ప్రవాసాంధ్ర రచయిత్రుల సొంత గొంతుక

ప్రవాసాంధ్ర సాహిత్యం

ప్రవాసంలో వున్నవారు ఏం రాసినా ప్రవాస సాహిత్యమవుతుందా లేక ప్రవాసజీవితం గురించి రాసిందే ప్రవాసాంధ్ర సాహిత్యమవుతుందా అన్న విషయం మీద గత అయిదారేళ్ళుగా చర్చ జరుగుతోంది. అమెరికాలో వుంటూ ఆముదాల వలసలో గడిపిన జీవితం గురించిన జ్ఞాపకాలు రాస్తే అది ప్రవాసాంధ్ర సాహిత్యం కాదని, అమెరికా జీవితం గురించి రాసిన సాహిత్యమే ప్రవాసాంధ్ర సాహిత్యంగా పరిగణించాలని కొందరి అబిప్రాయం. అయితే ప్రవాసంలో వుండటం వల్లే ఆ నోస్టాల్జియా బైటకు వస్తోంది కాబట్టి పరోక్షంగా అది ప్రవాసాంధ్రసాహిత్యంలో ఒక భాగంగా చూడాలని నాకనిపిస్తుంది. నోస్టాల్జియా పాతనీరు లాంటిది. పాతనీరంతా పోయాక (అంతా పోదనుకోండి. కొంత పాతనీరుంటుంది.) కొత్తనీరు వచ్చినట్టు నోస్టాల్జియా చెప్పటం అయ్యాక మన రచయితలు వర్తమానంలోకి వచ్చి ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు. అలాగే, అమెరికా నుండి ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ ప్రస్ఫుటంగా కనిపించే మార్పుల గురించో, ఆ మార్పుకి వెనక వున్న సామాజిక కారణాల గురించో, వాటన్నింటితో ముడిపడివున్న తమ జీవితాలకు సంబంధించిన మూలాల్ని వెతుక్కునే క్రమంలో రాసిన రచనల్ని కూడా ప్రవాసాంధ్ర జీవితంలో భాగంగా చూడవచ్చు.

నేను ఈ దేశం వచ్చిన మొదట్లో – అది 30 ఏళ్ళ క్రితం కాదండీ, ముచ్చటగా మూడేళ్ళ క్రితం నుండి ఇప్పటికి అనేకసార్లు అనేక సందర్భాల్లో చాలామందిని అడిగిన ఒక ప్రశ్న -‘ఇక్కడ రచయిత్రులెవరున్నారు? ఎలాంటి కథలు రాస్తున్నారు?’ దానికి నాకు దొరికిన సమాధానం.

‘అబ్బే, ఇక్కడెవరున్నారండి రచయిత్రులు. కొద్దిమంది ఆటాకో, తానాకో సావనీర్లకు రస్తారనుకోండి. కానీ అవి పెద్దగా చెప్పుకోదగ్గవి కావు,’ అంటూ నాన్చేసేవారు.

‘ఇక్కడి నుండి కూడా కథలు వస్తున్నాయండీ. కాని ఏం కథలవి? నిజంగా అమెరికా జీవితాన్ని గురించి చెప్తున్నాయా? రోడ్డు మీద పోలీసు ఆపి టిక్కెట్టు ఇవ్వడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం ఇవన్నీ పెద్ద కథలాండీ? నిజంగా ఇక్కడి లైఫ్‌ గురించి లోతుగా వెళ్ళి పరిశీలించి రాస్తున్నదెవరో చెప్పండి?’ అంటూ ఓ పెద్దాయన నన్ను నిలదీశాడు.

మరీ నిక్కచ్చిగా మాట్లాడే మరో పెద్దమనిషి, ‘డయాస్పోరా, డయాస్పోరా అంటూ మనం మొత్తుకోవడమే కానీయండి, ఆడా లేదు, మగా లేదు. ఇక్కడ రాస్తున్న వాళ్ళు నిజంగా అమెరికా జీవితాన్ని పరిశీలిస్తున్నారా? అంతా పైపైన రాస్తున్నారు’ అంటూ ఓ కుండబద్దలు కొట్టాడు. ఇండియాలో వున్న వాళ్ళు కూడా అమెరికా జీవితం గురించి అప్పుడప్పుడు కథలు రాస్తున్నారు కదా. వాటి మాటేమిటి అంటే ‘వాళ్ళా? అసలు అడగకండి. బిల్‌, బుష్‌, అమెరికా, అగ్రరాజ్యం అంటూ అన్నివిషయాలు కలగలిపి రాసేస్తారు. అసలు నిజానిజాలు తెలుసుకోకుండా ఇక్కడ భక్తి ఎక్కువైపోయిందని, రోజూ వ్రతాలు చేసుకుంటూ గుళ్ళ చుట్టూ తిరుగుతూ గడిపేస్తున్నారని, ఇక్కడ అసలు మనిషికి మనిషికి మధ్య ప్రేమానుబంధాలు వుండవని, తల్లితండ్రుల్ని చూడరని, డాలర్ల మాయలో పడి కొట్టుకుపోతుంటారని రాసి పడేస్తుంటారు. భక్తి ఎక్కువైంది ఇక్కడేనా, అక్కడ పెరగలేదూ? వీధి వీధికో బాబాగుడి. మనమేమైనా ఎదురురాస్తే ‘మీరు బుష్‌కి అమ్ముడు పోయారు’ అని ఎదురుమనల్ని అంటారు. అసలు అమెరికా రాకుండానే, చూడకుండానే ఇక్కడ గడపకుండానే అలా ఎలా రాస్తారండీ? పురుళ్ళు పోయటానికి వచ్చిన అమ్మమ్మలో, నానమ్మలో ఏది చెపితే అది రాయటమేనా’ అని మరో మూడుకుండల్ని బద్దలు కొట్టేశాడు.

నాకు కొన్ని పాత ఆటా, తానా సావనీర్లు దొరికినప్పుడు అవి తీసుకుని చదివాక ఇక్కడి ఆడవాళ్ళు రాసిన కొన్ని మంచికథలు దొరికాయి. అటు తర్వాత వంగూరి ఫౌండేషన్‌ వాళ్ళు వేసిన అమెరికా ఇల్లాలు, అమెరికా తెలుగు కథానికా సంకలనాలు కొన్ని చదివాక ఇక్కడ కూడా మంచి రచయిత్రులు లేకపోలేదు అన్న ఆశ కలిగింది. ఎవరో ముగ్గురో, నలుగురో కాదు చాలామంది రచయిత్రులు ఇక్కడి నుండి రచనలు చేస్తున్నారని అర్ధమైంది. ప్రవాసాంధ్రసాహిత్యంలో రచయిత్రుల రచనల్ని గురించి చర్చించుకునేటప్పుడు స్త్రీలు రాసిన కథలు, కవితలు, నవలలు, వ్యాసాలన్నీ చదివిచూసినప్పుడే సమగ్రస్వరూపం బోధపడుతుందని నాకు తెలిసిన నవలల్ని, కవితల్ని, వ్యాసాల్ని నాకున్న సమయాభావం వల్ల ఇక్కడ చర్చించలేకపోతున్నాను. ఈ వ్యాసంలో కేవలం నేను రచయిత్రుల కథల్ని (ప్రవాసం అంటే నా పరిధి కేవలం అమెరికా వరకు మాత్రమే) ప్రధానంగా చర్చిస్తున్నాను.

