రత్తి పాటలు

1

మావ:

ఏవూరిసిన్నదో ఎవ్వారి సిన్నదో
ఈడేరి వున్నది ఇంచక్క వున్నది
కొప్పేటి ముడిసింది కోకేటికట్టింది
సూపేటి సూసింది నడకేటి నడిసింది
సుడిగాలిలా నన్ను సుట్టపెట్టేసింది “ఏ”

ఎక్కడో సూసినట్టు ఏదేదో వున్నట్టు
మనసేటో సెపుతాది మనకేసి పోతాది
గుండెల్లో నాకు పాటేదో మెదిలింది “ఏ”

జనమ జనమల నుంచి నా పెళ్ళామేమొ
సెప్పగలగే వారు ఉన్నారో లేరో
కన్నులకు నాకు నిదరింకరాదు “ఏ”

రత్తి:

సక్కనైనోడు – సల్లనైనోడు
ఈడితో జోడు కుదిరితే ఇంపు
ఈడి పక్కనె నేను నిలిసుంటె సొంపు
రూపు సూపులు సూడ – ఊపిరాడబోదు “స”

ఈడిమాటలే పాటలై ఇనిపించుతాయి
ఈడుపాటలే పాడితే ఇంకెంత హాయి
ఆడి పలుకు ముందు సిలకాలెందుకందు “స”

నా కాలికి ముల్లు నాటుకున్నపుడు
ఆడి కళ్ళంట నీరు కారగాసూత్తి
ఆడి మనసు ముందు – ఎన్న ఎందుకందు “స”

రత్తి:

గుండెల్లో ఒక మాట గూడు కట్టింది
గుక్క తిప్పకుండ గోస పెడతంది “గు”

ఆడి తలపుల్లోన అలసిపోతుంది
ఆణ్ణి సూసేదాక ఆరాటపడుతుంది
పాడినా పాటలో ఆడి పేరుంటాది
నిదరలో ఆ రూపె మెదలుతా వుంటాది “గు”

కూకుండలేను నుంచుండలేను
నిముసమైనాగాని కునుకెయ్యలేను
ఆడొచ్చి అడిగితే సిక్కొదిలిపోతాది
ఆడిసేయి తగిలి తెగ్గొదిలిపోతాది “గు”

పూలకు పిట్టలకు ఊసులొచ్చుంటె
ఈ కబురు ఆడికి మోసేసి ఉంటె
ఈ సింత ఒదిలేసి- బతుకు
మలుపేదో తిరిగేది “గు”

మావ:

మాట తీసెయ్యొద్దు
ఇసిరి కొట్టెయ్యొద్దు
నీకు నాకేటని
నిలదీయ వద్దు “మా”

నీపేరె పదముగా పాడుకొంటున్నాను
నీ రూపు కళ్ళలో దాసుకొంటున్నాను
నీతోటి బతుకే నిత్తెముండాలని
ఎయ్యిదేవుళ్ళకు నేను మొక్కుకుంటున్నాను “మా”

నీ సూపు నా సూపు కలిసింది మొదలు
నా గుండె గూడులో ఏసంగి గుబులు
ఈమాట సెపితే ఏటందువోనని
ఇన్నాళ్ళు ఆగేను ఇంకాగలేనె “మా”

నేనంటే నీకు మనసున్నదంటే
చేతికి సెయ్యిచ్చి ఒక నవ్వు నవ్వు
నేనంటే నీకు ఇట్టమున్నట్టయితే
నీ సేతితోనె ఇంత యిసమిచ్చి సంపు “మా”

రత్తి :

నేనేటో ఎరగవు – నాపేరేటో ఎరగవు
నాపైన నీకింత మనసుండ తగదు “నే”

కులము తక్కువ దాన్ని – సిరిలేనిదాన్ని
రత్తిపేరూదాన్ని- సెత్తి లేనిదాన్ని “నే”

పొగరెక్కువంటారు – తెగటెక్కు అంటారు
ఊపిరి కొత్తరి – ఊసులకి కొత్తనె “నే”

నోరిడిసి అడిగేవు కాదనగలేను
వచ్చేటి ముప్పులకు – నేనేటి కాను “నే”

మావ:

ఈ ఏల నామనసు – ఈ మాపమైనది
ఆకాశ మంచులా తెగ తిరుగుతున్నాది “ఈ”

కులమేటి మతమేటి – ధనమేటి బలమేటి
మనసులూ కలిసేక మనకింక అడ్డేటి “ఈ”

నా రత్తంలో రంగువి నీవే
నాగుండెల్లో సప్పుడు నీవే
నిన్నొదులుకుంటానా?
నను సంపుకుంటానా? “ఈ”

ఏ ముప్పులొచ్చినా ఎదురీదగలను
ఏ అడ్డులొచ్చినా ఎగిరేయగలను
పక్కన నువ్వుంటె పరమేసుడున్నట్టె
ఒక్కరికి నేనింక ఓడేది లేదు “ఈ”

రత్తి:

కలతెందుకురా – కళ్ళనీరెందుకురా
ఎవరేటి అన్నారు – ఏ సిచ్చనేసారు
సెప్పరా నాతోటి సెప్పరా “క”

సుకములోనా నీవె కట్టాలలో నీవె
రెంటిలో నీతోనె కలిసి వుంటానురా “క”

నీగుండె నాకాడ దాసుకో వద్దురా
నా బతుకు నీ బతుకు ఏకమైనాదిరా “క”

మావ:

ఏటనీసెప్పనేరత్తి
ఏలాగ సెప్పనే
కన్నతల్లే నన్ను కాదు పొమ్మన్నాది
నీతోటి నా పెల్లి సెల్లదన్నాది
నే నేటి సెప్పినా ఒప్పుకోనన్నాది
నాకడుపు పట్టుకొని నొక్కకన్నాది “ఏ”

పదినెల్లు మోసాను
పాలిచ్చి పెంచాను
లోటేటి లేకుండ పెద్దోడివైనావు
ఈనాడు నామాట కొట్టవద్దన్నాది “ఏ”

మాట కొట్టిన ఎడల మాటాడ వద్దంది
ఏమాటా సెప్పరా ఒకరోజు గడువంది “ఏ”

రత్తి:

