తెలుగువాడిగా పుట్టనుగాక పుట్టను!

వచ్చే జన్మలో మళ్ళీ తెలుగువాడిగా పుట్టాలని మీకు ఉందా? అని నేను మిమ్మల్ని అడుగుతాను! ఉంది… ఉంది… ఉంది… అని మీరు బల్లగుద్ది మరీ చెబుతారు. ముక్కు గుద్ది మరీ చెబుతారు. కంప్యూటర్‌ కూడా ‘నొక్కి’ వక్కాణిస్తారు. అక్కడే మీకూ నాకూ పేచీ. మీరు ‘తప్పులో కాలేశారు. మళ్ళీ తెలుగు వాడిగా పుట్టాలన్న కోరిక నాకు ఏ కోశానా లేదుగాక లేదు. దేవుడి కైనా ఎదురు తిరుగుతాను. తుళు మాతృభాషగా ఉండేట్టు పుట్టాలని కోరుకుంటాను. పుట్టి శ్రీకృష్ణదేవరాయలుగా తెలుగు సేవ చేయాలని నా ఉద్దేశం. అప్పుడు ‘తెలుగు వల్లభుండ, తెలుగొకండ,’ అన్న తరహాలో ఇంకో పద్యం రాసి వినిపిస్తాను. దీనికి దేవుడొప్పుకోకపోతే ఇంగ్లీషువాడిగా పుడతాను. పుట్టి సీపీ బ్రౌన్‌ లాగా కడపలోనో రాజమండ్రిలోనో ఉండి తెలుగును ఉద్ధరిస్తాను. అంతేగానీ మళ్ళీ తెలుగువాడిగా పుట్టాలని నేను ససేమిరా కోరుకోను. మళ్ళీ మళ్ళీ తెలుగువాడిగా పుట్టి మళ్ళీ మళ్ళీ తెలుగుకు అన్యాయం ఎందుకు చేయాలి? తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి ‘సుందర తెలుంగిళ కోటి సైతు’ అని తెలుగును కొనియాడారు. అంతటితో ఊరుకోలేదు. ఆయన ‘చంద్రికైయిన్‌ కవితై’ అనే పేరుతో ఓ తమిళ నవల రాశారు. ఇందులో వీరేశ లింగం పాత్ర ఉంది. వీరేశలింగం అంటే సుబ్రహ్మణ్యభారతికి వల్లమాలిన అభిమానం. (ఈ నవలను చంద్రిక పేరుతో బంగోరె, గోపాలకృష్ణ, వి.ఎస్‌. రాఘవన్‌లు తెలుగులోకి అనువదించారు.) మనం తెలుగువాళ్ళం. వీరేశలింగాన్ని ఇంతగా గౌరవించామా? ఒక్కసారి ఆలోచించుకుంటే గుండె దిగజారుతుంది? గౌరవించకపోతే మానె ఎంత అవమానించాం! 1898లో రాజమండ్రిలో ‘వీరేశలింగం గ్రంథాలయం’ అని గ్రంథాలయం ప్రారంభమయింది. కొన్నాళ్ళకు ఆ గ్రంథాలయం పేరులో వీరేశలింగం కనపడదు. అది సర్వజన గ్రంథాలయం అయింది. అప్పట్లో వసుదాయ గ్రంథాలయం, సర్వజన గ్రంథాలయం కలిసి, ఇప్పటి గౌతమి గ్రంథాలయం అయ్యాయి. అది వేరే సంగతి! కనీసం కందుకూరివారి సమాధికి కూడా రక్షణ కరువయింది. అపచారం జరిగింది. సమాధి మీద కొందరు పేకాట ఆడేవాళ్ళు. ఆ దృశ్యాలు ‘చేచే’ పత్రికలో ప్రచురితమయ్యాయి. సంపాదకుడు పడాల రామారావు కొంతకాలానికి పరిస్థితిని చక్కదిద్దారు.

