2003 తానా కథాసాహితి కథ నవలల పోటీ ఫలితాలు

శాన్‌ హోసె నగరంలో, జులై 3,4,5 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రజతోత్సవం జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా, తానా ప్రచురణల కమిటీ, కథాసాహితి (హైదరాబాద్‌) సహకారంతో తెలుగు కథనవలల పోటీని నిర్వహించింది.

ప్రపంచస్థాయిలో నిలబడదగ్గ తెలుగు సాహిత్యాన్ని సృష్టించడాన్ని, గణనీయమైన బహుమతులు ఇవ్వడంద్వారా, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1997లో లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన 11వ ఉత్తర అమెరికా తెలుగు మహాసభల సందర్భంగా, తానా మొదటి నవలల పోటీని నిర్వహించి, శ్రీమతి చంద్రలత వ్రాసిన “రేగడివిత్తులు” నవలకు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు బహూకరించింది. 1999నుండి నవలల పోటీకి తోడుగా 25 వేల రూపాయల బహుమతితో కథలపోటీని కూడ జోడించి, రెండేళ్ళకొకసారి ఉత్తర అమెరికా తెలుగు (తానా) మహాసభల సందర్భంగా ఈ పోటీలను తానా ప్రచురణల కమిటీ నిర్వహిస్తున్నది. 1999లో “తపన” నవలకు శ్రీ కాశీభట్ల వేణుగోపాల్‌ లక్ష రూపాయల బహుమతి, 2001లో “టైటానిక్‌” కథకు శ్రీ సురేష్‌, “అస్తిత్వానికి అటూ ఇటూ” కథకు శ్రీ మధురాంతకం నరేంద్ర చెరి 15 వేల రూపాయల బహుమతి గెలుచుకొన్నారు. ఇప్పటివరకు బహుమతి పొందిన నవలలు, కథలు విపులప్రాచుర్యాన్ని పొంది, విస్తృతంగా చర్చింపబడ్డాయి.2001 నుండి హైదరాబాద్‌ కథాసాహితి సంస్థ వారు ఈ పోటీలు నిర్వహించటానికి సహకరిస్తున్నారు.

2003 కథల పోటీకి శ్రీమతి పి. సత్యవతి, శ్రీ సింగమనేని నారాయణ; నవలల పోటీకి శ్రీయుతులు డి. వెంకట్రామయ్య, శీలా వీర్రాజు ఇండియాలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. శ్రీయుతులు కన్నెగంటి చంద్రశేఖర్‌, కన్నెగంటి రామారావు, జంపాల చౌదరి, పారనంది లక్ష్మీనరసింహం, మద్దిపాటి కృష్ణారావు, మాచవరం మాధవ్‌ అమెరికాలో రెండు పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీ నిబంధనల ప్రకారం, అంతిమ నిర్ణయం వరకు రచయితల వివరాలు గుప్తంగా ఉంచబడ్డాయి.

2003 కథల పోటీ

ఈ సంవత్సరం 396 కథలు పోటీకి వచ్చాయి. మొదటి వడబోత తర్వాత, 335 కథలు ద్వితీయ పరిశీలనకు ఎంపిక కాగా, వాటిలో 54 కథలను మూడవ దశలో ఇండియాలో న్యాయ నిర్ణేతలు పరిశీలించారు. వారు ఎంపిక చేసిన 12 కథలను అంతిమ దశలో తానా న్యాయ నిర్ణేతల బృందం పరిశీలించింది.

ఆఖరి పరిశీలనకు వచ్చిన కథలలో, పోటీ ఉద్దేశించిన స్థాయిలో 25,000 రూపాయల బహుమతికి అర్హమయిన కథ ఏదీ లేదని న్యాయనిర్ణేతల ఏకాభిప్రాయం. సమకాలీన సమస్యలను వస్తువులుగా తీసుకోవటం అభినందనీయమే అయినా, ఆ సమస్యలను ఉపరితలం దాటి రచయితలు అవసరమైనంతగా స్పర్శించి, శోధించలేదు అనిపించింది. ఈ కథలన్నిటిలోనూ మంచి వాతావరణ చిత్రణ, చక్కగా చదివించే గుణం ఉన్నప్పటికీ, వస్తువు, అవగాహన, స్పష్టత, సహజత, పాత్రపోషణ, శిల్పాలలో ఉన్న హెచ్చుతగ్గులు ఈ కథల్ని మంచి కథల స్థాయినుంచి గొప్ప కథల స్థాయికి చేరకుండా ఆపేశాయి. అందుచేత, ఈ బహుమతి మొత్తాన్ని 30,000 రూపాయలకు పెంచి, ఈ కథలలో ఉత్తమమైన వాటికి పంచాలని న్యాయ నిర్ణేతల నిర్ణయం.

