హిత సూచని

హితసూచని
రచయిత: స్వామినీన ముద్దునరసిహ్మం
ఆరుద్ర ప్రవేశికతో
ప్రచురణ: ఆంధ్రకేసరి యువజన సమితి, రాజమహేంద్రి-4.
1986

HITASUCHANI
By
SWAMYNEENA MUDDU NARASIMHAM
First Edition: July, 1862
D.P.L.A.P. CITATION: No. 10367/800/7013. 26th List
Reprinted: April, 1986

Published by:
ANDHRA KESARI YUVAJANA SAMITHI
VIKRAMAHAL.
RAJAMAHENDRI – 533 104.
A.P., INDIA.

Rs. 35/-

Printed at:
RAMA SESHU PRESS,
Rajamahendri.

ఆశయం

అసలు పందొమ్మిదో శతాబ్దమే చైతన్య స్వరూపం. మూఢత్వం మేడకట్టిన ప్రజను నిర్నిద్రాణం చేసింది. నిర్నిద్రాణం కావించటానికి పూనుకొన్న ఆద్యులు ఆరాధ్యులయ్యారు. రంగాలకు ముందు కొందరు, వెనుక కొందరు నిల్చి జీవితాంతం పోరాడి లక్ష్యాలు సాధించారు. సంఘదురాచారాలను, దుర్మార్గాలను, మూఢనమ్మకాలను నిర్మూలించడానికి శతధా సమరం సాగించారు. వ్యవహారిక భాషకుగాని, సంస్కరణకుగాని తావులేనికాలంలో సమరశీలి స్వామినీన ముద్దునరసింహనాయుడు ‘హితసూచని’ పుస్తకం రాసారు! వ్యవహారికభాషకు, సంస్కరణకు, వెన్నెముకలా నిలచింది హితసూచని. హితసూచని ఈనాడు ‘దాదాపు’ అలభ్యం. వ్యావహారిక భాషావాదులకు, పరిశోధకులకేగాక అతి సామాన్య పాఠకులకు కూడ ప్రయోజనం కలిగించే అనేకాంశాలతో ఈపుస్తకం అపురూపంగా మిగిలింది. పునర్ముద్రించి పాఠకలోకానికి అందించాలనే తలంపు మా ఆంధ్రకేసరి యువజన సమితికి కలిగింది. పుస్తకముద్రణ విషయంలో ఇది ప్రథమ ప్రయత్నం.

1962 సం॥లో గౌతమీతీరాన రాజమహేంద్రి పట్టణంలో కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి చల్లనిఆశీస్సులతో శ్రీ యాతగిరి శ్రీరామనరసింహారావు చక్కని ఆశయంతో ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపించబడి ఎన్నో పటిష్ఠమైన కార్యక్రమాలు నిర్వహించింది. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాలలో కార్యక్రమాలు అఖండగౌతమిలా సాగుతూనేవున్నాయి. విజ్ఞానదాయకమైన ‘హితసూచని’ స్ఫూర్తితో పుస్తక ప్రచురణలో సమితి అడుగుపెట్టింది. ఎందరో తాళపత్రాలు ముద్రించే దశలో ముద్రితమై, అలభ్యమైన అపురూప గ్రంథాలను ముద్రించే ఆవశ్యకత ఉందని ప్రయత్నం సాగిస్తున్నాం.

అసంఖ్యాకమైన పుస్తకాలను పరిశోధించి గణుతికెక్కినవారు “ఆరుద్ర.” ముడివీడని ఏ చారిత్రకాంశాన్నైనా అవలీలగా తేటతెల్లం చేయగల సమర్థులు, సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకారులు “ఆరుద్ర.” ఆయన హితసూచని గ్రంథానికి “ప్రవేశిక” వ్రాయడం మాకు గర్వకారణం. ఆయనకు కృతజ్ఞతాంజలులు.

ఆంధ్రకేసరి యువజన సమితి వెండి పండుగ జరుపుకునే తరుణంలో తొలికాన్కగా ఆంధ్రజాతికి “హితసూచని” సమర్పించుకొంటున్నాం.

ఆశయం మాది – ఆదరణ అందరిదీ.

రాజమహేంద్రి,
23-4-86.

డా. అరిపిరాల నారాయణరావు, ఎమ్‌.ఎ., పిహెచ్‌.డి.
డైరెక్టర్‌, లైబ్రరి & మ్యూజియం
ఆంధ్రకేసరి యువజన సమితి

ప్రవేశిక

వాళ్ళ ముత్తాతగారు చేసిన గ్రంథాన్ని మళ్ళీ ముద్రించాలనే ఉద్దేశం ముద్దుకృష్ణకు చాలా కాలంగా ఉండేది. ముద్దుకృష్ణ అంటే మరెవరోకాదు; నవ్యసాహిత్య పరిషత్తు కొత్తరోజుల్లో ఆధునిక కవుల ఖండకావ్యాలను సంకలనంచేసి, 1935లో, ‘వైతాళికులు’ అనే సంపుటిని ప్రచురించిన ప్రజ్ఞావంతుడు. సామ్యవాద భావాలతో ‘జ్వాల’ అనే సాహిత్య పత్రికను నడిపిన దక్షుడు. “చీకటిలోనికి దీపికను తీసికొని పోగలరుకాని, ఎవరూ చీకటినే వెలుతురుగా మార్చలేరు” అని అజ్ఞానం తెల్లారని కాలంలో ఈ శతాబ్దంలో నమ్మినవాడు; కిందటి శతాబ్దంలోనే వాళ్ళ ముత్తాతగారు చిమ్మచీకటిలోనికి ఒక చిరుదీపికను తీసికొని రావడానికి ఒక గ్రంథం చేశారని తెలిసినవాడు. (కిందటి శతాబ్దం మొదటి సగభాగంలో గ్రంథకర్తలు గ్రంథాలను చేసేవారు. లేఖకులు రాసేవారు.)

ముద్దుకృష్ణ ముత్తాతగారి పేరు: స్వామినీన ముద్దు నరసింహనాయనివారు. ఆయన చేసిన గ్రంథం పేరు: హితసూచని. ఇది 1862లో తొలిసారి అచ్చుపడింది. దీని ప్రతులు రమారమీ అలభ్యం. ఒకటి రాజమంద్రి గౌతమీ గ్రంథాలయంలో ఉందని ముద్దుకృష్ణకు బాగా తెలుసు. దానిలో కొన్ని పుటలు లేవన్న సంగతికూడా తెలుసు. వేరే ప్రతులు ఎక్కడ దొరుకుతాయో పరిశోధించమని నన్ను అడుగుతూ వుండేవాడు. హితసూచనిని మళ్ళీ అచ్చువేయాలన్న సంకల్పం ముద్దుకృష్ణతోబాటు నాకూ లేకపోలేదు. ముద్దుకృష్ణకు ఈకోరిక నేను పుట్టకముందే ఉండేది.

1924లో ముద్దుకృష్ణ మద్రాసులో చదువుకొంటున్న రోజుల్లో గిడుగు రామ్మూర్తి గారిని కలుసుకొన్నాడు. ఆయన హితసూచని పుస్తకాన్ని ముద్దుకృష్ణకు చూపించి ఈ పుస్తకానికి చరిత్రాత్మకమైన విలువ వున్నదని చెప్పారు. “వ్యావహారికభాష ప్రయోజనాన్ని గుర్తించి ఆ వాదాన్ని ప్రారంభించినవాడు ఈ ముద్దు నరసింహం. అంతేకాదు సంఘ సంస్కారము, వితంతు వివాహము, బ్రహ్మసమాజముద్వారా బంగాళాదేశంనుంచి ఆంధ్రదేశంలోకి దిగుమతి కావడం కాదు. అంతకు పూర్వమే మన తెలుగువాడొకడు ఈ ఉద్యమాన్ని తలపెట్టి ప్రచారం చేసినవాడున్నాడు. అని రుజువు చేయడానికి ఈ హితసూచని ఆధారం. అందుచేతను ఈ గ్రంథాన్ని తిరిగి అచ్చువేయాలి. ఆ ప్రయత్నం జరిగేలోపున ముందు నీ తండ్రిగారిని అడిగి వారి తాతగారి జీవితవిశేషాలు కనుక్కొని ఉపోద్ఘాతం రాసి పంపండి” అని గిడుగువారు ముద్దుకృష్ణకు హితబోధచేశారు.

“నేను మా నాయనగారిని అడిగి ఆయన తాతగారి జీవితం గురించి చెప్పిన సంగతులన్నీ రాసి ఉంచాను. కాని, రామమూర్తిగారి హితసూచని ప్రచురణ ప్రయత్నం కొనసాగలేదు.” అని ముద్దుకృష్ణ చాలా బాధపడ్డాడు. ముద్దునరసింహంగారిమీద ఒక చిన్నవ్యాసం రాసి రాజమంద్రి సరస్వతీ పవర్‌ ప్రెస్‌వారి పక్షపత్రిక ‘సంస్కృతి’ 1-5-1959వ సంచికలో ప్రచురించాడు. (ఈ వ్యాసంలోనే గిడుగువారి ప్రయత్నం గురించి చివర రాశాడు.) వాళ్ళ ముత్తాతగారి కాలాన్ని నిర్ణయించడానికి ముద్దుకృష్ణ ఈ వ్యాసంలో ప్రయత్నించాడు.

“ముద్దునరసింహంగారి కాలం ఉజ్జాయింపుగా నిర్ణయించడానికి కొన్ని ఆధారాలు వున్నవి. ముద్దునరసింహంగారి కుమారుడు రంగప్రసాదరావు. ఆయన పెద్ద కుమారుడు తాతగారి పేరుగల ముద్దునరసింహం. ఈ మనవడు జనవరి 1861 ప్రాంతంలో, ఈయనకు పదకొండు సంవత్సరాల వయసులో తండ్రి రంగప్రసాదరావు చనిపోయాడు. అంటే రంగప్రసాదరావు మరణం 1872 ప్రాంతంలో, రంగప్రసాదరావు 1862లో హితసూచని గ్రంథాన్ని ప్రచురించాడు. అప్పటికి ఆయన రాజమహేంద్రవరంలో జిల్లా ఏక్టింగు గవర్నమెంటు వకీలు. రంగప్రసాదరావు 1832 ప్రాంతంలో జన్మించివుండాలి. దానినిబట్టి ముద్దునరసింహం మరణం 1856 ప్రాంతంలో అని నిర్ణయించవొచ్చును. అందుచేతను హితసూచని రచన 1856 పూర్వం జరిగివుండాలి.” పైన కోట్‌ చేసిన కాలనిర్ణయం ముద్దుకృష్ణ కేవలం తన ఊహాబలంతోనే తప్ప ప్రబల సాక్ష్యాధారాలతో చేయలేదు. ముద్దుకృష్ణలాగే టేకుమళ్ళ కామేశ్వరరావుగారు కూడా “మొత్తంమీద 1856కే హితసూచని గ్రంథం పూర్తయిందన్నమాట.” అని, 1937లోనే ‘ప్రతిభ’ అనే నవ్యసాహిత్య పరిషత్తు పత్రికలో ఊహించారు. ఈ ఇద్దరి ఊహలూ కరక్టే. ఇలాగ ధృవీకరించడానికి నా దగ్గిర సమకాలిక సాక్ష్యాలు ఉన్నాయి. 1856లో ముద్దునరసింహంగారు మరణించారు.

పందొమ్మిదో శతాబ్దం ఆదినుండీ చాలా సంవత్సరాలు చెన్నపట్నంలోని అశైలం ప్రెస్‌ అనే సంస్థ ‘మద్రాస్‌ ఆల్‌మొనాక్‌’ అనే వార్షిక సంపుటాలను ప్రచురించేది. 1840నుండి ఆ సంచికలలో వివిధజిల్లాల న్యాయశాఖలలో ఉద్యోగం చేస్తున్న నేటీవులపేర్లూ వాళ్ళ హోదాలు ప్రకటించేది. ముద్దునరసింహంగారి పేరు 1848లో తొలిసారిగా కనబడుతుంది. 1856లో ఆఖరిసారిగా నమోదు అయింది. 1857నుండి ఆయన పేరులేదు. అంటే 1856లోనే ఆయన మరణించారన్నమాట. రెండేళ్ళ తర్వాత తండ్రిచేస్తున్న ఉద్యోగంలో కొడుకును నియమించారు. అందుకే 1859 నుంచీ సామినేని రంగయ్యపేరు న్యాయశాఖలో ఉద్యోగిగా కనబడుతుంది.

ముద్దు నరసింహంగారు 1856లో మరణించారని తేలింది గానీ, ఆయన జన్మ సంవత్సరం తేల్చడం కష్టం. స్వామినీన వంశీయులు తరతరాలుగా రాజమంద్రి వాస్తవ్యులని ఈస్టిండియా కుంఫిణీవారి దుబాషులనీ ముద్దుకృష్ణ రాశాడు. 1769లో ఫ్రెంచివారిని వెళ్ళగొట్టాకగానీ ఇంగ్లీషువారికి ఉత్తర సర్కారులు దఖలు పడలేదు. ఈ రాజ్యాలను కంపెనీవారు మూడు కేంద్రాలలో ఉన్న ప్రొవిన్షియల్‌ కవున్సిళ్ళు ద్వారా పాలిస్తున్నామన్న నెపాన పన్నులు వసూలుచేస్తూ కొల్లగొట్టేవారు. ఆ మూడు కేంద్రాలూ గంజాము, విశాఖపట్నం, మచిలీపట్నాలు మాత్రమే. రాజమంద్రికి అప్పుడు ప్రాముఖ్యం లేదు. స్వామినీనవారు ప్రొవిన్షియల్‌ కవున్సిళ్ళలోని తెల్లదొరల దగ్గర దుబాషీలని ధృవపర్చడానికి ప్రస్తుతానికి సాక్ష్యాలు లేవు.

1794లో కొత్త పరిపాలనా విధానాన్ని కుంఫిణీ అమలు పరిచింది. సర్క్యూట్‌ మీద వివిధ ప్రాంతాలకు వెళ్ళి న్యాయవిచారణ చేసే ప్రొవిన్షియల్‌ కవున్సిళ్ళను రద్దుచేసి, వాటిస్థానే కలక్టరేటులను స్థాపించారు. గోదావరిజిల్లా ఏర్పడింది. దానిని మూడు డివిజన్లుగా విభజించారు.

అవి: ఫస్టు డివిజన్‌: పిఠాపురం, పెద్దాపురం సంస్థానాలు ఇందులో ఉండేవి. కాకినాడ కేంద్రం.
సెకండు డివిజన్‌: ఉండి, తణుకు, నరసాపురం, మొగలితుర్రు జమీందారీలు ఈ విభాగంలో ఉండేవి. మొగలితుర్రు కేంద్రస్థానం.
థర్డు డివిజన్‌: నడిమిలంకలు, రాజమంద్రి హవేలీ భూములు, రామచంద్రపురం, కోరుకొండ, కొత్తపల్లి, పోలవరం, గూటాల వగైరా ప్రాంతాలు దీనిలో ఉండేవి. రాజమంద్రి కేంద్రస్థానంగా నిర్ణయించారు.

ఇవి రెవిన్యూ డివిజన్లు. న్యాయపరిపాలన పాత ప్రొవిన్షియల్‌ కవున్సిళ్ళ సర్క్యూట్‌ కోర్టులద్వారా జరుగుతూ వుండేది. అయితే 1793లో రాజమంద్రిలో ఒక అదాలత్‌ స్థాపించారు. అప్పటినుంచీ ఆ కచేరీలో నేటివులు జమీన్‌దారులుగా, రైటర్లుగా, హెడ్‌రైటర్లుగా పనిచేసేవారేమో. ఆదినుంచీ స్వామినేనివారు రాజమంద్రి వాస్తవ్యులయితే వారి దుబాషీతనం 1792నుంచీ మొదలయి వుంటుంది. ముద్దునరసింహంగారు అరవైనాలుగు సంవత్సరాలు జీవించారనుకొంటే, ఆయన 1792లో జన్మించి వుండవచ్చు. కానీ ఆయన అంతకాలం జీవించారనుకోడానికి ఆధారంలేదు. వారి తాతతండ్రులు దుబాషులైతే వాళ్ళదగ్గరే ఆయన చిన్నప్పుడు ఇంగ్లీషుకూడా నేర్చుకొని వుండవచ్చు. అయితే ముద్దుకృష్ణ కథనం వేరుగా వుంది.

“ముద్దునరసింహానికి ఇంగ్లీషు చదువుమీద ఆకర్షణ కలిగింది. దక్షిణాదిని కుంభకోణంలో తప్ప మరెక్కడా ఇంగ్లీషుస్కూలు లేదు. అప్పటికింకా రైలుమార్గాలు ఏర్పాటుకాలేదు. అయినప్పటికీ, ముద్దునరసింహం రాజమహేంద్రవరంనుంచి నాటున ప్రయాణంచేసి బందరుకు చేరి అక్కడి ఓడ ఎక్కి మద్రాసు చేరి అక్కడినుంచి నాటున కుంభకోణం చేరి ఇంగ్లీషు స్కూల్లో చేరాడు.”

ఇది ముద్దుకృష్ణ వినికిడివల్ల రాసినది, ముద్దునరసింహానికి పద్నాలుగేళ్ళ వయస్సు వచ్చిననాటికి రాజమంద్రిలో ఇంగ్లీషు బళ్ళు లేకపోవచ్చుగానీ బందరులో మార్గన్‌ దొరగారి ఇస్కూలు ఉండేది. 1776లో జన్మించిన కావలి బొర్రయ్యగారు తన పద్నాలుగో ఏట 1790లోనే అక్కడ ఇంగ్లీషు నేర్చుకొన్నారు. ఇంగ్లీషు చదువుకోసం కాకపోయినా ముద్దునరసింహంగారు కోయంబత్తూరుకు మాత్రం వెళ్ళడం నిజం. దానికి ఒక కారణంకూడా వుంది. అదేమిటో తెలుసుకొనడానికి ముందు ఆనాటి విద్యావిధానం ఏమిటో నౌఖరి పద్ధతులేమిటో తెలుసుకోవాలి.

కుర్రవాళ్ళను అయిదో యేట వీధిబడిలో వేస్తారు. గుంట ఓనమాలు దిద్దాక, కజితంమీద అక్షరాలు రాయిస్తారు. (కజితం అంటే పలక లాంటిది) అక్షరాల తర్వాత గుణింతాలు, తర్వాత మాటలు రాయడం నేర్పుతారు. చెప్పిన పేరు రాయడం వచ్చాక తాటాకుమీద గంటంతో లిఖించడం నేర్పుతారు. మొదట గుండ్రటి సున్నాలు చుట్టడంతో ఈవ్రాత బాగా పట్టుబడుతుంది. బాల రామాయణం, అమరకోశంలోని కొన్ని వర్గులూ, పద్యాలూ, శ్లోకాలూ అర్థం చెప్పకుండా భట్టీ పట్టిస్తారు. సంవత్సరాల పేర్లు, మాసాలూ, వారాలూ, తిథులూ, గ్రహాలూ, నక్షత్రాలూ, పండుగలూ, పబ్బాలూ, మొదలైనవి కంఠతా పెట్టిస్తారు.

కుర్రవాడు తన పదోయేటో పదకొండోయేటో బడి విడిచిపెట్టేస్తాడు. చదువు పూర్తయిందా లేదా అని ఏమాత్రం పట్టించుకోరు. కులవృత్తిలో ప్రవేశిస్తాడు. వాళ్ళ తండ్రి కచేరీలో నౌఖరీ చేస్తుంటే కుర్రవాడుకూడా అందులో చేరుతాడు. లెక్కలు, పద్దులు రాయడం నేర్చుకొంటాడు. కొంచం చెయ్యితిరిగాక ఆ పిల్లవాడి బంధువులు ఎంతో తాపత్రయపడి ఏదో ఉద్యోగంలో అబ్బాయిని వేయిస్తారు. స్వయంకృషిమీదే కుర్రాడు ఇంగ్లీషుకూడా స్వయంగానో, ఉన్న బళ్ళల్లోనో నేర్చుకొంటాడు.

ముద్దునరసింహంగారుకూడా ఇలాగే వీధిబడిలో చదువుకొని కచేరీలో చేరి ఉంటారు. ఇంగ్లీషులో కుదురైన దస్తూరీ అలవడిన కుర్రవాళ్ళు ఆరోజుల్లో ఏదో ఒక కచేరీలో ఉమేదువారీగా ఉంటే జీతంబత్తెంలేని వలంటిరు గుమస్తాగా చేరేవారు. చుట్టాల ప్రాపంకంవల్ల క్రమంగా ఏదోకొంచెం జీతంవచ్చే ఉద్యోగం వేయించుకొంటారు. తెల్లదొరల మెప్పుపొందితే రొట్టెవిరిగి నేతిలో పడ్డట్టే. ఆదొరకు ఏ వూరుబదిలీ అయితే ఆవూరికి ఆనేటివు గుమాస్తాకూడా వెళ్ళేవాడు. ముద్దునరసింహంగారు అలాగే ఎవరో దొర ఆశ్రయం దొరకడంవల్ల, ఆదొరకు కోయంబత్తూరు బదిలీ అయితే అక్కడకు వెళ్ళివుంటాడు.

