జిగిరీ – 2వ భాగం

‘అరే ఇమామ్‌ …’’ వాకిట్లో నిలబడి పిలిచాడు చంద్రయ్య.

ఇమామ్‌ తండ్రి చనిపోయి అప్పటికి సరిగ్గా ఏడాది. తండ్రి చనిపోయిన రోజే తండ్రి తెచ్చుకున్న ఎలుగు చనిపోయింది. తండ్రి చనిపోయి తోడు దూరమై ఎలుగు చనిపోయి బతుకు దెరువు దూరమై పుట్టెడు దు:ఖంతో ఉన్నాడు ఇమామ్‌.

ఎవరో తనని పలుకరించడానికి వచ్చారనుకుని బయటకు వచ్చాడు ఇమామ్‌. ‘‘మా పల్లి చేను దగ్గర గుడ్డేలుగుందిరా … రాత్రిపూట వచ్చి చేనునంతా బొర్రిత్తంది …’’ అన్నాడు చంద్రయ్య.

‘‘అయితే నేనేం చేసేది. నా ఎలుగుపోయి వారం దాటింది’’ అన్నాడు ఇమామ్‌.

‘‘అరే పాగల్‌ … పూర్తిగా విను. నీ ఎలుగు సచ్చిపోయిందనే చెప్పటానికి వచ్చిన. చేను దగ్గరున్న ఎలుగు ఆడిది. దానితో ఒక పిల్ల గూడా ఉంది. పిల్లను తెచ్చుకుంటే నీకు బతుకు దెరువుంటది. యాడాదిల ఆటలన్నీ నేర్సుకుంటది’’ అన్నాడు.

ఇమామ్‌కు నిజమే అనిపించింది. కాని ఎలుగుల్ని పట్టడం రాదు. తన తండ్రి గూడా ఎలుగు పిల్లల్ని పట్టలేదు. ఎలుగుతో ఆట నేర్పిండు కానీ ఎలుగును పట్టడం నేర్పలేదు.

‘‘సూద్దాం … మన ప్రయత్నం మనం జేద్దాం. ఆట నేర్చిన గుడ్డేలుగును కొనాలంటే కనీసం రెండు మూడు వెయిలు గావాలె. పిల్ల దొరికితే మంచిదే! ఆట నేర్పచ్చు’’ బీబమ్మ అన్నది.

ఇమామ్‌ సరే అన్నాడు. ఆ రాత్రే వస్తానని చంద్రయ్యతో చెప్పాడు. అనుకున్నట్టు అదే రాత్రి ఎన్నీల సాలుకు చంద్రయ్యపల్లి చేను వద్దకు వెళ్ళాడు. అర్ధరాత్రి వరకూ చూశాడు. ఎలుగు రాలేదు. ఇక రాదనుకుని ఇంటికి వస్తున్నప్పుడు గుర్‌గుర్‌మని చప్పుడు వినిపించింది. చెట్టు చాటుకు నక్కి కూర్చుండి చూస్తుండి పోయాడు ఇమామ్‌.

నిండా బూరుతో నల్లగా ఎత్తుగా ఉంది ఎలుగు. తెల్లని వెన్నెల్లో దాని నలుపుదనం మరింత స్పష్టంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది.

అచ్చం తన చనిపోయిన గుడ్డేలుగు లాగే అనిపించింది ఇమామ్‌కు.

అది గనుక చనిపోకుండా ఉంటే అదే ఇదని బ్రమపడే వాడే!

మెల్లెగా నడిచి వస్తుంది ఎలుగు. భయం లేకుండా అడివంతా తనదే అన్నట్టుగా నడిచి వస్తుంది. ఇమామ్‌కు ఎలుగుల గురించి బాగా తెలుసు. అవి ఎప్పుడు ఎలా ఉంటాయి. ఎలా మసులుకుంటాయి తెలుసు. వాటి అలవాట్లేంటో తెలుసు. కానీ అడవి ఎలుగును చూస్తుంటే కొత్తగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.

ఇమామ్‌ చూపులు పిల్ల ఎలుగు కొరకు వెదుకుతున్నాయి. దాని జాడ కనిపించలేదు. పెద్ద ఎలుగును పట్టడం అంత తేలిక కాదు. అయినా పట్టవచ్చుగానీ దాని అలవాట్లను మాన్పడం మట్టుకు వీలుకాదు. అది అడవి వాసనలను అంత తొందరగా పోగొట్టుకోదు. మనుషులతో అంత తొందరగా మచ్చిక కాదు.

కత్తెర పొదల నుంచి … మంగపండ్ల వాసన చూస్తూ … భూమిని గోళ్ళతో గీరుతూ … తలెత్తి నోరు తెరిచి వాసనలను పసిగడుతూ వస్తుంది ఎలుగు.

ఎలుగును చూడగానే పులకించి పోయాడు. చాలా రోజుల తర్వాత ఆత్మీయులను చూసినట్టుగా అనిపించింది.

ఎలుగు ఇమామ్‌ ఉన్న పొద వద్దకు వచ్చి ఆగింది. తలపైకెత్తి గుర్రుమంది. ఇమామ్‌కు దస్సుమంది. పైపాణాలు పైనే పోయాయి. ఎలుగు తననిగానీ పసిగట్టిందా అనుకున్నాడు. ముందు జాగ్రత్తగా అడివికి వచ్చే ముందే పెయ్యంతా ఇప్పపూల సారను రాసుకున్నాడు.

ఎలుగు అక్కడే ఆగింది. గుర్రుగుర్రుమంటుంది. ఇమామ్‌ పాణాల మీద ఆశ వదులుకన్నాడు. ‘ఎలుగులు వేటకుక్కల కంటే వేయి రెట్లు చురుకైనయి. వాటికి వాసన పసిగట్టే శక్తి గూడా ఎక్కువనే! మనిషి వాసన పసిగట్టినట్టుంది. ఇది నన్ను మాత్రం వదలదు. వేటాడి వెంటాడి చంపుతుంది … ఎట్లా…? ఎలుగును పెంచే ఇంట్లపుట్టి ఎలుగుతోనే సచ్చుడా …’ అనుకున్నాడు ఇమామ్‌.

నిజానికి ఆ రోజు షికారుకు రాలేదు ఇమామ్‌. ఎలుగు తావులను చూసిపోవడానికి వచ్చాడు. అందుకే వెంట అగ్గిపెట్టెను కూడా తెచ్చుకోలేదు. చిన్న అగ్గిపుల్ల ఉన్నా ఆ ఆపద నుంచి తప్పించుకోవచ్చు. కానీ అదిగూడా లేదు.

