నాట్య జగతిపై తెలుగువాడి ‘ముద్ర’ కూచిపూడి. అద్భుత ఆహార్యం… విశిష్ట వాచికాభినయం… కూచిపూడి సొంతం. కృష్ణాతీరంలో ప్రభవించి… అచ్చ తెలుగు సంప్రదాయంలో వికసించి… ఖండఖండాంతరాల్లో జయకేతనం ఎగురవేసిన ఘనచరిత్ర కూచిపూడి నృత్యానిది. ఆనాటి సిద్ధేంద్రుడి నుంచి నిన్నటి వెంపటి చినసత్యం వరకూ ఎందరో మహానుభావుల కేళికా విన్యాసా లతో పరిపుష్టమై… భారతీయ శాస్త్రీయనృత్యాలకే తలమానికమై… దేశవిదేశాల్లోని అసంఖ్యాక అభిమానుల ఆదరణను అందుకుంటున్న అచ్చ తెలుగు కళారూపమిది.
చక్కెర తేనెల ఊట, మధురామృతాల తోట… మన తెలుగు నవరస నాట్యదీపిక… మన కూచిపూడి. ఈ రెండిరటిది అవినాభావ బంధం. ఆరు వందల ఏళ్ళ కిందట సిద్ధేంద్రుడు సృజించిన ‘భామాకలాపం’లో భాష, భావం జోడు గుర్రాలై కదం తొక్కుతాయి. ‘భామనే… సత్యభామనే,’ అంటూ తన గురించి చెప్పుకునే సిద్ధేంద్రుడి సత్యభామ… ‘ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే…’ అంటూ హొయలు పోతుంది. పదహారువేలమంది కోమలుల లందరిలోనూ తానే భామనని సగర్వంగా ప్రకటించుకుంటుంది. అభినయానికి, నర్తనానికి వంద శాతం అవకాశం కల్పించే అక్షరాల సమ్మేళనం… భామా కలాపం. ఇదొక్కటే కాదు, కూచిపూడి కళాకారులు అభినయించే నాట్య రూపాల్లో అత్యధికం అచ్చతెలుగుకు పట్టం కట్టినవే.
కూచిపూడి కళాకారుల నయనాలు అభినయాన్ని పలికిస్తే… కర చరణాల విన్యాసాలు భావప్రకటనలను వ్యక్తం చేస్తాయి. సాధారణ భావాల నుంచి నెమలి నాట్యం, పూల మకరందాన్ని గ్రోలే భ్రమర విన్యాసం, కడలి కెరటాల పదనిసలు, మలయ మారుతం, మేఘాల షికారు, వానజోరు, పిడుగుల హోరు, మగువ సౌందర్యం, సౌకుమార్యం లాంటి అనేకానేక అపురూప దృశ్యాలను… కేవలం చేతివేళ్ళను కదిలిస్తూ, శిల్ప సదృశ్యమైన భంగిమలతో కళ్ళకు కట్టడమే కూచిపూడి ప్రత్యేకత. కూచిపూడి హస్త ముద్రలు అపూర్వం. ప్రకృతి నుంచి, సామాజిక నేపథ్యం నుంచి, నిత్యజీవితం నుంచి గ్రహించిన అనేక భావాలను అతి సుకుమారంగా వ్యక్తం చేస్తాయి అవి. ఒక్క చేతితో అభినయించే 28 అసంయుక్త హస్తముద్రలు, రెండు చేతులతో చేసే 13 సంయుక్త హస్త ముద్రలు… కూచిపూడి సొంతం. నిజానికి భరతుడి నాట్యశాస్త్రం లోని 67 హస్తముద్రలనూ కూచిపూడి అభినయించ గలదు. అలాగే, చతుర్విధ ప్రక్రియల్నీ, రీతుల్ని పూర్తిగా అన్వయించు కున్న ఏకైక నృత్యమిది. అలంకార శాస్త్రంలోని దశ రూపకాలను, ఉప రూపకాలను కూడా పూర్తిస్థాయిలో ప్రదర్శించగల నేర్పు కూచిపూడి కళాకారులది.
సామాన్యుని జీవనచిత్రాన్ని ప్రతిబింబించినప్పుడే కవిత్వ మైనా, కళలైనా సార్థకమయ్యేది. ఈ కొలమానాన్ని అందు కోవడంలో కూచిపూడిది ఎప్పుడూ అగ్రస్థానమే. దేవాలయాలకు, రాజాస్థానాలకు మాత్రమే పరిమితం కాని కళ ఇది. ప్రజా సమస్యల్ని నర్మగర్భితంగా అభినయిస్తూ, మహరాజుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషిచేసే సామాజిక బాధ్యతను శతాబ్దాల కిందటే భుజానికెత్తుకుంది కూచిపూడి.
ఆనాడు శిస్తుల వసూలు పేరిట… రాయలసీమలోని సిద్ధవటం గ్రామంలో కరవుబారిన పడ్డ కుటుంబాల్లోని రస్తీలపై రాజప్రతినిధి సమ్మెట గురవరాజు క్రూరమైన అత్యాచారాలు చేసేవాడు. కేళిక రూపంలో శ్రీకృష్ణదేవరాయల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి, అకృత్యాలకు అడ్డుకట్ట వేయించారు నాటి కూచిపూడి భాగవతులు. ఆనాటి నుంచి నేటి వరకూ ఎన్నో సామాజిక సమస్యలపై పదం కలుపుతూ కదం తొక్కుతూ పురోగమిస్తూనే ఉంది. విశ్వకవి రవీంద్రుడి ‘చండాలిక’ను అభినయించి అంటరానితనంపై విల్లు ఎక్కుపెట్టింది. భ్రూణహత్యల పై ‘నాతిచర’, స్త్రీల సమస్యలకు అద్దం పట్టే ‘విజయోస్తు తే నారీ’, అన్నదాతల ఆక్రందనల నేపథ్యంలోని ‘రైతేరాజు’, జాతి సమగ్రతను చూపే ‘సమైక్యతాభారతి’, శాంతిని ఆకాంక్షించే ‘అహింసా పరమోధర్మః’, మహనీయుల జీవితాల్ని ప్రతిబింబించే ‘వివేకానంద…’ కూచిపూడి శైలికి నిలువెత్తు తార్కాణాలు.
కాలక్రమంలో వచ్చిన లెక్కకు మిక్కిలి మార్పులను ఎప్పటికప్పుడు ఆవాహనం చేసుకుంటూ కూచిపూడి సుసంపన్నం అవుతోంది. అయితే, కళకైనా కళాకారులకైనా జనాదరణ ఆయువు పట్టులాంటిదైతే ప్రభుత్వ చేయూత సంజీవని. దేశాంతరాల్లో తెలుగువారి ఖ్యాతిని ఇనుమడిరపజేస్తూ, అనితర సాధ్యమైన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న కూచిపూడికి ప్రభుత్వ ఆదరణ ఇంకా పెరగాలి. నాట్యాన్నే తపస్సుగా భావించి సాధన చేస్తూ, చేయిస్తూ… భావితరాలకు దాన్ని దగ్గర చేస్తున్న కళాకారులకూ చేయూతనందివ్వాలి. కూచిపూడికే జీవితాలను అంకితం చేసిన మహానుభావులను ఆర్థికంగా ఆదుకోవాలి. ప్రజల్లో కూచిపూడిపై అభిరుచిని, ఆసక్తిని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆసక్తి ఉన్న చిన్నారులకు పాఠశాల స్థాయిలోనే కూచిపూడిని నేర్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. అప్పుడే తెలుగువాడి కూచిపూడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతుంది.