పాండురంగారావు తన ఛాంబర్‌లో వున్నాడు. అతని టేబుల్ మీద రకరకాల పుస్తకాలు, కొన్ని ఫోటోలు గోడల మీద వేలాడుతున్నాయి, గత చరిత్రలకు గుర్తుగా. అతను మౌనంగా శూన్యంలోకి చూస్తున్నా మనసులో రకరకాల దృశ్యాలు, సంఘటనలు, సంవత్సరాలు అలా మెరిసి మాయం అవుతున్నాయి. అయినా ఆ ముఖంలో ఎలాంటి భావం పలకటం లేదు.
అపుడు తలుపు తెరుచుకుంది మెల్లగా.
‘‘అయ్యా, మిమ్మల్ని పిలుస్తున్నారు,’’ అన్నాడు రామచంద్రయ్య.
అతను పది సంవత్సరాలుగా పాండురంగారావుకి సహాయకుడిగా వుంటున్నాడు. చిన్నగా తలూపాడు రంగారావు.
అది సమావేశాలు జరుపుకునే చిన్న హాల్. పాండురంగారావు అక్కడి కెళ్ళాడు. అక్కడున్న వారి ముఖాలు గంభీరంగా వున్నాయి. ఆయన వారందరినీ నిశితంగా చూశాడు.
‘‘కూర్చోండి,’’ అన్నారొకరు.
రంగారావు కూర్చున్నాడు.
రెండున్నర దశాబ్దాల తర్వాత అతను ఓ దోషిలా తల దించుకొన్నాడు. అక్కడున్న వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవరో చిన్నగా దగ్గారు.
రంగారావు తల పైకెత్తాడు.
‘‘ఈ సమావేశం ఎందుకు జరుగుతుందో మీకు తెలుసు. మన పత్రిక పాలసీకి భిన్నంగా మీ స్వంత ఎజెండాని ప్రచారం చేస్తున్నారు,’’ అన్నాడొకతను.
‘‘అదేంటో చెప్పండి,’’ అన్నాడు రంగారావు.
‘‘మన సిద్ధాంత శత్రువు విశ్వేశ్వరయ్య మరణవార్తని మన పత్రికలో ఎందుకు ప్రచురించారు?’’
రంగారావు అతని కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ చూపుకి అతను కాస్త తొట్రుపడ్డాడు.
‘‘మీరు అdఇ పత్రికల సంప్రదాయం అంటారు. మన పార్టీ నాయకులు చనిపోతే వారి పత్రికలో వేస్తున్నారా? ప్రచురించినా ఏదో మూల చిన్న వార్తగా వుంటుంది. మీరు అలా కాదు. ఫ్రంట్ పేజీలో బాక్స్ కట్టి మరీ వేశారు. కార్యకర్తల నుండి నాయకత్వం దాకా ఎందరో ఫోన్లు చేస్తున్నారు. అభ్యంతరాలు చెబుతున్నారు. మన పత్రికలో విశ్వేశ్వరయ్యకి అంత ప్రాధాన్యం ఇచ్చినందుకు మండిపడుతున్నారు,’’ అన్నాడు ఇంకో వ్యక్తి.
‘‘మన నాయకుల మరణవార్తలు ప్రచురిస్తున్నారా? ప్రచురిస్తే ఎక్కడ ఏ మేరకు అనేది వారి విజ్ఞతకి చెందిన విషయం. ఆ పత్రికకి చెంది నేను సమాధానం చెప్పలేను,’’ అన్నాడు రంగారావు.
‘‘మీకున్న ప్రత్యేక శ్రద్ధ ఏంటో చెప్పండి.’’
రంగారావు మానసికంగా సిద్ధంగానే వున్నాడు.
‘‘ఈ వయసులో నాకు ప్రత్యేక శ్రద్ధలు వుండాల్సిన అవసరం లేదు. విశ్వేశ్వరయ్యగారు సిద్ధాంతపరంగా నాకు వ్యతిరేకి లేదా శత్రువు. వ్యక్తిగతంగా కాదు.’’
కొందరి ముఖాలు మాడిపోయాయి.