చివరి ప్రయత్నంగా అక్కడి నుంచి పరుగుతీత్తామనుకున్నాడు ఇమామ్‌. అలా పరుగుతీసినా తనని తాను రక్షించుకోలేనని తెలుసు.

ఇమామ్‌ నిలబడబోతుండగా ఎలుగు అక్కడి నుంచి కదిలింది. కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇమామ్‌. అతనిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అక్కడ ఇంకో ఎలుగు కనిపించింది. నడకలను బట్టి ఒకటి ఆడ ఒకటి మగగా గుర్తించాడు ఇమామ్‌. రెండూ నడిచిపోతున్నాయి.

ఇమామ్‌ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. శరీరం పులకరించింది. నడుస్తూ నడుస్తూ రెండు ఎలుగులు ఇప్పచెట్టు దగ్గర ఆగినాయి. మగ ఎలుగు చెట్టెక్కి పువ్వును దులిపింది. ఆడ ఎలుగు ఏరుకుని తిన్నది. రెండూ కలిసి ముందుకు నడుస్తున్నాయి.

‘ఊరి మనుషులకు లేని నీతి అడివి ఎలుగులకుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ జతకట్టయి. ఈ రాత్రి వీటికి జాగారమే … తిరిగి తిరిగి ఏనట్టడివిలోనో చీమ చిటుక్కుమనని చోట ఏ తెల్లారేముందో జతకడుతాయి’ అనుకున్నాడు ఇమామ్‌.

ఎలుగులు వెళ్ళిపోయాయి. పిల్ల ఎలుగులు మాత్రం రాలేదు. తెల్లవార్లూ ఆశగా అక్కడే కూర్చున్నాడు ఇమామ్‌.

మరునాడు చంద్రయ్య ఇమామ్‌ను కలిసి ఎలుగుల గురించి అడిగిండు. ‘‘ఎక్కడియి పటేలా … పిల్లలు లెవ్వు. ఎదునకచ్చిన పోతు పిల్లలున్నయి’’ అన్నాడు ఇమామ్‌. ఇమామ్‌ ఎక్కడ చూసిండో అడిగి అక్కడ కాదని వేరోచోటును చెప్పాడు చంద్రయ్య. అన్ని జాగ్రత్తలతో మరునాడు అడవికి పోయాడు ఇమామ్‌.

అదే ఎన్నీల సాలు. అదే అడవి. నిన్నటి యాల్లకే ఎలుగు వచ్చింది. చంద్రయ్య చెప్పినట్టు తల్లి పిల్ల రెండున్నాయి. తల్లి చకచక తాటి చెట్టు ఎక్కింది. కల్లును జుర్రింది. పిల్ల చెట్టును ఎక్కబోయింది. సగం వరకు ఎక్కి కిందికి జారింది.

తల్లి ఎలుగు ఇప్పచెట్టును ఎక్కింది. మండల్ని బలంగా ఊపింది. ఇప్పపూవు కిందికి రాలింది. పిల్ల పువ్వును ఏరుకుని బుక్కింది. బుక్కుతూ ఎగిరి గంతులేసింది. పొదలగుండా అటూ ఇటూ దూరింది.

ఇమామ్‌ ఎలుగు తావులన్నీ చూసిండు. జాగ్రత్తగా తప్పుకుని బయటకు వచ్చాడు. మనిషి వాసనను ఉనికిని వెంటనే పసిగడుతుంది ఎలుగు. ఒక వేళ పసిగడితే వెంట పడుతుంది. అది మనిషి మాంసాన్ని ముట్టదు. పంజా విసిరి తల పుచ్చెను తీస్తుంది. మెదడును జుర్రుతుంది. మగ ఎలుగైతే ఆడవాళ్ళను చంపిన తర్వాత పొందు చేస్తుంది.

మరునాడు ఇమామ్‌ రెండు వలలను సంపాదించాడు. ఇప్ప చెట్టు కింద రెండు పొదలున్న చోట వలలను కట్టి మాటువేశారు. ఆ రోజు వెంట బీబమ్మ ఉన్నది. ఈతకమ్మల్ని అగ్గిపెట్టెను పట్టుకుని కూసుంది. ఇమామ్‌ తడుకలతో అల్లిన బోనును పట్టుకుని కూర్చున్నాడు.

అర్ధరాత్రి దాటింది. నెలపొడవు పొడిచింది. మసక వెన్నెల్లో నల్లగా ఎత్తుగా బలంగా ఉన్న ఎలుగు నడిచి వచ్చింది. దాని వెంట గెంతులేస్తూ పిల్ల నడిచి వచ్చింది. తల్లి తాడి చెట్టెక్కి కల్లు తాగింది. పిల్ల సగం వరకు ఎక్కి జారింది.

తల్లి ఇప్ప చెట్టెక్కి పువ్వు దులిపింది. పిల్ల పువ్వును ఏరుకుని తిన్నది తర్వాత గెంతులు వేసింది. వేస్తూ వేస్తూ పొదలు తిరిగింది. పొదల్లోని వలలో చిక్కుకుంది. గురుక్కు గురుక్కుమంది.

దాని అరుపుకు తల్లి దిగి వచ్చింది. రెండు గెంతుల్లో పిల్లను చేరుకుంది. కొన్ని క్షణాలైతే వలను తెంపి పోగులు పెట్టేదే!

ఇమామ్‌ వలకున్న తాళ్ళను అందుకుని దూరం జరిపాడు. మనిషి వాసనను పసిగట్టిన గుడ్డేలుగు ‘గాండ్రు’మని రెండు కాళ్ళమీద లేచి నోరు తెరిచింది. నల్లటి ముక్కు తెల్లటి కోరలు వెన్నెల్లో తలుక్కున మెరిశాయి. క్షణం ఆలస్యమైనా ఇమామ్‌ తలపుచ్చె ఎగిరిపోయేదే.

అప్పుడే అగ్గి పుల్లగీకి ఈత కొమ్మల్ని అంటుపెట్టింది బీబమ్మ. రెండు ఈతకొమ్మల్ని ఎత్తి పట్టుకుంది. మంటను చూడగానే బెదిరి రెండడుగలు వెనక్కు వేసింది ఎలుగు. అదే అదనుగా దూరం తప్పుకున్నాడు. తల్లి ఎలుగు అంత తొందరగా చెట్టుమీది నుంచి పిల్ల ఎలుగును చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు.

