మా తెలుగు మేష్టారు, నెహ్రూ గారూ

ఆరు సంవత్సరాల క్రితం మాతెలుగు మేష్టారు గరికపాటి మల్లావధాని గారి గురించి చెప్పాను, రాశాను. నాకు కాస్తో కూస్తో (కాస్త కాదు, కూస్తోనే సరైనదని ఇన్నేళ్ళ త రువాత తెలిసింది!), తెలుగు సాహిత్యం మీద అభిమానం ఇంకా మిగిలి వుండటానికి మా తెలుగు మేష్టారే కారణం.

మాతెలుగు మేష్టారు గరికపాటి మల్లావధాని గారు 1899 లో పుట్టారు. అంటే 1999 లో శతవార్షిక సభ చేసి ఉండాలి. నాకు తెలిసినంతవరకూ అల్లాటి దుర్బుద్ధి ఎవరికీ పుట్టలేదు. కనీసం ఆయన పనిచేసిన కాలేజీ తెలుగు శాఖ భవనంలో ఆయన బొమ్మైనా పెట్టినట్టులేదు. అసలు, ఆయన అక్కడ పనిచేసినట్టు, సుమారు 25 సంవత్సరాల పాటు ఎంతోమంది విద్యార్థులకి మాతృభాషాభిక్ష పెట్టినట్టూ, అక్కడ ఇప్పుడు గద్దెకెక్కిన వారికి తెలిసినట్టు కూడా లేదు. తెలిసిన కొద్దిమందీ కిమ్మనకుండా బెల్లం కొట్టిన రాళ్ళల్లా కూర్చోవడానికి అసలు కారణం ఇప్పుడు చెప్పుకోవలసిన అవసరమూ లేదు.

కొవ్వూరు సంస్కృత విద్యాలయంలో మేష్టారి చదువు. తరువాత ప్రఖ్య సీతారామశాస్త్రి, పురిఘళ్ళ సుబ్రహ్మణ్య శాస్త్రి, తాతా సుబ్బరాయశాస్త్రుల శుష్రూషలో సంస్కృత భాష సాహిత్యపు మెరుగులు నేర్చుకోవడం, కల్లూరి వెంకట్రామ శాస్త్రి, వజ్ఝల సీతారామ శాస్త్రుల దగ్గిర తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించడమూ! ఈ పై పండితులెవరికీ ఏ డిగ్రీలూ లేవు; మల్లావధానిగారికి ఏ డిగ్రీ రాలేదు. అప్పట్లో, వేలూరి శివరామశాస్త్రి గారి అష్టావధానాల ఆకర్షణలో పడి, తనూ అవధానాలు చెయ్యడం; ఇవన్నీ, ఆయన జీవితంలో వంతెనకింద పోయిన నీరులా మరుగున పడిపోయాయి.

1921 లో ఆయన చదువు మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరి గ్రామ గ్రామానికీ పోయి జాతీయగీతాలు రాసి, పాడి, బ్రిటీషువాడికి వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చి, జనాన్ని మేలుకొలిపారు! ఆయన అప్పుడు పాడిన జాతీయగీతాలు ఆనాటి కాంగ్రేసు పార్టి అచ్చువేసి అమ్ముకున్నదని వినికిడి.

స్వరాజ్యం వచ్చిన తరువాత కూడా, ఆయన ఒక్క పైసా సంపాదించుకో లేదు, రాజకీయబాధితుడి ముసుగు వేసుకొని! అటువంటి స్వఛ్చందసేవకులెంతోమంది కష్టపడ్డారుగనుకనే ఇవ్వాళ, మనం రాజకీయ స్వాతంత్య్రం అనుభవిస్తున్నాం. ఇప్పుడు, మన మంత్రులు, మాజీ బాపతు, తాజా బాపతు మంత్రులందరూ, నిరాఘాటంగా నల్ల బజారు బిలియనీర్లుగా మారిపోతూవుంటే, వెర్రి మొహాలు వేసుకోని చూస్తూ ఉన్నాం!

1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించారు, మా తెలుగు మేష్టారు! ఆయన జైలు కథ మీకు చెప్పితీరాలి.

కోర్టువారు ఆయన్ని, ఏలూరులో బ్రిటీషు జిల్లాజడ్జి గారి ముందు విచారణకి బోనెక్కించారు. అప్పుడు, ఆయన ఆశువుగా చెప్పిన పద్యం.

లేదుగదయ్య! మా నుడుల లేశమసత్యము సత్య బద్ధమౌ
వాదమె దోసమయ్యెడు నభాగ్యమిదే మనకబ్బె నింక నౌ
కాదననేల? మీ విహిత కార్యకలాపము దీర్పబూనుడా
మీదట దేవుడే గలడు మిమ్మును మమ్ము పరీక్షసేయగన్‌.

“మేము చెప్పేది కాస్త కూడా అబద్ధం కాదు. నిజం చెప్పడం అపరాధం అయ్యింది. ఇది మన దురదృష్టం. ఇక అవును, కాదు అనడం ఎందుకు? మీరు చెయ్యవలసిన పని, (అంటే నన్ను జైలులో పెట్టడం) మీరు చెయ్యండి. ఆపైన మిమ్మలినీ, మమ్మలిని పరీక్షచేసేందుకు దేవుడే ఉన్నాడు,” అని ఆయన చెప్పాడు. జైలు కెళ్ళాడు. (జైలులో స్నేహితులని కూడగట్టుకోని, అవధానాలు చెయ్యడం అభ్యసించారని చెపుతారు!)