కుంఫిణీ నౌఖరీలో ఇది సర్వసామాన్యము. కర్నల్‌ కాలిన్‌ మెకంజీని ఆశ్రయించుకొన్న కావలి సోదరులు, ఆదొర తిరిగినన్ని ఊళ్ళూ తామూ తిరిగారు. చెన్నరాజధాని సుప్రీంకోర‌ట్‌లో ఇంటర్‌ప్రీటర్‌గా పనిచేసిన వెన్నెలకంటి సుబ్బారావు (1759-1839) ఆదిలో సేలం, చార్‌మహల్‌, దక్షిణ కనరాలలో తన పోషకుడైన దొరతో నివసించాడు. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకోవాలంటే కొన్ని డజన్లు ఉన్నాయి.

ముద్దునరసింహంగారు 1848లో రాజమంద్రి జిల్లాకోర్టులో సెకండుక్లాసు మునసబుగా పనిచేసిన దాఖలాలు దొరుకుతున్నాయి. 1848లోనే రాజమండ్రి జిల్లాజడ్జిగా థామస్‌ఆండ్రూ ఆన్‌స్త్రూతర్‌ నియమితుడయ్యాడు. ఈ దొర 1835లో 37లో కోయంబత్తూరు సబ్‌కలక్టర్‌గా జాయింట్‌ మేజస్ట్రేట్‌గా పనిచేశాడు. ఇతనికి ముద్దునరసింహంగారికి పూర్వపరిచయం ఉందో లేదో భావి పరిశోధనలవల్ల గానీ తేల్చలేం. ఏమైనా ఆన్‌స్త్రూతర్‌ రాజమంద్రికి వచ్చిన సంవత్సరమే మొదటిసారిగ ముద్దునరసింహంగారి పేరు జూడిషియాల్‌ సిబ్బందిలో కనబడడం గమనార్హమైన విషయం. (రెండవ తరగతి జిల్లా మునసబుకు ఆరోజుల్లో నూటపదిహేను రూపాయల జీతం, డెబ్బై రూపాయల భత్యం ముట్టేది – హోదాసంగతి వేరే చెప్పక్కర్లేదు.)

స్థానికంగా ఉండే తెల్లదొరలతో ముద్దునరసింహంగారు సాయిలా పాయిలాగా వుంటూ సంభాషిస్తూ విద్యాగోష్ఠులు జరిపేవాడని చెప్పవచ్చు. ముద్దుకృష్ణ కథనం ప్రకారం జిల్లాజడ్జితో ఆయన సాయంత్రాలు షికారు వెళ్ళేవారు.

“ఒకనాడు ఇద్దరూకలిసి, ఆర్యాపురం అవతలవున్న సీతమ్మ చెరువుప్రాంతాలకు వెళ్ళారు. ఆకాలంలో ఆర్యాపురం ప్రాంతంకూడా అడివిగా వుండేది. తరుచు చిరతపులులు తిరుగుతూవుండేవి. సీతమ్మచెరువు ప్రాంతాలకు – నేటి పేపరుమిల్లు ప్రాంతం – వీరు చేరగానే పొదచాటునుంచి యెలుగుబంటి వచ్చి వీరిని యెదుర్కొన్నది. జిల్లాకలక్టరు పారిపోయాడు. ఆప్రాంతాలకు షికారుకెళ్ళేటప్పుడు ముద్దునరసింహం పక్కను ఖడ్గం వుండేది. కలక్టరువద్ద పిస్తోలు వుండేది. కానీ, హఠాత్తుగా యెలుగుబంటి యెదురుకాగానే కలక్టరు కంగారుపడి పారిపోయాడు. ముద్దునరసింహం కత్తిదూసి యెడమచేత్తో యెలుగు ముట్టెపట్టుకొని దానిని నరికివేసి కత్తినివున్న రక్తాన్ని ఆకులతో తుడుస్తూవుండగా వూరిలోని జనాన్ని పోగుచేసుకొని కలక్టరు అక్కడకు వచ్చారు.”

ముద్దుకృష్ణచేసిన పై కథనంవల్ల ముద్దునరసింహంగారు కత్తిసాములో ఆరితేరినవారని చెప్పవచ్చు. “శరీరారోగ్యమునకు జరూరైన సంగతులు బాగా తెలుసుకొనేవాడిక” వ్యాయామంవల్ల కూడా వారికి వుండేదనిభావిస్తే, తప్పులేదు. వెలమవారిలో కత్తిపట్టడం కొందరికి, కర్రపట్టడం కొందరికి కులవిద్య. ముద్దునరసింహంగారు ఆదివెలమలు. తెలుగుదేశంలోని వెలమదొరలలో రెండు రకాలవారున్నారు. పద్మవెలమలు లేక పెద్దవెలమలు లేక రాచవెలమలు అనే శాఖ వకటి, ఆదివెలమలు అనే శాఖ ఇంకొకటివున్నాయి. పద్మవెలమల స్త్రీలు ఘోషా పాటిస్తారు. ఆదివెలమలు పరదాను పాటించరు.

ముద్దునరసింహంగారు కత్తిపట్టి ధైర్యసాహసాలను ప్రదర్శించిన ఇంకో సందర్భాన్ని ముద్దుకృష్ణ రికార్డు చేశాడు.

“ఒంగోలుదగ్గిర కొత్తపట్నంలో వివాహానికి ఈయన (ముద్దునరసింహం) వెళ్ళాడు. రాత్రి పెళ్ళి జరుగుతూ వుండగా మరాఠీదండు దోచుకోడానికి వొస్తూవుందని వార్త వొచ్చింది. అప్పుడు ముద్దునరసింహం ఆడవాళ్ళని పిల్లల్ని అటుకుమీదకు ఎక్కించాడు; తలుపులన్నీ బార్లా తీయించివేసి గుమ్మంపక్కను ఒక తలుపుచాటున తనూ, మరొక తలుపుచాటున తన నౌఖరు నక్కి ఉన్నారు. ఒక్కొక్క దోపిడీవాడూ లోపల కాలుపెట్టగానే ముద్దునరసింహం వాడితల నరకడమూ, నౌఖరు ఆ తలనీ మొండాన్నీ పక్కకు లాగిపారేయడమూ పద్ధతిని ఏడుగురు దోపిడీదార్లను చంపి ఆ శవాలను వీధిలో పారేయించి, కత్తులుపట్టుకొని తనూ నౌఖరూ వీధిలోకి వచ్చేటప్పటికి ఇరుగు పొరుగువారు ధైర్యం తెచ్చుకొని కత్తులూ కర్రలూ పట్టుకొనివచ్చి మరాఠీదండును తరిమివేశారు.”

ఇలాంటి ధైర్యసాహసాలతో తననూ తనవారినీ ‘బచావు చేసుకోవడం’ వల్ల ముద్దునరసింహంగారు ఆనాటి తెల్లవాళ్ళ ప్రశంసలకు ‘మిక్కిలీ’ పాత్రులై వుంటారు. ఆరోజుల్లో రాజమంద్రిలోని దొరలూ దొరసానులూ ఇంగ్లీషు మాట్లాడగల నేటీవులతో చర్చలు పెట్టుకొనడం గ్రంథాలకు ఎక్కింది. 1837లో రాజమంద్రి జిల్లాజడ్జి జేమ్సుథామస్‌ భార్య ఇంగ్లాండుకు రాసిన వుత్తరాలలో బాలికల విద్యగురించి పోస్టాఫీసు హెడ్‌రైటర్‌ శ్రీనివాసరావుతో చేసిన సంభాషణను పొందుపరిచింది. ఆడపిల్లల బడిపెడితే ఎవరైనా వస్తారా అని 1837 అక్టోబరు 31వ తేదీకి ముందు అడిగింది. “No what for girls learn?”అని శ్రీనివాసరావన్నాడట. ఆడపిల్లలు చదువుకొంటే ఆకుటుంబానికి అరిష్టాలు వాటిల్లుతాయనికూడా చెప్పాడు. (లేఖ నెంబరు 13)

ముద్దునరసింహంగారు తెల్లవాళ్ళతో చర్చలు జరిపినా స్వీయప్రజ్ఞతో దేశకాల పరిస్థితులను శాస్త్రీయవిజ్ఞానంతో ఆకళింపు చేసుకొన్నాడని చెప్పవచ్చు. ఆరోజుల్లో కొంచెం ఉన్నతోద్యోగాలలో ఉన్న నేటీవులకే తెల్లవాళ్ళ హుజూర్న ఇష్టాగోష్ఠి చేసేవీళ్ళు ఉండేవి. ఆనాటి జూడిషియాల్‌ వ్యవస్థలో జిల్లా మునసబుస్థానం కట్టకడపటిదే.

ఆ పరమపద సోపానపఠం ఇలా ఉండేది.

౧. జిల్లా కోరట్టు.
(సివిల్‌సైడ్‌)
1. శిరస్తాదార్‌ (రూ. 110)
2. నాజిర్‌ (రూ. 45)
3. రికార్డు కీపరు (రూ. 35)
4. హెడ్‌ గుమాస్తా (రూ. 24)
5. గుమాస్తా (రూ. 10-21)
6. హెడ్‌రైటర్‌ ఇంగ్లీషు (రూ. 70)
7. రైటర్లు (రూ. 21-35)
8. షరాబు (రూ. 10)
9. మున్షీ (రూ. 7)
10. హెడ్‌ మెసింజరు (రూ. 10)
11. మెసింజర్లు (రూ. 5-7)
12. మశాల్చీ (దీపం) (రూ. 3)
13. స్వీపర్లు (రూ. 2)
(క్రిమినల్‌ బ్రాంచి)
1. రికార్డు కీపరున్నూ ఇంటర్‌ప్రీటరున్నూ (రూ. 30)
2. జవాబ్నవీస్‌ (రూ. 28)
3. గుమాస్తా (రూ. 18)
4. ట్రాన్స్‌లేటర్‌ (రూ. 50)

౨. సబార్డినేట్‌ (ఆగ్జిలరీ) కోరట్టు
1. ప్రిన్స్‌పల్‌ సదరమీను (రూ. 500/-)
2. పండిత్‌ సదరమీను (రూ. 200/-)
3. కాజీ లేక మస్జీ సదరమీను (రూ. 200/-)

౩. జిల్లా మునసబు కోరట్టులు.
1. ఫస్టుక్లాసు మునసబు (రూ. 140+85)
2. సెకండ్‌ క్లాసు మునసబు (రూ. 115+70)
3. థర్డుక్లాసు (రూ. 100+60)

జూడిషియాల్‌ వ్యవస్థలో ఆనాటి నేటివులు పొందగలిగిన మహోన్నత పదవి ప్రిన్స్‌పల్‌ సదరమీను పదవే. గోదావరిజిల్లాలో ఆనాడు ఆరుచోట్ల డిస్ట్రిక్టు మునసబు కోర్టులుండేవి. అవి 1. రాజమంద్రి, 2. కాకినాడ, 3. పెద్దాపురం, 4. నరసాపురం, 5. అమలాపురం, 6. ఏలూరు. ఇవికాక సీతానగరంలోకూడా కచేరీ ఉండేది కాబోలు.

1848నుండి 1852దాకా అయిదేళ్ళు ముద్దునరసింహంగారు రాజమంద్రిలోనే సెకండుక్లాసు డిస్ట్రిక్టు మునసఫుగా పనిచేశారు. 1853లో ఆయనను ఫస్టుక్లాసు డిస్ట్రిక్టు మునసఫుగా ప్రమోటుచేసి సీతానగరంలో నియమించారు. అయితే ఏకారణాలవల్లనో తెలియదుగానీ మరుచటి సంవత్సరం రాజమంద్రి జిల్లాకోరట్టులో ఆయనను థర్డుక్లాసు డిస్ట్రిక్టు మునసఫుగా నియమించారు. 1858దాకా ఆమూడేళ్ళు ఆయన ఆహోదాలోనే ఉండేవారు. 1857లో ఆయన పేరు అశైలమ్‌ ఆల్‌మనాక్‌లో కనబడదు.

హితసూచని ముఖపత్రంమీద ‘మహోపకారులగు రాజమహేంద్రవరపు జిల్లా ఫస్టుక్లాస్‌ డిస్ట్రిక్టు మునసఫుగా నుండిన స్వామినీవ ముద్దునరసింహనాయనివారు’ దానిని రచించినట్టు ప్రకటించడంవల్ల హితసూచని రచన ఆయన ఆహోదాలోఉన్న 1853నాటికి అచ్చువేయించడానికి సిద్ధంచేసి వుంటారు.

ఆరోజుల్లో రాజమంద్రిలో ప్రైవేటు ముద్రణ సౌకర్యాలు లేవు. చాఫాఖానాలు చెన్నపట్టణంలోనే విస్తారంగా వుండేవి. బందరులోనూ ముద్రణ సౌకర్యాలుండేవి. 1874లో వీరేశలింగంగారు వివేకవర్ధని మాసపత్రికను ‘ఆకాలమునందు మా గోదావరి మండలములో దొరతనమువారివి తక్క వేఱు ముద్రాయంత్రము లేకపోవుటచేత’ చెన్నపట్టణంలోని కొక్కొండవారి ప్రెస్‌లో అచ్చువేయించేవారు. తర్వాత సొంతప్రెస్సుకు ప్రయత్నించారు. 1876లోగాని వీరేశలింగంగారి ముద్రాయంత్రం రాజమంద్రికి రాలేదు. దీనికి పద్నాలుగేళ్ళపూర్వం 1862లో అచ్చుపడిన హితసూచనిని చెన్నపట్నంలోని ప్రెస్సులోనే ముద్రించవలసివచ్చింది.

ముద్దునరసింహంగారి జీవితకాలంలో హితసూచని అచ్చుపడలేదు. ఆయన అవసానకాలాన్ని ముద్దుకృష్ణ ఇలా కథనం చేశాడు.

“ఈయన ఆఖరిదశలో పెద్దాపురంలో మునసబుగా ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం కచ్చేరి హఠాత్తుగా ఆపుచేసి ఒంట్లోబాగులేదని, ఇంతతో కచ్చేరి ఆపుచేస్తున్నానని, మళ్ళీ కలుసుకోలేకపోతే ఇంతతో సెలవు అని ఇంటికి వెళ్ళిపోయాడు. కుటుంబం రాజమహేంద్రవరంలో ఉంది. ఆయన వొంటరిగా పెద్దాపురంలో వున్నాడు. ఇల్లు చేరగానే వంటవాడిని పిలిచి భోజనం చెయ్యను. గదిలో పడుకొంటాను. పొద్దున్నవరకూ నన్ను మాట్లాడించవద్దు. పొద్దున్నచూసి మరీ అబ్బాయికి రాజమహేంద్రవరం కబురుచేయించు అని చెప్పి పడుకొన్నాడు. ఆరాత్రి యెప్పుడో ప్రాణంపోయింది. అప్పటికి ఆయన కుమారుడు రంగప్రసాదరావు చదువుకుంటున్నాడు.”

1855లో ముద్దునరసింహంగారు చనిపోయేటప్పుడు రంగప్రసాదరావు ఇంకా చదువుకొంటున్నాడంటే ఏ ఇరవై సంవత్సరాల వయస్సువాడో అయివుండాలి. అందువల్లన అతని జననం 1835 ప్రాంతాలుకావచ్చు. ముద్దునరసింహంగారి ఇరవయ్యోఏట పెద్దకొడుకు రంగప్రసాదరావు పుట్టాడనుకుంటే ఆయన జననకాలం 1815 అని తేలుతుంది. ఏమైనా ముద్దునరసింహంగారి జననకాలం 1810 ముందుకు జరిపించలేం. కాబట్టి ఆయన జీవితకాలాన్ని 1810-1855 అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల జీవితకాలంలో ఆయన మనుగడ సార్థకమే అయిందని చెప్పాలి.

హితసూచని పీఠికలో “స్త్రీలకు విద్యలు సాధకములగుచున్నవి” అన్నది ప్రారంభవాక్యం. ఇవి 1853లో అన్నమాటలు. 1837లో జిల్లాజడ్జి, అతని భార్య ఆడపిల్లలకు బడిపెడతామంటే హిందువులు ఆసక్తి చూపలేదు. అయినా పదహారేళ్ళలో కొంత ప్రభావితం అయ్యారని తెలుస్తూంది. స్త్రీవిద్య గురించి వాదోపవాదాలు చాలా జరిగేవి. ముద్దునరసింహంగారి పుస్తకం వెలువడిన రెండుదశాబ్దాలకు ధవళేశ్వరంలోని ప్రముఖులు చందాలు వేసుకొని 1874లో ఒక బాలికాపాఠశాలను స్థాపించుకొన్నారు. “పురుషులలో సైతము విద్య యత్యల్పముగా నుండిన యాకాలములో వొక చిన్నగ్రామములోనివారు చందాలు వేసికొని పాఠశాలను స్థాపించిరనుట వింతగానే తోచవచ్చును” అని వీరేశలింగంగారు తమ స్వీయచరిత్రలో రాశారు.

ఆడపిల్లలకోసం ఆరోజుల్లో బళ్ళు రాజమంద్రిలో లేకపోలేదు. అయితే పరువున్న వాళ్ళపిల్లలు వాటిలో చదువుకొనేవారుకాదు. ఆకాలమునందు రాజమహేంద్రవరములో పాఠశాలయనగా వేశ్యల చదువుకూటమనియే యర్థము. వేశ్యల నృత్యగీతాదులకై పెట్టబడిన పాఠశాల లప్పుడాపురమునందెన్నియో యుండెను.” అని వీరేశలింగంగారే రాశారు. సంఘ సంస్కారోద్యమ ప్రభావంవల్ల ఇవి క్రమేణామూతపడ్డాయి.

పురుషులకే విద్య సరిగ్గా బోధించడంలేదని ముద్దునరసింహంగారికి తెలుసు. ఏక్రమంలో అధ్యయనం చేయించాలో ఆయన సూచించారు. “ఈ అనుక్రమముగ విద్య చెప్పించేయెడల స్త్రీజాతికి యెవరెవరి మర్యాదకున్ను స్థితికిన్ని అనుకూలమని తోచినమట్టుకు విద్య చెప్పించవచ్చును. సాధ్యమైనంతమట్టుకు గ్రంథములు స్త్రీలున్ను చదవడమునకు లాయఖుగా నుండేలాగు రచించబడివలసినది” అని దూరదృష్టితో ఆయన చెప్పారు.

1840నాటికే తెలుగులో గ్రంథప్రచురణ ఉత్సాహకరంగా కొనసాగుతోంది. 1839లో ‘వృత్తాంతిని’ అనే పత్రిక కొన్నాళ్ళు నడిచింది. 1840లో ‘వర్తమాన తరంగిణి’ అనే పత్రిక ప్రారంభమై ఒక దశాబ్దంపైగా కొనసాగింది. చాపాఖానాలు, అచ్చుకూటాలు, ప్రింటింగు ప్రెస్సులు చెన్నపట్నంలోనూ కొన్ని ఇతర నగరాలలోనూ వెలసాయి. పురాణంవారు, వావిళ్ళవారు, పువ్వాడవారు మొదలైనవారు గ్రంథప్రచురణ విరివిగ చేశారు. సెంటు జార్జికోటకు చెందిన కాలేజీలో కుంఫిణీ ఉద్యోగులుగా రైటరు రాంకులో నమోదు అయిన తెల్ల విద్యార్థులకు తెలుగు నేర్పడంకోసం వ్యాకరణాలు, నిఘంటువులు, రీడర్లు వగైరాలను సర్కారువారే అచ్చువేయసాగారు. స్కూలు బుక్‌ సొసైటీ పేరుతో మరొక అనుబంధసంస్థ నేటీవు విద్యార్థులకోసం పుస్తకప్రచురణ చేపట్టింది.

ఇలా వెలువడుతున్న గ్రంథాలను చూసి ఇవి “మిక్కిలీ సదుపాయముగా ఏర్పడియున్నట్టు కొందరెంచుకొంటున్నారు”గాని ముద్దునరసింహంగారు అలాగ భావించలేదు. “ఇదివరకు ఏర్పడియున్న గ్రంథములు ఏమి, వాటిని బాలురకు చెప్పించు పద్ధతులు ఏమి, యెవరెవరిచేత జరిగించబడుచున్న కృషికి తగిన ఫలములు ఇవ్వడము లేదని” ఆయన భావించారు. దానికి కారణం ఒకటే. ఆపుస్తకాలు గుమాస్తాలను తయారుచేసేవేగాని విజ్ఞానబోధకాలుకావు.

