పాండురంగారావు తన ఛాంబర్‌లో వున్నాడు. అతని టేబుల్ మీద రకరకాల పుస్తకాలు, కొన్ని ఫోటోలు గోడల మీద వేలాడుతున్నాయి, గత చరిత్రలకు గుర్తుగా. అతను మౌనంగా శూన్యంలోకి చూస్తున్నా మనసులో రకరకాల దృశ్యాలు, సంఘటనలు, సంవత్సరాలు అలా మెరిసి మాయం అవుతున్నాయి. అయినా ఆ ముఖంలో ఎలాంటి భావం పలకటం లేదు.
అపుడు తలుపు తెరుచుకుంది మెల్లగా.
‘‘అయ్యా, మిమ్మల్ని పిలుస్తున్నారు,’’ అన్నాడు రామచంద్రయ్య.
అతను పది సంవత్సరాలుగా పాండురంగారావుకి సహాయకుడిగా వుంటున్నాడు. చిన్నగా తలూపాడు రంగారావు.
అది సమావేశాలు జరుపుకునే చిన్న హాల్. పాండురంగారావు అక్కడి కెళ్ళాడు. అక్కడున్న వారి ముఖాలు గంభీరంగా వున్నాయి. ఆయన వారందరినీ నిశితంగా చూశాడు.
‘‘కూర్చోండి,’’ అన్నారొకరు.
రంగారావు కూర్చున్నాడు.
రెండున్నర దశాబ్దాల తర్వాత అతను ఓ దోషిలా తల దించుకొన్నాడు. అక్కడున్న వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవరో చిన్నగా దగ్గారు.
రంగారావు తల పైకెత్తాడు.
‘‘ఈ సమావేశం ఎందుకు జరుగుతుందో మీకు తెలుసు. మన పత్రిక పాలసీకి భిన్నంగా మీ స్వంత ఎజెండాని ప్రచారం చేస్తున్నారు,’’ అన్నాడొకతను.
‘‘అదేంటో చెప్పండి,’’ అన్నాడు రంగారావు.
‘‘మన సిద్ధాంత శత్రువు విశ్వేశ్వరయ్య మరణవార్తని మన పత్రికలో ఎందుకు ప్రచురించారు?’’
రంగారావు అతని కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ చూపుకి అతను కాస్త తొట్రుపడ్డాడు.
‘‘మీరు అdఇ పత్రికల సంప్రదాయం అంటారు. మన పార్టీ నాయకులు చనిపోతే వారి పత్రికలో వేస్తున్నారా? ప్రచురించినా ఏదో మూల చిన్న వార్తగా వుంటుంది. మీరు అలా కాదు. ఫ్రంట్ పేజీలో బాక్స్ కట్టి మరీ వేశారు. కార్యకర్తల నుండి నాయకత్వం దాకా ఎందరో ఫోన్లు చేస్తున్నారు. అభ్యంతరాలు చెబుతున్నారు. మన పత్రికలో విశ్వేశ్వరయ్యకి అంత ప్రాధాన్యం ఇచ్చినందుకు మండిపడుతున్నారు,’’ అన్నాడు ఇంకో వ్యక్తి.
‘‘మన నాయకుల మరణవార్తలు ప్రచురిస్తున్నారా? ప్రచురిస్తే ఎక్కడ ఏ మేరకు అనేది వారి విజ్ఞతకి చెందిన విషయం. ఆ పత్రికకి చెంది నేను సమాధానం చెప్పలేను,’’ అన్నాడు రంగారావు.
‘‘మీకున్న ప్రత్యేక శ్రద్ధ ఏంటో చెప్పండి.’’
రంగారావు మానసికంగా సిద్ధంగానే వున్నాడు.
‘‘ఈ వయసులో నాకు ప్రత్యేక శ్రద్ధలు వుండాల్సిన అవసరం లేదు. విశ్వేశ్వరయ్యగారు సిద్ధాంతపరంగా నాకు వ్యతిరేకి లేదా శత్రువు. వ్యక్తిగతంగా కాదు.’’
కొందరి ముఖాలు మాడిపోయాయి.