అమెరికా నుండి ఎంతమంది కథలు రాస్తున్నారు? అందులో రచయిత్రులెంతమంది? వాళ్ళు ఇప్పటిదాకా ఎన్ని కథలు రాశారు అన్న గణాంకాలు నా దగ్గర లేవు కానీ మంచి కథకులు అనదగ్గ రచయిత్రులు కనీసం ఓ డజను మందైనా వున్నారని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ ఒక్కమాట చెప్పటానికి కాదు ఈ వ్యాసం. డయాస్పోరా రచయిత్రులు ఎలాంటి కథలు రాస్తున్నారు? ఎవరికోసం రాస్తున్నారు? ఎక్కడ రాస్తున్నారు? ఏమేమి విషయాలు రాస్తున్నారు? వాటిని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు?లాంటి విషయాలను మనం ప్రధానంగా గమనించాలి. అన్ని కథలు, అందరు కథలు నా దృష్టిలోకి వచ్చే అవకాశం, సమయం లేకపోవడం వల్ల ఈ వ్యాసం సమగ్రం, సంపూర్ణం కాదని, అలాగే ఈ వ్యాసం ద్వారా నా అభిప్రాయాలనే కాకుండా నా సందేహాలను కూడా మీతో పంచుకోవడం ద్వారా మనందరి ఆలోచనలతో, అభిప్రాయాలతో ఈ విషయంపై పూర్తి అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి కింద నేను రాసిన అభిప్రాయాల్లో ఎవరైనా నన్ను సరిదిద్దినా, నా సందేహాలకు సంబంధించి సమాధానాలు లేదా ఏ కొద్దిపాటి అదనపు సమాచారం అందించినా కూడా నా ఈ వ్యాసం ప్రయోజనం నెరవేరినట్టే.

అక్కడా….ఇక్కడా…

అసలు అమెరికాను ఆంధ్రదేశంలో వున్న రచయిత్రులు ఎలా చూస్తున్నారు? ఇక్కడి రచయిత్రులు అమెరికా జీవితాన్ని ఎలా పరిశీలిస్తున్నారు? అన్నవి నా ప్రశ్నలు. ఇవి రెండూ తూర్పుపడమరలు. రెండూ భిన్న దేశాలు. విభిన్న సంస్కృతులు. అమెరికా అక్కడి తెలుగువాళ్ళ జీవితంపై ఎలాంటి మార్పులు తెస్తోంది?ఆ దేశంలోనే వుంటున్న తెలుగు వాళ్ళ జీవితాలపై ఎలాంటి మార్పులు తెస్తోంది? ఆ దేశంలోనే వుంటున్న తెలుగువాళ్ళ జీవితంపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. ఈ రెండింటిని దగ్గర పెట్టుకొని చూసినప్పుడే మనకు తెలుగువారి జీవితాలపై, వారి సాహిత్యంపై ఓ అవగాహన వస్తుంది.

అమెరికా జీవితం గురించి ఇండియాలో వున్న రచయిత్రులు ఏం రాస్తున్నారు? అమెరికాలో వున్న రచయిత్రులు తమ జీవితాల గురించి ఏం మాట్లాడుతున్నారు? అప్పుడప్పుడూ అమెరికాకు వచ్చి కొద్ది కాలం గడిపి వెళ్ళిపోయే కొందరు రచయిత్రులకు అమెరికన్‌ తెలుగువారి జీవితాల పట్ల వున్న అవగాహన ఏమిటీ అన్నది వారి వారి కథల్ని పరిశీలించడం ద్వారా అర్ధం చేసుకుందాం.

ఇక్కడి పిల్లలు….అక్కడి తల్లితండ్రులు

అమెరికన్‌ తెలుగువారి మనస్తత్వాల గురించి, వారి జీవితాలు గురించి, అమెరికాలో పిల్లలున్న వారి కుటుంబాల్లో వస్తున్న మార్పుల గురించి నల్లూరి రుక్మిణి నాలుగైదు కథల్లో తన అవగాహన మేరకు చర్చించింది. అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయని, కొడుకు తిరిగివస్తే ఓ తండ్రి మోహనరావు కథ ‘మిడిసిపాటు’. నెలనెలా కొడుకు పంపించే డబ్బుతో ఇల్లు, బంగారం, ఊర్లో పరపతి పెంచుకున్న మోహనరావుకి అమెరికాలో స్లంప్‌ వల్ల కొడుకు ఇండియా తిరుగుముఖం పడతాడేమోనన్న ఆలోచనతో మిన్నువిరిగి మీద పడ్డట్టయింది. చుట్టాలు, పక్కాలకు మొహం ఎలా చూపించాలో తెలియక, కూతురిపెళ్ళి ఏమవుతుందో నన్న దిగులుతో మతి చలించినవాడయ్యాడు. పిల్లలు సంపాదించి పంపించే డాలర్లను చూసి మిడిసిపాటు పడితే ఒక్కోసారి పరిస్థితులు తలకిందులవుతుంటాయని రచయిత్రి ఈ కథతో హెచ్చరించింది.

