జింకపిల్ల

‘‘దీన్ని నక్క తిన! పదైదు దినాలుగా నన్ను సతాయిస్తా ఉండాది చేతికి చిక్కకుండా. వలకూ దొరకదూ, ఉచ్చుకూ దొరకదూ, బరిసెకూ అందదు. దీన్ని ఎట్లా పట్టాలో అర్థం కావడంలేదు. ఒక పక్క రెడ్డోరబ్బాయి తొందర చేస్తా ఉండాడు. ఎవరెవరికో డిన్నరు పెట్టాలంట. వాళ్ళందరూ కలిసి ఈయనకు పెద్ద కాంట్రాక్టులు ఇప్పించినారంట. జింక పిల్ల దొరికితే ఒకరోజు అనుకని అందరికీ ఫోన్లుకొట్టి పిలస్తాడంట. ఏం చేసేది. ఎట్లా పట్టేది ఈ కంతిరీ జింక పిల్లను. ఆఖరి ప్రయత్నంలోనైనా చిక్కుతుందో లేదో చూడాల.’’

ఆలోచిస్తూ తన పని తాను చేసుకుపోతున్నాడు యానాది నరిసిగాడు.

చుట్టూ దట్టమైన అడవి. నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడూ పక్షుల కూతలూ, చెట్ల ఆకుల గలగలలూ మాత్రమే వినబడుతున్నాయి. అది క్రూర మృగాలుండే అడివికాదు. జింకలూ, దుప్పులూ, కుందేళ్ళూ, అక్కడక్కడా ఒకటో రెండో ఎలుగుబంట్లూ మాత్రమే కనబడుతుంటాయి.

‘‘ఈ జింక పిల్ల ఏడాది పిల్ల. తినడానికి పక్వమైన వయస్సు. తింటే ఇప్పుడే తినాల. ఇంకా ముదిరిందంటే కండలైతే దండిగా కుప్ప పడుతుంది కానీ తినడానికి మదనం ఉండదు. అందుకోసమే కదా తాను దీన్నే – ఇప్పుడే – పట్టాలని పట్టుదలగా ఉండేది! ఇది దొరికితే తన పంట పండినట్టే. ఐదునూర్లు చెబితే మూడునూర్లు – కనీసం ఇన్నూట యాభై అయినా ఇస్తాడు రెడ్డోరబ్బాయి. కోసి, చర్మం తీసి, ఎముకలూ, మాంసమూ ఇంగడించి, వండేదానికి అనువుగా మాంసం ముక్కలుకోసి ఇస్తే – ఇంకో యాభై రూపాయలైనా ఇవ్వకుండా పోరు. ఈ రెడ్డోరికిగానీ, రెడ్డిసాన్లకు గాని ఈ పనులు ఎక్కడ చేతనవుతాయి? చర్మాన్ని కూడా అరువుచేసి వాళ్ళకే ఇచ్చేయాల. జింక చర్మాన్ని యానాదోడు అమ్మబోతే పోలీసోళ్ళు పట్టుకుంటారు. రెడ్డోరబ్బాయి అమ్మితే ఎవరూ పట్టించుకోరు. పేదోళ్ళు ఏ వస్తువు అమ్మబోయినా ఇది నీకు ఎక్కడిది? ఎక్కడ కట్టుకచ్చినావు? పద స్టేషనుకు’ అని పట్టుకుంటారు. పెద్ద వాళ్ళు ఏమిచేసినా చెల్లిపోతుంది. అందుకే పేదోళ్ళు తమ సరుకుల్ని పెద్దోళ్ళ చేతుల్లో పెట్టేసి వాళ్ళిచ్చినంత మారు మాట్లడకుండా తీసుకుంటారు. మన ప్రాప్తం ఇంతే అనుకుంటారు. పెద్దోళ్ళేమో అదే సరుకుని పదింతలు, ఇరవై ఇంతలకు అమ్ముకుంటారు. అడివి పందులూ, ఉడుములూ, పిట్టలు అయితే పరవాలేదు గానీ జింకలు, దుప్పులు, కణుతులు, నెమళ్ళూ అయితే మట్టుకు పోలీసోళ్ళతోనూ, ఫారెస్టోళ్ళతోనూ చిక్కే.’’

‘‘అయినా తప్పదు. డబ్బు కావాలంటే ఏదో ఒకటి ధైర్యం చేయాల కదా. అందుకే కదా కనీసం వెయ్యి రూపాయలు చేసే జింక పిల్లనూ, కనీసం ఐదునూర్లు చేసే జింక చర్మాన్నీ రెడ్డోరబ్బాయికి అయిన కాడికి ఇస్తా ఉండేది. ఇప్పుడు తనకు డబ్బవసరం.’’

కూతురు ‘చుక్క’ కళ్ళల్లో మెదిలింది. ‘తన కులపోళ్ళలో ఏ మొగోడూ చదవని చదువు చదవతా ఉండాది. ఇంటర్‌ రెండో సంవత్సరం. దినమూ టౌనుకు కాలేజీకి బస్సులో పోయి బస్సులో వస్తా ఉంది. దానికి పంజాబీ డ్రస్సు కావాలంట. ఎంత సాదాసీదాది కనాలన్నా మూడు నాలుగు నూర్లైనా అవుతుందంట. ఎట్లాగైనా ఈ జింక పిల్లను పట్టి రెడ్డోరబ్బాయికి అమ్మేసి చుక్కకు పంజాబీ డ్రస్సు కనాల.’’

చుక్కమ్మకు ఐదో ఏటనే తల్లి జబ్బుచేసి చనిపోయింది. పోయేటప్పుడు నరిసిగాడికి ఎన్నో చెప్పింది. బిడ్డ మేలుకోరే వాడివైతే మళ్ళీ పెళ్ళి చేసుకోవద్దంది. బిడ్డను బాగా చదివించమంది. యానాదోళ్ళు చదువుకోవడానికి గవర్నమెంటోళ్ళు డబ్బిస్తారంట. హాస్టలులో మాత్రం పెట్టొద్దంది. అక్కడ ఆడబిడ్డల్ని పాడుచేస్తారంట. కడుపునిండా అన్నం పెట్టరంట.

చుక్కమ్మను ఒకటో తరగతిలో చేర్చడానికి బడికివెళ్తే అక్కడ అయ్యవారు పేరడిగాడు. చుక్క, చుక్కమ్మ అన్నాడు నరిసిగాడు. ఆ పేరు బాగా లేదని అయ్యవారే సుకన్య అని పేరు రాసేసుకున్నాడు. సుకన్య అనే పేరును కూడా ‘సుక్క’ అనడమే అలవాటైపోయింది అందరికీ. ఎప్పుడో గానీ సుకన్య అనరు.

ఆరో తరగతికి పక్క ఊళ్ళో హైస్కూలులో చేర్చాడు. అప్పటికి బిడ్డ వయస్సు పదకొండు. పాపం ప్రొద్దున్నే ఎనిమిదికంతా చేతనైనంత మట్టుకు వంటచేసి కొంచెం తిని, కొంచెం క్యారియర్‌లో పెట్టుకని, మిగిలింది తండ్రికోసం ఉట్టిలో పెట్టి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేది.

