“ఇవ్వాళ మనమిద్దరం తొక్కుడు బిళ్ళాడు కోవాలి. ఊరూరికే కాదు… పందెం… ఏం పందెం వేసుకుందామబ్బా… చెప్పు సూరీ… ఏం పందెం వేసుకుందాం?” గారాలు పోతూ అడిగింది సుబ్బలక్ష్మి.
అంటే ఈ రోజు నేను సూర్యకుమారి నన్నమాట.
“అలాగే ఏం పందెం వేసుకుందాం? నువ్వే చెప్పు. నువ్వేదంటే అదే” తలెత్తి చూపు సారించి సుబ్బలక్ష్మిని తనివిదీరా చూసుకున్నాను. చింపిరి జుట్టును చేత్తోనే అటూ ఇటూ సరిచేసి వేసుకున్న రెండు జడలు, కళ్ళనిండుగా కాటుక, పెదవులపై అస్తవ్యస్తంగా పూసుకున్న ముదురు ఎరుపు లిప్‌స్టిక్.
“ఇదిగో ముందే చెబుతున్నా! తూచ్చి తూచ్చి అంటూ చీటింగ్ చేస్తే ఒప్పుకోను. సరిగ్గా ఆడితేనే…”
“అబ్బే, నేనెందుకు చీటింగ్ చేస్తాను?”
“ఎందుకు చెయ్యవు! తలపైకెత్తినట్టే ఎత్తి చూడనప్పుడు కిందకు చూస్తావు. నీకు అలవాటేగా. అల్లాగేగా నువ్వెప్పుడాడినా పందెం గెలిచేది. ఇంకెవరూ ఆడే వాళ్ళు లేరనేగా నీ ధీమా. ఎలా ఆడినా చెల్లుతుందనేగా!” బుంగమూతి పెట్టింది సుబ్బలక్ష్మి.
“లేదులే! ఈ సారి అలా చెయ్యను. సరేనా?” ఆ బుంగమూతి మీద ముద్దుపెట్టుకోవాలన్న కోరికను బలవంతాన ఆపుకున్నాను. రెండు గంటల పాటు తొక్కుడుబిళ్ళాడినా గెలుస్తున్న ఊపులో చాలనే మాటే సుబ్బలక్ష్మి నోటంట రాలేదు.
“ఇహ చాలు సుబ్బూ ఆకలేస్తోంది. ఇహ నా వల్లకాదు. ఎంతైనా నువ్వు గ్రేట్. నా వల్లకాదిక.” ఇంట్లోకైతే తీసుకొచ్చాను గాని నాలుగు ముద్దలు తినిపించేసరికి చుక్కలు కనిపించాయి.
“సుబ్బారావ్! ఇవ్వాళ తాడో పేడో తేలిపోవాలి. ఎన్నాళ్ళిలా నానుస్తావ్?”
ఎప్పుడు నిద్రలేచిందో కూడా గమనించనంతగా పుస్తకం చదవడంలో లీనమైపోయానేమో సుబ్బలక్ష్మి గద్దింపుకి తుళ్ళి పడ్డాను. అంటే నేనివాళ సుబ్బారావుని. పుస్తకం టేబుల్ మీదుంచేలోగా వచ్చి ఎదురుగా కూర్చుంది సుబ్బలక్ష్మి. అటూ ఇటూ ఫాన్సీ రబ్బర్ బాండ్లతో బిగించిన రెండు పోనీ టెయిల్స్, దోసగింజలా తీర్చిదిద్దిన తిలకం, మర్చి పోకుండా బుగ్గమీద కనీ కనిపించకుండా అలంకరించుకున్న చిన్న నల్లని చుక్క. ఎలా వెతికి సంపాదించిందో కాని కాస్త బిగుతైన స్లీవ్‌లెస్ పంజాబీ డ్రెస్. మెడచుట్టూ చెమ్కీలు కనబడేలా వేసుకున్న చున్నీ…
“సుబ్బారావ్, నిన్నే! వినిపించటం లేదా. ఇప్పటికే చదువు పూర్తయి నాలుగేళ్ళయింది. ఇంకెన్నాళ్ళు ఇలాగ? అయితే పెళ్ళి చేసుకో, లేదూ వీలవదని చెప్పెయ్. నీ దారి నీది నా దారి నాది. మరోసారి అడిగితే ఒట్టు. ఆగమని మాత్రం అనకు.”