‘ఇది డబ్బు ప్రపంచమే పూర్ణా.. అందులో నీ పిల్లలున్నది డబ్బు మాత్రమే వుండే ప్రపంచం’ అని ‘పోగులు తెగిన అల్లిక’లో పూర్ణమ్మకు భర్త నారాయణరావు హితోపదేశం చేస్తాడు. కానీ భర్త మాట పట్టించుకోలేదు ఆమె. అమెరికాలో వున్న కొడుకులు, కూతుళ్ళే తన సర్వస్వమనుకొని వాళ్ళ పురుళ్ళు, పుణ్యాల కోసం భర్తను కూడా వదిలి అమెరికాలో కొన్నేళ్ళపాటు వుండిపోయిన పూర్ణమ్మకు చివరకు మిగిలిందేమిటి? భర్తను పోగొట్టుకోవడంతో పాటు కన్నపిల్లలు తిరస్కారం చేయడంతో మళ్ళీ మాతృదేశానికి చేరింది. తన పెంపకంలో పెరిగిన కొడుకు విదేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాన్ని పొగుడుతుంటే ఎప్పటికైనా మనుష్యుల పట్ల వున్న ప్రేమ వాడిని తిరిగి తీసుకురాకుండాపోతుందా అని ఆశపడుతుంటుంది ‘దూరపు కొండలు’లో సుమిత్ర. ‘‘నిజానికి ఆ దేశం పైకి కనబడేంత బాగా వుండదని తెలుసుకోవడానికి ఇంకా టైం పట్టవచ్చు. జాతి వైషమ్యాలతో బ్లాక్స్‌పై హింస, అకృత్యాలు, హత్యలు.. ఇవన్నీ వాడి అనుభవంలోకి వస్తే సహించగలడా? ఓర్చుకోగలడా?..అంటూ కొడుకుని గురించి ఆవేదన పడుతుంది ఆమె.

గ్లోబలైజేషన్‌ అన్న మాయాభూతం ఊరి మీద, వాకిళ్ళమీద, ఆడాళ్ళమీద, మగాళ్ళమీద, పిల్లల మీద, పంటలమీద ఒక అందమైన మాయాజలతారు ఎలా కమ్మేస్తోందో రుక్మిణి‘మాయా జలతారు’ కథలో చెపుతుంది. ఇరాక్‌మీద అమెరికా దాడి గురించి ఆమె రాసిన ‘కథ పాతదే…కానీ’లో మనవలకు బుజ్జిమేక, తోడేలు బారి నుండి తెలివితేటలతో తప్పించుకున్నట్టు మార్చి చెపుతుంది.

అమమెరికాకు వచ్చి కొద్దికాలం గడిపివెళ్ళిన అనుభవాలతో కె.రామలక్ష్మి (నన్ను వెళ్ళి పోనివ్వండి), మహెజబీన్‌ (ఆకు పచ్చని ఆకాశం కింద), పి.సత్యవతి (మంత్రనగరి, తిమింగల స్వర్గం), వాసా ప్రభావతి, భార్గవీరావు (తూరుపుగాలి), యద్దనపూడి సులోచనారాణిలాంటి వారు రచనలు చేశారు. మహెజబీన్‌ కథ గురించి తీవ్రస్థాయిలోనే చర్చ జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చర్చించడం అనవసరం. ఆ కథలో రచయిత్రి ప్రస్తావించిన అంశాలు వాస్తవ విరుద్ధంగా వున్నాయన్నది అమెరికాలో వున్న సాహిత్యాభిమానుల ప్రధాన విమర్శ.

ఇక పి.సత్యవతి కథల్ని చూస్తే…‘తిమింగలస్వర్గం’(1996) ఓ అలీగరి. అదొక తిమింగలలోకం. అందులో శ్యాంమామయ్య, బిల్‌ అన్నయ్య, వందకాళ్ళ ఎలక్ట్రానిక్‌ పురుగు, ధవళగృహం అన్నీ వుంటాయి. సల్మాన్‌రష్దీ టైపులో కలలొచ్చే అమ్మాయికి వాళ్ళ నాన్న గుండెమార్పిడి, బ్రెయిన్‌ మార్పిడి ఆపరేషన్‌ చేస్తాడు. ట్యూబు నుండి ఆ అమ్మాయికి ఆక్సిజన్‌కి బదులు కరెన్సీనోట్లు పంపిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ కరెన్సీ నోట్లనే ఊపిరిగా పీల్చడం వల్ల ఆ అమ్మాయికి జీవితాంతం ఊపిరాడకపోవడమనేదే వుండదు. ఆపరేషన్‌లో భాగంగా ఆ అమ్మాయి మెదడు ట్యూన్‌ అయ్యేందుకు వీలుగా పాల్‌ ఫౌండర్‌ రాసిన ఫాల్స్‌ టేల్స్‌ చదివి వినిపిస్తారు. అందులో ఆణి ముత్యాల్లాంటి నాలుగుకథల సారాంశమేమిటంటే.. సొంత ఆస్తి, కుటుంబం వుండాలి. కులాలు, ఉపకులాలు, శాఖల్ని కాపాడుకోవాలి. పక్కవాడ్ని కిందపడేసైనా పోటీ ప్రపంచంలో పైకి రావాలి. మరింత అణచివేత వద్దనుకుంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళల్లా వుండాలి. వీటన్నింటికి ఆ అమ్మాయి మెదడు ట్యూన్‌ అయిపోయినా ఆ అమ్మాయి స్నేహితులు రవి, కాంతిలాంటి వాళ్ళు పట్టుదలతో ఆ తిమింగలస్వర్గం కోరల్లో చిక్కుకోకుండా తప్పించుకోగలుగుతారు. ఇది అమెరికా జీవితం గురించిన కథ కాదు గానీ అగ్రరాజ్యం దుర్నీతిని ప్రతీకాత్మకంగా అవహేళన చేస్తూ రాసిన కథ.

‘మంత్ర నగరి’ (2002) కథ చూస్తే…అమెరికా ఓ మంత్రనగరి. చదువుకొని విద్యార్థి సంఘాల్లో పనిచేసి, స్త్రీలహక్కులు, మానవహక్కుల ఉద్యమాల్లో తిరిగిన గీత లాంటి అమ్మాయిలు కూడా అందం, ఆస్తి, సొంత జీవితం అంటూ ఆ మత్తులో పడిపోతున్నారన్న ఆవేదనతో పాటు యువతరం ఎటువైపు వెళుతోందో ఆలోచించమన్న హెచ్చరిక కూడా ఈ కథ ద్వారా చేస్తుంది రచయిత్రి. రaాన్సీ కూతురు గీత అవకాశాల దేశంలో బాగాసెటిలై తల్లిని చూసిపోదువుగాని రమ్మంటే ఆమె అమెరికా వస్తుంది. అక్కడి జీవితాన్ని పరామర్శిస్తూ ఈ మంత్ర నగరికథ చెపుతుంది. ఈ కథలో ‘ఇక్కడ కూడా జీన్స్‌, టీషర్టులు ధరించిన మనుషులున్నారు’లాంటి వ్యాఖ్యలు కనిపిస్తాయి.