ఇప్పుడు కాలేజీకి టౌనులో బస్సులో పోతుంది రాత్రిళ్ళు బుడ్డ దీపం వెలుతురులోనే చదువుకుంటుంది.

ఎప్పుడూ తనకు ఇది కావాల అని అడిగిందికాదు. తల్లి లేని బిడ్డ కదా అని తానే అన్నీ గమనించుకుంటూ, అడిగి తెలుసుకుంటూ కని ఇస్తున్నాడు. అలాంటిది లేకలేక ఒక పంజాబీ డ్రస్సు అడిగింది. ఎంత కష్టమైనాసరే కొని ఇవ్వవలిసిందే.

జింక పిల్ల మడుగు దగ్గరికి వచ్చే దారిలో కొన్ని రోజులు వలవేసి చూశాడు. లాభంలేదు తప్పించుకని పారిపోయింది. దారి మార్చేసింది. కొత్త దారిలో ఉర్లు వేశాడు. ఊహు, తప్పించుకుంది. చెట్ల మాటు నుంచి బరిసెను విసిరాడు. తగల్లేదు. ఇక చివరగా మరో ఉపాయాన్ని ఆలోచిస్తున్నాడు.

***

దీన్ని అరబ్బీ వాడెత్తుకెళ్ళా! ఆరు నెలల నుంచి చేతికందకుండా సతాయిస్తా ఉండాది ఈ అరకాసు యానాది పిల్ల. దగ్గరికి వచ్చినట్టే వచ్చి తీరా మీద చెయ్యి వేసేటప్పటికి మొరాయిస్తా ఉండాది. పిల్లేమో పిటపిట లాడతా ఉండాది. చిన్నప్పుడు వాళ్ళమ్మా, నాయనా ఉడతల్ని, ఎలుకల్ని, పిట్టల్ని, చేపల్ని పట్టి కాల్చి ఇస్తా ఉంటే బాగా తిని ఒళ్ళు రాయిలాగా గట్టిగా తయారయింది. యానాదోళ్ళ ఆడబిడ్డలు అందంగానే పుడతారు. పుట్టినప్పుడు మంచి రంగు మీదుంటారు కూడా. క్రమంగా ఎండకు ఎండి, వానకు తడిసి, మంచుకు నానీ, కంచెం గోధుమ రంగుకు తిరుగుతారు. ‘చుక్క’ – అదే ‘సుకన్య’ కూడా అలాగే తయారయింది. వయస్సు పద్దెనిమిది. ఆడదాన్ని అనుభవించడానికి తగిన వయస్సు పద్దెనిమిది, ఇరవైల మధ్యనే. అంతకు తక్కువైతే సరసం తెలియని పసితనం. రుచి ఉండదు. అంతకు ఎక్కువైతే సరసానికి దూరమైన ముదురుతనం. అప్పుడూ అంతగా రుచిగా ఉండదు. పట్టితే ఇప్పుడే పట్టాల చుక్కను అనుకుంటున్నాడు నాయుడోళ్ళబ్బాయి.

‘‘హైదరాబాదులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కడుకు కత్త రుచులు కోరేవాడు. ఈ చుక్కను వాడికి ఎరవేస్తే ఎంఎల్‌ఏ పార్టీ టిక్కెట్టు తనకే ఖాయం. ఆపోజిట్‌ పార్టీలో తన నియోజక వర్గంలో పోటీ చేసేందుకు తగిన కాండిడేట్‌ లేనేలేడు. ఈ పార్టీ టిక్కెట్టు ఎవరికి వస్తే వాళ్ళకి గెలుపు ఖాయం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జిల్లా రాజకీయాలను తన కడుక్కు అప్పగించి తాను మాత్రం తన జిల్లాలో చక్రం తిప్పుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ కడుకు గారిని పట్టుకుంటే తన పని చక్కబడుతుంది. దానికి ఈ చుక్కమ్మే మొదటి సాధనం. అమ్మో పరవశించిపోడూ! వారం దినాలైనా వదలడు దాన్ని. సరుకు అలాంటిది మరి. చేతినిండుకూ, కౌగిలి నిండుకూ మనిషే. ఒక రాత్రికి ఆరేడు మంది మగాళ్ళనైనా సమాళించగల దిట్టమైన గట్టి శరీరం. మరీ పల్లెటూరి నాటు సరుకు కాదు. ఇంటర్‌ చదువు. ఒళ్ళూ, దుస్తులూ శుభ్రం. మరికాస్త ఖరీదైన బట్టలూ, కాస్త అలంకారమూ చేస్తే చూసేవాళ్ళ కళ్ళు చెదిరిపోవలసిందే. ఇది యానాది పిల్ల అంటే ఎవరూ నమ్మరు. అరగొండ చెఱుకు గడను నమిలినట్టు నమిలి తినవచ్చు.’’

ఒకనాడు చుక్క కాలేజీకి వెళ్ళడానికి బస్సుకోసం రోడ్డు ప్రక్కన నిలబడుంది. చేతిలో సంచీ, సంచిలో జాతీయ జెండా, అట్ట కిరీటం, అట్ట భుజకీర్తులూ ఇంకా ఏవేవో వస్తువులూ. నాయుడోళ్ళబ్బాయి మోటారు సైకిలు పైన పోతూ చుక్కను చూసి ఆగాడు.

‘‘కాలేజీకేనా చుక్కా’’ అడిగాడు. చిన్నప్పట్నుంచి చూచిన పిల్లే అయినా ఇంతవరకూ పలకరించవలసిన అవసరమూ, అవకాశమూ రాలేదు. ఆ పిల్లతో మాట్లాడడానికి పల్లెలో ఉన్న కులాల అంతరం కూడా ఒక విధమైన ఆటంకమే. ఇప్పుడు ఆ పిల్ల చదువూ, తన అవసరమూ ఆ అంతరాన్ని తగ్గిస్తూ ఉన్నాయి. కల్పించుకోక తప్పదు. తప్పూ లేదు.

‘‘ఊ’’ అవునన్నట్టు తలూపింది.

‘‘ఇవన్నీ ఏమిటి.’’

‘‘ఈ రోజు మా కాలేజీలో కాలేజి డే’’ డ్రామాలున్నాయి. అందులో నేను భారతమాత వేషం వేస్తున్నా. ఇవన్నీ ఆ వేషానికే.’’

అలాగే నిలబడ్డాడు నాయుడోళ్ళబ్బాయి.

‘‘టైమెంతయ్యిందయ్య గారూ’’ చిన్నప్పట్నుంచి పెద్దింటి వాళ్ళను పిలిచి అలవాటైన పిలుపు.

‘‘అయ్యగారూ ఏమిటీ మామూలు పల్లెటూరి పిల్లలాగా. నువ్విప్పుడు మామూలు యానాది పిల్లవు కావు. ఇంటర్‌ చదవతా ఉండావు. సురేష్‌ బాబూ అని పిలవ లేవూ. ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు నాగరికత.’’

నవ్వింది చుక్క.

‘‘టైం నాలుగున్నర.’’

‘‘అయ్యో, లేటయి పోయేటట్లుందే. బస్సు ఇంకా టౌను నుండే రాలేదు. అది వచ్చి ఇవతలివైపు ఐదు కిలోమీటర్లు వెళ్ళి తిరిగి రావాల. డ్రామాకు లేటయి పోతుందేమో. కాలేజీకి వెళ్ళిన తరువాత మేకప్‌ చేసుకోవాల కూడా.’’

