పొరుగు తెలుగు

తెలుగుజాతి చర్రితను నిండుగా తెలుసుకోవాలి అంటే, ముందుగా మొత్తం తెలుగునేల ఏదో ఎరుక పరచుకోవాలి. వక్కణాన (ఉత్తరం) విందెమల (వింధ్య పర్వతం), తెక్కణాన (దక్షిణం) వానమామల (కన్యాకుమారికి 30 కి.మీ. పైన ఉంటుంది), పడమర పడమటి కనుమలు, తూరుపున వంగకడలి ఇవీ నిండయిన తెలుగు నేల ఎల్లలు. వేల ఏళ్ళ తెలుగుజాతి చరిత్రలో తెలుగు వాళ్ళంతా ఒకే ఏలుబడి కింద ఏనాడూ లేరు. అట్లా ఉండడం వీలుకాని పని. ఎందుకంటే తమిళులలాగానో కన్నడిగులలాగానో ఒడియావారిలాగానో చిన్న గుంపు కాదు తెలుగువాళ్ళది.

మొత్తం 18 కోట్లమంది తెలుగువారిలో సగంమందే ఇప్పటి ఆంధ్ర ప్రదేశంలో ఉన్నారు. మిగిలిన సగంమంది ఆంధ్ర ప్రదేశానికి బయట ఉన్నారు. ఆంధ్రప్రదేశం తరువాత తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న తావు ఇప్పటి తమిళ నాడు. అక్కడ 42 నూర్పాలు (శాతం) మంది ఉన్నారు. ఇప్పటి కర్నాటకలో 33 నూర్పాలు, ఇప్పటి మహారాష్ట్రలో 16 నూర్పాలు, ఇప్పటి ఒడిశాలో 22 నూర్పాలు ఉన్నారు. ఇప్పటి చత్తీసుగడ్‌లోని పాత బస్తరు అంతా తెలుగే ఎక్కువ. పై తావుల పేర్లన్నింటి ముందూ ‘ఇప్పటి’ అనే మాటను ఎందుకు వాడినానంటే ఈ ఎల్లలు నిన్న మొన్న ఏర్పడినవి కాబట్టి. నుడుల పేరుతో నాడులు ఏర్పడడం తెలుగువాళ్ళకు పెద్ద దెబ్బ. తెలుగువాళ్ళు ఇప్పటి ఆంద్రదేశంలోనే ఉండి తరువాత తరువాత మిగిలిన చోట్లకు వలస పోయినారు అనేది తప్పుమాట. తొల్లి నుండీ పైన చెప్పిన ఎల్లల నడుమ తెలుగు పరచుకొని ఉంది.

తెలుగుజాతి ఎంత పెద్దది అంటే, 24 ద్రావిడ నుడులు మాట్లాడే వారు 32 కోట్ల మంది ఉంటే అందులో ఒక్క తెలుగు వాళ్ళ లెక్కే 18 కోట్లు. ఎందుకనో తెలుగువాళ్ళకు మొదటి నుంచీ తమ గొప్పను చాటుకోవడం తెలియదు. ఇండియాలో హిందీ పెద్ద నుడి అనీ హిందీ తరువాతి తావు తెలుగుదేననీ ఎందరో పెద్దలు రాసేస్తుంటారు. జనాభా లెక్కలను బట్టి చూస్తే ఇండియాలో హిందీ తరువాత పెద్ద నుడి వంగనుడి. మూడవ వరుసలో తెలుగు ఉంటుంది. కానీ దొరతనపు (Government) లెక్కలలో నెల్లుపొల్లులు ఎంత? మచ్చుకు తమిళనాడునే తీసుకొంటే తమిళనాడులో 42 నూర్పాలు తెలుగు వాళ్ళున్నారు, కానీ లెక్కలలో చూస్తే 5 నూర్పాలుగానే కనిపిస్తారు. కర్నాటక లోనూ అంతే. నుడుల పేరుతో నాడుల ఏర్పడిన తరువాత ఈ అరవయ్యేళ్ళ కాలంలో ఆయా నుడుల వారు తమతమ నుడుల లెక్కను పెంచేసి, తెలుగును తగ్గించేసినారు. అట్లాగే 47 నుడు లను మింగేసి హిందీ పేరుతో ఒక ఏలి (Artificial) నుడి వక్కణాన చెలరేగిపోయింది. బ్రజ్‌, కడీబోలీలను మట్టుకే హిందీగా లెక్కిస్తే ఆ రెండు నుడులనూ తల్లి నుడిగా కలిగినవారు పన్నెండు కోట్లకు మించరు. ఈ నిజాలను నిగ్గు తేల్చి చూస్తే ఇండియాలో తెలుగే పెద్ద నుడి. తెలుగువాళ్ళం ఈ నిజాన్ని బాగా చాటాలి. 18 కోట్ల మందికి తల్లి నుడి అయిన తెలుగు ప్రపంచ నుడులలో ఎన్నో వరుసలో ఉందో కూడా లెక్కలు వేసి చాటాలి.

