“శ్రీ గురుభ్యోన్నమః” నాటకీయంగా అంటూ ఇంట్లోకి వచ్చాడు భాస్కర్.
“సమస్త సన్మంగళాని భవంతు” అని ఉషశ్రీ ఫక్కీలో అతన్ని ఆశీర్వదించాను.
భాస్కర్ మా అల్లుడు శరత్‌కన్నా నాలుగయిదేళ్ళు పెద్ద. మా ఎపార్ట్‌మెంట్ కాంప్లెక్సులోనే వుంటాడు. నేనేం చెప్పినా, “పెద్దల మాట” అనుకుంటూ వింటూంటాడనుకుంటాను. ఒంటరిగా వుండే నాకు అతను అప్పుడప్పుడూ రావడం మంచి కాలక్షేపాన్ని కలుగజేస్తుంది. ఆ రోజు ఎందుకో మూడీగా వున్నాడనిపించింది.
“ఏమిటయ్యా అలా వున్నావ్?” అడిగాను.
“భార్యా రూపవతీ శత్రుః అని పెద్దవాళ్ళు నా గూర్చే అన్నారనిపిస్తుందండీ” అన్నాడు.
భాస్కర్ భార్య అందంగా వుంటుంది. వయసు ఆమె అందాన్ని ఇనుమడింప జేసిందనే చెప్పుకోవచ్చు. ఆమె ఎదురుగా వస్తుంటే చూపులు తిప్పుకోవడం కొంచెం కష్టం, నా వయసు వాడిక్కూడా. పధ్ధెనిమిదేళ్ళ కూతురు పక్కన ఆమె నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్ళనుకుంటారు తెలియని వాళ్ళు.
“ఇవాళ్ళ ప్రత్యేకంగా ఏమయింది?”
“ఇంటి సందులోకి తిరిగి, నడిచి వస్తుంటే పట్టుమని పదిహేనేళ్ళు కూడా లేని మగపిల్లలు – జులాయి వెధవలు – మాట్లాడుకుంటున్నారు. ఇవాళ్ళ ఆంటీ ఏం జాకెట్టేసిందిరా! ఆ వీపు మీద సెవెంటీ ఎమ్మెం సినిమా వెయ్యొచ్చు అని ఒకడంటే, రెండోవాడు, సరేలే, మొన్నీమధ్య వేసిన జాకెట్టయితే, ముందునించీ చూసేను, గుండెలదర కొట్టేసిందీ అంటున్నాడు. వాళ్ళకి నేను ఆ ఆంటీ మొగుణ్ణని తెలిసి వుండే అలా అన్నారని నా నమ్మకం. మామూలుగా అయితే సందులో ఎప్పుడూ నడిచే అలవాటు లేదు కాబట్టి, అలాంటి వ్యాఖ్యానాలు నా దాకా రాలేదు. ఇవాళ్ళ కారు రిపేరుకివ్వడం, సందులో నడిచి రావడం వల్ల ఆ మాటలు నా చెవినపడ్డాయి. రోజూ వాళ్ళేకాక ఇంకా ఎంతమంది ఇలా మాట్లాడుకుంటారోనని అనుకుంటే గుండె బద్దలవుతోంది. ఆ సినిమావాళ్ళు వేసుకునేలాంటి జాకెట్లు నీకొద్దే అంటే వినదు. ఆఖరికి పూజలు వ్రతాలు జరుగుతున్న చోట్లక్కూడా వేసుకొస్తుంది.” అన్నాడు.
రోజూ బాల్కనీలో గంటలు గంటలు కూర్చుంటాను కాబట్టీ, అక్కణ్ణించీ నాకు సందు చివరిదాకా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టీ ఆ ఆంటీ అతని భార్యే అని నాకూ తెలుసు. మరీ మరీ చూడాలనిపించే ఆ చెంపకు చేరడేసి కళ్ళు. నవ్వితే సొట్టపడే బుగ్గలు. పెదవులమీద మొదలై కళ్ళల్లో ప్రతిఫలిస్తూ నవ్వుకే నిర్వచన మనిపించే ఆ పెదవుల వంపు. భార్య అందం రోజురోజుకీ ఇనుమడిస్తుంటే ఇతనికి తనమీద తనకి నమ్మకం తగ్గిపోతున్నట్లనిపిస్తుంది. వాళ్ళిక్కడికొచ్చిన అయిదారేళ్ళల్లో భార్యని తనతో సినిమాలకి గానీ షికార్లకి గానీ తీసుకుని వెళ్ళగా నేను చూడలేదు. ఎవరో బాగా దగ్గరి బంధువుల యిళ్ళల్లో జరిగే శుభకార్యాలకి తప్ప ఇద్దరూ కలిసి వెళ్ళింది లేదు – అదికూడా వున్న ఊళ్ళో అయితేనే! ఆఫీసర్ సెలవివ్వట్లేదనో, పిల్లల చదువులు పాడైపోతాయనో ఎప్పుడూ ఏవో కుంటిసాకులు నాకు చెబుతూనే వుంటాడు. నా అభిప్రాయమల్లా ఆమె అందం ఇతగాణ్ణి భయపెడుతోందని.
