ఫిల్‌హార్మోనిక్ బాక్సాఫీసులో ఉన్న వాలంటీర్, ‘‘ఇదిగోండీ మీ టికెట్. మీరు c.e.o. బాక్సులో కూర్చుంటారు. యూ గాట్ ద బెస్ట్ సీట్ ఇన్ ద కాన్సర్ట్ హాల్. మీకు మిసెస్ మైరా పొలిన్స్కీ ఎలా తెలుసు?’’
‘‘నాకామె తెలియదు. ఒకవేళ కలిస్తే, ఇవాళే మొదటిసారి,’’ అంది డాక్టర్ నిసి షామల్.
‘‘షి ఈజ్ ఏ గ్రేట్ లేడీ. యూ విల్ బి ఇంప్రెస్డ్.’’
ఎవరీ మైరా? తనైతే షోపేన్ వినటానికి వచ్చింది. పియానో లైవ్ కాన్సర్ట్. మాస్కోలో ప్రైజు గెలుచుకుని, అప్పట్నించీ దేశ విదేశాల్లో మంచి బుకింగ్స్ సంపాదించుకుని, లాస్ ఎంజెలేస్‌లో సెటిల్ అయిన అమెరికన్ పియానిస్ట్. ‘బాక్సాఫీసులో నీకోసం టికెట్ ఉంటుంది తీసుకో, నేనూ జూలీ అక్కడ కలుస్తాం,’ అని అంత మాత్రమే బిల్ చెప్పాడు. ఈ మైరాని గురించి ఏం చెప్పలేదే? అంటే ఈ నగరంలో అందరికీ (తనకు తప్ప) ఈమెగారు తెలుసు అన్నమాట- అనుకుంది నిసి.
ప్రోగ్రాం తీసుకుని, తిన్నగా పైన బాక్సులోకి పోయి,తన సీటు నంబరు చూసుకుని కూర్చొంది. ఆమెకు ఆ ఎత్తుకు, కొంచెం తల తిరిగింది. పొట్టలో చిన్న నాసియా కెరటం. మరీ ముందు సీటు. రెయిలింగ్ పట్టుకుని సర్దుకుని కూర్చొంది. గభాలున ముందున్న పిట్టగోడ మీద పెట్టిన తన పర్సును తీసి, జాగ్రత్తగా తన పక్కగా పెట్టుకుంది. అమ్మయ్యో! ఆ పెద్ద బరువు పర్సుగాని గోడ మీద నుంచి కిందకి పడితే- సరిగ్గా కింద వరసల్లో ఖర్వాటు లెందరున్నారో, ఆ ‘ధర ఖర్వాటుడొకండు,’ పద్యంలోలాగా- మత్పర్సు పాత వేగమునకున్ తక్ష్షణమున్ తచ్చిరమున్ విచ్చెన్… లాంటి ఉపద్రవం, జరగ్గూడదు. అమ్మయ్యో! అసలే ఏదీ సరిగ్గా సాగటల్లేదు ఈ సాయంత్రం. ఆమె ఎవరోగానీ, లెట్ మీ నాట్ అప్ సెట్ మై హోస్టెస్, అనుకుని- షోపాన్ గురించి ఏవో ఆలోచనల్లో పడింది.
కొంచెంసేపట్లో, ‘ద వ్యూ’ షోలో ఊపీ గోల్డ్‌బర్గ్‌లాగా ఒక చాలా వదులుగా ఉన్న డ్రెస్ వేసుకుని, పైనా అలాగే, ఊపీ లాగా, ఓవర్ సైజు పలచటి పొడుగు సిల్కుకోట్ వేసుకున్న ఒక స్త్రీ వచ్చింది. ఆమె ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంది. వయసు మళ్ళిన ఎలిజబెత్ టేలర్‌లా ఉందామె.
నిసి లేచి తనను పరిచయం చేసుకుంది.
ఆమె ఆప్యాయంగా కౌగిలించి, ‘‘ఇంతకు ముందు చూశా నేనెక్కడో నిన్ను. ఎక్కడ కార్డియాలజిస్టుగా పనిచేసింది?’’
‘‘అయాం సారీ. నేను ఆంకాలజిస్ట్‌ని. గుండె డాక్టర్‌ని కాను.’’