సత్యవతి ఇటీవల అంటే ఏప్రిల్‌, 2006లో రాసిన మరో కథ ‘ఒక రాజు – ఒక రాణి’. ఆంధ్రదేశంలో పుట్టి పెరిగిన ఒక్కడే(ఏకసంతు) అబ్బాయి, ఒక్కర్తే(ఏకసంతు) అమ్మాయికి పెళ్ళవుతుంది. అప్పటికే అమెరికాలో వున్న అబ్బాయి దగ్గరకు అమ్మాయి వస్తుంది. అమ్మాయికి వంటరాదని, ఇల్లు సర్దడం లేదని, బాత్‌రూమ్‌లు కడగడం లేదని అబ్బాయి ఆరోపణ. అసలు అవన్నీ నేను మాత్రమే ఎందుక చేయాలి? నువ్వెందుకు చేయవు? నేను పుట్టి బుద్ధెరిగాక ఇప్పటి వరకూ కాపీ కప్పు కూడా కడగలేదంటుంది అమ్మాయి. అవన్నీ చేసుకునేకాడికి ఈ పెళ్ళి ఎందుకు? పెళ్ళాంగా నువ్వెందుకు? అవన్నీ చేసుకోవాలనే కదా నిన్ను చేసుకుంది అంటాడు అబ్బాయి. ఇద్దరూ కౌన్సిలింగ్‌ తీసుకోండి లేకపోతే కాపురం చేయడం కష్టమని సలహా ఇస్తుంది స్నేహితురాలు. పిల్ల పుడుతుంది. కాన్పుకొచ్చిన అమ్మాయి తల్లి, ఇండియానుండి అబ్బాయి తండ్రి పిల్లను ఇండియా తీసుకెళ్ళి పెంచుతాం, మీరిద్దరూ హాయిగా ఉద్యోగం చేసుకొని ఇల్లు కొనుక్కోండని సలహా ఇస్తారు.‘ఎందుకు మరో మహారాణిని తయారు చేయడానికా? మా జీవితాల గురించి మమ్మల్ని ఆలోచించుకోనివ్వండి.’అంటాడు అబ్బాయి. ఇదండీ ఒకరాజు- ఒకరాణి కథ. కొన్ని అమెరికా పెళ్ళిళ్ళు విడాకుల దాకా పోతుండటానికి ఈ కథలో చూపించిన అంశం ఒక కారణం కావచ్చు. సెప్టెంబర్‌ 11 నాటి దాడుల నేపధ్యంలో డబ్ల్యుటిసిలో పని చేసే సుష్మ, బ్రిటిషర్‌ ఆర్డ్‌ల మధ్య చిగురించిన ప్రేమానుబంధాన్ని ‘9/11ప్రేమకథ’ ద్వారా చెప్పారు ముదిగంటి సుజాతారెడ్డి. 9/11 దాడులు జరిగినప్పుడు లిఫ్టు నుండి బైటకు వస్తున్న తన బాస్‌ ఆర్ట్‌ గాయపడితే రక్షించి తన రూమ్‌కు తీసుకొస్తుంది సుష్మ. అప్పటివరకూ సుష్మ అంటే ప్రేమ వున్నా తనజాతి గొప్పదన్న సుపీరియార్టీ కాంప్లెక్స్‌తో దాన్ని కప్పివుంచాలనుకున్నాడు ఆర్ట్‌. మృత్యువుకి దగ్గర దాకా వెళ్ళివచ్చిన సంక్లిష్ట సందర్భంలో తన ప్రాణాన్ని కాపాడిన సుష్మకు తన మనసులో మాట చెప్పకుండావుండలేక పోయాడు ఆర్ట్‌. జాతుల మధ్య వున్న అంతరాలు, ఎక్కువ తక్కువన్న భావనలు మరిచి వారిద్దరూ ఒకటై ఎత్తైన భవనాలు కూలిన చోట శాంతిశిఖరాలు మొలుస్తాయన్న ఆశతో ముందుకు సాగుతారు. పైకి అందరం ఒకరినొకరు ‘గ్రేట్‌ గ్రేట్‌’ అంటూ భుజాలు తట్టుకుంటున్నా లోపల్లోపల ‘ఓరియంటల్‌’ అనో ‘కొలోనియల్‌’ అనో వున్న భావనల గురించి రచయిత్రి ఈ కథలో ప్రస్తావిస్తారు.

ఈతి బాధలూ…నీతి కథలూ!

పైన చెప్పిన కథలు కాకుండా అమెరికా మీద, అమెరికన్‌ తెలుగువారి మీద అనేక రకాల స్టీరియోటైపు కథలు వచ్చాయి. వస్తున్నాయి. ఆ కథల్లో ప్రధానంగా చూపించే అంశాలు —అమెరికాలో వున్న వారి మధ్య ఆర్ధిక సంబంధాలు తప్ప మానవసంబంధాలుండవు. వాళ్ళంతా డాలర్ల వెంపర్లాటలో వుంటారు. తల్లితండ్రుల్ని పట్టించుకోనివారో, తన్ని తరిమేసేవారో, ఓల్డ్‌ఏజ్‌హోముల్లో చేర్పించేవారో అయివుంటారు. డర్టీ ఇండియా అంటూ విసుక్కుంటారు రకరకాల మనుష్యులు, మనస్తత్వాలు సహజమైన సమాజంలో ఇలాంటి స్టీరియోటైపు వాళ్ళు ఆంధ్రలో వుంటారు. అమెరికాలో వుంటారు.

ఇండియా కథలు స్టీరియోటైపా…?

ఆంధ్రదేశంలో వున్న రచయిత్రులు తమ జీవితాల్లో అమెరికా ప్రభావం గురించో, తమకు తెలిసిన అమెరికా జీవితం గురించో కథలు రాశారు. ఈ కథలు ఇండియాలోని వారికి బాగానే నచ్చినా అమెరికాలోని సాహిత్యాభిమానులకు నచ్చలేదు. అందుకు వాళ్ళు చెప్పే కారణాలు అమెరికా జీవితం చూడకుండా అనుభవించకుండా రాయడం మీద ఒకటైతే, అందులో వాస్తవాలు లేవనడం మరొకటి. అమెరికాను, దాని ప్రభావాన్ని, లేదా ఇక్కడి డాలర్లను అక్కడి వారు నెగెటివ్‌ అంశంగానే చూపిస్తున్నారు తప్ప పాజిటివ్‌గా చూపించే రచనలేవీ కనిపించలేదు. వృద్ధులైన తల్లితండ్రుల్ని ఓల్డ్‌ఏజ్‌హోమ్‌లో చేర్పించే అంశం గురించి ఇండియాలో కేవలం అమెరికాకు వెళ్ళిన పిల్లల ప్రభావంగా చూస్తున్నారు తప్ప ఇండియాలోనే వున్న పిల్లలు కూడా తమ తల్లితండ్రుల్ని ఓల్డ్‌ఏజ్‌హోముల్లో చేర్పించటానికి ఇష్టపడుతున్నారని, అసలు చాలామంది తల్లితండ్రులే పిల్లల దగ్గర వుండటం కన్నా విడిగా వుండటమే మేలనుకుంటారన్న విషయాన్ని మనం గమనించాలి.

