ఏ ఇంగ్లీషు మాటకైనా అర్థం తెలియకపోతే వెంటనే డిక్షనరీ చూసే అలవాటు మనలో చాలామందికి ఉంది. టెక్నాలజీ అభివృద్ధి చెందినకొద్దీ ఈ పని మరీ సులువు అయ్యింది. వర్డ్ ప్రాసెసర్‌లోనో లేక సెర్చ్ ఇంజన్‌లోనో మనకు అర్థం కావలసిన మాట టైపు చెయ్యగానే ఆ మాట అర్థం, పర్యాయపదాలు, ఇతర వివరాలు వెంటనే స్క్రీన్ మీద ప్రత్యక్షమౌతాయి.
ఇంగ్లీషు డిక్షనరీలు తరచు చూసేవారికి కూడా, తెలుగు పదానికి అర్థం తెలియకపోతే డిక్షనరీ కోసం వెతికే అలవాటు తక్కువ. దీనికి ముఖ్యకారణం మనకు తెలుగు డిక్షనరీలు (ఇక్కడే కాదు, ఇండియాలోనూ) అందుబాటులో లేకపోవటమే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలుగువారు ప్రముఖపాత్రలు పోషిస్తున్నా ఇంటర్నెట్‌లో తెలుగు మాత్రం ఉండవలసిన స్థాయికి ఇంకా చేరు కోలేదు. కొన్నాళ్ళ క్రితం వరకూ తెలుగుపదానికి అర్థం కావాలంటే, ఇంటర్నెట్ తెలుగు వేదికల మీద తెలిసినవారిని సంప్రదించవలసిందే కాని స్వయంగా వెంటనే వెతుక్కునే అవకాశం ఉండేది కాదు.
ఈ లోటు పూరించటానికి వాడపల్లి శేషతల్పశాయి, కాలెపు నాగ భూషణరావు అనే ఇద్దరు హైదరాబాదు యువకులు స్వచ్ఛందంగా సిద్ధపడ్డారు. తాము నిర్వహిస్తున్న ఆంధ్రభారతి అనే తెలుగు సాహిత్య ఖజానా వెబ్‌సైటులో వారు తెలుగుపదాలకు అర్థం తేలికగా వెతుక్కునే సదుపాయం కల్పించటానికి సంకల్పించారు. తెలుగుకు సంబంధించిన అన్ని నిఘంటువులనూ ఒక్కచోటకు తీసుకొనివచ్చి ఒక్క మౌస్‌క్లిక్కుతో అందరికీ అందుబాటు లో ఉంచాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. జర్మనీలో ఉండే పరుచూరి శ్రీనివాస్ వీరికి సహాయపడ్డారు.
అయితే ఇది చిన్నపనేమీ కాదు, బృహత్కార్యమనే అనాలి. ముందు నిఘంటువుల తాలూకు హక్కులు ఎవరిదగ్గర ఉన్నాయో తెలుసుకొని వారి అనుమతి పొందాలి. నిఘంటువులో ఉన్న ప్రతి మాటనూ మళ్ళీ యూనికోడ్‌లో టైపు చేయాలి. ఆ తర్వాత జాగ్రత్త గా ఒకటికి రెండుమార్లు ప్రూఫులు సరిదిద్దుకోవాలి. ఆ తరువాత ఆ పదాలను వెతుక్కునే సెర్చ్ ఇంజన్ కంప్యూటర్ ప్రోగ్రాం తయారుచేసుకోవాలి. వేగవంతమైన కంప్యూటర్ సర్వర్లను నియోగించాలి. అంతేకాక ఈ సదుపాయం వినియోగించుకోదలచిన వారందరికీ కంప్యూటర్లో తెలుగు టైపు చేసే నైపుణ్యము, సౌకర్యము ఉండకపోవచ్చు. అందుచేత ఆ పదాలను ఇంగ్లీషులో టైపు చేసినా, తెలుగులో టైపు చేసినా వెతకగలిగేట్లుగా కంప్యూటరును ప్రోగ్రాము చేయాలి.
నిజానికి ఇంత పనిని తలకెత్తుకోవాల్సినది ఔత్సాహికులు కాదు. ప్రభుత్వమో, అధికార భాషాసంఘమో, విశ్వవిద్యాలయాలో, అకాడెమీలో చేయవలసిన పని. అయితేనేం, ఆంధ్రభారతివారు తమ ఉత్సాహమే వనరుగా ఈ పనిని ప్రారంభించారు. వారికి చేయూతనివ్వటానికి తానా ప్రచురణల కమిటీ నిశ్చయించింది. తెలుగును సంరక్షించటం, వ్యాపింపచేయటం తానా ఆశయాలలో ముఖ్యమైంది. అందుచేత తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ప్రయత్నాన్ని ఆమోదించి ప్రోత్సహించింది. ఈ ప్రయత్నానికి ఆర్థికంగా చేయూతనివ్వమని కోరగానే తానా సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అవసరమైన నిధులను సమకూర్చారు. ఈ దాతలందరికి, ముఖ్యంగా కొడవళ్ళ హనుమంత రావుగారికి, తానా సంస్థ తరపున నా కృతజ్ఞతలు.
