తెలిసీ చెప్పకపోయారో…

తెలుగు కార్టూన్‌ వయసు చిన్నదే. రాజకీయ కార్టూన్‌ అయితే మరీ చంటిది. యూరప్‌, అమెరికా, రష్యాలతో పోల్చుకుంటే ఇది నిజం. భారతదేశానికీ, సకల ప్రాచ్యదేశాలకూ, మధ్య ప్రాచ్యానికీ సంపద్వంతమైన చిత్రకళ, శిల్పకళాసాంప్రదాయ ముంది. ఇది యూరప్‌ పునరుజ్జీవ కాలం కంటే శతాబ్దాల ముందే ఉచ్ఛదశలో ఉంది.

చాలా ఏళ్ళ క్రితం పికాసో భార్య మన అదిలాబాద్‌ వచ్చింది. అక్కడ గోండులు చెక్కిన ఎద్దుతల చెక్కబొమ్మ చూసి,I thought there was only one Picasso on earth అన్నది. పంథొమ్మిదో శతాబ్దం మధ్యకాలం వరకు జపాన్‌ కళ, చైనా బొమ్మలను ఫ్రెంచి ఇంప్రెషనిస్టులూ, ఆస్ట్రియన్‌ ‘సెసెషన్‌’ గ్రూపూ చూడనేలేదు. ‘థింకర్‌, కిస్‌’ శిల్పాలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రోడిన్‌ మన నటరాజ విగ్రహం చూసి తల్లకిందులై పేజీల కొద్దీ రివ్యూ రాశాడు. ఆనందకుమారస్వామి ఎన్నో గ్రంథాల్లో చెప్పేంత వరకూ మన ప్రాచ్యకళ ప్రాభవం అప్రాచ్యులకు తెలీదు.

డావిన్సీ, మైకెలాంజెలో మాదిరిగా రియలిజానికి మిల్లీ మీటర్‌ దూరం కూడా పోనంతటి చిత్రాలనీ, శిల్పాలనీ చేయడమనే చట్రంలో యూరప్‌ శతాబ్దాలుగా బందీ అయింది. రాచరికం, ఫ్యూడలిజం పోయి పారిశ్రామిక విప్లవాలు అక్కడ రావడం, రాజకీయ పార్టీలు, వాటి ప్రచారానికి పత్రికలు పుట్టడం, వాటికి ప్రచార కార్టూన్లు అవసరం యూరప్‌లో ఎంతో ముందుగా వచ్చింది. పైగా మన రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాల సైజు కూడా లేని దేశాలు ఆఫ్రికా, ఆసియాల్లో అపార సంపదలున్న విశాల దేశాలపై దండెత్తి యూరప్‌కు దోచిపెట్టాయి. ఈనాటి వారి ఐశ్వర్యాలకూ, సాంస్కృతికంగా మాదే సుపీరియారిటీ అని డంబాలు కొట్టడానికీ మన ‘పేద’దేశాల సంపదలే పునాది. వాళ్ళ భాషనీ, దాని వెంట సంస్కృతినీ అన్ని రంగాల్లో మనపై రుద్దారు. మన బానిస మనసులకు కూడా అమెరికా, యూరప్‌ల తళుకు బెళుకులూ ప్రగతీ చూసి డంగైపోవడం మన రోజువారీ పనైంది.

ఈ పూర్వరంగంలో భారతదేశంలో చాలా లేటుగా పత్రికలు మొదలయ్యాయి. ఇంగ్లీషు పత్రికలు చాలావరకూ బ్రిటిష్‌ వాళ్ళు ప్రారంభించినవే. జాతీయోద్యమంలో ఇంగ్లీషు తెలుగు పత్రికల్ని దేశభక్తులు ప్రారంభించారు. మనకే సాంస్కృతిక అవసరం వచ్చినాసరే మన వలస పాలకుల దేశాల వంక చూడ్డం, అనుకరించడం మనకి పరిపాటి అయింది. పైగా వాళ్ళు మనకి ఇంగ్లీషు ఇంజక్షన్‌ ఇచ్చిపోయారు గదా. అది తిన్నగా బుర్ర కెక్కుతుంది. ఇక కార్టూన్‌లలో షేక్స్‌పియర్‌ కేరెక్టరూ, డాన్‌ క్విక్‌ సోటూ వగైరాలే ఎక్కువ. హేమ్లెట్‌ చేతిలో కపాలం పకాలంటుంది. అయితే ఇదంతా ఇంగ్లీషు పత్రికల కెక్కువ.