ఆమె లోకట్ బ్లవుజులు వేసుకునే మాట నిజమే. అయితే, మరీ సీత్రూ పైటని ఒకే పొరగా ఛాతీమీద వున్నట్టా లేనట్టా కనుక్కొమ్మన్నట్టుగా ఛాలెంజ్ చేస్తూ చాలామంది ఆడవాళ్ళు వేస్తున్న ఈ రోజుల్లో కూడా ఆమె రెండుమూడు పొరలుగా పైటని వేస్తోంది. దానికి భర్తగా అతనానందపడలేకపోతున్నాడు. ఆఫీసు పని అని చెప్పి ఏ రోజూ చీకటి పడేముందు ఇంటికి చేరింది లేదు. ఆదివారం నాడు తీరిక దొరికితే నాదగ్గరకి వచ్చి కూర్చుంటాడు. ఇంట్లో పన్లేం లేవా? అని పరోక్షంగా అడిగితే వాళ్ళావిడ టీవీ చూస్తోందనో, లేక ఆవిడతో బాటు గుడికి వెళ్ళడం ఇష్టంలేదనో చెబుతాడు. అతని వయసు స్నేహితులు గానీ కొలీగ్స్ కానీ అతనింటికి రాగా నేను చూసిన గుర్తు లేదు. పాపం ఆవిడకి ఎపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా కూర్చోవడానికి చికాకు పుట్టి అప్పుడప్పుడూ కొడుకునో కూతుర్నో తీసుకుని కొద్ది దూరం నడిచి రావడమో లేక పక్కింటావిణ్ణి తీసుకుని గుడికి వెళ్ళి రావడమో చేస్తూంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు కొంచెమయినా అలంకరించుకోరూ?
అతను ఉదహరించిన సామెత వినగానే నాకు క్రితం అమెరికా ట్రిప్పులో ఎదురయిన అనుభవం అతనికి చెబితే లాభం వుంటుందనిపించింది. ఇప్పటిదాకా ఎవరికీ చెప్పవలసిన అవసరం రాలేదు – రిటైరయిన ఒంటరిగాణ్ణి, నన్ను పట్టించుకునే వాళ్ళెందరున్నారు గనుక! సమయానుసారంగా కొంత కలిపి మరీ చెప్పాల్సిన అవసరం నాకు కనిపించింది.
“క్రితంసారి మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళొచ్చిన తరువాత అక్కడ నాకెదురైన అనుభవాలని నీతో పంచుకోవడానికి నువ్వు ఒక నెలపాటు ఊళ్ళో లేవు. ఆ తరువాత నీకు చెప్పడానికి నాకు గుర్తు లేదు. ఇప్పుడు సమయం వచ్చింది గనుక చెబుతున్నాను విను. మొత్తం మూణ్ణెల్ల గూర్చీ చెప్పన్లే, భయపడకు!” అంటూ మొదలుపెట్టాను.
“తాతయ్యా, మేం తెలుగు నేర్చుకుంటున్నాం” అన్నది పన్నెండేళ్ళ యామిని నన్ను వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుంటున్నప్పుడు.
“నేను కూడా” వంతపాడాడు పదేళ్ళ యశ్వంత్.
“‘వుయ్ ఆర్ లెర్నింగ్ టెలుగూ,’ అని మీరు అనలేదంటేనే ఎంత తెలుగు వచ్చేసిందో వెంఠనే అర్థమైపోయింది,” అన్నాను ఇద్దరినీ అక్కున చేర్చుకుని.
“ఎప్పటినించీ?” అనడిగాను.