ఇంతలోకి బిల్ క్లిఫర్డ్, అతని భార్య (నర్సు), ఇంకో నల్ల జంట (డెంటిస్టులు) బాక్సులోకి వచ్చారు.
మైరా, బిల్‌ని కోపంగా చూస్తూ, ‘‘ఏమయ్యా! నీ ఒక్క మాట నమ్మేదిలేదు. కార్డియాలజిస్టులను ఈ సాయంత్రం ప్రోగ్రాంకి పిలుస్తున్నానన్నావ్?’’
నిసికి నిమిషంలో అర్థమయింది. బిల్, మెడికల్ ప్రొఫెషన్ నుంచి కొందరిని, మైరాకి ఆ సాయంత్రం సి.యి.ఓ. బాక్సులో కంపెనీకి ఎన్నుకున్నాడు. ఎందుకో మరి? మైరా వారికి, అతని ద్వారా స్పెషల్ ఇన్విటేషన్లు పంపింది. కాని మైరాకి ఎవరొచ్చేదీ సరిగ్గా తెలియదు.
నిసికి కూడా, తన హోస్టెస్ గురించి కొంచెం కూడా తెలీదు. కానీ, వ్యవహారం చూస్తుంటే, ఆమె ఊళ్ళో ప్రముఖ వ్యక్తిలాగా ఉంది.
పాపం, బిల్‌కి తన వల్ల బిజినెస్ డీల్ ఏమీ దెబ్బతినదు కదా! అతడు మంచివాడు. తన ఒంటరితనం గురించి తెలిసిన వాడు. తను అతని గేలరీలో స్టైన్ వే పియానో కొనుక్కున్నప్పటి నించీ మంచి స్నేహితుడయ్యాడు. తనకి చక్కని పాశ్చాత్య సంగీతం వినిపించాలని, ఆ ఊళ్ళో నలుగురితో తను కలిసి, పార్టీలలో నవ్వుతూ పాల్గొనాలనీ అతని కోరిక.
నిసి, చనువుగా- ‘‘ఎక్కడో పొరపాటు. కానీ ఆ కార్డియాలజిస్ట్ కన్నా నేను లక్కీ. మిమ్మల్ని కలిశాను. ఈ అందమైన సాయంకాలం మీ అందరితో కలిసి షోపాన్ వినబోతున్నా,’’ అంది.
మైరా కరిగిపోయింది. వెంటనే సర్దుకుని,- ‘‘ఈ కాన్సర్ట్ పియానిస్ట్‌ని తప్పకుండా వినాలి. హి ఈజ్ ఎ డ్రీం. తర్వాత చిన్న పార్టీ. అతన్ని, ఫిల్‌హార్మోనిక్ మ్యూజిక్ కండక్టర్ నీ ముఖాముఖీ కలవొచ్చు.’’
కింద, ఆర్కెస్ట్రా మొదలయింది. వారంతా నిశ్శబ్దమైపోయి ప్రోగ్రాంలో లీనమైపోయారు.
మధ్యలో ఒకసారి, నిసి పక్కని నర్సు, చెవిలో గుసగుసగా అంది. ‘‘మైరాకి ఇప్పుడు ఎనభయ్యిల్లో వయసు. ఒక ముప్పయ్యేళ్ళుగా ఈ ఫిల్‌హార్మోనిక్‌ని పెంచుతూ వచ్చింది.’’
‘‘ఓ! హౌ నైస్! నాకీమె అసలు తెలియదు, అంత అందంగా ఎలా ఉంది!’’ అంది నిసి.
మళ్ళీ సంగీతంలో విరామం వచ్చినప్పుడు, మళ్ళీ నిసి చెవిలో, నర్సు జూలీ, ‘‘క్రేజీ కూట్స్- అని వరసగా పదిహేనో ఎన్నో ఎమ్మీ ఎవార్డులు వచ్చాయి. సెమీ రియాలిటీతో అల్లిన సీరీస్ అవి. ఆ షోలో హీరో, మైరా భర్తని ఆధారంగా తీసుకుని, రాశారు. అతడు ఒక బిజినెస్ టైకూన్.’’
నిసి- ‘‘1950, 60ల్లో అమెరికాలో, న్యూయార్క్‌లో అడ్వర్టయిజింగ్ జయంట్స్‌ని గురించిన షోనా? ఓరినీ! నే నమ్మ లేకపోతున్నా.’’