ఈమాటకేయింతదిగులా మావా
నీగుండెలో ఇన్ని సెగలా మావా
కన్న తల్లిని నువ్వు కలత పాల్సెయ్యొద్దు
నమ్ముకున్నదాన్ని నట్టేట దింపొద్దు “ఈ”

గుట్టుగా కొన్నాల్లు ఉండు
ఒట్టుగా మనకలలు పండు
ఎండల్లు కాత్తాయి వానల్లు వత్తాయి
కాలంలో మారుపుల కెరటాలె లేత్తాయి “ఈ”

కాదన్న మీ అమ్మ కట్టుయాటూ మనిసి
ఔనన్న నీ మనసుకు పేమంటే తెలుసు
కులాలు పోతాయి – మతాలు పోతాయి
నీ అమ్మ మనసులో పేమగాలేత్తాది “ఈ”

2

రత్తి:

సలి మంటకాడ
పదిమందిలోన
కనుగీటినావేటిరో
మావ పరువేటి కావాలిరో
మావ పరువేటి కావాలిరో

ఊరంటే ఏటిరా – నోరెట్టి పడతాది
ఇంతంటె అంతని – ఇంతగా సెపుతాది “ఊ” “స”

పేమంటె ఏటో – పేమ జంటెరుగురా
ఎరగలేనోళ్ళకి – పేమంటె పిచ్చిరా “ఊ” “స”

పెళ్ళయ్యే దాక కొంత గుట్టుగా ఉండరా
పెళ్ళయ్యిపోతే మనకడ్డేటి ఉందిరా “స”

రత్తి:

ఏకటాకీ చూడకు
ఎర్రోడి వవ్వకు
నాపేరే పాడకు
ఎల్లడిరా, వాడకు “ఏ”

నిన్నంటి వుందునే ఏసేనం
నీకంటి ఇంటనే కాపరం
నీ ఊసులే నాకు ఊపిరి
నీతీపి తలపులే రేతిరి “ఏ”

కూడు తినేటేల, కూలి చేసేటేల
కూకున్న ఏల, నిలుసున్న ఏల
నాగుండెల్లో నీవెపుడు నిలిసేవురా
గుండెల్లో గొంతెత్తి పిలిసేవురా! “ఏ”

మావ:

కునుకు రాదేరత్తి కూడదంటేను
కోక కొంటానే ఒప్పుకుంటేను

రత్తి: కొన్నాన కోకను? కట్టేన కోకను?
పెట్టావు లేవోయి మా గొప్ప లంచము

మావ: తిరము లేదే రత్తి తిప్పి కొడతేను
తిలకాన్ని కొంటాను ఒప్పుకుంటేను

రత్తి: కొన్నాన తిలకాన్ని? దుద్దేన నా నుదుట?
పెట్టావు లేవోయి మా గొప్ప లంచము

మావ: పగలు రాదె రత్తి పట్టనీకుంటేను
పట్టీలు కొంటాను ఒప్పుకుంటేను

రత్తి: ఏ ఇంటిగోడకు ఏసావు కన్నము
నాకొద్దు బాబోయి నీ దొంగనగలు

మావ: దొంగోడి నైతేను దోచి పారేత్తాను
దిక్కెవ్వరే నీకు మొక్కెవ్వరే నీకు
దిక్కెవ్వరే నీకు మొక్కెవ్వరే నీకు

రత్తి: దిక్కు మొక్కులు రెండు ఎదురున్న నీవు
ముట్ట కూడదు నన్ను తెలిసింద మావ

3

రత్తి:

ఒల్లో కూకుంటాడమ్మా!
ఎన్నో సెపుతుంటాడమ్మా!
కల్లకేసి సూత్తాడమ్మా!
కన్నుగీటి నవుతాడమ్మా! “ఒ”

ముద్దొత్త ఉంటాడమ్మా!
ముద్దిత్తా నంటాడమ్మా!
వద్దన్నా ఇనుకోడమ్మా!
వాటేసుకు పోతాడమ్మా! “ఒ”

రేయంతా నిదరోడమ్మా!
గోపాలుని అన్నోయమ్మా!
ఒల్లంతా సెమటేనమ్మా!
కనుగవ్వలు ఎరుపోయమ్మా! “ఒ”

నవ్వింతా ఉంటాడమ్మా!
కవ్వింతా ఉంటాడమ్మా!
నా నోముల పంటోయమ్మా!
నే కోరిన జంటోయమ్మా! “ఒ”

మావ:

పున్నమి సెందురుడు
పచ్చని ఎన్నెల “పు”

మల్లిపూలు ఎట్టుకోయే
మంచిగంధం రాసుకోయే
తెల్లకోక కట్టుకోయే
తెల్లారులు మేలుకోయే
కొమ్మమీంచి కోయిలమ్మ కూసినట్టు
మబ్బుసూసి నెమలి పిట్ట ఆడినట్టు
వరిసేను పైరిగాలి కూగినట్టు
వరిసేను పైరిగాలి కూగినట్టు
లేగదూడ పాలు తాగి గెంతినట్టు
ఈ ఏల సందడి – ఈ ఏల సందడి “పు”

రత్తి:

మలాట సినిమాకి
మావ మన మెలదామా? “మ”

సైకిలద్దిడబ్బులు నాదగ్గిరున్నాయి
తొక్కేటి ఓపిక నీ దగ్గరున్నాది “మ”

కోనసీమ తీసిరంట వానిస్రి ఉన్నదంట
నాగేసిరావేమో కుర్రగెంతి లేసిడంట
దారిలోన వానొత్తె గొడుగట్టుకొత్తాను
ఆలుకాడ ఆనకుండ ముసుగేసు కుంటాను
మాఇంటి కాడనైతె ఏదోటి సెపుతాను
పెద్దకాపు కళ్ళల్లో ఏకారం కొడతావో “మ”

మావ:

మాయమ్మాకి జొరమని మడతేత్తాను
టిక్కెట్టు డబ్బులు నేనట్టుకొత్తాను
మలాట సినిమాకి ఎలిపోదామే – రత్తి
మోటారు నెక్కినట్టు ఎలిపోదామే

4

రత్తి:

రాకురా రాకు – ఈ రేయి రాకు
కునుకట్టకున్న కుదురు లేకున్న
రాకురా రాకు – ఈ రేయి రాకు
వాడంతా మనవరస పసిగట్టినాది
పసిగట్టి మనపైన పగబట్టినాది “రా”

