తెలంగాణాంధ్రలలో ఎందరు తెలుగువారు ఉన్నారో ఇంకా అందరు తెలుగువారు ఆ ఎల్లలకు బయట ఉన్నారు. ఆ ఎల్లలకు లోపల తొమ్మిది, వెలుపల తొమ్మిది, మొత్తం పద్దెనిమిది కోట్ల తెలుగు ఎనము (జాతి) మనది. ఈమాట నిక్కమేనా? నమ్మవచ్చా? పదండి కొందరిని పలకరించి వద్దాం.
కొంగాపి (వైశాఖం) నెల, నిన్నాడుకు (పౌర్ణమి) ముందునాడు, మదరాసు నుండి పయనం మొదలిడినాను. మరునాడు రేయి శాలియ మంగళంలో తెలుగు బాగవతం ఆటను చూడడానికి. పేరేగిలో (బస్) సోరణం (కిటికి) పక్కనే ఇరవు (సీటు) దొరికింది. బయటంతా పత్తికాయలు పగిలినట్లు వెన్నెల. రయ్యిమని పరుగెత్తుతూ ఉంది పేరేగి.
నగరంలో కోయల మిట్ట దగ్గర బయలెక్కినాము కదా, గండిని గడచినాము, మీనంబాక చిట్లపాకలను దాటినాము, తాంబరంకు దరిదాపుల్లో ఉన్నాము. తాంబరాన్ని దాటుకొంటే నగరాన్ని వదిలేసినట్లే.
ఒక్క కుదుపు, పెద్ద కలకలం. గబగబ అందరమూ దిగినాము. పేరేగి ముందుగానుల (చక్రాలు) నడుమ ఒక ముగ్గాను (రిక్షా) నుజ్జునుజ్జయి పడి ఉంది. ఒక నడీడు ఆమె గుండెల్ని బాదుకొంటూ ఎలుగెత్తి తెలుగులో అరుస్తూ ఉంది. మెల్లగా పేరేగి కిందనుండి పాక్కుంటూ ఒకతను బయట పడినాడు. ఒంటిమీది గాయాలను కూడా పట్టించుకోకుండా, ఒక్క గెంతున ఆమె దగ్గరకు పోయినాడు. “ముయ్ లంజా, ముయ్ నోరు!” అంటూ ఆమె చెంపలమీద రెండు పీకినాడు.
జరిగినది ఏమిటంటే, పేరేగి తోలరి (డ్రైవరు) ఏమరుపాటున ముగ్గానును గుద్దేసినాడు. నడుపరి (కండక్టరు), ఆ ముగ్గాను అతనిని పిలిచి, అరవంలో బెదిరించి, ఏబై రూపాయల రేకును చేతిలో పెట్టి, ‘పోలాం పో రైట్!’ అని అరచినాడు. నాకు ఏమి చేయాలో తోచలేదు. నూర్రూపాయల రేకును తీసి పెద్దాయన చేతిలో పెడుతూ “ఆమెను కొట్టింది ఎందుకు?” అని అడిగినాను.
“తెలుగులో అరిసింది సారు, లంజముండ! దానికే వాడు ఏబైతో సరిపెట్టేసినాడు.”
గుండె కలుక్కుమనింది. పేరేగి కదిలింది. మీరు, అంటే తెలంగాణాంధ్రులవారు కలనైనా కనలేని తెలుగు నిలవరం ఇది.