అమెరికాలో వున్న వారే డాలర్‌మాయలో వున్నారని, ఇక్కడ డబ్బు, స్వార్ధం తప్ప మానవసంబంధాలు లేవన్న ఆరోపణ కూడా సత్యదూరమే. అమెరికా నుండి ఇండియాకు రవాణా అవుతున్న డబ్బువల్ల అక్కడి పంటపొలాలన్నీ ఇళ్ళ స్థలాలుగా మారడం, అమెరికా నుండి వచ్చేవారిని కేవలం డాలర్‌ నోట్లుగా చూడటం, ఎన్నారై డబ్బుతో మారుతున్న ఇండియన్ల ఆలోచనా ధోరణుల్ని చూపిస్తోంది. ఇటీవల జరిగిన ‘ప్రవాసీదివస్‌’లో ఎన్నారైల అనుభవాల కథనాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. వీటికి సాహిత్యానికి సంబంధమేమిటంటే సాహిత్యమెప్పుడూ సమాజరూపానికి ప్రతిబింబం కావాలి. అప్పుడే అది మంచి సాహిత్యమవుతుంది. వాస్తవ పరిస్థితుల్ని సాహిత్యంలో చర్చించినప్పుడు మాత్రమే మనకు సమాజం అసలు స్వరూపం బోధపడుతుంది.

అమెరికా తెలుగు రచయిత్రులు – కొత్త ఇతివృత్తాలు

అమెరికా నుండి ప్రముఖంగా రాస్తున్న రచయిత్రుల్లో మాచిరాజు సావిత్రి, పూడిపెద్ది శేషుశర్మ, చిమటా కమల, నోరిరాధిక, నిడదవోలు మాలతి, చెరుకూరి రమాదేవి, వడ్లమాని పద్మావతి, కొమరవోలు సరోజ, సుధేష్ణ, కలశపూడి వసుంధర, చింతం రాణి సంయుక్త, పుచ్చా అన్నపూర్ణ, పద్మలత, ఉపాధ్యాయుల సూర్యకుమారి, దామరాజు లక్ష్మి, శారదాపూర్ణ శొంఠి, పావనీ సుధాకర్‌, కల్పన రెంటాల, రాధికా శాస్త్రి, లలితా జొన్నాళ్‌, పుచ్చా వసంతలక్ష్మి, కొవ్వలి కాటూరి జ్యోతి, శ్యామల దశిక, ముత్యాల సీత, సులోచనా భండారు, అయ్యగారి రమామణి, మంగళాకందూర్‌, సాయిలక్ష్మి, కనకదుర్గ తదితరులున్నారు.

వీళ్ళల్లో కొందరి కథల్ని చూద్దాం. చాలా మంది మాట్లాడటానికి, గుర్తించటానికి నిరాకరించే గృహహింస (domestic abuse), డిప్రెషన్‌ లాంటి అంశాల్ని కనీసం రేఖామాత్రంగానైనా తన కథ ‘చీకటివెలుగులు’లో చూపించిన రచయిత్రి పూడిపెద్ది శేషుశర్మ. ఈ కథలో మాధవి గృహహింస బాధితురాలు. పెళ్ళై అమెరికా వచ్చాక కాలేజీలో చేరి చదువుకుంటోంది. ఆ అమ్మాయి వంటి మీద దెబ్బలు గమనించిన అదే కాలేజీలో పనిచేసే కిషోర్‌ ఆ అమ్మాయి మీద సానుభూతితో ఆమెతో స్నేహం చేసి భర్త ఇబ్బందులు పెడితే అవసరమైతే ఇంట్లోంచి ఎలా బైట పడవచ్చో ముందు జాగ్రత్తగా సలహాలిస్తాడు. భర్తకు ఎయిడ్స్‌వ్యాధి అన్న సంగతి తెలియగానే మాధవి ఇంట్లోంచి బైటపడి షెల్టర్‌కు చేరుకొని కిషోర్‌ సహాయంతో ఇండియా వెళ్ళిపోతుంది. కిషోర్‌ది మరోరకమైన సమస్య. ఇండియా నుండి పెళ్ళి చేసుకొని తీసుకువచ్చిన భార్య నాలుగు గోడల మధ్య వుండటంతో డిప్రెషన్‌కు గురైందన్న నిజాన్ని తెలుసుకోలేకపోవడంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. తన తప్పు తెలుసుకున్న కిషోర్‌ దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటాడు. శాడిస్టు భర్త నుండి బైట పడ్డ మాధవి, కిషోర్‌ పెళ్ళి చేసుకోవాలనుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ ఒక్క కథ తప్ప ఆడవాళ్ళలో డిప్రెషన్‌ గురించి, ఇక్కడి తెలుగు కుటుంబాల్లోని కుటుంబహింస గురించి చర్చించిన కథలేవీ నా దృష్టికి రాలేదు.

పెళ్ళయిన పాతికేళ్ళకు భర్తకు, తనకు మధ్య వున్న అగాధాల్ని అందరి ముందు ధైర్యంగా చెప్పి ఇండియా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది ‘సర్‌ప్రైజ్‌’ కథలో లత. నోరిరాధిక ‘అకాల వసంతం’ కథలో భార్య చనిపోతే ఆఫీసులో పనిచేసే కొలీగ్‌, స్నేహితురాలు ‘లిండా’తో కలిసి జీవితం పంచుకోవాలనుకున్న శంకరం నిర్ణయం పట్ల మొదట్లో పిల్లలకు వ్యతిరేకభావం కలిగినా, తమ మనసు మార్చుకొని తండ్రి నిర్ణయాన్ని ఆమోదిస్తారు . పెళ్ళీడుకొచ్చిన కొడుకో, కూతురో ‘సేమ్‌ సెక్స్‌మ్యారెజెస్‌’ వైపు వెళ్ళకుండా తెలుగు వాడ్ని, ఇండియన్‌ని కాకపోయినా కనీసం తెల్లవాడినో, నల్లవాడినో కట్టుకుంటే అమ్మయ్య గండం గట్టెక్కించారనుకునే తల్లితండ్రులు ఇంకా కోకొల్లలు. సుధేష్ణ ‘మొగుడు కావాలా?’ శేషు శర్మ ‘పెళ్ళి చేసుకుంటే చూడు’, లలితా జొన్నాళ్‌ ‘పి.పి.అమ్మ’, నోరి రాధిక ‘కాగల కార్యం గంధర్వులే తీర్చారు’ లాంటి కథలు, ఈ పెళ్ళిళ్ళ తంతులోని వైరుధ్యాల్ని, ఒత్తిడులను, సంఘర్షణలను చూపిస్తాయి

కలశపూడి వసుంధర కలం నుండి వెలువడ్డ ‘గిరీశం ఇన్‌ వైట్‌ హౌస్‌’, ‘పృచ్ఛకాభిమన్యులు’ రెండింటి ఇతివృత్తాలు కూడా ఇక్కడి స్త్రీల రచనల్లో కాస్త భిన్నంగా కనిపిస్తాయి. అమెరికన్‌ రాజకీయాల్లోని అప్రజాస్వామ్య, అనైతిక విలువల్ని గిరీశం పాత్ర ద్వారా అవహేళన చేయించారు, ‘గిరీశం ఇన్‌ వైట్‌ హౌస్‌’ కథలో. సహస్రావధానం పేరిట టక్కడ జరిగే తంతులోని చేదునిజాల్ని ‘పృచ్ఛకాభిమన్యులు’ కథలో ఎత్తి చూపించారు.

