ద్వారకానగరం!
లక్ష్మీ నిలయం!
విష్ణువుకి ఆటస్థలం!
సముద్రుడి తొడ మీద కూర్చుని వున్న అతని కూతురా అనిపిస్తోంది ద్వారక అంత చక్కటి, భాగ్యవంతమైన ద్వీపం! ఎ్తౖతెన బంగారు మేడల్తో నిండి “ఎవరం గొప్పో తేల్చుకుందాం రా!” అని స్వర్గంలోని అమరావతిని కొంగుపట్టుకు లాగుతోంది!
ద్వారకకు నాలుగు వైపులా రైవతకం మొదలైన పర్వతాలు స్తంభాలైతే, ఆకాశం వాటిమీద పరిచిన చలువరాతి కప్పు!
వరుణదేవుడి పట్టణంలోని మేడలు వచ్చి ద్వారకలోని మేడలకి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాయా అన్నట్టుంది సముద్రంలోంచి వచ్చి ఒడ్డున ఆగిపోయే కెరటాల నీళ్ళలో ద్వారక మేడల నీడలు పడుతుంటే!
ఊరికి అన్నివైపులా మొగ్గలు, పూలు, పుప్పొళ్ళు, పిందెలు, కాయల్తో నిండిన తోటలు. నందనవనం వాటిముందో లెక్కా పత్రమా?
ఊళ్ళోని జనం సుగుణాల గురించి చెప్పాలంటే అందుకు తగిన మాటలు భాషలోనే లేవు!
ఇక అక్కడి వేశ్యలా? అందంలో అప్సరసలు! విటుల డబ్బు దోచటంలో మహాఘటికులు! ఎప్పుడైనా దేవతా విటులొస్తారేమో నని చూసేంత ఎ్తౖతెన మేడల్లో వాళ్ళుండేది!
ఈ విశేషాలన్నీ ఒక ఎత్తయితే, మరొక ఎత్తు విష్ణువు ఈ అవతారంలో పదహారువేల నూట ఎనిమిది మంది భార్యల్తో వైకుంఠంలో ఎప్పుడూ దొరకని ఆనందాలు అనుభవిస్తూ ఉండటం!
ఆ వూళ్ళో ఒక పడుచుపిల్ల పేరు కలభాషిణి!
ఒక గొప్ప నటుడి కూతురు. అద్భుతమైన సౌందర్యం. మంచి గుణాలు. మాటల్లో గొప్ప చాతుర్యం. పేరే అది మరి!
యవ్వనంలో ఉంది. విలాసమైన చూపులు. చెప్పేదేముంది! మగవాళ్ళని చంపేస్తోంది ఆ చూపుల కత్తిపోట్ల తోటి!
అందుకే మరి ఆడవాళ్ళని “కటారి కత్తుల”నేది!
పాడటంలో, ఆడటంలో, కనీ వినీ ఎరగని రతిక్రీడల్లో దిట్ట! ఆమె కొన చూపు తాకిడికి విటుల మనసులూ, డబ్బూ కూడా హుష్‌కాకి!
వసంతకాలం ఊరు చుట్టూ తోటలు విరగబూసి విలాసంగా ఉన్నయ్!
చెలికత్తెల్ని, దాసీల్ని వెంటేసుకుని ఓ తోటకి విహారానికి వెళ్ళింది కలభాషిణి. అంతమంది ఆడవాళ్ళు! ఎక్కడ చూసినా పూలూ, లతలూ, చెట్లూ!
ఏమౌతుందో చెప్పాలా! నవ్వులు, కేరింతలు, హాస్యాలు, అపహాస్యాలు, ఆటలు, పాటలు, మొక్కల మీదా చెట్ల మీద కథలూ కాకరకాయలూ!
ఆటలయ్యాయి. ఇంక ఉయ్యాల లూగితే బాగుంటుంది!
