ప్రవాసాంధ్ర రచయిత్రుల సొంత గొంతుక

ప్రవాసాంధ్ర సాహిత్యం

ప్రవాసంలో వున్నవారు ఏం రాసినా ప్రవాస సాహిత్యమవుతుందా లేక ప్రవాసజీవితం గురించి రాసిందే ప్రవాసాంధ్ర సాహిత్యమవుతుందా అన్న విషయం మీద గత అయిదారేళ్ళుగా చర్చ జరుగుతోంది. అమెరికాలో వుంటూ ఆముదాల వలసలో గడిపిన జీవితం గురించిన జ్ఞాపకాలు రాస్తే అది ప్రవాసాంధ్ర సాహిత్యం కాదని, అమెరికా జీవితం గురించి రాసిన సాహిత్యమే ప్రవాసాంధ్ర సాహిత్యంగా పరిగణించాలని కొందరి అబిప్రాయం. అయితే ప్రవాసంలో వుండటం వల్లే ఆ నోస్టాల్జియా బైటకు వస్తోంది కాబట్టి పరోక్షంగా అది ప్రవాసాంధ్రసాహిత్యంలో ఒక భాగంగా చూడాలని నాకనిపిస్తుంది. నోస్టాల్జియా పాతనీరు లాంటిది. పాతనీరంతా పోయాక (అంతా పోదనుకోండి. కొంత పాతనీరుంటుంది.) కొత్తనీరు వచ్చినట్టు నోస్టాల్జియా చెప్పటం అయ్యాక మన రచయితలు వర్తమానంలోకి వచ్చి ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు. అలాగే, అమెరికా నుండి ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ ప్రస్ఫుటంగా కనిపించే మార్పుల గురించో, ఆ మార్పుకి వెనక వున్న సామాజిక కారణాల గురించో, వాటన్నింటితో ముడిపడివున్న తమ జీవితాలకు సంబంధించిన మూలాల్ని వెతుక్కునే క్రమంలో రాసిన రచనల్ని కూడా ప్రవాసాంధ్ర జీవితంలో భాగంగా చూడవచ్చు.

నేను ఈ దేశం వచ్చిన మొదట్లో – అది 30 ఏళ్ళ క్రితం కాదండీ, ముచ్చటగా మూడేళ్ళ క్రితం నుండి ఇప్పటికి అనేకసార్లు అనేక సందర్భాల్లో చాలామందిని అడిగిన ఒక ప్రశ్న -‘ఇక్కడ రచయిత్రులెవరున్నారు? ఎలాంటి కథలు రాస్తున్నారు?’ దానికి నాకు దొరికిన సమాధానం.

‘అబ్బే, ఇక్కడెవరున్నారండి రచయిత్రులు. కొద్దిమంది ఆటాకో, తానాకో సావనీర్లకు రస్తారనుకోండి. కానీ అవి పెద్దగా చెప్పుకోదగ్గవి కావు,’ అంటూ నాన్చేసేవారు.

‘ఇక్కడి నుండి కూడా కథలు వస్తున్నాయండీ. కాని ఏం కథలవి? నిజంగా అమెరికా జీవితాన్ని గురించి చెప్తున్నాయా? రోడ్డు మీద పోలీసు ఆపి టిక్కెట్టు ఇవ్వడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం ఇవన్నీ పెద్ద కథలాండీ? నిజంగా ఇక్కడి లైఫ్‌ గురించి లోతుగా వెళ్ళి పరిశీలించి రాస్తున్నదెవరో చెప్పండి?’ అంటూ ఓ పెద్దాయన నన్ను నిలదీశాడు.

మరీ నిక్కచ్చిగా మాట్లాడే మరో పెద్దమనిషి, ‘డయాస్పోరా, డయాస్పోరా అంటూ మనం మొత్తుకోవడమే కానీయండి, ఆడా లేదు, మగా లేదు. ఇక్కడ రాస్తున్న వాళ్ళు నిజంగా అమెరికా జీవితాన్ని పరిశీలిస్తున్నారా? అంతా పైపైన రాస్తున్నారు’ అంటూ ఓ కుండబద్దలు కొట్టాడు. ఇండియాలో వున్న వాళ్ళు కూడా అమెరికా జీవితం గురించి అప్పుడప్పుడు కథలు రాస్తున్నారు కదా. వాటి మాటేమిటి అంటే ‘వాళ్ళా? అసలు అడగకండి. బిల్‌, బుష్‌, అమెరికా, అగ్రరాజ్యం అంటూ అన్నివిషయాలు కలగలిపి రాసేస్తారు. అసలు నిజానిజాలు తెలుసుకోకుండా ఇక్కడ భక్తి ఎక్కువైపోయిందని, రోజూ వ్రతాలు చేసుకుంటూ గుళ్ళ చుట్టూ తిరుగుతూ గడిపేస్తున్నారని, ఇక్కడ అసలు మనిషికి మనిషికి మధ్య ప్రేమానుబంధాలు వుండవని, తల్లితండ్రుల్ని చూడరని, డాలర్ల మాయలో పడి కొట్టుకుపోతుంటారని రాసి పడేస్తుంటారు. భక్తి ఎక్కువైంది ఇక్కడేనా, అక్కడ పెరగలేదూ? వీధి వీధికో బాబాగుడి. మనమేమైనా ఎదురురాస్తే ‘మీరు బుష్‌కి అమ్ముడు పోయారు’ అని ఎదురుమనల్ని అంటారు. అసలు అమెరికా రాకుండానే, చూడకుండానే ఇక్కడ గడపకుండానే అలా ఎలా రాస్తారండీ? పురుళ్ళు పోయటానికి వచ్చిన అమ్మమ్మలో, నానమ్మలో ఏది చెపితే అది రాయటమేనా’ అని మరో మూడుకుండల్ని బద్దలు కొట్టేశాడు.