ఆంధ్రభారతి-తానాల సహకారం వల్ల ఈరోజు తెలుగు మాటలకు అర్థాల్ని ఇంటర్నెట్‌లో వెదుక్కోవడం సులభ సాధ్య మయ్యింది. ఆంధ్రభారతి సైటుకు వెళ్తే (లేకపోతే సైటులో నిఘంటు శోధన పై క్లిక్ చేస్తే) మీరు ఏ తెలుగుమాటకైనా అర్థం తెలుసుకునే వీలున్నది. మీ వీలునిబట్టి మీకు కావలసిన మాటను ఇంగ్లీషులో కాని తెలుగులో కాని టైపు చేస్తే చాలు.
తెలుగు మాటకు తెలుగు అర్థం, తెలుగు మాటకు ఇంగ్లీషులో అర్థం, ఇంగ్లీషు మాటకు తెలుగు అర్థం, ఉర్దూ మాటకు తెలుగు అర్థం ఇప్పుడు సులభంగా వెతుక్కోవచ్చు. శంకరనారాయణ, బ్రౌన్ తెలుగు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీలతో పాటు, ఉర్దూ-తెలుగు నిఘంటువు, రవ్వా శ్రీహరి నిఘంటువు, బూదరాజు రాధాకృష్ణ ఆధునిక వ్యవహారకోశం – మొత్తం ఎనిమిది డిక్షనరీలలో ఒక్కసారే అర్థాలు, పర్యాయపదాలు ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటికి ఈ సైటులో 8,250 డిక్షనరీ పేజీలు టైపుచేసి అందుబాటులోకి తెచ్చారు.
ఇదే మనకు గొప్పగా అనిపిస్తూ, ఉపయోగపడుతూ ఉన్నా, ఇప్పటివరకు చేసినది సంకల్పించిన ప్రయత్నంలో చిన్న భాగమే. ఇంకా ఏడు మాండలిక పదకోశాలు, మరో రెండు పర్యాయపద నిఘంటువులు టైపు చేయటం, ప్రూఫులు దిద్దడం పూర్తయ్యింది. ఏప్రిల్ నెలలో ఈ తొమ్మిది నిఘంటువులు (2,406 పేజీలు) కూడా ఇంటర్నెట్‌కి అప్‌లోడ్ చేయబడతాయి. ఇవి కాక ఇంకో 17 నిఘంటువులు (మొత్తం 34 వాల్యూములు, 17,835 పేజీలు) టైపు చేయటం అయిపోయింది. వీటన్నిటినీ జాగ్రత్తగా ప్రూఫులు దిద్దాక ఇంటర్నెట్‌లో అందుబాటులోకి వస్తాయి. తరువాత దశలో ఇంకో 37 నిఘంటువులు (55 వాల్యూములు, 25,407 పేజీలు) చేర్చబడతాయి. అంటే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి కనీసం 71 నిఘంటువులు (53,898 పేజీలు) ఇక్కడ అందు బాటులో ఉంటాయన్నమాట.
ఈ నిఘంటువుల్లో ప్రామాణిక సాంప్రదాయ నిఘంటువు లతో పాటు, మాండలిక పదకోశాలు, వివిధ వృత్తుల పారిభాషిక పదాల, పర్యాయ పదాల నిఘంటువులు కూడా ఉన్నాయి. వీటికి తోడు, ఇంగ్లీషు, సంస్కృత, ఉర్దూ పదాలు, పురాణాల్లో వచ్చే పేర్లు, సంగీతం, ఆయుర్వేదం వంటి వివిధ శాస్త్రాల్లో వచ్చే పదాలు, సాంకేతిక పదాల అర్థాలు కూడా ఇక్కడ లభ్యమౌతాయి. ఈ వివరాలన్నిటినీ మీరు ఈ పట్టికలో చూడవచ్చు.
ఈ సదుపాయాన్ని మీరంతా వినియోగించుకొంటారని ఆశిస్తున్నాను. తెలుగును సంరక్షించుకోవటానికి, నేర్చుకొనడానికి, వ్యాపింపజేయడానికి అవసరమైన ఇంకా ఎన్నో ప్రతిపాదనలను మన తానా ప్రస్తుతం పరిశీలిస్తుంది. మీ అందరి సహకారంతో శాశ్వతంగా ఉపయోగపడే అనేక ప్రాజెక్టులను మనం చేపట్టవచ్చు.
ఈ ప్రాజెక్టుకు, తానా ప్రచురణల కమిటీ చేపడుతున్న ఇతర ప్రాజెక్టులకూ మీరు సహాయాన్ని అందించదలచుకుంటే, ఈ లంకెలోTelugu On-line Dictionaries ద్వారా విరాళాలు ఇవ్వ వచ్చు. చెక్కు ద్వారా విరాళాలు ఇవ్వాలంటే,TANA Publication Committee పేర వ్రాసిన చెక్కులను V. Chowdary Jampala, 20374 Buckthorn Ct, Mundalein, IL 60060కు పంపించవచ్చు. ఇతర వివరాలకు నన్ను (cjampala@gmail.com; 937-475-7809) సంప్రదించవచ్చు.
ఈ ప్రయత్నంలో సహాయ సహకారాలు అందించిన వారందరికీ, మరోసారి నా కృతజతలు.