వానలొచ్చాయి, నువు రాలేదు.
రాత్రి తెల్లార్లు
కప్పల బెకబెక
కాలువ బలిసింది.
తన విధులు మరిచిపోయింది :
వంతెనకి నీడ చూపించటం లేదు.
కీచురాయి చప్పుడుతో
గదంతా నిండిపోయింది.
గదిలో నాకు చోటు లేదు.
వాన బ్రష్షు వచ్చి
ఆకాశాన్నీ, చెట్టునీ, రోడ్డునీ,
రంగుల్నీ పులిమేసింది.
చేతనైనంత మట్టుకు
చిరువానల్ని సృష్టిస్తున్నారంతా.
చివరికి కాకి కూడా.
వాన వెలిశాక
మైదానం నిండా నీటి పడెలు,
పడెల్లో గెంతుతూ పిల్లలూ, మబ్బుపింజెలూ.
కొలనులోకి రాయి విసిరారెవరో.
అలలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి.
రాయేదీ?
కొండ మీది కర్రి మబ్బూ
దండెం మీది కాకీ
రెక్కలు తెగ దులుపుకుంటున్నాయి.
దుకాణానికి వెళ్ళి చిక్కుకున్నాను,
చినుకు దారాలతో వర్షం నన్ను
పొట్లాం కట్టి పడేసింది.
విడవలేక, విడవలేక
విడవలేక వాన బొట్టు
చూరును విడిచింది.
కాజీపేట నించి కాకినాడ దాకా
ఒకటే వాన, దారి పొడుగునా
భూమ్మీద ఆరేసిన పాత ఆకాశాలు.
పచ్చిక మొలిచి
బాటని కప్పేసింది.
మళ్ళీ ఎన్ని వందల కాళ్ళవసరమో!
ఒకమ్మాయి మెడ తిప్పి
ఎవర్నో చూసి నవ్వుతోంది.
ఆ ‘ ఎవరో ‘ నేనైతే ఎంత బావుణ్ణు.
నువ్వెళ్ళి తొంగి చూస్తే
వానాకాలం బావి
జూమ్‌లెన్స్ తో ఫోటో తీస్తుంది.
ఎవరి కోసం వర్షిస్తాయి మేఘాలు,
పిల్లలకోసం కాకపోతే.
గొడుగులడ్డు పెట్టుకునే వాళ్ళకోసమా?
ప్రపంచమంతా తిరిగాను కాని,
అంతరంగం అక్కడే ఉంది.
సందె దీపమూ, అమ్మ పిలుపూ.
కొబ్బరాకుల మీద
వెన్నెల
పళ్ళిగిలించింది.
ఓరకంట చూసి
కాకి ఎగిరిపోయింది.
ఎందుకు చెప్మా!
చీకట్లో
మైళ్ళ కొద్దీ నడిచాక
అకస్మాత్తుగా చంద్రోదయం.
పసుపు రంగు దుస్తుల్తో
సైకిళ్ళు తొక్కుతూ ముగ్గురమ్మాయిలు.
బజారంతా చేమంతి తోట.
ఊపిరాడని వేసవి మధ్యాహ్నం
కోయిల కూసి
వాతావరణం మార్చేసింది.
తన నీడని నిత్యం చూసుకుంటూ బతకమని
బోటుని గట్టుకు కట్టెయ్యటం
ఎంత క్రూర శిక్ష!
వీధి గోడలకి
వెన్నెలంటే ఎంత ప్రేమో!
వెన్నెట్లో మెరిసిపోని గోడ ఉందా?