సరే, తీగల్తో కట్టిన ఉయ్యాల్లెక్కారు. పాదాలు ఆకాశానికి చాపి మంచి ఉద్ధృతంగా, ఉత్సాహంగా ఊగుతున్నారు పైకి, పైపైకి!
సరిగా అప్పుడే ఆకాశమార్గాన వస్తున్నాడక్కడికి కలహభోజనుడు నారదుడు!
పక్కనే శిష్యుడు మణికంధరుడు!
కృష్ణుడితో ఓ పని పడింది నారదుడికి!
మణికంధరుడు గంధర్వుడు. మంచి వయసులో ఉన్నాడు. దానికి తోడు కవి కూడ! ఉత్సాహం ఉరకలేస్తూ ఉయ్యాలలూగుతున్న ఆడవాళ్ళని చూశాడు. అతనికి మతిపోయింది! “ఆహా! పంతాలేసుకుని ఉల్లాసంగా ఉయ్యాలలూగుతున్న ఈ అమ్మాయిల పాదాలు చూశారా! స్వర్గంలో దేవతాస్త్రీల మీద “కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు” వుందే వీళ్ళ వ్యవహారం చూస్తుంటే!” అనకుండా ఆగలేకపోయాడు!
నారదుడు మాత్రం తక్కువ తిన్నాడా? “కవివంటే నువ్వేనోయ్‌శిష్యా! భలే అన్నావ్! ఇలాటి అమ్మాయిల్ని నేనూ ఎక్కడా చూడలేదంటే నమ్ము! కానీ వీళ్ళ వాలకం చూస్తుంటే దేవతల మీద కయ్యానికి కాదు, వాళ్ళ “తల దన్నటానికే” ఆ పాదాలు వెళ్తున్నాయనటం నిజానికి ఇంకాస్త దగ్గరోయ్!” అన్నాడు ఇంకా హుషారుగా!
సరిగ్గా ఈ మాటలనే సమయానికే వాళ్ళ పక్కన ఉన్న నల్ల మబ్బు వెనక విమానంలో రంభ! పక్కనే ఆమె ప్రియుడు నలకూబరుడు!
ఎంతైనా అప్సరస! ఆపైన మహా అందగత్తె!
ఆ మాటలు వినేసరికి మనసు చివుక్కుమంది!
“విన్నావు కదా, అవి నారదుడి మాటల్లాగా ఉన్నాయి. ఒక్కసారి ఆయన్ని పలకరించి వెళదాం” అంది నలకూబరుడితో.
“ఓహో, ఈ చుట్టుపక్కల ఎవరో ఉన్నారే!” అంటూ అటు చూశాడు నారదుడు కూడా.
మబ్బు అడ్డు తొలిగింది. చటుక్కున నారదుడి పాదాల కిందికి దిగింది వాళ్ళ విమానం. రంభా నలకూబరులు అతనికి పాదాభి వందనం చేశారు! పారిజాత పూల పరిమళం వెదజల్లే శిరసుల్తో!
“ఒకళ్ళ మీద ఒకళ్ళకి విడిపోని ప్రేమతో వర్ధిల్లండి!”
రంభ మనసు కుతకుతలాడుతోంది.
“మీ దీవన వల్ల అతనికి నా మీద ప్రేమ కాస్తో కూస్తో ఉంటుందేమో కాని ముందు ముందు మానవ స్త్రీల అందానికి లొంగిపోడని నమ్మకం ఏముందిలెండి!” అంది మూతితిప్పుకుంటూ.
“అదేమిటి, అలా అన్నావ్?”
“అన్నీ మాట్లాడుకుందాం. ఒకసారి మా విమానంలోకి వచ్చి మమ్మల్ని పావనం చెయ్యండి”
గురుశిష్యులు విమానం ఎక్కారు.
ప్రేయసీప్రియులు చామరాలు తీసుకుని నారదుడికి రెండు వైపుల్నించి విసురుతున్నారు.