ఇదే మంచి చాన్సు. ఎవరూ ప్రత్యేకంగా అనుమానించే అవకాశం లేని సహాయం. ఎవరైనా చేయవలసిన సహాయం.

‘‘అయితే ఒక పని చెయ్‌. నా వెనక కూర్చో. ఇరవై నిమిషాల్లో మీ కాలేజీ ముందర దింపుతా.’’

చుక్క కాసేపు తటపటాయించింది.

‘‘ఊు – తొందరగా నాకు టౌనులో అర్జంటు పని ఉంది. వెళ్ళాల.’’

సంచి మోటారు సైకిలు ముందర తగిలించి నాయుడోళ్ళబ్బాయి వెనక కూర్చుంది.

అప్పుడు అనుభవానికచ్చింది నాయుడోళ్ళబ్బాయికి చుక్క ఒంటి గట్టిదనం, అవయవాల పొంకం మొదలైనవన్నీ. అదేమిటో అవసరమున్నా లేకపోయినా మోటారు సైకిలుకు పదే పదే బ్రేకులు పడుతున్నాయి. నాయుడోళ్ళబ్బాయిని గట్టిగా పట్టుకోక తప్పలేదు చుక్కకు.

‘‘డ్రామా చూడ్డానికి ఉండరా …’ అంది కాలేజీ దగ్గర బండి దిగుతూ. ఇప్పుడు అతన్ని అయ్యగారూ అనడానికి తన కాలేజీ చదువు జ్ఞాపకం వచ్చి అడ్డు పడతా ఉంది. సురేష్‌ బాబూ అనడానికి పాత అలవాటు గొంతు పట్టుకుంటా ఉంది.

‘‘నువ్వుండే డ్రామా ఎన్ని గంటలకు?’’

‘‘ఏడు గంటల పైనే.’’

భారతమాత వేషంలో చుక్కను చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు నాయుడోళ్ళబ్బాయికి, ప్రేక్షకులకు కూడా. ‘‘ఎవరీ అమ్మాయి? ఏ ఊరు?’’

చివరకా ‘‘ఏ కులం? ఎవరమ్మాయి? అమ్మా నాన్నా ఏం చేస్తుంటారు.

తెలిసిన తరువాత ‘‘ఔరా!’’

ప్రోగ్రాములన్నీ ముగిసేసరికి ఆఖరు బస్సు వెళ్ళిపోయింది. నాయుడోళ్ళబ్బాయి అదృష్టం పండింది. మళ్ళీ మోటారు సైకిలుపైన
ప్రయాణం. వెనక చుక్క. జెండా, కిరీటం, భుజకీర్తులు తప్ప తక్కిన మేకప్‌ అంతా అలాగే ఉంది. కళ్ళు చెదిరిపోయే అలంకరణ.

చుక్క వెనక కూర్చొని అమాయికంగా కాలేజీ కబుర్లు ఏవేవో చెబుతూ ఉంటే నాయుడోళ్ళబ్బాయి పరవశంగా వింటున్నాడు. ఈసారి మోటారు సైకిలు ఎందుకో నిదానంగా పోతూ ఉంది. అయినా ఒకటే కుదుపులు.

చుక్క ఒక్కోసారి నాయుడోళ్ళబ్బాయి భుజాలూ, జబ్బలూ, నడుమూ పట్టుకోవలసి వస్తూ ఉంది కుదుపుల వల్ల.

పది గంటల రాత్రి. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. పాలార బోసినట్టు వెన్నెల. మోటారు సైకిలు వేగానికి చల్లగాలి రివ్వున కడుతూ చాలా హాయిగా ఉంది. అబ్బాయి మనస్సు వశం తప్పుతా వుంది.

ఒకచోట బండిని ఆపి వెనక్కు తిరిగి చుక్క ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని పెదవులపైన – కరికినంత ఇదిగా – గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.

చుక్క ఉలిక్కిపడి బిత్తరపోయింది. అంతలో తేరుకని ‘‘పెద్దయ్య గారితో చెబుతా’’ అని బండి దిగేసింది.

‘‘నన్నేం చెయ్యమంటావు నా తప్పేం లేదు. ఇంత అందంగా పుట్టడం నీదే తప్పు.’’

ఇలాంటి మాటకు ఏం బదులు చెప్పాలో తోచలేదు చుక్కకు.

‘‘మీరు వెళ్ళండి. నేను నడిచొస్తా.’’

‘‘ఇంకా అయిదు కిలోమీటర్లుంది మన ఊరు.’’

‘‘అయినా ఫరవాలేదు. మీ వెనక వస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులే చేస్తారు.’’

‘‘ఒకసారైతే మనసుగ్గబట్టలేక ముద్దు పెట్టుకన్నా. మళ్ళీ మళ్ళీ అలా చేస్తానా. నాకు మాత్రం నీతిలేదా. అయినా ఇప్పుడేమై పోయింది. ముద్దే కదా పెట్టుకున్నది. ఏమో జరగరానిది జరిగిపోయినట్టు ఇంత రాద్ధాంతం ఎందుకు? ఎక్కు బండి’’ అన్నాడు చనువుగా మందలించినట్టు.

బదులు మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది.

అలా ప్రారంభమైంది మొదటి పరిచయం. కాదు – అలా చేసుకున్నాడు మొదటి పరిచయం.

****

వారం రోజులుగా ఒక ఉపాయం ఆలోచించి ఆ ప్రయత్నంలో ఉన్నాడు నరిసిగాడు. మడుగుప్రక్కగా చెట్లు దట్టంగా ఉండే చోటు ఎంచుకున్నాడు. అక్కడ రోజూ లేత కాయలుండే పెసర తీగలూ, అలసంద తీగలూ, కంది చెట్లూ తెచ్చి అవి అక్కడే మొలిచి పెరిగినట్లు కనబడేలాగా నాటి పెడుతున్నాడు. వీటికోసం కొంత ఖర్చు కూడా అవుతూ ఉంది. పొలం ఆసామీకి రెండో మూడు ఇచ్చుకోవాలి. లేదా వాళ్ళు చెప్పిన చిన్నా, చితకా పని చేసిపెట్టాల. చేలో ఒత్తుగా పెరిగిన తీగల నుంచి కొన్నింటిని కోసుకోనిస్తారు. ఊరికే పడుతుందా జింక పిల్ల? అంతో ఇంతో ఖర్చు పెట్టాల మరి.

మొదట్లో కొద్ది రోజులు ఆ తీగలలో మనిషి వాసన వచ్చిందేమో, జింక పిల్ల ఆ తీగల వైపు రాలేదు. ఆ తీగలు రెండో రోజు వాడిపోతే మళ్ళీ కొత్తవి తెచ్చి నాటాడు. ఇలా ప్రతిరోజూ వాడిపోయినవి తీసేసి పసిమి మీద ఉన్న తీగలనే తెచ్చి నాటుతూ ఉన్నాడు.

ఇప్పడొక మూడు రోజులుగా జింకపిల్ల వస్తూ ఉంది. నాటిన తీగల్ని కొరికి తింటూ ఉంది.