తెలుగులో ఈ ప్రభావం తక్కువ. తలిశెట్టి రామారావు గారు ఇంగ్లీషు చదువుకున్న లాయరైనా సరే తెలుగు సాంఘిక జీవనం పైనే కార్టూన్లు వేశారు. మన తెలుగు కార్టూన్‌కు తొలిశెట్టి ఆయనే. ఆమధ్య ఆయన కార్టూన్ల పుస్తకం ఆవిష్కరణ అంటే ఆర్టిస్టులందరం పొలోమంటూ బెజవాడ పోయాం.

స్వతంత్రం తర్వాత తెలుగులో సాహిత్యపత్రికలు ఎక్కువ. అంతకుముందు ఆంధ్ర పత్రికలాంటి గొప్ప దినపత్రిక లున్నప్పటికీ మొదటి పేజీలో అమృతాంజనం బాటిల్‌కు తప్ప మరే ఐటమ్‌కి చోటే లేదు. ఇప్పుడ లాటి కాలం మళ్ళీ వచ్చిపడ్డ ట్టుంది. మన ఇంగ్లీష్‌, తెలుగు డైలీలకి మొదటి, రెండో పేజీల నిండా రియల్‌ ఎస్టేటూ, బంగారం సింగారం ఎడ్వర్‌టైజ్‌ మెంట్లే. 60, 70 దశకాల్లో మొదటి పేజీల్లో బానర్‌ కిందే వచ్చే రాజకీయకార్టూన్లు అట్లా అట్లా జరిగి లోపలి పేజీల్లో నంగినంగి నక్కుతున్నాయి.

50వ దశకంలో ఆంధ్రపత్రికలో ‘ఉమెన్‌’ అనే కేరళ కార్టూ నిస్టు రాజకీయ కార్టూన్లు వేసేవారు. కేరళ నుండి పోస్టు బాక్సులో వేయగా, ఆ తోకలేని పిట్ట తాపీగా తొంభై ఊళ్ళు తిరిగి పేపర్‌ ఆఫీస్‌కి చేరి ప్రింటయి ఊళ్ళోని పాఠకులకు చేరేసరికి వారం, పదిరోజులు దాటేది. ఆరోజుకి తెలుగులో రాజకీయ కార్టూనిస్టు ఇంకా పుట్టలేదు.

సంసారపక్షంగా ఎంతో మర్యాదగా మల్లెపూలతో కొట్టి నట్టుండే ఈ కార్టూన్ల ప్రపంచంలోకి 1955 తుపానొచ్చింది. తెలుగునాడంతా ఎర్రబారింది. కమ్యూనిస్టులు అధికారంలోకొచ్చే ప్రమాదం అటు కమ్యూనిస్టు వ్యతిరేకులకూ ఇటు కమ్యూనిస్టు లకూ కూడా స్పష్టంగా కనిపించింది. వాసు అనే కార్టూనిస్టుతో నార్ల వెంకటేశ్వరరావుగారు ప్రతిరోజూ ‘ఆంధ్రప్రభ’లో కార్టూన్లు వేయించేవారు. వాటికి సమాధానంగా మర్నాడు ‘విశాలాంధ్ర’లో రాంభట్ల కృష్ణమూర్తిగారు కార్టూన్‌ గీసేవారు. పైగా దానికింద ఆయన వ్యంగ్య కవితలు ఫ్రీ గిఫ్ట్‌. రాజకీయాల సంగతేమోగానీ తెలుగు ప్రజల్లో పొలిటికల్‌ కార్టూన్‌ మీద పిచ్చి పుట్టించిన కాలమది. ఎన్నికల ప్రచారంలో ట్రిక్‌ ఫోటోగ్రఫీతో (ఆరోజుల్లో వైర్‌ వర్క్‌ అనేవారు) ఈ కార్టూన్‌ ఆయుధాలు ఒకదాన్నొకటి ఢీకొంటుంటే జనం ‘మాయాబజార్‌’ని మర్చిపోయేవారు.

