The confrontation in India between the age-old caste system and the parliamentary form of government based on universal franchise vividly illustrates the manner in which old and historical societies get involved in, and provide content to, the modernizing process.” – Rajni Kothari, (Caste in Indian Politics. Orient Longman Ltd., 1970.)
పుట్టుకతోనే ఏ కులంలో పుట్టారో నిర్ణయించి, సంఘములో స్థానమేమిటో తెలిపి, ‘మనుషులంతా సమానం కాదు’ అని కుల వ్యవస్థ చెపుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. భారతదేశం లో లౌకిక ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టాలి అంటే కులాలు పోవాలి. కులాలు పోవాలి అంటే ప్రజల మనసులలో మార్పు రావాలా, లేక ఆర్ధిక, రాజకీయరంగాలలో మార్పు రావాలా అన్నది ప్రశ్న. స్కేడ్యూల్డ్ కులాలకు, గిరిజనులకు, వెనుకబడిన జాతులకు విద్యాసంస్థలలో, ఉద్యోగాల ఎంపికలో, రిజర్వేషను ఏర్పాటుచేసారు. ఈ రిజర్వేషను విధానము వల్లన కులవ్యవస్థ బలపడుతుంది కాని, కులాలు పోవు. రిజర్వేషను విధానమే లేకపోతే ఏళ్ళ తరబడి అణగద్రొక్కబడినవారికి సామాజిక న్యాయం ఎలా లభిస్తుంది?
కులం – పుట్టుక
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు వేదకాలం నుండి (క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాలు) భారతావనిలో ఉన్నాయని పురుషసూక్తంలో ఉంది. కులాల ప్రసక్తి భారతదేశములో హిందువులలోనే ఉంది. మరే దేశములలో కులాలు ఉన్నట్లు రుజువులేదు. సామాజిక, ఆర్ధిక, రాజకీయాలలో కులాలను బట్టి, ఆయా వ్యక్తుల హోదా నిర్ణయింపబడుతుంది. కులవిభజన వల్లన దేశానికి లాభమా? నష్టమా?
కులం – సాంఘికం
మా చిన్నతనంలో, అంటే 60 సంవత్సరాల క్రితం, రైలుబండి ఎక్కినపుడు, పక్కన కూర్చున్న ఆసామీ ‘మీరు ఏ కులస్తులు?’ అని అడిగేవాడు. ఈరోజుల్లో ‘ఎక్కడకు వెడుతున్నారు?’ అని అడుగుతున్నారు. కాలమహిమ అంటే ఇదే కాబోలు!
బ్రాహ్మణులు జనాభాలో తక్కువమంది ఉన్నా, పూర్వం వారికే ఉద్యోగాలు లభించేవి. బ్రిటిషువారి రోజుల్లో రాయటం, చదవటం బ్రాహ్మణులకు వచ్చును కాబట్టి, వారికి ఉద్యోగాలు ఇచ్చారు. శూద్రులకు చదువులేదు కాబట్టి వారికి ప్రభుత్వోద్యోగాలు రాలేదు. బ్రిటిషువారు, వారి పిల్లల కోసం పాఠశాలలు నెలకొల్పి, హరిజనుల పిల్లలకు, శూద్రుల పిల్లలకు, వారి పిల్లలతో పాటు విద్యాబోధన చేసేవారు. ఆ విధముగానే కూర్మా వెంకటరెడ్డినాయుడు (తెలగ నాయుడు) చదువుకుని, బ్రిటిషువారి పరిపాలనలో మద్రాసు రాష్ట్రానికి గవర్నరుగా, ముఖ్యమంత్రిగా పనిచేసాడు. భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తరువాత, రాజ్యాంగములో (1951 సంవత్స రములో), స్కెడ్యూల్డు కులాల వారికి, ఆదివాసు లకు రిజర్వేషను కల్పించారు. తరతరాల నుండి ఆదివాసులకు, హరి జనులకు తగిన విద్యావకాశాలులేవని, వారి ప్రగతిని ప్రోత్సహించా లని విశ్వవిద్యాలయాలలో, ప్రభుత్వఉదో గాలలో ’రిజర్వేషన్‘ కల్పించారు. స్కెడ్యూల్డు కులాలవారు, ఆదివాసులు కాక ఇతర జాతులవారు కూడా విద్యలో, ఆర్ధికముగా వెనుకబడి ఉన్నారని గ్రహించి సాంఘికముగా, విద్యారంగములో వెనుకబడినవారు ఎవరో తెలుసుకోవాలని, మండల్ కమిషనును జనతా పార్టీ ప్రభుత్వము 1979 సంవత్సరంలో ఏర్పాటుచేసింది. దీని వలన దేశములో అల్లర్లు చెలరేగాయి. పది సంవత్సరాలకు ఒక్కసారి చేసే జనాభా లెక్కలలో, కులం ఉండాలని కొందరు, ఉండకూడ దని మరికొందరు వాదులాడుట వాస్తవం. ఇటీవల (2011) జనాభా సేకరణలో కులాల గురించి సమాచారం సేకరించాలని కొందరు కోరారు.