వర్తమానకాలంలో విజ్ఞానదాయకమైన పుస్తకాలు ‘వాక్యగ్రంథాలు’గా వ్రాయాలని ప్రింటువేయించాలని ఆయన చాటిచెప్పారు. పండిత పామర సాధారణంగా ఉండే వాక్యగ్రంథాలు లేకపోవడముచేత హిందూదేశములవారికి విద్యలు రావడం కఠినమై ఉందని గుర్తించారు. తెలుగులో శాస్త్రగ్రంథాలు ఏర్పాటు చేయాలంటే సంస్కృతం మొదలైన భాషలను ఆశ్రయించాలి. ఇద్దరు ముగ్గురు పండితులను కూర్చి వారికి కావలసిన గ్రంథాలను తెప్పించియిస్తే కావలసిన తెలుగు పుస్తకాలు త్వరగా ఏర్పాటు కావచ్చునని ఆనాడే చెప్పారు. “ఇంగిలీషు బాగా తెలిసిన అసలు గ్రంథములయొక్క ముఖ్యాభిప్రాయములు సులభముగా బోధపడతగినట్టు దేశభాషకు సంగ్రహములు చెయ్యడమునకు లాయఖైనవారు పూనుకొన్న పక్షములో” తెలుగువాళ్ళు విజ్ఞానవంతులవుతారని ముద్దునరసింహంగారి నమ్మకం. ఆయన 1853లో సూచించిన పద్ధతిని తెలుగు అకాడమీ చేపట్టడానికి నూటఇరవై సంవత్సరాలు పట్టింది.

హితసూచనిలో ముద్దునరసింహంగారు ఎనిమిది ప్రమేయాల గురించి రాశారు. ప్రమేయమంటే సరియైన అవగాహన పాఠకలోకంలోలేదు. “ప్రమేయము వ్యాసంగాను, హితసూచని వ్యాససంపుటిగాను విమర్శకులు స్వీకరించారు” అని కొలకలూరి ఇనాక్‌ గారు తన తెలుగు వ్యాస పరిణామం అనే పుస్తకంలో తెలియజేస్తూ ముద్దునరసింహంగారి ప్రమేయాలను వ్యాసాలుగా భావించినట్టు ఎక్కడా కనబడలేదని వాస్తవాన్ని చెప్పారు. ప్రమేయం అనేమాటకు నైఘంటికార్థాలు ఇనాక్‌గారు వెతికారుగానీ శబ్దరత్నాకరం, ఆప్టీ నిఘంటువులు అసమగ్రమైనవి కాబట్టి “మోనియర్‌ విలియమ్సు”లో ‘ప్రమేయం” అన్న పదానికి ఇచ్చిన నానార్థాలలో “That of which a correct notion should be formed.” అన్నదానినే స్వీకరించడం మంచిది. దీనితోపాటు “An object of certain knowledge, The thing to be Proved of the Topic to be discussed.” అనే అర్థాలకుకూడా బాగా వర్తిస్తాయి. అందుకే సూర్యరాయాంధ్ర నిఘంటువు వివిధార్థాలు ఇలా ఇచ్చింది.
ప్రమేయము సం.విణ.(అ.ఆ.అ.)
౧. కొలువఁదగినది, కొలఁది యిడఁదగినది, పరిచ్ఛేద్యము
౨. అవధార్యము, నిశ్చయింపఁదగినది , యథార్థముగా ఎఱుఁగఁదగినది, ప్రమాజ్ఞానమునకు విషయమైనది, యథార్థముగా నెఱుఁగఁబడినది.
బ్రౌను మాత్రం తన నిఘంటువులో ప్రమేయమన్న పదానికి opportunity, occation, subject అనే అర్థాలు ఇచ్చాడు. వీటికి ప్రామాణికాలుగా తెలుగువాళ్ళ సంభాషణలో దొర్లే వాక్యాలను ఉదాహరించాడు.
“ఆప్రమేయములో దీనిని చెప్పినాడు He mentioned this on that occasion.
ఆప్రమేయమే ఎరుగను I know nothing of the matter.
పంపే ప్రమేయం వచ్చినపుడు When happen to send it.”

నిఘంటువులలోని అర్థాలనుబట్టి కాక ముద్దునరసింహంగారే హితసూచనిలోని వాక్యాలలో ఎక్కడెక్కడ ప్రమేయమన్నమాటకు ఏ అర్థంలో వాడారో పరిశీలించి ఇనాక్‌ గారు ఈ పదానికి ‘విషయం, సంగతి, అంశం’ అన్న అర్థాలే ఉన్నట్టు సబువుగా పోల్చారు. అచ్చతెనుగులో చెప్పాలంటే ప్రమేయమంటే ‘ఊసు’ అని చెప్పుకోవాలని నాభావం. ఉబుసు, ఊసు అనే పదాలకు సమాచారం, వృత్తాంతం అనే అర్థాలు ఉన్నాయి. ఉబుసుకు కేవలం పొద్దు పోవడానికి చెప్పుకొనే పోసుకోలు కబురుగా ఎంచనక్కరలేదు. ప్రమేయాలు తెలుగుకోదగ్గ ఊసులు.

ఇవాళ మనం ఏ అర్థాన్ని చెప్పుకుంటున్నా హితసూచనని అచ్చు వేయించినప్పుడు ముద్దునరసింహంగారి కుమారుడు రంగప్రసాదరావు మాత్రం ప్రమేయమంటే “చర్చవిషయము”, “విషయము” అనే అర్థాన్నే ఉద్దేశించినట్టు పుస్తక ముఖపత్రంలో స్పష్టమవుతుంది. ఈ చర్చ విషయాలను వ్యాసాలుగా ఇప్పుడు మనం అంగీకరిస్తే తప్పులేదుగానీ, వ్యాసమనేమాట అప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారంలోలేదు. అక్కిరాజు రమాపతిరావు గారు మాత్రం హితసూచని రచనాకాలానికి ఒక యేడు ముందుగానే 1852లోనే “వ్యాసమను పదము తెలుగు సాహిత్యమునందు ప్రచారమున నుండెనని స్పష్టమగుచున్నదని” చెప్పారు. దీనికి ప్రమాణంగా బ్రౌను తన ఇంగ్లీషు తెలుగు నిఘంటువులో ఇచ్చిన ఆ రూపాన్ని చూపారు.

“ESSAY M.S. (add) in commonly called in Madras వ్యాసము. Essayist M.S. He who makes an attempt, Who writer an essay, an author ప్రయత్నము చేసేవాడు, Madras Commonly Called వ్యాసము వ్రాసేవాడు. గ్రంథకర్త)

1972లో రమాపతిరావుగారు “వీరేశలింగంపంతులు – సమగ్ర పరిశీలన” అనే తమగ్రంథంలో ఉటంకించిన పై ఆ రూపాన్నే 1977లో నిడదవోలు వెంకటరావుగారు తమ “ఆంధ్ర వచన వాజ్ఞయము” అనే గ్రంధంలో చూపించారు. (ఈగ్రంథం తాలూకు తొలిముద్రణ 1954లో జరిగింది. అప్పుడు నిడదవోలువారు ఈ ఆరోపాన్ని చూపెట్టలేదు.) మద్రాసులో మాత్రమే ప్రచారంలోఉందని బ్రౌను స్పష్టంగా చెప్పున్నా అక్కిరాజువారుగానీ, ఆయనను చూసి నిడదవోలువారుగానీ దేశమంతటా ప్రచారంలో ఉందనుకోడం భావ్యంకాదు. 1852లో తెలుగుమాటలకు ఇంగ్లీషు అర్థాలను చెప్పి T.E.D.ని బ్రౌను ప్రచురించాడు. 1853లో ఇంగ్లీషు పదాలకు తెలుగుఅర్థాలనిచ్చే E.T.D. అనే నిఘంటువును ప్రచురించాడు. ఇంగ్లీషు తెలుగు నిఘంటువులో ఈ ఆరోపం ఉందిగాని దానికి ఒక ఏడాది ముందుగా ప్రచురించిన తెలుగు ఇంగ్లీషు నిఘంటువులో “వ్యాసము”అన్న ఆరోపం ప్రధానభాగంలో గాని అనుబంధంలోగాని ఎక్కడా కనబడదు. ఈ విషయాన్ని అక్కిరాజువారుగాని నిడదవోలువారుగాని గమనించినట్టు లేదు.

హితసూచని “Moral instructor in prose” అని ఇంగ్లీషు ముఖపత్రం చేప్తోంది. రంగప్రసాదరావు దీనిని ముద్రిస్తూ “కొన్ని విషయములను వచనరూపమున రచించి హితసూచని అని నామమిడిన గ్రంథము” అని విశదంచేశాడు. అయితే ముద్దునరసింహంగారు పుస్తకంలో ఎక్కడా ఇది వచనగ్రంథమనలేదు. ఆయన సాధించినవి వాక్యగ్రంథాలు మాత్రమే. ముద్దునరసింహంగారికి వచనానికి వాక్యానికిగల తేడా బాగా తెలుసు. తమ పుస్తకంలో వచనము, వచనములు అని వాడినచోట్ల ఆయన పురాణవచనాలను, శాస్త్రవచనాలను, స్మృతి, శ్రుతి వగైరా వచనాలనే ఉద్దేశించారు. (చూ. పుట 2, 192, 193.)

మన సాహిత్యంలో నన్నయ్యగారి కాలంనుంచీ వచన రచనా ధురీణులు లేకపోలేదు. అయితే ఆదినుంచీ వచనాన్ని రాగవరసలో పాడేవారు. కృష్ణమాచార్యుని సింహగిరి వచనాలు, తాళ్ళపాకవారి వేంకటేశ్వర వచనాలు ఇందుకు నిదర్శనం. యాగంటి లక్ష్మయ్యగారు పూర్తిగా పాటలే రాసినా వాటిని యాగంటివారి వచనాలని పేర్కొన్నారు. గంగుల సినఎల్లన్న కాటమరాజు కథను ద్విపద కావ్యంగా చెప్తూ “శ్రీనాథుని వచనా పద్ధతిని” దీనిని రచిస్తున్నానని చెప్పాడు. హరిభట్టు, లోకేరావు, సోమన మొదలైనవారు తమ కావ్యాలను “వచన కావ్యా”లుగా పేర్కొన్నారు. అవి పురాణ కథలు. గాన యోగ్యాలు. కిచ్చేలు తన కన్నడ నిఘంటువులలోనూ ఆప్టే సంస్కృత నిఘంటువులోనూ వచనం అంటే To requite అనే అర్థాలు కూడా ఇచ్చారు. ముద్దునరసింహంగారు కావాలనే “Prose” అనేమాటను వాక్యమనే పదాన్ని వాడారనుకోవాలి.

ముద్దు నరసింహంగారు తమ యింటిపేరును “స్వామినీన” అని రాసుకొన్నాడు. “నిడు” “నేడు” అనే పదాలు ఆదిలో కమ్మవారిలో బిరుదుపేర్లు. నాయుడు అన్నమాటకు సరిపోయే పదాలు వ్యక్తుల పేర్లలో చివర “నీడు” “నేడు” అనే పదాలు కనబడతాయి. కానీ ఇంటిపేర్లలో మాత్రం ఈ ‘డుమంత’ పదాలకు ‘న’, ‘ని’ అనే విభక్తులు ‘డు’ స్థానంలో వస్తాయి. మన తెలుగు నిఘంటువులలో “నేడు” అనే మాటకీ అర్థాన్ని ఇచ్చారు. బ్రౌను “నీడు” అనే మాటకు అర్థం చెప్పాడు.

నీడు: M.S. A title added to names of men of the kamma cast as అంకినీడు etc.
నేడు: A baron, petty chieftain.

ముద్దునరసింహంగారి మూలపురుషునిపేరు “స్వామినీడు.” అతని వంశంవారిని స్వామినీనవారు అని పిల్చుకొనేవారు. ఆమాటలోని చివరి “న”కారం శేష షష్ఠికి బదులు వచ్చే ప్రత్యయం. చిన్నయసూరి తన బాలవ్యాకరణం తత్సమ పరిచ్ఛేదంలో 11వ నెంబరు సూత్రంగా “డుమువున లేక వచనంబులు” అని చెప్పి “న” ఏకవచనానికి ఉదాహరణ ఇవ్వనే ఇవ్వలేదు. 23వ సూత్రంలో “డుమంతంబునకు ద్వితీయాద్యేకవచనంబు పరంబగునపుడు నిగాగమంబు సర్వత్ర విభాష నగు” అని చెప్పి వృత్తిలో “సర్వత్ర యనుట నగాగమ బాధనార్థము” అని వివరించాడు. “ఉకారాంత జడానికి నవర్ణకంబగు” (కారక. 18) అని చెప్పాడు. ఈ నవర్ణకం చాలావిభక్తులలో వస్తుంది. “ఒకనొకచో నొక విభక్తికి మఱియొక విభక్తియు నగు” (కారక. 21) అని ఒక బ్లాంకెట్‌ సూత్రంకూడా ఉంది. తెలుగు కారకం సంస్కృత మర్యాదలకు లొంగదు.

ముద్దు నరసింహంగారు “స్వామినీన” అనే స్పెల్లింగుతో తమ ఇంటిపేరు రాసుకొన్నా, వారి మునిమనుమడు ముద్దుకృష్ణ మాత్రం “సామినేని” అనే తన వ్యాసంలో పేర్కొన్నాడు. ఈమాటలో “స్వా” అనే సంయుక్తాక్షరం కాకుండా ఉత్త “సా” ఉండడం గమనించతగ్గ విషయం. ముద్దుకృష్ణ చిరకాలవాంఛితం అతని జీవితకాలంలో నెరవేరలేదుగాని ఇప్పుడు రాజమహేంద్రిలోని ఆంధ్రకేసరి యువజన సమితివారి ధర్మమా అని “హితసూచని” పునర్ముద్రణ పొందింది. ఇది సత్కార్యము. ఇందుకు పూనుకొన్నవాళ్ళంతా శ్లాఘనీయులు.

ముద్దునరసింహంగారు ఈ వాక్యగ్రంథంలో వెలిబుచ్చిన అభ్యుదయ భావాలు గొప్పవి. ఆయన వేగుచుక్క.డ మూఢాచారాలు, అంధవిశ్వాసాలు చిమ్మచీకట్లలాగ ఆవరించిన నిశాంత సమయంలో ఇంక అరుణోదయం కాబోతోందని చాటే వెలుగుల చుక్క. ఇహలోక విరుద్ధులైన వాటిని ఆయన తోసిపుచ్చిన హేతువాది. ఆడపిల్లలకు రజస్వలానంతరమేకాక పూర్ణవయస్సు వచ్చాక వాళ్ళ ఇష్టంతోనే పెళ్ళిచేయాలని సప్రమాణంగా వాదించిన దిట్ట. దెయ్యాలూ భూతాలూ దివ్యదృష్టి వగైరాలను తూర్పారబట్టిన గట్టివాడు. ఇతర లోహాలను బంగారం చేయడం అసంభవమని రుజువు చేసిన వేత్త. వాడుకభాషలో వాక్యగ్రంథాలకు బహుశా ఆద్యుడు.

“గ్రంథములు సత్త్వరజస్తమో గుణాత్మకములైయున్నవి” అని ఆదిలోనే చెప్పి ఈగుణములలో సత్త్వగుణమే ముఖ్యముగా గ్రహించదగ్గదని నూటముప్పైరెండు సంవత్సరాల కిందట బోధించాడు. ఇవాళ తెలుగు సాహిత్యంలో రజస్తమోగుణాత్మకమైన రచనలే కొల్లలుగా వస్తున్నాయి. ఆనాడే చీల్చి చెండాడిన పిశాచాలను ఈనాడు క్షుద్ర సాహిత్యకారులు మళ్ళా రెక్కపట్టుకు తీసుకువస్తున్నారు. సత్త్వగుణ ప్రధానమైన హేదువాద రచనలు సృజనాత్మకరంగంలోకూడా ఇవాళ చాలా అవసరం.

ముద్దునరసింహంగారి మీదా వారి హితసూచనిమీదా సమర్థు లెవరైనా పిహెచ్‌.డి. సిద్ధాంతగ్రంథం రాస్తే ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ మంచిపని ఎప్పుడు జరుగుతుందో మరి.

ఆరుద్ర.

THE
HITHA SOOCHANEE

OR

MORAL INSTRUCTOR
IN PROSE

PRIPARED BY

SWAMYNEENA MUTHOONARASIMMAH NAIDU
LATE FIRST CLASS DISTRICT MOONSIFF
RAJAHMUNDRY.

AND

PUBLISHED BY HIS SON

SWAMYNEENA RUNGAPRASAWD NAIDOO
AG GOVERNMENT VAKEEL IN THE DISTRICT
OF RAJAHMUNDRY.

MADRAS:
PRINTED AT THE JOTHESHKALANITHEE PRESS
July – 1862

శ్రీరస్తు
శ్రీమతే జగన్నాథాయనమః
ఈ లోకమునందు సకల శ్రేయస్కరంబులకు సాధకంబులగు సుగుణ వివేకసంపత్తులకు వలసిన చర్చవిషయము లనేకము లుండినను
వానిలోని కొన్ని విషయములు
ప్రజలకు సుబోధ యగునట్లు ముద్రాక్షరాంకితములుగ జేయకుండెడి లోపమును వారింపవలయునని
మహోపకారులగు
రాజమహేంద్రవరపు జిల్లా ఫస్టుక్లాసు డిస్ట్రిక్టు మునసఫుగా నుండిన స్వామినీన ముద్దునరసింహనాయనివారు
యోచించి ముఖ్యావశ్యకములగు కొన్నివిషయములను
వచనరూపముగ రచించి
హితసూచని
అను నామమిడిన గ్రంధమును వారి సుపుత్రులగు
రాజమహేంద్రవరపు జిల్లా ఆక్టిన్‌ గవర్నమెంటు వక్కీలు
సామినీన రంగప్రసాదు నాయనివారి వలన
జ్యోతిష్కళానిధి ముద్రాక్షరశాలయందు
అచ్చువేయించి ప్రచురింపబడినది.
దుందుభి సంవత్సర శ్రావణమాసము.
౧౮౬౨ సం॥ జులై నెల.
శ్రీ
పీఠిక

౧. స్త్రీలకు విద్యలు సాధకములౌచున్నవి. విద్యలు నేర్చుకొనుటకు హిందూదేశములో గ్రంధములు మిక్కిలీ సదుపాయముగా నేర్పడియున్నట్టు కొందరెంచుకుంటున్నారు కాని యిదివరకు ఏర్పడియున్న గ్రంధములు ఏమి వాటిని బాలురకు చెప్పించే పద్ధతులు ఏమి యెవరెవరిచేత జరిగించబడుచున్న కృషికి తగినఫలములు ఇవ్వడములేనందుననున్ను [1] శరీరారోగ్యమునకు జురూరైన వైద్యాంశములను గ్రహించడము సర్వత్ర ముఖ్యకార్యమై యున్నప్పటికిన్ని హిందూ జనులయందు అందునగురించి ఉపేక్ష చెయ్యబడుచున్నందుననున్ను [2] సంభవించతగని కార్యములు కొన్ని సంభవించుచునట్టున్ను [3] తెలియతగని సంగతులు కొన్ని తెలియుచున్నట్టున్ను [4] న్యాయవిరుద్ధ కార్యములుకొన్ని న్యాయములుగానున్నట్లున్ను [5] హిందూలలో చాలామంది నమ్ముచున్నందుననున్ను వారికి వ్యర్థ వ్రయమున్ను వ్యర్థ కాలక్షేపమున్ను అసౌఖ్యమున్ను హానియున్ను కలుగుచున్నవి – ఐతే గ్రంధములు బహుశః ఛందోబద్ధముగా నేర్పడియుండడము వల్లనున్ను [6] పురాణాదులయందు వాస్తవములైన సంగతులున్ను అవాస్తవములైన సంగతులున్ను సమస్థితిగా చేర్చబడి యుండడము వల్లనున్ను [7] వాటియందలి వాస్తవములను అవాస్తవములను విభజించే సదుపాయములులేకుండా నుండడమువల్లనున్ను ధర్మశాస్త్ర సంబంధములయిన గ్రంధములు కొన్ని కొన్ని యంశములయందు ఒకదానికొకటి భేదించియుండే నిర్ణయములు గలిగి నానా విధములుగా పుట్టుచూవచ్చి వాటి పద్ధతులు కొన్ని తరువాత పుట్టినవాటిలో వాటిని రచించినవారి యిష్టానుసారముగా దిద్దుబాటు చెయ్యబడుచూ అనేక గ్రంధములు ఏర్పడియున్నందుననున్ను [8] పురాణాదులనున్ను ధర్మశాస్త్ర గ్రంధములనున్ను మరిన్ని చిక్కుపరచే యుద్దేశముగలవారు కొందరు వచనమునుగాని వచనములనుగాని కల్పించి కొన్ని గ్రంధములలో చేర్చి యుండడమువల్లనున్ను [9] విద్యలు సులభముగా రాకపోవడమునకున్ను శరీరారోగ్యమునకు జురూరైన సంగతులు బాగా తెలుసుకునేవాడిక లేకపోవడమునకున్ను అవాస్తవములైన సంగతులను కొన్నిటిని వాస్తవములైనవిగానున్ను అన్యాయములైన సంగతులను కొన్నిటిని న్యాయములైనవిగానున్ను నమ్మడమునకున్ను హేతువులు కలుగుచున్నవి ప్రబంథఃకల్పనాకథా యనెడిన్ని నిరంకుశాః కవయః అనెడిన్ని వాడికలుకూడా గ్రంధములో కల్పితములైన సంగతులు చేరియున్నందుకున్ను ఒకదానికొకటి భిన్నముగానుండే పద్ధతులతో గ్రంధములుపుట్టుచూ రావడమునకు వాటినిరచించిన వారి యభిప్రాయములే కారణములై యున్నందుకున్ను [10] దృష్టాంతములైయున్నవి గనుక సదరు అంశములను గురించి నాకు కలుగుచున్న అభిప్రాయములను తగుమాత్రముగా సూచించుటకు అనుకూలముగా నుండునని తోచుచున్న యెనిమిది ప్రమేయములనగా విద్యాప్రమేయము – వైద్యప్రమేయము – సువర్ణప్రమేయము – మనుష్యేతరజంతుసంజ్ఞాప్రమేయము – రక్షఃప్రభృతిప్రమేయము – మంత్రప్రమేయము – పరోక్షాదిజ్ఞానప్రమేయము – వివాహప్రమేయమున్ను – ఈ పుస్తకమందు వివరించబడుచున్నవి.

