కె. రాణి పాడిన కొన్ని పాటలు

కొంతకాలం క్రితం రోహిణీప్రసాద్‌గారు గాయని ఎస్. వరలక్ష్మి గురించి తన అభిప్రాయం రాస్తూ ఇలా అన్నారు: “లతా మంగేశ్కర్ పాటలు పాడడం మొదలుపెట్టాక మహిళల గొంతులకు character అనేది లేకుండా పోవడం ‘మంచి’ లక్షణంగా రూపొందింది. అద్భుతమైన కంఠంతో ఏ హీరోయిన్‌కైనా, ఏ సందర్భానికైనా సరిపోతుందనిపించే శైలి ఆమెకు ఉండడం అన్నివిధాలా లాభించింది. ఈ లాభం ఆమెకూ, హీరోయిన్లకూ, వినేవారికీ అందరికీ ఉపయోగపడింది. […] ఆ తరవాత అంతకు ముందునుంచీ పాడుతున్న శంశాద్, నూర్జహాన్, సురైయాలూ, తరవాత వచ్చిన గీతాదత్ మొదలైనవారికీ పాడే శైలిలో ప్రత్యేక వ్యక్తిత్వం ఉండడం కాస్త ప్రతిబంధకంగా అనిపించసాగింది. అందుకే వారంతా ఒక్కో రకం పాటలకే పనికొస్తారనే భావన బలపడింది.” ఆయన చెప్పిన మాటలు తెలుగు సినిమా రంగానికి కూడా వర్తిస్తాయన్నది నేను మరల ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా సినిమా పాటలు పాడే అవకాశాలు తగ్గి, మరుగున పడిన గాయనుల్లో కె. రాణి ఒకరు.

కేబుల్ టి.వి. ఛానళ్ళు వచ్చిన తరవాత అప్పటి వరకు దొరకవనుకుంటున్న చాలా పాత సినిమాలు, దాని ద్వారా పాటలు, బయటకు వచ్చాయి. అలాగే ‘ఒకనాటి పాత కళాకారు’ల్ని వెదికి పట్టుకుని వారితో అచ్చు పత్రికల్లోను, టి.వి. ఛానళ్ళలోను ఇంటర్వ్యూలు జరపడం కొన్నేళ్ళపాటు జోరుగా సాగింది. 2003లో (అనుకుంటాను) హైదరాబాదులో కె.వి. రావుగారు, మరికొందరు సంగీతాభిమానులు కె. రాణి, ఎ.పి. కోమల, సి. కృష్ణవేణిగార్లను ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమం జరిపారు. అలా ఆవిడ మరల వార్తల్లోకి వచ్చారు. వ్యక్తిగతంగా ఆ రోజుల్లో నేను, మిత్రులు మధుసూదనశర్మగారితో రాణిగారిని రెండుసార్లు హైదరాబాదులో కలిశాను. చాలా బాగా మాట్లాడేవారు. ఆవిడతో జరిపిన ఆ రెండు సంభాషణలు నాకున్న మంచి జ్ఞాపకాల్లోనివి.

ఈ సంచికలో ఆవిడ పాడిన కొన్ని పాటలు వినండి. వీటిలో 5 పాటలు ప్రైవేటు రికార్డులుగా వచ్చినవి. తక్కినవి సినిమా పాటలు. వీటన్నిటినీ ఓపికగా డిజిటైజ్ చేసి ఇచ్చిన మధుసూదనశర్మగారికి నా కృతజ్ఞతలు. అలాగే ఐదు ప్రయివేటు పాటల్లో నాలుగు ఆయన రికార్డుల కలెక్షన్ లోనివి. ఈ పాటల వివరాలకొస్తే: వారెవ్వా ఘుమ్ ఘుమ్ ఘుమ్ అన్న పాట ఒక హిందీ సినిమా పాటకి పూర్తి అనుకరణ. చల్లగాలిలో అన్న యుగళగీతం సంగీత దర్శకుడు, మంచి గాయకుడు కూడా అయిన బి. గోపాలంతో కలిసి పాడినది. మరొక రెండు పాటలు ఎల్. మల్లేశ్వరరావు (కొన్ని సినిమాలకు కూడా పని చేశారు, ఉదా. భక్త అంబరీష, 1959) సంగీత దర్శకత్వంలో పాడినవి. మొక్కజొన్న తోటలో (కొనకళ్ళ వెంకటరత్నం రచన, పిఠాపురంతో కలిసి పాడినది), లగిజిగి (సముద్రాల జూ. రచన), పాటలున్న రికార్డు 33 ఏళ్ళ క్రితం నేను మద్రాసు సెంట్రల్ స్టేషన్ పరిసరాల్లో రోడ్ల మీద కొన్న మొదటి రికార్డుల్లో ఒకటి. చాలా హుషారుగా సాగే పాటలివి! కె. ఎస్. ప్రకాశరావు, జి. వరలక్ష్మి తీసిన సినిమాల్లో పెండ్యాల సంగీత దర్శకత్వంలో కె. రాణి మంచి పాటలు పాడారు. కన్నతల్లి (1953), అంతే కావాలి (1955) సినిమాలలోని 3 పాటలు ఈ సంకలనంలో వున్నాయి. బాలానందంలో (1954) పాడిన ఒక పాట ఇక్కడ.

  1. డేగలాగవస్తా తూనీగలాగ (కన్నతల్లి, 1953)

  2. ఇదేకదా అనురాగం (కన్నతల్లి, 1953)

  3. రావోయి ఇటురావోయి (అంతేకావాలి, 1955)

  4. ఈ నెలరేయి (శోభ, 1958)

  5. మొక్కజొన్న తోటలో (సిపాయి కూతురు, 1959)

  6. లగిజిగి లగిజిగి (సిపాయి కూతురు, 1959)

  7. చిన్నారి చేతుల (అన్నాతమ్ముడు, 1959)

  8. వారెవా ఘుమ్‌ఘుమ్ (నాన్ ఫిల్మ్)

  9. గీతము పాడుదునా (నాన్ ఫిల్మ్)

  10. ఎంతో ఆనందం ఎంతో సంతోషం (నాన్ ఫిల్మ్)

  11. వచ్చెను వచ్చెను సంక్రాంతి (నాన్ ఫిల్మ్)

  12. చల్లగాలిలో (నాన్ ఫిల్మ్)