గ్రాండ్‌ డేమ్‌

తర్వాత మైరా, తనకీ మధ్యే వచ్చిన గుండెజబ్బు గురించీ, నాలుగు వారాలు టెక్సాస్‌ హాస్పిటల్లో ఉండాల్సి వస్తే భరించలేక పోయాననీ, హాస్పిటలో భోజనం ఇంత కూడా సహించక ఇండియన్‌ స్పైసీ వంట చేసుకుని తిన్నట్టూ, అక్కడి డాక్టర్లకు, సంగీతం వినిపిస్తే చాలు పేషెంట్లకు, జబ్బులన్నీ నయమై పోతాయి, ఇప్పటి పిచ్చి వైద్యాలు మానేసి, ఒక సంగీతం విభాగం తెరవమని తను చెప్పినట్టూ-

ఇలా కబుర్లన్నీ – ఆమే చెపుతోంది. పెద్దామెగదా. బాక్సు ఆమెదేనయ్యే. ఫిల్‌హార్మోనిక్‌ అంటారా, అదీ ఆమె క్రియేషన్‌. మల్టీ మిలియనీరు. ఆ grand dame మాటలు, మిగతావారు మర్యాదగా, అప్పుడో మాట అప్పుడో మాట అందిస్తూ విన్నారు.

నిసిని మాత్రం, ఆ విరామం అంతసేపూ, భుజం మీద వేసిన చెయ్యి తియ్యకుండా, కావిలించుకునే ఉంది. ప్రోగ్రాం అయిపోయాక, తన ప్రైవేట్‌ పార్టీలో, కాన్సర్ట్‌ పియానిస్ట్‌కి పరి చయం చేసింది. ‘‘అతనితో మాట్లాడాలంటే నాకు భయం. నాకు సంగీతం గురించి ఏం తెలుసనీ? కొంచెం రిలాక్స్‌ అవటానికి ఇప్పుడైనా ఇంత ఎర్ర వైను ఇస్తావా మైరా?’’ అంటే,

‘‘ఆల్కహాల్‌ నా చేత్తో నేనివ్వను. కావాలంటే బార్‌ ఓపెన్‌గా ఉంది తెచ్చుకో,’’ అనేసి వెళ్ళిపోయింది మైరా.

నిసి, పియానిస్ట్‌ని- అతడి పియానో వాయిద్యం అద్భుతంగా ఉందనీ, షోపన్‌ పియానో వింటే, అతని కాలపు ఉమన్‌ రైటర్‌- జార్జ్‌ సేండ్స్‌కి, షోపన్‌ పియానో కిందే పడుకుని ఎందుకు ఉండి పోవాలనిపించిందో నాకిప్పుడు తెలిసింది -అని చెప్పింది.

అతను- ‘‘ఓ! పాత మూవీ promptu, రైట్‌? నాకూ ఇష్టం,’’ అని నవ్వాడు.

పార్టీ అయిపోయాక, కారులో వెనక్కి వస్తూ, మైరా కబుర్లు గురించి ఆలోచించింది నిసి. ప్రపంచానికి, ఇంకా ఇండియా ఉత్త చీరలూ, కర్రీ పౌడరూ, మసాలా దినుసులలాగా కనిపిస్తోందా? అనుకుంది.

ఈమెను మీరా అని ఇండియన్‌ విద్యార్ధులు పిలవటం- కూల్‌ డ్రింక్‌లూ, కాస్మెటిక్సూ అమ్మే బొమ్మలూ, కేప్షన్లూ సృష్టించిన ఈమె తర్వాత క్లాసికల్‌ సంగీతానికి అంకితం కావటం, తన వ్యాపారపు చాకచక్యం ఇలా దారి మళ్ళించి, సంగీతాన్ని ప్రజలకు అమ్మటమే (అదేలే ప్రజల అభిరుచిని మెరుగు పరచటం,) రోజువారీ కార్యక్రమంగా చేసుకోటం విచిత్రంగా అనిపించింది.

నిసికి ఏదో సందిగ్ధం? మైరా తనతో ఆదరంగానే మాట్లా డిరది. కానీ ఆమెకు ఏదో ఆందోళన? తన వల్ల? ఏదో అయిష్టం?