అరవయ్యో దశకంలో ‘విశాలాంధ్ర’ వారు ‘శంకర్స్‌ వీక్లీ’తో ఒప్పందంతో తెలుగులో ఆ కార్టూన్లు రోజూ వేసేవారు. అది గొప్ప వెరైటీ. 1962లో ‘ఆంధ్రజ్యోతి’ వచ్చింది. అందులో ఇ. వెంకట రమణ (ఇ.వి.ఆర్‌.)తో నార్ల వెంకటేశ్వరరావుగారు కార్టూన్లు వేయించేవారు. అదే సంవత్సరం ‘విశాలాంధ్ర’లో టి. వెంకట్రావు (టీవీ)గారు చేరారు. నేటి టీవీలు పుట్టని కాలం. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మీద జ్యోతి ముప్పేట దాడి చేసేది. మొదటిపేజీలో, లోపలా పుంఖానుపుంఖాలుగా కార్టూన్లు. ప్రస్తుతం తెలుగునాట పత్రికల మధ్య జరుగుతున్న కార్టూన్‌ల యుద్ధం నాడు మొదలైన గొడవకి క్లైమాక్స్‌ అనిపిస్తుంటుంది.

1974లో ‘ఆంధ్ర’ అనే టాగ్‌ ముందూ వెనకా లేని ‘నాడు’ వచ్చింది. మొదట విశాఖలో చిన్నగా మొదలైనపుడు ‘బాలి’ (ఎం. శంకర్రావు) కార్టూన్లు వేశారు. తర్వాత ఈనాడు హైదరాబాద్‌, విశాఖ, తిరుపతికి శాఖోపశాఖలై విస్తరించింది. ముఖ్యమంత్రి అంజయ్య మీద ‘పాపా’ కార్టూన్లు పేలేవి. తర్వాత ‘శ్రీధర్‌’ అనే యువ కార్టూనిస్టు వచ్చి చేరి ఈనాటికీ వేస్తున్నాడు. రాష్ట్ర మంతటా వటవృక్షంలా ఎదిగిన ఈనాడు ‘ది లార్జెస్ట్‌ సర్క్యు లేటెడ్‌ తెలుగు డైలీ,’ అనే కిరీటాన్ని ఆంధ్రప్రభ లోగో నుంచి తీసేసి తనే తగిలించుకుంది. 1981 నాటికి ప్రభకి కొత్తగా ఎ.వి.కె. ప్రసాద్‌ ఎడిటర్‌ అయారు. మోహన్‌ అనే నన్ను కార్టూనిస్టుగా తీసుకున్నారు. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఎడిటర్‌ జి.ఎస్‌. భార్గవ గారు కూడా ముచ్చటపడినందున ఎక్స్‌ప్రెస్‌లో పాకెట్‌ కార్టూన్‌ కూడా వేసేవాణ్ణి. రెండు మూడేళ్ళయ్యాక దాసరి నారాయణ రావుగారి పత్రిక ‘ఉదయం’ వచ్చింది. ఎబికె ఎడిటర్‌. నేను కార్టూ నిస్టుని. అదంతా ఎన్టీఆర్‌ యుగం. కార్టూనిస్టులకు పండుగ. జనానికి నాన్‌స్టాప్‌ నిర్బంధ వినోదం.

ఆ కాలంలో ప్రజాశక్తిలో కార్టూనిస్టుగా చేసిన శేఖర్‌ ఇపుడు ఆంధ్రజ్యోతికి వేస్తున్నాడు. ‘ఉదయం’ మేనేజ్‌మెంట్‌ మారిన కాలంలో ‘సురేన్ద్ర’ కార్టూనిస్టుగా ‘ఆంధ్రభూమి’ నుండి వచ్చాడు. కాలక్రమేణా ఆ పేపర్‌ అంతరించింది. ఇప్పుడు సురేన్ద్ర కార్టూన్లు రోజూ ‘హిందూ’లో మీరు చూడొచ్చు.