పక్కకు తప్పుకున్న ఇమామ్‌ ‘ఓయ్‌ … ఓయ్‌’ అని కేకలు వేస్తూ రాళ్ళను ఇసురుతూ మండుతున్న ఈత కొమ్మను అందుకుని ఎలుగును బెదిరించాడు. ఎలుగుకు మంటను చూస్తే చచ్చేంత భయం. అదే భయంతో దూరం జరిగింది. మంటతో దానిమీద దాడి చేస్తున్నట్టుగా ఎదురుగా పోతూ ఎలుగును మరింత వెనక్కి జరిపాడు ఇమామ్‌.

పిల్ల ఎలుగు వలలో కట్టుకుంటుంది. తల్లి ఎలుగు బయట గాండ్రిస్తుంది. మంటను చూసి ఆగిపోయిందిగాని లేకుంటే ఇద్దరి తల పుచ్చెలు ఎగిరిపడేవే!

ఈ లోపల మైబమ్మ ఒక ఎండు పొదకు మంటను తగిలించింది. పొద నుంచి నాలుకలు చాపి మంట పైకిలేచింది. ఆ వెలుతురులో ఒకరి కొకరు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఒక్కసారిగా పైకి లేచిన మంటను చూసి మరింత భయపడింది తల్లి ఎలుగు. కొంతదూరం వెనక్కి పరిగెత్తి అక్కడ నిలబడి ‘గాండ్రు గాండ్రు’మని పిల్లను పిలుస్తుంది. వలలో చిక్కుకున్న పిల్ల ‘గాండ్రు’మనే అరుపుతోనే సమాధానం చెప్పుతుంది.

వాటి అరుపులతో అడవి మొత్తం మేలుకుంది. చుట్టూ చెట్ల మీదున్న పిట్టలు ఎగిరిపోయాయి. పొదల్లో ఉన్న జంతువులు పారిపోయాయి.

ఇమామ్‌ ఆలస్యం చేయలేదు. వెనక్కి తగ్గిన ఎలుగుగాని కోపంతో ముందుకు వస్తే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. ఏ క్షణంలోనో అది చావుకు తెగించి ముందుకు దూకవచ్చు. చేతిలో ఈటె ఉంది. కత్తి ఉంది. ముక్కుకు గురిచూసి విసిరితే తన్నుకుని చస్తుంది. కాని తల్లిని చంపాలనిపించలేదు ఇమామ్‌కు.

ఆ వెలుతురులో వలను ముల్లెలా చుట్టిండు. ఒడుపుగా పిల్ల ఎలుగును అందుకున్నాడు. గోషిలోంచి నాటుసార సీసను తీశాడు. ఇమామ్‌ మోకాళ్ళపై కూర్చుండి, కాళ్ళతో చేతులతో పిల్లను ఒడిసి పట్టుకుంటే బీబమ్మ నాటుసారాను ఎలుగు గొంతులోకి వంపింది.

ఇప్పపూల రుచి మరిగిన ఎలుగు నాటుసారను చప్పరించింది. వల సందులోంచి సీసను పిల్ల ఎలుగు గొంతులోకి వంపింది బీబమ్మ. అది తనను పక్కలకు ఆడించినా కారిపోకుండా సీసాను దాని గొంతులోకి దించి పట్టుకుంది. కాళ్ళు కదలకుండా ఇమామ్‌ పట్టుకున్నాడు.

ఎంత ప్రయత్నించినా, ప్రతిఘటించినా లీటరుకు పైగా సారా ఎలుగు పిల్ల కడుపులోకి దిగిపోయింది. కొంతసేపు అరిచినా మత్తుగా అది నిద్రలోకి జారుకుంది. వల మొత్తం ముల్లెలా చుట్టి తడుకల బోనులో ఉంచాడు ఇమామ్‌. బోనును ఒక పొదలో ఉంచి తాళ్ళతో చెట్లకు గట్టిగా ముడివేశాడు.

అంతసేపూ ఎలుగు దూరంగానే నిలబడి గాండ్రిస్తుంది. బీబమ్మ ఈతకమ్మల్ని వెలిగిస్తూ కాపలా కాస్తూనే ఉంది.

చేయాల్సిన పని పూర్తయింది. పిల్ల ఎలుగు అరుపులు ఆగిపోయాక తల్లి ఎలుగు మరింతగా తల్లడిల్లింది. మొదట్లో ఉన్న భయం లేదిప్పుడు. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది.

ఆ రాత్రికి రాత్రే పిల్ల ఎలుగును బయటకు తరలించడం అసాధ్యం. వాసన పసిగట్టి వెంటపడుతుంది తల్లి. ఎంత మంటను వెలిగించి పట్టుకున్నా వదలదు. కొంతదూరం భయంగా వెంబడించినా తెగించి దాడి చేస్తుంది. అక్కడ ఉన్నా దాడి చేస్తుంది. అందుకని ఇద్దరూ తప్పుకుని బయటకు వచ్చారు. వచ్చే ముందు ఇంకో పొదను వెలిగించి వచ్చారు.

తల్లి ఎలుగు దృష్టి మొత్తం పిల్ల ఎలుగు మీదుంది. అందుకని వాళ్ళు తప్పుకోవడం సులభమయ్యింది. లేకుంటే వాళ్ళను వదిలిపెట్టేది కాదు. తొందరగా అడవిలోంచి తప్పుకుని ఇంటికి వచ్చారు. చాలా దూరం వరకు తల్లి ఎలుగు గాండ్రింపులు వినిపిస్తూనే ఉన్నాయి. దాని అరుపులను బట్టే ‘ఇప్పుడు పొద దగ్గరికి వెళ్ళింది’, ‘ఇప్పుడు పొద చుట్టూ తిరుగుతోంది’, ‘ఇప్పుడు ముక్కుతో నేలను తవ్వుతోంది’, ‘ఇప్పుడు ఎలిత బద్దల బోను మీద విరుచుకపడుతుంది’ అంటూ అంచనా వేసుకున్నాడు ఇమామ్‌.

‘‘పిల్ల చిక్కుతుందంటావా …’’ ఇంటికి వచ్చాక అనుమానంగా అడిగింది బీబమ్మ.

‘‘చిక్కక ఎటుపోతుంది. తల్లి ఎలుగు వలను కొరికిపోగులు చేసినా బోనును ముక్కలు చేసినా పిల్ల నిద్రలెవ్వది. సారలో తంబాకు బూడిద కలిపిన గదా’’ అన్నాడు ఇమామ్‌.