పూర్వకాలం రాజమండ్రి టౌన్‌హాల్‌లో కందుకూరి వీరేశలింగం చిత్రపటం ఉండేది? అది కొన్నాళ్ళకు మాయ మయింది. కందుకూరి వారి అసంఖ్యాక అభిమానుల ఆందోళన కారణంగా ఆ చిత్రపటం తిరిగి టౌన్‌హాల్‌లోకి వచ్చింది. అడుసు తొక్కనేల! కాలు కడుగనేల! తెలుగువాడిగా పుట్టడం, తెలుగు మాట్లాడటం తపోఫలానికి తక్కువేం కాదని అప్పయ్య దీక్షితులు అన్నారు. ఆయన తెలుగువాడయితే ఇలా అనేవారా? తెలుగువాడికి పొరుగింటి పుల్లకూర రుచి! (పొరుగింటి పిల్లకూర రుచి! అని నేనూ ఓ సందర్భంలో పళ్ళికిలించాను.)

తెలుగువాణ్ణి అర్థం చేసుకోవాల్సిన పాయింటు ఉంది. అందులో కృతజ్ఞతావిశేషం ఉంది. తెలుగువాడు ఇంగ్లీషు పిచ్చిలో పడుతున్నాడన్నది ఒకటే ఫిర్యాదు. ఇంగ్లీషు మాతృభాష అయిన బ్రౌన్‌ తెలుగుసేవ చేసినప్పుడు అందుకు కృతజ్ఞతగా తెలుగు వాళ్ళమయి ఉండి బ్రౌన్‌ మాతృభాష ఇంగ్లీషుకు సేవ చేస్తున్నాం. అంతే! అందుకే ఇంగ్లీషు అంటే మనకు పంచ ప్రాణాలు. ఒకప్పుడు జాతీయభాషల్లో తెలుగుభాష రెండో స్థానంలో ఉందని చెప్పేవాళ్ళు. అది మూడోస్థానంలోకి వచ్చిందని ఈమధ్య అంటు న్నారు. అయినా ఎందుకు ఇంత భావదారిద్య్రం! అహంభావ దారిద్య్రం! తెలుగు నిస్సందేహంగా అంతర్జాతీయ భాష. మన భాష జాతీయభాషల స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. అన్ని భాషల పదాల్ని ‘జాతీయం’ చేసుకొని తెలుగు అంతర్జాతీయ భాష అయిపోయింది. ఇంగ్లీషుకు జేజెమ్మలా అయింది. ఏమాట ఏ భాషదో ఎంతోమంది తెలుగువాళ్ళకి తెలీదు. అవన్నీ తెలుగు మాటలు అనుకుంటే అదో ‘తుత్తి!’ ఇంగ్లీష్‌ వాడిది రవి అస్త మించని సామ్రాజ్యం. తెలుగు వాడిది కవి అస్తమించని సామ్రాజ్యం.

కొన్నేళ్ళ కిందట ఓ హాస్యావధానం జరిగింది. అందులో కె.ఎల్‌. కామేశ్వరరావు అనే ఓ ప్రచ్ఛకుడు నాకో ప్రశ్న సంధిం చాడు. తెలుగుభాష అభివృద్ధి కోసం తెలుగుతల్లి విగ్రహం పెట్టు కున్నాం కదా! మరి ఆ విగ్రహం కింద తెలుగుతల్లి అనే మాటలు ఇంగ్లీషులో ఉన్నాయేమిటండీ! అని సన్నాయి నొక్కులు నొక్కాడు. ‘‘ఆ విగ్రహాన్ని వరల్డ్‌ బ్యాంకు లోనుతో కట్టారేమో! అందుకే తెలుగుతల్లి అక్షరాలు ఇంగ్లీషులో కనిపిస్తున్నాయేమో! ఆ అక్షరాలు మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు. ప్రపంచ బ్యాంకు అధికారులకు అర్థం కావాలి కదా! లేకపోతే లోన్‌ ఆగి పోయి మనం లోన్లీ అయ్యేవాళ్ళం,’ అన్నాను. ఈ వార్త మర్నాడు హిందూ పత్రికలో కూడా వచ్చింది. ‘నదుల అనుసంధాన పథకం’ గురించి దివంగత కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి కె.ఎల్‌. రావు ఎప్పుడూ కలవరించేవారు. ఆ కల ఇప్పటికీ వరించలేదు. అయితే నేం ఎవరూ కోరకుండానే తెలుగువాడు భాషల అను సంధాన పథకం సాధించగలిగాడు. ఒక తమిళుడు తమిళంలో మాట్లాడు తుంటే తమిళులకు తప్ప ఇతరులకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. మలయాళీలు మలయాళంలో మాట్లాడుతుంటే ఇతరు లకు అంతుబట్టదు. మరి తెలుగువాడు తెలుగులో (తెలుగు అనుకొని) మాట్లాడుతుంటే అన్ని భాషలవాళ్ళకు ఎంతో కొంత అర్థమవుతుంది. అయినా మనకో ఔదార్యం ఉంది. సంస్కారం ఉంది. ఆస్కార్‌ ఇవ్వాల్సినంత గొప్పదది! పదివేల మంది తెలుగువాళ్ళు సభలో ఉండి ఒక్క అతిథి ఇతర భాషీయుడు వున్నా మనం అతణ్ణి సంతృప్తిపరచడానికి ఆంగ్లంలో మాట్లాడతాం! పోనీ ఆ అతిథి దేవుడి మాతృభాష ఆంగ్లమా అంటే అదీ కాదు!

