పై చదువులకి, ఉద్యోగాలకి, విహారయాత్రలకి… ఇలా ఎన్నో రకాలుగా అమెరికా వెళ్ళడం అంటే తెలుగువారికి ప్రీతి. అమెరికా సురక్షితమైన దేశమే. కానీ గత కొద్ది సంవత్సరాలుగా మన తెలుగువారు ఎదుర్కొన్న విపత్తులు, ఘోర ప్రమాద సంఘటనల గురించి మనందరం వింటూనే ఉన్నాం. సంఖ్యాపరంగా చూస్తే, అమెరికాలో ఉన్న తెలుగువారి సంఖ్యతో పోలిస్తే ఇలా జరిగిన సంఘటనలు తక్కువే. కానీ వీటి బారినపడినవారు, వేల మైళ్ళ దూరంలో తెలుగుదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు అనుభవించిన ఆవేదన చాలా ఎక్కువ. అటువంటి సంఘటనలలో ఎన్నోసార్లు మన తెలుగువారిని ఆదుకొని, సహాయపడి వారికి, వారి కుటుంబసభ్యులకి ఓదార్పు నిచ్చింది, ప్రముఖ అమెరికా తెలుగు సంస్థ తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం).
ఈమధ్య సంభవించిన కొన్ని సంఘటనలని జాగ్రత్తగా పరిశీలిస్తే, దేనికి అదే ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఘటనగా కనిపించినా, అన్నింటా కనిపించిన మౌలిక లక్షణాలు కొన్ని వున్నాయి. రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడటం, మరణించటం, హింసాత్మక సంఘటనలు (ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్న విద్యార్థులపై దాడులు), అనారోగ్యం, ఆత్మహత్యలు లాంటివి మనవాళ్ళు ఎదుర్కొంటున్న విపత్తులలో కొన్ని. చట్ట నిర్వాహణా సంస్థలు, ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో ఇబ్బందులు, తగినంత ఇన్సూరెన్స్ (బీమా) చేయించుకోకపోవటం ఈ సమస్యల్ని మరింత జటిలం చేస్తున్నాయి.
మనందరికీ, అంటే పర్యాటకులకైనా, విద్యార్థులకైనా, అమెరికాలో నివాసం కోసం వచ్చేవారికైనా, భద్రతాపరంగా ఉపయోగపడే కొన్ని ముఖ్యసూచనల్ని అందిస్తున్నాము.
స్థూలంగా చెప్పాలంటే మనందరం
* ప్రమాదకర స్థలాలకి, పరిస్థితులకి దూరంగా ఉండాలి.
* చట్టబద్ధులై వ్యవహరించాలి.
* తగినంతగా వాహన, ఆరోగ్య, జీవిత బీమాలు తప్పని సరిగా చేయించుకోవాలి.
విద్యార్థులు – విశ్వవిద్యాలయాలు
పై చదువుల కోసం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలోనే తెలుగు ప్రాంతానికి చెందిన విద్యార్థులు అమెరికా వస్తుంటారు. వీరిలో చాలామందికి తగినంత ఆర్థిక సదుపాయం ఉండదు. కాంపస్ ఉద్యోగాలు లభించటం కష్టం. ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఇటువంటి విద్యార్థులు తప్పనిసరై కొన్ని సాహసాలకి పాల్పడ తారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి ఇది ప్రధాన కారణం.
- విశ్వవిద్యాలయ ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. గత రెండేళ్ళలో మూడు సంఘటనలు జరిగాయి. సరైన విధానాలు అమలు జరగని కారణంగా అమెరికా ప్రభు త్వం కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్ని మూసివేసింది. వీటిలో చదువుకొంటున్న తెలుగు విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారి పరిస్థితి దయనీయంగా, ఇబ్బందిగా మారింది. ఆన్‌లైన్ క్లాసులు, పనిచేసుకునే వెసులుబాటు విషయాలలో ప్రముఖ విశ్వవిద్యా లయాల కన్నా భిన్నంగా మరింతగా సడలింపులతో ప్రవర్తించే యూనివర్సిటీలను అనుమానించి, జాగ్రత్తగా విచారించాలి. స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు క్లాసులకి వెళ్ళి చదువుకోవటం, కేంపస్ దరిదాపుల్లోనే ఉంటూ చదువుకి సంబంధించిన ఉద్యోగాలు చెయ్యటం సాధారణం. ఈ అంశాలని అతిక్రమిస్తే వీసా నిబంధన లని వ్యతిరేకించినట్టే. అటువంటి విద్యార్థులని, తప్పుడు వ్యవహారాలకి పాల్పడినవారిగా సందేహించి జైల్లో పెట్టడమో, వెనక్కి పంపివేయడమో జరుగుతుంది.
- పై చదువుల కోసం అమెరికా వచ్చే విద్యార్థులు, మొత్తం విద్యాకాలం అంతటికీ చదువు మరియు వసతికి సరిపోయేంత ఆర్థిక వనరుతోనే రావాలి. ఒకటి లేదా రెండు సెమిస్టర్లకి సరిపోయేంత డబ్బు తెచ్చుకుంటే చాలదు.