తర్వాత వచ్చిన ‘వార్త’కు ఎడిటర్‌ మళ్ళీ ఎబికె. అందులో జావేద్‌, శంకర్‌, అన్వర్‌ కార్టూన్లు వేశారు.

ఒకనాడు ఈనాడులో కంపోజింగ్‌ అంతా కార్మికులే చేసేవారు. అప్పుడు ఉదయం కంప్యూటర్‌ కంపోజింగ్‌, సగం కలర్‌ ప్రింటింగ్‌తో వచ్చేసరికి జనం విస్తుపోయారు.

2007లో అంతకుమించిన విప్లవం జరిగింది. పంచ రంగుల పేజీలూ, ఆల్ట్రా మోడరన్‌ ప్రింటింగ్‌తో, రాష్ట్రమంతటా ఒకేసారి 24 ఎడిషన్‌లతో ‘సాక్షి’ వచ్చింది. జనం కళ్ళు జిగేల్‌ మన్నాయి. వేలంవెర్రిగా ఎగబడ్డారు. దీని ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి. జర్నలిజంలో సుదీర్ఘానుభవం ఉన్నవాడు. కార్టూ నిస్టు శంకర్‌, ఇలస్ట్రేటర్స్‌ అన్వర్‌, వాసు. వీళ్ళ బొమ్మలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. సాక్షి ప్రభ ఇంకా వెలుగుతూనే ఉంది.

పత్రికల్లో కార్టూనిస్టులుగా చేసినవారు చాలామంది టెలివిజన్‌ ఛానల్స్‌లో యానిమేటెడ్‌ కార్టూనిస్టులుగా అవతార మెత్తారు.

ఒకప్పటి హాండ్‌ కంపోజింగ్‌ నుండి, ఫ్లాట్‌ బెడ్‌ ప్రింటింగ్‌, బ్లాక్‌మేకింగ్‌, మల్టీకలర్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ వరకూ మనమెంతో ముందుకొచ్చేశాం. ఈ ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా పై వందల, వేల కోట్లు నిత్యం ఖర్చవుతోంది. రాష్ట్రంలో తిండి గింజల కోసం జనం చస్తున్నారు. రైతులు నిజంగానే చచ్చిపో తున్నారు. ఇతర రంగాల్లో బాధలు చెప్పనలవి కాదు. ఇటు ఇన్ని సినిమాలూ, మీడియా మీద ఖర్చుచూస్తే ఎవరేనా కళ్ళు తేలేస్తారు.

మరో గ్రిమ్‌ ట్రాజడీ. ఒకప్పుడు నిస్పాక్షిక జర్నలిజమనీ, ఉత్తమ విలువలనీ, ఇండిపెండెంట్‌ ఎడిటర్‌, కార్టూనిస్ట్‌లనీ, ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్లనీ ఇంకా ఏవేవో పేర్లతో ఒక రకం ముసు గైనా ఉండేది. ఇప్పుడలాంటిదేం లేదు. అఖ్కర్లేదు. ఫలానా పేపర్‌ అంటే ఫనాలా పార్టీది అని చెప్పడానికి మేధావి, పరిశీలకుడు కానక్కరలేదు. లేటెస్ట్‌ తెలుగు సినీమా హిట్టా ఫట్టా అని బాక్సా ఫీసు ముందు తగువుపడే జనం కూడా చెప్పేయగలరు.

ఒకప్పుడు పార్టీ పత్రికలంటే విశాలాంధ్ర, ప్రజాశక్తి, జనశక్తి అని చెప్పుకునేవారు. ఇప్పుడున్నవన్నీ పార్టీ పత్రికలే. పోనీ వేనకు వేల కోట్లు గుమ్మరిస్తున్న మీడియా మాన్యుఫాక్చర్‌ చేసిన ఒక మహా రచయిత, గొప్ప జర్నలిస్టు, సూపర్‌ కార్టూనిస్టు ఎవరన్నా ఉన్నారా అంటే ఎక్కువమంది యావరేజ్‌ సరుకే.

