భూషణీయం

ఈ కవితా సంకలనంలోని “పదార్థం” అనే కవిత నన్ను ఆకర్షించింది.పదానికి నిజమైన అర్థం పదార్థమే.అనగా స్వతస్సిద్ధమైన వస్తువు(thing-in-itself).పదానికి మనమిచ్చే అర్థాలు వదిలిపోతాయి,చచ్చిపోతాయి.అందుకని,పదాన్ని పాతి పెట్టమంటున్నాడు కవి.

చచ్చిన పదాన్ని
పదిమందీ తిరగని చోట
పదిలంగా పాతిపెట్టు..
పచ్చగడ్డి మొలుచుకు వచ్చి
మరో కొత్త అర్థం చెప్పి
ఊగిపోతుంది.

ఎందుకంటే,కవిత్వం పదాల అర్థాన్ని అన్వేషించదు.అది అన్వేషించేది పదార్థాల, అంటే,ప్రాపంచిక వస్తువుల అర్థాన్ని. భూషణ్‌కవిత్వ వ్యాపారమంతా ప్రాపంచిక వస్తువులతో సంబంధం పెట్టుకోవడమూ, తద్వ్దారా లభించిన అనుభవాన్ని ఆశ్చర్య చకిత నేత్రాలతో లకించడమూనూ.

కనిపించకుండా పోయిన “పాటగానికి

చిరునవ్వు చారల చొక్కాని
తిరగేసి తొడుక్కుని
రోజూ అందరూ తిరిగే
రోడ్డును దాటుకు వెళిపోయావు.
గిరికీల నీ పాట ఎరలేని గాలంలా
వేలాడుతుంది.

శబ్దం ఆగినప్పుడే ఆలోచన మొదలౌతుంది

ఇసుకను
మోసుకపోయే నది
ఎండిపోయింది
బండరాళ్ళు
బయటపడ్డాయి.
శబ్దం
ఆగిపోతుంది
ఆలోచనకు
మొదలు అక్కడే.

మధ్యాహ్న హాస” మని మరొక అనుభవం

వర్షం వచ్చి
నిలువునా నన్ను తడిపి
వెలిసిపోయింది.
తెప్పరిల్లిన ఆకాశం కింద
నీ నవ్వులు కాగితప్పడవలై
తేలిపోసాగినయ్‌

బ్రిటిష్‌చిత్రకారుడు టర్నర్‌చిత్రించిన ఝంఝా కల్లోలిత సాగర తరంగాల భయంకర సౌందర్యాన్ని ప్రతిఫలించే చిత్రమైన కవిత “విచిత్రాశ్వికుడు

రంగుల కళ్ళెం గుప్పెట్లో
భయానక సౌంద
ర్యా న్నారాధించే టర్నర్‌
సముద్ర హృద
యా న్నెరిగిన విచిత్రాశ్వికుడు!

వృక్షమానవం ” అనే కవిత ఇంత అనుభవ సంపదతోనూ జీవితం నశ్వరమనే దిగులును వ్యక్తీకరిస్తోందిఐతే, మానవ ఊహ, అనగా సృజన, నిలబడ వచ్చుననే ఆశ చివర్ని మిణుకుమంటోంది.

ఎగురుతున్న పక్షితో,ఎకాఎకీ
చిగురుతో ,ముఖాముఖీ
మాట్లాడుతాను.
మరణం నా చిరునామా!
బ్రతుకు చిన్న కామా,
మర్రి వృక్షంలా నా ఊహ
వెర్రిగా నిలబడుతుంది!

కొళాయి మీద పద్యం!అదృష్టవంతులకు కుళాయిలు కూడా విధేయంగా ఉంటాయి.

మీ కొళాయి..గరగర కసరదు
మొహం చిట్లించుకోదు
ధ్యానముద్రలో..ఒకేధార!

భూమ్యాకర్షణ శక్తి లాంటిది స్త్రీ ఆకర్షణ.దాన్నించీ ఎవరూ తప్పించుకోలేరంటున్నాడు, ‘మార్పు లేదు‘ అన్న కవితలో.

చీకటిలో ఆడదాని కన్ను
పారదర్శకంగా
ఆరక మండుతోంది
ఏపాటి వెలుతురున్నా
ఈపురుగులు ఎగిరివచ్చి
దీపాన్ని డీ కొడతాయి.
కాపాడ ఎవరితరము?

పూరకం” అనే కవితలో “నీలో నీవు నర్తించకు” అంటాడు కాని,కవిత్వమంటే తనలో తను నర్తించడమే!

ఆధునిక కవిత్వానికి వచన కవిత్వ మనే దౌర్భాగ్యపు పేరు ఎవరు పెట్టారో కాని,నిజమే ననుకొని శుష్క వచనం రాసేస్తున్నారు చాలామంది.వచనంలాగే కవిత్వానికి ఒక క్రమం, నడకా,నిర్మాణం అవసరం లేదని వీళ్ళ అభిప్రాయం.ఆ మాట కొస్తే,వచనానికి కూడా క్రమం, నిర్మాణం కావాలి కదా!మనం మాట్లాడే భాషే మన అనుభవాన్ని,ఆలోచనల్నీ క్రమబద్ధం చేసే ఉపకరణం.కవిత్వం జీవితానుభవాన్ని క్రమబద్ధం చెయ్యటమే కాదు, వాటి చాటునున్న అర్థవత్వ్తాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.

భూషణ్‌పద్యాలు బక్కగా,బలంగా ఉంటాయి.ఎక్కడా పిసరంత కొవ్వు కనిపించదు. తెలుగు కవిత్వానికి లయ హృదయస్పందన వంటిదనీ,అక్షరమైత్రి ఊపిరి వంటిదనీ ఇతనికి తెలుసు.ఇతని పద్యాలు కొన్ని సీతాకోక చిలకల్లా అన్ని వేపులకీ ఒకేమారు ఎగరాలనే ప్రయత్నంలో గాలిలో రెక్కలల్లార్చుతున్నట్టు కనిపించినా,భూషణ్‌ సామాన్యుడు కాడు. కవిత్వ హృదయాన్ని గ్రహించినవాడు.ముందు ముందు ఇంకా మంచికవిత్వం రాయగల ప్రతిభ ఇతనికుంది.ఇతని పురోగమనాన్ని ఆసక్తితో గమనించదలచుకొన్నాను.

కాకినాడ,
ఇస్మాయిల్‌