- యూనివర్సిటీ కాంపస్ బయట పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకోవటం ఆకర్షణీయంగానే తోచినా, వాటిలో చాలా ఉద్యోగాలు ప్రమాదకరమైనవి. దుండగుల క్రౌర్యం ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువ. కన్వీనియన్స్ స్టోర్స్, గ్యాస్ స్టేషన్స్, డెలివరీ ఉద్యోగాలలో నగదు, డబ్బు తాలూకు బాధ్యతే కాక, అర్ధరాత్రుళ్ళు పనిచేసే అవసరం కూడా ఉంటుంది. తీవ్ర నేర ప్రాంతాలలో తిరగటం వల్ల ప్రమాదాలతో చెలగాటం ఆడాల్సి వస్తుంది. అందుకని ఇలాంటి ఉద్యోగాలకు దూరంగా ఉండాలి.
- హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. బీమా చేయించుకోవటానికి కొంత ఖర్చు అవుతుందన్నది వాస్తవం. కానీ ఆరోగ్యబీమా చాలాచాలా అవసరం. బీమా చేయించుకోకపోతే మరింత ఖర్చుకి దారితీసే అవకాశాలు ఎక్కువే. ఇన్సూరెన్స్ ప్రీమియంకి అయ్యే ఖర్చుకి ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు అనారోగ్యం కోసం చేయాల్సిన ప్రమాదం ఉంది. తక్కువ ప్రీమియంతో వచ్చే గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల కోసం మీ విశ్వవిద్యాలయం వారిని సంప్రదించండి.
- సరైన కాలపరిమితి ఉండేలా వీసా విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ‘ఇంటర్నేషనల్ స్టూడెంట్ డిపార్ట్‌మెంట్’ వారితో ఎల్లవేళలా జవాబుదారితనంతో మెలగాలి.
- స్టూడెంట్ వీసాతో చట్టబద్ధం కాని పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చెయ్యకూడదు. వీటి వల్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాక అమెరికా నుండి పంపివేయబడటం, భవి ష్యత్తులో అమెరికాకి రానివ్వకపోవటం లాంటి శిక్షలకి కూడా దారితీయచ్చు.
ఘర్షణలని తప్పించుకోవటం
వాగ్వివాదాలు, అపార్థాలు సాధారణంగా గొడవలకి దారితీస్తాయి. ఆ గొడవలు కొద్ది క్షణాల్లోనే పెద్దవై విపరీత పరిణామాలకి దారి తీయవచ్చు. ప్రత్యర్థి దగ్గర ప్రమాదకర ఆయుధం ఉంటే మరింత విషమ పరిస్థితి ఎదురవుతుంది. అసలే అమెరికాలో తుపాకుల వాడకం మిగతా దేశాల కన్నా ఎక్కువ.
- అపరిచితులతో వాగ్వివాదాలు వద్దు. చాలారకాల అభి ప్రాయభేదాలు వాగ్వివాదాలుగా మారి ఒకరి నొకరు కొట్టుకునే స్థాయికి చేరతాయి. వాటివల్ల ఉత్తరోత్తరా ప్రత్యర్థి కన్నా మీకే ఎక్కువ నష్టం అన్న విషయం మరిచి పోకండి.
- అభ్యంతరకరమైన సంజ్ఞలు చెయ్యకండి (మధ్యవేలు, చూపుడువేలు చూపించటం లాంటివి). తిట్లు, బూతు మాటలు వాడకండి. పొరపాటు అవతలివారిదే అయినా, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. రెండు క్షణాలు నిగ్రహం పాటించగలిగితే పరిస్థితి దానంతటదే చక్కబడు తుంది. గొడవలు పడకుండా పరిష్కరించుకునే భద్రమైన పద్ధతులు చాలా ఉంటాయి.
- మొరటుగా బెదిరిస్తూ డబ్బు, విలువైన వస్తువులు ఇమ్మనే దొంగలుగానీ, దుండగులుగానీ ఎదురుపడితే, ఎంతమాత్రం ప్రతిఘటించకుండా ఉన్నవి ఇచ్చెయ్యటం మంచిది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. విలువైన ప్రాణం పోతే తిరిగి రాదు.
- తోటి భారతీయులు తారసపడితే, కొంతమంది ఇంగ్లీషులో కాక, భారతీయ భాషల్లోనే మాట్లాడతారు. వీరి భాష పక్కనున్న ఇతరులకు అర్థంకాక అపార్థం చేసుకొని గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల బయట ప్రదేశాలలో ఇంగ్లీషులో మాట్లాడితేనే మంచిది.
- ఎదుటివారిని, ముఖ్యంగా అపరిచితులని పరిశీలిస్తున్నట్టు కళ్ళప్పగించటం, తేరిపార చూడటం మంచిది కాదు. వారు నొచ్చుకునే అవకాశం ఉంది.
- లోకల్ విద్యార్థులతోను, ప్రాంతీయులందరితోను కలిసిమెలిసి గడిపే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు వాళ్ళకి మీరు పరాయివారన్న భావన తగ్గుతుంది. మీకు కూడా స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. భారతీయులతో మాత్రమే గడుపుతూంటే స్థానికులకి మీరు పరాయివారన్న అభిప్రాయం అలాగే ఉండిపోతుంది.