తెల్లవారి పొద్దు పొడిచిన తర్వాత అక్కడికి చేరుకున్నాడు ఇమామ్‌. అప్పటికే అక్కడికి చంద్రయ్య వచ్చాడు. బోను ఉంచిన పొద పొదలా లేదు. మొత్తం తుక్కు తుక్కయింది. బోను పొదలో లేదు. చాలా దూరంలో ఉంది. పొదచుట్టూ నేల దున్నినట్టుగా ఉంది.

పిల్ల ఎలుగు ఇంకా మత్తు నుండి లేవలేదు. బోను సగం వరకు విరిగిపోయింది. వలలో ముల్లెకట్టినట్టున్న పిల్లను ఎత్తి గంపలో వేసుకుని నెత్తి నెత్తుకున్నాడు ఇమామ్‌.

‘‘అరేయ్‌ … ఏందిరా … పిల్లను పట్టుకుంటే అయిపాయెనా … తల్లిని చంపుతావనుకున్నా … ఇప్పపూలు మొక్క తిక్కతిక్కగా నా పల్లి చేను తవ్వుతుంది. రేపటి నుంచి ఇంకా తిక్క మీదుంటది’’ అన్నాడు చంద్రయ్య.

‘‘పటేలా … రేపటి నుంచి నీ పల్లి చేనుకే కాదు. ఈ ఇప్పచెట్టు దగ్గరికే రాదు. అసలు ఈ అడవిలోనే ఉండది. అది దూరంగా వెళ్ళిపోతది. ఎలుగు తత్వమేంటో నాకు బాగా తెలుసు’’ అన్నాడు ఇమామ్‌.

పిల్లను ఇంటికి తెచ్చి సల్లగట్టుక పోసి మూతికి బెల్టును కట్టాడు. మెడకు తాడును బిగించాడు. కాలి గోర్లను కత్తిరించాడు. కొత్త బోనులో ఉంచి తడుక కట్టాడు.

నెలా రెండు నెలల వరకు ఆ వాతావరణానికి అలవాటు పడలేదు పిల్ల ఎలుగు. ఎప్పుడూ బోనులోనే ఉండేది. బయటకు వస్తే పారిపోవాలని చూసేది. తిక్కతిక్కగా ఉండేది. మనుషుల పైకి దూకేది. రెండుసార్లు ఇమామ్‌ మీద దూకింది. నాలుగైదు సార్లు బీబమ్మతో కలబడింది. నోటికి బెల్టుగానీ లేకుంటే గాయపరిచేదే. అక్కడికే గోర్లతో రక్కింది. గోర్లు లెవ్వు కాబట్టి సరిపోయింది. ఎప్పుడో తప్ప సల్లగటుక ముట్టేది కాదు.

చాంద్‌ ఏడాది పిల్లవాడు. తప్పటడుగులు వేస్తున్నాడు. ఎలుగు పిల్లను ఆశ్చర్యంగా చూసేవాడు. ఆడుకోవాలని ప్రయత్నించేవాడు. కానీ బీబమ్మనే కొడుకును దూరంగా ఉంచేది. ఎలుగుకు నమ్మి ఉండేది కాదు.

రెండు నెలల్లో ఎలుగు సగానికి సగమైపోయింది. బొచ్చు రాలిపోయింది. చర్మం వేలాడుతుంది. ఒక దశలో బతుకనే బతుకదనుకున్నారు. ఇమామ్‌ చెట్ల మందుల్ని దంచిపోసాడు. బీబమ్మ మరుగుమందు పెట్టింది. ఎలుగుకు షాదుల్‌ అని పేరు పెట్టుకున్నారు. షాదుల్‌ అనేది దేవుని పేరు.

చాంద్‌కు ఒక రొమ్ముని ఇచ్చి ఇంకో రొమ్మును షాదుల్‌కు పిండిపోసింది బీబమ్మ. షాదుల్‌ కోలుకోవాలని మొక్కరాని మొక్కులు మొక్కింది. పెద్దగుట్టకు ముడుపు కట్టింది. దర్గాకు ఎదురు మొక్కింది. పీరీల గుండం తొక్కింది. మనిషి పాలకు మరగినాక షాదుల్‌ మనుషుల్లో కలిసింది. చాంద్‌కు అడ్డం తిరిగి బీబమ్మ ఒడిలో ఒదిగిపోయి పాలు తాగేది. ఒక్కోసారి చెరో రొమ్మును అందుకుని పాలు తాగేవారు.

‘‘నీకు ఒక్కడు కాదు … ఇద్దరు కొడుకులే’’ నవ్వుతూ అన్నాడు ఇమామ్‌. బీబమ్మ నవ్వింది. ‘‘నాకు చాంద్‌ కంటే షాదుల్‌గాడే ఇష్టం. చాంద్‌గాన్ని మనం ఇరువై ఏండ్లు సాదాలి. అప్పుడుగాని వాడు మన చేతికి అందడు. షాదుల్‌గాడు ఇంకో ఆరు నెలల్లో ఆట నేర్చిండంటే సచ్చేదాక మననే సాకుతాడు’’ అన్నది.

‘‘అది జంతువు కదా! ఒకల కష్టాన్ని దోచుకోదు. వీడు మనిషి పుట్టక పుట్టె. మనిషంటేనే స్వార్థం కదా!’’ అన్నాడు ఇమామ్‌.

బీబమ్మ నవ్వింది. చాంద్‌ను ఒక చేత్తో షాదుల్‌ను ఇంకో చేత్తో దగ్గరికి తీసుకుంది.

షాదుల్‌ ఎంత మనుషుల్లో మెదిలినా ఇంకా కోలుకోలేదు. బక్కచిక్కిపోయింది. ఇయ్యాల్లనా రేపా అని నెల రోజులు చూసింది బీబమ్మ. షాదుల్‌లో మార్పు కనిపించలేదు. రోజురోజుకు షాదుల్‌ బక్కచిక్కిపోతుంది. బూరు తీసిన కోడిపిల్ల లెక్క తయారయింది.

‘‘అరే … ఎంత పనై పాయె … ఇది రోజు రోజుకు ఇట్లగావట్టి. అల్లా! ఎట్లా’’ అని మదనపడింది బీబమ్మ. అదే విషయాన్ని ఇమామ్‌తో చెప్పింది.

‘‘ఏం జేత్తం … కర్మ. ఎట్టయితే గట్టయితది. మన గంజినీళ్ళు దానికి బాకుంటే బతుకుతది. లేకుంటే సత్తది. మన చేతుల ఏముంది …?’’ విరక్తిగా అన్నాడు ఇమామ్‌.

