తళుకు తారల నీలి మేలిముసుగును దాల్చి
వలపుల నిశాకాంత వడి వడిగ తానొచ్చి
వక్షాన వాలితే కరుణతో ఉప్పొంగి
శ్యామలుడు, సాగరుడు, శాంత గంభీరుడు
కోమలిని నిశను, తన కౌగిటను పొదిగి
మురిపాల నురగల నోలలాడించాడు, ప్రియను
ప్రణయ తరంగాల డోల లూగించాడు.
కొల్లలుగ తారామణులున్న
ధనవతిరొ రేరాణి!
నిశ్శబ్ద నిగూఢ రాగాల రారాణి
చిక్కని నలుపుల చక్కని రమణి.
మణులు మాణిక్యాలు గల మహరాజు సాగరుడు
లోతులెరుగగ లేని అతిలోకపురుషుడు
అంతు జూడగ గాని అధిక బలశాలి
రేరాణి కతడెగా దీటైన రారాజు!
సృష్టికర్తను మించు సంధాన కర్తయె లేడు!
వాని శృంగార గీతాలె విందునే మున్ముందు.