సంకట్ కాల్ మే బాహర్ జానే కా మార్గ్

నేను బొంబాయిలో చదువుకునే రోజుల్లో పెళ్ళయి, హాయిగా సంసారాలు చేసుకుంటున్న ఆడకూతుళ్ళే తప్ప పెళ్ళి కుమార్తెల వయసులో ఉన్న వాళ్ళెవరూ మా కాంపస్‌లో లేక శుద్ధ ‘డ్రై’గా.. అనగా ఎడారిలా ఉన్న కారణం చేతనూ, షాపింగ్‌ నిమిత్తమూ మా టెలుగూ స్నేహితులం ముగ్గురమూ… అనగా నేనూ, మూర్తీ, రావూ వీలున్నప్పుడల్లా పవాయ్‌ అనబడే మా కాంపస్‌ నుంచి అందమైన పార్శీ అమ్మాయిలు విహరించే కొలాబా దాకా వెళ్ళి మేం కూడా విహరించే వాళ్ళం…అప్పుడప్పుడు. కేవలం సౌందర్యారాధన కోసం. ముందు ఒక అరగంట విక్రోలీ అనే స్టేషన్‌ దాకా బస్సులో వెళ్ళి, అక్కడ నుంచి ప్రయాణం అంతా స్థానిక రైల్లో ‘విక్టోరియా టెర్మినస్‌’ దాకా వెళ్ళేవాళ్ళం. దారిలో ఉన్న పదో, పదిహేనో స్టేషన్లంటిలోనూ కేవలం పది సెకన్లు మాత్రమే ఈ రైళ్ళు ఆగేవి. ఆ పది సెకన్లలోనూ దిగే వెధవ దిగడం, ఎక్కే వెధవ ఎక్కడం, అన్నీ టకటకా జరిగిపోవాలి. కిక్కిరిసిపోయి ఉన్న ఆ రైళ్ళలో పొరపాటున ఎవడైనా గుమ్మం దగ్గర బదులు వెనకాల ఎక్కడైనా ఇరుక్కుపోయాడో, చచ్చాడే. వాడు దిగ వలసిన స్టేషన్‌ వస్తోందనగానే ‘ఉతరో, ఉతరో’ అంటూ అందర్నీ వెనకాతల్నుంచీ తోసుకుంటూ నానా అవస్థా పడేవారు. మరాఠీ భాషలో ‘ఉతరో, ఉతరో’ అంటే ‘దిగు, దిగు’ అని అర్ధం.

నా జాతకం ప్రకారం నేను ఎప్పుడు లోకల్‌ రైలు ఎక్కినా, అందరూ నన్ను వెనక్కి తోసేసే వారు. పైగా, ఎవడో ప్రొఫెషనల్‌ దొంగ జేబు కత్తిరించి నా పర్సులో ఉన్న మూడు రూపాయల నలభై పైసలూ కాజేస్తాడేమూ అని ఒక చెయ్యి వెనకాల పోకెట్‌ మీద జిగురుతో అతికించినట్టుగా అతికించేసి, రెండో చెయ్యి తాలూకు మధ్య వేలు ముడిచి రాములవారి బాణంలా ముల్లుగా మార్చి, నా ముందూ, రెండు పక్కల ఉన్న మరాఠీ, గుజరాతీ వాళ్ళని అమాయకంగా నటిస్తూ, పొడిచి పారేస్తూ, కంపార్ట్‌మెంట్‌ లోపలికి దూసుకుపోయేవాడ్ని. ఈ దూకుడు కార్యక్రమం నేనే ఒరిజినల్‌గా రిసెర్చ్‌ చేసి కనిపెట్టాను కాబట్టి నాకు నోబుల్‌ ప్రయిజ్‌ ఖాయం అని అనుకున్నాను. కానీ సదరు గుజరాతీ మరియు మరాఠీ సోదరులూ, ఆఖరికి సోదరీమణులూ కూడా అదే టెక్నాలజీ వాడి నన్ను ఎక్కడో లోపలి దాకా తోసిపారేయడం అనేక సార్లు గమనించి నోబుల్‌ బహుమానం నాకు రాదని తెలుసుకున్నాను. ఒకసారి ఆ జనసందోహంలో నేను ఈ తోపుడు కార్యక్రమంలో ఒకానొక పెద్దావిడకి అనుకోకుండా నా రామబాణం,అనగా మధ్య వేలు కొంచెం ధాటీగా ఆవిడ వీపు మీద ఆనించి ముందుకు జరుగుతుండగా ఆవిడ పక్కనే ఉన్న ఆయనతో ‘ఈ వెధవ ఎవడో వేలుతో పొడుస్తున్నాడండీ’ అని శుద్ధ తెలుగులో విన్నవించుకుంది. శ్రీవారు నాకేసి ఒక చూపు చూసి తన అర్ధాంగితో ‘ఈ పొట్టి వెధవ అంతకన్నా ఏంచేస్తాడులే, కంగారు పడకు’ అని అభయం ఇచ్చారు. నేను ఆ డైలాగులు వినగానే అసంకల్పిత ప్రతీకార చర్యగా, అనగా ఆటోమేటిక్‌గా నా తెలుగు మొహం వాడిపోయి, నా మధ్యవేలు అనబడే ఆయుధాన్ని ఠపీమని వెనక్కి లాగేసుకున్నాను. వారితో, ‘ఏ వూరండీ మనది?’ అని పరిచయం చేసుకుందామా అనే ఆలోచన అరక్షణం నా మెదడులో మెదిలి, సదరు మొగుడుగారు నేను పొట్టి వాణ్ణి అని ఎలాగా గమనించారు కాబట్టి గాట్టిగా మొట్టినా మొట్టవచ్చును సుమా అని అనుమానం వేసి, ఆ పరిచయ కార్యక్రమం అర్జంటుగా వాయిదా వేసేసి, మరో మూలకి పారిపోయాను.

