ఒణుకు

ఇప్పుడు ఈ పాలపుంత దారుల్లో
కాలూనక ముందు
ఉనికిని పంచరంగుల పతాకంలా మార్చి
ఎవరిని వారు అంబరాన రెపరెపలుగా మార్చుకుందుకు
ఎన్ని సముద్రాలు గుక్క తిప్పుకోకుండా
ఆసాంతం తాగేసి ఉండవచ్చు!
ఎన్ని బాధలు
సొదలుసొదలుగా గుసగుసలుపోయి ఉండవచ్చు!

నిద్రలో నడుస్తున్న జీవితాలు
గుండె గుప్పిట్లో దాచుకు
నవ్వుల మధ్య ఉక్కిరిబిక్కిరయే శ్వాసను
అదలిస్తూ, కదిలిస్తూ ఒకరినొకరు తొక్కేస్తూ
పల్లకీల్లో ఊరేగిన గతాన్నీ గతవైభవాన్నీ నిజాయితీనీ
అవినీతి ఉక్కు పాదాల కింద
కర్కశత్వం మట్టిపొరల మధ్య
సజీవ సమాధి చేసి చిద్విలాసాల మధ్య
ఊరేగుతున్న తరం

నమ్మలేం కదూ
ఎవరిలో వారు గజగజలాడూతూ
సమయానికి ఎదురీదడం
ఎవరికి వారు మౌనంగా
గతం మరోసారి పునశ్చరణ గావించడం
నమ్మలేరు తీసిపారేసిన గడ్డిపరక నమ్మకం
సంభవామి యుగేయుగే అంటూ
కుత్తుకల మీద కత్తినుంచి
అదలించే రోజు వస్తుందని
అధికారదర్పం పీడించి పాలించి
గాదెల్లో నింపుకున్న పీడిత ధనం
ఒక నిమిషం ఆయువునూ
ఒక గాలితెమ్మెరనూ అందించలేదని
స్వయంకృతాపరాధం ఒకటి
అదృశ్యంగా యావత్ పంచాన్ని ఒకతాటిపైకి
లాగేస్తుందని
నమ్మలేం
అయినా చేసుకున్న వారికి చేసుకున్నంత!