దృష్టి

ఆ బృందంలోని కొందరికి కోపం వచ్చింది.

‘‘ఈమధ్య మీరు మన సిద్ధాంతాల్ని విమర్శించే రచయితల కథలు ప్రచురిస్తున్నారు. ఆ రకంగా మీరు వ్యక్తిగత సంబంధాలు పెంచుకుంటున్నారు.’’

‘‘మన పత్రిక పాలసీకి భిన్నంగా వేసిన కథ ఒకటి చెప్పండి,’’ అన్నాడు రంగారావు సూటిగా.

అక్కడ కొద్ది క్షణాలు నిశ్శబ్దం.

‘‘ఆ రచయతలు అన్ని పత్రికలకి రాస్తున్నారు. మనం విస్తృతంగా జనంలోకి వెళ్ళాలనుకుంటున్నాం. మన పత్రికకు ఇది ఫలానా పార్టీ పత్రిక అని ముద్రపడకుండా వుండాలి. అయినా ఇది మన పార్టీ అధికార పత్రిక కాదు. ఇది సాహిత్య, సాంస్కృతిక, సిద్ధాంత పత్రిక. మీరు ఏ వ్యక్తిగత పరిచయాల గురించి అడుగుతున్నారు. ఆరోపిస్తున్నారు. అందుకు అడుగుతున్నాను. మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఇతర శత్రుపార్టీల వారితో సంబంధాలు లేవా? అలాంటివారితో సామ్యం పొందటం లేదా? అధికార పార్టీతో పనులు చేయించుకోవటం లేదా? ఒకే వేదికల మీద కలిసి ప్రసంగించటం లేదా?’’ రంగారావు స్వరం ఆ హాల్లో ప్రతిధ్వనించింది.

‘‘ప్రజల సమస్యల కోసం కొన్ని పనులు చేయాల్సి వుంటుంది.’’

‘‘ఇది కూడా అందులో భాగం. విశ్వేశ్వరయ్యగారి వ్యక్తిత్వం, ప్రజల్లో ఆయనకున్న స్థానం వల్లనే నేను ఆ వార్తకు కాస్త ప్రాధాన్యత ఇచ్చాను. మన సిద్ధాంతాలకు భిన్నమైన వ్యక్తులను మనం స్వంతం చేసుకుంటున్నాం. మన పార్టీనే కాదు, మన వ్యతిరేకులు కూడా ఇలానే చేస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుపుకుపోవటం. అంతేకాదు, పత్రిక మనుగడ కోసం సవాలక్ష చెత్త ప్రకటనలు వేస్తున్నాం. వాటినే మనం వ్యతిరేకిస్తున్నాం గానీ వాటిని తిరస్కరించే స్థితిలో లేం,’’ అన్నాడు రంగారావు.

‘‘మీ వివరణ పూర్తయింది. మేం బాధ్యులకి మా రిపోర్ట్‌ అందజేస్తాం. మీరు వెళ్ళవచ్చు,’’ అన్నారు.

‘‘ధన్యవాదాలు,’’ అని తన ఛాంబర్‌కి వెళ్ళిపోయాడు రంగారావు.


రామచంద్రయ్య వచ్చాడు.

‘‘అయ్యా కాఫీ తీసుకురమ్మంటారా?’’ అన్నాడు.

‘‘ఇప్పుడేం వద్దు,’’ అన్నాడు రంగారావు.

రంగారావుకేసి విచారంగా చూసి వెళ్ళిపోయాడు.

ఇరవై సంవత్సరాలకు పైబడి రంగారావు ఒంటిచేత్తో పత్రికను నడుపుకుంటూ వస్తున్నాడు. పేరుకి ఎడిటోరియల్‌ బోర్డ్‌ వుంది. అందులో చాలా సభ్యులు మారిపోయారు. కొంత మంది చనిపోయారు. అప్పట్లో ఒకరిద్దరు అతనికి సహకరించే వారు. ఇంకొందరు వయసు మీరటంతో వ్రాయలేకపోతున్నారు.

ఇప్పుడున్నవారిలో చాలామంది పత్రిక పేజీలు కూడా తెరవరు. కొంతమంది ప్రకటనలు సేకరించి ఇస్తారు. అదే పత్రికకు చేసే గొప్ప సేవనుకుంటారు. అది కూడా సీరియస్‌గా చేయరు. సంవత్సరానికి ఒకటో, రెండో.

కొన్ని సందర్భాల్లో పత్రిక సర్క్యులేషన్‌ పెంచాలంటారు. క్యాంపెయిన్‌కి పిలుపునిస్తారు. కొన్ని పత్రికలకి చందాలు కట్టిస్తారు లేదా కొన్ని తామే కడతారు. ఇప్పటివరకు పత్రికలో కంటెంట్‌ గురించి తీవ్రంగా చర్చించిన దాఖలాలు లేవు.