ఎదురుగుండా కొత్త కొత్త రుచులు నోరూరిస్తూ ఉంటే ఏ జీవి మాత్రం ఎంతకాలం నిగ్రహించుకని ఉండగలదు? జింక పిల్లకు బాగా అలవాటై పోయింది. ఠంచన్‌గా సాయంత్రం అయిదు గంటలకు వచ్చేస్తుంది. లేత లేత కంది కాయలూ, పెసరకాయలూ, అలసంద కాయలూ తృప్తిగా తిని మడుగులో నీళ్ళు తాగి వెళ్ళిపోతూ ఉంది. ఇక బోను తయారుచేసి పట్టుకోవడమే మిగిలింది. మొన్న రెడ్డోరబ్బాయి అడగనే అడిగాడు. ఇంకా ఎన్నాళ్ళు రా అని. రెండు మూడు దినాలలో పట్టుకస్తానని మాటిచ్చి వచ్చాడు తను. రెండు మూడు రోజుల్లో చిట్టి తల్లి చుక్కకు పంజాబీ డ్రస్సు కనాల. వాళ్ళ క్లాసు పిల్లలందరూ ఫోటో తీసుకుంటారంట. ఆ రోజుకు కొత్త డ్రస్సు వేసుకోవాలని కోరతా ఉంది. పంజాబీ డ్రస్సులో ఎలా ఉంటుందో బిడ్డ!

చుక్కంటే చుక్కే. ఊళ్ళోని అమ్మాయిలంతా ఒక ఎత్తు. చుక్క ఒక ఎత్తు. చుక్క తల్లి చచ్చిపోతూ ప్రమాణం చేయించుకుంది. ఎలాగైనా డాక్టరు చదువుచదివించమని – ఎలాంటి చదువైనా యానాదోళ్ళకు ఉచితంగా చెబుతారంట. ఖర్చే ఉండదంట. అంతా గవర్నమెంటోళ్ళే పెట్టుకుంటారంట. అలాగే చదివిస్తానని మాటిచ్చాడు. హైస్కూల్లో ఏడవ తరగతి, పదో తరగతి పరీక్షల్లో ఫస్టు మార్కులతో పాసయింది. అయ్యవార్లంతా మెచ్చుకున్నారు. పొగిడారు. ఊళ్ళో వాళ్ళంతా ‘ఆ యానాది పిల్లను చూచైనా బుద్ధి తెచ్చుకోండ్రా. ప్రొద్దున్నే వంట చేసిపెట్టి స్కూలుకు వెళ్తుంది. ఇంటి పనంతా తానే చేసుకుంటుంది. బుడ్డీ దీపం వెలుతురులోనే చదువుకుంటుంది. చదువుల్లో ఫస్టు వస్తా ఉంది. మీరూ ఉన్నారు ఎందుకూ? ముప్పూటలా అన్నీ అమర్చి పెడుతున్నా తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అన్నట్టుంది మీ కథ’’ అని తమ తమ పిల్లల్ని తిడుతున్నారు. అసూయతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు.

మొన్న కాలేజీలో భరతమాత వేషం వేసిందట. ఆ రోజు రెడ్డోరింట్లో డిన్నరుకు అడవి పందిని కోసి అరువు చేసి ఇమ్మంటే అక్కడే ఉండిపోవలసి వచ్చింది. తాను వెళ్ళలేకపోయాడు. మరుసటి రోజు ఫోటో తెచ్చి చూపింది. అబ్బ! అచ్చు దేవతలా ఉంది. చేతులెత్తి దండం పెడదామా అనిపించేలాగా ఉంది. దిష్టితీసి ఫోటోకు అద్దం వేయించుకచ్చి గోడకు తగిలించాడు.

పంజాబీ డ్రస్సు కొంటే చుక్క సంతోషిస్తుంది కానీ దానికోసం జింక పిల్లను పట్టి అమ్మానంటే మట్టుకు బాధపడుతుంది. పిచ్చిది. జంతువులంటే ఎందుకో అంత దయ చుక్కకు. పదో తరగతి చదివే రోజుల్లో ఒకనాడు –

‘‘నాన్నా’’

‘‘ఏం తల్లీ’’

‘‘మరి – నువ్వు .. అడవిలో జీవాల్ని పట్టడం మానేస్తే ఏం?

‘‘మానేస్తే మనకు జరిగేదెట్లా?’’

‘‘ఏదైనా వేరే పని చూసుకోవచ్చు గదా?’’

‘‘యానాదోళ్ళకు వేరే పని ఏముంది తల్లీ. జీవాల్ని పట్టి అమ్ముకోవడం మన వృత్తి. మా నాన్న, మా తాత ఇదే పని చేసేవారు. తేనె తీసేవారు. పాముల్ని పట్టేవారు. మీ అమ్మ తమ్ముడు – నీ పెంచులు మామ పాములు పట్టి వాటి తోళ్ళు తీసి అమ్మి ఆ డబ్బుతో ఒక పెంకుటిల్లే కట్టుకున్నాడు. మన కులపోళ్ళలో పెంకుటిల్లు కట్టుకున్నోడు పెంచులుగాడు ఒకడే.’’

‘‘అది కాదు నాన్నా. మా క్లాసులో అయ్యవారు ఈ రోజు ఒక పద్యం చెప్పారు. అందులో ఏమి చెప్పిండంటే జింకలు తమ పాటికి తాము గడ్డీ గాదమూ, ఆకులూ, అలుములూ తిని అడవుల్లో తిరుగుతూ ఉంటాయి. ఒకరి జోలికి పోవు. ఒకరికి కష్టం కలిగించవు. అయినా వేటగాళ్ళు ఊరికే ఉండరు. అవి తమ సొత్తయినట్టు పట్టుకని అమ్ముకుంటారు. అలాగే చేపలు తమ పాటికి తాము నీళ్ళల్లో బ్రతుకుతూ ఉంటాయి. బెస్తవారు వాటిని బ్రతకనీయరు. వాటిని తమ తాతగారి సొత్తయినట్టు పట్టుకని అమ్ముకుంటారు. అలాగే మంచివాళ్ళు ఎవరి జోలికీ వెళ్ళకుండా తమ మానాన తాము సంతోషంగా బ్రతుకుతూ ఉంటే చాడీలు చెప్పేవాళ్ళు. ఊరికేనే వీళ్ళమీద చాడీలు ప్రచారంచేసి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు అని. ‘‘మరి మనం చేస్తున్నది ఆ పనే కదా.’’

నరిసిగాడు ఆలోచనలో పడ్డాడు.

అడివి జీవాలూ, చేపలూ, పక్షులూ ఉన్నదెందుకు? మనుషులు తినడానికే కదా? ఎవరో ఒకటి రెండు కులాల వాళ్ళు తప్ప చప్పన్న కులాల వాళ్ళు తింటూనే ఉన్నారు కదా. వాటిని పట్టుకుంటే తప్పెలా అవుతుంది? చాడీలు చెప్పే వాళ్ళవల్ల మంచివాళ్ళకు ఇబ్బంది కలిగేది మట్టుకు నిజం.