ప్రాక్‌, పశ్చిమ దృక్కోణాలలో ఇంతగాఅంతరాలు కనిపిస్తున్నా అంతరాంతరాల్లో ఆలోచనల్లో, ధోరణుల్లో అట్టే వ్యత్యాసం లేదని, మారుతున్న తరాలతో విలువలు ఎక్కడైనా మారిపోతున్నాయని నిడదవోలు మాలతి చెప్పే కథ ‘దృక్కోణాలు’. ఇక్కడున్న ఇండియన్లు లేదా తెలుగువారిలో అప్పుడప్పుడు స్పష్టంగా కనిపించే స్వార్ధం, పక్కవారిని తోసేసి లాభపడాలన్న దురాశ, ‘నువ్వు నా లాభం చూడు, నేను నా లాభం చూసుకుంటాను’ అన్న తత్త్త్వం, బంధుత్వాల్ని ఆసరాగా చేసుకొని చేయూతనిస్తామంటూ మనుష్యుల్ని కొనేసే డబ్బు మనస్తత్వం గురించి, ‘కొనే మనిషి’, ‘డాలర్‌కో గుప్పెడురూకలు’లాంటి కథల్లో మాలతి చిత్రించారు. అమెరికాలో తెలుగు ఇల్లాలుకి సుప్రభాతం నుండి పవళింపుసేవ వరకూ నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల సన్నివేశాల్ని, సందేహాల్ని చిన్న చిన్న కథానికలుగా రాసి ‘అమెరికా ఇల్లాలు’ సంకలనంతో అందరి మెప్పు పొందారు చిమటాకమల. వినాయకచవితి పండుగ చేసుకోవడమో, ఫ్యామిలీ ఫొటో తీయించుకోవడమో దేన్లోనైనా అమెరికా తెలుగు ఇల్లాలిది తూర్పు పడమరల సమ్మిళిత సంస్కృతి. సరదాగా చదువుకొని పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకోవడమే కాకుండా మనం సీరియస్‌గా మనసు పెట్టి ఆలోచించాల్సిన కొన్ని అంశాల గురించి కూడా ఆమె రచనలు చేశారు. అమెరికాలో కెరియర్‌ ఉమెన్‌కు సంబంధించిన సమస్యలేవీ రచయిత్రుల నుండి కథల రూపంలో రాలేదు. పావనీ సుధాకర్‌ రాసిన ‘కార్టూన్స్‌’(ఎ.పి.వీక్లీ) స్త్రీలకు సంబంధించిన కథ కాకపోయినా అందులో ప్రధాన పాత్ర షీనా ఓ కంపెనీలో బిజినెస్‌ అనలిస్ట్‌. అదే కంపెనీలో మరో ఇద్దరు అమ్మాయిలు ప్రీతి, చరణ్‌ పని చేస్తుంటారు. కాన్ఫరెన్స్‌కోసం కొత్తగా వచ్చిన ముగ్గురు తెలుగబ్బాయిలు ఒకే రకమైన డ్రెస్సింగ్‌లో వుండటం, ప్రతిదానికీ చేతులు కట్టుకొని ఎస్‌ సర్‌ అంటూ మాట్లాడటం చూసి అమ్మాయిలు వారిని కార్టూన్స్‌గా పిలుస్తూ, జోక్‌లేసుకుంటారు. అయితే ఆ ముగ్గురబ్బాయిల్లో ఓ అబ్బాయి ఇండియాకి ఫోన్లో మాట్లాడుతూన్న దాన్ని బట్టి తల్లి చనిపోయినా వెళ్ళలేని అతని అశక్తత, నిస్సహాయత అర్ధమైన షీనాకు అసలు కార్టూన్లు ఎవరో అర్ధమవుతుంది. హెచ్‌-1 వీసాల మోజులో పరుగెత్తుకుంటూ వస్తున్న కొందరి యువజీవితాల్లో అంతర్లీనంగా దాగుండే చీకటినీడల్ని బహిర్గతం చేస్తుంది ఈ కథ.

ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

డయాస్పోరా సాహిత్యాన్ని చూసేటప్పుడు కాలవిభజన చేసుకోవడం వల్ల మనకు ఏ టైంలో ఎలాంటి రచనలు వచ్చాయి అన్న విషయం, దాని వెనకవున్న కారణాలు మరింత స్పష్టమవుతాయి. మొదట మనం అర్ధం చేసుకోవాల్సింది, వీళ్ళందరికీ రచన ప్రవృత్తే కాని వృత్తి కాదు. అదెందుకు చెపుతున్నానంటే వీళ్ళు పాపులారిటీ కోసం అంటే కాలానుగుణంగా కాకుండా తమ మనసుకు దగ్గరగా వచ్చిన విషయాల మీద మాత్రమే రచనలు చేస్తున్నారు.