‘‘ఈ విషయంలో మీకు మేం ప్రత్యేకంగా చెప్పేదేం వుంటుంది,’’ అనేవారు.

‘‘పత్రికను బయటి పాఠకులు చదవటం వేరు. ముందు మన కార్యకర్తలతో చదివించండి. ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వండి,’’ అని ఎన్నోసార్లు రంగారావు మొత్తుకునేవాడు. వారికి ఎప్పటికప్పుడు రోడ్ల మీదికి రావటంతోనే సరిపోతుంది అనేవారు తప్ప అలాంటి ప్రయత్నం చేయలేదు. పార్టీ సభ్యులు ఇతర పత్రికలు చదువుతారు తప్ప ఈ పత్రిక చదవరు. అది నగ్నసత్యం.

ఇంకొందరు సంపాదకవర్గంలో తమ పేరు చూసుకుని మురిసిపోతుంటారు. ఆ హోదాని వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటారు. ఒకరిద్దరు రచనలు చేయగల శక్తి వున్నవారు. వారు పత్రికకి రచనలు పంపేవారు కాదు. పెద్దపెద్ద సర్క్యులేషన్‌ వున్న దినపత్రిక లకి పంపేవారు. ప్రత్యేక సంచికలు వేస్తున్నప్పుడు చివరి నిముషం దాకా ఎన్ని ఫోన్లు చేసినా, ‘ఇదిగో అదిగో’ అంటుండే వారు.

‘‘మీరు మన పత్రికకి వ్రాయకపోతే ఎలా?’’ అని రంగారావు ఒత్తిడి చేస్తుంటే ఒకతను చెప్పాడు.

‘‘మన పత్రికని చదివేవారు తక్కువ. అదే పెద్ద పత్రికలో అయితే మన భావాలు ఎక్కువమందికి చేరతాయి. ఎక్కువ మందిని ఆకర్షించటమే కదా మనకు కావలసింది.’’

‘‘కనీసం మనకున్న పాఠకులను కాపాడుకోవాలి. మన కార్యకర్తలను నిలుపుకోవాలి. ఇతర పత్రికలకు మిమ్మల్ని రాయవద్దని నేను అనటం లేదు. ఇది కర్తవ్యంగా పెట్టుకోండి,’’ అని రంగారావు వాదించాడు.

‘‘పోనీ ఆ పత్రికల వ్యాసాల్ని మన పత్రికలో రీప్రింట్‌ చేయండి. ఆ పత్రిక సౌజన్యంతో అని ప్రచురించండి.’’

రంగారావు వాదించటం మానేశాడు.

అతని చేతికి పత్రిక వచ్చేటప్పటికి అద్దెకి తీసుకున్న చిన్న గది, అందులో రెండు టేబుల్స్‌ వుండేవి. ఓ సహాయకుడు మాత్రం వుండేవాడు. అతనికి పత్రిక పనితో పాటు పార్టీ పని వుండేది. బయట ప్రెస్‌లో ప్రింట్‌ చేసేవారు.

కొంతమంది సంపాదకవర్గ సభ్యులుగా వుండటం వల్లనే వారి రచనలు అచ్చయ్యేవి. అసెంబ్లీలో ఆ పార్టీకి ఇద్దరు ముగ్గురు ఎం.ఎల్‌.ఎ.లు వుండేవారు. అయినా వారికో నాయకుడు వుంటాడు. ఎవరు శాసనసభాపక్ష నాయకుడయితే వారికి పత్రికలూ, మీడియా ప్రాధాన్యం ఇస్తుంది.

ఎలాంటి అధికార హోదా లేకపోయినా ప్రాధాన్యత ఇవ్వటమనేది వ్యక్తిగత ప్రతిభ మీద, ప్రవర్తన మీద, ప్రజల్లో వారికున్న స్థానం మీద ఆధారపడి వుంటుంది.

అలా ఓ గదిలో ప్రారంభమైన ఆ పత్రికని మూడు గదుల అద్దె భవనంలోకి మార్పించాడు. ఆ తర్వాత కాలంలో స్వంత భవనం, స్వంత ప్రెస్‌ ఏర్పాటు చేయాలనుకున్నాడు. పార్టీ ప్రముఖుల్ని కదిలించాడు.

అలా భవన నిర్మాణానికి పిలుపునిచ్చారు. అక్కడ వుండే రంగారావుకి మరో ప్రపంచం లేదు. పత్రిక, భవన నిర్మాణం. రామచంద్రయ్యకి రంగారావుతోనే లోకం.