ఉత్కంఠ ఆపుకోలేక, ఇంటర్‌ నెట్లో వెతికింది. మైరాని గురించీ, ఆమె భర్తని గురించీ వివరంగా చదివింది.

ఇదీ అక్కడ ఇచ్చిన సమాచారం.

రేమండ్‌ పొలిన్స్కీ 1950ల నుండీ ఓ ముప్పయ్‌ నలభై ఏళ్ళు, అతడు పనిచేసిందంతా, సిగరెట్ల అడ్వర్టైజ్‌మెంట్స్‌ రాయటానికి. సిగరెట్‌ తాగటం గ్లామరస్‌ అని చూపటానికి. బిల్‌ బోర్డ్‌ల మీద, ఆకర్షణీయమైన బొమ్మలూ, కేచీ స్లోగన్‌లతో, ప్రజలను ఆకర్షించి, సిగరెట్ల అమ్మకం పెంచటానికి.

రేమండ్‌ పొలిన్స్కీ ఛైన్‌ స్మోకర్‌. ఆల్కహాలిక్‌. ఉమనైజర్‌.

యాభయ్యిల వయసులో రేమండ్‌, మొదటి భార్యకు విడాకులిచ్చి, మైరాని రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరూ బిజినెస్‌ ఎక్సెక్యుటివ్‌లుగా ఎంతో పైకి వచ్చారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఆరాధన. మోజు. మైరాని పెళ్ళి చేసుకున్న ఒక పదేళ్ళలోనే, అతడు జబ్బుపడి, చనిపోయాడు.

ఇటీవలికాలంలో, మెడికల్‌ సైన్సు ద్వారా, సిగరెట్లు కాల్చ టానికీ -లంగ్‌ కేన్సర్‌, ఇతర కేన్సర్లకూ ఉన్న సంబంధం, టొబాకో వల్ల కలిగే ఇతర హానీ, బైటపడింది. ఆ తర్వాత, అమెరికాలో, టొబాకో కంపెనీల వాళ్ళు, డాక్టర్ల పరిశోధనా ఫలితాలను మాఫు చెయ్యటానికి ఎంతో ప్రయత్నించారు. సిగరెట్ల వల్ల అనారోగ్యం వచ్చిన ప్రజల క్లెయింలు రద్దు చెయ్యటానికీ, నష్ట పరిహారాలు ఇవ్వకుండా చూట్టానికీ, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. కాని కాల క్రమేణా, సిగరెట్లు తాగటం ప్రమాదకరమని వార్నింగులు, తప్పని సరి అయ్యాయి.అమెరికాలో సిగరెట్లు పబ్లిక్‌ ప్లేసుల్లో కాల్చటం నిషేధించారు. సిగరెట్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ విజర్డ్‌గా, షోకి లాగా, 1960 ల అప్పటి సమాజంలో పలుకుబడి, డబ్బు సంపాదించిన రేమండ్‌ పొలిన్స్కీ లాంటి వాళ్ళకి, ఇప్పుడు సమాజంలో విలువ సున్నా కూడా కాదు, మైనస్‌.

కేన్సర్‌ ఫీల్డ్‌లో పని చేసిన నిసికి, ఈ సిగరెట్టులు, పొగాకు చుట్టలు, చరిత్ర తెలియనిదా? మైరా భర్త ఎలా మరణించాడో, ఏ జబ్బుతో మరణించాడో, నిసికి ఊహించటం కష్టమా? ఒక గాఢ ప్రేమికగా, మైరా సొంత వేదనలు, ఆత్మకథల రూపంలో ప్రజలకు చేసుకునే నివేదనలు, తెలిసో తెలియకో వృత్తులలో ఇతరులకు చేసిన కీడుకు చేసుకునే ప్రాయశ్చిత్తాలు, ఇట్టి మనస్సంఘర్షణలు, నిసికి తెలియనివా?

(లైలా యెర్నేని ఇండియాలనూ, అమెరికాలోనూ చదువుకుని పాతికేళ్ళు అమెరికాలో డాక్టరుగా పనిచేసి, విరమించి, పుస్తకాలు చదువుకుంటూ, అప్పుడప్పుడూ సినిమాలు చూస్తూ, కాన్వాసు మీద బొమ్మలు వేస్తూ ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నారు.)