అమెరికాలో డయాస్పొరా తెలుగు కథ

(ఈ వ్యాసానికి ఆధారం  2000 ఆగస్ట్‌లో, చికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో, చేసిన ప్రసంగం. దీని ముఖ్య ఉద్దేశం అమెరికా తెలుగు కథల ధోరణులను పరిశీలించటం. ప్రస్తావించిన కథల, కథకుల పేర్లు సందర్భానికి తగిన ఉదాహరణలు మాత్రమే కాని సమగ్రమైన పట్టికలు కావు).

డయాస్పొరా కథ అంటే ఏమిటి అన్నది ముందు మనం నిర్వచించుకోవాలి. ప్రస్తుత సందర్భంలో నేను వాడే నిర్వచనం “తమకు అలవాటయిన ప్రాంతాన్ని, సంస్కృతిని వదిలి దూరప్రాంతాల్లో జీవిస్తున్నప్పుడు, తమ కొత్త అనుభవాలనూ, పాత అనుభవాలనూ సమన్వయం చేస్తూ, కొత్త కళ్ళతో ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ వ్రాసే సాహిత్యం డయాస్పొరా సాహిత్యం” అనేది.  అమెరికాలో ఉన్నవారు వ్రాసిన ప్రతి తెలుగు కథా డయాస్పొరా తెలుగు కథ కాదు; కొత్త (అమెరికా) అనుభవాల ఆధారంగా విశ్లేషించి వ్రాసిన తెలుగు కథ మాత్రమే  (అమెరికన్‌) డయాస్పొరా తెలుగు కథ.

అమెరికాలో తెలుగు రచనలు, ప్రచురణావకాశాలు

అమెరికాకు తెలుగువాళ్ళు చదువుకోసమో, ఉద్యోగం కోసమో రావడం మొదలుపెట్టి చాలా దశాబ్దాలవుతున్నా, తెలుగు రచనలు ప్రచురించటం అరవయ్యో దశకంలో ప్రారంభమయినట్లుంది. అప్పట్లో తెలుగు సంఘాలు, తెలుగు పత్రికలు ఉండేవి కావు. ఇక్కడినుంచి ఏమైనా రాసినా అవి ఆంధ్రదేశంలోని పత్రికల్లోనే ప్రచురించబడేవి. అప్పట్లో వచ్చినవి ఎక్కువభాగం ప్రమదావనంలోనూ, ఇతర మహిళా శీర్షికల్లోనూ ప్రచురించబడ్డ “మా అమెరికా ప్రయాణం”, “మా అమెరికా జీవితం” లాంటి వ్యాసాలే. వాటిని మినహాయిస్తే, అరవయ్యో దశకంలో ఎక్కువ తెలుగు సాహిత్యం అమెరికానుండి వెలువడినట్లు కనుపించదు.

డబ్భయ్యో దశకం వచ్చేసరికి, తెలుగువాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరగటంతో, అమెరికాలోని పెద్ద నగరాలన్నిట్లోనూ తెలుగు సంఘాలేర్పడటం, ఆ తరువాత ఆ సంఘాలు చిన్నవో పెద్దవో లిఖిత పత్రికలను ప్రచురించటం ప్రారంభమైంది. 1972లో ప్రారంభమైన “తెలుగుభాషా పత్రిక”, ముందుగా వ్రాత పత్రికగానూ, తర్వాత అచ్చుపత్రికగానూ దాదాపు నాలుగేళ్ళపాటు నడిచింది. ఆ తరువాత కొన్నాళ్ళు “తెలుగు అమెరికా” పత్రిక వచ్చింది. ఎనభయ్యో దశకంలో దేశవ్యాప్తంగా ప్రచారం ఉన్న తెలుగు పత్రికలంటూ ఏమీ లేవనే చెప్పాలి. తొంభయ్యో దశకం ప్రారంభంలో “తానా పత్రిక” క్రమంగా ప్రచురించబడటం మొదలయింది. ఆ తరువాత “అమెరికా భారతి” దానికి తోడయ్యింది. తొంభయ్యో దశకం చివరిరోజుల్లో ఇంటర్నెట్‌ విరివిగా అందుబాటులోకి రావడంతో, ఎలెక్ట్రానిక్‌ పత్రికలు మొదలయ్యాయి. వీటిలో విశేషంగా చెప్పుకోతగ్గది, “ఈమాట” ఎలెక్ట్రానిక్‌ పత్రిక.

