పద్మశ్రీ ఎస్. వి. రామారావు కవితలు

పిలుస్తున్నది పిట్ట నా పేరు

పదే పదేగా
పిలుస్తోంది పిట్ట నా పేరు
తన భాషలో.
కుటుంబీకులతో
కిచకిచలాడుకుంటూ
పిల్లలు, మేనళ్ళుళ్ళు,మనుమరాళ్ళతో
ఇంటికి వచ్చిన బంధువుల కందరికి
నన్ను చూపించాలని
వెంట వేసుక వచ్చింది.
వేసవి రోజున ఉదయాన
నా పెరడులో గచ్చు చప్టాపైన
కూర్చొని
ఎదురు చూస్తున్నారందరూ!
ఈ పిట్ట
రోజూ
వచ్చినప్పు డల్లా
నే విసిరేది
గుప్పెడు గింజలు
పోసేది మూకుడులో
గ్లాసుడు నీళ్ళు
అదేగా నే చేసే
ఉపకారం.
ఏమి చెప్పిందో
బంధువులందరికి
నన్ను చూడగానే
అందరూ
చిన్నా పెద్దా
ఏక కంఠంతో
పేరుతో పిలుస్తున్నారు
సంతోషంగా ఈలలు
వేస్తున్నారుప్రేమగా దీవిస్తున్నారేమో
నా కుటుంబం చల్లగా ఉండాలని
పిల్లలతో పెద్దలతో
కళ కళ లాడుతూ
గల గల నవ్వులతో
జీవితాన్ని ఆనందంగా
తమలా
గడపమని
అందరికి కృతజ్ఞతతో
ఉండమని
చెపుతున్నాయోమో
నాతో!!
ఈ వేళ
విసరాలి గింజలు
ఎక్కువగానే
దోసిళ్ళతో.
అందరి కడుపులు
నిండేంతగా

సూర్యుణ్ణి మింగిన గ్రహణం

పెద్ద పెద్ద చదువులతో
తెచ్చుకున్న సంపాదనతో
తరలి వచ్చిన విదేశాలలో
నాజూకు బట్టలు వేసికొని
విందులతో, వినోదాలతో
స్నేహితుల గుంపులతో
గడిపిన రోజులు `
నెమరు వేసుకోవలసిన రోజులు.
సాధించిన విజయాలకు
జల్సాగా సాగిన జీవితానికి
చిహ్నంగా
మెఱుస్తున్న బట్టతల
వణికే చేతులు
నిమురుతున్నాయి తలను.
కండ్ల చుట్టూ ఉన్న గీతలు
వయసు మళ్ళిన పలకపై
ఏవేవో గజిబిజిగా
పిల్లవాడు
గీసిన గీతల్లా
ఉన్నాయి.
అప్పటి దాకా
దేదీప్యమానంగా
మెరుస్తున్న సూర్యుణ్ణి
గ్రహణం
పట్టుకొని
తటాలున
మ్రింగివేసింది.

అమెరికాను చూస్తున్నాం మా పద్మలో

చదువులు పూర్తి చేసిన తర్వాత
ఇళ్ళకు తిరిగి వెళ్ళాలని
అనుకున్న వాళ్ళమే
నాలాంటి వారందరం
ఈ దేశంలోనే ` అమెరికాలో
దీర్ఘకాల నివాసమని
కలలోగూడ అనుకోని వాళ్ళం.
సంవత్సరాలు, దశాబ్దాలు
గడిచిపోతున్నాయి `
పోయాయి,
ఇంకా ఇక్కడే ఉన్నాం ` అందరం.
ఒక్కడిగా వచ్చిన వాళ్ళం
మళ్ళీ వెళ్ళి ఇండియాకు
ఇద్దరుగా వచ్చాం.
మా తల్లి దండ్రులు ఇండియాలో మేము ఇక్కడ
ఈ రెండు దేశాల్లో ఉన్నది
ఒక కుటుంబమే.
భరతనాట్యం చేస్తున్న అమ్మాయి
భగవద్గీతను పాడుతున్నది.
పెరుగు అన్నంలో
దొండకాయ వేపుడు
కలుపుతున్నది.
అమెరికాలో పుట్టిన అమ్మాయి
తడుముకుంటున్న తెలుగులో
ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే
ఇంగ్లీషులో పాడుతున్నట్టున్నది.
అమెరికన్‌, ఇండియన్‌ జండాలను
టేబుల్‌పై పెట్టుకున్నది తానే..
మాలో నుండి అమెరికా పుట్టింది
అమెరికా పరాయి దేశం కాదు
మరో దేశమే ఇండియాలా
అని చూపింది, చెప్తున్నది
మా ముద్దులకూతురు పద్మావతి
రెండు దేశాలకు తానే వారధి
అన్ని నదుల్లో నీరు ఒకటే
ఎక్కడైనా మంచు తెల్లనే
అమెరికాలోని పేలోస్‌ హిల్స్‌ కొలను నీళ్ళకు
ఇండియాలోని గుడివాడ పంట కాలువ నీటికి
భేదమేముంది
పేరులో తప్ప?
మేమెక్కడ నుండి వచ్చామో
చూపిస్తుంది అద్దం
ఎక్కడకు వెళుతున్నామో
చూపిస్తుంది మా పద్మ.

పద్మశ్రీ బిరుదు

వస్తే బిరుదులు
అన్ని
కట్ట కట్టుకు వస్తాయి
ఒక దాని తర్వాత మరొకటి
వరుసగా, అందంగా అనుభవించేందుకు
అంతగా
అవకాశం లేకుండగ.
అప్పటి వరకు
వేసవి మేఘాల్లో ఎక్కడ
దాక్కున్నదో జడివాన
జల్లున కురియడం
ప్రారంభించింది
ఎప్పుడు ఎఱుగమే
వర్షాలు కురియడం
ఈ సీజన్‌లో.
అమెరికన్‌ ఆకాశం నుండి
మంచుకొండలు విరిగి పడే
చికాగో నగరంలో
తెలుగు నాట పుట్టిన
సంపంగి చెట్టు
బ్రతకడమే ఆశ్చర్యం`
ఈ చెట్టే విరియబూయడం
ఎంతమందికి
ఆనందం కలుగ చేసిందని
అమెరికాలో!
సంతోషం పట్టలేని
తెలుగు హృదయాలు
నన్నో పూలరంగణ్ణి చేసాయి
నే పెరిగిన ఆంధ్రావనిలో
పుట్టిన గుడివాడలో
ఎన్ని ఉన్ని శాలువాలు కప్పారని ప్రేమతో
నా వయసుకు చలెక్కువని తెలుసేమో!!
రిటైర్‌ అయ్యేముందు
జనరల్‌గార్కి ఎన్నో మెడల్స్‌ `
నాకున్నూ ఎన్నో బిరుదులు.
జన్మనిచ్చిన పుణ్యభూమికి ` భారతావనికి
‘పద్మశ్రీ’ ఇచ్చిన ప్రభుత్వానికి
ప్రెసిడెంట్‌ గారికి
కృతజ్ఞాతాభివందనలు.
(2007 జనవరిలో ప్రచురింపబడే కవి, కవితా సంపుటి నుండి)