ఒకనాటి శంకర్స్‌ వీక్లీ కార్టూనిస్టులు అబూ అబ్రహాం, విజయన్‌లలాగా సొంత అభిప్రాయాలతో, సొంత శైలితో సొంత ఫిలాసఫీతో కార్టూన్లు గీసే బాధ లేకుండా మేనేజ్‌మెంట్లు ఇంచక్కని ఏర్పాట్లు చేశాయి.

కానీ కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలూ అండ్‌ మరికొన్ని సందేహాలూనూ.

బ్రిటిష్‌వాళ్ళు ఉదారం గా మనకిచ్చిన సిఫిలిస్‌నూ, గనేరియానూ, ఇంగ్లీష్‌ భాషా, దాని వైట్‌సుపీరియర్‌ కల్చర్‌ని మహదానందంగా స్వీకరించి చక్కగా ‘సివిలైజ్‌’ అయ్యాం గదా! అమెరికాలాగే వాళ్ళదీ మనదీ కేపిటలిజమే. గట్టిగా డబాయిస్తే మోనాపలీ కేపిట లిజం (ఎవరి సుకుమార హృదయమైనా గాయపడు తుందంటే ప్లేటు మార్చి అతి పెద్ద ప్రజాస్వామ్యాలని ముద్దుగా పిలుద్దాం) అక్కడా ఇక్కడా బిగ్‌ బిజినెస్‌ ప్రయోజనాలకే మీడియా మంచి వాచ్‌డాగ్‌లా కాపలా కాస్తుంది. మనకేం అభ్యంతరం లేదు. నోమ్‌ ఛామ్‌స్కీలాటి వెర్రివాళ్ళ కుంటే మనకేం సంబంధమూ లేదు. మరి ఆ రొంపి నుంచి ‘పంచ్‌’ మాగజైన్‌లూ ఒకనాటి స్టార్‌ కార్టూనిస్టులు ఎలా వచ్చారు? అమెరికన్‌ పత్రికల్లో ఆలిఫెంట్‌ లాంటి ప్రతిభావంతులు, హిర్స్‌ఫెల్ట్‌లాంటి జైంట్‌లు ఎలా మొలిచారు? ‘మాడ్‌’ మాగజైన్‌ ‘డర్టీ డజన్‌’ కంటే ఎక్కువ మందినే ఎలా మాన్యుఫేక్చర్‌ చేసింది?

ఇక డిస్నీ యానిమేషన్‌లకి ప్రాణం పోసిన యానిమేటర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ‘న్యూయార్కర్‌’ నుంచి జేమ్స్‌ థర్టర్‌ లాంటి గొప్ప రచయిత కమ్‌ కార్టూనిస్టు ఎలా పుట్టాడు? మన మీడియా ఇలా ఎవర్నీ కనలేక కనీసం నెప్పులూ పడలేక కిక్కురు మనకుండా ఎందుకుంది? డేవిడ్‌లోకి నకలుగా ఆర్‌.కె. లక్ష్మణ్‌ పుట్టిన కాలాన్ని అర్థం చేసుకోవచ్చు. సుధీర్‌ తైలాంగ్‌లాంటి అనేక కుక్కమూతి పిందెల్ని మన జర్నలిజం జామచెట్టు ఎలా కాసింది?

ఇవి పేద్ద యక్షప్రశ్నలూకావు, భేతాళ ప్రశ్నలూ కావు అని పించొచ్చు. కానీ నాకైతే ఒక్క సమాధానమూ తెలీదు. కారణం అంతగా చదూకోలేదు. పైగా బొమ్మలేసే వృత్తి. కనుక బాగా చదువుకున్న, లోతైన అధ్యయనం గల మేధావులెవరేనా విషయం వివరిస్తే ఎంతో సంతోషిస్తా.

మీకు తెలిసి కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే నా తల వెయ్యివక్కలవుతుంది.