రత్తి పాటలు

రత్తి:
సలి మంటకాడ
పదిమందిలోన
కనుగీటినావేటిరో
మావ పరువేటి కావాలిరో
మావ పరువేటి కావాలిరో

ఊరంటే ఏటిరా – నోరెట్టి పడతాది
ఇంతంటె అంతని – ఇంతగా సెపుతాది

పేమంటె ఏటో – పేమ జంటెరుగురా
ఎరగలేనోళ్ళకి – పేమంటె పిచ్చిరా

పెళ్ళయ్యే దాక కొంత గుట్టుగా ఉండరా
పెళ్ళయ్యిపోతే మనకడ్డేటి ఉందిరా

రత్తి:
ఏకటాకీ చూడకు
ఎర్రోడి వవ్వకు
నాపేరే పాడకు
ఎల్లడిరా, వాడకు

నిన్నంటి వుందునే ఏసేనం
నీకంటి ఇంటనే కాపరం
నీ ఊసులే నాకు ఊపిరి
నీతీపి తలపులే రేతిరి

కూడు తినేటేల, కూలి చేసేటేల
కూకున్న ఏల, నిలుసున్న ఏల
నాగుండెల్లో నీవెపుడు నిలిసేవురా
గుండెల్లో గొంతెత్తి పిలిసేవురా!

మావ:
కునుకు రాదేరత్తి కూడదంటేను
కోక కొంటానే ఒప్పుకుంటేను
రత్తి:
కొన్నాన కోకను? కట్టేన కోకను?
పెట్టావు లేవోయి మా గొప్ప లంచము
మావ:
తిరము లేదే రత్తి తిప్పి కొడతేను
తిలకాన్ని కొంటాను ఒప్పుకుంటేను
రత్తి:
కొన్నాన తిలకాన్ని? దుద్దేన నా నుదుట?
పెట్టావు లేవోయి మా గొప్ప లంచము
మావ:
పగలు రాదె రత్తి పట్టనీకుంటేను
పట్టీలు కొంటాను ఒప్పుకుంటేను
రత్తి:
ఏ ఇంటిగోడకు ఏసావు కన్నము
నాకొద్దు బాబోయి నీ దొంగనగలు
మావ:
దొంగోడి నైతేను దోచి పారేత్తాను
దిక్కెవ్వరే నీకు మొక్కెవ్వరే నీకు
దిక్కెవ్వరే నీకు మొక్కెవ్వరే నీకు
రత్తి:
దిక్కు మొక్కులు రెండు ఎదురున్న నీవు
ముట్ట కూడదు నన్ను తెలిసింద మావ

[పూర్తి పుస్తకం గ్రంథాలయంలో చదవండి. పిడిఎఫ్ ప్రతి ఇక్కడ లభిస్తుంది.]