ఎందుకో
తెల్లవారు ఝాము వచ్చి నాతో అన్నది
బద్దకం వదిలి లేవరా అని !
ఎప్పుడూ కళకళ లాడుతూ
కల్మషం లేని దానికేం తెలుసు !?
రాత్రితో నేను గడిపిన రహస్య జీవితం
ప్రతి రోజూ ఇదే గొడవ
భరించలేక
నా గదికి పరదాలు వేశాను
నా గుండెకు గుండీలు పెట్టేశాను
పగలుతో నాకేం పని ?
రాత్రే నాకు అన్నీ ఇస్తుంది
అందుకే ,
నా కళ్ళకు కృత్రిమ కంతలు అమరాయి
నా నరాల్లో ప్రతీ క్షణం జివ్వుమనే నాదం
ఇప్పుడు నాకు పక్షుల
కిలకిలలు వినిపించవు,
సీసాల
గలగలలు తప్ప
అరుణారుణ
సూర్యకాంతి కనిపించదు,
జిల్లుమనే
సోడియం లాంపులు తప్ప
కానీ ,అప్పుడప్పుడూ ,
మనసులో ,ఏమూలో
కనిపించని భయం
ఏదో చిన్నబాధ !
ఇదంతా…
అమ్మకు తెలిస్తే !!