అమెరికాలో సురక్షిత జీవనం కోసం మార్గదర్శక సూత్రాలు

పై చదువులకి, ఉద్యోగాలకి, విహారయాత్రలకి… ఇలా ఎన్నో రకాలుగా అమెరికా వెళ్ళడం అంటే తెలుగువారికి ప్రీతి. అమెరికా సురక్షితమైన దేశమే. కానీ గత కొద్ది సంవత్సరాలుగా మన తెలుగువారు ఎదుర్కొన్న విపత్తులు, ఘోర ప్రమాద సంఘటనల గురించి మనందరం వింటూనే ఉన్నాం. సంఖ్యాపరంగా చూస్తే, అమెరికాలో ఉన్న తెలుగువారి సంఖ్యతో పోలిస్తే ఇలా జరిగిన సంఘటనలు తక్కువే. కానీ వీటి బారినపడినవారు, వేల మైళ్ళ దూరంలో తెలుగుదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు అనుభవించిన ఆవేదన చాలా ఎక్కువ. అటువంటి సంఘటనలలో ఎన్నోసార్లు మన తెలుగువారిని ఆదుకొని, సహాయపడి వారికి, వారి కుటుంబసభ్యులకి ఓదార్పు నిచ్చింది, ప్రముఖ అమెరికా తెలుగు సంస్థ తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం).

ఈమధ్య సంభవించిన కొన్ని సంఘటనలని జాగ్రత్తగా పరిశీలిస్తే, దేనికి అదే ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఘటనగా కనిపించినా, అన్నింటా కనిపించిన మౌలిక లక్షణాలు కొన్ని వున్నాయి. రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడటం, మరణించటం, హింసాత్మక సంఘటనలు (ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్న విద్యార్థులపై దాడులు), అనారోగ్యం, ఆత్మహత్యలు లాంటివి మనవాళ్ళు ఎదుర్కొంటున్న విపత్తులలో కొన్ని. చట్ట నిర్వాహణా సంస్థలు, ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌తో ఇబ్బందులు, తగినంత ఇన్సూరెన్స్‌ (బీమా) చేయించుకోకపోవటం ఈ సమస్యల్ని మరింత జటిలం చేస్తున్నాయి.

మనందరికీ, అంటే పర్యాటకులకైనా, విద్యార్థులకైనా, అమెరికాలో నివాసం కోసం వచ్చేవారికైనా, భద్రతాపరంగా ఉపయోగపడే కొన్ని ముఖ్యసూచనల్ని అందిస్తున్నాము.

స్థూలంగా చెప్పాలంటే మనందరం

* ప్రమాదకర స్థలాలకి, పరిస్థితులకి దూరంగా ఉండాలి.

* చట్టబద్ధులై వ్యవహరించాలి.

* తగినంతగా వాహన, ఆరోగ్య, జీవిత బీమాలు తప్పని సరిగా చేయించుకోవాలి.

విద్యార్థులు – విశ్వవిద్యాలయాలు

పై చదువుల కోసం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలోనే తెలుగు ప్రాంతానికి చెందిన విద్యార్థులు అమెరికా వస్తుంటారు. వీరిలో చాలామందికి తగినంత ఆర్థిక సదుపాయం ఉండదు. కాంపస్‌ ఉద్యోగాలు లభించటం కష్టం. ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఇటువంటి విద్యార్థులు తప్పనిసరై కొన్ని సాహసాలకి పాల్పడ తారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి ఇది ప్రధాన కారణం.