మొదటి బహుమతి (6,000 రూ. చొప్పున)

  1. నందిని అక్కిరాజు భట్టిప్రోలు
  2. మిత్తవ మంచికంటి వెంకటేశ్వర రెడ్డి
  3. హాలాహలం వి. ప్రతిమ

రెండవ బహుమతి (4,000 రూ. చొప్పున)

  1. అతడు నేను కె. వరలక్ష్మి
  2. ఆ ఇల్లు మూతబడ్డది పెద్దింటి అశోక్‌ కుమార్‌
  3. చలివేంద్రం జాతశ్రీ

బహుమతి పొందిన కథలు తెలుగు పలుకు 14 వ సంచిక (2003 ఉత్తర అమెరికా సమావేశపు సావెనీర్‌), ఈమాట ఎలెక్ట్రానిక్‌ పత్రిక (www.eemaata.com) జులై సంచిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధాలలో ప్రచురింపబడతాయి.

2003 నవలల పోటీ

ఈ సంవత్సరం 50 నవలలు పోటీకి వచ్చాయి. మొదటి వడబోత తర్వాత, 17 నవలలను ఇండియాలో న్యాయ నిర్ణేతలు పరిశీలించారు. వారు ఎంపిక చేసిన 4 నవలలను అంతిమ దశలో తానా న్యాయ నిర్ణేతల బృందం పరిశీలించింది.

ఆఖరి పరిశీలనకు వచ్చిన నవలలలో, తానా ఉద్దేశించిన స్థాయిలో లక్ష రూపాయల బహుమతికి అర్హమయిన నవల ఏదీ లేదని న్యాయనిర్ణేతల ఏకాభిప్రాయం. అంతిమ స్థాయి వరకు వచ్చిన నవలలలో ఉత్తమంగా ఉన్న నవలకు ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని వారు నిర్ణయించారు.

ప్రోత్సాహక బహుమతి (25,000 రూ.)

  • మనోప్రస్థానం చంద్రశేఖర ఆజాద్‌

ఈ నవలను రచయిత మరోమారు సమీక్షించి, తగిన మార్పులు చేసి తిరగవ్రాస్తే, మంచి నవలగా పరిణమించే అవకాశం ఉందని న్యాయనిర్ణేతల అభిప్రాయం.

వరుసగా రెండవసారి కూడా ఉత్తమ నవల బహుమతికి అనుగుణమైన స్థాయిలో ఒక్క నవల కూడా లేకపోవటం తానా ప్రచురణల కమిటీని ఆందోళనకు గురి చేస్తూంది. మంచి నవలకు ఉండవలసిన లక్షణాలు సహజత్వం, పాత్రపోషణ, సన్నివేశ చిత్రణ, పక్వత, రససిద్ధి గత రెండు పోటీలకు అంతిమ దశవరకూ వచ్చిన అనేక నవలలలో లోపించడం గమనార్హం. ఉత్తమ ప్రమాణాలకు సరితూగే నవల వ్రాయడానికి అవసరమైన శ్రద్ధ తీసుకోవటంకన్నా, హడావిడిగా పోటీ కోసం బహుమతి మీద దృష్టితోనే వ్రాయబడ్డాయి అనిపించేలా చాలా నవలలు ఉండడం దురదృష్టం. ఈ పోటీ నిర్వహణను గురించి తానా ప్రచురణల కమిటీ పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

కృతజ్ఞతలు

ఈ పోటీ వివరాలను విశేషంగా ప్రచారం చేసేందుకు సహకరించిన పాత్రికేయులకు, సంపాదకులకు, ప్రత్యేకంగా శ్రీయుతులు వేమూరి బలరామ్‌ (స్వాతి), కె. రామచంద్రమూర్తి (ఆంధ్రజ్యోతి), విశ్వేశ్వరరావు (శ్రీశ్రీ ప్రింటర్స్‌), రామ్మోహనరావు (నవోదయా) గార్లకు, విజయవాడ పుస్తక విక్రేతల సంఘానికి, ఇండియాలో న్యాయ నిర్ణేతలు శ్రీమతి పి. సత్యవతి, శ్రీయుతులు డి. వెంకట్రామయ్య, సింగమనేని నారాయణ, శీలా వీర్రాజు గార్లకు, ప్రాథమిక పరిశీలకులుగా వ్యవహరించిన అనేక మిత్రులకు, అమెరికా న్యాయనిర్ణేతలకు, శ్రీమతి కన్నెగంటి మాధవికి తానా ప్రచురణల కమిటీ కృతజ్ఞతలు. కథాసాహితి (హైదరాబాద్‌), వాసిరెడ్డి నవీన్‌ల సహకారం ఈ పోటీలకు అమూల్యం. టానా అధ్యక్షులు శ్రీమతి ముత్యాల పద్మశ్రీ, శాన్‌ హోసె తానా సమావేశపు అధ్యక్షులు శ్రీ సూదనగుంట పేరయ్య, కన్వీనర్‌ శ్రీ కోమటి జయరాం ఈ పోటీ నిర్వహణను ప్రోత్సహించారు. వీరందరికీ నా వ్యక్తిపూర్వక కృతజ్ఞతలు.

జంపాల చౌదరి, అధ్యక్షులు, తానా ప్రచురణల కమిటీ
మే 30, 2003; బీవర్‌క్రీక్‌, ఒహాయో


జంపాల చౌదరి

రచయిత జంపాల చౌదరి గురించి: తెలుగునాడి పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన వారు వారు. ముఖ్యంగా తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు, చాలా కాలం తానా పత్రికకు సంపాదకత్వం వహించారు. ...