రంభ అంది “మునీంద్రా! కిందినుంచి ఎవరో ఉయ్యాలలూగుతుంటే ఇందాక మీరు ఏదో అన్నారు, మళ్ళీ సెలవిస్తారా?”
“దానికేం, శుభ్రంగా! “కవివంటే నువ్వేనోయ్‌శిష్యా! భలే అన్నావ్! ఇలాటి అమ్మాయిల్ని నేనూ ఎక్కడా చూడలేదంటే నమ్ము! కానీ వీళ్ళ వాలకం చూస్తుంటే దేవతల మీద కయ్యానికి కాదు, వాళ్ళ “తల దన్నటానికే” ఆ పాదాలు వెళ్తున్నాయనటం నిజానికి ఇంకాస్త దగ్గరోయ్!” అన్నాను. తప్పేం వుంది? నీకు నచ్చకపోతే చెప్పు. మన్లో మనకి దాగుడుమూతలెందుకు?”
“మీరు పెద్దవాళ్ళు. గొప్పవాళ్ళు. మీ మాటకి అడ్డేమిటి? ఐనా ఏదో అతిశయోక్తిగా అలా అని ఉంటారు గాని లేకపోతే వాళ్ళకీ, మాకూ పోలికా? వాళ్ళు మా ముందు దిగదుడుపు అనటానికి జగన్మోహనమైన అందగాడు ఈ నలకూబరుడు నా చెప్పుచేతల్లో ఉండటమే నిదర్శనం!” అంది నిష్టూరాన్నీ, గర్వాన్నీ కలబోస్తూ.
నారదుడికి ఒక వంక నవ్వూ, మరో వంక చిరాకు!
ఐనా తనేనా మాటల్లో తగ్గేది?
“సరేలేమ్మా! ఇప్పుడు అతనికి నీమీద విపరీతమైన ప్రేమ ఉంది గనక నువ్వేమన్నా చెల్లుతుంది. కాని ఒకటి గుర్తుంచుకో! అన్ని రోజులూ ఇలాగే ఉండవు. నీకూ ఓ సవతి రావొచ్చు. నీలాటి స్త్రీ నీకూ, అతని లాటి వాడు అతనికీ తగిలి మిమ్మల్ని తిప్పలు పెట్టొచ్చు. ముందెలా ఉందో ఎవరు చూడొచ్చారు?”
“నవ్వులాటకైనా అలాటి మాటలనకండి మహానుభావా! అసలే మీ మాట అమోఘమైంది. దయచేసి ఆపండి!”
ఆపాడు.
ఐతే అప్పటికే ఆలస్యం జరిగిపోయింది!
ఆమెకి తెలీదు సరిగ్గా అక్కడే, అప్పుడే మంచి రసవత్తరమైన కథకి అంకురార్పణ జరిగిందని!
ంంంంంంంంంంంంంంంంంంంంంంంం
నారదుడి ఆజ్ఞ ప్రకారం కలభాషిణీ వాళ్ళున్న తోటలోకి దిగింది విమానం.
కృష్ణుడి భవనం వైపుకి తిరిగి నమస్కరించి రంభానలకూబరులు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళారు. ఈలోగా కలభాషిణి విమానం దిగుతున్నప్పుడు అందులోంచి వాళ్ళ మాటలు విన్నది. ధగధగలాడే విమానాన్ని, అందులో నిగనిగలాడే నలకూబరుణ్ణి చూసింది. అతని సౌందర్యానికి ముగ్ధురాలయింది. ఇంకా ఇంకా తనివి తీరక వాళ్ళ విమానం వెంటబడి కొంత దూరం వెళ్ళింది.
విమానం దూరమైంది.
కలభాషిణి వెనక్కు తిరిగింది.