డ్రైవింగ్
అమెరికాలో తెలుగువాళ్ళకి ఎదురవుతున్న దుర్ఘటనలలో చాలా సంఘటనలు కారు ప్రమాదాల వల్ల జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకి సంబంధించిన కారణాలన్నీ మన అదుపులో లేకపోయినా, భద్రతా సూత్రాలను పాటిస్తూ, అప్రమత్తంగా ఉంటే చాలావరకు ప్రమాదాలను, తీవ్రంగా గాయ పడటాన్ని తగ్గించవచ్చు.
- చట్టరీత్యా అనే కాకుండా, ఎప్పుడూ సీట్‌బెల్ట్ పెట్టుకో వాలి. కారులో ముందు సీట్లలోనే కాక వెనక సీట్లలో కూచున్నా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి. సీట్‌బెల్ట్ పెట్టుకోవటం వల్ల అత్యంత పెద్ద ప్రమాదాల్లో కూడా రక్షణ ఉంటుంది. అనేక ప్రమాదాల్లో సీట్ బెల్టు పెట్టుకోకపోవడం వల్ల కారు నుంచి బయటికి విసిరి వేయబడి తీవ్రంగా గాయపడిన సంఘటనలు చాలా ఉన్నాయి.
- సరైన డ్రైవింగ్ లైసెన్స్, బీమా లేకుండా అమెరికాలో కారు నడపకండి.
- భారతదేశంలో కారు నడిపే అనుభవం మీకు ఎంత ఉన్నా, అమెరికాలో కారు నడిపే ముందు, డ్రైవింగ్ పాఠాలు తప్పనిసరిగా పొందండి. ప్రాథమిక అవగాహన, నియమ నిబంధనలు, పాటించాల్సిన వేగం మొదలైన వివరాలు అర్థమవుతాయి. అలా కాని పక్షంలో కంగారు, అయోమయం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన డ్రైవింగ్ తర్ఫీదు తప్పనిసరి.
- వీలైనంత వరకూ రాత్రి ప్రయాణాలను మానెయ్యండి. మీరు పూర్తి జాగ్రత్తతో సమర్థవంతంగా కారు నడిపినా, రాత్రి వేళల్లో కారు నడిపే తాగుబోతులు, నిద్రా బాధితులు ఎందరో ఉండే అవకాశం ఉంది.
- మాదకద్రవ్యాలు, మద్యం మత్తులో ఎప్పుడూ కారు నడపకండి. తాగి మోటారు వాహనాలు నడపడం అమెరికాలో చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు. లైసెన్సు రద్దు, జైలు శిక్ష, జరిమానాలు, లాయర్ ఫీజులు లాంటి పెద్ద ఇబ్బందులతో పోలిస్తే ఆల్కహాల్ ఇచ్చే క్షణికానందం ఏమాత్రమూ సరితూగదు. నలుగురూ కలిసి ఎక్కడికైనా వెళ్ళినా, విందు వినోదాల్లో పాల్గొన్నా, భద్రంగా కారు నడపడానికి మీలో ఒక వ్యక్తిని ఎంచుకోవాలి. ఆ వ్యక్తి అన్నిరకాల మత్తుపదార్థాలకి పూర్తిగా దూరంగా ఉండాలి.
- మీ కారు ముందుకు నడపలేని స్థితిలో తప్ప బ్రేక్ డౌన్ కోసం నిర్ధారించిన స్థలాలలో కారు నిలపకండి. ఒకవేళ బ్రేక్ డౌన్ అయి అలా నిలిపితే, కారులోంచి దిగి ట్రాఫిక్‌కి దూరంగా సురక్షిత స్థలానికి చేరటం మరువకండి.
- ఎవరయినా పోలీసు అధికారి మీ కారు ఆపితే, ఆగగానే కారులోంచి దిగకండి. మీ చేతులు స్టీరింగ్ మీదే ఉంచి, ఆయన ఆదేశాల కోసం వేచి చూడండి.
- భారతదేశంలోకన్నా అమెరికాలో పాదచారులకి హక్కులు ఎక్కువ. మీ కారు వారికి తగినంత దూరంలో ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
- కారు నడిపేటప్పుడు, భద్రతకి అవరోధం కలిగించనంత దూరంలో ఆగేలా మీ డ్రైవింగ్ ఉండాలి. అది అమెరికా డ్రైవింగ్‌లో ప్రాథమిక సూత్రం. ఈ దూరం ఎంత అన్నది వాతావరణం, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
- దారిలో ఏదయినా కారు ప్రమాదం కంటబడితే, స్వయంగా వారిని రక్షించాలని అనాలోచితంగా పరుగులు తీయకండి. తగిన జాగ్రత్త, శిక్షణ లేకపోతే వారికి సహాయం కన్నా కీడు చేసినవారవుతారు.
- మీ పర్స్, ఇతర విలువైన వస్తువుల్ని ఎవరి పర్యవేక్షణ లేకుండా కారులో వదలకండి.
