రజని పాటలు మరికొన్ని

ఈ సంచికలో బాలాంత్రపు రజనీకాంతరావుగారు (రజని, 1920-2018) పాడిన పాటలు మరికొన్ని. గాయకుడిగా ఆయన ప్రతిభకు స్పష్టంగా అద్దం పట్టే పాటలివి. మొదటి రెండు 1948లో మహాత్మా గాంధి మరణానంతరం రాసి, హెచ్.ఎం.వి. వారికి రికార్డుగా ఇచ్చినవి. అదే సమయంలో గాంధీకి నివాళులర్పిస్తూ చాలా భారతీయ భాషలలో బాగా పేరు పొందిన గాయనీగాయకులు రికార్డులిచ్చారు; ఉదాహరణకి తెలుగులో పి. సూరిబాబు, ఎం. ఎస్. రామారావు లాంటి వారు పాడినవి. కానీ ఈ రజని పాటలంటే నాకు చాలా ఇష్టం. నిజానికి ఆయన ఈ రెండు పాటలు పాడారని కూడా నాకు తెలియదు. ఆయన కూడా మాటల్లో ఎప్పుడూ చెప్పలేదు. ఈ రికార్డు 2004లో యాదృచ్ఛికంగా మచిలీపట్నంలో (మరో 30-35 అరుదైన రికార్డులతో పాటు) దొరికింది. వెంటనే ఈ రెండు పాటలు మాత్రమే ఆడియో టేపు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని మరుసటి రోజు ఆయనకు వినిపిస్తే ‘భలే పట్టుకున్నారే’ అని సంతోషించారు. ఈ రెండు పాటలు ఆయన పేరుతో వున్న యూట్యూబ్ ఛానల్‌లో కూడా వినవచ్చు.

మిగిలిన మూడు పాటలు 2000 సంవత్సరం తరువాత, అంటే 80 ఏళ్ళు పైబడిన తరువాత పాడినవి. ఆ వయసులో కూడా ఆయన శాస్త్రీయ బాణీలో భక్తిగీతం కాని, లలితంగా భావగీతం కాని, పిల్లలకోసం హుషారుగా బాలగేయం కానీ చక్కగా పాడటం గమనించవచ్చు. మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తాను.


  1. సర్వభూతాని

  2. ఓ మహాత్యాగి

  3. గణాధిపా

  4. చాయలకే

  5. చీమలు దూరని