‘‘ఆయన ఓ పార్టీకి నాయకుడు మాత్రమే కాదు. తను నమ్మిన సిద్ధాంతం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాడు. అతనికి ఆస్తులు లేవు. అవన్నీ పార్టీ కోసం అమ్మేశాడు. సాధారణ కార్యకర్తగా, అత్యంత నిరాడంబర జీవితం గడుపుతున్నాడు. మన పార్టీలోని వ్యక్తులే కాదు, అనేక రాజకీయ పార్టీల వారు వ్యక్తిగా వారిని గౌరవిస్తాయి. ముఖ్యంగా ప్రజలు అతన్ని నిస్వార్థ రాజకీయ నాయకుడిగా, ఎలాంటి మచ్చలేని వ్యక్తిగా గౌరవిస్తారు. అందుకే మన పత్రికలో ఆయనకి అంత చోటు లభించింది. అది కనీస ధర్మం అని నేను అనుకున్నాను,’’ అన్నాడు రంగారావు.
‘‘ఇంకా నయం. మీరు చివరి దర్శనానికి వెళ్ళి మన జెండాని ఆయన మీద కప్పి రాలేదు,’’ అన్నాడో యువకుడు.
‘‘నేను కప్పాలనుకున్నా వారు కప్పనీయరులే బాబూ.’’
‘‘చూశారా ఆ వ్యంగ్యం?’’
‘‘అది మొదలుపెట్టింది మీరు. పత్రిక్కి ఓ ప్రజాస్వామ్య లక్షణం వుండాలి. ఎదుటివారి సిద్ధాంతాల్లో మనం విభేదిస్తాం. ఈ విశ్వేశ్వరయ్యగారికి వ్యతిరేకంగా మన పత్రికలో ఎన్నో వ్యాసాలు ప్రచురించాం. మనం ప్రజలకు మంచి జరగాలని ఎలా పని చేస్తున్నామో, ఆయనా అలా పనిచేస్తున్నారు. వారి సేవలని మన తిరస్కరించలేం కదా. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారు?’’
‘‘మీకిది చిన్న విషయంగా కనిపించొచ్చు.’’
‘‘నేను ఒక్క మాట అడుగుతున్నాను. మన పార్టీ కార్య కర్తలు చనిపోతారు. నాయకులు చనిపోతారు. అందరికీ ఒకే రకమైన ప్రాధాన్యత ఇస్తామా? ఇస్తున్నామా? అది ఎవరి విషయం లోనైనా సాధ్యం అవుతుందా? సమాజంలో వారికున్న స్థానం, వారి కంట్రిబ్యూషన్, వీటినిబట్టి వారిని గుర్తిస్తాం. ఓ గ్రామ నాయకుడికీ, జాతీయ నాయకుడికి మధ్య వున్న తేడాని మనం గుర్తించామా?’’ అన్నాడు రంగారావు సూటిగా.
‘‘మీరు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు,’’ అన్నాడో ముఖ్యుడు. ‘‘గదుల్లో కూర్చుంటే ఇలానే వుంటుంది. జనంలోకి వచ్చి పనిచేస్తే తెలుస్తుంది. ప్రజల సమస్యలేంటో, వారు ఇలాంటి సమయాల్లో ఎలా రియాక్టవుతారో.’’
రంగారావు చిన్నగా నవ్వాడు.
‘‘నేను జనంలో పనిచేసి వచ్చిన కార్యకర్తనని మీకు తెలియకపోవచ్చు. నా గురించి తెలియని మీలాంటి వారికి విశ్వేశ్వరయ్యగారి గురించి తెలియకపోవటం ఆశ్చర్యం లేదు. ఓ పార్టీ కార్యకర్తకిగాని, నాయకుడికిగాని గత చరిత్ర తెలిసి వుండటం చాలా అవసరం. లేదంటే ఎలాంటి వ్యక్తుల మీదయినా ద్వేషాన్ని మాత్రమే పెంచుకుంటాం. పార్టీ పత్రిక బాధ్యత నామీద పెట్టింది. ఆ బాధ్యతని నేను సమక్రంగా నిర్వర్తిస్తున్నానని నమ్ముతున్నాను,’’ అంటుంటే…
‘‘ఇప్పటిదాకా పత్రికను మీమీద వదిలేయటం పార్టీ చేసిన తప్పు,’’ అన్నాడో సభ్యుడు.
‘‘మీరు పొరపాటు పడుతున్నారు. ఎప్పటినుంచో ఈ పత్రికకి సంపాదకవర్గం వుంది. అందులోని వారు ఏ మేరకు తమ బాధ్యతలు నిర్వహించారో ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది,’’ అన్నాడు మృదువుగానే.