నాకు కొన్ని పాత ఆటా, తానా సావనీర్లు దొరికినప్పుడు అవి తీసుకుని చదివాక ఇక్కడి ఆడవాళ్ళు రాసిన కొన్ని మంచికథలు దొరికాయి. అటు తర్వాత వంగూరి ఫౌండేషన్‌ వాళ్ళు వేసిన అమెరికా ఇల్లాలు, అమెరికా తెలుగు కథానికా సంకలనాలు కొన్ని చదివాక ఇక్కడ కూడా మంచి రచయిత్రులు లేకపోలేదు అన్న ఆశ కలిగింది. ఎవరో ముగ్గురో, నలుగురో కాదు చాలామంది రచయిత్రులు ఇక్కడి నుండి రచనలు చేస్తున్నారని అర్ధమైంది. ప్రవాసాంధ్రసాహిత్యంలో రచయిత్రుల రచనల్ని గురించి చర్చించుకునేటప్పుడు స్త్రీలు రాసిన కథలు, కవితలు, నవలలు, వ్యాసాలన్నీ చదివిచూసినప్పుడే సమగ్రస్వరూపం బోధపడుతుందని నాకు తెలిసిన నవలల్ని, కవితల్ని, వ్యాసాల్ని నాకున్న సమయాభావం వల్ల ఇక్కడ చర్చించలేకపోతున్నాను. ఈ వ్యాసంలో కేవలం నేను రచయిత్రుల కథల్ని (ప్రవాసం అంటే నా పరిధి కేవలం అమెరికా వరకు మాత్రమే) ప్రధానంగా చర్చిస్తున్నాను.

అమెరికా నుండి ఎంతమంది కథలు రాస్తున్నారు? అందులో రచయిత్రులెంతమంది? వాళ్ళు ఇప్పటిదాకా ఎన్ని కథలు రాశారు అన్న గణాంకాలు నా దగ్గర లేవు కానీ మంచి కథకులు అనదగ్గ రచయిత్రులు కనీసం ఓ డజను మందైనా వున్నారని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ ఒక్కమాట చెప్పటానికి కాదు ఈ వ్యాసం. డయాస్పోరా రచయిత్రులు ఎలాంటి కథలు రాస్తున్నారు? ఎవరికోసం రాస్తున్నారు? ఎక్కడ రాస్తున్నారు? ఏమేమి విషయాలు రాస్తున్నారు? వాటిని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు?లాంటి విషయాలను మనం ప్రధానంగా గమనించాలి. అన్ని కథలు, అందరు కథలు నా దృష్టిలోకి వచ్చే అవకాశం, సమయం లేకపోవడం వల్ల ఈ వ్యాసం సమగ్రం, సంపూర్ణం కాదని, అలాగే ఈ వ్యాసం ద్వారా నా అభిప్రాయాలనే కాకుండా నా సందేహాలను కూడా మీతో పంచుకోవడం ద్వారా మనందరి ఆలోచనలతో, అభిప్రాయాలతో ఈ విషయంపై పూర్తి అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి కింద నేను రాసిన అభిప్రాయాల్లో ఎవరైనా నన్ను సరిదిద్దినా, నా సందేహాలకు సంబంధించి సమాధానాలు లేదా ఏ కొద్దిపాటి అదనపు సమాచారం అందించినా కూడా నా ఈ వ్యాసం ప్రయోజనం నెరవేరినట్టే.

అక్కడా….ఇక్కడా…

అసలు అమెరికాను ఆంధ్రదేశంలో వున్న రచయిత్రులు ఎలా చూస్తున్నారు? ఇక్కడి రచయిత్రులు అమెరికా జీవితాన్ని ఎలా పరిశీలిస్తున్నారు? అన్నవి నా ప్రశ్నలు. ఇవి రెండూ తూర్పుపడమరలు. రెండూ భిన్న దేశాలు. విభిన్న సంస్కృతులు. అమెరికా అక్కడి తెలుగువాళ్ళ జీవితంపై ఎలాంటి మార్పులు తెస్తోంది?ఆ దేశంలోనే వుంటున్న తెలుగు వాళ్ళ జీవితాలపై ఎలాంటి మార్పులు తెస్తోంది? ఆ దేశంలోనే వుంటున్న తెలుగువాళ్ళ జీవితంపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. ఈ రెండింటిని దగ్గర పెట్టుకొని చూసినప్పుడే మనకు తెలుగువారి జీవితాలపై, వారి సాహిత్యంపై ఓ అవగాహన వస్తుంది.