“ఏం చెప్పను?”
“ఏముంది, ఎప్పుడూ ఉన్న రామాయణమేగా. నీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళవాలి. నీ తమ్ముడి చదువవాలి. నీ నాయనమ్మ జబ్బుకి మందులు కావాలి. సుబ్బారావ్, ఈ కుంటి సాకులు మానుకోలేవా?!”
“అలా అంటే ఏం చెప్పను? నిన్ను ఏమాత్రం సుఖపెట్ట లేననేగా నా బాధ…”
“అక్కడికి నా సుఖమేమిటో నీకు బాగా తెలిసినట్టు! అవును గాని, ఎంతసేపూ నా బాధ్యతలు బరువులు అంటావు. పెళ్ళయాక నీ బరువు బాధ్యతలు నావి కావా?” ఎంత మార్దవం ఆ గొంతులో. కరిగిపోయాను.
“చెప్పు సుబ్బూ, మరేం చెయ్యను? నువ్వెలా చెబితే అలాగే, ఇప్పుడే, ఏం చెయ్యమంటే అదే చేస్తాను.”
“అయితే రా!”
ఇప్పుడేం చేస్తుందో నాకు బాగా తెలుసు. బరబరా చెయ్యట్టుకు లాక్కెళుతుంది. బీరువా తెరిచి సీక్రెట్ అరలోంచి పసుపు తాడుకి గుచ్చిన కొత్త మంగళసూత్రాలు తీసుకు వస్తుంది.
“పద.” వంటింట్లో ఆ మూల షెల్ఫ్‌లో అమర్చిన దేవుడి విగ్రహాల ముందుకు లాక్కెళ్ళి,
“సుబ్బారావ్. నాకు నీకు ఈ భగవంతుడే సాక్షి. మరెవరీ ఊసూ అవసరం లేదు. నాకు నువ్వూ నీకు నేనూ… ఊ, తీసుకో…”
తలవంచాను.
ఇది పదమూడో సారి ఇలా సుబ్బలక్ష్మి మెడలో తాళి కట్టడం.
కడుతూనే వంగి కాళ్ళకు దణ్ణం పెడుతుంది. ఆపాలని ఎంత ప్రయత్నించానో… ఊహు!
వంగిన సుబ్బలక్ష్మి అక్కడే కుప్పకూలినట్టు వాలిపోయింది.
పది రోజుల పాటు నరకం ఏమిటో తెలిసి వచ్చింది.
ఐ సీ యూ లో సుబ్బలక్ష్మి. బయట నేను.
డాక్టర్ గారి చీవాట్లు. “మీకిది వరకే చెప్పాను. గాజుబొమ్మలా చూసుకోవాలని. హర్ బ్రెయిన్ సెల్స్ ఆర్ రాపిడ్లీ డికేయింగ్ అని. శ్రమ పెట్ట వద్దని. ఏమో ఏం జరుగుతుందో చెప్పలేం. స్పృహ వస్తే గాని తెలీదు.”
థాంక్ గాడ్! పదకొండో రోజు స్పృహ వచ్చింది. ఎప్పటిలానే అదే స్థితిలో…
ఇరవై రోజులకు ఇల్లు చేరాం. “అబ్బబ్బ! నాల్రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లంతా ఎంత చిందరవందరగా వుందో. ఏదీ ఈ వెంకాయమ్మ. పిలవండి. ముక్క చీవాట్లు వేస్తాను.”
“నువ్వు రెస్ట్ తీసుకో సుబ్బూ. నేను వెళ్ళి పిల్చుకొచ్చి ఇల్లు క్లీన్ చేయిస్తాగా.”
“ఉఁహు, నువ్వు ఎదురుగా లేకుండా నాకు భయం. ఏ నిద్రలోనో చచ్చిపోతే? నువ్వు పక్కనుంటేనే నిద్ర…” రోజు రోజుకీ పసిపాపలా మారిపోతోంది సుబ్బలక్ష్మి.
