నిర్ణేత వ్యాఖ్య – కవితలు

ఏ కళలోనైనా తరచుగా నిర్వహించే పోటీలు కళాకారుల్లో ఆసక్తిని రేకెత్తించి ప్రోత్సాహం అందజేస్తాయి. ఆ కళా వికాసం కోసం జరిగే కృషిలో పోటీలు కూడా చేరుతాయి.

ఆటా నిర్వహించిన కవితల పోటీ కూడా సహజంగానే అట్లాంటి ఆసక్తిని కలిగించినట్లు కవుల ప్రతిస్పందన తెలియజేస్తుంది. ఆటా వారు నిర్వహించిన పోటీకి 494 కవితలు వచ్చినాయి. 227 మంది కవులు పాల్గొన్నారు. 182 మంది పురుషులు 45 మంది స్త్రీలు. వారిలో ప్రవాసాంధ్రులు 7గురు. 6గురు ఇతరరాష్ట్రాలవారు కాగా ఒక్కరు విదేశీయురాలు. అందునా కువైట్‌ నుండి పాల్గొనటం విశేషం.

పోటీలో పాల్గొన్న కవులందరిలోనూ సమానంగా వ్యక్తమయిన ఉత్సాహాన్ని తప్పకుండా అభినందించాలి. నిజంగా పోటీపడి కవితలు రాసి పంపించారు. ఔత్సాహికులతో పాటు లబ్ధ ప్రతిష్ఠులయిన ప్రముఖులు కూడా పాల్గొనటం ఈ పోటీల ప్రత్యేకత. కొత్త వస్తువుల్ని స్వీకరించటంలోనూ కొత్తగా రచించటంలోనూ చాలా మంది పోటీ పడ్డారు.

ప్రపంచీకరణ, ధ్వంసమైపోతున్న పల్లెలు, వలసజీవితాలు, ఆధునిక పరిజ్ఞానాలు, మారిన, మారుతున్న అనుభవాలు, నలుగుతున్న మనిషి, ప్రాంతీయ వైరుధ్యాలు, ఫాక్షనిజం, సునామీ, ఆడశిశువుల అమ్మకం నుంచి తమిళనాడు పాఠశాల అగ్ని ప్రమాదం దాకా ఇటీవల అందరిలో ఆసక్తిని రేకెత్తించిన అమ్మభాష అభిమానంతో సహా కవులు స్వీకరించిన వస్తువులు వైవిధ్యాన్ని, వెతుకులాటను సూచిస్తున్నాయి. రచనాశైలి పరంగా ఒక ఎదుగుదల చాలామందిలో కనిపిస్తున్నది. ఎవరికి వారు ప్రత్యేకతకోసం తపన పడ్డట్టు బోధపడుతున్నది. 4 దశాబ్దాల క్రితం సజీవదహనం చేయబడ్డ కంచికచర్ల కోటేశు మోనోలాగ్‌, అక్రమ ఆస్తులు సంపాదించిన తండ్రితో కొడుకు భాషణ విశేషంగా కనిపిస్తాయి. 33 కవితలు పంపిన రికార్డు ఒకరిదయితే 14 పేజీల దీర్ఘకవిత పంపిన రికార్డు మరొకరిది.

మొదటి వడపోతలో 104 కవితలు అర్హత పొందినాయి. రెండో వడపోత తర్వాత 40, మూడో వడపోత తర్వాత 14 కవితలు ఉత్తమంగా ఎంపికయినాయి. అవన్నీ బహుమతికి అర్హమైనవే అయినప్పటికీ ప్రకటించిన బహుమతుల మేరకు తుది ఎంపిక చేయటం జరిగింది.

‘చీలిన మనిషి’ ప్రపంచీకరణలో జాడకోల్పోతున్న మనిషి సంఘర్షణను ఆవిష్కరించింది. కొత్త సాంకేతిక జ్ఞానాన్ని గుప్పిస్తున్న ప్రపంచం ముందు మనిషినుండి ఆత్మ విడిపోతున్న స్థితిని కవినేర్పుగా ఆక్షరీకరించాడు.

‘పిచ్చినాన్న’ సాధారణ అనుభవాన్ని అసాధారణ శైలిలో వ్యక్తీకరించింది. ఇవాళటి సగటు తండ్రికి తమ సంతానమే సర్వస్వం. అమ్మాయి నాన్న కన్నప్రేమ ఎంత గాఢంగా ఉంటుందో కొత్తగా చిత్రీకరించింది. సరళశిల్పం, కొత్తవ్యక్తీకరణ కవి నైపుణ్యానికి నిదర్శనంగా ఉన్నాయి.

‘ఆకాశంలో ఎడారి’. మేఘాలనీడ సోకని రాయలసీమ దీనావస్థను ఆవిష్కరించింది. ప్రాంత(పు) వెనుకబాటు తనాన్ని కవితాత్మకంగా వర్ణించిన కవిత.

‘గోసిగుడ్డ’. తెలంగాణ రైతు జీవితాన్ని జీవభాషలో ఆవిష్కరించినది.

–నందిని సిధారెడ్డి