నర్సు గర్వంగా- ‘‘ఐ నో. యు డోంట్ నో. హీ ఈజ్ డెడ్. మైరా ఈజ్ ఎ పవర్ హౌస్ ఇన్ దిస్ టౌన్,’’ అతి మెల్లగా అని ఊరుకుంది.
నిసి- ఇప్పటికైనా తన హోస్టెస్‌ని గురించి కొంతైనా తెలిసింది కదా అని ‘అప్పుడప్పుడూ సొసైటీ గురించి నాకు అప్ డేట్లు పంపమనాలి జూలీని,’ అని మెంటల్ నోట్‌పేడ్‌లో రాసు కుంది.
పియానిస్ట్, కేజువల్గా డ్రెస్ చేసుకున్నాడు. కాన్సర్ట్ పియానిస్ట్ నల్లదుస్తుల డ్రెస్‌కోడ్, ఫిల్‌హార్మోనిక్ వారి స్టేజ్ ఆచారాలు ఏమీ పాటించలేదు. కానీ ఆ సాయంత్రాన్ని పూర్తిగా డామినేట్ చేశాడు. సందేహం లేకుండా ఆ సాయంత్రం, ఇతర వయొలిన్, వయోలా వాయిద్యగాళ్ళు అతనికి కేవలం కొంత సపోర్ట్ మాత్రమే.
విరామంలో, మైరా గెస్ట్‌లకు బాక్సులోనే ఆతిథ్యం. నిసి తనకు షాంపేన్ కావాలంది. మైరా, తను మద్యం తాగనని, కావాలంటే పక్క బాక్సు నుంచి తెప్పిస్తానంది.
‘‘వద్దులే. మంచినీళ్ళు ఇవ్వు, చాలు,’’ అంటే మైరా నవ్వుతూ, ‘‘ఇండియానాలో, స్టేట్ యూనివర్సిటీలో, నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు తీసుకుంటున్నప్పుడు, నాకు కొందరు ఇండియన్ స్టూడెంట్లని ఎసైన్ చేసేవారు. నన్ను వాళ్ళు ‘మీరా’ అని పిలిచేవాళ్ళు. నేను అప్పుడప్పుడూ, వాళ్ళకు కర్రీ పౌడరూ, క్యూమిన్ వేసి వంటచేసి పెట్టేదాన్ని. మగపిల్లలు ఇండియా పెళ్ళి చేసుకోటానికి పోయి వస్తుండేవారు. తిరిగి వచ్చినప్పుడల్లా, మీ దేశంలో పొడుగ్గా వేసుకునే అంగీలు – వాటిని ఏమంటారూ?’’ అని నిసిని భుజం మీద పొడుస్తే, ఆమెకు మైరాకి కావాల్సిన పదం ఏమిటో గబుక్కున తెలియలేదు.
పక్కన నర్సు- ‘‘నెహ్రూ కోట్,’’ అని టక్కున అందించింది.
మైరా- ‘‘నాకు ఆ ‘నెహ్రూ కోట్’, ప్రతిసారీ మళ్ళీ ఒక ‘సారీ’ తెచ్చి ఇచ్చేవారు. నేను ఇండియన్‌లకు పార్టీలిచ్చేప్పుడు, అవి చుట్టుకునేదాన్ని. మగపిల్లలు, వాళ్ళకు నా వంట బాగుండే దంటా, నన్ను వాళ్ళ పెళ్ళాలకు కుకింగ్ కోర్సులు తియ్యమనే వాళ్ళు,’’ అంది.
డెంటిస్టులు, బిల్, మౌనంగా ఆ సంభాషణ వింటున్నారు.
నిసి, ‘‘1960లా? అప్పుడు నేనేం చేస్తున్నానబ్బా!’’ అంది తమాషాకి.
‘‘నువ్వింకా హైస్కూలు దాటి ఉండవు. షికాగోలో ఏ హాస్పిటల్లో పని చేశావు?’’ అంది నిసిని.
‘‘ఎక్కడా చెయ్యలా. నేను న్యూయార్క్ డాక్టర్‌ని. ఇల్లినాయ్, ఇండియానాలో యూనివర్సిటీలు, హాస్పిటల్స్ నాకు అసలు తెలీదు.’’