ఇంకొక అరగంటకు కలవ చెరువు పక్కన పోతూ ఉన్నాం. చెంగలపట్టు పేటను ఆనుకొని ఉంటుంది కలవ చెరువు. అల అల మీదా కల్వరేడు పుట్టి చెరువునంతా మినమిన మెరిపిస్తున్నాడు. పేద్ద చెరువు అది. నిక్కంగానే, పెద్ద కాదు, పేద్ద చెరువు. మా దామన్న గురుతుకొచ్చినాడు. ‘చూడు బా, మా చెంగలపట్టుకు, చెన్ కళినీర్ పట్టు అని తమిళ్‌లో రాస్తా ఉండారు!’ అంటూ వెతపడినారు ఒకసారి. ఎర్రటి మురికినీళ్ళ పట్టు అట అది. చెంగలరాయడు అనే తెలుగు వెలమదొర పేరుమీదుగా పుట్టిన ఊరు అది, చివరికి మురికినీళ్ళ ఊరు అయింది. ఇదే మాటను ఒక ఆంధ్ర నేస్తుడితో అన్నాను. ‘చెంగలరాయడు అనకూడదు, చెంగల్వరాయుడు అనాలి. అంటే ఎర్రకలువ దొర అని’ అంటూ నన్ను దిద్దాలని చూసినాడు ఆ నేస్తం. నేను ఒప్పుకోకపోయినా అతను వినిపించుకోలేదు. మీరైనా వినిపించుకోవాలి కదా? చెంగలరాయడు అనేది సుబ్బారాయడికి మరొక పేరు. చెంగల అనేది ఒక తీరు గడ్డి. చెంగల గడ్డిలో పుట్టినవాడు చెంగలరాయడు.
చెంగలపట్టును దాటినాక నాకు కునుకు పట్టింది. పొద్దున తంజావూరులో దిగినాను. పేరేగిలు (బస్టాండు) లోనే కళ్ళూ పళ్ళూ ఒళ్ళూ కాళ్ళూ కడిగేసుకొన్నాను. అక్కడికి అరగంట పయనంలోని శాలియమంగళంకు చేరుకొన్నాను. నిలుకు (బస్టాపు) నుండి ఒక్క కిలోమీటరు లోపే అగ్రహారం. అగ్రహారాన్ని మేము మేల్గేరి అంటాము లెండి.
మేల్గేరిలో వడమ, వాతిమ, అష్టసహస్రం చీలకల తమిళ అయ్యవార్లు ఉంటారు. ఒకే ఒక్క ఇల్లు తెలుగువారు ఉంటారు. వాళ్ళు వేంగినాటి వైదికులు. నాలుగునూర్ల ఏండ్ల కిందట నాయకదొరల తరిలో (కాలంలో) మూడువంతులు తెలుగు వైదికులు, ఒక వంతు తమిళ వైదికులు బతికిన తావు ఇది. మొదట తెలుగువారే ఈ భాగవతాలను ఆడేవారు. తెలుగువారినుండి తమిళ వైదికులు ఈ కళను అందిపుచ్చుకొన్నారు. శాలియమంగళంలో మూడునాళ్ళు మూడు కతలను ఆడ్తారు. అందులో రెండవది అయిన ప్రహ్లాద చరిత్ర మట్టుకే తెలుగులో మిగిలి ఉంది. మిగిలిన రెండూ తమిళ భాగవతాలుగా మారిపోయినాయి.
ఇప్పటి తమిళనాడులో, ఒకప్పుడు జరిగిన పారులెదిరింపు ఎసవులో (ఉద్యమంలో), ఎక్కువగా దెబ్బతినింది తెలుగు పారులే (బ్రాహ్మణులే). ఊళ్ళకు ఊళ్ళు, ఇళ్ళకు ళళ్ళు వదిలేసి నగరాలకు వలసపోయింది తెలుగు వైదికులే. ఇప్పటికీ కావేరి ఒడ్డునున్న మేల్గేరులలో అంతో ఇంతో తమిళ పారులు ఉన్నారు కానీ, తెలుగువారిని వెతికివెతికి పట్టుకోవాలి.
శాలియమంగళం కంటే ఎక్కువగా గొప్పగా భాగవత కళను నిలబెట్టుకొన్న మెలట్టూరు కూడా అంతే. ఒకప్పుడు అది వెలనాటివారి మేల్గేరి. ఇప్పుడు అక్కడ ఉన్నది ఒకే ఒక వెలనాటి కుటుంబం. మిగిలినవారు అందరూ పడమలే. మెలట్టూరు కాపుగేరిలో ఉంటున్నది ఎక్కువగా కమ్మవారు.