నువ్వొచ్చెటపుడు ఏ కన్ను కానిందో
నిన్నునన్ను చూసి ఏ గుండె కాలిందో
ఏ గుడిసి సూసిన గుసగుసలే
ఏ మనిసి సూసినా రుసరుసలే “రా”

కనకడేమొ నిదరొదిలి కాపు కాత్తడంట
నాగడేమొ దడి యెనక నక్కి సూత్తడంట

పట్టుపడిపోయేమో పకపకలే
తలెత్తుకోలేక యిసయిసలే “రా”

మావ:

ఎర్రినా కొడుకిలకి ఏలాకోలమా
నీతోటి నాతోటి పంతాలా! “ఎ”

బాణా కర్ర పుచ్చుకొన్ననా
బుర్ర సెక్కలయిపోతాది
చేత సెయ్యి కలిపినానా
ఎముకలు పిండైపోతాయి “ఎ”

ఆలుమగలం కాబోతాం
ఆడుకొంటాం పాడుకొంటాం
ఆళ్ళకెందుకే మద్దిన “ఎ”

రత్తి:

ఓరి ఎర్రి నా మామ
ఓ మాట సెప్పనా
పెళ్ళికానోళ్ళము
తల్లి సాటోల్లము
గుట్టు బయలు కారాదు
పట్టుదలకు పోరాదు
సీకటి పడ్డాక రారా
నీ ఆకలి తీరునురా మావ “సీ”

సుట్టా గిట్టా కాల్చకురా
నిప్పు నిన్ను సెప్పేను
నల్లబట్టలు కట్టుకురా
సీకటి నిన్ను కప్పేను “సీ”

ఈది దోవను రాకురా
కుక్కలు సూసి మొరిగేను
ఈలపాట పాడుమురా
సప్పున నేను లేచేను “సీ”

అత్తరు ఉంటే రాసుకురా
వాసన వలపును పెంచేను
పూల మాట మరువకురా
ఆటికి పడి సత్తాను “సీ”

5

రత్తి:

నీసాటి నీవేరా
నీరూపు నీదేరా “నీ”

తలపాగ సుట్టి
మేడితోక పట్టి
దున్నుతుంటే నిన్ను
సూసిందే కన్ను
రేకు రేకు రంగు పొంగే పువ్వు రా నీనవ్వు “నీ”

సెరువు గట్టుకాడ
మలిసందెయేల
దూళ్ళమేపే నిన్ను
మూసిందే కన్ను
బతుకు మొత్తం బానిస చేసే మోమురా నీమోము “నీ”

ముంతని మూట గట్టి
కొడవల్ని సేబట్టి
కోత కెల్లే నిన్ను
సూసిందే కన్ను
గుండెమొత్తము పిండిచేసే తూవురా నీసూపు “నీ”

మావ:

ఏ పాట పాడి నీ రూపు సెప్పనే
ఏయింతోటి నిను నేను పోల్చనే “ఏ”

ఇష్నుమూర్తి ఈసుడింటి కెల్లేడంట
అందమైన పిల్లనాడ సూసాడంట
“ఈ పిల్లకన్న మిన్న లేదు లేదోరన్నా”
అనుకున్నాడంట అన్నాడంట
ఇష్ను, ఈసుడు బెమ్మింటి కెల్లిరంట
“అందమైన పిల్లెవర”ని బెమ్మనడిగిరంట
ఈసుడా మీ యింటి పిల్లకాదు
ఇష్నువా మీ యింటి పిల్లకాదు
బూలోకమందున్న రత్తిదే అందము
దానితో పోల్సానూ ఎవ్వరూ సాలరు
అన్నాడంట, రత్తి, ఇన్నావంటే
అన్నాడంట, రత్తి, ఇన్నావంటే “ఏ”

6

రత్తి:

ఒద్దు నాయేపు సూడొద్దు
ఒద్దొద్దు నాఊసు తేవొద్దు
రెప్పన్నా ఏయికుండ
తలుపన్నా మూయకుండ
ఎలుగొచ్చేదాక ఎదురు సూత్తిరా “ఒ”

దేనింటి కెళ్ళినావో, దేని కాళ్ళు పిసికినావో
ఈ రత్తి నీకు గురుతుంటదా “ఒ”

నగలేమి లేనిదాన్ని, వగలేమి పోనిదాన్ని
ఈ పిల్ల నీకు రుచులిచ్చునా “ఒ”

మావ:

ఒద్దు అంతమాట అనవొద్దు
ఒద్దొద్దు గుండెల్లో పొడవొద్దు
కామందు రాసికాడ – కాపు కాయమన్నాడు
సాకు సెప్పబోతుంటె – రూక ముట్టదన్నాడు
ఈలు లేక మానినాను – తప్పయితే
సెమియించు “ఒ”

రత్తి:

జాతరొచ్చింది మావ
ఒంక దొరికింది
యిద్దరము కసితీర
రేయంతు సూడాలి “జా”

గుండాట సూద్దాము
గరగాట సూద్దాము
బుడగల్ని కొందాము
కోయడానుసుకాడ కాసేపు ఉందాము “జా”

పొట్లాలు తిందాము
రికాడ్లు ఇందాము
సాతకం సూద్దాము
అమ్మోరి గుడికాడ దన్నాలు పెడదాము “జా”

పూనకం సూద్దాము
పానకం పోద్దాము
లైట్లుల్లో మన రూపు మనసార సూద్దాము “జా”

మావ:

సెలేమేదో దినమేదొ సెప్పతేకున్నానని
జాతరొచ్చినంటె ఒప్పులేకున్నానె “సె”

కూడుతింటున్నానొ
కునుకు తీత్తన్నానొ
మాటాడుతున్నానొ
పదమాడుతున్నానొ
నేనేటి ఎరగనే “సె”

గడ్డి కోత్తన్నానొ
గొడ్లు కాత్తన్నానొ
పొలమెల్లతున్నానొ
పాటు పడుతున్నానొ – రత్తి
ఏ మందు రాసేవో “సె”

ఏ మంత్రమేసేవొ
నువ్వేటి సేసేవొ
నీ ఊసె ఊపిరి – రత్తి
నీ ఊసె ఊపిరి “సె”

7

రత్తి:

జాడలేదు – జాబులేదు
కంటిరెప్పలు కప్పుతున్నాయ్
కూడుమరిసి – జోడుతలిసి
గుడిసి దీపా లెలగకున్నాయ్

ఏటి సేసినా, ఆడేటి సేసినా
నాకు సెప్పకపోడు ఎప్పుడూ
ఎందునుండెనో, ఎందుకుండెనో
నాడు గుండెల బాద సప్పుడు “జా”

డబ్బు జబ్బు ఎరగనోడు
ముండ రుసులు మరగనోడు
ఎందునుండెనో, ఎందుకుండెనో
నాదు గుండెల బాద సప్పుడు “జా”

నన్ను మరిసి, నన్ను యిడిసి
సెనము బతకని మంచి మనిసి
ఎందునుండెనో, ఎందుకుండెనో
నాడు గుండెల బాద సప్పుడు “జా”

సోది నడిగితె సెప్పునేమొ
కుదురు కొంత దొరుకునేమొ

రత్తి:

నాకళ్ళు పొరలేసె నింతకాలం
నా మావ సేసేడు ఎంత మోసం “నా”

కోక పిచ్చి ఉన్నదని
రూక పిచ్చి ఉన్నదని
మాట మంచి సూపించి
మనసు పిప్పి సేత్తాడని
అనుకోనే లేదు
ఆ, ఆలోసనే లేదు “నా”

మనసాడికి లేదని
మమతంటే తెలదని
దొంగ నటన మాడేసి
దోసుకు పోతాడని
అనుకోనే లేదు
ఆ, ఆలోసనే లేదు “నా”

కాలుజారి పోయేను
నట్టేటన ములిగేను
దొంగోడిని నమ్మేసి
తలకొట్టుకు లాభమేటి
బతుకంతా పోయే
బాదల పాలాయె “నా”

రత్తి:

నా గాలికే ఆగలేనోడు
నా జోలికే ఎందుకురాడు “నా”

ఏ మందు రాసినాదో – ఏ యిందు సేసినాదో
ఏ మత్తు సూపినాదో – ఏ ఒత్తు లొత్తినాదో
సూరమ్మకి మరిగినాడంట “నా”

ఏ మాట కెదురాడేను – నేను
ఏ లోటు సేసున్నాను! “నా”

ఏబానం ఇసిరి నాదో – ఏరూపున ఆనినాదో
ఏ లంచమిచ్చి నాదో – ఏ మంచ మెక్కినాదో
గంగమ్మకి మరిగినాడంట “నా”

ఏ మాట కెదురాడేను – నేను
ఏ లోటు సేసున్నాను “ఏ”

మావ:

రాయె నారత్తి నాదు సందిట్లోకి
రాకుంటె నీ మావ రాలిపోతాడు “రా”

నీవుంటె ఏ పొద్దు ఎగిరెల్లిపోతాది
నువు లేనీపొద్దు ఏడిపించేత్తాది
నవ్వేటీ దానవు, నవ్వించుదానవు
నా గుండె గంటను మోగించుదానవు “రా”

నీతోటి నా నిదుర పయనమయ్యింది
నెదరతో కుదురుజోడు కూడింది
ఎండిపోతున్నాను మండిపోతున్నాను
కూడు తినకుండా కుమిలిపోతున్నాను “రా”

పూలతోటెమొ పిలిసి నవ్వింది
ఆ నవ్వు నాకు బల్లెమయ్యింది
బాదించినా గాని బరియించినా
మూగోడినై పోయి మూల్గుతున్నాను “రా”

రత్తి:

వచ్చావ మావ ఇన్నాళ్ళకు
గురుతొచ్చాన మావ ఇన్నాళ్ళకు
కంటి కగపడకుండ – కబురైన లేకుండ
ఎక్కడకు పోయేవు? – ఏటయ్యిపోయేవు? “వ”

నమ్ముకున్నది ఒకతున్నదని
నిన్నిడిసి సెనము బతికుండదని
మరిసేపోయేవా – నువ్వు తెలిసేపోయేవా “క”

కూడు తినకుండ – కునుకేయకుండ
ఎంతయ్యిపోయేనొ – కనపడత ఉన్నాన! “క”

ఎందుకెల్లేవసలు యిపుడైన సెప్పు
సెప్పకున్నట్టయితె ఇకపైన రాకు
నేనేడిత్తె నీకు – ఏడుకా సెప్పు! “క”

రత్తి:

నవ్వుకో నవ్వుకో నవ్వు నవ్వుకో
నాకాడ నవ్వకు, ననుసూసి నవ్వకు “న”

సూసుకో సూసుకో సూపు సూసుకో
నాకేసి సూడకు, నాసూపు సూడకు “సూ”

ఆడుకో ఆడుకో, ఆట ఆడుకో
నా కాడ ఆడకు, నాతోటి ఆడకు “ఆ”

ఏడ్సుకో ఏడ్సుకో ఏడుపు ఏడ్సుకో
నాకాడ ఏడకు నాకుపడి ఏడకు “ఏ”

మావ:

ఏటేటి? ఏటి? ఇదేటి
ఈ యింతైన యింతేటి? “ఏ”

ఎవరెరువు ఇచ్చేరె ఈ కోపము
ఏ ఎదవ పన్నేనె కుట్ర
ఇది నా రత్తియేనా? ఇది నా నెత్తురేనా? “ఏ”

నేనెప్పుడు సూడలేదె ఈ రూపం
నేనెరిగి సేయలేదె ఏ పాపం

ఎంతేసి మాటలు – ఎన్నేసి ఈటెలు
ఎటైన చూసేవ నీకంట
ఎందుకు రగిలింతావీ మంట
నువుదక్కకుంటె రత్తి – నాకు దక్కునులేమిత్తి “ఏ”

మావ:

తగ్గించు తగ్గించు తాపాన్ని
ఉత్తినే పెంచుకోకు పాపాన్ని “త”

అనుకోనీ పైనమైతినే – అమ్మతో
అనుకోనీ పైనమైతినే
పైనముతో అమ్మమనసు మారినాదే
అమ్మనోట పెళ్ళిమాట పలికినాదే “త”

పెళ్ళి ఎప్పుడో సెప్పవే
కలలన్నీ పండించే కలిమానమే
కంగారు కంగారుగున్నదే! “త”