“అబ్బ! ఎంత అందగాడు! విన్న కొన్ని మాటల్ని బట్టి అతను నలకూబరుడని పిస్తోంది. మరి అతన్ని దక్కించుకున్న అదృష్ట వంతురాలు ఎవరో కదా! నలకూబరుడి ప్రియురాలు రంభ అంటారు. ఈమె ఆమేనా? ఏమైనా ఈవిషయం వెంటనే ఆ నారద మునిని అడిగి తెలుసుకోవాల్సిందే!” అనుకుంది.
ఒంటరిగా నారదుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించింది. “మహర్షీ! ఇప్పుడు విమానంలో వెళ్ళిన వాళ్ళు రంభా నలకూబరులే కదా?” అనడిగింది వినయంగా.
“ఔను. నీకెలా తెలిసింది?”
“మీరు మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను లెండి”
“ఓహో! ఐతే మేం ఆకాశంలో మాట్లాడుకున్నవి కూడా విన్నావా?”
“విన్నాను స్వామీ! తన అద్భుత సౌందర్యంతో నలకూబరుణ్ణి పూర్తిగా వశం చేసుకున్నట్టు రంభ అనటం, ఆ మాట మీకు నచ్చకపోవటం కూడా గమనించాను”
“నిజమే మరి. గర్వంతో కన్నూ మిన్నూ కనపడ్డం లేదు ఆ రంభకి. ఐనా ముందుందిలే ముసళ్ళ పండగ! ఆమెకో విచిత్రమైన సవతిపోరు తగలబోతోంది! ఆమాటకొస్తే, వేరే ఎవరో ఎందుకు, కాలం కలిసిరావాలే గానీ, నువ్వే ఆ సవతివి కావొచ్చు!”
“సరేలెండి. అంతటి సౌందర్య వతులకి తప్ప మాలాటి వాళ్ళం ఎన్ని తిప్పలు పడినా కాలం కలిసొస్తుందా?”
“అదేం మాట! అసలు నీ అందం ముందు రంభ గాని, మిగిలిన అప్సరసలు గాని సరిపోతారా?….. అది సరే! నిన్ను ఇదివరకు ఎక్కడో చూశానే! శ్రీకృష్ణుల వారి కొలువుకి వస్తుంటావా నువ్వు?”
“అవును స్వామీ! అక్కడ ఇదివరకు మిమ్మల్ని చూశాను కూడా”
“నిజమే, నిజమే. ఇప్పుడు గుర్తొస్తోంది. కొన్నాళ్ళ క్రితం నా శిష్యుడు … ఈ మణికంధరుడు … తొలిసారిగా కృష్ణుల వారిని చూడటానికి వచ్చి భక్తి పారవశ్యంతో ఒక దండకం పాడి ఆయన్ని స్తోత్రం చేశాడు. అప్పుడు నువ్వు ఏకసంథాగ్రహణంతో దాన్ని పట్టేశావు! నీ పేరు కలభాషిణి కదూ? బలే బలే. అన్నట్లు, ఆ దండకం నీకింకా గుర్తుందా?”
“ఎందుకు లేదు? ఇదుగో వినండి” అంటూనే మధురంగా పాడి వినిపించింది కలభాషిణి. వినిపించి అన్నది “అప్పుడు శ్రీకృష్ణుల వారు మెచ్చుకుని ఇచ్చిందే కదా మీ శిష్యుడి మెళ్ళో వేలాడుతున్న ఆ రత్నహారం! ఐనా ఎంతో అద్భుతమైన చక్కటి కవిత్వం చెప్పిన వాళ్ళను ఎవరు మాత్రం మెచ్చుకోరు? ఏం ఇవ్వరు? … అలాగే, మీలాటి మహాత్ములతో తిరిగితే చాలు మాలాటి వాళ్ళ కోరికలన్నీ తీరతాయి. అందువల్ల దయచేసి మీ వీణని మోసుకురావటానికి నాకు అవకాశం ఇవ్వండి. ఎలాగూ మీరు కృష్ణుల వారి అంతఃపురానికి వెళ్ళేటప్పుడు యీ మణికంధరుణ్ణి బయటే ఉంచి మీ వీణని మీరే మోసుకుపోతారు కదా? ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని ఈ కోరిక కోరాలనుకుంటున్నా”
“సరే, అలాగే, దాన్లో ఏవుందీ!”