చావడం అంటే తట్టుకోలేకపోతుంది బీబమ్మ. తన ఎరుకలో రెండే రెండు ఎలుగుల చావుల్ని చూసింది బీబమ్మ. ఒకటి అత్త గారింట్లో… ఒకటి తల్లి గారింట్లో. ఎలుగు చస్తే ఇంట్లో మనిషి చచ్చినంత దు:ఖం. ఈ రెండు సార్లూ వారం రోజులు మనిషి కాలేదు బీబమ్మ.

ఇప్పుడు షాదుల్‌ను చూస్తుంటే ఆ చావులే గుర్తుక వత్తున్నయి. షాదుల్‌లో బీబమ్మ కొడుకును చూసుకుంటుంది. దాని నడకల్లో తప్పటడుగులను దాని మొఖంలో పసితనపు చాయలను చూసుకుంటుంది. చాంద్‌ను షాదుల్‌ను విడదీసి చూడడానికి మనుసు ఒప్పడం లేదు.

అందుకే ఇమామ్‌ ఆలోచనలతో ఏకీభవించలేదు. ఇమామ్‌ వదిలినట్టుగా దానిని దాని కర్మానికి వదల్లేదు. ఆమెకు తల్లిగారింటి వద్ద మసీదు గుర్తుకొచ్చింది. మసీదు దగ్గరుండే పక్కిర్‌ సాబ్‌ గర్తుకొచ్చిండు. చిన్న పిల్లలకు జరాలు వస్తే పొగమందు ఇస్తడు. తాయితులు కడుతడు.

బీబమ్మ ఇమామ్‌కు చెప్పింది. ఇమామ్‌ పట్టించుకోలేదు. చాంద్‌ను ఒక భుజం మీద షాదుల్‌ను ఒక భుజం మీద ఎత్తుకుని చెప్పక చెయ్యకనే బయలుదేరింది బీబమ్మ.

నడేవానకాలం. నిండా ముసురు. షాదుల్‌ను చూసి ఎవలూ బస్సు ఎక్కనియ్యలేదు. కాలి నడకనే నడిచింది బీబమ్మ. పొద్దున బయలు దేరిందల్లా పొద్దు గూకిగానీ తల్లి గారింటికి చేరలేదు. ముగ్గురూ తడిసి ముద్దయిండ్రు. దెబ్బకే చాంద్‌కు జరం అందుకుంది. చలికి వణుకుతున్నాడు. షాదుల్‌ ముడుచుకు పోయాడు.

బీబమ్మ తల్లి కోపానికి వచ్చింది. ‘‘నీ మొద్దుల మన్నువాడ … ఇంత వానల పోరాన్ని సంపుతవా … గుడ్డెలుగుల మన్నువాడ అది సత్తేంది బతికితేంది …’’ అని యాష్టపడ్డది.

చాంద్‌ను ఇంట్లో ఉంచి షాదుల్‌ను ఎత్తుకపోయింది బీబమ్మ. షాదుల్‌ను చూసి పక్కున నవ్విండు పక్కీరు. ‘ఇది చిన్న పిల్లలకే పనిచేస్తది … సంటి పిల్లలకు’ అన్నడు.

‘‘మా షాదుల్‌ సంటిపిల్లనే గదా! యాడాది నిండలేదు’’ అమాయకంగా అన్నది బీబమ్మ. ఆమెను వదిలించుకోవడానికి ఏదో ఒక మందును ఇచ్చాడు ఫకీరు. ఎంతో భక్తితో తెచ్చుకుంది బీబమ్మ.

ఇంటికి వచ్చినంక చాంద్‌కు జరం మరింత ఎక్కువైంది. ఇమామ్‌ కూడా కోప్పడ్డాడు. బీబమ్మ మాత్రం భయపడలేదు. వీనికేంది … నాలుగు బుక్కలు పాలు ఎక్కువ ఇత్తే జరంగిరం అంతపోతది. కాదంటే రెండు గోళీలు ఏత్త. షాదుల్‌గాని పాణమెట్ల’ అని తండ్లాడింది.

షాదుల్‌ కోసం ఎవలేం చెబితే అది చేసింది. ఎటు కూలీపోయినా షాదుల్‌ గురించే అడిగింది. ఆమె ఆతృతను చూసి ‘షాదుల్‌’ అంటే ఆమె కొడుకే కావచ్చనుకున్నారందరూ.

ఒకసారి శిగమూగే ఎల్లవ్వ షాదుల్‌ అంటే కొడుకే అనుకుని ‘రాత్రి ఎత్తుకరా బొట్టు పెడత. రోగం నొప్పి అన్నీ పోవాలె’ అన్నది.

బీబమ్మ కొంగును కప్పుకుని రాత్రి పూట షాదుల్‌ను ఎత్తుకపోయింది. అప్పటికే శిగమూగుతూ ఇరుగు పొరుగు వాళ్ళకు బొట్టు పెడుతుంది ఎల్లవ్వ. బీబమ్మ ఎల్లవ్వ ముందుకూసుండి కొంగు తీసింది. షాదుల్‌ బీబమ్మ ఒడిలోంచి ఎల్లవ్వ మీదికి దూకింది. శిగం ఎటువోయిందో దేవుడు ఎటుపోయిండో ఎల్లవ్వ ఇంట్లకు ఉరికింది. బీబమ్మను తిట్టనోళ్ళ గాదు.

షాదుల్‌ బాగులేడని మూతికున్న బెల్టు కూడా కట్టేదిగాదు. ఒకసారి ఊరి డాక్టర్‌ దగ్గరికి ఎత్తుకుపోతే డాక్టర్‌ మీదికి ఎగిరి కొరికినంత పనిచేసింది షాదుల్‌. ‘ముండా ఎవడు రమ్మన్నడు నడువు’ అని డాక్టర్‌ బీబమ్మను బయటకు నెట్టాడు.

షాదుల్‌ను చాంద్‌ను సమానంగా చూసేది బీబమ్మ. ఒకటే చోట షాదుల్‌, చాంద్‌ ఇద్దరూ ఆడుకుంటున్నారు. చాంద్‌కు ఉగ్గుపోసి నప్పుడు షాదుల్‌కు గుటక సల్లపోస్తుంది బీబమ్మ. చాంద్‌కు స్నానం చేయించినప్పుడు షాదుల్‌కూ చేయిస్తుంది. ముందు జాగ్రత్తగా తిండి పెట్టేప్పుడు మాత్రమే మూతికున్న బెల్టును తీస్తున్నారు. తర్వాత వెంటనే బెల్టులను బిగిస్తున్నారు. కాలిగోళ్ళను పెరుగకుండా శుభ్రం చేస్తున్నారు.