ఆ బృందంలోని కొందరికి కోపం వచ్చింది.
‘‘ఈమధ్య మీరు మన సిద్ధాంతాల్ని విమర్శించే రచయితల కథలు ప్రచురిస్తున్నారు. ఆ రకంగా మీరు వ్యక్తిగత సంబంధాలు పెంచుకుంటున్నారు.’’
‘‘మన పత్రిక పాలసీకి భిన్నంగా వేసిన కథ ఒకటి చెప్పండి,’’ అన్నాడు రంగారావు సూటిగా.
అక్కడ కొద్ది క్షణాలు నిశ్శబ్దం.
‘‘ఆ రచయతలు అన్ని పత్రికలకి రాస్తున్నారు. మనం విస్తృతంగా జనంలోకి వెళ్ళాలనుకుంటున్నాం. మన పత్రికకు ఇది ఫలానా పార్టీ పత్రిక అని ముద్రపడకుండా వుండాలి. అయినా ఇది మన పార్టీ అధికార పత్రిక కాదు. ఇది సాహిత్య, సాంస్కృతిక, సిద్ధాంత పత్రిక. మీరు ఏ వ్యక్తిగత పరిచయాల గురించి అడుగుతున్నారు. ఆరోపిస్తున్నారు. అందుకు అడుగుతున్నాను. మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఇతర శత్రుపార్టీల వారితో సంబంధాలు లేవా? అలాంటివారితో సామ్యం పొందటం లేదా? అధికార పార్టీతో పనులు చేయించుకోవటం లేదా? ఒకే వేదికల మీద కలిసి ప్రసంగించటం లేదా?’’ రంగారావు స్వరం ఆ హాల్లో ప్రతిధ్వనించింది.
‘‘ప్రజల సమస్యల కోసం కొన్ని పనులు చేయాల్సి వుంటుంది.’’
‘‘ఇది కూడా అందులో భాగం. విశ్వేశ్వరయ్యగారి వ్యక్తిత్వం, ప్రజల్లో ఆయనకున్న స్థానం వల్లనే నేను ఆ వార్తకు కాస్త ప్రాధాన్యత ఇచ్చాను. మన సిద్ధాంతాలకు భిన్నమైన వ్యక్తులను మనం స్వంతం చేసుకుంటున్నాం. మన పార్టీనే కాదు, మన వ్యతిరేకులు కూడా ఇలానే చేస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుపుకుపోవటం. అంతేకాదు, పత్రిక మనుగడ కోసం సవాలక్ష చెత్త ప్రకటనలు వేస్తున్నాం. వాటినే మనం వ్యతిరేకిస్తున్నాం గానీ వాటిని తిరస్కరించే స్థితిలో లేం,’’ అన్నాడు రంగారావు.
‘‘మీ వివరణ పూర్తయింది. మేం బాధ్యులకి మా రిపోర్ట్ అందజేస్తాం. మీరు వెళ్ళవచ్చు,’’ అన్నారు.
‘‘ధన్యవాదాలు,’’ అని తన ఛాంబర్‌కి వెళ్ళిపోయాడు రంగారావు.
రామచంద్రయ్య వచ్చాడు.
‘‘అయ్యా కాఫీ తీసుకురమ్మంటారా?’’ అన్నాడు.
‘‘ఇప్పుడేం వద్దు,’’ అన్నాడు రంగారావు.
రంగారావుకేసి విచారంగా చూసి వెళ్ళిపోయాడు.
ఇరవై సంవత్సరాలకు పైబడి రంగారావు ఒంటిచేత్తో పత్రికను నడుపుకుంటూ వస్తున్నాడు. పేరుకి ఎడిటోరియల్ బోర్డ్ వుంది. అందులో చాలా సభ్యులు మారిపోయారు. కొంత మంది చనిపోయారు. అప్పట్లో ఒకరిద్దరు అతనికి సహకరించే వారు. ఇంకొందరు వయసు మీరటంతో వ్రాయలేకపోతున్నారు.
ఇప్పుడున్నవారిలో చాలామంది పత్రిక పేజీలు కూడా తెరవరు. కొంతమంది ప్రకటనలు సేకరించి ఇస్తారు. అదే పత్రికకు చేసే గొప్ప సేవనుకుంటారు. అది కూడా సీరియస్‌గా చేయరు. సంవత్సరానికి ఒకటో, రెండో.
