An Operetta
Program: Her Waking up; Early morning; Dip in the sea; Breakfast in seaside park with a lover; Preparations of her house and garden for an evening party; Driving to the dance studio; A Waltz with a lover; Return home; A solitary stroll in the garden; A Charmer; Dressing up; Blaming cupid; Awaiting; Afternoon rendezvous with her lover; Snuggle in gazebo; Lunch-Siesta; Evening Pool party: Pairs dancing on terrace, One woman’s appraisal of value of Desire and Sex, Pairs in floats in the pool; After party: Quiet foreplay; Praise of moon; Her passionate Love under the stars; Benediction.
కల జారిపోయె
కలలోన కదలిన ఆ కథ ఏదొ, గురుతు రాదాయె!
వెలుగు రేకలు తోచె
రేకలు జారిపోయె, రంగులు మారిపోయె,
త్రుటిలోన ఆకృతులెల్ల తెల్లమాయె,
తొల్లింటి ఆ విస్మయపు పురిటిమాయ జారిపోయే.
తెలతెల కాంతీ!
తేలి వచ్చేవేళ
తోడు తేవమ్మా తోడి రాగం.
తుహిన స్పర్శలు తోచి
పావురంలా నేను మేలుకుంటాను.
తరుణ కాంతిలో
అలల పొంగుల వాడ!
తనువు జలకమాడించగా
కదలి రావయ్యా!
నాచువలె నా జుట్టు ముఖమంత కమ్మింది
విడదీసి పోవయా,
ముత్యమల్లే నేను మెరిసిపోతాను.
ధరణిలో సుమరాజ్ఞి డెలనిక్స్ అరుణిమలు
తరుఛ్చాయల సరసుడ! నీతో శీతల పెరియాన్ సేవనాలు
ఫ్రాంజిపానీ అపరంజి రాగరంజిత
మృదులమనోహరాంతరంగపు సుదీర్ఘ చుంబనాలు
ఈ కడలి తీరాన, నా కత్యంత ప్రియాలు.
ఫ్లారిడా సముద్ర తీరములోని ఆమె విశాల విశ్రాంతి భవంతిలో; వెనుక పక్కనున్న స్విమ్మింగ్ పూల్. ఇద్దరు క్లీనింగ్ మెన్, పెద్ద గడవాసంతో, నీళ్ళలోని ఆకులు అలములు పోగు చేసి తీసేస్తున్నారు. బీచ్ నుండి తిరిగి వచ్చిన ఆమె బ్రేక్‌ఫాస్ట్ నూక్‌లో పియానోపై పాఠం నేర్చుకుంటున్నది.
ఇంట్లోకీ బైటకూ తిరుగుతూ, నిచ్చెన ఎక్కుతూ దిగుతూ సీలింగ్ నుండీ నేల వరకూ ఉన్న గాజు తలుపుల అద్దాలు అన్నీ కడిగి తుడుస్తున్నాడు టామ్. సాయంత్రం ఆమె ఇవ్వబోయే పార్టీకి, ఆ సన్నాహం. మధ్యలో వచ్చి కత్తెర కావాలన్నాడు. అద్దాలు తుడిచే వాడికి కత్తెర ఎందుకు! కిచెన్లో మొదటి డ్రాయర్‌లో ఉందంటూ చెప్తే కత్తెర తీసుకు పోయాడు. కొంచెం సేపట్లో చేతినిండా లాంగ్ స్టెమ్ రోజెస్‌తో వచ్చి, “వేజ్ ఇస్తావా” అని ఆమె ముఖం చూసి, “డోంట్ గెటప్” అని తనే వేజ్ సెలెక్ట్ చేసుకుని పూలు అమర్చాడు.
తోట ఆమెదే, గులాబీలు ఆమెవే ఐనా కోసుకు వచ్చి తన కోసం అమర్చి, “లైక్ దెమ్?!” అని అడిగిన ఆ విండోవాషర్ మృదుహృదయం ఆమెను అలరించింది. తన పని మధ్యలో ఆపి, ఒక స్త్రీకి, గులాబీలు తెచ్చి ఇవ్వాలన్న ఆలోచన రాని అప్రాచ్యుడెవడు?
“లవ్ దెమ్!” అని తనంటే “డోంట్ ఫర్గెట్ టు స్మెల్ దెమ్” అనేసి, భవంతి బయటివైపంతా, పవర్ వాష్ చెయ్యటానికి వెళ్ళి పోయాడు. గులాబీల సుగంధం కొంచెం సేపటికి కిచెన్ అంతా వ్యాపించింది.
ఆమె పియానో పాట ముగించి, కారు గరాజ్ నుండి తీసి, డాన్స్ స్టుడియోకి దారి తీసింది.
ఆహ్! పగలు ధగధగలు కోటి
మిరుమిట్లు; సూటిగా చూస్తే చిమ్మచీకట్లు!
మండి కోర్కెలు, పొగలు ఆవిర్లు.