పదేళ్ళ తరువాత, 1940 లో గాంధీ ప్రేరణతో, రెండవ ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా భారతదేశం అంతటా, సత్యాగ్రహోద్యమం మొదలయ్యింది. ఆ సత్యాగ్రహంలో మొట్టమొదటగా దేశద్రోహం అని నేరం ఆపాదించి వినోబా భావేని బ్రిటీషు ప్రభుత్వం జైల్లో పెట్టింది. తరువాత, గోరఖ్‌ పూర్‌ లో నెహ్రూ గారు సత్యాగ్రాహిగా మూడు ఉపన్యాసాలిచ్చారు, యుద్ధానికి వ్యతిరేకంగా! ఆ ఉపన్యాసాలు, “దేశద్రోహకరం,” అని గోరఖ్‌పూర్‌ జిల్లా కోర్టులో బ్రిటీషుప్రభుత్వం నెహ్రూమీద అభియోగం తెచ్చింది. గోరఖ్‌ పూర్‌ లో బ్రిటీషు జడ్జీ ముందు నెహ్రూగారు తనపై తెచ్చిన అభివాదంపై చేసిన ప్రకటన, సారాంశం సరిగ్గా పది సంవత్సరాలకి ముందు మా తెలుగు మేష్టారు ఏలూరు జడ్జీకి చెప్పిన పద్యంలాంటిదే! ఆ ప్రకటన సారాంశం ఇది.

నేను మీముందు ఒక వ్యక్తిగా, బ్రిటీషుప్రభుత్వానికి వ్యతిరేకిగా నిలబడి వున్నాను. మీరు (జడ్జీ గారిని ఉద్దేశించి) బ్రిటీషు ప్రభుత్వానికి ఒక ప్రతీక ( symbol ) ప్రస్తుతం నేనూ ఒక ప్రతీకనే. మొత్తం భారతజాతికి, వారి జాతీయతకీ ప్రతీకని. బ్రిటీషు సామ్రాజ్యంతో తెగతెంపులు చేసుకోని, స్వతంత్ర భారతంగా వేరవడానికి నిశ్చయించుకున్న వాడిని. ఇది నా ఒక్కడి కోరికా కాదు. భారతీయులందరూ ఏకగ్రీవంగా ఇదే వాంఛిస్తున్నారు. అంటే, నన్ను దోషిగా నిందించి శిక్ష వెయ్యడం కొన్ని కోట్ల భారతీయులని నిందించి శిక్ష వెయ్యడం అని అర్థం. అది, ఎంతో గొప్పదనుకుంటున్న మీ బ్రిటీషు ప్రభుత్వానికి ఏమంత తేలికైన పని కాదు. నెహ్రూగారు దేవుడి ప్రసక్తి తేలేదు. ప్రజల ప్రసక్తి తెచ్చారు. ప్రపంచన్యాయస్థానం దృష్టిలో బ్రిటీషు ప్రభుత్వమే నేరస్తుడిగా పరిగణించబబడుతుంది సుమా అని తీవ్రంగా హెచ్చరించాడు. ( Incidentally, Nehru’s statement at his trial was and still is one of the best prose pieces ever written in the English language! ) ప్రపంచ ప్రజలు, స్వాతంత్య్రంకోసం ఉవ్విళ్ళూరే ఎన్నో కోట్ల ప్రజలు, బ్రిటీషు ప్రభుత్వాన్ని fascist నిరంకుశ ప్రభుత్వంగా న్యాయవిచారణ చేసే రోజు వస్తుంది సుమా, అని మందలించాడు.

నెహ్రూ జైలు కథ, మా తెలుగు మేష్టారి (గరికపాటి మల్లావధాని గారు!) జైలు కథతో జోడించి ఎందుకు చెప్పానంటే, నిస్స్వార్థంగా, ప్రత్యేక కార్యసాధన గురిగా పెట్టుకొని పనిచేసే వాళ్ళందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు; ప్రవర్తిస్తారు, అని చెప్పడం కోసం.

ఇవాళ భారతదేశంలో, నెహ్రూలూ లేరు; మల్లావధానులూ లేరు. అది మన దురదృష్టం.

పి.యస్‌. మల్లావధాని మేష్టారికి శిక్ష వేసిన జడ్జీగారు, శిక్షవేసితరువాత, వారం రోజుల్లో హటాత్తుగా మరణించారు. అప్పట్లో, ఏలూరు ప్రజలు అనుకునే వారట మల్లావధానిగారు జడ్జీ గారిని శపించాడనీ అందుకే ఆయన వారం తిరక్కుండా గుటుక్కుమన్నాడనీ! ఏమో! ఏ పుట్టలో ఏపాముందో ఎవరికి తెలుసు! (నవంబరు 14 నెహ్రూ గారి పుట్టిన రోజు. భారత ప్రభుత్వం ఆ రోజు పిల్లల రోజుగా ప్రత్యేకించింది.)