ఐదు కవితలు: మట్టి వాసన


నేలంతా చిన్న చిన్న దేశాల్లా విడిపోతుంది; ఒక్కడికి కూడా ఇరుకయ్యే దేశాలు! విసురుతున్న పలుగులకు ఒక్కో మట్టి గడ్డా విరిగిపడుతుంది తలకిందులవుతూ- పైన ఎండ, ఒకటే దాహం! వొళ్ళంతా నోళ్ళే! నోళ్ళంతా ఆవిరైన నాలుకలే! చిటికెడు తడి చల్లగా తగలదు పిడికెడు ప్రాణం పచ్చగా కళ్ళబడదు- మిగిలింది వూడ్చుకుపోయిన గింజల జాడలూ, పెకిలించుకుపోయిన మొక్కల వేళ్ళ గుర్తులూ! ఓ మబ్బూ, ఓ మెరుపూ, ఓ వురుమూ- ఎండకి కాగిన మట్టి తొలకరి వానలో తడుస్తున్నప్పుడు విడుస్తున్న వాసన గుండెల్ని నులివెచ్చగా నింపేస్తూ! ప్రాణాలు లేచి వస్తాయి మెత్తబడ్డ నల్ల మట్టి లోనుంచి పచ్చగా! అన్ని దిక్కుల్లో ఒకే రంగు జెండాలు ఆకుపచ్చ సామ్రాజ్యంలో! కనపడని మట్టి ఎంత కడుక్కున్నా, వొదుల్చుకోవాలనుకున్నా వదలని మట్టి అడుగుల్ని మెత్తగా హత్తుకుంటూనే వుంటుంది పాదాల్ని గట్టిగా పట్టుకునే, వొంటిని ఎప్పుడూ చుట్టుకునే!

(30/01/1997)


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...