మెలట్టూరులో తొమ్మిది కతలను తెలుగులో ఆడుతారు. తేపెరుమా నల్లూరులో కూడా ఇంకా భాగవతం నడుస్తూ ఉన్నది. తంజావూరికి చుట్టుపక్కల ఈ మూడు ఊర్లలో ఇంకా తెలుగు భాగవతాలను ఆడుతున్నారు. చూడ మంగళం, ఊటకాడు, పులిమిట్ట వంటి ఊర్లలో ఇదివరకు నడిచేవంట, ఇప్పుడు లేవు. ఇవన్నీ వైదికుల మేల్గేరులే. నాలుగైదు ఏండ్ల కిందట, మన్నారుగుడి అనే ఊరిలోని అయ్యంగార్లు, తెలుగు భాగవతాన్ని ఆడడం మొదలిడినారు. ‘మా ఆటకు నూర్లేండ్ల మెలన ఉండేది, నడుమన మరుగయింది అంతే!’ అంటున్నారు వాళ్ళు.
ఇవన్నీ చోళమండలంలో జరుగుతున్నవి. తెలుగును ఎక్కువగా పోగొట్టుకొన్నది చోళమండలం వాళ్ళే. నట్టనడి తమిళనాడులోని చోళమండలంలోకన్నా, కట్టకడన ఉండే పాండ్యమండలంలో తెలుగు బాగా నిలచి ఉంది. ఎందుకో తెలియదు, కాపు కులాలే కాదు బడుగు కులాలు కూడా తెలుగును వదిలేస్తున్నాయి చోళమండలాన.
భాగవతాలు చోళమండలంలోనే మిగిలి వున్నాయి. ఇప్పటి తమిళనాడులోని మిగిలిన మూడు తావులైన తొండ, కొంగు, పాండ్య మండలాల్లో భాగవతాలకు పాత పొడలైన తెరువాటలుగా ఉన్నాయి. తెలంగాణాంధ్రలలో యక్షగానాలు అంటారే, అవే ఇవి. ఇక్కడ కొన్ని తావులలో ఆట అంటారు, కొన్ని తావులలో తెరువాట అంటారు, కొన్ని తావులలో కేళిక అంటారు, కొన్ని తావులలో బయలాట అంటారు, కొన్ని తావులలో కుందు అంటారు.
నెల్లూరు, చిత్తూరులకు ఆనుకొని ఉండే తొండమండలంలో తెరువాటలు చాలాచోట్ల జరుగుతుంటాయి. జంగాలపల్లి, గంగాపురం, పెరుమాళ్ళపల్లి, దక్షిణ పాతపాళం వంటి వూర్లు పేరుకెక్కినవి. కొంగు మండలంలోని నానుగల్లులో సీతాకల్యాణం అనే భాగవతం నడుస్తూ ఉండేదంట. అట్లాగే ధర్మపురిలో వామనచరిత్రం అనే భాగవతం జరుగుతుండేదంట. ఇవి రెండూ నలబై ఏండ్ల కిందటనే నిలిచిపోయాయంట.
మరలా శాలియమంగళం దగ్గరకు పోదాం. ఆ రెయ్యి తమిళ వైదికులు ఆడిన భాగవతాన్ని అబ్బురపడి చూసినాను. తిరుగు పయనం అయినాను.
రెండేండ్ల కిందట ఇంకొక ఆంధ్ర నేస్తంతో కలిసి అదే చోళమండలంలోని మెలట్టూరుకు బయలుదేరినాను. ఇద్దరమూ తంజావూరులో పట్టేగి (రైలు) దిగినాము. చోళమండలాన తెలుగువాళ్ళు తక్కువ. ఉన్నవారు కూడా తెలుగుకు విరవిర ఎడమవుతున్నవారే. దిగుతూనే, పాత పేరేగిలుకు పోయే దారిని గురించి ఒకాయన్ని తెలుగులో అడిగినాను. అతను ఆ దోవను తమిళంలో విడమరచి చెప్పినాడు. నాకు తెలిసిన దారే, నేను బాగా ఎరిగిన తావే. బయటకు వచ్చి ఒక తానేగి (ఆటోరిక్షా) అతన్ని అదే అడిగినాను, తెలుగులోనే. అతను, ఏబై రూకలిస్తే ఎక్కించుకొనిపోయి వదులుతానన్నాడు. ఆ పక్కనే ఉన్న మరొక తానేగతను అక్కరలేదు, నడిచిపోతే