కొన్ని సందర్భాల్లో పత్రిక సర్క్యులేషన్ పెంచాలంటారు. క్యాంపెయిన్‌కి పిలుపునిస్తారు. కొన్ని పత్రికలకి చందాలు కట్టిస్తారు లేదా కొన్ని తామే కడతారు. ఇప్పటివరకు పత్రికలో కంటెంట్ గురించి తీవ్రంగా చర్చించిన దాఖలాలు లేవు.
‘‘ఈ విషయంలో మీకు మేం ప్రత్యేకంగా చెప్పేదేం వుంటుంది,’’ అనేవారు.
‘‘పత్రికను బయటి పాఠకులు చదవటం వేరు. ముందు మన కార్యకర్తలతో చదివించండి. ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి,’’ అని ఎన్నోసార్లు రంగారావు మొత్తుకునేవాడు. వారికి ఎప్పటికప్పుడు రోడ్ల మీదికి రావటంతోనే సరిపోతుంది అనేవారు తప్ప అలాంటి ప్రయత్నం చేయలేదు. పార్టీ సభ్యులు ఇతర పత్రికలు చదువుతారు తప్ప ఈ పత్రిక చదవరు. అది నగ్నసత్యం.
ఇంకొందరు సంపాదకవర్గంలో తమ పేరు చూసుకుని మురిసిపోతుంటారు. ఆ హోదాని వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటారు. ఒకరిద్దరు రచనలు చేయగల శక్తి వున్నవారు. వారు పత్రికకి రచనలు పంపేవారు కాదు. పెద్దపెద్ద సర్క్యులేషన్ వున్న దినపత్రిక లకి పంపేవారు. ప్రత్యేక సంచికలు వేస్తున్నప్పుడు చివరి నిముషం దాకా ఎన్ని ఫోన్లు చేసినా, ‘ఇదిగో అదిగో’ అంటుండే వారు.
‘‘మీరు మన పత్రికకి వ్రాయకపోతే ఎలా?’’ అని రంగారావు ఒత్తిడి చేస్తుంటే ఒకతను చెప్పాడు.
‘‘మన పత్రికని చదివేవారు తక్కువ. అదే పెద్ద పత్రికలో అయితే మన భావాలు ఎక్కువమందికి చేరతాయి. ఎక్కువ మందిని ఆకర్షించటమే కదా మనకు కావలసింది.’’
‘‘కనీసం మనకున్న పాఠకులను కాపాడుకోవాలి. మన కార్యకర్తలను నిలుపుకోవాలి. ఇతర పత్రికలకు మిమ్మల్ని రాయవద్దని నేను అనటం లేదు. ఇది కర్తవ్యంగా పెట్టుకోండి,’’ అని రంగారావు వాదించాడు.
‘‘పోనీ ఆ పత్రికల వ్యాసాల్ని మన పత్రికలో రీప్రింట్ చేయండి. ఆ పత్రిక సౌజన్యంతో అని ప్రచురించండి.’’
రంగారావు వాదించటం మానేశాడు.
అతని చేతికి పత్రిక వచ్చేటప్పటికి అద్దెకి తీసుకున్న చిన్న గది, అందులో రెండు టేబుల్స్ వుండేవి. ఓ సహాయకుడు మాత్రం వుండేవాడు. అతనికి పత్రిక పనితో పాటు పార్టీ పని వుండేది. బయట ప్రెస్‌లో ప్రింట్ చేసేవారు.
కొంతమంది సంపాదకవర్గ సభ్యులుగా వుండటం వల్లనే వారి రచనలు అచ్చయ్యేవి. అసెంబ్లీలో ఆ పార్టీకి ఇద్దరు ముగ్గురు ఎం.ఎల్.ఎ.లు వుండేవారు. అయినా వారికో నాయకుడు వుంటాడు. ఎవరు శాసనసభాపక్ష నాయకుడయితే వారికి పత్రికలూ, మీడియా ప్రాధాన్యం ఇస్తుంది.
ఎలాంటి అధికార హోదా లేకపోయినా ప్రాధాన్యత ఇవ్వటమనేది వ్యక్తిగత ప్రతిభ మీద, ప్రవర్తన మీద, ప్రజల్లో వారికున్న స్థానం మీద ఆధారపడి వుంటుంది.