8

రత్తి:

వూరకుక్కల్లార – కాటి నక్కల్లార
మీతోటి పనియేటి – మీరు నాకేమ్టి “వూ”

నా మావ నాకు – మావకి నేను
రత్తాన్ని సైతం రత్తి కిత్తాడు
రత్తి లేదంటే సచ్చిపోతాడు
కులమేటి మతమేటి కుళ్ళి ఎదవల్లారా
అరిసేతిలో పెట్టి పూజించుకోడా “వూ”

మావతో మనువు ఎన్నాళ్ళనోవొ
మావ చెంతనె నాకు సొరగాలు లేవొ
మనసు తెలియని మీరు మనుసులే కారు
మనుసులైతే మీకు ఈ బుద్దులేరావు “వూ”

పేమ పెళ్ళికి మీరు పుల్లెయ్యబోతారు
పెళ్ళి సెడిపోతే మేలు మేలంటారు
ఎదవల్లారా మీరు ఆపలేరీ పెళ్ళి
మావకి నాకు బేమ్మడే వద్దు “వూ”

మావ:

రతనమంటి రత్తి – రాయికే దక్కింది
రాయినే రాయుడని – నోరార పిలిచింది
సేమంతిలాగ – సిరిమల్లెలాగ
గుడిసంత గుప్పున – యింపు నింపేసింది
వూరు వాడంత – ఒక్కటయినాగాని
నోరుమూసినాకె – పెళ్ళమయిపోయింది “ర”

ఏదేవి వరమొ – ఏనోము పలమొ
నాబతుకు కింతటి -సొంపు దక్కేసినాది
కులాలు మతాలు – అడ్డొచ్చినా గాని
కుళ్ళి ఎదవల నోళ్ళు – నొక్కుకున్నాగాని “ర”

మావ:

ఈ కొత్త సిగ్గులేటి?
ఆ యెర్ర బుగ్గలేటి?
పచ్చగడ్డి పరుపుమీద
తొలిరేయి గడిసేనని
మరిసేవా? ఏటి? “ఈ”

ఒకలుపైన ఒకలుపడి
వందలసార్లలిసేమని
మరిసేవా? ఏటి? “ఈ”

తలుపు సందుల దూరి
ఎవరైనా సూత్తారని
తలిసేవా? ఏటి? “ఈ”

మంచం కిందెవరైనా
నక్కి కూకున్నారని
తెలిసేనా? ఏటి? “ఈ”

పెళ్ళయిన పెతిపిల్ల
సిగ్గువొలక పోయాల
అనుకున్నావా? ఏటి? “ఈ”

సిగ్గువొత్తె సాలులే
బుగ్గ లెర్రబడతాయని
ఆలోసనా? ఏటి? “ఈ”

రత్తి:

సుక్కలూ సెందురుడు
సూడొచ్చె మన సరసం
సిగ్గొదిలి పెట్టేసి
రెప్పల్ని కట్టేసి “సు”

పరులకేళీ సూత్తమంటె
ఆళ్ళికి బలే ముచ్చట్లు
ఆరుబయట పడుకుంటె
తప్పవులే ఈ పాట్లు “సు”

గుడిసిలోన దూరితే
దుప్పటొకటి కప్పితే
సూడవురా ఏ కళ్ళు
నీ ఇట్టంరా రేయల్లా “సు”

రత్తి:

దడి యెనక నేను
తానమాడు తుంటే
సలిసీమ లాగొచ్చి
తొంగిసూత్తాడు
మావ పొంగిపోతాడు
తానమాడి నేను
కోక కడుతుంటే
ఏమెరగనట్టే
దగ్గిపోతాడు
మావ తగ్గిపోతాడు
తలదువ్వి నేను
కొప్పు సుడుతుంటే
కొప్పులో మందారం
ఎట్టి పోతాడు
మావ మొట్టిపోతాడు
సాపేసి తొంగుంటే
సరసకొత్తాడు
సరసకొచ్చిన మావ
సరసాలు పోతాడు
సంబరం సేత్తాడు

రత్తి:

కొసరొద్దు కసరొద్దు
ఈరేయికింక ఇసిగించవద్దు
కోడికూత్తన్నాది
నిదరవత్తన్నాది “కొ”

పగలంత నీవు పాటడిపోతావు
రేయేమొ నాతోటి యుద్దానికొత్తావు
ఎంత ఓపిక నీకు – ఎరువియ్యరా నాకు “కొ”

ఒళ్ళంత నీకు వలపు సెగలేమొ
నినుతాకితేసాలు చలి సచ్చిపోతాది
ఎంత రసికుడవోయి – నాబతుకంత హాయి “కొ”

మనకొక్క కొడుకు ఎపుడు పుడతాడొ
పుట్టిన కొడుకు ఎంతటోడవుతాడో
సెప్పరా ఓ మావ – పాడతానిక జోల “కొ”

మావ:

సెనసెనము దిన దినము
తేటపడతన్నాది నీ అందం
తేజమవుతున్నాది నీ అందం “సె”

నీ పైట గాలికే
పచ్చనగుతున్నాది వరిసేను
నీలోని హొయలొలికే
మెలితిరుగుతున్నాది సెలయేరు “సె”

నీకొప్పు కోసమే
పూలు పూత్తన్నాది సేమంతిమొక్క
నీమెప్పు కోసమే
కూత కూత్తనాది కోయిలపిట్ట “సె”

నీ నడక సూడగా
హంసలొత్తన్నాయి ఆకాశమంటే
నీ పాట పాడగా
ఎదురు సూత్తన్నాయి ఈ యిస్వమంతా “సె”

రత్తి:

సెడ్డ సిగ్గుగా వున్నాది
దొడ్డసిక్కొచ్చీ పడ్డాది “సె”

పెంకికాకి రక్కిందని సెప్పుకోనా?
సేతి గాజు గీసిందని సెప్పుకోనా?
నా పుగ్గమీద కాటుకి ఏ బొంకు బొంకను
అడిగేటోళ్ళ కళ్ళలో నేను ఏకారం కొట్టను “సె”

తుమ్మసెట్టు గీసిందని సెప్పుకోనా?
దెయ్యమొచ్చి గీరిందని సెప్పుకోనా?
నా బుగ్గమీద కాటుకి ఏ బొంకు బొంకను
అడిగేటోళ్ళ కళ్ళలో నేను ఏకారం కొట్టను “సె”