కుతుకంగా
అతి తమకంగా
మైకంగా, మమేకంగా
నృత్యమాడేమోయీ!
మధురంగా
సుమధురంగా
కుసుమ సదృశ మృదులంగా
మారేనోయీ అధరం!
కొలను లోని వలయంగా
కువలయంగా
భ్రమించీ, నిదానించి –
ఆగింది నర్తనభువనం.
నాట్యశాల నుండి భవంతికి తిరిగి వచ్చేసరికి, పనంతా ముగించి పనివారంతా వెళ్ళిపోయారు. తోటమాలి కూడా వచ్చి వెళ్ళినట్టు, ఆ చక్కగా కత్తిరించబడ్డ నిమ్మ, నారింజ, కమలా, సపోటా, అవకాడో, కీవీ, ప్లమ్, పేర్, పీచ్ ఫలవృక్షాలు; గజీబోలలో అల్లుకున్న మల్లె, జాజి, బూగే విల్లా; ఇంటి రాతి గోడలపైకి ట్రిమ్‌గా ఎగబాకిన గులాబీ, మేండెవిల్లా కొమ్మలు; గోడల వెంబడి అందమైన మందారాలు, ఇక్సోరా, గన్నేరులు, గార్డీనియా, క్రోటన్లు; హోస్టా, సాల్వియా, జినియా, డెయిసీ, దాలియాలు; పెటూనియా, పెరివింకిల్, లాంటానా, వర్బీనా ఫ్లవర్ బెడ్స్ ఆమెకు చెపుతున్నాయి.
ఈ తోటలో, ఈ బాటలో
ఈ పూలు పూచిందెవరికోసం
విరితావి వేచిందెవరికోసం!
ఇన్ని రంగులు, ఇన్ని హంగులు
ఇంత మిసమిసలూ,
ఆ జిలుగు రెక్కల తుమ్మెదేనా?
ఈ పూలగంధం అతనికేనా?
That red cardinal
Tiny plumage! Cocky head!
A whir and blur of fire.
In stillness: can be a cherry
Can be a petal, can be a leaf
Don’t be mistaken. When
In motion – he is a vision.
ఆ విహరించి వచ్చిన తన ఉద్యానపు మోజులో అవ్వాలనిపించింది ఆమెకూ ఎర్రని పువ్వులా. అన్ని గోళ్ళకూ తాజా ఎఱుపు రంగులు వేసి క్షణాల్లో సృష్టించింది సొంతంగా ఎర్ర మొగ్గలు! పెదాలపై మెఱుపు చాకొలెట్ ఎఱుపు, కన్నులపై ఎన్నో ఛాయల నీలాలు, కపోలాలపై తళుకు పసుపు, ఊదాలు. చెంపలపై చేతివేళ్ళు చేర్చి, మీటుతూ అద్దంలో ఆలోకించినప్పుడు మరుక్షణంలో విరియబోయే ఇక్సోరా మొగ్గల భ్రమ ఆదిలో కలిగినా; విడివడి అంతలో ముఖాన్ని కమ్మిన కేశం ఉత్తేజితం, ఘనం ఐనందున మోహంతో గాజుఫలకాలలో ప్రతిబింబాలలో ఆ పిమ్మట ఆమె వీక్షించింది చటుకు చటుకూ తళుక్కని అంతర్హితమౌతున్న విబ్జియార్మెఱుపుల నర్తనాలు.
మనసిజ నీ మటుమాయలు, నే నెటులోర్తును!
ఎటుచూసిన కుటిలుడ! విటులను నిలిపితివి నీవు
నేనటునిటు నడవగలేనే.
లలలలా
నలుపుల అలలలా
మన వలపుల కలలలా
సఖుడా, కలియ రా.
When he folds me, into his arms
I absolutely know no qualms.
When he holds my face in his palms
Why, his sweet nothings are holy psalms.
పెదవులివిగో, ప్రియా, ప్రియా!
మధువులివిగో నయా!
పగడపు పెదవి, పగడపు మధువు
జగడము రగిలిన జగతియె స్వర్గము
కదా, కదా!
కుహుకుహు నికరము, బహుబహు సుఖదము
సఖా! సఖా! యను సకియయె సర్వము
కదా, కదా!
మధుపముగ రా సదా! సదా! మదగరిమ దాగదా.
మధ్యాహ్నం, అతడికి తను వండిన ఇండియన్ డిష్, రొట్టె మడుపులో, స్వయంగా నోటి కందిస్తే, గోధుమ కనుపాపల, ఆశ్చర్యపు అరక్షణపు నిస్టాగ్మస్. ఆ పై ప్రతి బైట్‌కూ, సంభోగ పరాకాష్ఠాసమయపు కూజితాలు వెలువడ్డాయ్ అతని గొంతులోంచి. ‘ఎవ్రిధింగ్ సీమ్డ్ ఎక్జాట్‌లీ రైట్, ఒళ్ళంతా కోన్యాక్‌లా వెచ్చగా జ్వలించింది.’ అన్నాడు.