మొదటి తరం రచయిత్రులు మొదట్లో పుట్టినగడ్డకు దూరంగా వుండటం వల్ల ఆ జ్ఞాపకాలు, అనుభూతులు ఒకరితో మరొకరు పంచు కోవాలనుకున్నారు. అందుకు ప్రారంభంలో చిన్నగా ఏర్పడిన తెలుగు సంఘాలు, వాటి సావనీర్లు ఆలంబన అయ్యాయి. కాబట్టే తొలుత చాలామంది నొస్టాల్జియాతో రాశారు. దాదాపు 25,30 ఏళ్ళుగా ఈ దేశంలో వుంటున్న మొదటితరానికి చెందిన రచయిత్రులు ఇప్పటికీ ఆ ప్రపంచం నుండి బైటపడలేకపోతున్నారు. వాళ్ళు ఏంరాసినా మాతృదేశంతో వాళ్ళ మానసిక సాన్నిహిత్యం కనిపిస్తుంటుంది. ఆ విషయాన్ని నేను నెగెటివ్‌గా కాకుండా అది మన తెలుగుసమాజానికి ఓ బలమైన పార్శ్వంగా మాత్రమే చూస్తున్నాను. ఇన్నేళ్ళుగా వాళ్ళు భౌతికంగా ఈ దేశంలో వున్నా తమ మూలాల్ని మరిచిపోలేదు. వారి మాటల్లో వారి భాషలో తెలుగు నుడికారం ఇంకా సజీవంగా వుంది. కథల్లో సందర్భోచితంగా కృష్ణదేవరాయల కవిపోషణ గురించో, ముక్కు తిమ్మన్న పారిజాతాపహరణం గురించో, సత్యభామ వాల్జెడ గురించో, ఉరగాంగనస వ్యుత్పత్తి అర్ధం గురించో రాయగలుగుతున్నారు. మాచిరాజు సావిత్రి, నిడదవోలు మాలతి (చాతక పక్షులు) వడ్లమాని పద్మావతి (పడమటి గాలులు) మీరాబాయి (అమెరికా జీవితం గురించి ఆమె రాసిన నవల స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురితమైంది), చింతం రాణి సంయుక్త లాంటి వాళ్ళు అక్కడి జీవితంతో పాటు ఇక్కడి జీవితాన్ని గురించికూడా అంతే బలంగా చిత్రిస్తూ రచనలు చేశారు. దామరాజు లక్ష్మి, శారదాపూర్ణ శొంఠి లాంటివాళ్ళు పూర్తిగా మాతృదేశపు జ్ఞాపకాలతో కథల్లాంటివి రాశారు. మొదటి తరం వాళ్ళు ఈ దేశం వచ్చేటప్పటికి తెలుగువారి సంఖ్య ఇప్పటితో పోలిస్తే చాలాతక్కువ వుండటం, అప్పుడు ఆంధ్రదేశం వున్న తీరు, వాళ్ళు వచ్చినప్పుడు అమెరికా వున్న తీరు – ఇవన్నీకూడా మొదటితరం రచయిత్రులు ఎలాంటి కథలు రాశారన్నదానికి స్పష్టమైన ఆధారం. ఈ దేశం వచ్చిన మొదట్లో వ్యక్తిగతంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా నిలదొక్కుకోవడానికి మొదటితరం వారు పడిన సంఘర్షణ, దాని తాలూకు అనుభవాలు తర్వాత వచ్చిన తరాల వారికి ఉపయోగపడ్డాయి.

90ల తర్వాత వచ్చిన రెండో తరం రచయిత్రుల నుండి పెద్దగా నోస్టాల్జియా రచనలు వచ్చినట్టు కనిపించలేదు. గత పదిహేనేళ్ళుగా మొదటి, రెండోతరం రచయిత్రులంతా కూడా కలగలసిపోయిన అమెరికన్‌ తెలుగు సంస్కృతి, జీవనవిధానం, పిల్లల పెంపకంలో ఎదురయ్యే ఇబ్బందులు, మారుతున్న భార్యాభర్తల అనుబంధాలు, పిల్లల పెళ్ళిళ్ళల్లో ఎదురవుతున్న అవస్థల్లాంటి ఇతివృత్తాలతో ప్రధానంగా కథలు రాశారు. ఈ కథలన్నీ కూడా పాతిక, ముప్ఫై ఏళ్ళుగా క్రమంగా మారుతూ వచ్చిన అమెరికన్‌ తెలుగు సమాజ స్వరూపాన్ని మన కళ్ళకు కటినట్టు చూపిస్తాయి. ఇవాళ మనకు అమెరికా తెలుగువారి జీవనవిధానం సంపూర్ణంగా అర్ధం కావాలంటే ఈ కథలు చదవాలి.

అయితే ముఫ్ఫై ఏళ్ళనాటి అమెరికాకి, ‘బూమ్‌’ తర్వాతి అమెరికాకు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే సెప్టెంబర్‌ 11 తర్వాత అమెరికాకు చాలా తేడా వుంది. ఈ తేడాను పట్టుకొని తమ రచనల్లో బలంగా చూపించిన రచయిత్రులు దాదాపుగా లేరనే చెప్పుకోవాలి. మాచిరాజు సావిత్రి, నిడదవోలు మాలతి, కలశపూడి వసుంధర, శేషుశర్మ లాంటి అతికొద్దిమంది రచయిత్రులు తప్ప ఎక్కువ మంది అమెరికన్‌ తెలుగు జీవనానికి సంబంధించి కౌటుంబిక ఇతివృత్తాలతోనే కథలు రాశారు. వర్తమాన పరిస్థితులపై, రాజకీయార్ధిక విషయాలపై ఒకటో, రెండో కథలు తప్ప కనిపించవు.

ఇక్కడి షేర్‌ మార్కెట్‌ గురించో, సెప్టెంబర్‌ 11 దాడుల గురించో, క్రెడిట్‌కార్డ్‌ల మోసాల గురించో ఆడవాళ్ళ నుంచి కథలెందుకు రావన్నది నన్ను ఆలోచింపచేస్తున్న అంశం.

అలాగే ఇండియాలో మారుమూల పల్లెల్లో కూడా మనకు ‘లెస్బియన్‌, గే’లాంటి సంఘటనలు జరుగుతుంటే, అమెరికన్‌ సమాజంలో అవి మరింత ఎక్కువ, చట్టబద్ధం, అతిసామాన్యం అయినప్పుడు దాని ప్రభావం అమెరికన్‌ తెలుగు సమాజంపై ఎలా వుంది. అది కేవలం పిల్లల పెళ్ళిళ్ళకు సంబంధించి భయాందోళనలకు సంబంధించిన అంశంగా కాకుండా అలాంటివాటిపట్ల మన అమెరికన్‌ తెలుగుపిల్లలు ఎలా ప్రతిస్పందిస్తున్నారు. వాటి పట్ల వాళ్ళ ఆలోచనలు ఎలా వుంటున్నాయి. అలాంటి సంఘటనలు మన కమ్యూనిటీలో ఏమైనా జరిగాయా? అన్న విషయాలు ఇక్కడి రచనల్లో ఎందుకు చర్చకు రావడం లేదన్నది నా సందేహం.

గత పదిపదిహేనేళ్ళుగా ఇక్కడి తెలుగు అమెరికన్‌ సమాజంలో ప్రముఖంగా కనిపిస్తున్న లేదా వినిపిస్తున్న విడాకులకేసులు, గృహహింస, కట్నం వేధింపులు, పెళ్ళి పట్ల పిల్లల, పెద్దల ఆలోచనల్లో వచ్చిన మార్పు, కొత్తగా పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న వివాహ వేదికలు, ఆన్‌ లైన్‌ మారేజీ బ్యూరోలు ఇలాంటి అంశాల మీద ఇక్కడి రచయిత్రుల నుండి కథలు వచ్చినట్టు కనిపించలేదు.