అలా ఓ గదిలో ప్రారంభమైన ఆ పత్రికని మూడు గదుల అద్దె భవనంలోకి మార్పించాడు. ఆ తర్వాత కాలంలో స్వంత భవనం, స్వంత ప్రెస్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. పార్టీ ప్రముఖుల్ని కదిలించాడు.
అలా భవన నిర్మాణానికి పిలుపునిచ్చారు. అక్కడ వుండే రంగారావుకి మరో ప్రపంచం లేదు. పత్రిక, భవన నిర్మాణం. రామచంద్రయ్యకి రంగారావుతోనే లోకం.
అతనికి భార్య చనిపోయింది. పిల్లలు లేరు. పార్టీ, భవనం, రంగారావుకి సహాయకుడిగా వుండటం మాత్రమే ప్రపంచం. చందాలు సేకరించటం, ప్లానులు గీయించటం, పనులు చేయించటం, ఎప్పుడో తినటం, అర్ధరాత్రులు ఆర్టికల్స్ రాయటం. ఇలా అప్పట్లో పార్టీ కాస్త ఊపు మీద వుంది. అప్పుడు కూడా రంగారావుని నిరుత్సాహపరిచిన వారున్నారు.
‘తలకు మించిన భారం పెట్టుకున్నారు, అప్పులు చేయాల్సి వస్తోంది, ఇవన్నీ ఎప్పటికి తీరాలి,’ అంటూ.
రంగారావు ఎక్కువ వాదించేవాడు కాదు.
భవన నిర్మాణం కోసం రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు. కార్యకర్తల్ని కదిలించడు. నాయకుల వెంట పడడు. వ్యక్తిగతంగా రంగారావుని అభిమానించే వారున్నారు. అలాంటి వారందరూ ఎంతోకొంత డబ్బు రూపంలో, వస్తువుల రూపంలో ఇచ్చి సహకరించారు.
ఇప్పుడు భవనంలో మీటింగ్ హాల్ వుంది. బయట ప్రాంతాల నుండి వచ్చేవారికి విడిది గదులున్నాయి. భోజనశాల వుంది. పత్రికకి స్వంత మెషినరీ వుంది. సంపాదకుడికి ఛాంబర్ వుంది. పాటలూ, నాటకాలు, రూపకాలు రూపొందించు కోవటానికి గదులున్నాయి. ఇవన్నీ ఏర్పడినా సంప్రదాయంగా వున్న చందాదారుల కంటే ఓ వెయ్యి కాపీలు అటూ ఇటూగా వుంటాయి.
అందుకే పత్రికను సాధ్యమైనంత ఎక్కువమందికి చేర్చటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.
శిలాఫలకం మీద తన పేరు వేస్తానంటే రంగారావు అంగీకరించలేదు. పత్రికలో రాజకీయ అంశాలతో పాటు కథలూ, కవిత్వం, సినిమాల మీద సమీక్షలు, ఇంకా అనేకానేక శీర్షికలు ప్రవేశపెడుతున్నాడు. రచయితలకు పారితోషికం ఇవ్వటం మొదలుపెట్టాడు.
పత్రిక తరఫున అనేక సెమినార్లు పెడుతున్నాడు. ఇలాంటి సమయంలోనే కొత్తగా కొందరు రంగారావు కృషిని ఇంకో కోణంలో చూడటం మొదలుపెట్టారు. అందులో ఒకతనికి పత్రిక సంపాదకుడిగా పనిచేయాలనే కోరిక వుంది. కానీ అది చిన్న విషయం కాదని అతనికి తెలుసు. అందుకే చాప కింద నీరులా పనిచేయటం మొదలుపెట్టాడు.
రంగారావు యువకుడిగా వున్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతానికి ఆకర్షింపబడ్డాడు. అప్పటి నుండి పూర్తికాలం కార్యకర్తగా పనిచేయటం మొదలుపెట్టాడు. ఎన్నోసార్లు శత్రువుల దాడికి గురయ్యాడు. అతనికి పార్టీ తప్ప ఇంకోటి తెలియదు.
ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నా నిరంతరం అధ్యయనంలో వుండేవాడు. కరపత్రాలు రూపొందించేవాడు. సభల్లో ఉపన్యసించేవాడు. ఎప్పుడయితే పార్టీలోకి రావాలనుకున్నాడో అప్పుడు ‘బ్రహ్మచారి’గా వుండాలని నిర్ణయించుకున్నాడు.