ఈ పత్రికలన్నిటికీ వేరుగా 1977 నుంచి జరుగుతున్న ద్వైవార్షిక తానా సమావేశాలు, 1991 నుంచి జరుగుతున్న ఆటా  సమావేశాలు, ఈమధ్యే జరుపుకుంటున్న అనేక తెలుగు సంఘాల రజతోత్సవాలు, ఇలాటి సందర్భాల్లో సావెనీర్లు ప్రచురించటం ఆనవాయితీ అయిపోయింది. ఇవన్నీ కాక వంగూరి ఫౌండేషన్‌  వారు ఏటేటా పోటీలు నిర్వహించి కథా, కవితా సంకలనాలు ప్రచురిస్తున్నారు.

ఈ పత్రికలూ, సావెనీర్లూ  వీలయినంత వరకూ అమెరికాలో ఉన్న తెలుగు రచయితల్ని ప్రోత్సహిస్తూ వచ్చాయి.  ఇంతేకాకుండా అదివరకు లాగానే ఇక్కడి రచయితల్లో చాలామంది తమ రచనలు తెలుగుదేశపు పత్రికలలో కూడా ప్రచురిస్తూ పేరు తెచ్చుకొంటున్నారు.  ఇవన్నీ కలుపుకుంటే అమెరికా ఆంధ్రులు సృష్టించిన తెలుగు సాహిత్యం రాశిపరంగా గణనీయంగానే ఉంది. ఈ సాహిత్యంలో ఎక్కువభాగం కథలు, కవితలు. మిగతావి బహు కొద్దిగా వచ్చిన నవలలూ, నాటికలూ, వ్యాసాలూను. ఇక్కడ మనం కథలు గురించి మాత్రమే మాట్లాడుకుందాం.

ముఖ్య ధోరణులు

అమెరికా తెలుగు కథల్ని ముఖ్యంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు.  అమెరికాలో ఉన్నా, ఆంధ్రప్రదేశే కథాస్థలంగానూ, అక్కడి విషయాలే కథావస్తువులుగానూ ఉండేవి మొదటి వర్గానివి; అమెరికన్‌  తెలుగువాళ్ళ విషయాలు కథావస్తువుగా ఉన్నవి రెండో వర్గానివి. మొదటి వర్గానికి చెందినవి, మంచి కథలుగా పేర్కొనతగ్గవి చాలానే ఉన్నా, ఆ కథల్ని నేను  డయాస్పొరా కథలుగా చూడలేను. వలస అనుభావాలు కానీ, ఆ అనుభవాల వల్ల దృక్పథంలో వచ్చే మార్పుల ప్రభావం కానీ ఈ కథల్లో కనపడవు. ఈ కథలు చదివి ఇవి అమెరికాలో కొంతకాలం ఉన్న రచయితలు వ్రాశారని చెప్పలేం. ఈ రచయితలు అమెరికా ఎప్పుడూ చూడకపోయినా ఈ కథలు ఇంత గొప్పగానూ వ్రాసుండే వాళ్ళేమో!

రెండో వర్గానికి చెందిన కథల్లో అనేక రకాలున్నాయి. కొన్నిటిలో కథాస్థలం మాత్రమే అమెరికా; వస్తువు, పాత్రలు, చిత్రీకరణ మొత్తం ఇండియా నుంచే. కథాస్థలాన్ని హ్యూస్టన్‌ బదులు హైదరాబాద్‌, చికాగో బదులు శ్రీకాకుళం చేసి ఈ కథల్ని పెద్ద మార్పులులేకుండా తిరగవ్రాస్తే, పాఠకులకు తేడా ఏమీ తెలీదు. వీటినీ డయాస్పొరా కథలు అనలేము.

