ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం

కథ: ఎందుకు పారేస్తాను నాన్నా
రచయిత: చాసో (చాగంటి సోమయాజులు)
రచనాకాలం: 1944.

చాసో 1944లో రాసిన ఈ కథని మొదటిసారి దాదాపు నలభై ఏళ్ళ క్రితం చదివాను. ఆ తర్వాత మరెన్నో సార్లు చదివాను. గొప్ప కథలెన్నో ఉన్న తెలుగులో ఈ కథ బహు గొప్ప కథ అని నేను నమ్ముతాను.

చాసో రాసిన ఈ చిన్ని కథలో ఎన్నెన్ని అందాలో! చదువంటే పడిచచ్చే తెలివైన పేద కృష్ణుడు, వాణ్ణి ప్రేమించే తల్లీ తండ్రీ, వాడితో చదువులో పోటీ పడే శకుంతలా, వాడి ఇతర నేస్తాలూ, పిల్లల మధ్య పోటీలూ, ఆప్యాయతలూ, ఆ రోజుల్లో హైస్కూల్ చదువులూ అన్నీ వివరంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి – ఈ రెండు పేజీల చిన్న కథలో. ఈ కథలో ముఖ్యపాత్ర కృష్ణుడు. కథలో విలన్ లేడు, కృష్ణుడి బీదరికం తప్ప. ఆ బీదతనం గురించి అరుపులూ కేకలూ లేవు. ఇది రాజకీయాలు ప్రచారం చేయడానికి రాసిన కథ కాదు. అయినా సమాజాన్ని గురించి ఆలోచింపచేస్తుంది. దీన్లో కన్నవాళ్ళ ప్రేమ గురించి పేరాలు పేరాలుగా రాయలేదు. అయినా మనకు ఆ ప్రేమ గురించి స్పష్టంగా తెలుస్తుంది. డబ్బు, తెలివితేటలు, అవకాశాలు, అవరోధాలు అన్నింటినీ రచయిత ఈ కథలో మనకు చూపిస్తాడు. చర్చించడు. వేరే చర్చేమీ అవసరం లేదు.

కుంచెనీ, రంగుల్నీ చాలా మితంగా ఉపయోగిస్తూనే, విస్తృత దృశ్యాలను చూపగల్గిన చిత్రకారుని చాతుర్యముంది ఈ కథలో. బహు తక్కువ మాటలతో బలమైన భావాలను స్ఫురింప జేయగలడీ రచయిత. “కొడుకు బాధంతా తండ్రికి బోధ పడ్డది. కొడుకు బాధంతా తండ్రి పడ్డాడు.” రెండే వాక్యాలు. అంతకన్నా అక్కర్లేదు ఈ రచయితకి వాళ్ళిద్దరి బాధ, బాంధవ్యమూ చూపి ఆ బాధంతా మనమూ పడేట్లు చేయడానికి. హవానా పేంటేసుకున్నా, డబ్బున్న నరసింహం స్కూల్లో మాత్రం చిరుగు బట్టల కృష్ణుడి ముందు దిగదుడుపే. అయితేనేం, నరసింహం బళ్ళో చేరేడు. కృష్ణుడి పేరు ముందు ‘డిస్కంటిన్యూడ్’ అని రాయబోతున్నారు. ఆ అన్యాయాన్ని తలచుకుంటే కోపం రాదూ?

ఈ రచయిత ప్రతిభ అన్నింటికన్నా ఎక్కువ వ్యక్తం అయ్యేది ఈ కథకు ఆయువుపట్టు, కథ శీర్షిక, ఆఖరు పంక్తి అయిన “ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న కృష్ణుడి ప్రశ్నలో. అవును, ఎందుకు పారేస్తాడు వాడు? వాడేమన్నా తెలివి తక్కువ వాడా, బాధ్యత తెలీనివాడా, డబ్బు విలువ గ్రహించని వాడా? ఎందుకు పారేస్తాడు? చచ్చినా పారేయడు. ఈ కథ చదివాక గుండె బరువెక్కకుండా ఎట్లా ఉంటుంది? కళ్ళల్లో నీళ్ళు తిరిగితే ఆశ్చర్యమేముంటుంది?

ఈ కథ రాసిన చాసో ఇప్పుడిక లేడు. ఇంతటి గొప్ప కథకుడు మళ్ళీ ఎప్పుడు పుడతాడో!


(దాదాపు 1966 దాకా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా హయ్యర్ ఫారం – అంటే తొమ్మిదో తరగతి నుంచి – విద్యార్థులు నెల నెలా ఫీజు చెల్లించాల్సి ఉండేది. కొంత రాయితీ ఉన్నా, మధ్య తరగతి కుటుంబాలకు కొంత కష్టంగానే ఉండేది. 1966 తర్వాత ఈ ఫీజులు రద్దు చేశారు.)


జంపాల చౌదరి

రచయిత జంపాల చౌదరి గురించి: తెలుగునాడి పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి గారికి పరిచయం అక్కర్లేదు జగమెరిగిన వారు వారు. ముఖ్యంగా తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు, చాలా కాలం తానా పత్రికకు సంపాదకత్వం వహించారు. ...