౨. పదవ్యాపారమునకు ఏర్పరచబడేహద్దులు భాషను రచించడమునకున్ను లిఖించడమునకున్ను సాధ్యమైనంత సులభముగా నుండవలసినది అవశ్యమైయున్నది ఆంధ్రభాషయందు కొన్నిపదములలో నొకానొక యక్షరమునకు అర్ధానుస్వార చేరియుండడము జురూరైనట్టు లక్షణగ్రంధములయందు చెప్పబడియున్నది కాని అటువంటి చాలా పదములు ఇప్పట్లొ అర్ధానుస్వార లేకుండానే సాధారణమైన భాషయందు వాడిక చెయ్యబడుచున్నవి – పదవ్యాపారమందు హద్దులు ఏర్పరచడమునకు దేశముయొక్క వాడికయున్ను నీతియున్ను ఆధారములైయుండవలసినది గనుకనున్ను వాఁడు వీఁడు అనేపదములు ఉచ్చారణ యందున్ను వాక్యగ్రంధముల లిపియందున్ను వాడు వీడు అని వాడిక చెయ్యబడుచున్నవి గనుకనున్ను ఈ వాడిక ఉచ్చారణకున్ను లిపికిన్ని సులభముగా నున్నదిగనుకనున్ను – అటువంటి పదములు వాడికకు అనుగుణముగానే యీ పుస్తుకమందు వ్రాయబడుచున్నవి – శకటరేభయనే యక్షరము కొన్ని పదములలో చేరియుండవలసినట్టుకూడా లక్షణగ్రంధములలో చెప్పబడియున్నది కాని అటువంటి పదములలో రేభనుచేర్చినా శకటరేభను చేర్చినా అర్థము ఒకటి ఐయుంటున్నది కనుకనున్ను రేభ శకటరేభలకు ఉచ్చారణయందు భేదమేమీ కనుపడడములేదు గనుకనున్ను అటువంటి చాలాపదములు వాక్యగ్రంధములయందు ఇప్పట్లో శకటరేభలేకుండానే రేభను చేర్చి వ్రాయబడుచున్నవి గనుకనున్ను అందఱు–కొందఱు బొఱ్ఱ–గుఱ్ఱము అనే పదములు – ఈ ప్రకారము శకటరేభతో వ్రాయడముకంటె అందరు–కొందరు బొర్ర–గుర్రము అని రేభతోనే వ్రాయడము లిపికి సులభముగా నున్నది గనుకనున్ను ఏకరీతిగా పలుకవలసిన పలుకులలో నొకదానికి ఒకయక్షరమున్ను మరియొక దానికి ఇంకొక యక్షరమున్ను వ్రాయవలసియుండడము అధికమైన చికాకుకలుగడమునకు కారణమౌ చున్నదిగనుకనున్ను రేభ శకటరేభలలో రేభయనే వర్ణమే రవర్ణోచ్చారణగల అన్ని పలుకులకున్ను చిహ్నమయి యుండతగియున్నదిగనుకనున్ను ఈ పుస్తకములో అటువంటి పలుకులన్నీ రేభతోనే వ్రాయబడుచున్నవి – వాక్యగ్రంధములయందు కొందరు సంధి యశ్రుతి మొదలైనవాటినియమములను అనుసరించి వ్రాయుచున్నారు కాని ఆంధ్రదేశమందు ఆంధ్రభాషను బహుశః సంధి మొదలయినవాటి నియమములేకుండానే భాషించడమున్ను వాక్యగ్రంధములయందు వ్రాయడమున్ను వాడికయైయున్నది యీ పద్ధతి సులభముగానున్ను రమ్యముగానున్ను భాషను రచించడమునకు సదుపాయమై యున్నట్టు నాకు తోచుచున్నది గ్రామ్యోక్తి ఆంధ్రభాష తాలూక్‌ అంశములలో నొకటిగా లక్షణగ్రంధములయందు చెప్పబడియున్నది యీ పదములు ఛందోబద్ధములైన గ్రంధములయందు చేర్చడము అరుదైయున్నదిగాని వాక్యగ్రథములయందున్ను భాషయందున్ను వీటి వాడిక తరుచైయున్నది యిందువల్ల భాషా రచన మిక్కిలీ ధారాళముగా నుంచున్నదిగనుక సాధారణమయిన భాషయందు వాడికలోనున్న గ్రామ్యపదములు చాలామట్టుకు సరసమయిన వాక్యరచనలో నంగీకరించ తగినవిగా నేను ఎంచుకుంటున్నాను.

[1] ప్రధమ ప్రమేయము తాలూక్‌ మూడవపేరా చూడవలసినది.
[2] రెండవ ప్రమేయము తాలూక్‌ ౧౨ పేరాలు చూడవలసినది.
[3] ౩-౪-౫-౬ ప్రమేయములు చూడవలసినది.
[4] సప్తమ ప్రమేయము తాలూక్‌ పూర్వభాగమున్ను ౮దో ప్రమేయములో ప్రత్యుత్తరము తాలూక్‌ ౫దవ పేరానున్ను చూడవలసినది.
[5] ౮దో ప్రమేయములోని అభిప్రాయము తాలూక్‌ మూడవ పేరా చూడవలసినది.
[6] విద్యాప్రమేయము తాలూక్‌ మూడవపేరా చూడవలసినది.
[7] మనుష్యేతరజంతుసంజ్ఞాప్రమేయము తాలూక్‌ ముంగికథయున్ను – కేకయ మహారాజు కథయున్ను మంత్రప్రమేయములోని తక్షకప్రశంసయున్ను చూడవలసినది.
[8] వివాహప్రమేయములోని ప్రత్యుత్తరము తాలూక్‌ ఐదు ఆరు పేరాలు చూడవలసినది.
[9] డిటో
[10] వివాహప్రమేయముయొక్క ప్రత్యుత్తరము తాలూక్‌ ఐదు – ఆరు పేరాలున్ను అభిప్రాయము తాలూక్‌ మూడవ పేరానున్ను చూడవలసినది.

ప్రమేయములు పేరాలు గ్రంధసూచి

విద్యాప్రమేయములు
1. విద్యల యొక్క గ్రంధముల యొక్క ప్రశంస.
2. లోక శ్రేయస్సుకొరకు గ్రంధములు రచించబడ వలసినదనుట.
3. ఏ గ్రంధమైనా విద్యార్థులకు సులభముగా బోధకాతగినట్లు ఉండవలసినదనిన్ని ఛందోబద్ధములైన గ్రంధములవల్ల వారికి బాగా కిఫాయతు కలుగడము లేదనిన్ని.
4. శాస్త్రములయొక్క ఇతరాంశములయొక్క గ్రంధములు సులభముగా తెలియతగినట్టు ఏర్పరచవలసినపద్ధతిన్ని విద్యాభ్యాసము చేసే క్రమమున్ను.
5. సదరు గ్రంధములు ఏర్పడడమునకు సదుపాయములు.

వైద్యప్రమేయములు
1. మనుష్యుడు వైద్యాంశములు గ్రహించియుండడము జురూరైనందుకు సబబులున్ను హిందూవైద్యులు బహుశః శాస్త్ర పరిశ్రమ లేకుండానే వైద్యము చేస్తున్నారన్న సంగతిన్ని.
2. రసవిషాదుల వైద్యముకంటె మూలికావైద్యము శ్రేష్ఠమైనిన్ని చికిత్సలు సాధ్యమైనంతమట్టుకు సౌమ్యముగా జరిగించడము యుక్తమనిన్ని.
3. కొన్ని వైద్యాంశములు గ్రహించిన విద్యార్థులలో ఇచ్ఛగలవానికి వైద్యములుబాగా నేర్పవలసినందుకు సదుపాయములు.
4. రోగోత్పత్తికారణములు మొదలైన వాటిసంగతిన్ని వమన విరేచనజాడ్యము మరిడీ దేవతవల్ల వస్తుందనేవాడిక వాస్తవమైనది కాదన్న సంగతిన్ని.
5. సదరు జాడ్యమునకున్ను ఇంకా యితరములైన విరేచన జాడ్యములకున్ను ఉపయోగమయిన యొక ఔషధయోగము.
6. సదరు ఔషధము తాలూక్‌ ఒకటో నంబరు మాత్రలు ఇవ్వవలసిన నిమిత్తములున్ను క్రమమున్ను.
7 డిటో – రెండు – మూడు నంబర్ల మాత్రలు ఇవ్వవలసిన నిమిత్తములున్ను క్రమమున్ను.
8 డిటో – నాలుగవ నంబరు మాత్రలు ఇవ్వవలసిన నిమిత్తములున్ను – క్రమమున్ను.

సువర్ణప్రమేయము
1 సువర్ణము చేసేవిద్యను సాధించవలెనని చాలామంది ప్రయత్నము చేసి మోసపోతున్నారనిన్ని రాగి బంగారము చెయ్యబడనేరదనిన్ని.
2 స్పర్శవేదివల్ల ఇనుము బంగారమౌతుందనే వాడికను గురించి.
3 ఒక శాణారవాడు బంగారము చేసినాడన్న వాడికను గురించి.

మనుష్యేతరజంతుసంజ్ఞాప్రమేయము
1 మనుష్యునకు భిన్నములైన జంతువులు ఒకదాని భావమును మరియొకదానికి తెలియ చెయ్యడమునకు సంజ్ఞలే ఆధారములై యున్నవి – గాని వాటికి భాష లేదన్న సంగతి.
2 ఒక యేడారి స్థలమందుండి న్యాయార్జితద్రవ్యముచేత ధర్మము జరిగించినాడన్న గృహస్థుని యొక్క కథ.
3 ఆ గృహస్థు యింటి సమీపమందు నివసించియుండినదన్న ముంగియొక్క ప్రశంస.
4 సదరు ప్రశంస సంగతులు వాస్తవముగా నడిచినని కావనుట.
5. ఈ కథయందు కనుపర్చడమునకు ఉద్దేశించబడ్డ నీతియుక్తులయొక్క వివరము.
6. కేకయ మహారాజుకు చీమలు మొదలయిన వాటియొక్క భాష తెలిసియుండినదన్న కథ.
7. ఈ కథ వాస్తవముగా జరిగినది కాదన్న సంగతి.
8 ఈ కథయందు కనుపర్చడమునకు ఉద్దేశించబడ్డ నీతియుక్తులయొక్క వివరము.

రక్షఃప్రభృతిప్రమేయము
1 చనిపోయినవారు రక్షస్సులు వగైరాలు ఔతారని కొందరికి కలిగియున్న నమ్మకము పొరబాటైనందుకు సబబులు.
2. ఒక బ్రాహ్మణుడు కొర్తిమీదనుండి వివాహము చేసుకున్నాడన్న కథ.
3. సదరు రక్షస్సులు మొదలైనవి మనుష్యనివాసములయందు నివసిస్తవియనే వాడిక వాస్తవమైనది కానందుకు సబబులు.
4. అవి కొందరిని ఆవహిస్తవియనే వాడికయున్ను నిజముకానిదైనందుకు హేతువులు.
5. జగదీశభట్టాచార్యుల ప్రశంస.

మంత్రప్రమేయము
1. మంత్రములయందు ప్రత్యక్ష ఫలములు కలవనే నమ్మకము పొరబాటైనందుకు హేతువులు.
2. మౌసల్‌దేశపు రాజుకథ.
3. పరకాయ ప్రవేశమయ్యే సామర్థ్యము మనుష్యునకు కలుగనేరదన్న సంగతి.
4. ఈ కథయందు కనుపర్చడమునకు ఉద్దేశించబడ్డ నీతియుక్తులయొక్క వివరము.
5. శంకరాచార్య స్వాములవారి కథ.
6. బగ్దాద్‌ పట్టణస్థుని కథ.
7. ఈ కథయందున్న వింతకార్యములు సంభవించతగ్గవి కావన్నసంగతి.
8. ఈ కథయందు కనుపర్చడమునకు ఉద్దేశించబడ్డ నీతియుక్తులయొక్క వివరము.
9. తక్షక ప్రశంస.
10. ఈ ప్రశంసలో జరిగినవన్న వింతకార్యములు సంభవించతగ్గవి కావన్న సంగతి.
11. ఈ ప్రశంసయందు కనుపర్చడమునకు ఉద్దేశించబడ్డ నీతియుక్తులయొక్క వివరము.

పరోక్షాదిజ్ఞానప్రమేయము – పూర్వభాగము.
1. మనుష్యునకు దివ్యదృష్టి కలుగడము అసంభవమైనందుకు హేతువులు.
2. మనుష్యునకు ఆకళింపులో రాకుండానున్న సంగతులయొక్క తెలివి దేవతోపాసనచేత కలుగుతుందనడము వాస్తవమైనది కానందుకు సబబులు.
3. జ్యోతిశ్శాస్త్రముయొక్క జాతకముహూర్త భాగములవల్లనున్ను సాముద్రికశాస్త్రము మొదలైనవాటివల్లనున్ను భవిష్యత్సంగతులు కనిపెట్టబడుతున్నవి యనడము నిశ్చితమైనది కానిదైనందుకు హేతువులు.
ఉత్తరభాగము.
1. నిరీశ్వరవాదమును గురించిన ప్రశంస.
2. ఈశ్వరుడు అగుణుడనే వాడికను గురించిన సంగతి.
3. భగవంతుని అనుగ్రహమును గురించిన ముఖ్యసాధనముయొక్క ప్రశంస.

వివాహప్రమేయము (వివాహమర్యాదను గురించిన ప్రశ్న తాలూక్‌.)
1. వివాహమునకు ప్రధానాప్రధాన సంగతుల వివరము.
2. బ్రాహ్మణులు వగైరాలు వివాహములు జరిగించే మర్యాదను గురించిన్ని కన్యాదానము చెయ్యడమును గురించిన్ని.
3. ప్రశ్నభావము.
ఉత్తరము తాలూక్‌
1. గాంధర్వవివాహమునకు మాత్రమే పరస్పరేచ్ఛ జురూరనిన్ని యిప్పట్లో పరస్పరేచ్ఛనుపట్టి వివాహములు చెయ్యడము లేదనిన్ని.
2. వివాహ సంధికాలమందు చెప్పించుచున్న మంత్రముల అర్థమును గురించి.
3. స్త్రీలకు స్వాతంత్య్రము లేదన్న సంగతి.
4. బాలికలకు వివాహము చేసే ఆచారము బ్రాహ్మలు దరిమిలాను ఏర్పరుచుకోలేదనిన్ని వారిలో ఆడపిల్లలయొక్క 10-9-8 సంవత్సరములయందు మాత్రమే వివాహము చెయ్యవలసినది విధి అనిన్ని.
5. 8-9-10 సంవత్సరముల యీడుగల ఆడపిల్లలనున్ను అంతకు మిగిలిన యీడుగల ఆడపిల్లలనున్ను దానములు చేస్తే కలుగుతవనే ఫలముల వైనము.
6. సమస్త–వర్ణముల వారికిన్ని చిన్నదానియొక్క యెనిమిదో సంవత్సరములోనే కన్యాదానము చెయ్యడము యోగ్యమన్న సంగతి.
వివాహము యెప్పుడు చేసినా అదృష్టమే ప్రధానముగా జరుగుతుందన్నసంగతి.
1. గాంధర్వ వివాహమునకు మాత్రమే పరస్పరేచ్ఛ జురూరన్నందుకున్ను ఇప్పట్లో పరస్పరేచ్ఛనుపట్టి వివాహములు చెయ్యడము లేదన్నందుకున్ను ప్రత్యుక్తి.
2. వివాహ సంధికాలమందు చెప్పించుచున్న మంత్రములకు వ్రాసిన అర్థమును గురించిన ప్రత్యుక్తి.
3. స్త్రీలకు స్వాతంత్య్రము లేదన్నందుకు ప్రత్యుక్తి.
4. బాలికలకు వివాహము చేసే ఆచారము బ్రాహ్మణులు దరిమిలాను ఏర్పరుచుకోలేదన్నందుకున్ను వారిలో ఆడపిల్లయొక్క 10-9-8 సంవత్సరములయందు మాత్రమే వివాహము చెయ్యవలసినది విధి అన్నందుకున్ను ప్రత్యుక్తి.
5. 8-9-10 సంవత్సరముల యీడుగల ఆడపిల్లలనున్ను అంతకుమిగిలిన యీడుగల ఆడపిల్లలనున్ను దానములుచేస్తే ఫలములు కలుగుతవి యన్నందుకు ప్రత్యుక్తి.
6. సమస్త-వర్ణముల వారికిన్ని చిన్నదాని యొక్క యెనిమిదో సంవత్సరములోనే వివాహము చెయ్యడము యోగ్యమన్నందుకు ప్రత్యుక్తి.
7. వివాహము ఎప్పుడు చేసినా అదృష్టమే ప్రధానముగా జరుగుతుంది అన్నందుకు ప్రత్యుక్తి.
అభిప్రాయము
1. బాలికలకు వివాహము చేసేలాగు ఏర్పరచుకున్న ఆచారము ద్రవ్యము పుచ్చుకుని చిన్నదాన్ని వివాహమునకు ఇచ్చే ఆచారమును కలుగచేసినదన్న సంగతి.
2. చిన్నది రజస్వల యైనతరువాత కన్యయొక్క చిన్నవానియొక్క పరస్పరేచ్ఛ కనిపెట్టి వివాహము చెయ్యడము యుక్తకార్యమన్న సంగతి.
3. సదరు ప్రకారము వివాహము చెయ్యడమును గురించిన్ని స్త్రీకి పునర్వివాహము చెయ్యడమును గురించిన్నీ.

శ్రీమజ్జగన్నాథాయనమః
హితసూచని
విద్యాప్రమేయము

౧ – విద్యలు సమస్త ప్రయోజనములకు ఆవశ్యకములై యున్నవి, అవి గ్రంధ స్వరూపములై యున్నవి, గ్రంధములు సత్వరజస్తమోగుణాత్మకలై యున్నవి, ఈ గుణములలో సత్వగుణమే ముఖ్యముగా గ్రహించతగ్గదై యున్నది, గ్రంధములయందుండే యుక్తిన్ని నీతిన్ని సత్వగుణోద్భవములై యున్నవి. మిగిలిన యంశములు రజస్తమోగుణాత్మకములుగా నెంచతగి యున్నవి, విద్యార్థులు యుక్తినిన్ని నీతినిన్ని గ్రహించేటటువంటిన్ని, జ్ఞాపకము ఉంచుకునేటటువంటిన్ని, అభ్యాసమును చేయుచునుండేవారికి విద్యలు సులభముగా స్వాధీనపడగలవు, గనుక, చదువు చెప్పేవారు ప్రతిసంగతి యందున్ను నీతియుక్తులను ఏర్పరచి విద్యార్థులకు కనుపరుస్తూ నుండవలసినది.

(శ్లోకము)
అనంతశాస్త్రం బహువేదితవ్య మల్పశ్చకాలో బహవశ్చ విఘ్నాః।
యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబుమిశ్రం.

అభిప్రాయము॥ అనంతశాస్త్రం – శాస్త్రములు అనంతముగానున్ను బహువేదితవ్యం – మిక్కిలీ మెహనతుచేసి గ్రహించతగ్గవిగానున్ను ఉన్నవి, కాలః – మనుష్యనియొక్క జీవితకాలము, అల్పశ్చ – అల్పమైనదిగానున్ను, విఘ్నాః – విద్యావిఘ్నములు, బహవశ్చ – అనేకములుగానున్ను ఉన్నవి గనుక యత్‌ – ఏది, సారభూతం – సారాంశమైనదో, తత్‌ – అది, అంబుమిశ్రం – ఉదకముతో కూడియున్న, యథాక్షీరం – శుద్ధ క్షీరమునకును, హంసఇవ – హంసము ఏ ప్రకారము విడతీసి గ్రహిస్తుందో ఆప్రకారమే, ఉపాసితవ్యం – బుద్ధిమంతునిచేత గ్రహించతగ్గదైయున్నది, అని చెప్పబడ్డది గనుక ఏ గ్రంధమందైనా సారభూతమైన నీతినిన్ని యుక్తినిన్ని విద్యార్థులు ముఖ్యముగా గ్రహించవలసినది, ఇందువల్ల వారు క్రమక్రమముగా పండితులౌతారు వారి వాక్యములు లోకమునకు శ్రేయః ప్రదములౌతవి, యే భాషయందైనా విద్యార్థి యెంత చదివినా గ్రంధములు రచించనేర్చినా యుక్తాయుక్తములను వాస్తమును అవాస్తవమును నిదానించడమునకు ఉపయోగమైన యోగ్యతకూడా కలిగినమీదటగాని పండితుడని యెంచబడడు.