“ఈ మహాత్ముడి అనుగ్రహం కొంత కలిగింది. ఇక మెల్లగా నా కోరిక కూడ తీరొచ్చు” అనుకునేలోగా మరో విషయం గుర్తొచ్చింది కలభాషిణికి.
ఆ విషయం నారదుణ్ణి అడుగుదామా వద్దా అని తటపటాయిస్తుంటే
“ఇదేదో రహస్యం లావుంది. నేనిక్కడుండటం బావుండదు” అని పక్కకి తప్పుకున్నాడు మంచిబాలుడు మణికంధరుడు.
అదుగో అక్కడే అతను పప్పులో కాలేశాడు!
ఈ చిన్న పని ఆ తర్వాత అతని జీవితాన్ని ఎన్ని వింత మలుపులు తిప్పబోతోందో తెలిస్తేనా బహుశా అలా చేసుండేవాడే కాడు!
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
అలా మణికంధరుడు పక్కకు వెళ్ళాక నారదుడితో కలభాషిణి అంది కదా “మునీంద్రా! మీరు నేల మీద వుండగా వాళ్ళు ఆకాశంలోకి వెంటనే ఎగిరిపోవటం బాగుండదని ఆ జంట వాళ్ళ విమానాన్ని కొంత దూరం నేలకి దగ్గర్లోనే పోనిచ్చారు. నేనేమో ఎందుకో తెలియకుండానే దాని పక్కనే వెళ్ళాను. అప్పుడు నలకూబరుడు అన్నాడు కదా “ఓ రంభా! మధ్యలో యీ నారదుడు రావటం వల్ల ఆపేశావు. ఆ కళాపూర్ణుడి విషయం ఏదో చివరిదాకా చెప్పు మరి” అని. దానికా రంభ, “నీకు చెప్పే విషయమైతే అప్పుడే చెప్పేదాన్ని కదా! ఇంక ఆ విషయం అడగొద్దు.అంతేకాదు ఇంతకుముందు నేను చెప్పింది కూడ బయటికి పొక్కనివ్వొద్దు. నామీదొట్టు!” అంది. మరి స్వామీ! ఆ కళాపూర్ణుడెవరో అతని కథేమిటో, రంభ ఏంచెప్పిందో ఏం చెప్పలేనందో నాకు చెప్పండి దయచేసి” అనడిగింది నారదుణ్ణి.
నారదుడికి బోలెడంత ఆశ్చర్యం వేసింది తనకి తెలియని కథ కూడా ఉందా అని!
కొంచెం సేపు కదలకుండా నిలబడ్డాడు నారదుడు.
ప్రపంచంలోని భూతభవిష్యత్‌వర్తమానాల్ని చూశాడు.
“అబ్బో! ఆ రంభ అతన్తో చెప్పలేనన్న కథ చాలా అపూర్వమైంది. నేను కూడా చెప్పేది కాదు” అన్నాడు నమ్మలేనట్లుగా.