పూర్వం కులవిభజన ఉన్నా, పల్లెల్లో ప్రజలు సామరస్య ముగా బ్రతికేవారు. నేడు కులాలు ప్రజల్ని విడదీస్తున్నాయి. ఈరోజులలో (2013 ఎ.డి.) కూడా, స్కెడ్యూల్డు కులాలవారి పిల్లలు, బడిలో వర్ణవివక్షకు గురి అవుతున్నారు. స్కెడ్యూల్డు కులాలవారు నివసించే గుడిసెలకు నిప్పు అంటిస్తున్నారు. స్కెడ్యూల్డు కులాలవారి స్త్రీలు లైంగికహింసకు బలవుతున్నారు. కులవిభజనే ఇటువంటి హింసలకు కారణం అని గ్రహించాలి.
కులం-ఆర్థికం
పాశ్చాత్యులు ఆనాడు భారతదేశములో ఉన్న సంపదను చూసి, వర్తకము చేసి, లాభాలు గడిరచాలని వచ్చారు. ఆనాటి సంపదకు కారణం కులాలు ఉండుట వల్లనే అని నిపుణులు తెలియచేసారు. ఒక కులం వారు ఒకే పని చేయటం వల్లన వారు నిపుణులు (specialists) కాగలిగారు. ఆ నిపుణతయే ప్రాచీన భారతదేశ ఆర్ధిక పునాదికి ఆధారము. స్వర్ణకారుల పనితనమే ఇందుకు నిదర్శనం. గ్రామాలలో ప్రబలిన ప్రజాస్వామ్యము పోయి, రాజకరిము రాగానే ఒకేఒక వ్యక్తి చేతిలోనికి అధికారము కేంద్రీకృతమైంది. గ్రామాలలో లభించిన ఆదాయమును సైన్యాన్ని పోషించుటకు, పొరుగుదేశాలపై యుద్ధము చేయుటకు, రాజులు వాడేవారు. కులాల ప్రాతిపదికగా రాజులు, వారి అమాత్యులు, ధర్మం పేరుతో, రాజ్యపాలన చేసేవారు. బ్రిటిషువారు ప్రభువులైన తరువాత ‘విభజించు, పాలించు’ సూత్రముతో ఆయా కులాల వారిని, కులాల పేరుతో విభజించి, రాజ్యపాలన సాగించారు. 1875 సంవత్సరములో జరిగిన తిరుగుబాటు మళ్ళీ రాకుండా బ్రిటిషువారు, అప్పటివరకు ఉన్న సైన్యాలను రద్దుచేసి, కులాల, మతాల ప్రాతిపదికగా సైన్యాలను ఏర్పాటుచేసారు. సిఖ్ రెజి మెంట్, మరాఠా రెజిమెంట్ మొదలగు సైన్యాలు బ్రిటిషువారి రోజుల్లో ఏర్పాటుచేసారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినా, అదే పద్ధతిలో ఈనాటికి సైన్యములో చేరాలి అంటే కులంతో ముడి పడిన పద్ధతులే అమలులో ఉన్నాయి. సైన్యములో చేరాలి అంటే కులం, లేదా ప్రాంతము పరిగణలోనికి తీసుకోవాలో, లేదో, సుప్రీవ్‌ు కోర్టువారు తీర్పుచెపుతారు (ది హిందూ, డిసెంబర్ 11, 2012). స్వతంత్రము వచ్చిన తరువాత దళితులకు, ఆదివాసు లకు, ఇదివరకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుటకుగాను, చదువుల్లో, ఉద్యోగాలలో ‘రిజర్వేషను’ కల్పించారు. ఉన్నత కులాలవారికే సంపదను చేకూర్చే సాధనాలు భూమి, పరిశ్రమలు. పల్లెల్లో కులాలు నాటుకుని పోవటం వల్ల, తగిన డబ్బు ఉన్నా, దళితుడు, ఉన్నత కులస్తులు ఉండేచోట ఇల్లు కొనుక్కోలేక పోయేవాడు.