౨ – విశ్వశ్రేయః కావ్యం అనే న్యాయముచేతను లోకులయొక్క శ్రేయస్సు కొరకు గ్రంధముల నేర్పరచడము ఆవశ్యకమైయున్నది బుద్ధిమంతులు విద్యావంతులు ఐయుండి ఉపకారబుద్ధిచేత గ్రంధములు చేసేవారు సదరు నిమిత్తమును కనిపెట్టి వాస్తవమును అవాస్తవమును యుక్తాయుక్తములను తెలియడమునకు అనుకూలముగా నుండేలాగు గ్రంధములు రచించడము న్యాయమైయున్నది. యుక్తాయుక్తకార్యములను తెలియచేసే గ్రంధముగాని వచనముగాని ఎంతఖ్యాతిగలవారు రచించినదై నప్పటికిన్ని యుక్తియుక్తముగా నుంటేగాని అంగీకరించతగ్గది కాదు.

(శ్లోకం)
యుక్తియుక్తం వచోగ్రాహ్యం బాలాదపి సుభాషితం
వచనం తుత్తునగ్రాహ్య మయుక్తంతు బృహస్పతేః.

అభిప్రాయము, సుభాషితం సుష్ఠుగా పలుకబడ్డటువంటిన్ని యుక్తియుక్తం– యుక్తితో గూడుకున్నటువంటిన్ని, వచః–వాక్యము, బాలాదపి–బాలునివల్లనైనా, గ్రాహ్యం–గ్రహించతగ్గది, అయుక్తం–సుష్ఠుగా పలుకబడనటువంటిన్ని యుక్తి హీనమైనటువంటిన్ని వచః–వాక్యము, బృహస్పతేస్తు–బృహస్సతివల్లనైనా, నగ్రాహ్యం– అంగీకరించతగ్గది కాదు, అటువంటి ఏ వచనమైనా ఏ గ్రంధమైనా రచించే మనిషి అందలి వాస్తవము తనకు తెలిసియుండి అందువల్ల లోకులకు శ్రేయస్సు కలుగుతుందని తనకురూఢిగా తోచినపక్షమందు అది వాస్తవమైనదిగా కనుపడేలాగురచించవచ్చును ఒకవేళ వాస్తవముకాని సంగతినియైనా నీతిని యుక్తిని కనుపరచే కొరకు కల్పించి రచించే పక్షమందు అది అటువంటిదిగానే కనుపడేలాగు రచించవచ్చునుగాని తనకు తెలియనటువంటిన్ని వాస్తవము కానటువంటిన్ని లోకుల కిఫాయతు కొరకు ఉపయోగముకానటువంటిన్ని అసందర్భమైనటువంటిన్ని వచనమునైనా వాస్తవములైనవిగానున్ను కిఫాయతు గలవిగానున్ను కనుపడేలాగు రచించకూడదు. అట్లా రచించడముచేత లోకులు ఆ అభిప్రాయములను నమ్మి తప్పితములు జరిగించి చెడిపోవడమునకున్ను అటువంటి అభిప్రాయముల నేర్పరచినవారికి పాపము రావడమునకున్ను హేతువులు కలుగుచున్నవి.[1]

౩ – ఏ గ్రంధమైనా చదువుకునేవారికి సులభముగానున్ను త్వరితముగానున్ను సందేహములు లేకుండానున్ను బోధపడేలాగున నుండవలసినది ఆవశ్యకమైయున్నది, గనుక గ్రంధములు పండితపామరసాధారణముగా నుండేలాగు రచించవలసినదిన్ని ఛాపా వేయించవలసినదిన్ని న్యాయమై యున్నది, విశేషించిన్ని హిందూలలో గానమున కావశ్యములైన గ్రంధములుతప్ప తతిమ్మావి సులభముగా తెలియతగినట్లు వాక్యగ్రంధములుగా దేశభాషలలో నుండడము యుక్తమని నాకుతోస్తున్నది, ఎందుచేతనంటే ఛందోబద్ధమైన గ్రంధము రచించేటప్పుడు అది రచించే మనిషియొక్క బుద్ధి ఛందస్సును కుదుర్చు కోవడమందు కూడా సక్తమైయుంటుంది గనుక ఆమనిషి తనఅభిప్రాయమును సులభముగా బోధపడేలాగు రచించడమునకు వల్లముండదు ఛందోరూపకమైన గ్రంధము సులభముగానున్ను త్వరితముగానున్ను సందేహములు లేకుండానున్ను బోధకాదు, హిందూదేశములలో గ్రంధములుచాలామట్టుకు ఛందోబద్ధముగా నుండడముచేతనున్ను కొన్నిశాస్త్రములు వాక్యగ్రంధములుగానున్నా సంస్కృతభాషలో నుండడముచేతనున్ను మిక్కిలీ కఠినముగా నుండడముచేతనున్ను పండితసామరసాధారణముగానుండే వాక్యగ్రంధములు లేకపోవడముచేతనున్ను హిందూదేశములవారికి విద్యలురావడము కఠినమైయున్నది, విశేషములై నటువంటిన్ని ఆవశ్యకములై నటువంటిన్ని అనేకశాస్త్రములయొక్క జ్ఞానము వారికి కలుగకనే పోతూవచ్చినది. ఇదివరకుఉండే ఛందోబద్ధములైన గ్రంధములు వాటిఅర్థము బాగాతెలియని వారిచేత బాలురకు చెప్పించేమర్యాద తరుచైయున్నది. ఆ గ్రంధములయొక్క అర్థము చెప్పేవారికే స్పష్టముగాకపోతూ నుండగా చదువుకునే వారికి బోధపడుతుందని ఎంచే వల్లలేదు బాలురు విద్యాభ్యాసమును చేయడమునకు లాయఖైయుండే కాలమంతా సదరుపద్ధతిచేత వ్యర్థముగా వినియోగమైపోతున్నది, వారు అభ్యసించే అంశములయొక్క అభిప్రాయమే తెలియకుండా చదువుకోవడమువల్ల అధికమైనశ్రమను పొందిన్ని విద్యను సాధించలేకుండానుంటున్నారు.

౪ – శాస్త్రములయొక్క గ్రంధములున్ను ఇతరాంశములను గురించిన గ్రంధములున్ను సులభముగా బోధపడేలాగు దేశభాషలలో వాక్యగ్రంధములుగా వ్రాయించి ప్రింటు వేయించి అవేబాలురకు చెప్పించే పక్షమందు బాల్యకాలములోనే శాస్త్రములయొక్క ఇతరములైన అంశములయొక్క జ్ఞానము వారికి త్వరగా కలుగడమునకు సందేహమేమియుంలేదు గనుక ప్రతిబాలునకున్ను ప్రపంచజ్ఞానము తగుమాత్రము కలిగినట్టుగానే విద్యాభాసము చేయించుటకు ఆరంభించి వానికి ఒత్తుడు తగలకుండా అనుకూలముగానుండే సదుపాయముచేత విద్యయందు వానిబుద్ధి ప్రవేశింపచేయవలసినది, బాలురకు అక్షరములయొక్క జ్ఞానమిన్ను వాటినికూర్చేశక్తిని సలక్షణముగా వచ్చేకొరకు అచ్చులుహల్లులు మొదలైన వాటి వివేకముతో ఒకపత్రిక వ్రాయించి అదిన్నిశబ్దశబ్దార్థములయొక్క జ్ఞానము వారికి కలుగడమునకు ఏయేదేశ భాషలయందు వాడికలోనుండే పదములలో వారుచ్చరించడమునకు అనుకూలముగా నున్ను అర్థావగాహన చేసుకోవడమునకు జురూరుగానున్ను ఉండే పదములు ఏర్పచి వర్గులుగానున్ను లక్షణక్రమముగాను (అనగా) నామవాచకాదిభేదముల వరుసనున్ను సులభముగా బోధకాతగిన ప్రతిపదములతో జాబితా వ్రాయించి అదిన్ని విభక్తులు మొదలైన హద్దులు వివరముగా తెలియడమునకు తగినప్రతికయొకటి వ్రాయించి అదిన్ని వాక్యరచనాసామర్థ్యము సలక్షణముగా కలుగడమునకు కర్తరిప్రయోగము మొదలైనవాటి వివరముగల పత్రికయొకటి వ్రాయించి అదిన్ని యొక పుస్తుకముగాచేర్చి అచ్చువేయించి వారికి క్రమముగా చెప్పించవలసినది, సాధారణముగా నుండే లెక్కలుకూడా చెప్పించవలసినది, ఆమీదట వైద్యముతాలూక్‌ కొన్నిఅంశములు ప్రతివిద్యార్థికిన్ని చెప్పించడము ఆవశ్యకమైయున్నట్టు నేను ఎంచుకుంటున్నాను, కొన్ని అంశములనగా మనుష్యునకు ముఖ్యముగా ఉపయోగించే వస్తువులపేర్లు వాటియెదుటను వాటి గుణములు వైనముతో వ్రాయబడ్డ జాబితానున్ను, నైసర్గిక విషవస్తువులపేర్లు వాటియెదుటను ప్రతివిషముల వైనముతోవ్రాయబడ్డ జాబితానున్ను, మనుష్యప్రవర్తనతో చేరిన స్నానపానాది కార్యములవైనమున్ను వాటియెదుటను వాటియందు సంభవించే గుణదోషములవివరమున్ను గల జాబితానున్ను ఏయేరోగములపేర్లు వాటియెదుట వాటిచిహ్నముల వైనముతో వ్రాయబడ్డ యొక జాబితానున్ను వస్తుకూట భక్షణము మొదలయిన వాటివల్లనున్ను ఏయేజంతువుల కాట్లుమొదలయిన వాటివల్లనున్ను కలిగే విషచిహ్నముల వైనమున్ను వాటియెదుటను ఆవిషముల చికిత్సలయొక్క వివరమున్నుగల జాబితానున్ను, ప్రతివిద్యార్థిన్ని చదివియుంటే అనేక నిమిత్తములయందు కిఫాయతు కలుగుతున్నది, గనుక సదరు ఐదు అంశముల సంగతులున్ను, స్వదేశ భాష తాలూక్‌ గ్రంధములయందున్న మట్టుకున్న భాషాంతర గ్రంధములవల్ల సాధ్యమైనంత మట్టుకున్ను, సంగ్రహించి సులభముగా బోధపడడమునకు తగినట్టు స్వదేశభాషను అనుకూలమైనంత ముక్తసరుగా వ్రాయించి అచ్చువేయించి చిన్నవాండ్లకు చెప్పించవలసినది, అందుమీద నీతిని చక్కగా విశదపరచే యొక గ్రంధము వాక్యరూపముగా నేర్పరచబడినది (చదివించవలసినది, యిది నీతిని గురించిన గ్రంధములవల్ల నేర్పరచబడవలసి యున్నది) మరిన్ని యీ హితసూచని అప్పుడేకాని ముందుచెప్పబడే గ్రంధములుకొన్ని చదివినమీదటగాని చెప్పించవచ్చును, తదనంతరము భూగోళశాస్త్రముయొక్క గణితశాస్త్రము తాలూక్‌ క్షేత్రముయొక్క లెక్కయొక్క సిద్ధాంతభాగముయొక్క మరిన్ని న్యాయశాస్త్రముయొక్క శారీరశాస్త్రముయొక్క వాక్యరూపములైన సంగ్రహములను ఏయే దేశభాషలచేత సంగ్రహించి అచ్చువేయించి చిన్నవాండ్లకు చెప్పించవలశినది, ఐతే, సంస్కృతము వగైరా భాషలయందు శారీరశాస్త్రము మొదలైనవి రచించబడి యున్నవి కాని ఆ గ్రంధములు బహు ప్రాచీనములైనవిన్ని దరిమిలాను పరిశీలనవల్ల తెలియవచ్చిన సంగతులచేత అభివృద్ధిని పొందించ బడనివిన్ని ఐయున్నందున వాటినిపట్టి యేయే దేశభాషలను సంగ్రహములు చెయ్యడము కంటే యింగిలీషున ఇప్పట్లో వాడికెలో నుండే జిఆగ్రఫి, జిఆమిత్రి, ఎరిధ్మిటిక్‌, ఎస్త్రాన్మో, మి, ఫిలాస్సాఫి, ఎనాట్టొమి, అనే గ్రంధములయొక్క సంగ్రహములు ఏయే దేశభాషలను వ్రాయించి విద్యార్థులకు చెప్పించడము జురూరై యున్నది.

మరిన్ని ధాతునిదానమున్ను ఏయే రోగములకు ఉపయోగములైన ఔషధములున్ను ఆయా చికిత్సల క్రమమున్ను తెలిసేలాగు దేశభాషను సంగ్రహమైన యొక పుస్తకము వ్రాయించి అదిన్ని వారిచేత చదివించవలశినది, యింకా చాలాశాస్త్రములయొక్క వ్యవహారాద్యంశములయొక్క గ్రంధములు ఇంగిలీషు భాషను విశేషముగా దిద్దుబాటౌతూ వృద్ధిని పొందుచున్నవి. గనుక వాటిలో జురూరైన ప్రమేయములు ఇంగిలీషు గ్రంధములలోనుంచి దేశభాషలను తర్జమా చేయించి యేయేవిద్యార్థియొక్క ఇచ్ఛకున్ను శక్తికిన్ని అనుగుణములైన గ్రంధములు చెప్పించడము యుక్తముగా తోచుచున్నది, వైద్యమును గురించిన సదరు జాబితాలు వగైరాలు ఒకభాషను ముందు సంగ్రహించి వాటినిపట్టి తతిమ్మాభాషలను తర్జుమాలు చేసుకోవచ్చును. పిల్లలకు వైద్య సంబంధములైన అంశములు చదివించడమునకు ఆరంభము చేయించేయెడలనే క్రమక్రమముగా ఉత్తరప్రత్యుత్తరములున్ను వ్యవహార సంబంధములైన కాగితములున్ను లెక్కలున్ను వ్రాయించే అభ్యాసముకూడా చేయించడము జురూరైయున్నది. ఈ అనుక్రమముగా విద్య చెప్పించేయెడల స్త్రీజాతి ఎవరెవరి మర్యాదకున్ను స్థితికిన్ని అనుకూలమని తోచిన మట్టుకు విద్య చెప్పించవచ్చును సాధ్యమైనంతమట్టుకు గ్రంధములు స్త్రీలున్ను చదవడమునకు లాయఖుగానుండేలాగు రచించబడవలసినది, మరిన్ని మగపిల్లలకు భూగోళశాస్త్రము మొదలైనవి నేర్చేయెడల ఆవశ్యకమని తోచిన భాషాంతరములయొక్క అభ్యాసమున్ను చేయించవచ్చును.

౫ – పైన వివరించబడిన గ్రంధములలో ఇదివరకు ఏర్పరచబడి యున్నవిగాక మిగిలినవి భాగ్యవంతులుగానైనా సమర్థులుగానైనా యుండి విద్యలు బాలురకు చెప్పించవలెననే ధర్మబుద్ధిగలిగియున్న వారిచేత నేర్పాటుచేయించతగ్గవి యైయున్నవి సదరు ధర్మబుద్ధి గలవారు కొందరు స్వతఃగానున్ను కొందరు చందా మూలకముగానున్ను పాఠశాలలు ఉంచి విద్యలు చెప్పించుచున్నారు. కొందరు ఇటువంటి సత్కార్యములు జరిగించే ప్రయత్నములు చేస్తున్నారు కాని అటువంటి సత్పురుషులు బాలురకు చెప్పించడమునకు ఈ ప్రమేయముయొక్క నాలుగవ పేరాలో వివరించబడిన గ్రంధములు సాధ్యమైనంతమట్టుకు ముందుగా ఏర్పాటుచేయడము మిక్కిలి యుక్తమైనకార్యముగా నేను ఎంచుకుంటున్నాను. ఇంకా సమర్థులైన వారున్ను సదరు ధర్మకార్యమునకు సహకారమయ్యేలాగు సదరుగ్రంధములు ముందుగా తయారుచేయించడమునకు పూనుకోవడమున్ను ఆవశ్యకమే అయియున్నది ఈ పై పేరాలో పిల్లలకు ప్రథమతః చెప్పించగలందులకు ఏర్పరచబడవలసినదన్న పుస్తుకము వ్యాకరణములు బాగా తెలిసియున్న యిద్దరు ముగ్గురు పండితులు కూడి రచించే పక్షమందు త్వరితముగానే సిద్ధము కావచ్చును. తదనంతరము చెప్పించగలందులకు ఏర్పాటు చేయించవలశినవన్న వైద్యముతాలూక్‌ ఐదు ముక్తసరుజాబితాలున్ను ఇటువంటివే సవిస్తరములైన ఐదుజాబితాలు (అనగా) ఐదుపుస్తుకములు వైద్యము బాగా నేర్చుకునేవారు చూచుకోవడమునకు కావలసియుంటవిగనుక అవిన్ని వైద్యశాస్త్రమందు చక్కగా పరిశ్రమ చేసియున్న వారినిన్ని యితరములైన శాస్త్రములు తెలిసియున్న పండితులను కొందరినిన్ని చేర్చి సంస్కృతభాషలోనున్న హిందూదేశభాషలలోనున్ను ఉన్న గుణపాఠములు మొదలైన గ్రంధములు తెప్పించి వారికి ఇప్పించి వాటికి అనుగుణముగా సదరు జాబితాలన్నీ యొకసారిగానే ఏర్పరచేలాగు చేయించిన పక్షమందు అవి శీఘ్రకాలములోనే క్రమక్రమముగా ఏర్పాటు కాగలవు, మరిన్ని సదరు పేరాలో చెప్పబడియున్న ధాతునిదానము మొదలైనవాటి సంగ్రహమున్ను ఔషధములు ఏర్పరచడమునకున్ను చికిత్సలు జరిగించడమునకున్ను సదుపాయమయ్యేలాగు దేశభాషను రచించబడవలసినదని వైద్యప్రమేయము తాలూక్‌ మూడవపేరాలో చెప్పబడియున్న పుస్తుకమున్ను సదరు కూటమువారిచేతనే తయారుచేయించబడవలసినవై యున్నవి విద్యార్థులు చూచుకోవడమునకు పాకశాస్త్రము తాలూక్‌ గ్రంధములు కావలసియుంటవి గనుక సంస్కృతము వగైరా భాషలయందుండే పాకశాస్త్రగ్రంధములు సదరు కూటము వారిచేతనే దేశభాషను వాక్యగ్రంధములుగా తర్జుమా చేయించవలశినది. నీతి తెలియగలందులకు వ్రాయించవలసినదన్న పుస్తుకము నీతివేత్తలైన యిద్దరు ముగ్గురు పండితులను కూర్చి వారికి కావలసిన గ్రంధములు తెప్పించి యిప్పించి వారిచేత నేర్పాటుచేయిస్తే త్వరగానే సిద్ధము కావచ్చును ఈ పైన ఉదహరించబడ్డ గ్రంధములు ఒకసారి ఏర్పాటై వాడికలో వస్తూఉన్నమీదట ఆవశ్యకమని కనుపడే పక్షమందు ఈ ప్రమేయము తాలూక్‌ నాలుగవ పేరాయొక్క వైద్యప్రమేయము తాలూక్‌ మూడవపేరాయొక్క ఉద్దేశములకు అనుగుణముగా నుండడమును గురించి అప్పటప్పటికి దిద్దుబాటు చేసుకుంటూ వృద్ధినీ పొందించుకుంటూ నుండవచ్చును ఇంగిలీషు బాగా తెలిసిన అసలు గ్రంధములయొక్క ముఖ్యాభిప్రాయములు సులభముగా బోధపడతగినట్టు దేశభాషను సంగ్రహములు చెయ్యడమునకు లాయఖైన సామర్థ్యము గలిగినవారు పూనుకున్న పక్షమందు ఈ ప్రమేయము తాలూక్‌ నాలుగవపేరాలో చెప్పబడియున్న శాస్త్రసంబంధములైన సంగ్రహములలో నొకటొకటి తగినకాలములో నేర్పాటుకావచ్చును. మరిన్ని విద్యార్థులు చూచుకునే నిమిత్తము శాస్త్రముయొక్క యింకా జురూరైన అంశములయొక్క ప్రమేయములు చాలాగా ఇంగిలీషు భాషయందుండే గ్రంధములనుపట్టి తర్జుమా చెయ్యబడవలసి యుంటున్నది, గనుక పైన చెప్పబడ్డ సామర్థ్యము గలవారు పూనుకొన్న పక్షమందే అవిన్ని తయారుకావచ్చును.
[1] వివాహప్రమేయములో ప్రత్యుత్తరము తాలూక్‌ ఐదవ పేరానున్ను అభిప్రాయము తాలూక్‌ మూడవ పేరానున్ను చూడవలసినది.