పోయినేడాది తాను అడవిలో ఒక నెమలిని ప్రాణాలతో పట్టి తెచ్చుకున్నాడు. అంతలో తమ వాళ్ళలోనే ఎవడో ఒకడు ఫారెస్టు వాళ్ళకు ఉప్పందించాడు. ఫారెస్టు వాళ్ళచ్చి తనను జైలులో వేస్తామని బెదిరించి నూర్రూపాయలు లాక్కని, నెమలిని వాళ్ళే లాక్కని వెళ్ళిపోయారు. ఆ రోజు తనకోసం నూర్రూపాయలు కట్టి తనను విడిపించింది ఈ రెడ్డోరి అబ్బాయే. నిజాయితీతో బతికే వాళ్ళకు ఈ చాడీకోర్లు ఎప్పుడూ పగవాళ్ళే.’’

అదే మాట అన్నాడు నరిసిగాడు కూతురుతో.

‘‘బాగుంది నాన్నా బాగుంది. జంతువులకూ, పక్షులకూ, చేపలకూ ఒక న్యాయమూ, మనుష్యులకొక న్యాయమా. వాటిని పట్టుకోవడానికి మనకు ఏమి హక్కుంది. దేవుడు మనల్ని ఎట్లా పుట్టించాడో వాటినీ అట్లాగే పుట్టించాడు. వాటిని పట్టుకునే హక్కు మనిషికి లేదు.’’

‘‘ఏమో అదంతా నాకు తెలియదు. నా చేతికి దొరికిందాన్ని పట్టుకుంటాను, అమ్మకుంటాను. అంతే.’’

‘‘నీ చేతికి మనుషులు దొరికినా ఇట్లాగే అమ్ముకుంటావా.’’

‘‘మనుషులేంది, దొరకడమేమిటి? వాళ్ళేం జంతువులా, వస్తువులా దొరకడానికి. మనుషుల్ని ఎవరైనా పట్టుకుపోయి అమ్ముకుంటారా? అమ్ముతూ ఉంటే ఆ మనుషులు ఊరుకుంటారా?’’

‘‘చాలా కాలానికి ముందు అమెరికా వాళ్ళు ఆఫ్రికా దేశంలో అడవుల్లో తిరిగే నీగ్రోజాతి మనుషుల్ని వలలువేసి పట్టుకునే వారంట. కంత మందిని చాటునుండి కట్టి పడేసి కాళ్ళు చేతులూ కట్టేశేవారట. ఇట్లా పట్టుకున్న వాళ్ళనందరినీ స్టీమర్లలో వేసుకుని అమెరికా వెళ్ళి అక్కడ బజారులో నిలబెట్టి వేలంవేసి అమ్మేవారంట. వాళ్ళను భూస్వాములు తమ పొలాల్లో పని చేయడానికి బానిసలుగా కొనుక్కనే వారంట. భార్యా భర్తా, బిడ్డలుగా ఉన్న కుటుంబాలనే పట్టుకెళ్ళి ఒక్కక్కరిని ఒక్కక్కరికి అమ్మేసేవారంట. మా పుస్తకాల్లో రాశారు. నీకు చదవడం నేర్పుతా. నేర్చుకో. ఇదంతా నీ అంతట నువ్వే తెలుసుకుందువు గానీ.’’

నరిసిగాడు ఆలోచనలో పడ్డాడు. బలం లేనోళ్ళ బతుకులు ఇంతే. వీళ్ళకు ఏ రక్షణా ఉండదు. హక్కులూ, అధికారాలూ అన్నీ బలం ఉన్న వాళ్ళకే.

లేనివాళ్ళెప్పుడూ మోసపోతూనే ఉంటారు. ఉన్న వాళ్ళెప్పుడూ మోసగిస్తూనే ఉంటారు. ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్లా జరుగుతూనే ఉంది. ఇది ఆగదు. ఎవరూ ఏమీ చేయలేరు. బ్రతుకు తెరువుకోసం తాను అడవి జీవాల్ని పట్టకా తప్పదు, అయిన కాడికి పెద్దోళ్ళకు అమ్మకా తప్పదు.

ఇక బోను తయారుచేయాల. దట్టంగా ఉన్న చెట్లలోనే మూడు వైపులా కంచె వేసినట్టు చెట్టుకూ చెట్టుకూ మధ్య పచ్చని ఆకులుండే తీగలను గట్టిగా బిగించి కట్టాడు. అక్కడ తీగలు సహజంగా అల్లుకున్నట్టు కనబడుతుంది కాని పనిగట్టుకని బిగించి కట్టినట్టు కనబడదు. అలా దాదాపు అయిదడుగుల ఎత్తు వరకూ మూడు వైపులా తీగల కంచె కట్టాడు. నాలుగోవైపు దారి వదిలాడు. ఇక నాలుగో వైపు దారికి అడ్డంగా పైన గట్టివలను పైకెత్తి కట్టాల. లోపల నేలపైన అడ్డంగా కన్ని తీగలు కట్టాల. ఒక బిస కట్టెను బిగించాల. నేలపై నుండే అడ్డతీగ జింక కాలికి తగిలి లాగిందంటే బిసకట్టె ఊడి వలను వదిలేస్తుంది. వల వాలిపోయి నాలుగో వైపు దారి మూసుకుపోతుంది. ఇంక లోపల జింక ఎంత గుంజులాడినా కంచెలాగా ఉన్న తీగలు తెగవు. వలలో దారి దొరకదు. ఎగిరి దాటిపోవడానికి వీలులేదు. ఒకవేళ జింక కాలికి తీగ తగలకపోతే తానే బిసకట్టెకు ఒక తాడు కట్టిపెట్టి దూరంగా సిద్ధంగా ఉండాలి. సమయం చూసి తాడులాగితే బిసకట్టె ఊడిపోయి వల వాలిపోతుంది. ఈ ఏర్పాట్లు ఏమాత్రం తప్పిపోకుండా రెండు మూడు సార్లు చేసి చూసుకోవాల. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా తన ప్రయత్నం అంతా చెడిపోతుంది. భగవంతుడా ఈ రోజు తప్పకుండా జింకపిల్ల దొరికేటట్టు దయ చూడు స్వామీ.

నరిసిగాడు వలనూ, బిసకట్టెనూ బిగించే ప్రయత్నంలో పడ్డాడు.

****

సాయంత్రం అయిదయింది. చుక్క కాలేజీ దగ్గర బస్సుకోసం నిలబడింది. నాయుడోళ్ళబ్బాయి అంతవరకూ దూరంగా కాపుకాసి ఉండి అప్పుడే యాథాలాపంగా అటువైపు వచ్చినట్టు అక్కడికి వచ్చాడు మోటారు సైకిలు పైన.

‘నేనూ మనూరికే వెళ్తున్నా. వస్తావా.’’

చుక్క కాసేపు తటపటాయించింది. మనస్సు వద్దంటున్నా శరీరం మునుపటి అనుభవాన్ని కోరుతూ ఉంది. వేరే దారిలేక ఒప్పుకుంటున్నట్టు కదిలి బండి వెనక కూర్చుంది.

మోటారు సైకిలు ఒక పెద్ద హోటలు వద్ద ఆగింది. చుక్క మొదట వద్దంది కాని నాయుడోళ్ళబ్బాయి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు ఆ అమ్మాయికి. ఖరీదైన పదార్థాలు – చుక్క ఇది వరకు తిననివీ, చూడనివీ వచ్చాయి. వాటిని ఎట్లా తినాలో కూడా అబ్బాయే నేర్పవలసి వచ్చింది.