“సరే, పోనీ చెప్పలేంది వదిలేసి వాళ్ళిద్దరి మధ్యా అసలా విషయం ఎందుకొచ్చిందో ఐనా చెప్పండి”
“ఏం చెప్పమన్నావ్! వీళ్ళద్దరూ ఎంత కాముకులంటే ఒకర్నొకరు చూస్తే చాలు ఉద్రేకం వచ్చేస్తుంది వాళ్ళకి! ఇందాక నన్ను చూడటానికి ముందు వాళ్ళు విమానంలో ఎగురుతున్నప్పుడు ఉదయిస్తున్న సూర్యుడి పక్కన ఒక తెల్లటి మేఘం కనపడింది. ఆ దృశ్యాన్ని చూసి రంభ అవి రెండూ బ్రహ్మా సరస్వతుల్లాగా కనిపిస్తున్నాయని పోలిక చెప్పింది. దాన్లో ఏవుందో, ఆ మాటకే వాడు రెచ్చిపోయి ఆమెని ముద్దాడి పెదాల్ని పంటితో నొక్కాడు. అప్పుడు దాని గొంతులోంచి అదివరకెప్పుడూ వినపడని ఒక కోమలమైన శబ్దం బయటికొచ్చింది. వాడేమో, “ఇదేదో భలే వుందే, యింకో సారను” అంటూ వెంట పడ్డాడు. కాసేపు సరసాలయాక ఇక తప్పదని అది వాడి కోరిక తీర్చింది. వాడంతటితో ఊరుకున్నాడా? “ఇదెప్పుడు నేర్చుకున్నావు చెప్పు, చెప్పు” అనడిగితే అది “ఎప్పుడో నేర్చుకున్నాను గాని ఓ కారణం వల్ల ఇన్నాళ్ళూ దాచాను. ఇప్పుడు అనుకోకుండా బయటపడింది” అంది. “ఎందుకు దాచావ్?” అని మళ్ళీ వాడడిగితే, “ఆ సందర్భంలో కళాపూర్ణుడి విషయం వస్తుందేమోనని భయపడి దాచాను” అంది రంభ. అంతటితో ఆపకుండా, “కళాపూర్ణుడి విషయం వస్తే చిక్కేమిటంటే, ఇక ఆ కథ చెప్పిన వాళ్ళు, విన్న వాళ్ళు భూలోకంలో ఎన్నో తరాల పాటు సంపదలు, సుఖాలు పొందుతారు. కనక నీకు నేను చెప్తే దానివల్ల మనం భూలోకంలో పుట్టవలసొస్తుంది. “మరి నువ్వు విన్నావు కదా” అని నన్ను అడగొచ్చు నువ్వు. జరిగిందేమిటంటే, నేను ఆ కథంతా విన్న తర్వాత ఒక అమోఘమైన వాక్కు వున్న వ్యక్తి ఈ ఫలశ్రుతి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆ కథ చెప్పకూడదు” అంది రంభ”
అని చెప్పి నారదుడు ” అమ్మాయీ! ఆ రంభ కున్న భయమే నాకూ వుంది గనక నేనూ నీకు ఆ కళాపూర్ణుడి కథ చెప్పలేను. ఐతే ఒకటి మాత్రం నిజం. తొందర్లోనే ఆ కథ బయటికి రాబోతున్నది” అని ముగించాడు.
అప్పటిదాకా దూరంగా ఉన్నాడు మణికంధరుడు.
నారదుడు అతన్ని పిలిచి కృష్ణుడి దగ్గరికి బయల్దేరాడు.
కలభాషిణి కూడా కొలువు సింగారం చేసుకోవటానికి ఇంటికి పరిగెత్తింది.
“కాస్త చుట్టు దారైనప్పటికీ ఉపయోగమే కలిగింది. సవతి పోరు కలిగించి రంభ మదం దించటానికి అంకురార్పణ జరిగింది” అనుకుంటూ ఆనందంగా నడవసాగాడు నారదుడు.
పక్కనే వీణ మోసుకుంటూ శిష్యుడు.
ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, నమస్కారాలు చేసేవాళ్ళు, ఎవరికి తగువులు పెట్టబోతున్నాడో అనుకునే వాళ్ళు, వాహనాలు దిగి సాష్టాంగపడేవాళ్ళు దారిలో జనం అంతా హడావుడి పడిపోయారు.
నారదుడు కూడ అందర్నీ రకరకాలుగా ఆనందపరుస్తూ దార్లో విశేషాలు గమనిస్తూ కృష్ణుడి కొలువుకూటం ప్రాంతాలకి చేరుకున్నాడు ఎప్పటికప్పుడే వింతగా కనిపిస్తూ వైకుంఠాన్ని గుర్తుకు తెస్తుందే అని ఆశ్చర్యపోతూ.