రచయితల్ని ఫలానా అంశాలు ఎందుకు తీసుకుంటున్నారని కానీ, ఎందుకు తీసుకోలేదని కానీ మనం అడగాల్సిన పనిలేదు. ఏ రచయితైనా తన మనసుకు దగ్గరగా వచ్చిన అంశాల్ని మాత్రమే కథావస్తువుగా స్వీకరిస్తారు. మరి ఈ ప్రశ్నలెందుకంటే నిజంగా అమెరికన్‌తెలుగు సమాజం ఎలా వుంది? ఎలాంటి జీవనవిధానాన్ని గడుపుతోంది? అన్న విషయాల మీద ఇక్కడి నుంచి వాస్తవ చిత్రణతో రచనలు రాకపోవడం, వాటి గురించి లోతైన పరిశీలన కానీ జరగకపోవడం ప్రవాసాంధ్ర సాహిత్యానికి ఓ లోపంగా మిగిలిపోతుంది కాబట్టి.

ఈ అంశాలన్నీ కూడా అమెరికాలోనూ, ఇండియాలోనూ కనిపిస్తున్న ఆలోచనల గురించి, వాటిల్లో వస్తున్న మార్పునుగురించి చెప్పటం కోసమే. అక్కడి ప్రభావం ఇక్కడ, ఇక్కడి ప్రభావం అక్కడ వుండటం రెండూ సహజమే. అయితే ఈ ప్రభావాల్ని, మార్పుని సమన్వయం చేసి చెప్పాస్సిన బాధ్యత రచయితలదే. అమెరికాలో జీవిస్తున్నవాళ్ళు కూడా ఎక్కడి నుంచో దిగుమతి అయ్యేవాళ్ళు కాదుకదా. వాళ్ళు, వాళ్ళ మూలాలు ఇండియానుండి వచ్చినవే. ఇక్కడ కూడా భార్యల్ని రకరకాలుగా కట్టడి చేసే మనుషులుంటారు. మానసికంగా, భౌతికంగా ‘ముక్కలు ముక్కలు’గా నరికే నరహంతకులుంటారు. కొందరి ‘మాటల’ ప్రకారం గ్రీన్‌కార్డు కోసం అమెరికాలో వున్న అబ్బాయిల్ని పెళ్ళి చేసుకొని ఎయిర్‌పోర్టులోనే వదిలివెళ్ళిపోయే అమ్మాయిలుంటారు. మరి ఇవన్నీ రచనల్లో వచ్చినప్పుడే కదా మిగతా ప్రపంచానికి కూడా ఇక్కడేం జరుగుతోందో తెలిసేది. కాబట్టి ప్రేమించిన వాళ్ళు మోసం చేశారనో, కట్నం తక్కువ ఇచ్చారనో అమ్మాయిల ఆత్మహత్యలు, హత్యలు అక్కడైనా ఇక్కడైనా ఒక్కటే. అక్కడా ఇక్కడా విడాకుల రేటు సమానమే. ఎన్నారైల కట్నం వేధింపు కేసులు ఎక్కువవడం వల్ల ఇండియాలో ప్రత్యేకంగా ఎన్నారై సెల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. కానీ కట్నం వేధింపుల గురించి ఒక్క కథ కూడా ఇక్కడి నుంచి రాలేదు. అంటే రచయిత్రులు వాస్తవాన్ని చూపించటానికి నిరాకరిస్తున్నారా? లేక అలాంటి వాటి గురించి రాయటానికి భయపడుతున్నారా? అన్నది ఆలోచించాల్సిన అంశం.

ఇక్కడున్న రచయిత్రుల్లో ఒకరిద్దరివి తప్ప మిగతావారి రచనలేవీ ఇండియాలోని ప్రధానస్రవంతి పత్రికల్లో ప్రచురితమైనట్లు చూడలేదు. ఇందుకు కారణం వాళ్ళకు అక్కడికి ఎలా పంపాలి అన్న విషయంపై అవగాహన లేకపోవడమైనా అయివుండాలి లేదా దాని పట్ల ఇంట్రస్టు అయినా వుండకపోవాలి. అందువల్లే చాలామంది ప్రవాసాంధ్ర రచయిత్రులు ఇక్కడున్న ఆన్‌లైన్‌ పత్రికలకు, సావనీర్లకు పరిమితమైపోయారు. ‘తెలుగునాడి’లో ఇండియాలో ప్రచురితమైన కథల్నే పునర్ముద్రిస్తున్నారు తప్ప డైరెక్టుగా అమెరికా వారి రచనల్ని ఎక్కువగా తీసుకోవడం లేదు. ప్రవాస సాహిత్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారు రాస్తున్న రచనల్ని ఎలక్ట్రానిక్‌ రూపంలో అందరికీ అందుబాటులోకి తెచ్చే సదాశయంతో మొదలు పెట్టారు ‘ఈమాట’. వంగూరి ఫౌండేషన్‌ వాళ్ళు డయాస్పోరా సాహిత్యాన్ని సంకలనాలుగా తీసుకువచ్చే బృహత్‌కార్యక్రమాన్ని నిరాటంకంగా చేస్తుండటం వల్ల కొంతన్నా ప్రవాసాంధ్ర సాహిత్యం మనకు ఓ చోట లభ్యమవుతోంది. ఆ ప్రచురణలే లేకపోతే ఇవాళ చాలా మంది కథలు సావనీర్లలో తప్ప మనకు దొరికేవి కావు. చిమటా కమల రాసిన ‘అమెరికా ఇల్లాలు’ సంకలనం, వడ్లమాని పద్మావతి ‘పడమటి గాలులు’ నవల రెండూ కూడా వంగూరి ఫౌండేషన్‌ ప్రచురణలే. ‘తెలుగు పీపుల్‌ డాట్‌ కామ్‌’ సుజనరంజని, ‘భువనవిజయం’ లాంటి వెబ్‌సైట్ల్‌ కూడా ఇతోధికంగా ప్రవాసాంధ్ర రచనల్ని ప్రోత్సహిస్తున్నాయి.

తెలుగు సాహిత్యంలో ప్రవాసాంధ్ర జీవితం ఓ పాయ. దళిత, స్త్రీ, మైనార్టీ ఉద్యమాలతో భాగంగా ప్రవాసాంధ్ర జీవితం గురించి అక్కడా, ఇక్కడా సరైన చర్చ జరిగినప్పుడే వర్తమాన తెలుగుసాహిత్య స్వరూపం మరింత స్పష్టమవుతుంది.*