అవును అది నాకు బాగా తెలుసు
స్తబ్దంగా నేనొక మంచుబొమ్మగా
మిగిలిపోబోయే క్షణాల్లోనే
వేసవి సూర్యుడిలా అతని ఆగమనం
నను వెచ్చగా కరిగించివేస్తుంది
కరిగి నీరై ఓ ప్రవాహాన్నై
వాగునై వరదనై
ఉప్పెనగా మారే నా ఆరాటం
సుడిగాలిలా అతన్ని చుట్టేస్తే
అలవోకగా వాలిన
సీతాకోకచిలుక రెక్కల మెరుపులా
పెదవి విరుపులా
అతని కంటి కొసల్లో ప్రతి ఫలిస్తుంది
కదలని పెదవుల తొణికిసలాటలో
సరిగమల్ని సరిదిద్దుకుంటూ
వినిపించని గానామృతం తాగి
పరవశించి అమరమైపోతాను.
ఒక సంగమం పన్నీటి జల్లులా
తెరలు తెరలుగా
మనసు పొరల్ని తడిపేస్తూనే ఉంటుంది
ఒక అనుభవం పిల్ల తెమ్మెర
అలసిన హృదయాన్ని సేద తీరుస్తుంది
ఓదార్పు స్పర్శ నరనరాన పాకి
కొత్త జీవితపు కోర్కె నిస్తుంది
మనసు వంపులో ఓ పలకరింపు
పంచాక్షరిగా మారుతుంది
అదృశ్యంగా అనుభూతిని పెనవేసుకున్న మనసు
కొత్త కలల్ని నెమరు వేస్తూనే వుంటుంది.