దంతంతో చేసిన ఉయ్యాల మంచం మీద కూర్చుని వున్నాడు కృష్ణుడు.
నారదుడి రాక వినటంతో తటాల్న లేచి, “ఎప్పుడూ ఆకాశం నుంచి నేరుగా ఇక్కడే దిగేవాడు ఇవేళ ఇలా రావటం చాలా చిత్రంగా ఉందే” అంటూ ఎదురువెళ్ళి ఆదరంగా తీసుకొచ్చాడు. చకచక కొలువు ముగించుకుని అతన్ని అంతఃపురానికి తీసుకెళ్ళాడు.
మణికంధరుడు లోపలికి వెళ్ళకూడదు కదా కలభాషిణి నారదుడి వీణ తీసుకుని నడిచింది. కృష్ణుడు కూడా ఆమెని చూసి “భేష్! నేనెప్పట్నుంచో అనుకుంటున్నాను నువ్వు నారదుడికి శిష్యురాలివైతే బాగుంటుందని” అన్నాడు.
సిగ్గుపడింది కలభాషిణి.
ముగ్గురూ జాంబవతి ఇంటికి చేరారు.
“జాంబవతీ! తనకు గానవిద్య బాగా వచ్చినా కూడా తుంబురుడితో పోటీ కోసం మన దగ్గర నేర్చుకోవటానికి వచ్చాడీ నారదుడు. ఇతనికి నీకు వచ్చిన విద్యంతా నేర్పాలి మరి!” అన్నాడు కృష్ణుడు.
“తప్పక అలాగే చేస్తాను. ఐతే ముందు నా విద్యలో తప్పులేమన్నా ఉన్నాయేమో చూడండి” అంటూ అద్భుతంగా పాడి వినిపించింది జాంబవతి.
ముగ్ధుడయ్యాడు కృష్ణుడు.
“ఏ విషయంలోనూ ఏమాత్రం కొరత లేదు. ఇక ఈయనకి నేర్పటమే ఆలస్యం” అని నారదుణ్ణి ఆమెకి అప్పగించి కదిలాడు.
ఓ సంవత్సరం పాటు నారదుడికీ, కలభాషిణికీ సంగీతం నేర్పింది జాంబవతి.
సత్యభామ, రుక్మిణి కూడ చెరో ఏడు శిక్షణ ఇచ్చారు.
స్వయంగా కృష్ణుడే మరో సంవత్సరం పాటు నేర్పాడు.
పాపం మణికంధరుడికి అంతఃపుర ప్రవేశం లేదుకదా! ఐతేనేం, కృష్ణుడు అతన్ని కూడ నారదుడంతడి వాడిగా తీర్చిదిద్దాడు.
అలా ఆ ముగ్గురూ సంగీతంలో ఆరితేరారు.
నారదుడి శిక్షణ పూర్తయింది.
అంతఃపురంలో అందరూ “గానంలో నిన్ను మించిన వాళ్ళు లేరు” అని పొగుడుతున్నారు నారదుణ్ణి.
ఐతే అవి ఒట్టి పైపై మాటలా నిజమా? అని సందేహం పట్టుకుందతనికి!
తెలుసుకోవటానికి కలభాషిణి ఒక సలహా చెప్పింది “నేను వెళ్ళి కనుక్కోవచ్చు గాని ఇలా వెళ్తే వాళ్ళు నా ముందైనా నిజం చెప్తారో లేదో! కనక నాకు ఎవరు కావాలంటే ఆ స్త్రీ రూపం ధరించే వరం యిస్తే నేను వాళ్ళవాళ్ళ ఇష్ట సఖుల రూపాల్లో వెళ్ళి అసలు విషయం తెలుసుకుని వస్తాను మరి!” “ఈ నెపం పెట్టుకుని రంభ రూపంలో వెళ్ళి తను నలకూబరుణ్ణి కలవాలని దీని ఆలోచన. సరే, మనక్కావల్సిందీ అదే!” అనుకుని ఆనందంగా అలాగే వరం ఇచ్చాడు నారదుడు.