దగ్గరే అని తెలుగులో మాటాడినాడు. వెంటనే నా నేస్తం, పలుకెన (ఫోన్) తెరచి దానిని దారి అడిగినాడు. అది చెప్పసాగింది. నేస్తం నాకు దారి చూపించసాగినాడు. కొంత దవ్వు నడిచినాక, ఒకతను వీరతాడుతో ఒళ్ళంతా నెత్తురు కారేటట్లు బాదుకొంటూ ఉంటే, అతని ఇల్లాలు గుయ్యిగుయ్యిమని ఉరుమును వాయిస్తూ ఉంది. వాళ్ళని సాట కొట్టేవాళ్ళు అంటాము. తెలుగువాళ్ళే. పలుకరించి దారిని అడిగితే తెలుగులో చెప్పినారు. మరికొంత దవ్వున తాళాలు బాగుచేస్తూ దారిపక్కన కూర్చునున్న ఇంకొకతను కనిపించినాడు. నా పలుకరింపూ అతని మారింపూ నడిచినాక, మీరు దొమ్మిదాసర్లా చెన్నదాసర్లా అని అడిగినాను. మేము దోవదాసర్లం దొరా అన్నాడు అతను. వీళ్ళనే రాయలసీమలో సమేదాసర్లు అంటారు. ఇంకొంత దవ్వున చెప్పులు కుడుతూ కనిపించినాడు మాదిగన్న. పలుకరింపుకే పులకరించి దగ్గరుండి దారి చూపించినాడు. అప్పటికి కానీ ఎరుకపడలేదు నా నేస్తానికి, ఆయన చేతిలోనిది ఉసురు కాదు ఉరువు అని.
తడబడి తడబడి కడనడకలు నడుస్తున్న చోళమండలపు తెలుగులో కూడా ఇంత పలుతనం (వైవిధ్యం) ఉంది. ఇప్పటి తమిళనాడు మొత్తం మీద నూటపది పల్లెకళలు ఉంటే, అందులో నూరు తెలుగువారివి.
దేవరాట, జిక్కాట, చెక్కపుల్లలాట, కోలాట, పూజాట, రోకలాట, కీలుగుర్రాలాట, మరుగాట, కొక్కిలికట్టె ఆట, మోడి ఆట, సామాట, బుర్రకత, జంగంకత, తందానకత, బయినికత, పిచ్చిగుంట్ల కత, నోక్కం కత, కూనపులి కత, తప్పాట, పలకలాట, పంబ కతలు, సిలములాట, పండరి బజన… కంచి, ఆరణి పట్టుచీరలు, సేలం పట్టుపంచెలు, తళుదాల కొయ్యబొమ్మలు, తంజావూరు సోవులు, కుంబకోణం కంచుబొమ్మలు, ఆలకొండ మట్టిబొమ్మలు, శివకాశి టపాకాయలు, బరతనాట్యంగా పేరు మార్చుకొన్న దాసియాట, సదిరాటలు, జల్లికట్టు, పొంగలి పండుగ, జాము కోడంగులు, పాముల్నాడించే నాగకుళువర్లు, కోతుల్నాడించే రామకుళువర్లు, వడ్ల పేర్లను కాపులకు గురుతుచేసే నాళిమణికారులు, వల్లకాటికి కావలి కాచే సిద్దనార్లు, తెరువాటల ఆండిపండారాలు, బలిజల్ని నమ్ముకొని బతికే ఉప్పాండి పప్పండి ఉంగరాలాండిలు…
ఈ వరుస అట్లా సాగిపోతూనే ఉంటుంది. ఇది ఇప్పటి తమిళనాడులోని తెలుగుదనం మట్టుకే. ఇంతకింతా ఇప్పటి కర్నాటకలో, ఇప్పటి మహారాష్ట్రలో, ఇప్పటి ఒడిశాలో, ఇంకా చాలా చోట్ల ఉంది. మనం వెతుక్కొంటే వెతుక్కొన్నంత, తవ్వుకొంటే తవ్వుకొన్నంత, కలుపుకొంటే కలుపుకొన్నంత.
పద్దెనిమిది కోట్ల తెలుగు ఎనము మనది. ఎన్ని నాడులలో ఉన్నా, ఎన్ని ఏలుబడుల కింద ఉన్నా, తెలుగువారంతా ఒక్కటే. చాటుకొంటే పోయేదేమీ లేదు, చేవలేనితనం తప్ప.