షాదుల్‌ కోలుకుంది. రాలిన బొచ్చు పెరిగింది. అడవి అలవాట్లు మానుకుంది. చూపుల్లో తేడా వచ్చింది. నడవడంలో తేడా వచ్చింది. మనుషుల తిండికి అలవాటయింది.

ఇమామ్‌ షాదుల్‌కు ఆటలు నేర్పించాలనుకున్నాడు. ఇంకా పెరిగితే మాట వినదని తెలుసు. ‘ఖడే’ అనగానే రెండు కాళ్ళ మీద నిలబడటం నేర్పాడు. అది నేర్వడానికి చాలా దెబ్బల్ని తిన్నది షాదుల్‌. ముక్కు మీద కట్టెతో కడుతుంటే బీబమ్మ పాణం తల్లడిల్లేది. భర్తను వారించేది.

ఇమామ్‌ వదిలిపెట్టేవాడు కాదు. షాదుల్‌ను దూరంగా తీసుకెళ్ళేవాడు. చెట్టుకింద కూర్చొని నేర్పేవాడు. ‘చల్‌’ అనగానే రెండు కాళ్ళ మీద నడవడం నేర్చుకుంది షాదుల్‌. ‘పక్‌డో’ అని కట్టెను విసరగానే అందుకోవడం నేర్చుకుంది.

ఇమామ్‌ పొద్దున లేవగానే స్నానం చేసేవాడు. అల్లాను యాది జేసుకునేవాడు. తండ్రికి మొక్కుకునే వాడు. షాదుల్‌కు స్నానం చేయించే వాడు. సల్ల గుటక తాగించే వాడు. చేతుల బెత్తంతో షాదుల్‌ను పట్టుకుని బయటకు వచ్చేవాడు.

‘‘మెల్లగ నేర్చుకుంటది. దెబ్బలు కొట్టకు. ముక్కు దూలమంటే ఆయువుపట్టు. ఒకసారి నిన్ను నువ్వు కొట్టుకో ఎంత పాణమెల్లిపోతదో ..’’ రోజూ చెప్పేది బీబమ్మ.

ఇమామ్‌ గడ్డాన్ని దువ్వుకుంటూ దీక్షగా బయటకు వచ్చేవాడు. పొద్దున పూట ఒక గంట ఆటలు నేర్పేవాడు. రాత్రి వెన్నెల పూట నేర్చుకున్న ఆటల్ని ప్రాక్టీసు చేయించే వాడు. వెన్నెల్లో షాదుల్‌ ఉషారుగా ఉండేది. ఉషారుగా ఆడేది. ఉషారుగా గంతులు వేసేది.

ఆరు నెలలు గడిచింది. ఈ ఆరు నెలల్లో ఇమామ్‌ గురువు, షాదుల్‌ శిష్యుడు. ఇమామ్‌ చేతుల్లో బెత్తం ఆడేది. షాదుల్‌ అతడు చెప్పినట్టు నడుచుకునేది. బడికి వెళ్ళి దీక్షగా చదువుకునే విద్యార్థిలా కనిపించేది షాదుల్‌. విద్యార్థులను చక్కటి నడవడిలో పెట్టే గురువులా కనిపించే వాడు ఇమామ్‌.

చాంద్‌ నడక నేర్వనే లేదు. షాదుల్‌ ఆటలన్నీ నేర్చుకున్నాడు. లేచి నడవడం … పల్టీలు కొట్టడం, డ్యాన్స్‌ చేయడం నేర్చుకున్నాడు. మిగిలింది ఒకటే ఆట. తాయత్తును నోట్లో పెడితే బయటకు ఊదడం.

ఊర్లల్లో ఉండే మనుషులందరికీ ఒక నమ్మకం. పిల్లలందరికీ గుడ్డేలుగు వెంట్రుకలతో తాయతును కట్టిస్తారు. ఆ తాయతును గుడ్డేలుగు నోట్లో పెడుతాడు ఇమామ్‌. దాన్ని నోట్లోంచి పిల్లగాని మీదికి విసురాలె. అప్పుడే తాయతుకు గిరాకీ. ఆ ఆట రాకుంటే బతుకుదెరువు లేదు.

ఆ ఆటకోసం ముందుగా ఇమామ్‌ చేదైన వేపకాయలను, ఒగరైన ఉసిరికాయల్ని ఉపయోగించాడు. నోట్లో చేదుగా ఉంటే షాదుల్‌ బయటకు ఉమ్మేస్తుందనుకున్నాడు. కాని షాదుల్‌ నమిలి మింగుతుంది. ఆ ఆట కోసం చాలా దెబ్బల్ని తిన్నది షాదుల్‌. కానీ ఉమ్మేయడం అలవాటు కాలేదు.

చివరికి పచ్చి మిరపకాయ ముక్కల్ని ఉపయోగించాడు ఇమామ్‌. షాదుల్‌ కారాన్ని తట్టుకోలేకపోయాడు. బయటకు ఉమ్మి వేయడం నేర్చుకున్నాడు. అట్లా రెండు నెలలు పట్టింది. ఆ రెండు నెలల్లో షాదుల్‌ ఒడుపుగా తాయతు విసురడం నేర్చుకున్నది. తాయితును నోట్లో పెట్టి ఎదురుగా నిలబడితే ఒడుపుగా పైకి విసురుతుంది. దానిని అందుకుని ఇమామ్‌ పిల్లలకు కట్టాలనుకున్నాడు.

చాంద్‌, షాదుల్‌లు కలిసి ఆడుకుంటున్నారు. చాంద్‌తో ఆడుకునేటప్పుడు షాదుల్‌ చిన్నపిల్లై పోతుంది. బీబమ్మ దగ్గర ఉన్నప్పుడు సంటి బిడ్డయి పోతుంది. ఇమామ్‌ వెంట నడిచినప్పుడు కుటుంబపు బరువునంతా నెత్తి నెత్తుకుంటుంది.

ఆటలు పూర్తిగా నేర్చిన తర్వాత ఒకనాడు బయలుదేరినాడు ఇమామ్‌. ముందుగా ఊరిలో ఆటను ఆడియ్యాలనుకున్నాడు. ఇన్ని రోజులు ఎలుగు ఇల్లు, ఇల్లు చుట్టూ పెరట్లోనే తిరిగింది. బయటకు అడుగు పెట్టలేదు.