మైరా మళ్ళీ బిల్‌ని తినేసేట్టు చూసి- ‘‘గుండె డాక్టరూ కాదు, షికాగో నుంచీ రాలేదు? అన్నీ తప్పే. నువ్వు చెప్పే వాయిద్యం ఒక్కటి కూడా ఇక నేను కొనను,’’ అంది.
బిల్ అస్పష్టంగా ఏదో అన్నాడు, ఇంకో డాక్టర్ , ఎందుకో రాలేదంటూ.
తర్వాత మైరా, తనకీ మధ్యే వచ్చిన గుండెజబ్బు గురించీ, నాలుగు వారాలు టెక్సాస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తే భరించలేక పోయాననీ, హాస్పిటలో భోజనం ఇంత కూడా సహించక ఇండియన్ స్పైసీ వంట చేసుకుని తిన్నట్టూ, అక్కడి డాక్టర్లకు, సంగీతం వినిపిస్తే చాలు పేషెంట్లకు, జబ్బులన్నీ నయమై పోతాయి, ఇప్పటి పిచ్చి వైద్యాలు మానేసి, ఒక సంగీతం విభాగం తెరవమని తను చెప్పినట్టూ-
ఇలా కబుర్లన్నీ – ఆమే చెపుతోంది. పెద్దామెగదా. బాక్సు ఆమెదేనయ్యే. ఫిల్‌హార్మోనిక్ అంటారా, అదీ ఆమె క్రియేషన్. మల్టీ మిలియనీరు. ఆ grand dame మాటలు, మిగతావారు మర్యాదగా, అప్పుడో మాట అప్పుడో మాట అందిస్తూ విన్నారు.
నిసిని మాత్రం, ఆ విరామం అంతసేపూ, భుజం మీద వేసిన చెయ్యి తియ్యకుండా, కావిలించుకునే ఉంది. ప్రోగ్రాం అయిపోయాక, తన ప్రైవేట్ పార్టీలో, కాన్సర్ట్ పియానిస్ట్‌కి పరి చయం చేసింది. ‘‘అతనితో మాట్లాడాలంటే నాకు భయం. నాకు సంగీతం గురించి ఏం తెలుసనీ? కొంచెం రిలాక్స్ అవటానికి ఇప్పుడైనా ఇంత ఎర్ర వైను ఇస్తావా మైరా?’’ అంటే,
‘‘ఆల్కహాల్ నా చేత్తో నేనివ్వను. కావాలంటే బార్ ఓపెన్‌గా ఉంది తెచ్చుకో,’’ అనేసి వెళ్ళిపోయింది మైరా.
నిసి, పియానిస్ట్‌ని- అతడి పియానో వాయిద్యం అద్భుతంగా ఉందనీ, షోపన్ పియానో వింటే, అతని కాలపు ఉమన్ రైటర్- జార్జ్ సేండ్స్‌కి, షోపన్ పియానో కిందే పడుకుని ఎందుకు ఉండి పోవాలనిపించిందో నాకిప్పుడు తెలిసింది -అని చెప్పింది.
అతను- ‘‘ఓ! పాత మూవీ promptu, రైట్? నాకూ ఇష్టం,’’ అని నవ్వాడు.
పార్టీ అయిపోయాక, కారులో వెనక్కి వస్తూ, మైరా కబుర్లు గురించి ఆలోచించింది నిసి. ప్రపంచానికి, ఇంకా ఇండియా ఉత్త చీరలూ, కర్రీ పౌడరూ, మసాలా దినుసులలాగా కనిపిస్తోందా? అనుకుంది.
ఈమెను మీరా అని ఇండియన్ విద్యార్ధులు పిలవటం- కూల్ డ్రింక్‌లూ, కాస్మెటిక్సూ అమ్మే బొమ్మలూ, కేప్షన్లూ సృష్టించిన ఈమె తర్వాత క్లాసికల్ సంగీతానికి అంకితం కావటం, తన వ్యాపారపు చాకచక్యం ఇలా దారి మళ్ళించి, సంగీతాన్ని ప్రజలకు అమ్మటమే (అదేలే ప్రజల అభిరుచిని మెరుగు పరచటం,) రోజువారీ కార్యక్రమంగా చేసుకోటం విచిత్రంగా అనిపించింది.
నిసికి ఏదో సందిగ్ధం? మైరా తనతో ఆదరంగానే మాట్లా డిరది. కానీ ఆమెకు ఏదో ఆందోళన? తన వల్ల? ఏదో అయిష్టం?