‘‘ఆయన ఓ పార్టీకి నాయకుడు మాత్రమే కాదు. తను నమ్మిన సిద్ధాంతం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాడు. అతనికి ఆస్తులు లేవు. అవన్నీ పార్టీ కోసం అమ్మేశాడు. సాధారణ కార్యకర్తగా, అత్యంత నిరాడంబర జీవితం గడుపుతున్నాడు. మన పార్టీలోని వ్యక్తులే కాదు, అనేక రాజకీయ పార్టీల వారు వ్యక్తిగా వారిని గౌరవిస్తాయి. ముఖ్యంగా ప్రజలు అతన్ని నిస్వార్థ రాజకీయ నాయకుడిగా, ఎలాంటి మచ్చలేని వ్యక్తిగా గౌరవిస్తారు. అందుకే మన పత్రికలో ఆయనకి అంత చోటు లభించింది. అది కనీస ధర్మం అని నేను అనుకున్నాను,’’ అన్నాడు రంగారావు.
‘‘ఇంకా నయం. మీరు చివరి దర్శనానికి వెళ్ళి మన జెండాని ఆయన మీద కప్పి రాలేదు,’’ అన్నాడో యువకుడు.
‘‘నేను కప్పాలనుకున్నా వారు కప్పనీయరులే బాబూ.’’
‘‘చూశారా ఆ వ్యంగ్యం?’’
‘‘అది మొదలుపెట్టింది మీరు. పత్రిక్కి ఓ ప్రజాస్వామ్య లక్షణం వుండాలి. ఎదుటివారి సిద్ధాంతాల్లో మనం విభేదిస్తాం. ఈ విశ్వేశ్వరయ్యగారికి వ్యతిరేకంగా మన పత్రికలో ఎన్నో వ్యాసాలు ప్రచురించాం. మనం ప్రజలకు మంచి జరగాలని ఎలా పని చేస్తున్నామో, ఆయనా అలా పనిచేస్తున్నారు. వారి సేవలని మన తిరస్కరించలేం కదా. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారు?’’
‘‘మీకిది చిన్న విషయంగా కనిపించొచ్చు.’’
‘‘నేను ఒక్క మాట అడుగుతున్నాను. మన పార్టీ కార్య కర్తలు చనిపోతారు. నాయకులు చనిపోతారు. అందరికీ ఒకే రకమైన ప్రాధాన్యత ఇస్తామా? ఇస్తున్నామా? అది ఎవరి విషయం లోనైనా సాధ్యం అవుతుందా? సమాజంలో వారికున్న స్థానం, వారి కంట్రిబ్యూషన్, వీటినిబట్టి వారిని గుర్తిస్తాం. ఓ గ్రామ నాయకుడికీ, జాతీయ నాయకుడికి మధ్య వున్న తేడాని మనం గుర్తించామా?’’ అన్నాడు రంగారావు సూటిగా.
‘‘మీరు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు,’’ అన్నాడో ముఖ్యుడు. ‘‘గదుల్లో కూర్చుంటే ఇలానే వుంటుంది. జనంలోకి వచ్చి పనిచేస్తే తెలుస్తుంది. ప్రజల సమస్యలేంటో, వారు ఇలాంటి సమయాల్లో ఎలా రియాక్టవుతారో.’’
రంగారావు చిన్నగా నవ్వాడు.
‘‘నేను జనంలో పనిచేసి వచ్చిన కార్యకర్తనని మీకు తెలియకపోవచ్చు. నా గురించి తెలియని మీలాంటి వారికి విశ్వేశ్వరయ్యగారి గురించి తెలియకపోవటం ఆశ్చర్యం లేదు. ఓ పార్టీ కార్యకర్తకిగాని, నాయకుడికిగాని గత చరిత్ర తెలిసి వుండటం చాలా అవసరం. లేదంటే ఎలాంటి వ్యక్తుల మీదయినా ద్వేషాన్ని మాత్రమే పెంచుకుంటాం. పార్టీ పత్రిక బాధ్యత నామీద పెట్టింది. ఆ బాధ్యతని నేను సమక్రంగా నిర్వర్తిస్తున్నానని నమ్ముతున్నాను,’’ అంటుంటే…
‘‘ఇప్పటిదాకా పత్రికను మీమీద వదిలేయటం పార్టీ చేసిన తప్పు,’’ అన్నాడో సభ్యుడు.
‘‘మీరు పొరపాటు పడుతున్నారు. ఎప్పటినుంచో ఈ పత్రికకి సంపాదకవర్గం వుంది. అందులోని వారు ఏ మేరకు తమ బాధ్యతలు నిర్వహించారో ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది,’’ అన్నాడు మృదువుగానే.