ఇమామ్‌ కోటు వేసుకున్నాడు. సిల్కు లుంగీ ఎగజుట్టి కట్టుకున్నాడు. ఎలుగుకు మక్కగటుక పెట్టి తను ఇంత తిని మూతికి బెల్టును కట్టి నూలు పగ్గాన్ని మెడల చుట్టి పగ్గాన్ని చేతులో పట్టుకున్నాడు. ఒక చేతిలో బెత్తం ఉంది.

ఇమామ్‌ ముందు నడుత్తుంటే షాదుల్‌ వెనుక నడుత్తుంది. పగ్గం పట్టుకున్న చేతిలో తాయతులున్నాయి. ఎప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరి వీదిలోకి వచ్చిండో అప్పుడే ఎలుగు వెంట కుక్కలు పడ్డాయి.

ఎలుగు బెదిరింది. అటునుంచి ఇటు … ఇటు నుంచి అటు ఉరికింది. ఇమామ్‌ నూలు పగ్గాన్ని గట్టిగా పట్టుకుని కుక్కలను అదిలిస్తూ నడుస్తున్నాడు.

ఎలుగు పెనుగు లాడుతుంది. ముందుకు రాకుండా వెనక్కే లాక్కుంటుంది. ‘‘అగో … నీగత్తర్రాను … కుక్కలకు భయపడతవా …? నాలుగైదు రోజులైతే అలవాటయితది. కొత్తగా చూస్తున్నావు గదా’’ అంటూ ముందుకు లాగాడు ఇమామ్‌.

మెడ దగ్గర పగ్గం పుటుక్కున తెగింది. ఇమామ్‌ వెనక్కి విరుచుకు పడబోయి నిలదొక్కుకున్నాడు. ఎలుగు రెండు గంతుల్లో రాళ్ళ తెట్టెను దుంకి పరుగు అందుకుంది. ఎప్పుడైతే అది పరుగును అందుకుందో అప్పుడే కుక్కలు వెంటపడి తరిమాయి.

‘అడీ … మీగత్తర్రాను … దాని వెంబడి పడ్డరు. దాని మూతి బెల్టు ఉంది కాబట్టి బతికిపోతున్నరు. లేకుంటే మిమ్ముల్ని కొరికి పోగులు వెడుతుండే’ అనుకుంటూ ఎలుగు వెంటపడ్డాడు ఇమామ్‌.

ఇమామ్‌కు ఎలుగు అందలేదు. కుక్కలు గెదుముతున్నాయి. ఎలుగు పరుగు పెడుతుంది. చూస్తున్నంత సేపట్లోనే ఊరుదాటింది. అది ఊరు దాటేవరకూ కుక్కలు వదలలేదు.

ఇమామ్‌కు ఏం చేయాలో తోచలేదు. కొద్ది దూరం పరుగు తీశాడు. ‘ఖడే … ఖడే’ అని అరిచాడు. ‘షాదుల్‌ … ఆవోరే … ఆవోరే…’ అన్నాడు. ఎంత అరిచినా ఎలుగు నిలువలేదు. కుక్కల అరుపుల్లో ఇమామ్‌ అరుపులు కలిసిపోయాయి.

తన కండ్లముందే షాదుల్‌ మాయమైపోవడం ఇమామ్‌ జీర్ణించుకోలేకపోయాడు. అంగట్లో కొడుకు తప్పిపోయినప్పుడు కలిగే దు:ఖం కలిగింది. తిండి, తిప్పలు మాని అడివంతా వెదికిండు. బీబమ్మకు ఎవరు చెప్పిండ్రో గాని చాంద్‌ను ఎత్తుకుని అడివికి వచ్చింది.

షాదుల్‌ అడుగు జాడలకోసం చూశారిద్దరు. అవి కనిపించలేదు. చెట్టు గుట్టా తెలిసిన జాగల్లా వెదికారు. షాదుల్‌ కనిపించలేదు.

‘‘మనకు బాకీలేదు. దాని తావుకు అది పోయింది. ఇంది గాకుంటే ఇంకోటి. అడివే గొడ్డువోయిందా …? పోతేపోనీ’’ వెదికీ వెదికీ విసుగొచ్చి అన్నది బీబమ్మ.

ఇమామ్‌ కండ్లల్ల నీళ్ళు తిరిగాయి. అతడి కండ్లల్లో ఎప్పుడూ నీళ్ళను చూడలేదు బీబమ్మ.

‘‘నా బాధ అది గాదే … పూచినయన్నీ పువ్వులైతయా … కాచినయన్నీ కాయలైతయా … పోతే పోనిగానీ దాని మూతికి తోలు బెల్టుందే … ఆకలితో ఒర్రి సత్తది. అదీ నా భయం. దాని గోస మనకు తలుగుతది. కన్న ప్రేమ కంటే పెంచుకున్న ప్రేమ పెద్దది …’’ అన్నాడు.

బీబమ్మకు కూడా గుండె కరిగిపోయింది. షాదుల్‌ రూపము కండ్లముందు కదిలింది. అది చాంద్‌తోపాటు తన రొమ్ముకు ఎగబడి పాలు చీకటం గుర్తుకొచ్చి తల్లి పేగు కదిలింది.

ఆ రాత్రంతా షాదుల్‌ కొరకు వెదికి తెల్లారుతుందనగా ఇంటికి వచ్చారు. ఆ రోజు పొయ్యిమీద కుండలేదు. చెరో చోట ముడుచుకుని పండుకున్నారు. కొడుకు ఏడ్చినా పట్టించుకోలేదు బీబమ్మ.

షాదుల్‌ ఎట్టయినా చనిపోతుందని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఒక వేళ అది అడివంతా తిరిగి తల్లిని చేరుకున్నా తల్లి చేరదీయదు. మనుషుల మధ్య జీవించిన బిడ్డ పొడనే సహించదు. నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపుతుంది.

ఇదంతా ఊహించుకున్నాక బీబమ్మకు కోపం ఆగలేదు. భర్త మీద విరుచుకపడ్డది. ‘‘నీ గుడ్డి తలపండు వలుగ. కుక్కలు ఎంటవడితే ఇడిచివెడతావా … గెదుమనుంటివి … ఉచ్చేతార్థంగా దాని పాణం దీత్తివా …’’ అని తిట్టింది.