- నిద్ర వచ్చినా, అలసటగా అనిపించినా వెంటనే సురక్షిత స్థలంలో ఆగి తగిన విశ్రాంతి తీసుకోండి. ‘మరొక్క మైలు వెళ్ళాక చూద్దాం,’ అని పొరపాటుగానయినా ఆలోచించ కండి. డ్రైవరు ఒక్క క్షణం నిద్రతో తూలగా తీవ్రమైన యాక్సిడెంట్లయి ప్రాణాలు పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి.
- కారు నడుపుతూ టెక్ట్స్ / ఎస్.ఎం.ఎస్.లకి సెల్‌ఫోన్ వినియోగించకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ వాడకం అమెరికాలో చాలాచోట్ల నిషిద్ధం. ప్రాంతీయ చట్టాలను తెలుసుకోండి.
- అపరిచితులను, లిఫ్ట్ అడిగేవారిని మీ కారులో ఎక్కించు కోకండి.
- మీకు పరిచయం లేని వ్యక్తుల కారు ఎక్కకండి.
- నడిచేటప్పుడు పాదచారులకు నిర్ధారించిన స్థలంలోనే రోడ్డు దాటండి. ఎప్పుడూ ట్రాఫిక్ నియంత్రణ సూత్రాలను పాటించి తీరండి.
- డ్రైవింగ్‌లో ప్రమాదకర విషయాలు
ఎ) నిద్రమత్తు (నిద్రమత్తుగా అనిపించిన వెంటనే డ్రైవింగ్ ఆపేయండి. ఎంత మాత్రం రిస్క్ తీసుకో వద్దు).
బి) వేగం (వేగం ఉద్వేగంగా ఉండొచ్చు, కానీ ప్రాణాం తకం).
సి) మత్తు పదార్థాలు (ఆల్కహాల్, ఇతర మత్తుపదార్థాలు ప్రమాద కారణాలే కాక, చట్ట వ్యతిరేకం).
డి) సీట్‌బెల్ట్ (సీట్‌బెల్ట్ కట్టుకోవటం చట్టనిబంధనే కాదు, ప్రమాదరక్షణ కూడా).
వీసా నిబంధనలు
మీ వీసాకి సంబంధించిన పరిమితులు, వెసులుబాట్లు బాగా అర్థం చేసుకోండి. ఇమ్మిగ్రేషన్ చట్టాలు అతిక్రమించటం నిర్బంధానికిగానీ, డిపోర్టేషన్‌కి గానీ దారితీయవచ్చు. చాలా చోట్ల తమ వీసాపత్రాలని ఎల్లవేళలా కూడా ఉంచుకునే నిబంధనఉంది. ముఖ్యంగా అరిజోనా రాష్ట్రం లాంటి సరిహద్దు ప్రాంతాలలో వీసాపత్రాలు ఎప్పుడూ కూడానే ఉంచుకోవాలి.
అపార్ట్‌మెంట్ / ఇల్లు / డార్మ్ రూమ్
- ఎప్పుడూ మీ అపార్ట్‌మెంట్ / ఇల్లు / డార్మ్ తలుపులు (క్రిందగానీ, మొదటి అంతస్థుగానీ అయితే కిటికీ తలుపులతో సహా) భద్రంగా తాళాలు వేయండి.
- తలుపులు లోపల నుంచి మరింత దృఢంగా ఉండ టానికి ‘కిక్ ఇన్ బార్’ (అడ్డు గడియ)ని వాడండి. ఇవి అంత ఖరీదైనవి కావు. వాల్‌మార్ట్/టార్గెట్/హోమ్‌డిపో/లోవ్స్ లాంటి చాలా సూపర్ స్టోర్స్‌లో తేలిగ్గా లభించే సంరక్షణ పరికరం.
- పొగ త్రాగటానికో, పార్టీల వంటలు చెయ్యటానికో స్మోక్ డిటెక్టర్స్ కనక్షన్ తొలగించటం, బద్దలు కొట్టడం లేదా ఆపటం చెయ్యకూడదు.
- గత కొంతకాలంగా దొంగలకి భారతీయుల ఇళ్ళు ఆకర్షణీయంగా మారాయి. ఎందుకంటే మనవాళ్ళకి ఖరీదైన నగలను ఇళ్ళల్లో పెట్టుకోవటం అలవాటు. అది వాళ్ళకీ తెలుసు. పార్టీలలోను, ముఖ్య సమావేశాలలోను మన వాళ్ళ నగలు చూసి, దొంగలు వెంటాడి వచ్చిన సంఘటనలెన్నో వెలుగు చూస్తున్నాయి. మీ విలువైన నగలు, పత్రాలు, సర్టిఫికెట్లు ఇళ్ళల్లో/అపార్ట్‌మెంట్లలో ఉంచుకోవద్దు. సేఫ్ డిపాజిట్ బాక్స్ (లాకర్స్) భద్రమైనది. దానికి అయ్యే ఖర్చు తక్కువే కాక మీకు, మీ ఆస్తికి ఎంతో భద్రత.
- అత్యవసర సమయంలో వచ్చి సహాయపడటానికి వీలుగా, మీకు బాగా నమ్మకస్తుడైన వ్యక్తి దగ్గర మీ ఇంటి మారు తాళం ఉండే ఏర్పాటు చేసుకోండి.