పై రెండు రకాల్నీ పక్కకు పెట్టినా, డయాస్పొరా కథలు అని ఒప్పుకు తీరాల్సిన కథలు చాలానే ఉన్నాయి. ఈ కథల్ని కూడా ప్రచురితమైన క్రమంలో పరిశీలిస్తే, అమెరికన్‌ తెలుగు సమాజంలో వస్తున్న మార్పులు కూడా కొద్దికొద్దిగా అవగతమౌతాయి. మొదటి తరం అమెరికా తెలుగుకథల్లో ముఖ్యంగా కనిపించేవి కల్చర్‌ షాక్‌ కథలు. ఇవి చాలావరకు హాస్యరసంతో కూడిన కథలు. వేలూరి వెంకటేశ్వర రావు “మెటమార్ఫసిస్‌”, చిమట కమల “అమెరికా ఇల్లాలి కథలు”, వంగూరి చిట్టెన్‌రాజు “జులపాల కథ” ఈ కోవలో కొన్ని ప్రసిద్ధమైన కథలు. అలవాటయిన విషయాలు కొత్తగా ఉండటంతోనూ, కొత్త విషయాలు సరిగ్గా అర్థం కాకపోవడంతోనూ వచ్చే “బారిష్టర్‌ పార్వతీశం మార్కు” ఇబ్బందులు ఈ కథలన్నిటిలోనూ సామాన్యాంశం. అయితే ఈ కథల్లో హాస్యమొక్కటే కాకుండా ఇతర అంశాల్ని స్పృశించటం లేకపోలేదు. ఉదాహరణకు వేలూరి “మెటమార్ఫసిస్‌” కథ రొటీన్‌ కల్చర్‌ షాక్‌  హాస్య కథగానే సాగినా, చివరలో ముఖ్యపాత్రలో వచ్చిన పరిణామం (మెటమార్ఫసిస్‌) మనల్ని ఆలోచింపచేస్తుంది.

కల్చర్‌ షాక్‌ కథల తర్వాత నెమ్మదిగా అమెరికా తెలుగు జీవనానికి సంబంధించిన కథలు రావటం మొదలైనాయి. పిల్లల పెంపకంలో ఉండే ఇబ్బందులూ, ఇక్కడనుండి ఇండియా వెళ్ళినప్పుడు కలిగే అనుభవాలూ, అమెరికాలో అతిథులతో ఇబ్బందులూ వగైరాలు కథావస్తువులైనాయి. ఆ తరువాత పిల్లల పెళ్ళిళ్ళు ముఖ్య కథాంశమయ్యాయి. డేటింగ్‌, అరేన్జ్‌డ్‌ మేరేజెస్‌, అమెరికా పిల్లలకు ఇండియా పెళ్ళి సంబంధాలు, జాత్యంతర వివాహాలు, చర్చనీయాంశాలయ్యాయి. అయిదారేళ్ళుగా విడాకులు, వృద్ధాప్యం, రిటైర్‌మెన్ట్‌ కూడ వస్తువులుగా కథలు వస్తున్నాయి.

గత దశాబ్దంలో  అమెరికా తెలుగు సమాజంలో వచ్చిన పెను మార్పు కంప్యూటర్‌ రంగంలో అనేకమంది ఒక్కసారిగా ఆంధ్ర నుంచి రావడం, కంప్యూటర్‌ కంపెనీలు,  స్టాక్‌ మార్కెట్‌ ఉవ్వెత్తున పెరిగి దబ్బున నేలకూలటం. ఈ మార్పుల వల్ల అకస్మాత్తుగా తెలుగు సాంఘిక జీవనంలోనూ సహజంగానే చాలా మార్పులు వచ్చాయి. ఇవి కూడా వెంటనే కథలకు ఇతివృత్తాలయ్యాయి. ఆరి సీతారామయ్య వ్రాసిన “రెండు వారాల సెలవు”, కె.వి.ఎస్‌.రామారావు వరసగా వ్రాస్తున్న చాలా కథలు, చిట్టెంరాజు “చేగోడీ కంప్యూటర్‌ కంపెనీ” కథ ఈ కోవ లోవే.

అమెరికాలో కొంత కాలం ఉన్నాక, ఆ కళ్ళతో ఇండియాను చూస్తే వచ్చే రివర్స్‌ కల్చర్‌ షాక్‌ ఆధారంగా కూడా చాలా కథలు వస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా మందపాటి సత్యం వ్రాసిన “గవర్నమెంటాలిటీ కథ”ల్ని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడి తెలుగు సంఘాల్లో కనిపించే అవాంఛనీయ ధోరణులను వెక్కిరిస్తూ వ్రాసిన కథలు కూడా చాలానే ఉన్నాయి.

కల్చర్‌ షాక్‌ కథల్ని తీసేస్తే, అమెరికన్‌ తెలుగు కథలు చాలా వరకు తెలుగు పాత్రలకూ, తెలుగు కుటుంబాలకే పరిమితం. అమెరికన్‌ పాత్రలూ, అమెరికన్‌ ప్రపంచమూ ఈ కథల్లో అరుదుగా కనిపిస్తాయి (నాసీ వ్రాసిన తుపాకీ లాంటి కొద్ది కథల్లో  తప్పితే). కొద్దో గొప్పో కనిపించే అమెరికన్‌ పాత్రలు సాధారణంగా స్టీరియోటైపులు మాత్రమే. మనం అమెరికన్‌ జన జీవన స్రవంతిలో ఇంకా పూర్తిగా కలవలేదనీ, మన బ్రతుకులు మనం విడిగానే బ్రతుకుతున్నామనీ అనటానికి ఇది ఒక ఉదాహరణ కాబోలు.

