మెహఫిల్

తెల్లటి పూలగుత్తులు రోడ్డంతా
మంచుప్రేమ మైకంలో మునిగిపోయే మాడిసన్‌

చివరిచూపు, చివరిమాటల్లాగా
ఎండిపోయిన చెట్లు
ఆఖరిక్షణాల్లో ఆత్మీయపు పలకరింతల్లాగా
మళ్ళీ తొలిప్రేమంతా తాజాగా
ఓ తెల్లటి కౌగలింతలో ఒదిగిపోయిన రెండు రాబిన్‌ పక్షులు
పక్షుల ఈలపాట మెహఫిల్‌ మీద
పిల్లల నవ్వుల పువ్వుల కేరింతలు
మళ్ళీ కొత్తజీవితపు కోటి ఆశలు
ఏవీ ఆరుబైట మంచు బొమ్మలు?
ఏవీ ఆ చిత్రవిచిత్ర ఆకుల ఇంద్రధనస్సులు?
ఏవీ ఆ రెడ్‌కార్డినల్స్ స్వరఝరులు?
ఏవీ ఆ పడిలేచే అల్లరి తరంగాలు?
ఏవీ ఆ లేక్‌మెండోటా గుసగుసలు?

ఆస్టిన్‌ నీరెండల మధ్య మాడిసన్‌ స్మృతులు
తొలిముద్దు ముద్దమందారాలే!

(మంచునగరం మా మాడిసన్‌ కోసం)


కల్పన రెంటాల

రచయిత కల్పన రెంటాల గురించి:

కల్పనా రెంటాల మొదటి కథ 1985-86లలో తన 20 ఏళ్ల వయస్సులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. మొదటి కవితా సంకలనం “నేను కనిపించే పదం” నకు అనంతా పురస్కారం లభించింది. స్త్రీలు, పిల్లలకు సంబంధించిన ఇతివృత్తాలతో కల్పనగారు అనేక కథలు, కవితలు, సాహిత్య విమర్శలు, అనువాదాలు చేశారు. ‘తూర్పు-పడమర’ అనే వెబ్ పత్రికను నిర్వహిస్తున్నారు.

 ...