రత్తి:

నామాటె సెపుతావు – నను మెచ్చుకుంటావు
నీవేటొ నీవెరగవా నీవు సీకట్లో ఎలుగెలగవా “నా”

సుక్కలు నీకొరకు ఉచ్చుల్ని ఒగ్గాలి
సెంద్రుడు నీకు సలాము సెయ్యాలి

నీటీవి సూసి పులులదిరి పోవాలి “నా”

నీ సురుకు ముందు మెరుపోడి పోవాలి
పెదకాపు నీయందు పాలేరు లాటోడే
గోవులకు నీవు గోపాల కిట్టుడవే
ఎదవలకి తప్ప అందరికి ఇట్టుడవే
నీరత్తి గుండెల్లో కొలువున్న దేవుడవే “నా”

9

రత్తి:

ఎల్లిపోతుంది – దొర్లి పోతుంది
దొల్లెల్లిపోతుంది – మల్లి రా నంటంది
పుట్టినా ఒకలాగే – సచ్చినా ఒకలాగే
గడిసిన గతంలో – మల్లెపూలున్నాయి
వత్తున్న రోజులు – నిప్పులా గున్నాయి
కీడైతే ఒకలాగే -మేలైన ఒకలాగే
నిన్న నవ్విన పువ్వు – నేడు రాలింది
పువ్వులా మానవ్వు – నిప్పు కాలింది
కీడైతే ఒక లాగే -మేలైన ఒకలాగే
ఆట పాటలు తప్ప – ఏ మెరగనోళ్ళము
ఆకలికి సిక్కేము – అల్లాడుతున్నాము
కీడైన ఒకలాగే – మేలైన ఒకలాగే “ఎ”

మావ:

ఏల వచ్చెనమ్మ – కరువు ఏల వచ్చెను
పంటలన్నీ పండగా ఏల వచ్చెను
మాయదారి కరువు ఏల వచ్చెను
ఏల వచ్చెను – ఏల వచ్చెను
మానెడు బియ్యం మూడు రూపాయలెల్లాగమ్మెను
ముడతలుకోక ముప్పైరూపాయలెల్లాగయ్యెను
ఈసురు మిరప ఇరవైరూపాయలెల్లాగమ్మెను
కుంకుడుకాయలు కుంచం ఐదు ఎల్లాగయ్యెను
సెక్కరగుండ బెల్లమ్ముక్క సేతికందకుండెను
సమురు సుక్క సింతపండు కంటికానకుండెను “ఏ”

పండిన పంటను గాదినదాత్తే
లంచం మరిగి నాయంసత్తే
కళ్ళ్కు సీకటి గంతలు కడితే
నీతికి కడుపులో మంటలు పుడితే
అలావచ్చెనమ్మ కరువు అలా వచ్చెను
అలావచ్చెనమ్మ కరువు అలా వచ్చెను

మావ:

భూమిదున్నేము – నారు నాటేము “భూ”
కూడేది కూలోడికి – రత్తి – జాలేటి కామందుకి “కూ”
నీరుతోడేము – కలుపు తీసేము “నీ” “కూ”
కోతకోసేము – కుప్పనేనూర్చేము “కో” “కూ”
రాసిచేసేము -గాది నింపేము “రా” “కూ”
ఎండ ఎండేము – వాన తడిసేము “ఎ” “కూ”
సెమట కురిసేము – సిక్కిపోయేము “సె” “కూ”

మావ:

కాడిమీది మేడినాది ఎద్దులార
గడ్డిమీకు గంజినాకు ఎద్దులార
ఎద్దులార ఎద్దులార “కా”

గట్టుమీద గొడుగునీడ కామందు
గయ్యిమంటు కయ్యిమంటు…….
మట్టితోన మట్టిలోన మనముందు
ఏడలేక నోరుమూసి ……..
కంతిగాసి మీమెడలు – కడుపు నుండి మా బతుకులు
దిక్కులేదు మొక్కులేదు – రచ్చించే దాతలేడు
మీబాదలు మీగాదలు – నోరుంటే సెవుదురేమొ
నా బాదలు నా గాదలు – నోరుండి సెప్పలేము “కా”

రత్తి:

పొద్దుతోటేపాటు – పొలమెల్లిపోయి
పొద్దుకూగేదాక – ఆడుండిపోయి
సెమపడిన గాని – సెమటూడ్సినాగాని
పొట్టనిండేదేది మామ – పొయ్యిమండేదేది మావ
రేపుకోసం మనము – సూపు సూత్తాము
రేపొచ్చి మనబతుకు – దిగులు సేత్తాది
రేపొచ్చి మనబతుకు – దిగులు సేత్తాది
రేపు సూపులు మనకు – ఎన్నాళ్ళు మావ
మన బతుకులకింక – సుకాలు రావ? “పొ”

రత్తి:

రెక్కల్లో సత్తువ – డొక్కల్లో ఉంటాది “రె”
డొక్కలే మాడితే
ఇంకెక్కడుంటాది – సత్తువింకెక్కడుంటాది “రె”

నీరున్ననారు పచ్చగుంటాది
సమురున్న ఒత్తు ఎలుగుతుంటాది
నీరేయకుంటే నారెండిపోతాది
సమురేయకుంటే ఒత్తారిపోతాది “రె”

దేనికై నాగాని అద్దొకటి ఉంటాది
ఈ అమాస సీకట్లో పొద్దెపుడు పుడతాది
కాల్లిరిసి నడమంటే కల్లోడిసి సూడంటే
ఏ మనిసి సేత్తాడు నే నెక్కడినలేదు “రె”

సిచ్చపడాలంటె తప్పొకటి సేయాలి
తప్పేటి సేయందె సిచ్చేల వేయాలి
కన్నొడిసె సీకట్లో కరినాగు వాకిట్లో
ఎన్నాళ్ళు నిలవాలి నే నిలవలేను “రె”

రత్తి:

ఏటిసెప్పను నేను నామావకు
ఎలా సూడను నేను నా మనసు “ఏ”

నా ఒళ్ళు కందితే సూడలేనోడికి
నా మనసు నొచ్చితే ఉండలేనోడికి “ఏ”