అతనిలోని ప్రతిభని, నిబద్ధతని గమనించి పార్టీ ముఖ్యుడు పత్రిక బాధ్యతని అప్పగించారు. అప్పటి నుంచి ఏం తిన్నాడో, తాగాడో తెలియదు. ఏరోజూ విలాసంగా బతక లేదు. ఇప్పటివరకు జీతం తీసుకోలేదు. తనకి ఎవరున్నారని, ఎవరికి ఆస్తులు ఇవ్వాలని పతనమవుతాడు. పేరు మాత్రమే కోరుకుంటే ఈ పత్రికనే అంటి పెట్టుకుని వుండాలా?
కేంద్రానికి రమ్మని, ఎం.ఎల్.సి.గా అవకాశం ఇస్తామని ఎంతమంది సీనియిర్ నాయకులు తనని అడగలేదు. అవన్నీ కాదన్నాడు. ముందు పత్రికను ప్రజల పత్రికగా చేయాలను కున్నాడు.
జీవితంలో మొదటిసారి బాధనిపించింది. గుండెల దగ్గర చేత్తో రాసుకుంటున్నాడు. అప్పుడు మళ్ళీ రామచంద్రయ్య కనిపించాడు. అతని కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అతను రంగారావు దగ్గరకొచ్చాడు.
‘‘అయ్యా, ఏదోకరోజు నన్నూ బయటికి వెళ్ళమంటా రేమో,’’ అన్నాడు గద్గదికంగా.
‘‘ఎందుకలా అనుకుంటున్నావు. అది పొరపాటు,’’ అన్నాడు.
‘‘అది నాకు తెలియదు బాబూ. పార్టీలోగాని, బయటగానీ డబ్బున్న వాడికే విలువ. అధికారంలో వున్నవాడికే విలువ అనిపిస్తోంది. మీకు చేతకానిది పదిరూపాయలు సంపాదించటం. లౌకికంగా బతకాలని తెలియకపోవటం,’’ అన్నాడు.
రంగారావు నిర్వికారంగా చూస్తున్నాడు.
రాత్రి ఎంతకూ నిద్ర పట్టటం లేదు.
రంగారావుకి తమ పార్టీలోని కొంతమంది వ్యక్తుల మీద ఎత గౌరవం, అభిమానం వున్నాయో, ఇతర పార్టీలకు, సిద్ధాంతా లకు చెందిన మరికొందరి మీద అంతే గౌరవాభిమానా లున్నాయి. అందులో విశ్వేశ్వరయ్య ఒకడు.
ఆ మాటకొస్తే పార్టీలోనే విభేదాలున్నాయి. అయినా కలిసి పనిచేస్తున్నారు. వ్యక్తుల్ని అంచనా వేసే పద్ధతి ఇది కాదు అనుకున్నాడు. అతను తన టేబుల్ దగ్గరికి వచ్చాడు. ప్యాడ్ అందుకొని చదవటం మొదలుపెట్టాడు.
పార్టీ బాధ్యులకు,
నమస్కారం.
ఇన్ని సంవత్సరాల ఆ కృషిని, పార్టీ పట్ల నాకున్న విశ్వాసాన్ని ఒక్క వార్తతో నిర్ణయించారు. నన్ను పార్టీ వ్యతిరేకిగా, చివరికి వ్యక్తివాదిగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.
ఇదేదో కొంతమంది వ్యక్తుల ప్రమేయం అని నేను అనుకోవటం లేదు. ఇలాంటిది మన పార్టీకే పరిమితం అని కూడా నేను అనుకోవటం లేదు.
సమాజంలో వస్తున్న కొన్ని మార్పులు అన్ని వ్యవస్థలకీ పాకుతున్నాయి. మానవీయ విలువలు పడిపోతున్నాయి. సమాజంలో పరస్పర విరుద్ధమైన అనేక సిద్ధాంతాలున్నాయి. వాటిని నమ్మి, వాటి కోసం ఎందరో పనిచేస్తున్నారు.