అదిగో ఆ మూలన, కంపార్ట్‌మెంట్‌ గోడమీద మొదటిసారిగా హిందీయో, మరాఠీయో తెలియదు కానీ ‘సంకట్‌ కాల్‌ మే బాహర్‌ జానే కా మార్గ్‌’ అని పేద్ధ అక్షరాలతో వ్రాసి ఉన్న సందేశం చదివాను. ఈ సంకట కాలం అంటే ఏమిటి, అది అక్కడ ఎందుకు రాశారూ అని కాస్త పరిశోధించగానే అక్కడే ఇంగ్లీషులో ‘ఎమర్జెన్సీ ఎక్సిట్‌’ అనికూడా కనపడింది. అప్పుడు నాకు స్పష్టంగా సంకట కాలం అంటే ఎమర్జెన్సీ అనియూ, బాహర్‌ జానే కా మార్గ్‌ అనగా కొంప ములిగే టైములో బయటికి పారిపోయే గుమ్మం అనియూ అర్ధం అయింది. నా నూతన విజ్ఞానానికి సంతోషిస్తూ ఉండగా వెనకనించి పది టిఫినూ, మరియు లంచ్‌ డబ్బాలు పట్టుకున్న వీరుడొకడు ‘ఉతరో, ఉతరో’ అంటూ నానా గొడవ చేస్తున్నాడు. నేను వాడి బారి నుండి పక్కకి తప్పుకుని చూద్దును కదా, సదరు రైలు నేను దిగవలసిన స్టేషను దాటిపోయి తరవాతి స్టేషను దగ్గర ఆగుతోంది. ‘నాయనా, నేను ఉతరవలసిన స్టేషన్‌ ఇందాకానే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇద్దరం కలిసి ఇక్కడే ఉతరి తరిద్దాం’ అని వాడి డబ్బాలతో పాటు నేనూ దిగిపోయాను. నేను దిగడం చూసి ఇందాకా నా గురించి ముచ్చటించుకున్న తెలుగు దంపతులు రైలులో ఆనందడోలాయమానసులై ఉండడం గమనించాను. రైలు కదులుతూండగా నేను ప్లాట్‌ఫార్మ్‌ మీదనుంచి వాళ్ళిద్దరికీ చెయ్యి ఊపుతూ ‘ఏమండీ, బావున్నారా, ఏ ఊరు మనది’ అని అరిచాను. ఒక అరక్షణం పాలిపోయిన వారి మొహాలు చూసి, నా మొహం విప్పారింది.