పసిపాపలా ఒళ్ళో తలపెట్టుకు పడుకున్న సుబ్బలక్ష్మి జుట్టు సరి చేశాను. నిద్రలేస్తూనే మళ్ళీ మారిపోయాం.
“ఇదిగో శంకరం! అలా అమెరికా వెళ్ళి వాడికి నచ్చిన పిల్లను పెళ్ళి చేసుకున్నా ఒక్కమాట మాట్లాడవు. రాత్రీ పగలూ పిల్లల కోసమే బతికాం. వాళ్ళే కద మన ఆస్తులనుకున్నాం. ఇప్పుడిలా మనను మన దారిన వదిలేస్తే…”
“పోనీలే సుబ్బూ. నాకు నువ్వూ నీకు నేనూ…”
“అవును, కదూ. మనం ఇద్దరమే. మరొకరు వద్దు”
సుబ్బలక్ష్మి కోమాలోకి వెళ్ళిపోయింది.
ఎప్పట్లా ఏ బాల్యపు, యౌవనపు సీమల్లోకో వెళ్ళిపోయి ఏ పారిజాతపు చెట్టు వెనకో దాగుడు మూత లాడుతోందనుకున్నాను కాని సన్నజాజి పందిరి కింద స్పృహ కోల్పోయి పడి ఉంటుందని, ఇంత తొందరగా ఈ రోజు వస్తుందని, ఊహించలేదు.
అసలు నా పేరైనా సుబ్బలక్ష్మికి గుర్తుందో లేదో తెలియదు. అవును మరి. ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నంత మాత్రాన నేనెవరో తనకి గుర్తుండల్సిన అవసరం ఏముంది. పీజీ కాలేజి చదువులకు వైజాగ్ వెళ్ళి మళ్ళీ సెలవలకు వచ్చేసరికి ఊరంతా గుప్పుమంది కరణం గారి అమ్మాయి సుబ్బారావును పెళ్ళి చేసుకుందని. నవ్వుకున్నాను నా దౌర్భాగ్యానికి.
అవును. చదువు పూర్తయి ఉద్యోగం సంపాయించుకున్నాక పెళ్ళి మాటలు మాట్లాడమని అమ్మకు చెబ్దామనుకున్నాను. కాని ఆరోజే నిర్ణయమైపోయింది నేనిలా నా అపరంజి కలల్లోనే బ్రతకాలని. అందుకే జీవితమంతా అనామకంగానే సుబ్బలక్ష్మి చుట్టు పక్కలే గడిచిపోయింది. చివరకు ఇలా మతిస్థిమితం కోల్పోయి నా పాలిట వరంలా, చంటి పాపాయిలా తనను చూసుకునే అదృష్టం నాకు రాసి వుందని ఏనాడూ అనుకోలేదు.
కనీసం ఇప్పుడయినా తనకు సేవ చేసుకునే భాగ్యం, తనతో కలసి బ్రతికే అవకాశం… అందుకే సుబ్బలక్ష్మిని ఇక్కడకు తెచ్చుకుని గత ఏడెనిమిదేళ్ళుగా సజీవంగా బ్రతుకు తున్నాను.
మొదటి సారి తాళి కట్టమన్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. భగవంతుడు ఎప్పుడో తప్పించి ఇప్పుడిలా రాసి పెట్టాడా అనుకున్నాను.
దిగులుగా వుంది. తను లేకుండా ఎలా బ్రతకాలి… ఏమో!
కోమా లోకి వెళ్ళిపోయినా సుబ్బలక్ష్మి ఎన్నాళ్ళలా ఉంటుందో తెలియదట… నేను మాత్రం ఇలా… చిత్రవధ అనుభవిస్తూ….
ఐ సీ యూ బయట కూర్చుని తల నొక్కుకుంటున్న నా వేళ్ళు క్షణం స్పర్శను కోల్పోయాయి.
ఓ, మీకు చెప్పనేలేదు కదూ! సుబ్బలక్ష్మికి అరవై ఆరేళ్ళు. నాకన్నా ఓ రెండు నెలలు చిన్నది.