చుక్క ఇంట్లో రాత్రింబగళ్ళూ సంగటీ, ఊరుబిండీ, పుల్లగూరేకదా. ఒక్కో రోజు ఏదైనా గువ్వమాంసం. కాలేజీ క్యారియర్‌లో పట్టుకెళ్ళడానికి అన్నం ఉండదు. ఉదయం కడుపు నిండుకూ సంగటి తిని వెళ్ళిపోతే మళ్ళీ రాత్రికే భోజనం. అందుకే చుక్క ఆరోగ్యం అంత గట్టిగా ఉంది.

‘‘ఈ హోటలుకు అప్పుడప్పుడూ వస్తా ఉంటారా మీరు.’’

‘‘టౌనుకు వచ్చినప్పుడంతా తప్పక ఈ హోటలుకే వస్తా.’’

‘‘వచ్చినప్పుడంతా ఇవే తింటారా’’ జంకుతూ అడిగింది.

‘‘కాక! ఇక్కడ కూడా ఇడ్లీలు, దోసెలూ, పూరీలే తింటానా? ఇవేకాదు ఇంకా చాలా రకాలున్నాయి. ఇంకక రోజు మరికన్ని వెరైటీలు తిందాం కానీ.’’

‘‘ఇడ్లీలూ, దోసెలూ, పూరీలూ అంత చులకనగా కనబడుతున్నాయి ఇతని కంటికి’’ అనుకుంది చుక్క.

ఏడున్నరకు మోటారు సైకిలు ఊరిదారి పట్టింది.

దారిలో అడిగాడు ‘ఇంటర్‌ తరువాత ఏం చేద్దామనుకుంటున్నావు.’’

‘‘ఎంసెట్‌ రాసి మెడిసిన్‌లో చేరుతా. మా అమ్మ ఆఖరు కోరిక అదే.’

‘‘వెరీగుడ్‌, తప్పకుండా మెడిసిన్‌ చదువు. అందుకు ఎంత ఖర్చయినా నేను భరిస్తా.’’

‘మీరా? ఎందుకూ?’’

‘‘ఏమో నిన్ను చూస్తుంటే ఎందుకో అలా అనిపిస్తా ఉంది. నువ్వు డాక్టరువై స్టెతస్కోపు మెడకు తగిలించుకని తిరుగుతూ ఉంటే అదిగో మా చుక్క – ఛ – ఛ అదిగో మా డాక్టరు సుకన్య అని నలుగురికీ చూపాలని ఉంది.’’

ఆ మాటలు వింటూ ఉంటే చుక్కకు ఏమిటోలాగా ఉంది. బదులు మాట్లాడలేదు.

అబ్బాయి కళ్ళద్దాలు జారి క్రిందపడిపోయాయి. బండి ఆపి ఇద్దరూ దిగారు. మళ్ళీ అదే ప్రదేశం. అదే వాతావరణం. అదే ఏకాంతం. అబ్బాయి వెనక్కి వెళ్ళి కళ్ళద్దాలు తెచ్చుకున్నాడు. చుక్క దగ్గరికి వచ్చాడు. కాసేపు ఎదురుగా నిలుచున్నాడు. చుక్క అతని వైపే చూస్తూ ఉంది. అబ్బాయి ఒక్కసారిగా చుక్కను గట్టిగా కౌగిలించుకుని పెదాలపైనా, చెంపల పైనా, మెడపైనా ముద్దులు కురిపించాడు.

చుక్క ఒక్క నిమిషం అలాగే నిలిచిపోయింది. తన శరీరం ఆశిస్తున్నదీ, ఎదురు చూస్తున్నదీ ఇలాంటి అనుభవం కోసమే. కాని మనస్సు జాగ్రత్త, జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ ఉంది. స్నేహం ఇంతవరకే అయితే బాగానే ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే ప్రమాదమే.

‘‘ఇదిగో, ఇదే వద్దన్నది. ఎక్కండి బండి.’’

పిట్ట దారిలోకి వస్తూ ఉంది. హోటలు తిండితో ఆడపిల్ల బుట్టలో పడుతుందా. మరికాస్త ఎక్కువే ఖర్చుపెట్టాల. మరికాస్త పొగడాల, మరికాస్త ఓపిక పట్టాల. బెదిరిపోనివ్వకూడదు.

ఏమీ మాట్లాడకుండా ఊళ్ళోకి వచ్చేశారు.

‘‘నీ మెడబోసిగా ఉంటే చూడ్డానికేం బాగా లేదు’’ అన్నాడొకనాడు.

‘‘ఈసారి తలకోన తిరణాళ్ళలో పూసలదండ కొనుక్కుంటా.’’

‘‘పూసల దండా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నాయుడోళ్ళ అమ్మాయిలాగా, రెడ్డోళ్ళ అమ్మాయిలాగా ఉన్నావు. ఇంటర్‌ చదువుతా ఉన్నావు. లక్షణంగా సన్నని బంగారు చైను వేసుకోవాల’’ జేబులోంచి తీసి చూపాడు.

బంగారు గొలుసు తళతళ మెరుస్తూ ఉంది. చుక్క కళ్ళు మిలమిల మెరిశాయి.

‘‘మెడలో వేసుకో.’’

‘‘నాకేనా?’’

‘‘నీకే. నీ కోసమే కొన్నా.’’

‘‘నేను డబ్బులివ్వలేను. నా కొద్దు.’’

‘‘నేను డబ్బులిమ్మన్నానా? నేను నగలు అమ్మే వ్యాపారం చేస్తున్నానా.’’

‘‘మరి ఊరికే ఎందుకిస్తున్నారు.’’

‘‘ఇంత ఖరీదైన వస్తువు ఎవరికి పడితే వాళ్ళకు ఊరికే ఇస్తానా? నా మనిషివి అని అనుకున్నాను కనుక ఇస్తున్నా. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంటుంది. ఇద్దరం ఒకటేనేమో అనిపిస్తుంది. నువ్వు వేరే మనిషివి అనిపించడం లేదు. నా స్వంతానివి అనిపిస్తూ ఉంది. నీపైనా, నీ బాగోగులపైనా నాకు అధికారమున్నట్టు, నా కొక్కడికే అధికారమున్నట్టు అనిపిస్తూ ఉంది. అందుకే నీకిస్తున్నా’’ జాగ్రత్తగా తయారుచేసుకన్న నాలుగు మాటల్ని చక్కగా వల్లించాడు. చుక్క సిగ్గుపడింది. నవ్వింది.

వెన్న కరుగుతూ ఉంది.

‘‘మరి మా నాన్న ‘ఎక్కడిదే ఇది’ అని అడిగితే?’’

అబ్బాయి అటూ ఇటూ చూసి రోడ్డు ప్రక్కన ఒక వర్క్‌షాపు దగ్గర మసిమట్టిలో బాగా పొర్లించి తెచ్చాడు.

‘‘రోడ్డుమీద దొరికిందని చెప్పు. మెరుగేయించుకో.’’

చుక్క సమస్యకు పరిష్కారం దొరికింది. అబ్బాయి సమస్య ఇంకా తీరలేదు.