అప్పుడు చూద్దును కదా, మా సదరు రావు, మూర్తి ఎచ్చటనూ కనపడలేదు. అనగా, వాళ్ళిద్దరూ మేము అసలు దిగవలసిన స్టేషనులో దిగిపోయారనమాట. లేదా, వాళ్ళు కూడా అది మిస్సయిపోయి, నేను దిగిన స్టేషనులో కూడా దిగకుండా దూసుకుపోయారన మాట. అప్పుడు నాకు అర్ధమయింది నిజంగా సంకటకాలం అంటే ఏమిటో. నేను ఇక్కడ దిగినట్టు రావుకీ, మూర్తికీ ఎలా తెలియును? ఆ డిప్ప గాళ్ళు ఇద్దరూ ఎక్కడ దిగి చచ్చారో నాకు ఎలా తెలియును? పరిస్థితిలో నా తక్షణ కర్తవ్యం ఏమిటి? ఇవన్నీ ఆలోచించి ఈ రోజు మన జాతకం అదోలా ఉన్న కారణం చేతనే ఈ విధంగా జరిగిందనీ, పార్శీ అమ్మాయిల సౌందర్యారాధన నేను ఒక్కడినీ చేసే ధైర్యం లేకనూ, ఒక వేళ చేసినా, మా అనుంగుమిత్రులు నన్ను చావగొట్టే అవకాశం ఉందనీ గమనించి మా కాంపస్‌కి తిరిగి వెళ్ళిపోయాను. తరవాత నుంచీ ఎప్పుడు రైలు ఎక్కినా ‘ సంకట్‌ కాల్‌ మే బాహర్‌ జానే కా మార్గ్‌’ దగ్గరే నా మకాం. ఆ కారణం చేత నేను ఎప్పుడూ ఉతర వలసిన స్టేషనులోనే ఉతరడానికి రావూ, మూర్తీ నానా అవస్థా పడేవారు.

ఇదంతా నాకు ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వచ్చిందీ అంటే ఈ మధ్య మా ఊళ్ళో ఉండే చిరకాల మిత్రులు వాళ్ళింట్లో పూజకి పిలిచారు. ఆ ప్రాంతాలలోనే మొత్తం అమెరికాలోనే సుప్రసిద్ధమైన మీనాక్షీ దేవాలయం కూడా ఉంది. బహుశా అందుకే కాబోలు అక్కడి వారందరికీ దైవభక్తి మెండు. అంతే కాక ‘నువ్వు నెలకో పూజ చేస్తే మేము వారానికో వ్రతం చేస్తాం చూసుకో’ అనే టైపులో అంతా పోటీలు పడి దైవభక్తిలో తరిస్తారు. ఆ రోజు పూజలో పురోహితుడుగారు, పూజా విధానమూ, దానివలన ఫలితములూ వివరిస్తూ, ‘ఈ పూజ చేసిన వారికీ, చూసిన వారికీ, కథ విన్న వారికీ, వీడియో తీసిన వారికీ పుణ్యమే కాక, కష్టాలు వచ్చినప్పుడు సంకట కాలం నుంచి బయట పడి అవి తీరే మార్గం కనపడుతుంది’ అని వివరించారు. ఇది వినగానే నాకు ముప్ఫై సంవత్సరాల క్రితం బొంబాయిలో ఆ రోజు నాకు వచ్చిన సంకటకాలమూ, సంకట్‌ కాల్‌ మే బాహర్‌ జానే కా మార్గ్‌ అనబడే ఎమర్జెన్సీ ఎక్సిట్‌ గుర్తుకొచ్చాయి.

వెంటనే ఇన్ని పూజలు చేసి ఏ విధమైన సంకట కాలం నుంచి వీళ్ళందరూ బాహర్‌ జానేకా మార్గ్‌ వెతుక్కుంటున్నారూ అని అనుమానం వచ్చి రోజు పూజకి వచ్చిన యాబై పైగా కుటుంబాలన్నింటినీ ఓరకంటితో చూశాను. తీరా చూస్తే అందులో చాలా మంది వయస్సు అరవైకి అటూ, ఇటూను. అందరికీ ఐదారు లక్షల డాలర్ల పైగానే బాంక్‌ బేలన్స్‌లూ, పెద్ద, పెద్ద ఇళ్ళూ, బంగారం వస్తువులూ, ఖరీదైన పట్టుచీరలూ, బాగా చదువుకుని సక్సెస్‌ఫుల్‌ జీవితంలో అడుగు పెట్టిన పిల్లలూ, రేపో, మాపో పెళ్ళాడబోయే పిల్లలూ, ఇలా ఎన్ని రకాలుగా చూసినా వీళ్ళకి వచ్చిన సంకటకాలం ఏమిటో నాకు అర్ధం అవలేదు.

అప్పుడు నాకు అర్ధమయింది అమెరికాలో కొంత మంది తమ సంకట కాలం స్వయంకృతాపరాధం అని. ఉదాహరణకి, కేండిడేట్‌ నెంబర్‌ వన్‌ ఇంట్లో మొన్న పదిహేను వంకాయలు కాశాయి. కానీ ఏం పాపమో, అతని పక్కింటివాడే అయిన కేండిడేట్‌ నెంబర్‌ టూ ఇంట్లో ఇరవై వంకాయలు కాశాయి. పాపం కేండిడేట్‌ వన్‌కి ఎంత సంకటకాలం వచ్చిందో కదా! అందుకే ఆ రోజు స్పెషల్‌ పూజ చేసుకుంటున్నాడు. కేండిడేట్‌ మూడు గారికి పొరపాటున తన కొలెస్టరాల్‌ లెవెల్‌ కేండిడేట్‌ నెంబర్‌ ఫోర్‌ కంటే నాలుగు పాయింట్లు ఎక్కువ ఉందని తెలిసిపోయింది. అంతే ఆ వీకెండే స్పెషల్‌ డీలక్స్‌ సంకట్‌ కాల్‌ మే బాహర్‌ జానేకా మార్గ్‌…అనగా సత్యనారాయణ వ్రతం బాపతు.