తెలుగంటే ప్రేమతో ఆ భాష లోతుల్లోకి వెళ్తే ఎన్నో గొప్ప విషయాలు తోచాయి. కన్యాకుమారి నుంచి వింధ్య పర్వతాల దాకా తెలుగువారు అసంఖ్యాకం. అందుకే పార్లమెంటులో హిందీని జాతీయభాషగా చేయడంపై చర్చ జరిగినప్పుడు, ఇంత అఖండమైన దేశానికి కొద్దిమంది మాత్రమే మాట్లాడుకునే భాషని జాతీయభాషగా గుర్తించడం పట్ల వ్యతిరేకత వచ్చింది. దానికి బదులు ఉత్తరాదికీ దక్షిణాదికీ అనుసంధాన భాషగా తెలుగును గుర్తించాలన్న వాదనను అన్నాదురై వంటి తమిళ నాయకులు సైతం బలపరిచారు.

తెలుగువాళ్ళకు మొదటి నుండీ వలస మీద మక్కువ ఎక్కువ. ప్రపంచంలో కొద్ది జాతులలో మట్టుకే ఈ ఎసలు (స్వభావం) ఉంటుంది. ఇండియా మొత్తంమీద ఇప్పటికే దిమ్మరి తెగలు (Nomads) గా ఉన్న వారిని గమనిస్తే, మొత్తం తెగలలో సగానికి పైగా తెలుగు తెగలే ఉన్నాయి. తెలుగువారు మనం ఊహించలేని మారుమూలల్లో ఉనికి నిలబెట్టుకుంటున్నారు. ఉదాహరణకు శ్రీలంకలో నివసించే నాలుగు మూల జాతుల్లో మూడు తెలుగువారివే. వారు అహికూటిక (పాములు పట్టేవాళ్ళు), రామకూడూరు (కోతులనాడిరచేవారు), వాగై (సోది చెప్పుకునేవారు). అంతదాకా ఎందుకు శ్రీలంకని పాలించిన చివరి రాజు తెలుగువాడే. ఆంగ్లేయులని ఎదిరించినందుకు ఆయన్ని బంధించి వేలూరుకి తరలించారు. ఇప్పటికీ ఆయన సమాధిని అక్కడ చూడవచ్చు – తమిళ ఫలకంతో! ఆయన వారసులు చిత్తూరు దగ్గరలో ఉంటున్నారు.

రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రలలో తిరుగుతుండే బైరూపులు, ఉచల్యా, గీర్‌ నెవడార్‌, వడార్‌, వార్‌వార్‌, మందుల వార్‌, చిన్నదేవర్‌, మశన్‌ జోగి వంటి తెగలన్నీ తెలుగువే. కర్నాటకలోని చెన్నదాసరి, దొంబి దాసరి, విబూది వేషగాళ్ళు, కొండ మామలు, దురగ మురిగి, ఉరుమారెమ్మ మున్నగు తెగల వాళ్ళందరూ తెలుగువారే. తమిళనాడులో ఆండి పండారం, ఉప్పాండి, పప్పాండి, ఉంగరాలాండి, మలక జంగాలు, పచ్చ జంగాలు, జంగమ పండారం, కుడుకుడుపోళ్ళు, అళగర్‌ మాట్టు కారర్‌, నాళి మణిక్కారర్‌, రామ కుళువర్‌, నాగకుళువర్‌, పచ్చ కొరస, తల్లి కొరస, లండోళ్ళు, వంటి నలబయి పైచిలుకు దిమ్మరి తెగలున్నాయి. దిమ్మరి తెగలలో పరిసరాల ఎరుకువ (విజ్ఞానం) ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క తెగలోనూ అరుదయిన తెలుగు మాటలు నూర్ల కొద్దీ దొరుకుతాయి. వీటన్నిటినీ సేకరించగలిగితే ఇప్పటివరకూ తెలుగులోకి రాని వేల తెలుగు మాటలను బయట పెట్టవచ్చు. మచ్చుకు ‘విబూది వేషగాళ్ళు’ అనే తెగవాళ్ళ దగ్గర నేను సేకరించిన వాటిలో కొన్ని మాటలను చూడండి.