ఆ ఎండల్లో ఔట్ డోర్ కిచెన్‌లో ఆమె వండిన వంటకాలు, ఆ సుగంధ ద్రవ్యాల మిలాయింపులు, దివ్యాలు, భవ్యాలు. భోజనానంతర పునర్భవ కామ వాంఛలు, భోగినీ దండకాలకే ఉచితాలు, పరిమితాలు.
ఆ సాయంత్రం. ఆమె భవనం వెనుక రాక్ గార్డెన్, పామ్స్; కేస్కేడింగ్ వాటర్ ఫాల్, స్విమ్మింగ్ పూల్; పూల్ సైడ్ టెరెస్ మీద లైవ్ మ్యూజిక్ బేండ్; అతిథులకు అల్పాహారాలు, మధుర పానీయాలు; అనంతరం వారి నృత్యాలు, జలక్రీడలు.
విరియుసరోజినినిధిమధుభాండపుపానపుమధుపసునాదమ్
అరయుమయూరిమయూరవయారపుపింఛపునటనవినోదమ్
దరియుసువాంఛలచలచంచలఛాయలచెలువలఅనుమోదమ్
మెరియుమహామదధీరతసుదతులగూడెడిపురుషప్రమోదమ్.
సొగసగు ఆలోచనలో, ఆంతర్యపు వెల్లడిలో
ఆధిక్యత నీదని ఒప్పుకున్నా; పాఠం
నిన్నే చెప్పమన్నా.
ప్రియా! దయుంచి చెప్పవా,
చెప్పి నాకు ప్రియంబు చేయవా!
Beaux! మీతోటి పొందు నన్ను సూపర్-డూపర్ రంజింపచేసింది.
ఇదమిత్థమనలేని సవురునిచ్చి తనువును దీప్తింపచేసింది.
కన్నుల చెంపల పెదవుల మెదువును సొంపుగ పెంపొందించింది.
కాస్మెటిక్స్, కాస్మెటిక్ సర్జరీ, జిమ్‌లు, పిలాటేలు పరమ దండగ –
హాట్ ప్రేమికులుండగా -అన్న నా థియరీని ధృవపరచింది.
ప్రణయపు వాహినిలో, నావను నడుపుటలో
జాగృతి నీవని ఒప్పుకున్నా-తోడుగ
తెడ్డును వేయమన్నా.
ప్రియా! దయుంచి యుండవా!
ఉండి నాకు
ప్రియంబు కూర్చవా!
ముగిసింది ఆహూతుల వీడ్కోలు
వెళ్ళిపోయాయి అతిథుల వాహనాలు.
మూశాను నా విలాస వసతి తలుపులు
మిగిలింది నువ్వూ, నేనూ.
పరుచుకుంది భవంతిలో ఒక ప్రశాంతపు విశ్రాంతి
మెదిలింది మనసులో
ఒక దొరకనున్న సుఖానుభూతి
విరిసిందొక దరహాసం
నడిరాతిరి,
వాటర్ ఫోర్డ్ గ్లాసుల్లో టేలర్ 2 షెర్రీ
వెలిగే ఫైర్ ప్లేస్
ఎగసే కెరటాల హోరు
కలసి ధ్వనిస్తున్న గుండెల లయ
మదన రాగమై మనం.
నక్షత్రేశ, అంభోజుడ, శీతాంశుడా
అభిరూపుడ! తొగనెచ్చెలీ!
చలువజ్యోతి, నిసివెలుగు, తుహినకరా
కడలివెన్న, కుముదబంధూ!
నీరజారి, నేత్రయోని, చందిరుడ, చెందొవరా!
ఎందుకు నిద్రించటం, నేనెందుకు నిద్రించటం
ఎఱ్ఱని మధువు తాగుతూ, ఎంతో ఏకాంతంలో
ఇంతైనా అంతరాయం లేని ప్రాయంలో
ఎంతెంతో వాంఛతో
నేనాతని
పుంభావాన్నీ, పరిరంభాన్నీ
మరిమరి ఆహ్వానిస్తూ, పరిపరి జ్వలిస్తూ
ఎనలేని సుఖాన్ని పొందే ఈ పరువపు రాత్రిలో
ఊరందరి లాగే ఉద్రేకరహితంగా నేనెందుకు నిద్రించటం?
నక్షత్రములు నవ్విన రాత్రి అది! నఖక్షతములు అర్ధచంద్రములెన్ని, మయూరపదకములెన్ని, ఉత్పలపత్రకము లెన్ని? లెక్కించమను నామె; శిక్షాపాత్రుడనని వక్షద్వయముపై శిరముంచె నతడు.
అక్షయబాణ తూణీరమువాడు ఆ ద్వయమును రక్షించుగాక!
Written by: Lyla Yerneni
Music: Brahms, Chopin, Jayadeva, and Schumann.
Vocabulary: Andhra Bharathi dictionaries.