ఎప్పటికి తెలుస్తుంది?
మరోసారి మనిషిని మనిషి పునః మలుచుకోవాలన్న సంగతి
వెయ్యి ముఖాల తొడుగుల్లో
అసలు మొహాన్ని పారేసుకున్నాక
ఆదిమ జాతి అవలక్షణాల జారుడు బండమీద జారి జారి
అధఃపాతాళానికి చేరుకున్నాక మళ్ళీ
పునరపి జననం తప్పదని
ఎప్పటికి తెలుస్తుంది ?
దేహాల భాషలో కాదు భాషలేని మనసులఘోషలొంచి పుట్టి
సముద్రాల నురగల్లో పరచుకున్న హరివిల్లు
నందనవనాల్లో పెరిగి
ప్రేమ నిలయాల కాంతి వలయాల్లో
లోలోపలి పొరల్లో పొదిపొదిగి
ఈ నాటికి రూపుదాల్చిన ఈ గొంగళి పురుగు వికృత రూపం
సతత హరితపు మంచితనం కడదాకా ఆరగించకముందే
దీర్ఘనిద్రలోకి జారి స్వప్నాల రంగులు రెక్కలుగా మలుచుకు
దీర్ఘనిద్రలోకి వెళ్ళినా రాక్షసముళ్ళనూ రక్తపుకలలనూ విదిలించుకు
సీతాకోక చిలుకలు కావలసిన సమయం ఇదేనని
ఎప్పటికి తెలుస్తుంది?
నక్షత్రాలకు రంగులద్ది, సముద్రాలను
సరిగమలు చేసుకుంటూ
వేలి కొసల కింద విశ్వ రూపాన్ని అదిమిపెట్టి,
చూపుల కిరణాల్లో ముక్కంటిని నిలుపుకు
మేధస్సుకు రెక్కలు తొడిగినా అస్తిపంజరాల్లో
ఆత్మలు ప్రతిష్టించినా
రెప్పలు వాల్చని కంటి చెలమల్లో ఎడారులు
పరుచుకునే సమయాన
ఎప్పటికి తెలుస్తుంది
మానను మనం సాగు చేసుకు పండించుకోవలసిన
సమయం ఇదేనని