విబూది వేషగాళ్ళ మాట – మన మాట

1) ఈకినగాడు – మాలవాడు
2) కీనగాడు – మాదిగవాడు
3) ఎలకోడు – రెడ్డి
4) కడ్డిగాడు – ఈడిగ
5) కెందలగాడు – చాకలి
6) కొరగాడు – మంగలి
7) గొంటగాడు – కోమటి
8) జిడ్డగాడు – కురుబ
9) తాటిగాడు – బ్రాహ్మణుడు
10) బార్తిగాడు – ఒడ్డెర
11) మొబ్బగాడు – వాల్మీకి/బోయ
12) కారిగాడు – బుడగ జంగమ
13) కుమ్మిగాడు – కుమ్మరి
14) కుచ్చుగాడు – పోలీసు
15) దారిగాడు – ముస్లిం
16) బిడంగాడు – దొమ్మరి
17) మక్కడిగాడు – లంబాడి
18) ఒల్తుగాడు – యాచకుడు
19) కంచికదారి – దనవంతుడు
20) కంకదారి – వైద్యుడు
21) మిడసడు – దొంగ
22) నెట్టగాడు – దొర
23) బీరుగాడు – మార్వాడీ
24) మట్టగాడు – ఊరిదేవుడు
25) ముత్తడు – దేవుడు
26) సిర్పగాడు – అబ్బాయి
27) సిర్పకోటి – అమ్మాయి
28) కొక్కడిగాడు – కోడి
29) కైక – కుక్క
30) కాసిగం – పిల్లి
31) ఉన్నసిగాడు – ఎలుక
32) కాజలు – చేపలు
33) తోడిసిగాడు – ఉడుత
34) కురుంగాడు – తాబేలు
35) నర్సిగాడు – నక్క
36) మండిగాడు – పంది
37) మీటాంగాడు – తేలు
38) వలెంగాడు – ఉడుము
39) సెవులపోతు – కుందేలు
40) పుల్లంకొక్కడి – నీటికోడి
41) కొరగ – గువ్వ
42) గింజ – రూపాయి
43) గీటు – పావలా
44) తుక్కులు – పైసలు
45) నెట్టు – బంగారం
46) చిక్కనెట్టు – వెండి
47) సొణపం – నగ
48) కొంకణం – పురుషాంగం
49) పుచ్చం – యోని
50) బోగాటకం – సంబోగం

అట్లాగే కర్నాటకలోని బెల్గాం జిల్లాలోని పాములదిన్నె అనే పల్లెలో బేడ జంగాలు అనే తెగవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ‘బేడ’ అనే వాద్యాన్ని మోగిస్తూ తెలుగులో కతలను పాడుతుంటారు. వీళ్ళ దగ్గర 95 కతలు ఉన్నాయి. ఒక్కొక్క కతను ఒక రేయంతా చెపుతారు. వీటిలో చాలా కతలు ఇప్పటి ఆంధ్రదేశంలో లేవు. కుంబం చెన్నారెడ్డి కత, కలిచెళ్ళ నరసింహారెడ్డి కత, పినాయి పాపిరెడ్డి కత, ఈడిగోళ్ళ సత్తెమ్మ కత, ఎరికల మాచాళ కత, కమ్మ వారి పణితి కత, ఈడిగ దేవమ్మ కత, తెలుగు సత్తెమ్మ కత, బలుగూరి కొండయ్య కత వంటి అరుదయిన కతలను ఎన్నింటినో చెపుతారు వీళ్ళు.