“మీరు క్రితం ఏడాది ఇండియా తిరిగి వెళ్ళినప్పటినించీ,” అన్నది మా అమ్మాయి.
“మరి ఈ పదినెల్లపాటూ ఫోన్లో ఒక్కసారయినా చెప్పలేదేం?” అనడిగాను. నన్ను తెలిసినవాళ్ళు, పిల్లలని చూసిన దానికంటే వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారన్న విషయానికే ఎక్కువ సంతోషం పొందాననుకునేవాళ్ళు.
“మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఇలా దాచి వుంచారు,” అన్నాడు మా అల్లుడు శరత్.
“మేమిప్పుడు తెలుగు చదవగలం కూడా తాతయ్యా!” అన్నాడు యశ్వంత్.
ఇన్నిసార్లు అమెరికా వచ్చినా, వచ్చిన ప్రతీసారీ వాళ్ళని తెలుగులో మాట్లాడమని బ్రతిమిలాడితే ‘నో’ అన్నవాళ్ళు ఇప్పుడు అడగకుండానే ఇంతగా మారారా! ఎలా సాధ్యం?
“ఇక్కడ మాకు తెలిసిన ఒకాయన ప్రతి ఆదివారం తెలుగు క్లాసులు నడుపుతున్నారు. వాళ్ళమ్మాయి, ఇదీ మంచి స్నేహితులు. వాళ్ళు మాకు ఫామిలీ ఫ్రెండ్స్ కూడా. దానితోబాటు వీడూ వెడతానన్నాడు. వీళ్ళతోబాటు ఇంకో పదిమంది వుంటారు,” చెప్పింది మా అమ్మాయి.
ఇంటికి చేరిన తరువాత వాళ్ళు నాకు వాళ్ళ తెలుగు పుస్తకాలు చూపించారు. అక్షరాలమీద వేళ్ళుపెట్టి కూడబలుక్కుంటున్నట్టుగా యశ్వంత్ చదివితే, యామిని అంతకన్నా చాలా వేగంగా చదివింది. మరునాడు ఆదివారం కావడంతో వాళ్ళతోబాటు నేను కూడా ఆ తెలుగు క్లాసుకి వెళ్ళాను.
“మీరు వస్తున్నారని వీళ్ళు ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో వున్నారు. మీకు తెలుగంటే చాలా యిష్టమనీ, కవితలూ పద్యాలూ రాస్తారనీ చెప్పారు. మీ ముందు పాఠం చెప్పేటప్పుడు తప్పులేమయినా దొర్లితే క్షమించాలి,” అన్నాడు టీచర్ రఘురాం.
“ఏమయినా తప్పులున్నా పిల్లలముందు చెప్పను. మీరు సాఫ్ట్‌వేర్ వుద్యోగం చేస్తూ ఇలా మాతృభాష మీద మమకారంతో మీ సమయాన్ని వెచ్చించల్లా ఈ పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నందుకు నా అభివందనాలు,” అన్నాను.
ఆరోజు రఘురాం తెలుగులో సామెతల గూర్చి పాఠం చెప్పాడు.
“సామెతలంటే ప్రావెర్బ్స్ అన్నమాట. ఇవి, ఎన్నో వేల ఏళ్ళుగా తెలుగువాళ్ళు వాళ్ళ జీవితంలో నేర్చుకున్న పాఠాలని గుర్తుండేలా క్లుప్తంగా – అంటే కన్సైజ్‌గా – చిన్న చిన్న వాక్యాలల్లో చెప్పినవన్నమాట. ఉదాహరణకి, ‘ఇంటిదొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు’ అన్న సామెతని తీసుకోండి. దీనికెవరైనా అర్థం చెప్పగలరా?”
“ఈవెన్ ఈశ్వర్ కాంట్ కాచ్ హోం థీఫ్,” అన్నది యామిని. నేనే కాక రఘురాం కూడా కష్టపడ్డాడు నవ్వు నాపుకోవడానికి.
“నో. ఐ కెన్,” అన్నాడు ఒక కుర్రాడు. వాడి పేరు ఈశ్వర్ అని తెలిసింది. వాడు యామినికంటే రెండు మూడేళ్ళు పెద్దవాడయి వుండాలనిపించింది. కావాలనే చిలిపిగా అలా అన్నాడనుకుంటాను. ఆ పిల్లవాడి తెలుగు కూడా అద్భుతంగా ఉంది.