****

సాయంత్రం అయిదయింది. ఇంకక గంటలో పొద్దుగూకవచ్చు. పక్షులన్నీ తమ తమ గూళ్ళ దగ్గరికి వస్తూ పోతూ ఉన్నాయి. ఆఖరి ప్రయత్నంగా తాము సంపాదించగలిగిన ఆహారాన్ని సంపాదించుకని, తిని, తమ గూళ్ళలో చేరిపోవాలని చూస్తున్నాయి. జంతువులన్నీ మామూలుగా తాము పడుకొనే తావుల దగ్గర దగ్గరికి చేరుకుంటున్నాయి.

యానాది నరిసిగాడు బిసకట్టెకు కట్టిన తాడు కొన పట్టుకని కాస్త దూరంగా ఉన్న చెట్టుపైన దట్టమైన కొమ్మలమధ్య దాక్కున్నాడు. రోజూ తెచ్చిపెట్టే పెసర తీగలూ, అలసంద తీగల కంటే ఈ రోజు కాస్త ఎక్కువే తెచ్చి నాటి పెట్టాడు.

జింకపిల్ల బెదురు చూపులు చూస్తూ వచ్చింది. మూడు రోజులుగా ఏ విధమైన అపాయము ఎదురుకాకుండా మంచిమేత లభిస్తున్నా జాతి సహజమైన బెదురు జింకను వదల్లేదు. గడ్డి పరకలూ, లేత ఆకులూ కొరుక్కుంటూ బోను లోపల అడుగుపెట్టింది. బిసకట్టెకు కట్టిన తీగ జింక కాలికి తగులుతుందేమో అని నరిసిగాడు ఆత్రంగా చూస్తున్నాడు. కాని జింకపిల్ల ముందటి అడుగులు తీగకు అవతల పడ్డాయి. తరువాత వెనుక కాళ్ళు కూడా తీగను దాటుకున్నాయి. ఇక తన చేతిలోని తాడును లాగక తప్పదు. జింకపిల్ల పెసర, అలసంద తీగల్ని ఆబ ఆబగా కొరుకుతూ ఉంది. లేత లేత పెసర అలసంద కాయలు కమ్మగా ఉన్నాయేమో, అటూ, ఇటూ చూడకుండా ఏకదృష్టితో తింటూ ఉంది. జింకపిల్ల బాగా లోపలికి వెళ్ళగానే తక్షణం తాడు లాగాడు నరిసిగాడు. బిసకట్టె ఊడిపోయింది. వల వాలిపోయింది. ద్వారంవద్ద వల అడ్డంగా నిలిచిపోయింది. ద్వారం మూసుకుపోయింది. శబ్దానికి జింకపిల్ల బెదిరి వెనక్కి గెంతింది. వెనక వల అడ్డుకుంది. పక్కలకు గెంతింది. చెట్లకు అల్లి కట్టిపెట్టిన బలమైన తీగలు అడ్డుకున్నాయి. గంతేసి పైకెగిరింది. కంచెలాగా ఎత్తుగా కట్టిన తీగలలో కాళ్ళు తగులుకని కొంతసేపు బోనులోపలే తలకిందులుగా వేలాడింది. తరువాత పట్టుతప్పి జింకపిల్ల నేలమీద పడిపోయింది.

****

నాయుడోళ్ళబ్బాయి చిరాకు పడిపోతున్నాడు. తన రాజకీయ భవిష్యత్తు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొడుకు చేతిలో ఉంది. అతని దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళడం ఎలా? ఈ అరగాసు యానాదిపిల్ల పెట్టిందంతా తింటా ఉంది. ఇచ్చిందంతా తీసుకుంటా ఉంది. రూముకు రమ్మంటే రాదు. సినిమాకు రమ్మంటే రాదు. తలకోనకు మోటారు సైకిలు మీద షికారుకి రమ్మంటేరాదు. ఎట్లా? రెండు మూడు రోజుల్లో ఎట్లాగైనా ఈ పిల్లను హైదరాబాదుకు తీసుకెళ్ళిపోవాల. అక్కడ రెండు రోజులు దానికి మగ సుఖం రుచి చూపి తరువాత మంత్రి కొడుక్కి అప్పగించాల. మరీ ముడిసరుకుగా సమర్పిస్తే అది అక్కడ కిరికిరిలు చేస్తే అతడు విసుక్కుంటాడు. అతడు ఎన్నిరోజులు ఉంచుకుంటాడో చూసి ఆ తరువాత షకీలా బేగంకు అమ్మేస్తే కనీసం ఇరవై అయిదు వేలైనా దండుకోవచ్చు. కానీ ఈ పిల్లను దారిలో పెట్టేదెట్లా? ఇద్దరు మనుషుల సాయంతో బలవంతాన ఎత్తి కారులో వేసుకని హైదరాబాదు వెళ్ళిపోవచ్చు. కాని అది ఆఖరి ప్రయత్నం. అన్ని ప్రయత్నాలూ ఫెయిల్‌ అయినప్పుడు చేయవలసిన ప్రయత్నం.

ఈ దిక్కుమాలిన, అమాయికపు భారతదేశ స్త్రీలను లొంగదీయాలంటే ఒకటే మంత్రం. ‘‘పెండ్లి చేసుకుంటా, మెడలో మంగళసూత్రం కడతా, ఇదిగో మంగళసూత్రం’’ అంతే – ఆ మంత్రంతో ఠఫ్‌మని పడిపోతారు.

ఆ మంత్రమే వేశాడు చివరకు.

‘‘ఎన్నాళ్ళిలా చుక్కా? నిన్ను వదలి, నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. మనం వెంటనే పెండ్లి చేసుకుందాం. నేను ఎంఎల్‌ఏ అయ్యానంటే తరువాత కుదరదు.’’

‘‘నన్నా? పెళ్ళా? మేము యానాదోళ్ళం. మీరు నాయుళ్ళు…’’

‘‘నాకు ఆ భేదం లేదు. ఆ భేదమే నా మనస్సులో ఉంటే నీతో ఎందుకు సావాసం చేస్తాను? నువ్వు యానాది పిల్లవు కావు. రత్నానివి. దిబ్బలో ఉన్నా రత్నం రత్నమే.’’

‘‘మీ అమ్మా నాన్నా ఒప్పుకుంటారా? నన్ను మీ ఇంటిలోకి రానిస్తారా? చంపేయరూ నన్నూ, మా నాన్ననూ కూడా.’’

‘‘నిజమే. మా అమ్మా నాన్నా మన పెళ్ళికి ఛస్తే ఒప్పుకోరు. అందుకే మనం హైదరాబాద్‌ వెళ్ళి అక్కడ నా స్నేహితుల సమక్షంలో పెళ్ళి చేసుకుందాం. అక్కడ మన పెళ్ళికి ఎంఎల్‌ఏలూ, మంత్రులూ వస్తారు. అక్కడే కాపురం పెడదాం. నేను పార్టీ టిక్కెట్టు కోసం కొంతకాలం హైదరాబాద్‌లో ఉండాల. ఇంతలోపల నా స్నేహితులు మన పెళ్ళి విషయం మా వాళ్ళకు చెప్పేస్తారు. మా వాళ్ళు హైదరాబాద్‌ వచ్చేటప్పటికి మనం కొన్నాళ్ళు ఉత్తరాది టూరువెళ్ళి వద్దాం. ఇంత జరిగాక మా వాళ్ళు ఒప్పుకోక ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా గొడవచేస్తే మన పెళ్ళికి వచ్చిన పెద్దలు సర్ది చెబుతారు. పైగా నేను కులాంతర వివాహం చేసుకుంటే నాకు మరింత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎలెక్షన్‌లో గెలుపు ఖాయం. తరువాత మీ నాన్నను మన దగ్గరికి రప్పించుకుందాం. నీకు తోడుగా ఉంటాడు.’’

