మాటల అక్షరాలు

1.

అదేమిటో
చుక్కలుగా పుట్టి
నదీ నదాలుగా విస్తరి౦చి ప్రవహించి పరవశించి
చేతులు చాపి సముద్రాన్ని అల్లుకున్నట్టు
మాటలు అక్షరాలక్షరాలుగా కుదిరి
తొలిపలుకు ను౦డీ తుదిశ్వాస వరకూ
లోలోపలి పొరల మధ్య నిక్షిప్తాలై
ప్రవహిస్తూనే ఉ౦టాయి.
ముళ్ళకిరీటపు పిడికిళ్ళుగా మొలిచి
మస్తిష్కపు పొరలను గిచ్చుతూ ఉ౦టాయి
నాగస్వరం వశీకరి౦చిన పడగలై
పైపైకి వచ్చి బుసలు కొడతాయి
గాయాల గేయాలై
దిశదశలా ప్రతిధ్వనులవుతాయి.

2.

పెదవిపై పెదవి చేర్చి మమ్మమ్మ అన్నపుడు
తొలిపలుకులకు చక్కెర చిలకలు పంచారట
తీయ తీయని మాటల మూటల
తేనెవాగుల జలపాతాలు కురిపించాలని కాబోలు
కస్తూరీ తిలకం దిద్ది
పలక చేతికందించారట
అక్షరాలు గుత్తులు గుత్తులై విరిసి
సంపెంగల పరిమళాలు వెదజల్లాలని కాబోలు
కనుమూసినా తెరచినా
అక్షరాల కలలు నీడలై
కాపలా కాస్తూనే ఉ౦టాయి.

3.

మనిద్దరి మధ్యా మాటల అవసరం యేముంది
చూపుల కొసలమీద వేళ్ళాడుతూ
కాళ్ళావేళ్ళా పడే అభ్యర్దనలు
వేలికొసలను౦డి పాకిపాకి
నిలువెల్లా పరామర్శించే అనునయాలు
ఎక్కడ పదిలంగా చెక్కిన శిల్పాలో కాని
సురక్షితంగా కనురెప్పల వాకిట
కాపలా కాస్తూనే ఉన్నాయి
నీకూ నాకూ లేనట్టే మన భావాలు గీసుకున్న చిత్రాలకూ
వయసేమీ లేదు
యౌవన వీధిలో వసంత సమయాలు
అలా గోడమీది రంగుల్లా మిగిలిపోయాయి.

4.

మన మౌనాక్షరాలు
నా రెక్కలయి పడమర చివరి వరకూ
ఎగురుతూనే ఉ౦టాయి.