ఉత్పత్తి సాధనాలు ఉన్నతకులాల వారి చేతుల్లో ఉండుట వల్ల నిమ్నకులాలవారు సంపదను పెంచుకోలేకపోయారు. ఈ పరిస్థితిని సరిదిద్దుటకు ‘నేషనల్ స్కెడ్యుల్డు కేస్టస్ ఫైనాన్సు అండ్ డె వేలోప్మేంట్ కార్పోరేషన్’ ను ప్రభుత్వము ఏర్పాటు చేసింది. చదువు, సామర్ధ్యము, కార్యనిర్వహణ సంపదను పెంచుకొనుటకు అన్ని కులాలవారికి అవసరము. చదువు, సామర్ధ్యము ఉన్నవారు పట్టణాలకు పోయి, పల్లెల్లో ఉన్న కులవిభేదాన్ని వదలి, ఉద్యో గాలు చేస్తున్నారు.
కులం-రాజకీయం
ఇటీవల మా ఇంటికి (అమెరికాలో) వచ్చిన పెద్దమనిషిని అడిగా ‘ఫలానా ఆయనకు మీ నియోజకవర్గములో ఎమ్మెల్యేగా నిలబడుటకు సీటు ఎలా ఇచ్చారు?’ అని. ఆయన సమాధానం: ‘మెజారిటీ కులానికి ప్రతినిధిగా ఆయనకు సీటు ఇచ్చారు.’ అధిక సంఖ్యాకులు ఎవరైతే వారికి కులాన్ని బట్టి ఓటు వేస్తారు. ఇప్పటి రాజకీయ పార్టీలవారు కులాన్ని పరిగణించి, ఎమ్మెల్యే సీటును లేక ఎం.పి. సీటును ఇస్తున్నారు. స్కెడ్యూల్డు కులాలవారికి, గిరి జనులకు ప్రజాప్రతినిధులుగా పోటీ చేయుటకు వీలుగా రిజ ర్వేషను కల్పించారు. ఈ విధముగా వెనుకబడినవారికి రాజకీయా లలో పాల్గొనుటకు వీలయింది. భారతదేశ అధ్యక్షుడిగా, లోక్‌సభ స్పీకరుగా, రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా స్కెడ్యూల్డు కులాల వారు ఎన్నికయ్యారు.
కులం-లాభనష్టాలు
కులాలు సమాజములో వేళ్ళూని బలపడటం వల్లన సమత సాధ్యము కాదు. ఆర్ధిక అసమానత, విద్యలో, ఉద్యోగా లలో వెనుకబడుట, రాజకీయరంగములో అధికారము లేకపోవుట వల్ల వెనుకబడిన కులాలవారు సంఘంలో సమానత్వాన్ని సాధించ లేరు. దేశములో సగానికి సగంమంది వెనుకబడిన కులాలవారు కావటం వల్ల దేశప్రగతి మందముగా సాగుతోంది. దీన్ని అధిగమిం చాలి అంటే, సంఘ సంస్కరణలు, ప్రభుత్వ విధానాలు అవసరం. గతములో నష్టపోయిన కులాలవారికి చదువులలో, ఉద్యోగాలలో రిజర్వేషను (Affirmative action) కల్పిస్తే, ఆర్ధిక అసమానత్వం పోతుంది అన్న నమ్మకముతో ప్రభుత్వము పనిచేస్తోంది. చట్టాలు చేయటం వల్లన ఆర్ధిక అసమా నత్వం పోలేదు. అగ్రవర్ణాలవారి మనసులలో మార్పు వచ్చినపుడే ఆర్ధిక అసమానత్వం పోతుంది. భారత రాజ్యంగములొ పొందు పరచిన రిజర్వేషన్లను ఈనాటి ప్రజలు ఎంతమంది ఆమోది స్తున్నారు? దేశములో సగంమంది ప్రజలు వెనుకబడి ఉంటే ప్రగతి సాధ్యమా? షెడ్యూల్ కులాల నాయకులకు అధికారం సంప్రాప్తం అయినపుడు షెడ్యూల్ కులాల వారికి ఏమి ఉపకారం చేయగలిగారు? భారతదేశమునకు స్వతంత్రం లభించి 66 సంవత్సారాలు గడిచినా వెనుకబడిన జాతులు అన్నివిధాలా వెనుకబడి ఉన్నాయి.