కలభాషిణి వెళ్ళి జాంబవతి, రుక్మిణి, సత్యభామలు నారదుడి గురించి అన్నది నిజమే నని తెలుసుకుని వచ్చింది.
ఆ సంతోషంలో నారదుడు, “అమ్మాయీ! నువ్విది వరకు కోరుకున్న వాణ్ణి, నలకూబరుడి రూపంలో ఉన్న వాణ్ణి కలుస్తావు పో!” అని దీవించి పంపాడు.
ఈ మాటల్ని జాగ్రత్తగా గమనించాలి మనం. ముందు ముందు ఉపయోగం ఉంటుంది!
ఇక నారదుడు, మణికంధరుడు బయల్దేరారు. కొంతసేపు మాట్లాడుకున్నాక నారదుడు ఒక వైపు వెళ్ళాడు.
అతని ఆదేశం ప్రకారం తీర్థయాత్రలకు వెళ్ళాడు మణికంధరుడు.
మరి ఇప్పుడు మనం కలభాషిణి విషయం చూద్దాం. ఇదివరకులా కొలువుకు వెళ్ళటం తగ్గింది. గానాభ్యాసం కూడా తగ్గింది. దాంతో మళ్ళీ నలకూబరుడి మీదికి గాలి మళ్ళింది. ఐతే అతని దగ్గరికి వెళ్ళే దారి మాత్రం కనపడటంలేదు! అసలతను ఎక్కడుంటాడో కూడా తెలీదుగా!
కాలం గడుస్తోంది. ఒకనాడు ఒక్కతే వీణ తీసుకుని ఇంటితోట లోకి వెళ్ళింది కలభాషిణి ఏమీ తోచక.
అంతలో సింహం మీదెక్కి ఆకాశంలోంచి ఆ తోట లోకి దిగాడొక సిద్ధుడు!
బూడితపూత, యోగదండం, చిన్న జడలు, మందుల పుస్తకం, నాగబెత్తం, వీణ, గంజాయి గొట్టం ఇదీ అతని వాలకం!
ఆశ్చర్యంతో వెళ్ళి అర్య్ఘం ఇచ్చింది కలభాషిణి!
మర్యాదలు చేసింది.
వెంటనే కుశలప్రశ్నలు గుప్పించాడతను ఎప్పట్నుంచో ఎరిగున్న దగ్గరి చుట్టం లాగా “ఐతే కలభాషిణీ! నారదుడు ఈ మధ్య ఇటువైపు రావటం లేదు కదా! ఇంకేం పని లేక నీ మనసు పూర్తిగా నలకూబరుడి మీదే ఉండి ఉండాలి! ఐనా తను వెళ్ళేటప్పుడు నారదుడు నీ కోరిక తీరేట్లు దీవించాడు కదా! ఆయన మాట జరిగితీరుతుంది, నీకేం బెంగ అక్కర్లేదు! …. ఇక అసలు విషయానికొస్తే, ఈ ప్రపంచంలో నాకు నచ్చిన గానాలు ఇద్దరివే ఒకటి మణికంధరుడిదీ, రెండోది నీదీ! కానీ ఈ మధ్య తపసులోకి దిగి మణికంధరుడు పాడటం మానేశాడాయె! నువ్వైనా కాసేపు హాయిగా వీణ వాయించి నా చెవుల తుప్పు వదిలిస్తావని ఇటొచ్చా” అన్నాడతను హడావుడిగా.
అతననే ఒక్కో మాటకీ ఆశ్చర్యం పెరిగిపోతోందామెలో. ఎవరితను? ఇంత రహస్యమైన విషయాలు ఎలా తెలుసునితనికి?
(ఇంకా ఉంది)