హిందూ మతంలో ఉన్న గొప్పతనమే అది. ఎటువంటి తరహా సంకట్‌ కాలానికైనా ఏదో ఒక బాహర్‌ జానే కా మార్గ్‌…అనగా ఎమర్జెన్సీ పూజ ఉంటుంది.

అమెరికాలో ఇలాటి కష్టాలు తప్ప అసలు సిసలు సంకటకాలాలు..అనగా ఏలినాటి శని పట్టి ఇన్‌సూరెన్స్‌ రేట్లు, బంగారం ఖరీదూ పెరిగిపోవడం కొంతమందికి కష్టకాలం అయితే, ఈ సాఫ్ట్‌వేర్‌ గాళ్ళకి ఏ ప్రాజక్ట్‌ ఎప్పుడు అయిపోయి బెంచీ మీద ఎన్నాళ్ళు సెటిల్‌ అవుతారె తెలియక పోవడం మహా సంకటకాలం. తీరా అలా మరొక ప్రాజెక్ట్‌ వెతుక్కునే రోజుల్లో సదరు భర్త ఇంట్లోనే ఉండిపోతే, అంత వరకూ సోమవారం నుండీ శుక్రవారం వరకూ పై ఊళ్ళలో పని చేస్తాడు కాబట్టి హాయిగా సుఖపడుతున్న ఆడంగులకి మరీ సంకట కాలం ముంచుకొచ్చినట్టు ఉంటుంది.

ఈ అమెరికాలక్షేపంలో నేను ములిగి తేలుతుండగా, ‘ఇదిగో, రేపు పూజారి గారు పొద్దున్న ఎనిమిదింటికల్లా రడీగా ఉంటాను. రమ్మని ఫోన్‌ చేశారు. ఆట్టే వెర్రి వేషాలు వెయ్యక తొందరగా లేచి ఆయన్ని తీసుకురా’ అని వంటింట్లోంచి ఆర్డరు వేసింది మా క్వీన్‌ విక్టోరియా.

‘‘పూజారిగారా, ఎందుకూ?’’ అన్నాను విషయం అర్ధం అవక.

‘‘ఎందుకేమిటి, నీ తలకాయ. మన అమ్మాయి పెళ్ళి చెయ్యొద్దూ’’

‘‘రేపు మన అమ్మాయి పెళ్ళా, రియల్లీ’’ నా మొహంలో రంగులు మారాయి.

మా ఇంట్లో చాలా సంగతులు నేను పట్టించుకోననీ, నా ప్రపంచంలో నేను ఉంటాననీ అందరూ అనుకున్నా, కన్యాదానం చేయడానికి నాకు కనీసం 24 గంటలైనా నోటీసు ఇవ్వకపోడం ఏం బాలేదు.

ఆ మాటే పైకి అనగానే ‘‘నీ మొహం, అమ్మాయి పెళ్ళి కాదు రేపు. దానికి అమెరికాలో పెళ్ళి సంబంధాలు చూడాలంటే మనకి కష్ట కాలం వచ్చినట్టే. అందుకే ఎందుకైనా మంచిదని, నవగ్రహశాంతి, రతీమన్మధ పూజ, భేతాళ ప్రయోగం మొదలైనవన్నీ చేశాకే తెలుగు మేట్రిమనీలో రిజిస్టర్‌ చేద్దాం, అందుకూ..’’ అంది.

అవును సుమా, మన సొంత సంకటకాలం మన పెళ్ళితో మొదలై, అమెరికాలో మన పిల్లల పెళ్ళిటైముకి మహా సంకట కాలంలా రెచ్చి పోతుంది. అప్పుడర్ధమయింది మా మిత్రులందరూ అన్ని పూజలు ఎందుకు చేస్తారో. అమెరికాలో పెళ్ళీడుకొచ్చిన పిల్లలందరూ ఆడా, మగా అనే భేదం లేకుండా అందరూ బాహర్‌ జానేకా మార్గ్‌ లేని సంకటకాల కారకులే కదా. *