తమిళనాడు వేలూరు జిల్లాలోని గంగాపురం అనే ఊరిలో ఆండిపండారం వాళ్ళు ఉన్నారు. తెరువాటలు ఆడేదాంట్లో పేరుపొందిన తెగ వీరు. వీరి దగ్గర ఇంకా 42 తెరువాటలు (యక్షగానాలు) బతికి ఉన్నాయి. ద్రౌపది పూర్వజన్మ అయిన నళాయణి తెరువాట వీరి దగ్గర మట్టుకే ఉన్న కళారూపం.

ఈ ఆండి పండారం తెగవారే కేరళలోనూ ఉన్నారు. అక్కడ కూడా వీరి ఇంటి నుడి తెలుగే. కేరళ సంప్రదాయ నృత్య రూపకాలు కతకళి, రామనాటం, క్రిష్ణనాటం. ఈ మూడు కళా రూపాలకూ మూలరూపం కూడియాటం. ఈ కూడియాటం కళా కారులు ఆండిపండారం వారే. అంటే కేరళలోని కతకళికి కూడా మూలం తెలుగువాళ్ళ కళే.

ఇంకొక కళారూపాన్ని గురించి కూడా మనం చెప్పుకోవాలి. అలెక్స్‌ హేలీ రాసిన రూట్స్‌ నవలను చదివితే మన వెంట్రుకలు నిక్కబొడుచుకొంటాయి కదా. అట్లాగే అనిపిస్తుంది ఈ పాటను విన్నప్పుడు కూడా. కావేరికి తెక్కణంగా ‘కంబళనాయకర్లు’ అనే తెలుగు కులం ఒకటుంది. వీళ్ళలో దేవరాట, సేవాట, తెమ్మాం గాట వంటి గొప్ప పల్లెకళలున్నాయి. ఇవన్నీ కాదుకానీ, వీళ్ళు పెళ్ళిళ్ళప్పుడు పాడుకొనే మంగళం పాట మట్టుకు ఎంతో అబ్బుర మయినది. ఆడవాళ్ళు కొందరు గుంపుగా కూచుని సుమారు గంటసేపు ఈ పాటను పాడుతారు. పాట మొత్తం వింటే మన ఒళ్ళు గగురుపొడుస్తుంది. సుమారు ఆరేడు వందల ఏళ్ళ నాడు తుంగబద్ర తీరం నుండి బయలుదేరి బళ్ళారి, కడప, చిత్తూరు, వేలూరు, సేలం, కరూరు జిల్లాల మీదుగా సాగి కావేరిని దాటి వచ్చి ఇప్పుడున్న తావులో వాళ్ళు ఎట్ల కుదురుకొన్నారో చెప్పే పాట అది. ఆ పాటలో తుంగబద్ర, కావేరి నదుల నడుమ జరిగిన ఒక పెద్ద వలస చరిత్ర ఉంది. ఆనాడు వాళ్ళు వచ్చిన దోవను గుర్తు పెట్టుకొని దానిని పాటగా మలిచి తరతరాలుగా పాడు కొంటున్నారు. ‘ఏనాటికయినా మన సీమకు పోవలెనయా…’ అంటా కళ్ళనీళ్ళు పెట్టుకొంటా ముగిస్తారు పాటను.

ఆంధ్రదేశంలో వినిపించని కమ్మవారి కులపురాణం ఇప్పటి తమిళనాడులో ఇంకా బతికే ఉంది. వీరణం అనే వాద్యాన్ని మోగిస్తూ బయినాండ్లు అనే కులం వారు 22 రాత్రులు కతను గానం చేస్తారు. కమ్మకులంలో సహగమనం చేసిన 200 మంది పేరంటాళ్ళ కతను గానం చేస్తూ తిరిగే పిచ్చికుంటి వారు కూడా ఉన్నారు.

ఇక మాదిగల కళారూపాలను గురించి చెప్పాలంటే ఒక పొత్తమే రాయాల్సి వస్తుంది. తమిళనాట మాదిగలు అందరూ తెలుగువారే. జిక్కాట, జింపలాట, పెద్దమేళం, చెక్కపుల్లలాట, రొమ్ముడోళ్ళు, కంసాళె కతలు, పలకలాట, ఉడుకాట…. ఇట్లా ఎన్నో కళలు మాదిగలవి.