చుక్క అబ్బాయి మాటల వెంబడి పయనించి ఆకాశంలో మేడలలో విహరించసాగింది. పెళ్ళి, పెద్ద పెద్ద వాళ్ళు సాక్షులు. తనతో వివాహం వల్ల అబ్బాయి గెలుపు ఖాయం. ఇవన్నీ అబ్బాయికి అవసరమైన విషయాలే. ఇందులో తనను మోసంచేసే విషయం ఏమీలేదు. నాన్నను నిదానంగా నచ్చచెప్పి రప్పించుకోవచ్చు. నాన్న తన దగ్గరే ఉంటాడు. నిజానికి నాన్న సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. కూతురి అదృష్టాన్ని తలచుకని తలచుకొని ఉబ్బి తబ్బిబ్బులై పోతాడు. తన దగ్గరే ఉండి పోతాడు.’’

పడిపోయింది. ఇన్నాళ్ళకు ఈ మంత్రంతో యానాది పిల్ల పడిపోయింది. ఇక ఆలస్యం చేయకూడదు.

‘‘సాయంత్రం కాలేజీ దగ్గరికి కారు తెస్తాను. రెడీగా ఉండు. అటు నుంచి అటే హైదరాబాద్‌ ప్రయాణం. నువ్వేమీ తెచ్చుకోవద్దు. నీకు కావలసినవన్నీ హైదరాబాద్‌ వెళ్ళిన వెంటనే కందాం’’. వంగి రొమ్ముల మీద ముద్దు పెట్టుకున్నాడు.

చుక్క మౌనంగా ఉండిపోయింది ఊహల్లో తేలిపోతూ.

****

జింకపిల్ల పడిపోగానే నరిసిగాడు చెట్టు దిగి గబగబా బోను దగ్గరికి పరుగెత్తాడు. వల కిందనుంచి దూరి బోనులోకి వెళ్ళాడు. అంత లోపల జింకపిల్ల మళ్ళీ లేచి కంచె తీగలగుండా దూరి బయట పడడానికి శాయశక్తులా పెనుగులాడుతూ ఉంది. నరిసిగాడు జింకను కింద పడేసి నాలుగు కాళ్ళు గుదిగూర్చి గట్టి తాడుతో కట్టేశాడు. జింక కట్టేసిన కాళ్ళతోనే తన్నుకుంటూ ఉంది. జింక శరీరం తన మెడమీద, కాళ్ళు తన రొమ్ముమీదా ఉండేలాగా ఎత్తుకని బయలుదేరాడు నరిసిగాడు కొండంత సంబరంతో.

దాదాపు ఇరవై దినాల శ్రమ ఫలించింది. రెడ్డోరబ్బాయి దగ్గర ఎక్కువ డబ్బే రాబట్టాల. కష్టానికి తగిన ఫలం అడగాల. రేపే టౌనుకు చుక్కను తీసుకెళ్ళి దానికి నచ్చిన పంజాబీ డ్రస్సు కొని ఇవ్వాల. డబ్బు చాలకపోతే వేంకటాచలం శెట్టి దగ్గర తాను ఇచ్చి పెట్టిన డబ్బును కూడా తీసుకోవాల.

ఇంకా ప్రొద్దుగ్రుంకలేదు. ఈపాటికి చుక్క కాలేజి నుంచి ఇంటికి వచ్చేసి ఉంటుంది. వలచుట్టను ఇంటి దగ్గర పడవేసి నేరుగా రెడ్డోరి ఇంటి కెళ్ళాల.

నరిసిగాడు మెడమీద బరువు మోసుకుంటూ వలచుట్టను చంకలో పెట్టుకని తొందర తొందరగా ఇల్లు చేరుకున్నాడు. తలుపు మూసే ఉంది. వేసిన బేగం వేసినట్టే ఉంది. ఇంకా చుక్క కాలేజీ నుంచి ఇంటికి వచ్చినట్టు లేదు.

చంకలో ఉన్న వలచుట్టను కిందికి జారవిడిచి మెడపైన ఉన్న జింక పిల్లను మెల్లగా దించి దాని కాళ్ళకు కట్టిన తాడు భద్రంగా ఉందో లేదో మరోసారి చూసుకున్నాడు. మొలతాడుకు కట్టుకున్న మారు బీగం చెవితో బీగం తీయడానికి తలుపు దగ్గరికి వెళ్ళాడు. బీగం సందులో ఏదో కాగితం. దాన్ని బయటకు లాగి మడతలు విప్పి అందులోని అక్షరాలు కూడదీసి కూడదీసి చదవసాగాడు.

‘‘నాన్నా నేనూ, నాయుడోళ్ళబ్బాయా హైదరాబాదులో పెళ్ళి చేసుకోబోతున్నాం. ఈరోజే వెళ్తున్నాము. నువ్వు నా కోసం హైదరాబాద్‌కు రావద్దు. నాయుడోళ్ళ ఇంటిలో చెప్పొద్దు. నేనే కొద్ది రోజుల తరువాత వచ్చి నిన్ను మా దగ్గరికి తీసుకెళ్తాను.’’

నరిసిగాడు నెత్తిన పిడుగుపడ్డట్టయింది. కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది. కాళ్ళల్లో శక్తి ఒక్కసారిగా చచ్చిపోయి నిలబడలేక కూలిపోయాడు. చుట్టూ లోకం గిర్రున తిరిగినట్టయింది. కళ్ళు కనబడడం లేదు. నాయుడోళ్ళబ్బాయి రూపం కళ్ళముందు మెరిసింది. వాడి గత చరిత్ర మనస్సులో మెదిలింది. ఇలాంటి పెళ్ళి కబుర్లు ఎక్కడికి చేరి ఎక్కడ అంతమౌతాయో, ఎలా అంతమౌతాయో తనకు బాగా తెలుసు. చుక్కకు పట్టబోయే గతి సినిమా రీళ్ళలాగా కళ్ళముందు మెదిలింది. హృదయం బద్దలై పోయింది. తల పగిలిపోయింది. తల, రొమ్ము బాదుకున్నాడు. ‘‘చుక్కా’’ అని బిగ్గరగా కేకేశాడు. తల నేలకేసి బాదుకున్నాడు. ఏడవడానికి గొంతు పెగలలేదు. చుక్కా, చుక్కా అని మాత్రం అరవగలుగుతున్నాడు.

పక్కనే పడి ఉన్న జింకపిల్ల పకపకా నవ్వినట్టయింది. నరిసిగాడు దానివైపు చూశాడు. జింకపిల్ల నరిసిగాడి వైపు ఒక్క క్షణం జాలిగా చూసి మెల్లగా నవ్వింది. తరువాత మెల్లగా తల వాల్చేసింది. *