ఇమామ్‌ ఎలుగు పిల్ల పారిపోయినట్టు ఊరంతా తెలిసింది. దానికోసం వాళ్ళు పడుతున్న బాధ అందరినీ కదిలించింది. రైతులు తమ పొలాల దగ్గర ఎలుగు పిల్లకోసం వెదికారు.

ఒక రైతు తన సంటి దుడ్డె మందలోంచి తప్పిపోయిందని మరునాడు అడవిలో తిరుగుతుంటే ఒక పాత బాయి బొందలో ఎలుగు పిల్ల కనిపించింది. అతడు ఇమామ్‌ను పిలుచుకుని వారం రోజులు వరికోతకు వస్తానంటే ఎలుగు జాడ చెబుతానన్నాడు.

ఇమామ్‌కు పోయిన పాణం వచ్చినట్టయింది. వారం గాదు. పది రోజులు వస్తానన్నాడు ఇమామ్‌. మాట తీసుకున్నాక గానీ రైతు ఎలుగు జాడ చెప్పలేదు. జాడ తెలియగానే భార్యాభర్తలిద్దరూ పరుగందుకున్నారు.

పాత బాయి బొందలో చెట్లు దట్టంగా పెరిగినాయి. పొదలో మలుచుకుని పడుకుంది షాదుల్‌. గుర్రుగుర్రు మంటుంది. పొదకి ఒకవైపు బీబమ్మ నిలబడింది. ఇంకోవైపు ఇమామ్‌ నిలబడ్డాడు. ఎలుగును చూసినంక ఇద్దరికీ పట్టరాని సంతోషం కలిగింది. పాణాలకు తెగించి అయినా దాన్ని పట్టుకోవాలనే తొందర్లో ఉన్నారు.

పొదకి దగ్గరగా జరిగి ‘షాదుల్‌…’ అని పిలిచాడు ఇమామ్‌.

షాదుల్‌ తలెత్తి చూసింది. బెదిరి పరుగు అందుకుంటుందనుకున్నారిద్దరు. అలా పరుగు అందుకుంటే ఏం చెయ్యాలో చెప్పుకున్నారు. కాని షాదుల్‌ పరుగు అందుకోలేదు. మూలుగుతూ పొదలోంచి ఇమామ్‌ దగ్గరికి వచ్చింది.

ఇమామ్‌ కండ్లల్లో నీళ్ళు తిరిగినాయి. దాన్ని ఎత్తుకుని గుండెకు హత్తుకుని ‘‘అరే బేటా … షాదుల్‌ … నీకెంత కష్టమొచ్చిందిరా …’’ అన్నాడు. ఎలుగును ఎత్తుకుని బీబమ్మ కూడా ఏడ్చింది. షాదుల్‌ను ఎత్తుకుంటే ఆమెకు కొడుకు చాంద్‌ను ఎత్తుకున్నట్టు తృప్తిగా ఉంది.

రైతుకు ఇచ్చిన మాట ప్రకారం ఎర్రటి ఎండలో పది రోజులు వరికోతకు భార్యాభర్తలిద్దరూ వెళ్ళారు. మరో పది రోజులు కూలీ చేసి షాదుల్‌ కోసం ముక్కల్ని జమచేశారు. ఒక రైతుకు రోజూ పచ్చగడ్డి మోపును కోసి తెచ్చిస్తానని పాలను వాడిక పెట్టింది బీబమ్మ. షాదుల్‌ కోలుకుని భయం లేకుండా తిరుగడానికి నెలపైనే పట్టింది.

ఆ నెల రోజులు షాదుల్‌ సంటిపిల్ల కంటే ఎక్కువ పోషన చేసింది బీబమ్మ. ఒకవైపు కొడుకు చాంద్‌ను పడుకో బెట్టుకుంటే మరోవైపు షాదుల్‌ను పడుకోబెట్టుకుంది. షాదుల్‌ ఇల్లు చేరినందుకు మొక్కిన మొక్కులన్నీ తీర్చుకుంది.

ఐదేండ్లప్పుడు ఒకసారి జబ్బు పడ్డది షాదుల్‌. ఏం రోగమో తెలువలేదు. చెట్ల మందులు దంచిపోసిండు ఇమామ్‌. తగ్గలేదు. గటుక ముట్టలేదు. లేచి నడువలేదు. నాటు వైద్యుడు పాము కుసం కావాలన్నాడు. పాము కుసం కోసం ఇద్దరూ తిరుగని పుట్టలేదు. చూడని గట్టు లేదు.

అది ఎర్రటి ఎండాకాలం. పాములు పుట్ట అడుగుల్లోనే దాక్కుంటాయి. రెండు రోజులు తిరిగి బీబమ్మనే ఎక్కడో వెదుక్కొచ్చింది. పాముకుసుంతో చేసిన మందు పని చేసింది. వారంలో షాదులు కోలుకుంది.

షాదుల్‌ పదేండ్లప్పుడు అటూ ఇటుగా చాంద్‌ పదేండ్ల పిల్లగాడు. షాదుల్‌ మీద గుర్రమెక్కి ఆడుకునే వాడు. అప్పుడు పెద్ద కరువు. అంత కరువులో కుటుంబాన్ని నెట్టుకొచ్చింది షాదుల్‌. దాని విన్యాసాలకు అందరూ నోరు తెరిచేవారు.

ఊర్లో తిండి దొరకదని తెలిసినంక ఇమామ్‌ షాదుల్‌తో స్కూళ్ళ మీద పడ్డాడు. పిల్లలు మెచ్చే రీతిలో వాళ్ళకు నచ్చే రీతిలో ఆడేది షాదుల్‌. పావలా ఆటానా దానం చేస్తే అందరూ పొట్ట పోసుకునే వారు.

షాదుల్‌కు చాంద్‌కు చిన్న చిన్న తగాదాలు వచ్చేవి. తనను ఎత్తేసిందని, తోసేసిందని, గిల్లిందని, గీరిందని ఎకరువు పెట్టేవాడు చాంద్‌. భార్యాభర్తలిద్దరికే చిన్న పిల్లల తగాదాల్లా అనిపించేవి. షాదుల్‌ లేక ముందు ఉపవాసంతో ఉన్న రోజులెన్నో ఉన్నాయి. షాదుల్‌ వచ్చాక ఒక్కనాడు ఉపవాసమున్నది లేదు. షాదుల్‌ను వెంటేసుకుని రెండు వాడలు తిరిగితే సరిపోయే తిండి దొరికేది. నాలుగు తాయతులు అమ్మితే సరిపోను ఖర్చుకు దొరికేవి.