కలనైన కనలేని కతనైన ఇనలేని
దారునం జరిగింది దహనమైపోయేను “ఏ”

పనిలోకి రమ్మని పైట కొంగట్టుకుని
నా పైన పడ్డాడు నరకాన నెట్టేడు “ఏ”

పైనున్న దేవుడికి పగ బట్టెనేమో
కామందు రూపనా కాల్సిపోయేడు “ఏ”

సంపేటి సత్తాన్ని సెప్పేటికన్నా
సత్తాన్ని గుండెల్లొ సంపటమే మేలు “ఏ”

మావ:

బగ్గుమనే మంటలు – బగ్గు బగ్గుమనే మంటలు
కూడులేని మంటలు – ఇయ్యి కడుపులోని మంటలు
ఆశంటుకున్న మంటలు – మనసంటుకున్న మంటలు
కళ్ళుకాలుతున్న మంటలు – కుళ్ళు రేపుతున్న మంటలు

రత్తి:

ఏటిసేత్తన్నాడు? దేవుడేటయ్యిపోయేడు “ఏ”
మంచోళ్ళ కడుపులు – మాడి పోతుంటె
నీతి నాయాలేమొ – ఒణికి పోతుంటె
పెద్దోళ్ళ సేతుల్లొ బొమ్మయ్యి పోయేడా?
పెద్దింటి కాపలా – కుక్కయ్యిపోయేడా?
ఏటి సేత్తన్నాడు – దేవుడేటయ్యిపోయేడు?

మేడొద్దు మిద్దొద్దు – కూడుంటె సాలని
సెమ చేసినందుకు – సెమటూడ్సినందుకు
మొక్కుకుంటె మేము – తప్పయ్యిపోయిందా
మొక్కుతున్నందుకీ కచ్చబూనేడా
ఏటి సేత్తనాడు? దేవుడేటయ్యిపోయేడు?

రత్తి:

మీబతుకు బళ్ళులాగేటి ఎద్దులం
ఏ సదువు సందె లెరగని మొద్దులం
సూర్యున్ని తాకట్టు పెట్టుకున్నాం
సీకట్లో బతుకుల్ని గడుపుతున్నాం “మీ”

మా రెక్కలకు సాకిరి అలుపు
మా డొక్కల్లో ఆకలి అరుపు
మా బతుకులు సుకమెరగవు
మా యేపున పొద్దొడవదు
మా కళ్ళలో కన్నీటి సుక్కలు
మా గుండెల్లో రగిలేటి మంటలు
మా బతుకులు సుకమెరగవు
మా యేపున పొద్దొడవదు “మీ”

మా గుడిసెల్లో నిదరున్న మురికి
మా రత్తాన నెలవున్న పిరికి
మా బతుకులు సుకమెరగవు
మా యేపున పొద్దొడవదు “మీ”

రత్తి:

రావురా మావ ఆరోజులింక
లేవురా సుకాలు మన బతుకులింక “రా”

గొంతులో పుండేసి – పాట మోటైనాది
పాముల పక్కన – బతుకుబాదైనాది “రా”

సోకాల ఏటిలో – దిన దినము తానాలు
నడిసేటి బాటలో – అడుగడుగు గండాలు
ననుసూతైనీకు – నినుసూతైనాకు
కలతలూ దిగుల్లు – కన్నీటి వరదలు “రా”

రత్తి:

పోదాము పోదాము ఓరి మామ
మనము టౌనెల్లి పోదాము ఓరి మామ “పో”

సుక మసలూ కావరాదు – కన్నీటి వరదలాయె
కామందులు రాబందులు – కరణాలు కసాయోళ్ళు
గూడొదిలి ఊరొదిలి – గంగడేల పోయినా
ఊరంతా ఉరితాళ్ళు – పల్లెకింక సెలవుసెప్పి “పో”

కుడువనింత కూడులేదు – నిలువ నింత నీడలేదు
కట్టానికి కొదువలేదు – కూలైతే కానిరాదు
ఊరాతల బావిలోన – సతైందుకు కూకి నాది
ఊరంతా ఉరితాళ్ళు – పల్లెకింక సెలవు చెప్పి “పో”

మావ: పేదోళ్ళు ఎక్కడున్న – పెద్దోళ్ళు అనలేదే
పెద్దోళ్ళు ఎక్కడున్న – పేదోళ్ళుయకాబోరే

10

రత్తి:

సంటోళ్ళ మనసు – సల్లగుంటాది
ఆళ్ళకళ్ళలో నాయం – నితైనమంటాది “సం”

అన్నె మెరగనివాళ్ళు – పున్నెమెరగని వాళ్ళు
మాయలు మరమాలు – మచ్చుకే లేనోళ్ళు సంటోళ్ళు “సం”

తోసింది సేత్తారు – తోసిగా అవుతారు
సిని సిన్ని మాటలతో – సత్తాన్ని సెలపుతారు సంటోళ్ళు “సం”

కూలోల్లు నాలోల్లు – కులాలు మతాలు
తేడాలే ఎరగరు – మాకైన రూకైన
మేడైన పాకైన – ఒకలాగె సూత్తారు
ఒక్కటనుకుంటారు సంటోళ్ళు “సం”

సంటోళ్ళమైపోతే ఎంత బాగుంటాది
సెనిగాడి పీడొదిలి సుకాలి ఒత్తాయి “సం”

రత్తి:

గంపేసి మూసినా కోడి కూత్తాది
కూత యింటూనే పెజలు లేత్తారు “గం”

పొడిసేటి పొద్దు ఎరుపు – ఎరుపుతోనెవచ్చు తెలుపు
సీకటిని సంపేసి – గోతులో పాతేసి
ఎలుగులో పోదాము రా రా
మావ ఎలుతురూ చాదాము రా రా “గం”

పుట్టినా పాపడు తెలుపే – ఎదిగేక వత్తాది నలుపు
నలుపును సెరిపేసి – తెలుపుగా సేసేసి
ఎలుగులో పోదాము రా రా
మావ ఎలుతురూ చూదాము రా రా “గం”

పుట్టాక సత్తారు జనము – సచ్చీ బతకాలి మనము
మనిసికి బాటేసి – బాటలో పూలేసి
ఎలుగులో పోదాము రా రా
మావ ఎలుతురు చూదాము రా రా “గం”