- మీరు నివసిస్తున్న అపార్ట్‌మెంట్, ఇంటి ప్రాంతం సురక్షితమైందే అయినా, వృత్తి నైపుణ్యతతో పర్యవేక్షించే రక్షణ సదుపాయాన్ని (అలారం సిస్టం) ప్రత్యేకంగా ఏర్పరచు కోండి. ఇటువంటి రక్షణ విధానాలు సమర్థవంతంగా దొంగతనాలు, కార్బన్ మోనాక్సైడ్, లో/హై టెంపరేచర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
- చాలా అపార్ట్‌మెంట్లలో, బీమా ఏర్పాట్లు బిల్డింగ్‌కు మాత్రమే పరిమితం. కానీ ఆ బీమా నివసించే వారి వస్తువులకు వర్తించదు. అందుచేత మీ వస్తువులకు మీరే బీమా ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఈ బీమా ఏర్పాటు అంత ఖరీదైనది కాదు. మీ లీజింగ్ ఆఫీసుని సంప్రదిస్తే వివరాలు తెలుస్తాయి.
- అత్యవసర పరిస్థితిలో 9-1-1కి ఫోన్ చెయ్యండి. అగ్ని మాపక, పోలీస్, అంబులెన్స్ లాంటి అత్యవసర సేవల బృందాలు అమెరికాలోని చాలా నగరాలలో పది నిము షాల దూరంలోపే ఉంటాయి. అత్యవసర పరిస్థితులని ఎదుర్కోవటానికి, అవసరమయిన ప్రాథమిక చికిత్స అందించటానికి వారు సుశిక్షితులు. స్నేహితులకి ఫోన్ చేసి విలువైన సమయాన్ని వృధా చేయకండి.
- వంట ఇంటి పరికరాలు స్టవ్, ఓవెన్, ఇస్త్రీపెట్టె, హీటర్, ఎ.సి. లాంటివి వాడుకలో లేనప్పుడు వాటిని కట్టి వుంచటం అలవాటు చేసుకోండి. ఇంటిని వదిలి వెళ్ళే ముందు ఒకటికి రెండుసార్లు ఈ విషయాలను పర్య వేక్షించండి.
- ఇంట్లో ఎవరూ లేనప్పుడు కొవ్వొత్తులు లాంటి అన్ని దీపాలు, పూజ దగ్గర దివ్వెలు అన్నీ ఆరి ఉండేలా జాగ్రత్త వహించండి.
ఆత్మహత్య మరియు మానసిక ఇబ్బందులు, అత్యవసర పరిస్థితులు
ఉద్వేగ మనఃస్థితి, మానసిక రోగాలు, ఉద్రిక్త ప్రవర్తనల వల్ల వచ్చే అత్యవసర పరి స్థితులలో సహాయపడటానికి సామాజికపరంగా ఎన్నో సౌకర్యా లున్నాయి. సాధారణంగా కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సెంటర్ లేదా క్రైసిస్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. వారి ద్వారా ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో తగిన సహాయం లభిస్తుంది. వారి ఫోన్ నెంబర్లు ప్రాంతీయ టెలిఫోన్ డైరెక్టరీలో ఉంటాయి. అత్యవసర పరిస్థితిలో 911కి ఫోన్ చేసినా స్థానిక పోలీసులు సహాయం అందిస్తారు. ఇన్సూరెన్స్ లేకపోయినా, మానసిక ఆరోగ్య సమస్యలకు లోకల్ కమ్యూనిటీ మెంటల్ హెల్త్ ఏజెన్సీ దగ్గర నుంచి వైద్య సహాయం పొందవచ్చు.
ఆత్మహత్యా భావనతో బాధపడేవారు Toll Free Nationwide Hotline (1-800-273-Talk)ని సంప్రదిస్తే తక్షణ సహాయం లభిస్తుంది.
చట్టబద్ధ ప్రవర్తన
- చట్టప్రకారమే నడుచుకోండి. అమెరికాలో ఉన్నంత వరకూ ప్రాంతీయ చట్ట విధానాలకు కట్టుబడి ప్రవర్తించటం తప్ప మరో మార్గం లేదు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదు.
- ఒంటరిగా ఉన్న పసిపిల్లల జోలికి వెళ్ళకండి. వారు మీ పక్కింటి పిల్లలయినా సరే, ఒంటరిగా ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళటం, తాకటం చెయ్యకండి.
- పిల్లలతో ఉన్న తల్లిదండ్రులుగానీ, పెద్దవారుగానీ అనుమతిస్తేనే తప్ప పిల్లలకి తినుబండారాలు, పానీయాలు ఇవ్వకండి.
- బహిరంగ ప్రదేశాల్లో, స్విమ్మింగ్‌పూల్స్‌లో, థియేటర్లలో అపరిచితులను ముట్టుకోవటం కానీ, వారిని రాసుకుని వెళ్ళటం కానీ చేయకండి.
- గుర్తింపు పత్రాలు, మందుల చీటీలు, సర్టిఫికెట్‌ల విషయంలో తప్పుడు విధానాలకు, దొంగ సంతకాలకు పాల్పడకండి.
- విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, సామాజికంగా ప్రఖ్యాతి ఉన్న యజమానులు ధృవీకరించిన పత్రాలను తప్పుగా నకలు చెయ్యటంలాంటి చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు పూనుకోకండి. ఓ విశ్వవిద్యాలయపు ఖాళీ లెటర్ హెడ్స్, రబ్బరు స్టాంపులు, సీల్స్ వెంట ఉంచుకుని తిరుగుతున్న ఓ భారతీయ విద్యార్థిని పట్టుకుని శిక్షించి వెనక్కి పంపించటం జరిగింది.
- తగిన చట్టబద్ధమైన అనుమతి లేని ఏ ఆయుధం మీ దగ్గర ఉంచుకోకండి.
- పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించేటప్పుడు, విమాన ప్రయాణంలోను ఎంతో జాగ్రత్త గా ఉండండి. సబబు కాకపోయినా, 9/11 సంఘటన తరువాత మధ్య ఆసియా వాసులంటే ఎక్కువగా అనుమానిస్తున్నారు. పదునైన వస్తువులుగానీ, మండే ద్రావకాలుగానీ మీతో ఉండ కుండా చాలా జాగ్రత్త వహించండి.
- ఒకవేళ దారి తప్పినా, ఇతరుల ఇళ్ళ ప్రాంగణాలలోకి వెళ్ళకూడదు, వాళ్ళ తలుపులు తట్టకూడదు.
- ఇరుగు పొరుగు వారితో ఇబ్బంది కలిగేలా ప్రవర్తించ కండి. ముఖ్యంగా రాత్రివేళల్లో.
గృహహింస
ఎవర్నయినా సరే, కుటుంబ సభ్యు లనయినా సరే హింసించటం అమెరికాలో చట్ట వ్యతిరేక చర్య. ఎదుటివారి అనుమతి, ఇష్టం లేకుండా ముట్టుకోవటం కూడా నిర్బంధ హింసగా పరిగ ణిస్తారు. గృహహింసని ఇక్కడి న్యాయవ్యవస్థ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది.
- అభిప్రాయభేదం, ఘర్షణ పడటం జరిగితే క్రౌర్యానికి కానీ, మొరటుతనానికి కానీ, శారీరక హింసకి కానీ దిగ వద్దు. చిన్న తప్పిదం కూడా కెరియర్ మొత్తాన్నే కాక జీవితాన్నే నాశనం చేస్తుంది.
- మీ భార్యనిగానీ, భాగస్వామిని లేదా స్నేహితుల్ని, తదితర కుటుంబసభ్యుల్ని కోపంగా, గట్టిగా తాకవద్దు. మీ వల్ల వారికి చిన్న పాటి దెబ్బ కూడా తగలకూడదు.
- మీరు ఎటువంటి గృహహింసనయినా ఎదుర్కొంటే వెంటనే సహాయాన్ని అర్థించండి. దేశం మొత్తంగా ఎన్నో భారతీయ సంస్థలు మీకు సహాయం చెయ్యటానికి సిద్ధం గా ఉన్నాయి. గృహహింస బాధితుల్ని ఆదుకోవటానికి ప్రతిచోట ప్రాంతీయ సంస్థలు ఎన్నో ఉన్నాయి.
తల్లిదండ్రులు, బంధువులు
- పరిసరాలకి పూర్తిగా అలవాటు పడే వరకూ తల్లిదండ్రులను ఒంటరిగా వదలకండి.
- సురక్షితం కాని ప్రదేశాలలో వారిని ఒంటరిగా తిరగనివ్వకండి. మీ ఇంటి చుట్టు ప్రక్కల వారితో ప్రమాదం లేక పోయినా, ఇతర ప్రదేశాల నుంచి వచ్చే ఆగంతుకుల వల్ల ప్రమాదం ఉండవచ్చు.
- పరిసరాలలోని పిల్లలకి, పెంపుడు జంతువులకి ఆహార పదార్థాలు పెట్టటం, దగ్గరగా వెళ్ళి తాకటం అమెరికాలో చెయ్యకూడదని వారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పండి.
- వారు మీ దగ్గర అతి తక్కువ కాలం గడపడానికి వచ్చినా, వారికి ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండేలా చూడండి.
పిల్లలు
- ఇంట్లోగానీ, కారులోగానీ, కారు వెలుపలగానీ పిల్లల్ని ఒంటరిగా వదలకండి.
- పిల్లలను కారులో ఒంటరిగా వదలకూడదు. ఏ షాపు లోకో వెళ్ళినప్పుడు, కారులో ఒంటరిగా వదిలిన మీ పిల్లలు మీకు కనపడే దూరంలో ఉన్నా, వారిని అలా వదలకండి. అమెరికాలో చాలాచోట్ల చట్టరీత్యా అది నిషిద్ధం కూడా.
- మీ పిల్లలే కదా అని మొరటుగా, క్రూరంగా ప్రవర్తించటం, కొట్టటం లాంటి చర్యలకి పాల్పడకండి. పిల్లల్ని కొట్టటం, హింసించటం, ఇతర శిక్షలకు గురి చేయటం అమెరికాలో నేరం. అలాచేస్తే అమెరికా చట్టరీత్యా సమస్యల్ని ఆహ్వానించిన వారవుతారు. మీ నుంచి మీ పిల్లల్ని వేరుచేసే ప్రమాదం ఉంది.