మన భాషను ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అని ఇంగ్లీషు వాడే అన్నాడు. తెలుగులో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అజంత భాష అంటాం. మనం అలా ఉండనిచ్చామా? ఉండ నిస్తే మనం తెలుగువాళ్ళమెలా అవుతాం? మన పేర్లన్నీ చకచకా హలంతాలుగా మార్చేస్తున్నాం. ఉదా: సురేష్‌, రమేష్‌, (ష్‌… అలా అనకూడదు. అది వేరే సంగతి) ప్రదీప్‌. తెలుగు అంటే తమాషా కాదు. 56 అక్షరాలు. ఇంగ్లీషు అక్షరాలకు రెట్టింపు! మన అక్షరాల్ని మనమే తీసేసుకున్నా మిగిలినవి కూడా ఇంగ్లీషు కన్నా ఎక్కువే! తెలుగువాడికి ఇతరులెవరూ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఆ మాత్రం శక్తి లేకనా? మనం అక్షరాలకు తల కట్టులు పెట్టుకున్నాం కదా! తలకట్టు అంటే రైటు. మనమే రాస్తాం… మనమే రైటు అనుకుంటాం. ఇంకేం కావాలి? ఇంకెవరు పొగడాలి?

తెలుగువాడు ‘పంచె’బాణుడు! పంచె కట్టుటలో ప్రపం చాన మొనగాడు! అని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి వర్ణించాడు. చిత్రంగా కొన్ని దశాబ్దాల నుంచి తెలుగువాడి పంచె జారిపోతోంది. ఇంగ్లీషు ప్యాంటు ఎగబాకు తోంది! పంచె కట్టడం అంత తేలిక కాదు! ఎరగనోణ్ణి పంచె కట్టుకో మంటే చాలు ఎలక్ట్రిక్‌ స్తంభం ఎక్కినంత పనవుతుంది. అయిదు నిమిషాల్లో పరారయిపోతాడు.