రాశి వాసి

అమెరికా తెలుగు కథల రాశి ఎక్కువగానే ఉన్నా, వాసి సంతృప్తికరంగా లేదనే చెప్పాలి. కథాశిల్పం తెలిసి, ముఖ్యమైన విషయాలపై మంచి కథలు వ్రాసిన, వ్రాయగల రచయితలు ఉన్నా, వారి సంఖ్య నిజానికి తక్కువే. చాలామంది రచయితలు కథ ఎత్తుగడ, ముగింపు, భాష, శైలి వంటి విషయాల పట్ల ఇంకొంత శ్రద్ధ చూపడం అవసరం. కథల్లో ఉపన్యాసాలు, సుదీర్ఘ సంభాషణలు పరిపాటి.  చాలా కథలు కాలక్షేపానికి బాగానే ఉన్నా, ఆలోచింపచేసేవి కొన్నే.

గమనించ వలసిన ఇంకో విషయమేమిటంటే కథా రచయితలు చాలామందే ఉన్నా, ఎక్కువ కథలు వ్రాసిన వారు తక్కువే. ఒకటో  రెండో కథలు వ్రాసి చాలా కాలంగా వ్రాయని రచయితలే ఎక్కువ. ఇది కూడా కథాశిల్పంలో పరిణతి కనిపించకపోవటానికి ఒక కారణం కావచ్చు. స్థానిక సంపాదకులు కూడా కథల ఎన్నిక విషయంలోనూ, రచనలో లోట్లను సవరించడంలోనూ అవసరమైన శ్రద్ధ, శ్రమ చూపుతున్నట్లు కన్పించదు. బాగా వ్రాసేవాళ్ళు తక్కువ, ప్రచురణావకాశాలు ఎక్కువ అవడంతో రచయితలకు సరయిన ఫీడ్‌బాక్‌ అందక, అర్హతకి మించిన ఆత్మవిశ్వాసం సహజంగానే పెరుగుతూంది. మంచి రచయితలుగా ఎదిగే అవకాశం ఉన్న రచయితలు కూడా తాము ఏది వ్రాసినా చెల్లిపోవడంతో హడావుడిగా వ్రాయడం, ఇంతకు ముందు వాడుకున్న వస్తువునే మరో రూపంలో తిరగవ్రాయడం, చేస్తున్నారు. సమీక్షలూ, విమర్శలూ ఏ మాత్రం లేకపోవడం ఈ పరిస్థితిని మరింత విషమంగా చేస్తున్నది.

ఈ మధ్య వస్తున్న కొన్ని కథల్లో, ముఖ్యంగా కొత్తగా వ్రాస్తున్న కథకులు కొంతమందిలో, వస్తువులోనూ, శిల్పంలోనూ వైవిధ్యం చూపాలన్న తపన స్పష్టంగా కనిపిస్తుంది. వీరు తమ కథలపై చర్చలనూ, విమర్శలనూ ఆహ్వానించడం, కథలు పలుసార్లు తిరగవ్రాయడం గమనించవచ్చు. ఇది శుభ పరిణామమే.

అమెరికా తెలుగు కథ ఇంకా బాల్యావస్థలోనే ఉంది. వస్తుపరంగానూ, శిల్పపరంగానూ ఇంకా చాలా ఎదగవలసి ఉంది. ముఖ్యంగా రెండు సంస్కృతుల, జీవనక్రమాల సమాగమాల్ని విశ్లేషించి సమన్వయించే అవకాశం చాలా ఉంది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోగల రచయితలు ఇక్కడ ఉన్నారనీ, వారినుంచి మనం గొప్ప కథలు చదువుతామనీ, ఈ అమెరికన్‌ డయాస్పొరా తెలుగు కథలు పరిణతినీ, ప్రఖ్యాతినీ పొందుతాయనీ నా ఆశ, నమ్మకం.


జంపాల చౌదరి

రచయిత జంపాల చౌదరి గురించి: తెలుగునాడి పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన వారు వారు. ముఖ్యంగా తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు, చాలా కాలం తానా పత్రికకు సంపాదకత్వం వహించారు. ...