- చిన్నపిల్లలకి అందేలా ఏ ప్రమాదకర వస్తువు వదలకండి.
- పిల్లలకి ప్రమాదకరమైన ఆల్కహాల్ లాంటివి అందు బాటులో లేకుండా జాగ్రత్త పడండి. అటువంటివాటిని తాళం వేసి భద్రపరచటం మంచిది. యుక్తవయసులోకి అడుగుపెట్టబోయే పిల్లల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త అవసరం.
- వారి తల్లిదండ్రుల అనుమతి లేనిదే పరిచయం లేని పిల్లల ఫోటోలు తియ్యకండి.
బేబీ సిట్టింగ్ / బేబీ డే కేర్
- బేబీ సిట్టింగ్ కానీ, డే కేర్ కానీ అవ సరమైతే, ఆ వృత్తిపర శిక్షణ, లైసెన్స్ కలిగిన వ్యక్తులు మరియు సంస్థల సేవలే వినియోగించండి.
- మీకు తగిన ధృవీకరణ, మీ స్థలానికి తగిన లైసెన్స్ ఉంటేనే పసిపిల్లల బేబీ సిట్టింగ్ మరియు డే కేర్ సర్వీసులకు మీరు సిద్ధపడండి. పసిపిల్లలకి ఇటువంటి సేవలు అందించినవారికి ఎదురయిన దురదృష్టకర సంఘటనలు, వారు ఎదుర్కొన్న తీవ్ర కష్టాలు చాలా వెలుగు లోకి వస్తున్నాయి. సరైన లైసెన్స్ లేని బేబీ సిట్టింగ్ చాలా చోట్ల చట్టరీత్యా నేరం.
- చట్ట వ్యతిరేకంగా, ఇమ్మిగ్రేషన్ పద్ధతులకి వ్యతిరేకంగా నివసిస్తున్నవారిని బేబీ సిట్టింగ్‌కి గానీ, మీ ఇంటిపనికి గానీ నియోగించకండి. అలా చెయ్యటం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.
పన్నులు
అమెరికా జీవితంలో పన్ను చెల్లించటం తప్పనిసరి. అందువల్ల పన్నులకి సంబంధించిన చట్టాలను, సూత్రాలను, నిబంధన లను కనీసం మీ అవసరం మేరకయినా చక్కగా అవగాహన చేసుకుని, సజావుగా టాక్స్ రిటర్న్స్ సమర్పించి, పన్ను కట్టండి.
ఆరోగ్య, జీవిత, ఆటో బీమాలు
- వీసా కాలపరిమితి ఎంత తక్కువ కాలమయినా, అమెరికాలో ఉన్నన్ని రోజులు మంచి ఆరోగ్య బీమా వుండటం ఎంతో అవసరం. అమెరికాలో వైద్యం ఎంతో ఖరీదు. ఇన్సూరెన్స్ లేకపోతే చాలామందికి భరించలే నంత ఖర్చు. సరైన ఆరోగ్యబీమా చేయించుకోని అశ్రద్ధ వల్ల హెచ్-1, ఎల్-1 తాత్కాలిక వీసాలతో అమెరికా వచ్చిన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందుల పాలయిన సందర్భాలు అసంఖ్యాకం.
- మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులయినా రేపేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గత ఆరు నెలల్లో 35 ఏళ్ళ వయసు లోపు భారతీయులు మాసివ్ హార్ట్‌ఎటాక్‌తో మరణించిన సందర్భాలు పన్నెండు పైగా ఉన్నాయి.
- టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా చాలామందికి అందు బాటులో ఉండే ప్రీమియంకి లభిస్తుంది. ముప్ఫై అయిదేళ్ళలోపు వయసు వారికి లక్ష డాలర్ల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి రెండుసార్లు రెస్టారెంట్‌లో పెట్టే ఖర్చుకి వచ్చేస్తుంది. అటువంటి బీమా సౌకర్యం, మీ దగ్గరవారిని తీవ్ర ఆర్థిక ఇబ్బంది నుంచి కాపాడుతుంది.
- మీరు ఏదయినా సంస్థకి లేదా కంపెనీకి చెందిన వారైతే, ఆ సంస్థ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్, డిసెబిలిటీ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందేమో తెలుసుకోండి. గ్రూపు పాలసీలు చౌకగా లభిస్తాయి. అయితే, మీరు ఆ సంస్థలో పని చేస్తున్నంత వరకే ఆ బీమా సౌకర్యం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి.
- మంచి ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ అత్యవసరం. ప్రాంతీయ చట్టాల ప్రకారం ఎంతోకొంత బీమా తప్పనిసరిగా ఉన్నా, మరికొంత బీమా థర్డ్ పార్టీగా లేదా అంబ్రెల్లా కవరేజ్‌గా ఉండటం మంచిది.