ఎవరినో అనడమెందుకు? నన్ను అడిగినప్పుడూ ఇబ్బంది పడ్డాను. చిత్రమేమిటంటే పంచె కట్టుకోకుండా తెలుగునాడులో తెలుగు పెద్దలకు నడుస్తుందిగానీ అమెరికాలో తెలుగు పెద్దలకు కుదరదు. వాళ్ళు పండుగలకు పబ్బాలకు పంచెలు కడతారు. ఇదే నాకు నచ్చదు. నాకు పంచె కట్టుకోవడం చేతకాకనే ఈ సమస్య. అమెరికాలోని ఓ సంస్థ వాళ్ళు నన్ను అమెరికాకు ఆహ్వా నించారు. ఎగిరి గంతులు వేయకపోయినా ఒప్పుకున్నాను. వీసా వచ్చింది. వెళ్ళే ముందు ఆ సంస్థ నిర్వాహకులు ఫోన్‌ చేసి, ‘వేదిక మీద మేమందరం పంచెలు కట్టుకుని కూర్చుంటాం. మీరూ అలాగే కూర్చోవాలి,’ అన్నారు. నా గుండెల్లో ‘పంచె’బడిరది. పంచ్‌ పడిరది! అమెరికా ప్రయాణం మానుకోవడం అంత సులభమా? ఏం చేయాలా అని ఆలోచించాను. హైదరాబాద్‌లో కోఠీ ప్రాంతం లో వస్త్ర షాపుల్లో సర్వే చేశాను. ఖాదీబండార్‌లో ప్యాంటులాగా కనిపించే పంచె దొరికింది. ఆ పంచె, దానికో లాల్చీ కలిపి కొన్నాను. వేసేవాడికి ప్యాంటులాగా, చూసేవాడికి పంచెలాగా కనిపిస్తుంది. పంచె ‘భవిష్యత్తు’ గురించి ఆలోచన వచ్చింది. ఆ సభలో నేను నాకేమీ కాదుకానీ నా పంచెకు ఏమన్నా అవుతుం దన్నదే నా భయం. నేను అసలే వామనుణ్ణి. పంచెకు ఏమయినా అయి వేమనుణ్ణి అయితే మీరే ఆదుకోవాలి,’ అన్నాను. సభలో ‘ముక్కోటి దేవతలు’ ఒక్కటైన పనిమీద ఉండటం వల్ల నాకు గండం తప్పింది. ‘పంచె’తంత్రం ఫలించింది. నా మానాన నేను అమెరికా నుంచి తిరిగొచ్చాను. అన్నట్టు ఒక హాస్యావధానంలో, ‘మిమ్మల్ని తానావారు పిలిస్తే అమెరికా వెళతారా?’ అని ప్రముఖ సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు వంశీ రామరాజు అడిగారు. ‘పిలిచేది తానా? వెళ్ళేది… నేనా?’ అన్నాను. సర్వము ‘తానా’ అయినా వాడెవ్వడు నన్ను ఎందుకు పిలుస్తాడు అనుకున్నాను. తీరా ‘కలయో, వంశీ మాయయో’ అన్నట్టు 2001లో తానా నుంచి నాకు పిలుపు వచ్చింది! అయితే అమెరికా తెలుగువాళ్ళ అదృష్ట వశాత్తు నాకు వీసా రాలేదు. అప్పుడు వెళ్ళలేదు. గ్రహాలు ఎప్పుడూ ఒకేరకంగా ఉండవు కదా! అవి వక్రించి నాకు వీసా వచ్చింది. ఇప్పటికి మూడుసార్లు అమెరికా వెళ్ళి వచ్చాను. మా కుటుంబం లో మా ఇద్దరు అమ్మాయిలు, అల్లుళ్ళు అక్కడే ఉన్నారు. నా మనవరాళ్ళు నలుగురూ అమెరికాలో పుట్టారు. ‘మన పిల్లలు అమెరికా సైన్యం,’ అన్నాన్నేను ఒక కవితలో! చిత్రమేమిటంటే, అమెరికా వాళ్ళకున్న గ్లామర్‌ యావత్‌ భూ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు!

తెలుగును ఎలా బతికించాలా అని అమెరికా తెలుగు వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. బాగా బతకడానికి ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఎంతోమంది అమెరికాకు వెళుతుంటే, తెలుగును బాగా బతికించడానికి అమెరికా తెలుగువాళ్ళు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. కొన్నేళ్ళ కిందట ‘అమెరికా వెళదామా! తెలుగు నేర్చు కుందామా!’ అని ఒక కవిత రాశాను. మా పెద్దమ్మాయి లక్ష్మీ సంధ్యకు అమెరికాలో ఎం.ఎస్‌. సీటు వచ్చినప్పుడు, ‘నీకు తెలుగుభాష బాగా వస్తుందని, మన సంస్కృతి నేర్చుకుంటావని అమెరికా పంపిస్తున్నాను,’ అని అన్నాను. మా అమ్మాయికి చెడ్డ కోపం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఒకసారి, ‘బుధవారం అంటే వెన్స్‌డేనా డాడీ,’ అని అడిగింది. అమెరికాకు వెళ్ళిన కొద్ది రోజుల్లోనే అట్లతద్ది గురించి మాట్లాడిరది. అడిగిన వాళ్ళందరికీ అమెరికా వీసాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది మిగులుతా రన్నది లెక్కల్లో ఫెయిలయినవాళ్ళు కూడా తేలిగ్గా లెక్కపెట్టవచ్చు!

