కవితలు

ఈ చెట్టు నన్ను వెక్కిరిస్తుంది

ఈ చెట్టు నన్ను వెక్కిరిస్తుంది
కువకువలాడుతూ
నవవసంతాన్ని
వంపేది నాగుండెల్లో
ప్రతీ ఉదయం
నా చేత్తో పట్టి లాగితే
అచ్చెరువుగా తనపైకి
లాక్కునేది
ప్రేమతో
గలగల కధలెన్నో
నులకమంచం మీదున్న నాపై
చిలకరించేది
ఆ చెట్టిప్పుడు లేదు
ఈ చెట్టు నన్ను వెక్కిరిస్తుంది

జ్ఞాపకాలు

జ్ఞాపకాలంటే ప్రియం నాకు
సాయంకాలం సాగరపు అలల్లా
నా చిన్నతనాన్ని
గుండెకు చుట్టుకునే
గుండు మల్లెచెట్టు సౌరభాన్ని
గుర్తు చేసుకోవడమన్నా
ఆ క్షణం నిర్దాక్షిణ్యంగా
నా కళ్ళల్లో చీకటిని కుక్కేసి
కుట్టేసేవరకూ
జ్ఞాపకాలంటే నాకు ప్రియం


గరికపాటి పవన్‌ కుమార్

రచయిత గరికపాటి పవన్‌ కుమార్ గురించి:

గరికపాటి పవన్ కుమార్ భారతీయ విజ్ఞాన వ్యవస్థలు (IKS), వేద శాస్త్రాలు, ఖగోళ శాస్త్రం, ఆధ్యాత్మిక తత్వశాస్త్రంపై లోతైన పరిశోధనలు చేస్తున్న స్వతంత్ర పరిశోధకుడు. వేదాలు, వేదాంగాలు, న్యాయదర్శనంవంటి అంశాలలో నిపుణులు. Indica Today, ఇతర వేదికలలో ఆయన వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

 ...