అమెరికా జీవితం గురించి ఇండియాలో వున్న రచయిత్రులు ఏం రాస్తున్నారు? అమెరికాలో వున్న రచయిత్రులు తమ జీవితాల గురించి ఏం మాట్లాడుతున్నారు? అప్పుడప్పుడూ అమెరికాకు వచ్చి కొద్ది కాలం గడిపి వెళ్ళిపోయే కొందరు రచయిత్రులకు అమెరికన్‌ తెలుగువారి జీవితాల పట్ల వున్న అవగాహన ఏమిటీ అన్నది వారి వారి కథల్ని పరిశీలించడం ద్వారా అర్ధం చేసుకుందాం.

ఇక్కడి పిల్లలు….అక్కడి తల్లితండ్రులు

అమెరికన్‌ తెలుగువారి మనస్తత్వాల గురించి, వారి జీవితాలు గురించి, అమెరికాలో పిల్లలున్న వారి కుటుంబాల్లో వస్తున్న మార్పుల గురించి నల్లూరి రుక్మిణి నాలుగైదు కథల్లో తన అవగాహన మేరకు చర్చించింది. అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయని, కొడుకు తిరిగివస్తే ఓ తండ్రి మోహనరావు కథ ‘మిడిసిపాటు’. నెలనెలా కొడుకు పంపించే డబ్బుతో ఇల్లు, బంగారం, ఊర్లో పరపతి పెంచుకున్న మోహనరావుకి అమెరికాలో స్లంప్‌ వల్ల కొడుకు ఇండియా తిరుగుముఖం పడతాడేమోనన్న ఆలోచనతో మిన్నువిరిగి మీద పడ్డట్టయింది. చుట్టాలు, పక్కాలకు మొహం ఎలా చూపించాలో తెలియక, కూతురిపెళ్ళి ఏమవుతుందో నన్న దిగులుతో మతి చలించినవాడయ్యాడు. పిల్లలు సంపాదించి పంపించే డాలర్లను చూసి మిడిసిపాటు పడితే ఒక్కోసారి పరిస్థితులు తలకిందులవుతుంటాయని రచయిత్రి ఈ కథతో హెచ్చరించింది.

‘ఇది డబ్బు ప్రపంచమే పూర్ణా.. అందులో నీ పిల్లలున్నది డబ్బు మాత్రమే వుండే ప్రపంచం’ అని ‘పోగులు తెగిన అల్లిక’లో పూర్ణమ్మకు భర్త నారాయణరావు హితోపదేశం చేస్తాడు. కానీ భర్త మాట పట్టించుకోలేదు ఆమె. అమెరికాలో వున్న కొడుకులు, కూతుళ్ళే తన సర్వస్వమనుకొని వాళ్ళ పురుళ్ళు, పుణ్యాల కోసం భర్తను కూడా వదిలి అమెరికాలో కొన్నేళ్ళపాటు వుండిపోయిన పూర్ణమ్మకు చివరకు మిగిలిందేమిటి? భర్తను పోగొట్టుకోవడంతో పాటు కన్నపిల్లలు తిరస్కారం చేయడంతో మళ్ళీ మాతృదేశానికి చేరింది. తన పెంపకంలో పెరిగిన కొడుకు విదేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాన్ని పొగుడుతుంటే ఎప్పటికైనా మనుష్యుల పట్ల వున్న ప్రేమ వాడిని తిరిగి తీసుకురాకుండాపోతుందా అని ఆశపడుతుంటుంది ‘దూరపు కొండలు’లో సుమిత్ర. ‘‘నిజానికి ఆ దేశం పైకి కనబడేంత బాగా వుండదని తెలుసుకోవడానికి ఇంకా టైం పట్టవచ్చు. జాతి వైషమ్యాలతో బ్లాక్స్‌పై హింస, అకృత్యాలు, హత్యలు.. ఇవన్నీ వాడి అనుభవంలోకి వస్తే సహించగలడా? ఓర్చుకోగలడా?..అంటూ కొడుకుని గురించి ఆవేదన పడుతుంది ఆమె.

గ్లోబలైజేషన్‌ అన్న మాయాభూతం ఊరి మీద, వాకిళ్ళమీద, ఆడాళ్ళమీద, మగాళ్ళమీద, పిల్లల మీద, పంటలమీద ఒక అందమైన మాయాజలతారు ఎలా కమ్మేస్తోందో రుక్మిణి‘మాయా జలతారు’ కథలో చెపుతుంది. ఇరాక్‌మీద అమెరికా దాడి గురించి ఆమె రాసిన ‘కథ పాతదే…కానీ’లో మనవలకు బుజ్జిమేక, తోడేలు బారి నుండి తెలివితేటలతో తప్పించుకున్నట్టు మార్చి చెపుతుంది.