ఆత్మీయత ప్లస్‌ ఆలోచనా వెరసి ఇస్మాయిల్‌

ఎవరైనా ఇస్మాయిల్‌ గారిని ఎలా మరిచిపోగలరు?

ఆత్మీయతను కురిపించే ఆకుపచ్చటి ఉత్తరాల్ని అందుకున్న వారెవరైనా ఆయనతో జరిపిన సంభాషణను జీవితపు డైరీలో పదిలంగా దాచుకోవాల్సిందే. ఆయనతో మాట్లాడే అదృష్టం, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే అవకాశం దక్కిన వారిలో నేనూ ఒకరిని.

అది 1995. “ఆహ్వానం” సాహిత్య పత్రికను లక్ష్మిగారితో కలిసి నేను కూడా చూస్తున్నాను. “ఆహ్వానం” పత్రికను ఆదరించి ప్రోత్సహించిన వారిలో ఇస్మాయిల్‌ గారు ప్రముఖులు. పత్రిక సంపాదక వర్గంలో ఆయన కూడా వుండేవారు. పత్రిక నిర్వహణకు సంబంధించి లక్ష్మిగారితో కలిసి ఆయనతో మాట్లాడే సదవకాశం కలిగింది. ఎంత సున్నితంగా, ఎంత భావుకతతో కనిపిస్తారో అభిప్రాయాల దగ్గరా, అభిరుచుల దగ్గరా అంత నిక్కచ్చిగా వుంటారు. మృదువైన మాటల వెనుక కచ్చితమైన అభిప్రాయాలుంటాయి.

ఇస్మాయిల్‌గారు హైదరాబాద్‌ వస్తే సదాశివరావు గారింట్లో దిగినట్టు కబురొచ్చేది. వెంటనే వెళ్ళి కలిస్తే ఎన్ని కబుర్లో! నేను కనిపించగానే ఆయన అడిగే మొదటి ప్రశ్న “ఆహ్వానం” గురించే. ఓసారి “ఆహ్వానం”లో శరత్‌ “శేషప్రశ్న” లో కమల వ్యక్తిత్వం మీద లక్ష్మిగారు సంపాదకీయం రాశారు. ఆయనకు బాగా నచ్చిన సంపాదకీయాల్లో అది కూడా ఒకటి. శరత్‌ స్త్రీ పాత్రల గురించి ఓ రోజు హైదరాబాద్‌లో మా అందరితో ఆయన చేసిన చర్చలో ఎన్నో కొత్త విషయాలు ప్రస్తావించారు. అప్పటికే ఆయన స్వరపేటిక ఎక్కువగా మాట్లాడనివ్వకుండా చేస్తున్నా మాతో చాలా విషయాలు పంచుకోవాలన్న ఆయన ఆరాటం మమ్మల్ని ఆయన దగ్గర పసిపిల్లలుగా చేసేది.

“ప్రజాతంత్ర”లో నా “విస్మృతి” కవిత అచ్చుకాగానే కవిత నచ్చిందని చెపుతూ రాసిన ఉత్తరంతో పాటు “ఇంకెక్కడా ఖాళీ దొరకనట్టు అనంతపురం వెళ్ళారేమిటి? అక్కడసలే గాడిదలు ఎక్కువ!” అంటూ ఓ చెణుకు. ఇస్మాయిల్‌ గారు కొంతకాలం పాటు అనంతపురం కాలేజీలో పనిచేశారు. మేం అనంతపురంలో వున్నప్పుడు ఆయన మిత్రులు కొందరు ఇస్మాయిల్‌ గారిని తరుచూ గుర్తుచేసేవారు. ముఖ్యంగా ఆయన రెండు విషయాల్లో అనంతపురంలో మాకు బాగా గుర్తుకువచ్చేవారు. మొదటిది చిలుకలు వాలిన చెట్టు నిజంగానే అనంతపురంలో వుండేదని ఆయన మిత్రులు చెప్పేవారు .. ఎక్కడా కనిపించనన్ని చిలుకలు ప్రతి సాయంత్రం ఆ చెట్టు మీద వాలి కబుర్లు చెప్పుకునేవట. చెట్టు కింద ఇస్మాయిల్‌ గారు కొందరు మిత్రులతో ప్రతి సాయంత్రం కలిసేవారట.

రెండోది ఇస్మాయిల్‌ గారు “అనంతపురంలో గాడిదలు” కవిత రాసిన సందర్భం, నేపథ్యం ఏవైనప్పటికీ గాడిదలు లేకుండా అనంతపురాన్ని ఊహించడం కష్టం. ఎక్కడికిపోయినా ఊర్లో గార్దభదర్శనం తప్పనిసరి. ఇస్మాయిల్‌ గారికి ఏ ఊరికెళ్ళినా ఆ ఊర్లోని మంచి మనుషులతో పాటు చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు, పశుపక్ష్యాదులూ ఇట్టే తెలిసిపోతాయి. అది ఆయన స్వచ్ఛమైన ప్రకృతితో, మనుష్యులతో మమేకమయ్యే దృష్టికి గుర్తు.

అందరం పచ్చపచ్చగా సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ కనిపిస్తే కళ్ళారా చూసి ఆనందించే మా ఇస్మాయిల్‌ గారికి ఈ అమెరికా వచ్చేసి ముందు మేం దూరమైనాం, ఆ తరువాత ఆయన మనందరిని వదిలేసి దూరంగా మరో ఆకుపచ్చటి లోకం కోసం వెళ్ళిపోయారు.