మావ: పత్తున్న మనిషికి కూడెట్టలేరు
గుడి లోన రాయికి యిందు లెడతారు
నిన్ను కొట్టిన సొమ్ము – నన్ను కొట్టిన సొమ్ము
ఏడుకొండల పైన ఎంకన్న కిచ్చి
సెమియించమంటూ ఏడు కొంటారు
నా పేగు బాదలు నీపేగు బాదలు
ఆలకించీ ఆళ్ళు హాయిగా నవుతారు
సంతోషమయిపోయి పాడుకుంటారు

రత్తి:

ఆడికళ్ళు రెండుపేల – ఆడుంటే కనరాడా?
ఓ తల్లి కన్నవాడ – లేకుంటే యినవేర
ఓ పేరు కాదంట – ఓ రూపు లేదంట
అంతటా వున్నడంట
గుడులెందు కెలిసేయంట? “ఆ”

సెడ్డోల్లను సంపునంట – మంచోల్లను మరవడంట
సెడ్డోల్లకు మేడలు – అయ్యొ
మంచోల్లకు గుడిసెలు “ఆ”

కడుపుమంట కరమంట – కాలితాపు రాతంట
ఈజనమ కట్టమైన – రేయ్ – మరుజనమసుకమంట
బూమంతా ఆడిదంట – బూరిముక్క కరువంట
ఆ ఎదవలు నమ్ముకుంటే – మననోట్లో మట్టంట “ఆ”

రత్తి:

మేలుకో – మేలు కోరుకో
ఏలుకో – జగతి నేలుకో “మే”

రాళ్ళకు మొక్కి – రాళ్ళపాలవకు
నమ్మకాలకు నీవు – నరకేయ బడకు
సుక్కేసి తొంగుంటె – సూరీడు రాడు
తలదించి ఒంగుంటె – సుకాలు రావు “మే”

పిడికిలికి పికిచ్చి – గిజగిజలాడకు
రంగు కలలాతోటి – బతకేయబోకు
పడకేసి రమ్మంటె – సూరీడు రాడు
అనికేసి కూకుంటే – సూకాలు రావు “మే”

పుట్టుకొత్తన్నాది – నిప్పంటి తరము
కాలిపోతాది – పిడ్డంత నిజము
రంకేసి వత్తాడు – సూరీడు నాడు
మాడిపోతాదోరి – సినాగాడి మాడు “మే”

రత్తి:

గొంతెత్తరా – గొంతెత్తరా “గొ”
నిజమేటో సెప్పగాం
నీతి గుట్టు యిప్పగాం
గొంతెత్తరా – గొంతెత్తరా
తల ఎత్తరా – తల ఎత్తరా “త”

మీసాన్ని మెలిపెడతాం
తల ఎత్తరా – తల ఎత్తరా
పయనించరా – పయనించరా “ప”

అడ్డంకులను దాటుదాం
అందరొకటని చాటుదాం
పయనించరా – పయనించరా “ప”

చితి పేర్సరా – సితి పేర్సరా
చింతలను కాలుద్దాం
బతుకులకు ఎలిగిద్దాం
సితి పేర్సరా – చితి పేర్సరా “చి”

రత్తి:

మాటమీద మాటొచ్చి అంటున్నాను
మనిసంటె ఎవడని అడుగుతున్నాను “మా”
కళ్ళుంటె, కాళ్ళుంటె
సెవులుంటె, సేతులుంటె మనిసంటె
ఒప్పుకోను నేనొప్పుకోను “మా”

మాటాడే సెత్తుంటే ఏటాడే తెలివుంటే
రాత రాయగలడంటె
కోత కోయగలడంటె మనిసంటె
ఒప్పుకోను నేనొప్పుకోను “మా”

దోచేసే బుర్రంటే దాచేసే పెట్టుంటె
ఇంస పెట్టగలడంటె
ఇసమిచ్చేగలడంటె మనిసంటె
ఒప్పుకోను నే నొప్పుకోను “మా”

మనిసంటె మనసుండాలి
మనసంతా మంచుండాలి
నాయంగా బతకాలి
నాడెంగా మసలాలి
మనిసంటె ఆడే
ఒప్పుకోరా నువ్వొప్పుకోరా

రత్తి:

కాలమంతా కట్టమాయె
సుకమునకు సూన్యమాయె “కా”

ఎండకాలెం వచ్చెనంట
నిలవనింత నీడ దొరకదు
సెమట తప్ప నీరు దొరకదు “ఎ” “కా”

వానకాలం వచ్చెనంట
గుడిసులోన నీటి పరుగులు
గుడిసె చుట్టూ కప్పలరుపులు “వా” “కా”

సీతకాలం వచ్చెనంట
కప్పుకోను దుప్పటుండదు
కాచుకోను నిప్పులుండవు “సీ” “కా”
మూడు రుతువుల కూడులేదు
కూడు నడిగే నోరు లేదు

11

రత్తి:

పదమాడినామంటె
సత్తాన్ని సెప్పాలి
పదం పదినాళ్ళు ఉండాలి
పదిమంది మెచ్చాలి “ప”

గుండెల్ని కుదపాలి
బండల్ని చిదపాలి
గొంతు గొంతున మన పాట
మారు మోగాలి “ప”

సీకటిని సీల్చాలి
నాయాన్ని నిలపాలి
ఎలుగుకే మన పాట
బాటల్ని సూపాలి “ప”

కన్నీళ్ళు తుడవాలి
కడుపుల్ని తుడవాలి
పేమకి మన పాట
పేదెల్లి పోవాలి “ప”

ఆశాపూరిత ఆఖరి గీతం

రత్తి:

కనుసూపు దూరాన
కనపడత వున్నాడు
ఎర్రగా సూరీడు
ఎదురేగుతున్నాడు
గండాల
గుండాలు దాటేసి
గట్టెక్కి పోతాము
ఊపిరిదీత్తాము “క”

బాదల
బందాలు తెంపేసి
ఒల్లిరుసు కుంటాము
మునుముందరి కెళతాము “క”

ఏడుపుల
ఏటిని ఈదేసి
సుకంగ వుంటాము
తల తుడుసుకుంటాము “క”

దిన దినము
మనకు దీపాల పండగ
దీపాల ఎలుగులో
దీపాల జనము “క”