  1. విశ్వవిద్యాలయ ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. గత రెండేళ్ళలో మూడు సంఘటనలు జరిగాయి. సరైన విధానాలు అమలు జరగని కారణంగా అమెరికా ప్రభు త్వం కొన్ని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్ని మూసివేసింది. వీటిలో చదువుకొంటున్న తెలుగు విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారి పరిస్థితి దయనీయంగా, ఇబ్బందిగా మారింది. ఆన్‌లైన్‌ క్లాసులు, పనిచేసుకునే వెసులుబాటు విషయాలలో ప్రముఖ విశ్వవిద్యా లయాల కన్నా భిన్నంగా మరింతగా సడలింపులతో ప్రవర్తించే యూనివర్సిటీలను అనుమానించి, జాగ్రత్తగా విచారించాలి. స్టూడెంట్‌ వీసా మీద ఉన్నప్పుడు క్లాసులకి వెళ్ళి చదువుకోవటం, కేంపస్‌ దరిదాపుల్లోనే ఉంటూ చదువుకి సంబంధించిన ఉద్యోగాలు చెయ్యటం సాధారణం. ఈ అంశాలని అతిక్రమిస్తే వీసా నిబంధన లని వ్యతిరేకించినట్టే. అటువంటి విద్యార్థులని, తప్పుడు వ్యవహారాలకి పాల్పడినవారిగా సందేహించి జైల్లో పెట్టడమో, వెనక్కి పంపివేయడమో జరుగుతుంది.
  2. పై చదువుల కోసం అమెరికా వచ్చే విద్యార్థులు, మొత్తం విద్యాకాలం అంతటికీ చదువు మరియు వసతికి సరిపోయేంత ఆర్థిక వనరుతోనే రావాలి. ఒకటి లేదా రెండు సెమిస్టర్లకి సరిపోయేంత డబ్బు తెచ్చుకుంటే చాలదు.
  3. యూనివర్సిటీ కాంపస్‌ బయట పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకోవటం ఆకర్షణీయంగానే తోచినా, వాటిలో చాలా ఉద్యోగాలు ప్రమాదకరమైనవి. దుండగుల క్రౌర్యం ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువ. కన్వీనియన్స్‌ స్టోర్స్‌, గ్యాస్‌ స్టేషన్స్‌, డెలివరీ ఉద్యోగాలలో నగదు, డబ్బు తాలూకు బాధ్యతే కాక, అర్ధరాత్రుళ్ళు పనిచేసే అవసరం కూడా ఉంటుంది. తీవ్ర నేర ప్రాంతాలలో తిరగటం వల్ల ప్రమాదాలతో చెలగాటం ఆడాల్సి వస్తుంది. అందుకని ఇలాంటి ఉద్యోగాలకు దూరంగా ఉండాలి.
  4. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. బీమా చేయించుకోవటానికి కొంత ఖర్చు అవుతుందన్నది వాస్తవం. కానీ ఆరోగ్యబీమా చాలాచాలా అవసరం. బీమా చేయించుకోకపోతే మరింత ఖర్చుకి దారితీసే అవకాశాలు ఎక్కువే. ఇన్సూరెన్స్‌ ప్రీమియంకి అయ్యే ఖర్చుకి ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు అనారోగ్యం కోసం చేయాల్సిన ప్రమాదం ఉంది. తక్కువ ప్రీమియంతో వచ్చే గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకాల కోసం మీ విశ్వవిద్యాలయం వారిని సంప్రదించండి.
  5. సరైన కాలపరిమితి ఉండేలా వీసా విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ‘ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ డిపార్ట్‌మెంట్‌’ వారితో ఎల్లవేళలా జవాబుదారితనంతో మెలగాలి.
  6. స్టూడెంట్‌ వీసాతో చట్టబద్ధం కాని పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చెయ్యకూడదు. వీటి వల్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాక అమెరికా నుండి పంపివేయబడటం, భవి ష్యత్తులో అమెరికాకి రానివ్వకపోవటం లాంటి శిక్షలకి కూడా దారితీయచ్చు.

ఘర్షణలని తప్పించుకోవటం

వాగ్వివాదాలు, అపార్థాలు సాధారణంగా గొడవలకి దారితీస్తాయి. ఆ గొడవలు కొద్ది క్షణాల్లోనే పెద్దవై విపరీత పరిణామాలకి దారి తీయవచ్చు. ప్రత్యర్థి దగ్గర ప్రమాదకర ఆయుధం ఉంటే మరింత విషమ పరిస్థితి ఎదురవుతుంది. అసలే అమెరికాలో తుపాకుల వాడకం మిగతా దేశాల కన్నా ఎక్కువ.

  1. అపరిచితులతో వాగ్వివాదాలు వద్దు. చాలారకాల అభి ప్రాయభేదాలు వాగ్వివాదాలుగా మారి ఒకరి నొకరు కొట్టుకునే స్థాయికి చేరతాయి. వాటివల్ల ఉత్తరోత్తరా ప్రత్యర్థి కన్నా మీకే ఎక్కువ నష్టం అన్న విషయం మరిచి పోకండి.
  2. అభ్యంతరకరమైన సంజ్ఞలు చెయ్యకండి (మధ్యవేలు, చూపుడువేలు చూపించటం లాంటివి). తిట్లు, బూతు మాటలు వాడకండి. పొరపాటు అవతలివారిదే అయినా, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. రెండు క్షణాలు నిగ్రహం పాటించగలిగితే పరిస్థితి దానంతటదే చక్కబడు తుంది. గొడవలు పడకుండా పరిష్కరించుకునే భద్రమైన పద్ధతులు చాలా ఉంటాయి.
  3. మొరటుగా బెదిరిస్తూ డబ్బు, విలువైన వస్తువులు ఇమ్మనే దొంగలుగానీ, దుండగులుగానీ ఎదురుపడితే, ఎంతమాత్రం ప్రతిఘటించకుండా ఉన్నవి ఇచ్చెయ్యటం మంచిది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. విలువైన ప్రాణం పోతే తిరిగి రాదు.
  4. తోటి భారతీయులు తారసపడితే, కొంతమంది ఇంగ్లీషులో కాక, భారతీయ భాషల్లోనే మాట్లాడతారు. వీరి భాష పక్కనున్న ఇతరులకు అర్థంకాక అపార్థం చేసుకొని గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల బయట ప్రదేశాలలో ఇంగ్లీషులో మాట్లాడితేనే మంచిది.
  5. ఎదుటివారిని, ముఖ్యంగా అపరిచితులని పరిశీలిస్తున్నట్టు కళ్ళప్పగించటం, తేరిపార చూడటం మంచిది కాదు. వారు నొచ్చుకునే అవకాశం ఉంది.
  6. లోకల్‌ విద్యార్థులతోను, ప్రాంతీయులందరితోను కలిసిమెలిసి గడిపే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు వాళ్ళకి మీరు పరాయివారన్న భావన తగ్గుతుంది. మీకు కూడా స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. భారతీయులతో మాత్రమే గడుపుతూంటే స్థానికులకి మీరు పరాయివారన్న అభిప్రాయం అలాగే ఉండిపోతుంది.