ఆ సందర్భాల్లో ఒకరికొకరు శత్రువులుగా ఎదురెదురుగా నిలబడాల్సి వస్తుంది. పోరాటం చేయాల్సి వస్తుంది. అయితే కొంతమంది వ్యక్తులు కులాలకి, మతాలకి, సిద్ధాంతాలకి కూడా అతీతంగా ఎదుగుతారు. అంటే అది వారిలోని మానవీయ కోణం, సమాజానికి వీరు అందించే కంట్రిబ్యూషన్. మనం ఓ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి ఇతరుల మంచిని సయితం నిరాకరించాల్సిన అవసరం లేదు. దానికి మించి అలాంటి వ్యక్తుల్లోని ఆదర్శగుణాలని మనం స్వీకరించాలి.
ఎత్తుగడలు, వ్యూహాలు, ఆచరణ ఓ క్రమంలో నిబద్ధతతో సాగేవి. ఇప్పుడలా కాదు. అన్ని పార్టీల్లోకి కులాలు, మతాలు, ఇంకా అనేకానేక అంశాలు ప్రవేశించాయి. వీటన్నిటికీ ఆర్థిక మూలాలున్నాయి. తాత్త్వికత ఉంది. ఎక్కువ శాతం వాటి ప్రభావంలో పడిపోయారు. అనేకానేక అవలక్షణాలు ఇప్పుడు చాలామందికి ఆదర్శవంతం కావటం, వస్తు వినిమయ ప్రభావాన్నించి తప్పించుకోలేని బలహీనతలు రాజ్యమేలుతున్నాయి. ఇంకో పక్కన బతుకు పోరాటం ఎంతోమందిని అంతవరకే పరిమితం చేస్తున్నాయి. ప్రజల ఉమ్మడి శత్రువుల విషయంలో మనం రాజీ పడుతున్నాం. విశాలమైన ఐక్య సంఘం నిర్మించటంలో విఫలమవుతున్నాం.
మనం అమ్మను ప్రేమిస్తాం. అమ్మ మనల్ని ప్రేమిస్తుంది. అమ్మలోను, మనలోను బలాలు, బలహీనతలు ఉంటాయి. చాదస్తాలు, ప్రేమ, కోపం, ఇంకెన్నో లక్షణాలను భరిస్తూ ఎవరికి వారు బయటపడే ప్రయత్నం చేయాలి. ఎదుటివారి విషయం లోనూ అంతే. వారిని అంచనా వేయటంలో తర్కం, సిద్ధాంతా లతో పాటు కొన్ని సందర్భాల్లో వాటికి మించిన హృదయం వుండాలి. ఇలా ఉండడం సరయినది కాదంటున్నారు. అందుకే నన్ను మన పత్రిక సంపాదక బాధ్యతల నుండి తప్పించవల సిందిగా కోరుతున్నాను.
నేను ఎవరి మీదో కోపంతో ఈ నిర్ణయం తీసుకోలేదు. అలాగే నేను పార్టీని వదిలిపెట్టి వెళ్ళడం లేదు. పత్రికకి నాలాంటి వ్యక్తులు పనికిరారని నాకనిపించింది. నావల్ల పత్రికకు, పార్టీకి ఎలాంటి నష్టం కలుగకూడదు. ఇక నుండి సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. కార్యకర్తగా పనికిరానని పార్టీ భావిస్తే ఎలాంటి వివాదాలు సృష్టించకుండా సంస్థ నుండి మౌనంగా బయటికి వెళ్ళిపోతాను.
నేను మనుషుల్ని ప్రేమిస్తాను. మనుషులు ఎవరయినా వారు చేసే పనులు, వారి ఆచరణను బట్టే గౌరవిస్తాను.
పార్టీ ఒడిలోనే తుది శ్వాస విడవాలని నేను కోరుకుంటున్నాను. అది సాధ్యం కానప్పుడు ప్రజల మధ్య నా చివరి మజిలీ ముగిస్తాను.
ధన్యవాదాలతో…
మీ
పాండురంగారావు
(తెలుగులో విస్తృతంగా రాసే రచయితల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. 56 నవలలు, 400కు పైగా కథలు అచ్చయ్యాయి. టీవీ సీరియల్స్‌కు, సినిమాలకు మాటలు, కథలు, స్క్రీన్ ప్లే అందిస్తూ వుంటారు. వేలాది టీవీ సీరియల్ ఎపిసోడ్లకు రచయిత. వివిధ పత్రికల్లో కాలమ్స్ నిర్వహించారు. వీరి కథలకి, నవలలకి అనేక బహుమతులు లభించాయి. నివాసం హైదరాబాద్.)