శుభమస్తు
హితసూచని
వైద్యప్రమేయము

౧ – మనుష్యుడు అనేక వస్తువులనున్ను వస్తువులయొక్క కూటములనున్ను భక్షించడమునకున్ను పానము చెయ్యడమునకున్ను అభ్యాసముగలవాడున్ను అనేకములైన హద్దులకు లోవడవలసిన ప్రవర్తనగలవాడున్ను అనేక దుష్ప్రేరణలను పొందడమునకు లాయఖైనవాడున్ను అనేకములైన కోరికలను కోరేవాడున్ను ఐయున్నందున మనుష్యశరీరము అనేక విషదోషములను పొందడమునకున్ను అనేకరోగముల యుత్పత్తికిన్ని ఆలయమైయున్నది, ఈలాగున సంభవించే విషదోషముల వల్లనుంచిన్ని రోగములవల్లనుంచిన్ని బచావుచేసుకోవలసినది ప్రతిమనుష్యునకును ఆవశ్యకమైయున్నది, మరిన్నీ మనుష్యేతరజంతువులున్ను రోగాదులను పొందడమునకు తగిననే, ఐయున్నప్పటికిన్ని స్వేచ్ఛావిహారాదులచేత వాటికి వ్యాధులు తక్కువగా కలుగుచున్నవి, గాని వాటితో మనిషి మచ్చికయందుండెవాటికి అధికముగా రోగములు కలుగుచున్నవి, యీ జంతువులను సంరక్షించడమునకు మనుష్యుడు బాధ్యతగలవాడై యుంటాడు. కనుక వీటికికలిగే వ్యాధులు నివారణ చెయ్యడమున్ను మనుష్యునకే విధిఐయున్నది వ్యాధులుసంభవించకుండా సాధ్యమైనంతమట్టుకు జాగ్రతపెట్టుకోవడమునకున్ను సంభవించినవాటినివారణ చేసుకోవడమునకున్ను శాస్త్రాభ్యాసమే సదుపాయమైయున్నది, హిందువులలో వైద్యశాస్త్రముయొక్క గ్రంధములు అనేకములుగానున్నప్పటికిన్ని ప్రస్తుతకాలములో వాటిని అభ్యసించేటటువంటిన్ని అవిసులభముగా బోధపడెపద్ధతులు ఏర్పాటుచేసుకునేటటువంటిన్ని వాటియందుండే పొరబాట్లను పరిశీలనచేత కనుపడే ప్రకారము దిద్దుబాటు చేసుకునేటటువంటిన్ని వాడికలేకుండానున్నది, శాస్త్రవిహీనుడైన వైద్యుడు రోగపాలిటికి యమదూతతో సమానుడని యొకవాడిక కలిగియున్నది. హిందువులలో వైద్యులని చెప్పబడుతున్నవారు చాలామంది శాస్త్రపరిశ్రమ చెయ్యకపోవడమే కాకుండా వైద్యమందు తాము వాడికచేసే వస్తువులయొక్క గుణదోషములఅభిజ్ఞత చక్కగాలేకుండానే రోగులకు ఔషధములు ప్రయోగిస్తున్నారు.

౨ – రసవిషాదులు తీక్ష్ణములైన వస్తువులైనందున కొన్ని సంగతులలో వ్యాధులను త్వరగా మళ్ళించేవి ఐనప్పటికిన్నీ తదనంతరము ఆ శరీరికి అనేక విధములైన వికారములను కలుగచేసే స్వభావము గలవై యున్నవి, యింతేకాకుండా చాలాసంగతులలో వాటిని ప్రయోగించిన నిమిత్తములకు, అవి ఉపయోగించనియెడల త్వరితముగానే వాటిని పుచ్చుకున్న వారికి చాలా విరోధనములను కలుగ చేస్తున్నవి, రసవిషాదుల వైద్యముకంటె మూలికావైద్యము శ్రేష్ఠమని కొందరు చెప్పుచున్నారు, విశేషించిన్ని సాధ్యమైనంతమట్టుకు నిర్దోషములైన మూలికలతో వైద్యము చేయడము యుక్తమైన పనిగా కొందరు బుద్ధిమంతులు వాడుక చేస్తున్నారు. హిందూవైద్యులలో చాలామంది అనేక నిమిత్తములయందు రోగులను చాలా లంఘనములు చేయిస్తున్నారు, పైగా వారికి చురుకైన ఔషధమున్ను ఇచ్చి కఠినములైన చికిత్సలున్ను జరిగిస్తున్నారు రోగికి జ్వరముచేతగాని మరి యే బాధచేతగాని ఆహారేచ్ఛ లేకయున్న సమయమందుతప్ప లంఘనము ఉంచడము న్యాయముగా కనుపడదు లంఘనములచేత దార్ఢ్యమును నశింపచేయడమే కాకుండా ఔషధములచేతనున్ను ఇంకా కఠినములైన చికిత్సలచేతనున్ను కూడా వారిప్రాణములను బాధించడము మిక్కిలీ ఘోరకృత్యముగా తోస్తున్నది, ఇంతేకాదు కొన్ని జ్వరములు వదిలిపోయిన తరువాతనున్ను ఆ మాతిసార రక్తాతిసారములు మొదలైన వాటియందున్ను రోగికి ఆహారమందు ఆసక్తి తక్కువగా ఉన్నప్పటికిన్నీ తగిన ఆహారము ఇస్తూ ఉండవలసినదే యుక్తమైయున్నది, రోజూ గాని అప్పటప్పటికి గాని వస్తూపోతూ వుండే జ్వరములు ఆహికజ్వరములని చెప్పబడుచున్నవి, ఈ జ్వరములు లంఘనములచేత త్వరితముగా వదిలిపొయ్యేవి కావు, గనక జ్వరము లేకుండా ఉన్నప్పుడు తగిన ఆహారము యిస్తూ ఔషధము ఇవ్వవచ్చును. శీతజ్వరములు మొదలైన కొన్ని వ్యాధులకు శరీర దార్ఢ్యమును కనిపెట్టి నేర్పుగా గర్భమందుండే కల్మషమును నివర్తింపచేస్తూ జ్వరమును హరించతగిన ఔషధము ఇస్తూనుంటే ఆ రోగములు గుణపడవచ్చును గాని ఈ జ్వరములను గురించి లంఘనములు ఉంచడము మిక్కిలి అయుక్తమైన పనియైయున్నది. హిందూవైద్యులు చాలామంది యిటువంటి సంగతులలోనున్ను జ్వరములేని కొన్ని సంగతులలోనున్ను భోజనేచ్ఛ యున్నప్పటికిన్ని వాయువుగా నున్నదనిన్ని ధాతువుయందు కాకలేకుండా వున్నదనిన్ని చాలా లంఘనములు ఉంచిన్ని రోగములయొక్క ఆయా శరీరతత్వములయొక్క స్వభావములను కనిపెట్టచాలక తీక్ష్ణములైన ఔషధములు మిక్కటముగా ప్రయోగించడమువల్ల చాలామందియొక్క ప్రాణములకు అపాయము సంభవిస్తూన్నదని నేను నమ్ముతున్నాను.

౩ – చదువును ఆరంభించే ప్రతివిద్యార్థికిన్ని వాక్యరచనాసామర్థ్యము కలిగినట్టుగానే వైద్యముయొక్క కొన్ని అంశములున్న ఇంకాకొన్ని సంగతులయందు పరిశ్రమ జరిగిన మీదట శారీర శాస్త్రము యొక్క సంగ్రహమున్ను చెప్పించి చికిత్స సంగ్రహమున్ను చదివించ వలశినదని విద్యాప్రమేయములో వ్రాళియున్నాను అంతమట్టుకు వైద్యాంశములు తెలిసియున్న చిన్నవాండ్లు తమతమ శరీరములను కాపాడుకోవడమును గురించిన జాగ్రత్తగలవారు కాగలరు విశేషించిన్ని వారు తమకు కావలసినవారికి కలిగే వ్యాధులను గురించి తగినవైద్యము చేయించడమునకు అనుకూలమైన సామర్థ్యము గలవారున్ను కాగలరు, అటువంటి విద్యార్థులలో వైద్యము పూరాగా నేర్చుకోవలెననే ఇచ్ఛగలవారికి వైద్యశాస్త్రము సాధ్యమైనంతమట్టుకు బాగా నేర్పడము జురూరై యుంటుంది, గనుక వారు అభ్యసించిడమునకు ఔషధములు ఏర్పరచేటటువంటిన్ని చికిత్సలు జరిగించేటటువంటి క్రమము దేశభాషతాలూక్‌ వైద్య గ్రంధములలోనుంచిన్ని సంస్కృతభాషలోనున్న వైద్య గ్రంధములలోనుంచిన్ని దేశభాషను ఒక వాక్యగ్రంధముగా యెత్తి వ్రాయించవలశినది, సాధ్యమైనంతమట్టుకు భాషాంతరముల యందుండే వైద్యగ్రంధములున్ను ఇంగిలీషు సర్జరిన్ని దేశభాషను తర్జుమాలు ఐయుండడము జురూరై యున్నది, యీలాగున నేర్పడి యుండడమువల్ల ఏయే దేశములయందు జరిగే చికిత్సల తరహాలున్న శస్త్రవైద్యక్రమమున్ను ఈ వైద్యులకు తేటబడియుంటవి, ఈ ప్రమేయములో పైనవివరించబడ్డ సంగతులు సరసులైనవారు పూరాగాఆలోచనలో తెచ్చి యీపేరాలోనున్ను విద్యాప్రమేయము తాలూక్‌ నాలుగవపేరాలోనున్ను చెప్పబడియున్న గ్రంధములు ఏర్పాటు చేయించి విద్యార్థులకు చెప్పించే పక్షమందు హిందూలలో సంభవించే రోగములచేతనున్ను వాటినిగురించిన చికిత్సలచేతనున్ను ఇదివరకు జరుగుతూ ఉన్న అధికములైన ఉపద్రవములు తగ్గిపోవడమునకున్ను శ్రేయోవృద్ధి కావడమునకున్ను హేతువు కలుగుతుంది.

౪ – శరీరతత్వమునకు దేశకాలములలో నైనా భోజన మజ్జనాది కార్యములలోనైనా ఒకటిగాని కొన్నిగాని సరిపడక పోవడముచేతనున్ను మనస్సుయందు కలిగే వికారములచేతనున్ను అభిఘాతములచేతనున్ను స్పర్శ మొదలైన వాటిచేతనున్ను వ్యాధులు కలుగుచున్నవి. వీటిలో చాలామట్టుకు ఔషధ చికిత్సలవల్లనున్ను కొన్ని అనుకూలమైన ఆదరణలవల్లనున్ను నివాసమును బదలాయించడమువల్ల కొనిన్ని మనస్సుయందు కలిగినవికారములు తీరడమువల్ల కొనిన్ని నయము కాతగియున్నవి, దయ్యములు మొదలైన వాటివల్లను మంత్రప్రయోగములచేతను ఇంకా కొన్ని హేతువులచేతను వ్యాధులు కలుగుచున్నవనిన్ని మంత్రములు పూజనములు మొదలైన వాటిచేత అవి నివారించబడతవనిన్ని కొందరు నమ్ముతున్నారు, ఇది వాస్తవమును పట్టి కలిగిన నమ్మకము కాదు[1] వమన విరేచన జాడ్యము మరిడి మహాలక్ష్మీ అనే దేవత పూనడముచేత ఎవరెవరికి సంభవిస్తున్నవనిన్ని ఆదేవతను గురించి జాతరలున్ను ఉత్సవములున్ను చెయ్యడముచేతనైనా లేక మరియేదేవతాంతరముల భజనములున్ను ఉత్సవములున్ను చెయ్యడముచేతనైనా ఆవ్యాధి ఆయా శరీరముయొక్క అప్పటి స్థితినిన్ని గాలి మొదలైన వాటినిన్ని పట్టి సంభవించేదే కాని మరిడి మహాలక్ష్మీ అనే దేవత పూనడమువల్ల వచ్చేది కాదు సదరుప్రకారము జాతరలు భజనలు ఉత్సవములు చెయ్యడమువల్ల ఈ వ్యాధి యెక్కడా నిమ్మళించడము లేదు అలాగున నిమ్మళించడమునకు బదులుగా సదరు ఉత్సవములు మొదలైన వాటియందలి వాద్యములు వగైరాలచేత చాలామందికి భీతిపుట్టి అందువల్ల సదరు రోగము వారికిన్ని కలిగేది కద్దు.

౫ – సదరు జాడ్యమును గురించిన్ని యింకా గృహిణులు అతిసారములు మొదలైన విరేచనజాడ్యములను గురించిన్ని నేనున్ను యొక ఔషధ యోగమును ఏర్పరచి యున్నాను ఇది బీదలుగానుండే ప్రజలున్ను సులభముగా చేసుకోవడమునకు అనుకూలమైన ఔషధమై యున్నది, యిరు సంవత్సరములనుంచి యీ యౌషధమును కొన్ని బస్తీలలో చాలామంది వాడికలో తెచ్చి దీనిగుణములను కనిపెట్టి యున్నారు. వమన విరేచన జాడ్యము కనిపించినవారికి ఈ యౌషధము ఇవ్వగలందులకు నిర్ణయమైన కాలములో గానున్ను పద్ధతుల చొప్పుననున్ను ఇవ్వబడ్డ స్థలముల యందు ఆ జాడ్యము నయమౌతూ వచ్చినట్టున్ను సమయమందు ఔషధము ఇవ్వకపోయినా అందుల పద్ధతులను క్రమముగా అనుసరించకపోయినా రసభస్మము మొదలైన కొన్ని ఔషధములు విస్తారముగా ఇచ్చిన మీదట ఈ ఔషధము ఇచ్చినా అటువంటి స్థలములలో మాత్రము ఆవ్యాధి నిమ్మళించకపోయినట్టున్ను చాలామంది తెలియచేసి యున్నారు. ఇతర విరేచన జాడ్యములకున్ను ఈ యౌషధము చాలా కిఫాయతు కలుగచేస్తూ వచ్చినట్టుకూడా చాలామంది తెలియచేసియున్నారు గనుక ఈ యౌషధము ఏయే నిమిత్తమునకు ఉపయోగముగా తయారుచేసేక్రమము ఈదిగువను వివరించడమైనది.
ఔషధమందు చేరేవస్తువులు 1.టో నంబరు మాత్రలకూ తూనికెంచిన్నములు 2.డో నంబరు మాత్రలకూ తూనికెంచిన్నములు 3.డో నంబరు మాత్రలకూ తూనికెంచిన్నములు 4.గో నంబరు మాత్రలకూ తూనికెంచిన్నములు
అల్లముపొట్టుతీస్ని కొమ్ములు ౩౨ ౪౦ ౫౦ ౬౦
నల్లమందు ౧ ౧ ౧ ౧
హారతి కర్పూరం ౧ ౧ ౧ ౧

సదరు కొమ్ములలో ప్రతికొమ్మున్ను రెండు చెక్కలుగా కత్తితో ఒకదళముగానున్ను ఒకటి దానికంటే కొంచెము పలుచగానున్ను ఉండెలాగున చీల్చవలసినది, వాటిలో దళసరిగా నుండేదాని చీల్చబడ్డ పక్కను నడుమగా కత్తితో కొంచము గుంటయేర్పరచి అందులో తగుమాత్రము సదరు మందు యిమిడ్చి రెండోచెక్క మూతవేసి అది చెదరకుండా నూలుతో చుట్టవలశినది, ఈ ప్రకారము సదరు కొమ్ములతో ఆ మందు యిమిడ్చి ప్రతికొమ్ముకు నూలుచుట్టి ఆ కొమ్ములన్ని యిమడతగిన వెడల్పున్ను మూడుచుట్లు రాతగిన నిడివిన్నిగల ఒకచీర పేలికకు ఒకపక్కను నీరునున్నమురాచి సున్నము రాయకుండానున్ను పక్కను సదరు కొమ్ములన్నివుంచి మూడుపొరలు వచ్చేలాగు అన్నిపక్కలను సందులేకుండా చుట్టి బొగ్గులు నిప్పులు చేసి వాటిలోనేగాని వంటచేసిన పొయ్యియొక్క వేడికుమ్ములోనే గాని లేక కుంపటియొక్క వేడికుమ్ములోనేగాని అది ఉంచి సుష్ఠుగా పక్వము కానిచ్చి మాడిపోకుండా తీసుకుని అందులోని కొమ్ములు జాగ్రత్తగా విప్పుకుని ఖల్వములోవేసి నూరి తరువాత సదరు కర్పూరము అందులోవేసి బాగా కలియనూరి తూనిక సరిగానుండెలాగు పదిమాత్రలు చేశి నీడను ఆర్చి తగినసీసాలోగాని కళైరేకు బరిణెలోగాని లేక మరియే బరిణెలోగాని ఉంచవలసినది. ఈ పద్ధతిప్రకారము జురూరు ఉన్నంత అవుషధము తయారుచేసి యుంచుకోవచ్చును ఈలాగున ఉంచుకొన్న అవుషధము ౨-౩ సంవత్సరముల మట్టుకు సత్వము తగ్గిపోకుండా నుండవచ్చునని తోస్తున్నది.

౬ – వమన విరేచనాలు జాడ్యము కనుపించిన పక్షమందు వెంటనే సదరు ఒకటోనెంబరుమాత్ర కొంచముగా చితక గొట్టి ఆ పలుకులు ముణిగేమాత్రము తేనెపోసి పుచ్చుకొని అంతమాత్రము తేనె తిరిగి పుచ్చుకోవలసినది, సదరు జాడ్యము కనుపించగానే పుచ్చుకోవడము సంభవించకపోయిన పక్షమందు తరువాత ఒకఘంటకులోపుగా నయినా సదరు ప్రకారము పుచ్చుకోవలసినది, యొకవేళ అవుషధము లోపల ఇమడక వమనముతో వెళ్ళిపోయిన పక్షమందు అవుషధము ఇమిడే మట్టుకు వెంటవెంటనే తిరిగీ పుచ్చుకుంటూ ఉండవలసినది, అవుషధము ఇమిడిన మీదటనున్ను తిరిగీవిరేచనము ఏమైనా ఐనపక్షమందు ఆ విరేచన స్వభావమును కనిపెట్టి జురూరని తోచినపక్షమందు వెంటనే కాని కొంచెము నిడివిమీదనేగాని నిండుమాత్రే గాని మాత్రలో కొంత గాని అనుకూలప్రకారము తిరిగీ పుచ్చుకోవచ్చును విరేచనము స్వల్పముగా అవుతూవున్న పక్షమందు అవుషధము పుచ్చుకోక మానివేయవచ్చును, విరేచనము కావడము నిలిచిపోయిన పక్షమందు అవుషధము పుచ్చుకోకూడదు, మరిన్ని సదరు జాడ్యము శిశువుకు ఒకమాత్రలో నాలుగోవంతు తక్కువగానున్ను సంవత్సరముపైన ఐదు సంవత్సరములకు లోపలి యీడు మగపిల్లలకు మాత్రలో మూడోవంతుకు తక్కువగానున్ను అయిదు సంవత్సరములపైన ౧౪-సంవత్సరముల లోపల యీడు గలవారికి మాత్రలో ముప్పాతిక మట్టుకున్ను అనుకూలమని తోచిన ప్రకారము సదరు పద్ధతి వెంబడిని ఔషధము యివ్వవలశినది ఈ వ్యాధియందు కొందరికి వమనము లేకుండా విరేచనములు మాత్రము అయ్యేది కాదని తెలుస్తున్నది గనుక అట్లా కనుపించిన పక్షమందు వెంటనే సదరు ప్రకారము ఔషధము ఇవ్వడము ఆరంభించి గుణము నిమ్మళించే మట్టుకు ఘంటకు ఒకమాత్ర చొప్పునగాని అంతకు తక్కువగా గాని అనుకూలము వెంబడిని ఇవ్వవచ్చును, ఒకానొక సంగతిలో సదరు ఆశక్తము కలిగిన మనిషియొక్క దార్ఢ్యమునున్ను రోగముయొక్క వికారమునున్ను యోజించి జురూరనితోస్తే మాత్రన్నరగాని రెండుమాత్రలుగాని మొదటి దఫాను వేయవచ్చును కొందరికి వమనముగాని విరేచనముగాని ఔతూనుండగానున్ను కొందరికి అవి నిల్చిపోయిన తరువాతనున్ను దాహము కావడముకలదు అప్పుడు పొట్టుతీసిన శొంఠికొమ్ము చితకకొట్టి దానితోకాచిన నీళ్ళుగాని లేక అట్లా నలియకొట్టిన శొంఠితో చారెడుబియ్యమున్ను రెండుశేర్ల ఉదకమున్ను జేర్చి కాచిననీళ్ళుగాని ఒకటి రెండు మూడు పర్యాయములు అనుకూలము వెంబడి కొద్దికొద్దిగా ఇస్తూనుండవచ్చును, విరేచనములు నిమ్మళించిన తర్వాత సదరు జాడ్యవికారములు కొన్ని కొంతసేపు ఉండడము కలదు గనుక అవి శాంతించడమును కనిపెట్టి ఆకలి ఐనప్పుడు కొద్దిగా పాతచింతపండు వేసి మరగకాచిన మిర్యాలచారు అన్నముగాని, పొంగునీళ్ళ అన్నముగాని తగుమాత్రము యివ్వవచ్చును, పాతఉసిరిక పచ్చడిగాని నారదబ్బకాయ వగైరా ఊరగాయలలో నేదైనగాని వ్యంజనముగా ఇవ్వవచ్చును. ఐతే విరేచనములు నిమ్మళించగానే కొందరికి చిరిచెమటలు పట్టడమున్ను చెవులు గడియలు పడడమున్ను కలదు, అటువంటివారికి తక్షణమే సదరు ప్రకారము ధారకము ఇవ్వవలసి ఉంటున్నది గనుక బుద్ధిమంతులు అట్టి సమయములను జాగ్రత్తతో కనిపెట్టవలసినది.