కులమే లేకపోతే?
భారతదేశములోనే కులాలు ఉన్నట్లు, మరే దేశములో కులాలు లేవు అని మనకు తెలుసు. అయినా ఇతర దేశాలలో బీదవారు ఉన్నారు, నిరక్షరాశ్యులు ఉన్నారు. అక్షరగ్యానము, ఉద్యోగ లభ్యము ఉన్నపుడే ఆర్ధిక అసమానత్వము పోతుంది. పల్లెలో వివక్షకు గురిఅయిన షెడ్యూల్ కులాలవారు పట్టణాలకు వలసపొతే, వర్ణవివక్షతకు గురికాలేదు. గత ప్రభుత్వ విధానాలు పల్లెప్రజలు పట్టణాలకు పోకుండా అడ్డుపడ్డాయి. షెడ్యూల్ కులాలవారు ఆర్ధిక సమానతను సాధించలేకపోవటానికి ఈ విధానాలు తోడ్పడినాయి.
అగ్రరాజ్యముగా భారతదేశం
చదువు, డబ్బు ఉన్నవాళ్ళే ముందుకి సాగుతున్నారు. వాళ్ళే కులాన్ని పక్కన పెట్టి పెళ్ళి చేసుకోగలుగుతున్నారు. ‘వియ్యమైనా, కయ్యమైనా సమానమైన వారితోనే సాధ్యము.’ చదువుకున్నవారిలో ఈ సామెత నిజమని రుజువవుతోంది. కులరహిత సమాజమే దేశప్రగతికి అవసరం అని ఈ వ్యాసకర్త అభిప్రాయం. కులాలు పోవాలి అంటే ఆర్ధిక అసమానత్వం పోవాలి, చదువులో ప్రగతి సాధించాలి. జాతి,కులం, మతం, లింగభేదము పరిగణన చేసి, సమత సాధించినపుడే దేశం ముందుకి సాగుతుంది. కుల రహిత సమాజమే ఆదర్శసమాజంగా, అందరికి ఉద్యోగం లభించే రాజ్యంగా, ప్రజలే ప్రభువులుగా ఉండే దేశములో, కఠిన నిర్ణయా లను చేయగల నాయకులుగా ఉన్నపుడే భారదేశము అగ్రరాజ్య ముగా పరిగణించబడుతుంది. ఆరోజు తొందరలోనే వస్తుందని నా నమ్మకం.
‘భారత దేశంలో కులం-ప్రజాస్వామ్య రాజకీయాలు’ అన్న పుస్తకాన్ని ఘన్‌శ్యాం షా గారు, సౌత్ ఆసియన్ స్టడీస్‌లో భాగంగా ప్రచురించారు. కులం గురించి మరింత తెలుసుకోవాలని కోరే వారికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
References
1. Purusha Sukta. Translated and Explained by B.V.Kamesvara Aiyar, M.A., G.A. Natesan & Co., Madras, 1898. Sukta XII. Pages 55 – 59.
2. http://en.wikipedia.org/wiki/Purusha_sukta
3. http://en.wikipedia.org/wiki/Kurma_Venkata_Reddy_Naidu
4. http://www.thehindu.com/news/states/karnataka/study-reveals-discrimination-in -karnataka schools/article4019883.ece
5. Caste, Society and Politics in India. Susan Bayly. Cambridge University Press. 1999.
6. Asian Strategic And Military Perspective By Ravi Shekhar Narain Singh Singh. Lancer Publishers, 2005.
7. http://www.thehindu.com/news/national/how-can-caste-region based-recruitment-continue-in-army-regiments/article4185517.ece
8. Caste and Democratic Politics In India By Ghanshyam Shah. Anthem Press, 2004.
9. Why Political Reservations? Esther Duflo. http://www.povertyactionlab.org/sites/default/files/publications/Duflo%20Why%20Political%20 Reser-vations.pdf
10. The Grammar of Caste: Economic Discrimination in Contemporary India by Ashwini Deshpande. Oxford University Press, 2011.