బొడ్డు తెగి చాలాకాలమయింది
ఒడ్డు మారి కూడా దశాబ్దాలు దాటింది
అయినా అమ్మ నేలమీద బెంగ మాత్రం
అణువంతయినా తగ్గదు.
ఆదరించిన నేల అన్నీ ఇచ్చింది
బ్రతుకు ఫలాలు అందుకోవటానికి
పరుగెత్తటం నేర్పింది
కాని, తప్పటడుగులు వేసిన నేలే
ఎప్పటికీ తలపుల్లో నిలుస్తుంది.
ఈ నేలే కాదు,
ఇక్కడి ఆకాశం కూడా
అపరిచితంగా తోస్తుంది.
ఉదయించే సూర్యచంద్రులు
వాడిన వస్తువుల్లా కనిపిస్తారు.
ఎక్కడెక్కడికో వెళతాము
రెక్కలొచ్చిన కలలా ఎగురుతాము
కాని, కనులు మూసుకున్నప్పుడు
చిన్నప్పటి నేస్తం ముఖమే
కలలో పలకరిస్తుంది.
ఏదో ఒకనాటికి
నేనూ ఈ నేల కిందే నిదురిస్తాను
అనంతశయనంలో కూడా బహుశ
అక్కడ మట్టివాసనలే
విడవకుండా నన్ను వెంటాడతాయి.