ఉత్కంఠ ఆపుకోలేక, ఇంటర్ నెట్లో వెతికింది. మైరాని గురించీ, ఆమె భర్తని గురించీ వివరంగా చదివింది.
ఇదీ అక్కడ ఇచ్చిన సమాచారం.
రేమండ్ పొలిన్స్కీ 1950ల నుండీ ఓ ముప్పయ్ నలభై ఏళ్ళు, అతడు పనిచేసిందంతా, సిగరెట్ల అడ్వర్టైజ్‌మెంట్స్ రాయటానికి. సిగరెట్ తాగటం గ్లామరస్ అని చూపటానికి. బిల్ బోర్డ్‌ల మీద, ఆకర్షణీయమైన బొమ్మలూ, కేచీ స్లోగన్‌లతో, ప్రజలను ఆకర్షించి, సిగరెట్ల అమ్మకం పెంచటానికి.
రేమండ్ పొలిన్స్కీ ఛైన్ స్మోకర్. ఆల్కహాలిక్. ఉమనైజర్.
యాభయ్యిల వయసులో రేమండ్, మొదటి భార్యకు విడాకులిచ్చి, మైరాని రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరూ బిజినెస్ ఎక్సెక్యుటివ్‌లుగా ఎంతో పైకి వచ్చారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఆరాధన. మోజు. మైరాని పెళ్ళి చేసుకున్న ఒక పదేళ్ళలోనే, అతడు జబ్బుపడి, చనిపోయాడు.
ఇటీవలికాలంలో, మెడికల్ సైన్సు ద్వారా, సిగరెట్లు కాల్చ టానికీ -లంగ్ కేన్సర్, ఇతర కేన్సర్లకూ ఉన్న సంబంధం, టొబాకో వల్ల కలిగే ఇతర హానీ, బైటపడింది. ఆ తర్వాత, అమెరికాలో, టొబాకో కంపెనీల వాళ్ళు, డాక్టర్ల పరిశోధనా ఫలితాలను మాఫు చెయ్యటానికి ఎంతో ప్రయత్నించారు. సిగరెట్ల వల్ల అనారోగ్యం వచ్చిన ప్రజల క్లెయింలు రద్దు చెయ్యటానికీ, నష్ట పరిహారాలు ఇవ్వకుండా చూట్టానికీ, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. కాని కాల క్రమేణా, సిగరెట్లు తాగటం ప్రమాదకరమని వార్నింగులు, తప్పని సరి అయ్యాయి.అమెరికాలో సిగరెట్లు పబ్లిక్ ప్లేసుల్లో కాల్చటం నిషేధించారు. సిగరెట్ అడ్వర్టైజ్‌మెంట్ విజర్డ్‌గా, షోకి లాగా, 1960 ల అప్పటి సమాజంలో పలుకుబడి, డబ్బు సంపాదించిన రేమండ్ పొలిన్స్కీ లాంటి వాళ్ళకి, ఇప్పుడు సమాజంలో విలువ సున్నా కూడా కాదు, మైనస్.
కేన్సర్ ఫీల్డ్‌లో పని చేసిన నిసికి, ఈ సిగరెట్టులు, పొగాకు చుట్టలు, చరిత్ర తెలియనిదా? మైరా భర్త ఎలా మరణించాడో, ఏ జబ్బుతో మరణించాడో, నిసికి ఊహించటం కష్టమా? ఒక గాఢ ప్రేమికగా, మైరా సొంత వేదనలు, ఆత్మకథల రూపంలో ప్రజలకు చేసుకునే నివేదనలు, తెలిసో తెలియకో వృత్తులలో ఇతరులకు చేసిన కీడుకు చేసుకునే ప్రాయశ్చిత్తాలు, ఇట్టి మనస్సంఘర్షణలు, నిసికి తెలియనివా?
(లైలా యెర్నేని ఇండియాలనూ, అమెరికాలోనూ చదువుకుని పాతికేళ్ళు అమెరికాలో డాక్టరుగా పనిచేసి, విరమించి, పుస్తకాలు చదువుకుంటూ, అప్పుడప్పుడూ సినిమాలు చూస్తూ, కాన్వాసు మీద బొమ్మలు వేస్తూ ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నారు.)