తెనుగు అంటే దక్షిణదేశ భాష. తెన్‌ అంటే దక్షిణం. (టెంకాయ, తెన్‌కాయ) తెలుగు దారీతెన్నూ చూసుకోవాలి. తెలుగు అంటే తేల్‌ నదీ పరీవాహక ప్రాంతాల్లో మాట్లాడే భాష అని ఇంకో అభిప్రాయం. ఇక త్రిలింగభాష అంటే తెలియని దెవరికి? పేరు ఎలా వచ్చినా తీరు ఎలా ఉన్నదన్నదే సమస్య! ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఒక సదస్సుకు ముఖ్య అతిథి అప్పటి కేంద్రమంత్రి పి.వి. నరసింహా రావు. ఆ సదస్సులో విదేశీయుడైన గ్విన్‌ మాట్లా డారు. ఆయన తెలుగులో విద్వాంసుడు. అయినా ఆంగ్లంలో మాట్లాడారు. తెలుగులో మాట్లాడాలని ఆయన్ను సభ్యులు కోరారు. ‘నేను తెలుగులో మాట్లాడితే తెలుగును చంపేస్తానేమో,’ అన్నారు గ్విన్‌. వెంటనే పి.వి. నరసింహారావు, ‘మీకు ఆ అవకాశం లేదులెండి… మేము ఎప్పుడో చంపేశాం,’ అన్నారు. అందరూ నవ్వారు… ఏడవలేక! తెలుగుభాష పరిస్థితి అందరికీ తెలుసు గనక! తెలుగువాడి తిట్లలాంటివి ఈ భూమండలంలో ఎక్కడన్నా వినిపిస్తాయా! అన్నదీ అనుమానమే! మచ్చుకు నీయమ్మ కడుపు కాల, నీ దుంపతెగ. దుంపతెగ అంటే వంశం మొత్తం నాశనం కావడం.

తెలుగువాడి తీరు చిత్రాతిచిత్రంగా ఉంటుంది. తెలుగు వాడు తెలుగు ప్రాంతంలో తప్ప ఎక్కడివారితోనైనా కలిసిపో గలడు. ‘ఆకులో ఆకునై’ అన్నట్టు అవసరమైతే ఏ అడవిలో నయినా సెటిల్‌ అయిపోయి షటిల్‌ ఆడుకోగలడు. ‘తిక్కరేగిం దంటే డొక్క చీల్చేవాడు,’ అని సి. నారాయణరెడ్డి అన్నారు. ఇక్కడో వివరణ. తెలుగువాడు ఎవరి జోలికీ పోడు. ఎవరితోనూ గొడవ పెట్టుకోడు. అంతమాత్రాన ఊరుకుంటాడా అంటే అదేం లేదు. సాటి తెలుగువాళ్ళతో మాత్రం ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టు కుంటాడు. తెలుగువాడికి తెలుగువాడే శత్రువు అనిపిస్తాడు. ఇది తెలుగువాడి ఇంటిపోరు. ఇలాంటి సందర్భంలో మన వేమన వచ్చి ఇంటిలోని పోరు ఇంతింతకాదయా అంటాడు. మనమూ వింటాం. మనమూ అంటాం. అంతా టామ్‌టామ్‌!

