యెప్పటికీ తెలవారని రాత్రి చివరి అంచు మీద నిలబడి గుర్తు తెలియని ముఖాల కోసం వెదుక్కుంటున్నాం. దట్టమైన చీకటి సన్నటి దుప్పట్లో మూతబడని కన్రెప్పల మీద రక్కుతున్న చల్లని పెదవుల ఆనవాళ్ళు తడుముకుంటున్నాం. సైగలూ మాటలూ సంభాషణలూ దేహచాలనాలూ జ్ఞాపకాలై రేవులో గడ్డకట్టుకుపోతున్నాయి. యెవరూ గడపకి అవతల నిలబడి పిలవరూ గదిలోకి రారూ అంతా వర్చువల్ వూహాజనితం. చుట్టూ వేలాదిమంది మనుషులు మాటల్లేని మాట్లాడని చూపుల్లేని చూపులు కలవని వూపిరి మరిచిన మనుషులు వొంటరివాళ్ళం ఇంతమంది మధ్య తాకని పలకరింపులు వినబడని సంభాషణలు వొక అచంచల నిశ్శబ్దం మాట చనిపోయింది ధ్వని చనిపోయింది యెవరూ పలకరు ఎవరూ కదలరు అంతా నీలితెరలే అన్నీ పొగ పరదాలే యెవరూ లేరు చేయి కలపడానికి చాచినా అందుకోలేము పక్కనే వున్న యెవరినీ చెవిలో వూపిరి తాకుతున్నా కౌగలించుకోలేం నోరెత్తలేం పెగిలినా మనకే వినబడని శబ్దాల హోరు అంతుచిక్కని భాషల సాలెగూళ్ళు మనకే తగలని మన శ్వాస మనకే అందని మన చలనం మనమేనా మనమేనా కదుల్తోంది అంతా కనబడే మసక తెరల మధ్య మనమేనా మనమేనా మాట్లాడుతుంది యెవరికీ వినబడకుండా ఆకు రాలినా వినబడే నిరంతర శీతాకాల కీకారణ్య జనావాసాల్లో నేనేనా నువ్వేనా పోల్చుకోగలమా నా ముందు నువ్వేనా నీ ముందు నేనేనా మనమసలు యెక్కడైనా ఉన్నామా వొకరికొకరం యెప్పుడైనా ఒకే కాలంలో ఉన్నామా వొకే వర్తమానాన్ని అనుభవించామా యెన్నడైనా బలంగా మూసుకున్న రాత్రి తలుపుసందుల మధ్య సన్నని వెల్తురవగలమా వెల్తురుని పోల్చుకోగలమా అన్నీ వున్న అశాశ్వతత్వం ఘనీభవించిన క్షణికమే శాశ్వతమా యెవరూ యెవరూ యెవరి గాయాలూ యెవరి నొప్పీ యెవరూ లుంగలు చుట్టుకోవడం యెవరూ సుదీర్ఘలిప్తపాటు దుఃఖించడం కన్నీళ్ళ చుట్టూ బూజు మాటల్లేని మౌనమా మౌనమైన సంభాషణలా అంతా ఆన్‌లైన్ పద్మవ్యూహాల్లో చిక్కుకుపోయామా బయటపడగలమా లేక బయటే వున్నామా యెవరైనా యెవరైనా ఇంత మట్టివాసన చూపిస్తారా నారు పోస్తారా ఒక మొక్క నాటుతారా ఒక్క కలని వినగలరా కలల కువకువల్ని వినిపిస్తారా పలికిస్తారా వేకువనీ వేకువరాగాల్నీ ఎగిరిపోయిన మబ్బు ఊపిరిని అందుకోగలమా చేయిచాచి తాకగలమా గడ్డిపువ్వుకి జన్మనిచ్చిన క్షణాన్ని మరో మనిషి మనసారా చిర్నవ్విన తరుణాన్ని!