౭ – మిక్కిలీ పలుచగానయ్యే విరేచనములకున్ను అంత పలుచనగాకుండానయ్యే విరేచనములకున్ను రెండోనంబరు మాత్రలు సదరు పేరాలో పూర్వభాగమందు చెప్పబడియున్న ప్రకారమే తేనెతో ఇవ్వవలసినదని, వ్యాధి నిమ్మళించిన మీదట లఘువైన పథ్యము నివ్వవచ్చును అజీర్ణతచేతకలిగే విరేచనములకు గర్భమందుండే కల్మషము చాలామట్టుకు నివర్తించినమీదట సదరుమాత్ర తేనెతో ఇవ్వవలసినది, జురూరనితోచిన పక్షమందు రెండోపూటనున్ను ఇవ్వవచ్చును, విరేచన కావడము శాంతించిన మీదట ఆకలిగానుంటే లఘువుగావుండే ఆహారము ఇవ్వవచ్చును, ఆమముతోకూడా కలిసి అయ్యే విరేచనములకున్ను ఒకానొకసారి మలవిరేచనమున్ను కొన్నిమార్లు ఆమవిరేచనములున్ను అయ్యేగుణములకున్ను తరుచుగా కొద్దికొద్ది ఆ విరేచనములయ్యే గుణములకున్ను మూడోనంబరుమాత్ర నిండుగాగాని మాత్రలో ముప్పాతికెగాని సగముకాని అనుకూలము వెంబడి పూటకు ఒకదఫా చొప్పున తేనెతో నివ్వవలసినది ఈ గుణములలో కొన్ని వ్యవధిమీదగాని నిమ్మళించవు గనుక అవి నిమ్మళించేమట్టుకు పూటకు ఒకసారి ఔషధము ఇస్తూవుండవలసినది యుంటున్నది, పూటపూటకు పథ్యము యిచ్చే యెడల అరటిపువ్వు లేతఅరటికాయ మొదలైనవి యుక్తముగా పక్వముచేసి వ్యంజనములుగా యివ్వవచ్చును. ఆవుమజ్జిగయున్ను అనుకూలము వెంబడిని యివ్వవచ్చును, వీటిలో కొన్ని గుణములకు పొట్టుతీసిన శొంఠిచూర్ణము వస్త్రగాళితము చేసి కొంచము ఉప్పువేశి కలియనూరి భోజనారంభమందు కొంచము అన్నముతో కలిపి భోజనము చేసేలాగుచేస్తే అనుకూలముగా నుంటుంది, కడుపు కొంచము బిగపట్టేటటువంటిన్ని మలవిరేచనముకాకుండా నుండేటటువంటిన్ని గుణములకు ఈప్రకారము యివ్వవలసినది, కొన్నిగుణములకు గసగసాలు కొద్దిగా వెచ్చజేసి కొంచముఉప్పువేసి కొద్దిగా నూరి మొదట భోజనముచేసేయెడల అన్నములో అదికలిపి పుచ్చుకునేలాగు చేస్తే అనుకూలముగానుంటుంది. కొంచెము కారకముమీద విరేచనమయ్యే గుణములకు ఈ ప్రకారము ఇవ్వవలసినది. జ్వరాతిసారములకు నల్లతుమ్మచిగుళ్ళు కొంచెము నీళ్ళుతో ఉడకనిచ్చి నూరి తేనెతో కలిపి దానితో పైచెప్పిన ఔషధము సదరు ప్రకారమే ఇవ్వవలశినది.

౮ – రక్తవిరేచనములకున్ను రక్తము ఆమముతోచేరి విరేచనమయ్యే గుణమునకున్ను గసగసాలపాలున్ను తేనెయున్ను సమముగా కలిపి అందులో రెండుచిన్నములయెత్తు తంగేడుగింజలచూర్ణము కలిపి దానిలో నాలుగోనంబరుమాత్ర సగము కలిపి ప్రొద్దున ఒకసారిన్ని సాయంకాలము ఒకసారిన్ని ఇవ్వవలసినది, తంగేడుగింజలు దొరకని సమయమందు ఆ చూర్ణము లేకుండానే ఔషధము ఇవ్వవచ్చును కొన్ని గుణములకు గసగసాలపాలున్ను తంగేడుగింజలచూర్ణమున్ను కలిపి దానితో ఔషధము ఇవ్వవచ్చును వ్యాధి ప్రబలముగానున్నప్పుడు పగటిపూట అన్నము చెదరకాచివంచిన గంజి ఉప్పులేకుండానేకాని ఉప్పుకలిపిగాని అనుకూలప్రకారము యివ్వవచ్చును రెండో పూట పయినచెప్పబడిన గసగసాలపొడితోటిన్నీ అరటిపువ్వుతోటిన్ని లేతఅరటికాయతోటిన్ని అన్నము పెట్టవచ్చును. జాడ్యముకొంచెము నిమ్మళముగానున్నప్పుడు ఆవుమజ్జిగయున్ను అన్నముతో నివ్వవచ్చును. సదరు వ్యాధి ప్రబలమునున్నా శాంతిగానున్నా కొంచెమునొప్పిగానున్నా వెలగపండ్లగుంజు నీళ్ళలో నానవేసి గింజలు ఏశలు వగైరాలు తీసివేశి చిక్కనిరసము కొంచము తేనె కలిపి తగుమాత్రము ఇవ్వవచ్చును. తేనె కలియకుండా రసము పలుచగాచేసి దాహమునకు బదులుగా ఇవ్వవచ్చును. ఈ రసము ౭-డవ పేరాలో చెప్పబడ్డ గుణములకున్ను ఇవ్వవచ్చును ఈ పేరాలోనున్ను ౭-డవ పేరాలో చెప్పబడ్డ గుణములకున్ను ౯-దో పేరాలో చెప్పబడ్డ ప్రకారమే వయస్సుకు తగినట్టు ఔషధము ఇవ్వవలశినది వైద్యమందు ప్రవేశము కలిగియున్న బుద్ధిమంతులు కాలమునున్ను వ్యాధియొక్క స్థితినిన్ని అశక్తునియొక్క శరీరస్థితినిన్ను తత్వమునున్ను యోజించి అవుషధమున్ను పథ్యపు వస్తువులున్ను ఇప్పిస్తూ ఉండవలసింది.

[1] రక్షఃప్రభృతిప్రమేయము తాలూక్‌ 1-4 పేరాలున్ను మంత్రప్రమేయము తాలూక్‌ ఒకటో పేరానున్ను పరోక్షాదిజ్ఞానప్రమేయము తాలూక్‌ రెండవ పేరానున్ను చూడవలసినది.

శుభమస్తు
శ్రీమజ్జగన్నాథాయనమః
హితసూచని
సువర్ణప్రమేయము

౧ – సువర్ణముచేసేవిద్య యొకటి యున్నదని కొందరు నమ్ముతున్నారు, వారిలో కొందరు ఈ విద్యను సాధించవలెననే ఆసక్తిచేత తమయొక్క ద్రవ్యమునున్ను కాలమునున్ను వ్యర్థముగా వ్యయము చెయ్యడము మాత్రమేకాకుండా చాలామట్టుకు వినియోగముమాలిన యత్నములు జరిగించి చివరకు బుద్ధిని కలలుపరుచుకుంటున్నారు – బైరాగులు గోసాయీలు మొదలైనవారు కొందరేమి వారివలె వేషములు వేసుకున్న మరికొందరేమి సదరు నమ్మకము గలవారియొద్ద చేరి బంగారము చేసేవిద్యను నేర్పుతామనిగాని బంగారముచేసి యిస్తామనిగాని భ్రమపెట్టి వారియొద్దనుండే సొమ్మేమి వారిద్వారా లోకులతాలూక్‌ సొమ్మేమి తెప్పించి సువర్ణముచేసే ప్రయత్నముగలవారుగా కొన్నికృత్యములుజరిగిస్తూవుండి సదరుసొమ్ముయావత్తు నంగ్రహించుకుని అదాత్తుగా పరారి కావడమున్ను అందువల్ల మోసపోయినవారు తదనంతరము అందుల విచారమును పొందుతూ వుండడమున్ను సంభవిస్తున్నది, బంగారము చేసేయత్నము జరిగించిన వారెవరున్ను దాన్ని చేసేవిద్యను సాధించలేదనిన్ని వారందరున్ను మొసమునే పొందుతున్నారనిన్ని ప్రతీతి చాలా కలిగియున్నప్పటికిన్ని ఆ విద్యను సాధించవలెననే ప్రయత్నములు కొందరు జరిగిస్తూనే యున్నారు – బుద్ధిమంతులైనవారు బాగా యోజిస్తే మరియొక లోహమును బంగారము చెయ్యడము అసాధ్యమని తెలియతగియున్నది. బంగారము చేసేవిద్యను సాధిస్తామనేవారిలో బుద్ధిమంతులున్ను ఉందురు గాని గ్రహచార సామాన్యముచేత వారిబుద్ధులు పొరబాటునుపొందడమువల్ల అటువంటియత్నములును వారు పూనుకుంటున్నారని తోస్తున్నది రాగికరిగి అందులో ఒకానొక వస్తువువేస్తే బంగారమౌతున్నదని కొందరు వాడిక చేస్తున్నారు బంగారము వెండి రాగి మొదలైనలోహములు మృచ్ఛిలాదులయందు సహజముగా ఉత్పన్నము లౌచున్నవి గనుక అవి అసలులోహములని చెప్పతగియున్నవి, వీటిలో కొన్ని మొదట తియ్యబడ్డప్పుడు స్వచ్ఛముగానుండకపోతే వాటిని విమలముగా చేసుకొనడమున్నుకలదు – ఈలోహములలో రెంటినిగాని కొన్నిటినిగాని చేర్చి కరిగించినపక్షమందు నీరువలెకరిగి సమ్మిశ్రితము కావడము వాటికి స్వభావమై యున్నవి – జురూరు గలవారు సువర్ణములో తగుమాత్రము రాగిగాని వెండిగాని చేర్చి కరిగించి దాన్ని విస్తరింప చేసుకుని ఆభరణములు మొదలైనవి చేయించుకోవడము కలుదు మరిన్ని సదరు అసలు లోహములలో కొన్నిటిని తగినపాళ్ళను కలిపికరుగడముచేత మిశ్రలోహములు (అనగా ఇత్తడి-కంచు మొదలైనవి) ఏర్పాటౌచున్నవి గాని అసలులోహములలో నొకదాన్ని మరియొకటిగా చేయడమెవరికిన్ని సాధ్యమైనపనికాదు – అట్లా చేయడము సాధ్యమనేపక్షమందు సహజముగా కలిగిన యొకవస్తువును సహజముగా కలిగిన మరియొక వస్తువుగా చెయ్యడము మనుష్యునకు సాధ్యమై ఉన్నట్లు ఎంచవలసి వస్తుంది[1] అట్లా సాధ్యమయ్యేటట్లైతే అసలు వస్తువులైన ఒక ధాన్యమును మరియొక ధాన్యముగాగాని ఒకజంతువును మరియొక జంతువుగాగాని మనుష్యుడు చెయ్యవచ్చును, ఈ లాగున ఏమానవుడున్ను చెయ్యలేడు గనుక నరుడు ఒక ధాన్యమును మరియొక ధాన్యముగానైనా ఒక జంతువును మరియొక జంతువుగా నైనా ఏలాగున చెయ్యలేడో అలాగునే ఒక అసలులోహమును మరియొక అసలులోహముగా నెప్పుడున్ను చెయ్యనేరడు – అసలు లోహములలో స్వర్ణము కొన్ని గుణములయందు విశేషమైన సత్వముగలదై యున్నది – రాగి కరిగి యున్నప్పుడు (ఒకానొకవస్తువు) అనగా లోహ సంబంధము కలిగియున్న పాదరస భస్మము మొదలైనవాటిలో నొకటి – అందులోనుంచిన పక్షమందు రాగికి నిజకాంతికంటే భిన్నకాంతి రావచ్చును గాని అది సువర్ణము కానేరదు. ఒకవేళ అందులో వెయ్యబడేవస్తువు లోహసంబంధము లేనిది అనగా పసర్లు మొదలైనవాటిలో నొకటి ఐనపక్షమందు అది రాగియొక్క స్వభావమును భేదించేదైతే అందువల్ల రాగియొక్క సత్వమున్ను కాంతియున్ను తగ్గిపోతవిగాని దానియొక్క సూక్ష్మభాగములకు సువర్ణతాలూక్‌ సూక్ష్మభాగములయొక్క సత్వమున్ను కాంతియున్ను కలుగనేరవు – వైద్యశాస్త్రమందలి లోహాదులయొక్క భస్మప్రమేయమును చూడవలసినది.

౨ – స్పర్శవేది అనే వస్తువుఒకటి యున్నదనిన్ని దానియొక్క స్పర్శమాత్రము చేతను ఇనుము బంగారమౌతుందనిన్ని వాడిక కలిగియున్నది. కొన్నిగ్రంధములయందున్ను చెప్పబడియున్నది గాని – అది ఒక వస్తువో లేక కొన్ని వస్తువులయొక్క కూటమో ఏలాగున ఏర్పాటైనదో ఏ స్థలమందు ఉన్నదో ఆ వైనము స్పష్టముగా తెలియడములేదు. ఇటువంటి స్పర్శవేది అనేవస్తువును ఇహలోకమందు చూచినవారెవరూ ఉన్నట్టు తెలియడములేదు – అది వాస్తవముగా స్థితిగలదైతే ఎవరైనా దాన్ని పరిశీలించకుండా నుండడమునకు సబబు ఉండదు – ఒకవేళ లోకమందు ఏర్పడి యుండే ఏ వస్తువుకైనా ఆ పేరు కలిగి యున్నప్పటికిన్ని దానిస్పర్శ యినుముకు తగిలినంతమాత్రముచేత ఇనుము యొక్క సూక్ష్మభాగములయందు అది ఏలాగున వ్యాపిస్తుంది లేక ఇనుమును భేదించేశక్తి ఆవస్తువుకు కలిగియుంటుందని చెప్పేపక్షమందు అది ఇనుమును నశింపజేసును గాని – సువర్ణముయొక్క సత్వమునున్ను కాంతినిన్ని యినుముకు యేలాగున కలుగచేస్తుంది గనుక స్పర్శవేది యనేపేరుగలవస్తువు ఒకటి యున్నప్పటికిన్ని దాని స్పర్శవల్ల ఇనుము బంగారమయ్యేటట్టు నమ్మడమునకు తగినసబబులు ఏమిన్ని కనుపడలేదు.

౩ – శంకరాచార్యస్వాములవారు ఒక శాణారవాలినికి అనగా ఈడిగవానికి సువర్ణముఖ అనేవిద్యను ఉపదేశించినారనిన్ని వాడు ఆ విద్యచేత చాలాబంగారముచేసి శాణారకాసులనే బంగారుకాసులను ముద్ర వేయించినాడనిన్ని యొకవాడిక కలిగియున్నది. నాణ్యములను ముద్రవేయించే అధికారమెప్పుడూ దేశాధిపతులయందుండినది – గనుక సామాన్యులకు అటువంటిహక్కు కలిగినట్టు నమ్మకూడదు – దేశాధికారము చేసేవారిలో నెవరో అలాగంటినాణ్యములు వేయించడమునకు ఇష్టముగలవారైనప్పుడు ఆ నాణ్యములు పుట్టినట్టు ఎంచతగియున్నవి – సువర్ణముఖియనేవిద్య క్రియారూపమైనది అనే పక్షమందు … ద్రూపముగా బంగారము కానేరదన్న సంగతి పైన చెప్పబడే యున్నది. ఒకవేళ అది మంత్రరూపమైన విద్యయనేక్షమందు ఆసంగతి కల్పితమైనదిగా నెంచతగి యున్నట్టు మంత్రప్రమేయమువల్ల తెలుస్తూనే యున్నది.

సువర్ణప్రమేయము
సంపూర్ణము.

[1]స్వభావముగా కలిగేవస్తువులన్నా సహజముగా నయ్యేవస్తువులన్నా అసలువస్తువులన్నా దైవనిర్మితములైన వస్తువులని ఎంచవలసినది. పరోక్షాదిజ్ఞానప్రమేయముయొక్క ఉత్తరభాగము తాలూక్‌ ఒకటోపేరా చూడవలసినది.

శుభమస్తు
శ్రీమజ్జగన్నాథాయనమః
హితసూచని
మనుష్యేతరజంతుసంజ్ఞాప్రమేయము

౧ – మనుష్యునకు భిన్నములైన జంతువులు వాటిలో నొకదాని అభిప్రాయమును మరియొక దానికి తెలియ చెయ్యడమునకు భాషలను రచిస్తున్నదని కొందరు నమ్ముతున్నారు కాని ఇది పొరబాటు నమ్మకమైయున్నది, యెందుచేతనంటే భాషయుక్తియుక్తములైన సంగతులచేత నేర్పరచబడవలసినదై యున్నది. గనుక న్యాయ గ్రాహకమైన బుద్ధి కలిగియుంటేగాని భాషను గ్రహించడమునకున్ను రచించడమునకున్ను వల్లలేదు – అటువంటి బుద్ధిగలిగి పలుకులు పలుకడమునకు తగిన వాగింద్రియ సామర్థ్యముకూడా కలిగియుంటేగాని యొక జంతువు దాని అభిప్రాయమును మరియొక జంతువుకు భాషాపూర్వకముగా తెలియచేసే సదుపాయము ఉండదు – మనుష్యేతర జంతువులకు సామాన్యమైనబుద్ధి కలదు గాని న్యాయ గ్రాహకమైన బుద్ధి లేదు. వాటిలో కొన్ని పక్షిజాతములకు మాత్రము మనుష్యులు వచించే కొన్ని పలుకులను పలుకతగిన వాగింద్రియ సామర్థ్యము గలదు కొన్ని పక్షిజాతములకు వాటి జాతి సహజములైన పలుకులు మాత్రము పలుకతగిన వాగింద్రియ సామర్థ్యము కలదు కొన్నిజంతువులకు వాటిజాతి సహజములైన ధ్వనులు చెయ్యడమునకే తప్ప వాగింద్రియ సామర్థ్యములేదు, కొన్ని ధ్వని చెయ్యడమున్నట్టె వినబడదు మనుష్యునకు న్యాయగ్రాహబుద్ధిన్ని వాగింద్రియముయొక్క పూర్ణసామర్థ్యమున్ను కలిగియున్నందున మనుష్యులలో నొకరి తాత్పర్యము మరియొకరికి భాషాపూర్వకముగా తెలియచెయ్యబడుతున్నది, మనుష్యుల పలుకులు నేర్పబడే పక్షులైనా న్యాయగ్రాహకమైన బుద్ధిలేనివైనందున వాటికి నేర్పబడేపలుకుల అభిప్రాయము గ్రహించనున్ను నేరవు. నేర్పబడని పలుకులు వినడము మాత్రముచేత వాటికి వచించనున్న నేరవు, ఐతే మనుష్యేతర జంతువులయందు కొన్ని జాతుల జంతువులు వాటిలో నొకదాని అభిప్రాయమును మరియొకదానికి శబ్దపూర్వకముగా కంఠరవముచేతనున్ను అభినయాదులచేతనున్ను స్పర్శమొదలైన వాటిచేతనున్ను తెలియచేస్తున్నవి. మనిషి మచ్చికలోనున్న జంతువులు వాటిఅభిప్రాయమును మనుష్యునకు కంఠరవాదిసంజ్ఞలచేతనే తెలియచేస్తున్నవి, ఇది యావత్తు సంజ్ఞాపూర్వకముగా తెలియచేయడమని చెప్పతగియున్నవి, కాని భాషాపూర్వకమని చెప్పడమునకు సబబులేదు. మనుష్యేతరజంతువులకు కలిగియుండే బుద్ధిలోనున్ను చాలా తరగతులు ఉన్నవి, యేలాగంటే వాటియందు బుద్ధిచేతను ఏనుగ మొదటితరగతిలోనున్నది అనగా తతిమ్మా జంతువులకంటె అధికమైన బుద్ధికలదై యున్నది – పిపీలికాదులు బుద్ధియందు ఆఖరుతరగతిలో నున్నవి వాటిలో నొకదాని భావమును మరియొకటి స్పర్శచేతనున్ను కేవలసన్నిహితసంచారాదులచేతనున్ను కనిపెట్టుతున్నట్టు తోచుచున్నది గాని వాటికి శబ్దపూర్వకమైనటువంటిన్ని అభినయాదులతో కూడినటువంటిన్ని సంజ్ఞలులేవు ఏనుగుకున్ను పిపీలికాదులకున్ను మధ్యనుండే జంతువులయొక్క తరగతులను బుద్ధిమంతులైనవారు సులభముగానే కనిపెట్టవచ్చును.