బేంకింగ్, ఇతర అత్యవసర వివరాలు
- బేంక్ ఖాతా తెరిచే సమయంలో (సేవింగ్స్ కానీ చెకింగ్ కానీ) ఒక నామినీ లేదా పియుడి (Payable Upon Death) పేరుగానీ ఎన్నుకోవాలి. మీరు ఎంపిక చేసుకున్న వ్యక్తి బేంక్‌లో, ఆ సమయంలో ఉండాలన్న నిబంధన లేదు. మీకు బాగా నమ్మకమైన కుటుంబ సభ్యులనుగానీ లేదా స్నేహితులనుగానీ ఎంపిక చేసు కోండి. మీకేమయినా జరిగితే, మీరు కష్టపడి సంపా దించిన సొమ్ము దుర్వినియోగం కాకుండా, మీ కుటుంబ సభ్యులకు ఏ రకమయిన చట్టపర సమస్యలు ఎదురవ్వ కుండా ఆ సొమ్ము పొందేలా పూర్తి నమ్మకమయిన వ్యక్తినే నామినీ / పిఓడిగా ఎంపిక చేసుకోండి.
- మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని, అత్యవసర పరిస్థితి లో సంప్రదించాల్సిన వివరాలను మీ సెల్‌ఫోన్‌లో, పర్స్‌లో పొందుపరచి ఉంచండి. మీ సెల్‌ఫోన్‌లో ICE (In Case of Emergency) అని ఈ సమాచారాన్ని పొందు పరచవచ్చు.
- మీ వివాహ, ఆర్థిక, వయో పరిస్థితి ఎటువంటిదయినా మీరొక వీలునామా రాసి ఉంచటం అభిలషణీయం.
క్రీడలు మరియు వినోదం
- తగినంత సామర్థ్యం, అనుభవం లేనిదే సాహస క్రీడల జోలికి వెళ్ళకండి.
- ఈత రాకపోతే, మీకు మీరుగా స్విమ్మింగ్ ఫూల్స్‌లో, పాండ్స్‌లో దిగకండి. మిమ్మల్ని భద్రంగా కాపాడే తర్ఫీదు గల వ్యక్తులు ఉన్నచోటే నీటిలో దిగండి. మీరు గజ ఈత గాళ్ళయినా మీకు తెలియని నీటిలోతులలోకి, సముద్రాలలోకి వెళ్ళకండి. పరిచయం లేని ప్రకృతి, పరిసరాలు ప్రమాదకరం కూడా అని మరువకండి.
- షూటింగ్ రేంజెస్, గన్ క్లబ్స్‌లో పాల్గొనే ముందు భద్రతాపరమైన తర్ఫీదుని తప్పనిసరిగా తీసుకోండి.
- జలసంబంధమయిన వినోదాలు, అంటే White water rafting, Fishing, Canoeing లాంటి సరదాలలో సేఫ్టీ జాకెట్స్ తప్పనిసరిగా ధరించండి.
- మీరు పాల్గొనే క్రీడలకు తగిన పరికరాలు మంచి స్థితిలో ఉన్నవి ఎంచుకోండి.
ఇంటర్నెట్
- అపరిచిత వ్యక్తులతో శృంగార సంభాషణలు ఆన్‌లైన్‌లో జరపకండి. పోలీసులు జరిపే స్టింగ్ ఆపరేషన్స్‌కు ఈమధ్యన చాలామంది దొరికిపోతున్నారు.
- వెబ్‌సైట్స్ ద్వారా బెదిరింపులకు, నీచమైన సందేశాలకు పాల్పడకండి. దానివల్ల మీకుగానీ, మరెవరికీ గానీ ఎంతమాత్రం ఉపయోగం లేదు. ఇలాంటి చర్యల వల్ల ఈమధ్య ఎందరో విద్యార్థులు ఎన్నో కష్టాల పాలయ్యారు.
- మీ కంప్యూటర్‌లను వైరస్, మాల్‌వేర్ ప్రమాదాల నుంచి జాగ్రత్తగా రక్షించుకోండి. మీ కంప్యూటర్‌ని బేంకింగ్ మరియు ఇతర ఆర్థిక లావాదేవీలకు వాడుతుంటే అప్రమత్తంగా ఉండాలి. చాలా ఇండియన్ వెబ్‌సైట్స్ వైరస్ మరియు మాల్‌వేర్ కారకాలు అవుతున్నాయి.
- మీరు పనిచేస్తున్న స్థలాలలోని మీ ఇంటర్నెట్ సౌకర్యాలను దుర్వినియోగం చెయ్యకండి. ఇంటర్నెట్ వ్యక్తిగత వినియోగం మీద చాలా సంస్థల్లో ఆంక్షలుంటాయి. ఏమాత్రం దుర్వినియోగమైనా మీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది.
మరో ముఖ్యమైన విషయం: మీ వీసా స్థితి, పరిధి, హక్కులను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అతిక్రమిస్తే జైలు, దేశ బహిష్కరణలకు దారితీసే అవకాశం ఉంది.
సరయిన అవగాహన, ప్రణాళికాబద్ధ జీవనం మిమ్మల్ని, మీ కుటుంబసభ్యుల్ని ఎన్నో రకాల విపత్తుల నుంచి కాపాడుతాయి.