తెలుగువాడిలాంటి నిరామయ, నిస్వార్థ జీవి ఎక్కడా ఉండడు. ‘తనది’ అని దేన్నీ అనుకోడు. ఉదాహరణకు ఇది నా భాష, కాపాడుకోవాలని అనుకోడు. ఏ భాష అయితేనేం అను కుంటాడు. ఉర్దూ గజల్సూ పాడతాడు. హిందీ సినిమాలూ చూస్తాడు. కానీ తెలుగు చదవమంటే మాత్రం అదోలా మొహం పెడతాడు. (ఆముదం తాగినట్టు అంటే బాగుండదు.) ఎవర యినా ఏమయినా అనుకుంటారేమో అనుకుంటాడు! పంచభక్ష్య పరమాన్నాలు తన కంచాన వడ్డింప గోంగూర కోసమై గుటకలేసే వాడు,’ అని తెలుగువాడి గురించి సినారె అన్నారు. మనవాడు తమిళనాడుకు వెళ్తే సాంబారును ప్రేమించుమన్నా అంటాడు. ఉత్తర భారతానికి వెళ్తే చపాతీ, కుర్మాల జుగల్‌బందీని చూసి లొట్టలు వేస్తాడు. తిండి సంగతి సరే! దుస్తుల్లోకి వద్దాం. చాలా మంది తెలుగు అమ్మాయిల్ని చూస్తే, వీళ్ళు పంజాబీలు అంటే నమ్మవచ్చు! తెలుగు పరికిణీలు, ఓణీలు మ్యూజియంలో వస్తువులు అవుతాయన్నది ఎంతోమంది అనుమానం! కొన్నాళ్ళకు చీరె కట్టుకోమంటే చీరేస్తారో ఏమో! వెంకయ్య, సుబ్బయ్య, వెంకటలక్ష్మి, సుబ్బలక్ష్మి లాంటి తెలుగు పేర్లు పెట్టుకున్న వాళ్ళు కనపడ్డా పంచెలు, చీరెలు కట్టుకున్న వాళ్ళు కనపడ్డా పాదాభి వందనం చేయాలనిపిస్తుంది.

తెలుగువాడు ఎప్పుడూ ఏదీ ఒక పట్టాన నమ్మడు. ‘అను మాన్‌ చాలీసా’ చదువుతుంటాడు. అంతెందుకు హనుమంతుడు కచ్చితంగా తెలుగువాడే! హనుమంతుడికి తన శక్తి తనకు తెలీదు. తెలుగువాడికీ తన శక్తి తనకు తెలీదు!

తెలుగువాడు ‘ఎక్కడా’ దొరకడు! ఎప్పుడయినా తప్పించు కుంటాడు. గొప్ప లీగల్‌ బ్రెయిన్‌. అతగాడి బ్రెయిన్‌లో ఆరుద్ర అన్నట్టు ఆలోచనల ట్రైన్‌ తిరుగుతూ ఉంటుంది. మనవాడికి ఓ ఆట‘కారం’ ఉంది. అదే గొప్ప వెటకారం! వాడు తింటున్నాడు‘అట!’ ఆమె తిరుగుతున్నది‘అట!’ అంటాడు. పుకార్లు పుట్టిస్తాడు. మనకు హ్యూమర్‌ తక్కువ. రూమర్‌ ఎక్కువ. నిజా నిజాల గురించి తనకు బాధ్యత ఏమీ లేదని మనవాడు చేతులు దులుపుకుంటాడు. సునాయాసంగా వేరేవాళ్ళ మీదికి తోసేస్తాడు. తెలుగువాడి సంభాషణా విన్యాసం చిత్రంగా వుంటుంది! ‘వాడు అన్నాడు సరే నీకు బుద్ధి ఉండొద్దూ! నీవు గడ్డి తింటున్నావా!’ అని తెలుగువాడు సాటివాడితో అంటాడు. విన్నవాడు చిరునవ్వులు చిందిస్తుంటాడు… కోపం తెచ్చుకోకుండా ఇదేమిటా గమ్మత్తు అనిపిస్తుంది. తిట్టేది ఎదుటివాడ్ని కాదు… ఎవరినో! తెలుగు తమాషాలు అన్నీ ఇన్నీ కావు.

వెనుకటికి కొత్త విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది సిఫార్సు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ చర్చోపచర్చలు జరిపి వివిధ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సిఫార్సు చేసింది. అందులో విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయడం ఒకటి. అందరూ సంతోషించారు. ఆ కమిటీలో తెలుగువాడు ఒక్కడు కూడా లేడు. ‘అయితే’ ఈ కమిటీలో ఒక్కడు తెలుగు వాడు ఉన్నా మనకు ఆంధ్ర యూనివర్సిటీ దక్కేది కాదని హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు చమత్కరించారట.

ఇలాంటి విషయాల్లో చమత్కారాలతో పాటు పచ్చి నిజాలు కూడా ఉంటాయి. అయితేనేం తెలుగువాడు తనవాడు తనను అణచి వేస్తున్నా పైకొస్తున్నాడు. ప్రస్థానం సాగుతోంది. తెలుగు వాడా! మజాకా!