శ్రీరామనవమి నుంచి ఏడు శుక్రవారాలు ఆడే లేపాక్షి రామాయణం యక్షగాన ప్రక్రియకే అత్యున్నతమయినది. హోసూరు తాలూకా ‘బేరిక’ అనే పల్లెలో ఆడుతారు దీనిని. ఏడు శుక్రవారాల ఆటలోనూ ఒక్క నుడుగు కూడా వచనం ఉండదు. మొత్తం పాటే. చివరి వారం ‘ఎదురు చప్పరం’ పేరుతో ఎదు రెదురుగా రెండు వేదికలను వేస్తారు. ఒక్కొక్క వేదికమీదా వానర, రక్కస సేన గుమిగూడి పోరును కళ్ళ ఎదుట నిలుపుతారు.

వేసవిలో తంజావూరు జిల్లా మేలటూరు, శాలియ మంగళం, తేపెరుమానల్లూరులలో జరిగే బాగవత మేళాలు, హోసూరు తాలూకాలోని అలసనత్తం యక్షగానం, నోక్కం కతలు, ఒంటిపులి కుందు, కూనపిల్లి ఆట, వీరకాశి, పడుకాశి, రోకలాట, కారవళ్ళి కొయ్యబొమ్మలాట, ఒడ్డెర్ల ఉడుక కతలు, ఒట్టకూత్తు… ఒకటా రెండా ఒక్క తమిళనాడులోనే నూటికి పై చిలుకు తెలుగు కళలున్నాయి. కర్నాటకలోనూ అంతే. బెంగుళూరు జిల్లా ఆనేకల్లు తాలూకాలో ‘మాయసంద్ర’ అనే పల్లె ఉంది. ఊరు ఉండేది కర్నాటకలో, ఊరిలోని జనమంతా తమిళులు, అయినా ఆ ఊర్లో దేసింగురాజు కేళికను తెలుగులోనే ఆడుతారు. ఒడిశా బరంపురం దగ్గర తెలుగు గొల్లవారి అంజాటను చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. మహారాష్ట్ర విదర్బ తావులో కోమట్ల కులపురాణం చెప్పే తెలుగు గోందళేలున్నారు.

అలాగే అక్కడి కళారూపాలను ఇక్కడికి తీసుకువచ్చి ప్రదర్శించాలి. పాపం అక్కడి కళాకారులకు తెలుగువారి మధ్య ఆడాలని కోరిక. మమ్మల్ని తిరప్తికి (తిరుపతి) తీసుకుపోయి ఆడించప్పా అని ఎంతో ఆశగా అడుగుతారు.

ఇవన్నీ, ఇంత తెలుగుతనమూ ఆంధ్ర దేశానికి బయటే ఉన్నాయి. మెల్లమెల్లగా ఇవన్నీ వేరే నుడుల వారి కళలుగా పేరు తెచ్చుకొంటున్నాయి. వీటన్నింటినీ మనవిగా చాటుకోవాలి. ఈ కళలను బతికించుకోవాలి. కనీసం రికార్డు చేసి పెట్టుకోవాలి. వందల తరాలుగా మన పెద్దలు కాపాడుకొంటూ వచ్చి మనకు అందించిన సొత్తును మనం మన తరువాతి తరాలకు అందించి తీరాలి. అట్లా జరగాలంటే ఆంధ్రదేశంలోని తెలుగువారు తాము ఉంటున్నది కేవలం రాజకీయపు గిరి మట్టుకే అని గుర్తించాలి. ఒక తెలుగు చిత్రపటాన్ని తయారు చేసుకొని, దానికి ప్రచారం తేవాలి. అప్పుడే పొరుగు తెలుగుకు కూడా గుర్తింపు వస్తుంది. 18 కోట్ల తెలుగుజాతి తలెత్తి నిలబడుతుంది.

[రచయిత ఈ వ్యాసాన్ని ఇంగ్లీషు, సంస్కృత పదాలు లేకుండా వీలయినంత వరకూ అచ్చ తెనుగు పదాలతో రాశారు. అందుకే ఎక్కడా గూటాలు కనపడవు. (ఉదా: తుంగబద్ర)]