కవిత్వం ఎలాఉండాలీ అంటూ అల్లసాని పెద్దన ఆశువుగా చెప్పిన ఉత్పల మాల లోని అచ్చ తెలుగు భాగానికి ఒక తెలుగు అనుసరణ:
కైతను నేను.పైపై పూతను కాను
పసరు పూపను కాను.
ఆసాంతము జిగ్ జిగ్ జిగ్
జిగేల్మని మెరసిపోదును
ఘుం ఘుం ఘుం ఘుమ్మని
పూల సౌరభము వలె
పైకెగసిపోదును.నను తలచావో
రేయనకా పగలనకా
నిను వదలక సలిపే
నువు మరిగిన
మగువ మేని మధుర
పరిమళపు జ్ఞాపకపు
బాధ లాటి తీపి బాధ
రేగాలోయ్
నను విన్నావో
గువ్వ వలె నీకౌగిట వాలిన
నీ కాంత గొంతులో
కువకువలాడిన కూత వినగ
నీలోరివ్వున లేచే కోర్కెలాటి
కమ్మని కోర్కెలు రేగాలోయ్
నను చేత పట్టావో
నీచేతులార బిగియార
కౌగలించిన కన్నెపిల్ల
చిన్నిపొన్నికరకు రొమ్ముల
వలె ముచ్చటగా నే
తగలాలోయ్
నను రుచి చూశావో
నీ జంటనున్నకులుకు మిటారి
కమ్మని ఊటలూరు
ఎర్ర దొండపండు తీపి పెదవి
పంట నొక్కినప్పటి
చవులూరాలోయ్
కైతను నేను
వనరుహ లోచను రాణి
వరవీణా మృదుపాణి
గోటిమీట్ల వీణ మెట్ట్ల
బంగరు తీగల వెంబడి
జాలువారి రంజిల్లెడు
కన్నడ గౌళ రాగము వలె
దిశ దిశలు మార్మోగుచు
గుండెలు ఝల్ ఝల్
మనిపించెడి అచ్చ తెలుగు
కైతను నేనోయ్
కైతను నేను.