౨ – ఒకయెడారిస్థలమందు యుక్తప్రవర్తకుడున్ను న్యాయమైన ఆర్జనను చేసేవాడున్ను పేదవాడున్ను ఐన యొకబ్రాహ్మణుడు ఉండేవాడనిన్ని పాత్రతగలవారు ఎవరైనా ఆ మార్గముగావచ్చి అర్థించిన పక్షమందు తనశక్తికి అనుగుణముగా వారినిసత్కరిస్తూఉండేవాడనిన్ని ఆయనకు భార్యయున్ను కుమారుడున్ను కోడలున్ను ఉండేవారనిన్ని వారున్నూ ఆయనయోగ్యతకు అనుగుణమైన యోగ్యతేకలవారై యుండి నారనిన్ని ఈలాగుననుండగా ఒకసారి చాలా దుర్భిక్షిమైన కాలము సంభవించినట్టున్ను అప్పట్లో తనకుటుంబమును సంరక్షించుకోవడమునకే ఆయనకు దుర్ఘటముగానుంటూ వచ్చినట్టున్ను ఐనప్పటికిన్ని సాధ్యమైనంతమట్టుకు ఆయన అతిథిపూజ జరిగిస్తూ వచ్చేవాడనిన్ని యొకవేసవిరోజున ఆ కుటుంబమువారికి – సాయంకాలమయ్యేమట్టుకు ఆహారార్థము ఏమిన్ని దొరకకపోయినందును వారు నిరాహారులుగా నుండినట్టున్ను సాయంకాలమైనమీదట ఆ గృహాధిపతి కొన్నియవలు సంగ్రహించి తెచ్చినట్టున్ను అప్పుడాయవలు వేపుడుపిండిచేసుకుని వారు నాలుగుభాగములుగా పంచుకుని తమ క్షుధతీర్చుకోవలెనని యత్నపడుతూ నుండగా ఒక బ్రాహ్మణాతిథి అక్కడికి వచ్చి ఆ యజమానిని ఆహారమును గురించి యాచించినట్టున్ను ఆ గృహస్థు అందుమీద న్యాయమును యోజించి తానుతరించి ఇతరులను తరింపచేయడము న్యాయముగానున్నప్పటికిన్ని తనయొక్క క్షుత్పిపాసలనులోపర్చుకుని అర్థిని ఆదరించడమే తాను తరించడముగా ఎంచుకుని తనవంతు సత్తుముద్ద అతిథికి సమర్పించినట్టున్ను ఆయనదాన్ని ఆరగించి తృప్తిలేనివాడుగా కనపడ్డట్టున్ను అందుకాయింటి యజమాని సేయునది లేక ఊరికెయున్నట్టును అందుపైన ఆయనభార్య ఆసంగతిని పర్యాలోచించి స్త్రీకి పెనిమిటియొక్క న్యాయమైన ఇష్టమును నెరవేర్చడముకంటే పరమధర్మము లేదనిన్ని అభ్యాగతుడు ఈశ్వరునివలెనె యెంచ తగినవాడనే మర్యాదనుపట్టి మీరు ఈయనిను తృప్తునిగా చేయతలచినారు గనుక నా భాగమైన సత్తుముద్దనుకూడా ఆయనకు ఇవ్వవచ్చుననన్ని చెప్పినట్టున్ను నీవు ఆకలిచేతను పీడితురాలవై శుష్కించియున్నావు – ధర్మము తనగృహమందే ఆరంభము కావలసినది ఐతే అక్కడనే పర్యవసానము కాగూడదనే న్యాయముచే ముందు తన యొక్క ప్రత్యక్షసంబంధులనున్ను తననుఆశ్రయించియున్నవారినిన్ని ఆదరించినమీదట సాధ్యమైతే పరులకు ఉపచరించడము యుక్తమైన కార్యమై యున్నందువల్లనున్ను భార్యయొక్క సంరక్షణ ముఖ్యధర్మముగా పురుషుడు ఆచరించవలసినది అవశ్యమైయున్నందువల్లనున్ను నీభాగము అతిథికి ఇవ్వడమునకు నేనంగీకరించకూడదనిన్ని భర్తజవాబు చేప్పినట్టున్ను ఏ హేతువుచేత మీరు జితేంద్రియులై ఆయనకు మీభాగము సమర్పించినారో ఆ హేతువుచేతనే ఆయనయొక్క ఆకలితీరేటందుకు నాభాగమునున్ను వినియోగపరచి నేను తరించేదాన్ని కావలెననే ఆసక్తి నాకున్ను కలుగుతున్నది – గనుక ఈభాగమును ఆయనకు మీరు యివ్వవలసినదని నేను మిమ్మున వేడుకుంటున్నానని భార్య తిరిగీ చెప్పినట్టున్ను అందుకు ఆయన అంగీకరించి ఆమెభాగమైన పిండిన్ని సదరు యాచనకుఇచ్చినట్టున్ను ఆయనఅదిన్ని పుచ్చుకుని తృప్తిలేనివానివలె అగుపడ్డట్టున్ను అంతట గృహాధిపతియొక్క కుమారుడాస్థితిని గ్రహించి తనభాగమైన సత్తుముద్దుకూడా ఆయనకు యిమ్మని తండ్రితో మనవిచేసినట్టున్ను ఇందుకు నేను ఒప్పడము న్యాయము కాదనిన్ని నేనున్ను నీతల్లిన్ని కాలముగడిచినవారమై యున్నందున మాక్షుత్పిపాసలు ప్రబలముగా నుండనేరవున్ను వాటిని మేము భరించవచ్చుననిన్ని యౌవనమందున్న నీయాకలి దప్పులు మిక్కిలి ప్రబలములై యుంటవిగనుక వాటిని నీవు తిరస్కరించడము చాలా ప్రయాసమైయుంటున్నదనిన్ని నీవు నిరాహారుడవై యుండడమునకు నేను సహించచాలననిన్ని తండ్రి యుత్తర విచ్చినట్టున్ను మనుష్యుడు శరీరదార్ఢ్యము కలిగియున్నప్పుడే ధర్మసంగ్రహము చేయవలశినది విధి గనుకనున్ను, ఈ యతిథియొక్క క్షుత్తును శాంతిపరచడమునకు మీరు ఉద్దేశించినారు గనుకనున్ను – తండ్రియొక్క యుద్దేశమును నెరవేర్చడము కుమారునకు మిక్కిలీ యవశ్యమైనపని గనుకనున్ను ధర్మమువల్ల వర్తించవలసినది నాకున్ను జురూరేగనుకనున్ను నాభాగమైన పిండిముద్దనున్ను మీరు అర్థివినియోగములో తేగా చూడవలెనని నేను నిరీక్షిస్తున్నాననిన్ని కుమారుడు ప్రార్థించినందున తండ్రి అందుకు సంతోషించి ఆముద్దయున్ను సదరు బ్రాహ్మణుని యొద్దనుంచినట్టును ఆయన అదిన్ని సారుపడి యింకా ఆకలి తీరనివాడుగా నుండినట్టున్ను ఈ అభిప్రాయమును సదరు గృహదక్షునికోడలుకనిపెట్టి మామగారిని చూచి నాపెనిమిటిన్ని అత్తగారున్ను మీ యత్నమును సానుకూలము చేయడమునకు ఏలాగున బుద్ధులైనారో నేనున్ను అదే ప్రకారము అందుకు బద్ధురాలనౌచున్నాననిన్ని నాపాలిసత్తుముద్దుయున్ను మీరు అతిథి వినియోగముచేసి నన్ను కృతకృత్యురాలునుగావించవలెననిన్ని వేడుకున్నట్టున్ను ఆదర్ఖాస్తుకు ఆయన సమ్మతించక నీవు మరియొకరి బిడ్డవైయుండిన్ని మాయింటికివచ్చి మేము కృతార్థులమయ్యేలాగు నడుచుకుంటూఉన్నదానవున్ను బలవంతమైన క్షుత్పీడచేత సొక్కియున్నదానవున్ను ఐయుండగా నీయొక్క భాగమును మరియొకరికి ఇచ్చి నీవు భోజనము చేయకుండా ఉండడము నాకు సమ్మతిగా నుండలేదని ఆయన తిరిగీపలికినట్టున్ను స్త్రీకి పతియే దైవమని చెప్పబడుతున్నదిన్ని మత్పతికి ఆజ్ఞాకర్తలైన మీయొక్క యత్నము సమగ్రమైనదిగా చేయడమునకు ప్రయత్నముగలదాన్ని కావడముచేత నేనున్ను ధర్మానుసారిణిని కావలసినది గనుక నాకోరికనున్ను తమరు ఆదరించవలసినదని ఆమె మామగారిని బతిమాలుకున్నట్టున్ను అందుకు ఆయన యొప్పుకుని ఆ ముద్దయున్ను సదరు బ్రాహ్మణునకు అందించినట్టున్ను అంతట ఆయన అది భక్షించి సంతుష్టిని పొంది మీ నలుగురి యోగ్యతకు సంతోషించినాననిన్ని మీకు స్వర్గము కలుగుతున్నదనిన్ని వారినిగూర్చి పలికి అక్కడనుంచి వెళ్ళినట్టున్ను వెంటనే ఆకుటుంబమువారు నలుగురున్ను స్వర్గమునకు వెళ్ళినట్టున్ను ఒక కథచెప్పబడ్డది.

౩ – మరిన్ని ఆ కుటుంబమువారి యింటియొద్ద ఒకకలుగులో నొక ముంగియుండి సదరు వృత్తాంతము యావత్తువిని వెలపలికి వచ్చి వారు సదరు అతిథికి ఇచ్చిన పాద్యమువగైరాల తీర్థముతాలూక్‌ యింకిపోకుండానున్న తర్థములో ముందుగా తనతలముంచి తదనంతరము అందులో పొర్లాడే నిమిత్తము ఆస్థలమందు అది యొరగినట్టున్ను అక్కడనున్న ఉదకశేషముచేత దాని శరీరముయొక్క యొక భాగముమాత్రము తడిసినట్టున్ను అందుచేత అట్లాతడిసిన భాగమున్ను శిరస్సును స్వర్ణమయములైనట్టున్ను అంతట నాముంగికి తన శరీరము యొక్క తతిమ్మాభాగము కూడా స్వర్ణమయమైనదిగా చేసుకోవలెననే సంకల్పము ఉదయించి పుణ్యక్షేత్రములకున్ను మహత్ములని చెప్పబడ్డవారి ఆశ్రమములయొద్దికిన్ని యాగములు చేయబడే స్థలములకున్ను వెళ్ళి అటువంటి స్థలములలో సత్కరించబడ్డవారి పాదతీర్థములలో ప్రవేశించి పొర్లుతూ ముణుగుతు వచ్చినట్టున్ను కొంత కాలముఅలాగున జరిగించి సువర్ణ వికారము పొందకుండానున్న తనశరీరభాగము ఎప్పటివలెనే యున్నట్టు చూచుకుని విసికియుండగా ధర్మరాజు అశ్వమేధయాగము చేస్తున్నాడని వినవచ్చినట్టున్ను అప్పుడు అక్కడికివెళ్ళి ఆయాగమందు పూజించబడ్డవారి పాదోదకములయందు పొర్లాడుతూనుండి యాగమంతా పూర్ణమైన తరువాత బంగారపు రంగును పొందకుండా నుండిన తన శరీర భాగము ఎప్పటి వలెనె యుండగా చూచుకుని అసహ్యపడి అక్కడనుండిన యొక కలుగులో నివసించి యుండగా ధర్మరాజు సభతీర్చి యున్నయెడల చాలామంది ఋషులు ఆ యాగధర్మమందు తృప్తినిపొంది రాజునున్ను యాగమునున్ను మిక్కిలీస్తోత్రములు చేసినట్టున్ను ఆ సమయమందు సదరు ముంగి కలుగులోనుంచి వెలుపలికి వచ్చి స్ఫూర్తిగలకంఠముతో రాజున్ను సభికులైనవారున్ను వినేలాగు ఈ యజ్ఞకార్యమందు తనకు విశేషమేమీ కనుపడలేదనిన్ని సదరు మహాత్ములు చేసిన స్తోత్రములు వినియోగముమాలినవనిన్ని అన్నట్టున్ను అప్పుడాసభలోనున్న ఋషి శ్రేష్ఠులు కొందరు నీవు ఎక్కడనుండేదానవు ఇక్కడికి ఎందుకు వచ్చినావు సమస్తజనులున్ను ఈ యాగమందలి సత్కారములవల్ల సంతసించి యుండగా ఈయాగము వినియోగము మాలినదిగా నీవు నిందించడమునకు హేతువేమని అడిగినట్టును – అందుమీదట సదరుకుటుంబము వారియొక్క వృత్తాంతమున్ను తనశిరస్సున్ను శరీరముయొక్క అర్ధభాగమున్ను హేమరూపమైన సంగతిన్ని తతిమ్మాశరీరమును స్వర్ణమయముగా చేసుకోవలెనని తనకు ఇచ్ఛపుట్టినందుకు తాను పరిశీలించిన వైనమున్ను సదరు అశ్వమేధమందు తాను జరిగించిన యత్నమున్ను తెలియచేసి బంగారువర్ణములైయున్న తనతలయున్ను ఒంటియొక్క యొక పక్కానున్ను అట్లా కాకుండా శేషించియున్న భాగమున్ను చూడవలసినదని, వారికి కనుపరిచి సదరు కుటుంబమువారి ధర్మము ముందర తాను చూచిన యావత్కార్యములు ఈ అశ్వమేధము సమేతు ఏమిన్ని లెక్కలో లేకుండా నున్నవనిన్ని యిటువంటి గొప్పనిమిత్తములు నెరవేర్చడమునకు పూనుకున్నవారు అందుకు తగినద్రవ్యము రాబట్టేయెడల ఇతరులకు కలిగే ఆయాసమునుగురించి జవాబుదార్లు కావలసి యుంటారనిన్ని దానము చేయడముకంటే యితరులకు ఆయాసము కలుగకుండా నడచుకోవడము విశేషమైన కార్యమనిన్ని చెప్పి ఆముంగి తిరిగీ కలుగులోకి వెళ్ళినట్టున్ను సదరు ఋషులందరు ఏమిన్ని చెప్పలేక ఎవరిమట్టుకువారు రాజానుమతిమీద లేచి వెళ్ళినట్టును రాజుభిన్నుడై అంతఃపురమునకు వెళ్ళినట్టును ఒకకథ గ్రంధమందు చెప్పబడి యున్నది.

౪ – ముంగి న్యాయగ్రాహకమైన బుద్ధిలేనిదై యున్నది యుక్తి యుక్తములైన సంగతులచేత రచించబడే మనుష్యభాష యొక్క అర్థము వివరముగా దానికి ఏలాగున తెలుస్తుంది అటువంటి భాషను ఏర్పరచే సామర్థ్యము దానికి ఏలాగున కలుగుతుంది బ్రాహ్మణులు వాడికచేసిన జలములయొక స్పర్శచేత దాని శరీరముయొక్క కొంత భాగము ఏలాగున హాటక స్వరూపమౌతుంది యివి ప్రపంచ మర్యాదకు విపరీతములైన కార్యములు గనుక వాస్తవముగా నడిచియున్నట్టు ఎంచడమునకు ఎంతమాత్రమూ సబబులేదు.

౫ – ఈకథయందు కనుపర్చడమునకు ఉద్దేశించబడ్డ నీతియుక్తులయొక్క వివరము – మనిషి ధర్మము జరిగించడము అవశ్యమున్ను ముందు తనకుటుంబమునున్ను తనను ఆశ్రయించుకుని యున్నవారినిన్ని గురించిన సంరక్షణ జరిగించడము ముఖ్యధర్మమనిన్ని తదనంతరము పాత్రతయున్ను జురూరున్ను గలవారికి సాధ్యమైనంతమట్టుకు తనశక్తికొలది ఉపచరించడము ఆవశ్యకమనిన్ని న్యాయముగా ఆర్జన చేయబడ్డ సొత్తులో మంచి మనస్సుచేత పాత్రతయున్ను జురూరున్ను గెర్తెరిగి చేసినధర్మము ఎంతస్వల్పమైనదిగా నున్నప్పటికిన్ని విశేషమైనదిగా పరిణమిస్తుందనిన్ని కేవల న్యాయానుగుణముగా ఆర్జించనిసొత్తు ఎంతవిస్తారముగా వ్రయముచేసినా న్యాయకష్టార్జితము తాలూక్‌ స్వల్పభాగముయొక్క ధర్మముతో సమానము కానేరదనిన్ని ఇతరులకు బాధకరముగా నుండేలాగు ఆర్జించినసొత్తు ఎంతవిస్తారముగా ధర్మము చేసినా అది తద్దోషముయొక్క సూక్ష్మభాగమునైనా పోగొట్టడమునకు చాలదనిన్ని యెటువంటి యోగ్యతగలవారుగా చెప్పబడ్డవారిలోనైనా అనేకులలో నొకరుగాని నిజమైన యోగ్యతగలవారు ఉండనేరరనిన్ని యెన్నితీర్థయాత్రలుచేసినా యెన్నియాగములుచేసినా మంచిమనస్సుచేతనున్ను కష్టార్జితద్రవ్యముచేతనున్ను చేయబడ్డ స్వల్పమైన ఉపకారమునకు సరిగా నేరవనిన్ని డంబమును ఆపేక్షించి జరిగించిన విస్తారపు ధర్మమైనా పారమార్థికతచేత జరిగించిన కించిదుపకారమునకు సరిరానేరదనిన్ని – యాగకార్యము ధర్మరాజుచేత జరిగించబడ్డదైనా సఫలము కావడము దుస్తరమేననిన్ని స్తోత్రము చేసేవారు వాస్తవమును కనిపెట్టడము అరుదనిన్ని తెలియడమునకు సదరు ముంగి చెప్పినదన్న కథ కల్పించబడ్డది గాని అది వాస్తవముగా నడిచినదికాదు.

కేకయమహారాజప్రశంస

౬ – ఆత్మనామమును ప్రకటనచేస్తున్న రాజ్యమునకుప్రభువుగానుండిన కేకయమహారాజనే పేరుగలయొకరాజు వైభవములచేతనున్ను సౌఖ్యములచేతనున్ను సంతోషిస్తూఉన్న కాలములో ఒకానొకనాటి రాత్రి నిద్రించియుండి ప్రభాతసమయమునందు మలయమారుతాదులచేత ప్రబోధితుడైయున్నసమయమందు చీమలయొక్క యొకపంక్తి ఆయన శయనించి యున్నమంచముయొద్దికి వచ్చినట్టున్ను అప్పుడు ఆబారు వెళ్ళదలచిన మార్గము ఆమంచముయొక్క కిందుగా నుండినట్టున్ను ఆపంక్తియందు …మైన చీమ అదికనిపెట్టి తనను అనుసరించియున్న చీమలబారును ఆటంకపరచి ఆసంగతి వటికి తెలియజేసి మంచముకిందుగా మనబారు వెళ్ళడము హల్కాపని …యున్ను మరియొక మార్గముగా వెళ్ళడమునకు ఇక్కడ … లేనందున చాలాదూరము తిరిగిపోవలసి వస్తుంది గనుకనున్ను రాజదంపతులతోనున్న ఈ మంచము మన పంక్తిలోనుండే చాలాచీమల యొక్క సహాయముచేత అవతలనుంచి మన … నిరాళముగా నడిపింతామని అన్నట్టున్ను ఆ కేకయమహారాజుకు ఒక పురుషుని అనుగ్రహమువల్ల మనుష్యునకు భిన్నములైన జంతువులభాషలయొక్క అభిప్రాయమును గ్రహించే సామర్థ్యముకూడా కలిగిఉన్నట్టున్ను సదరు చీమయొక్క సంభాషణ ఆయనకు వినవచ్చినట్టున్ను అది వింటూవున్న సమయమందు ఆయన అప్పుడప్పుడు నవ్వుకుంటూ వచ్చినట్టున్ను ఆయనయొక్కరాణి యాసంగతిని కనిపెట్టి మనయిద్దరికంటె ఈ స్థలమందు మరియెవరూలేరు – మనకు ఇప్పట్లో ఏమీ సంభాషణ జరగలేదు ఇతరుల వాక్యములున్ను మనకు వినబడడము లేదు ఈలాగున నున్న సమయమందు మీకు నవ్వురావడమునకు కారణమేమో తెలిసినది కాదు. నేను ఉన్న స్థితియందు మీకుయేమైనా వింత కనుపడి అందుచేత మీరు నవ్వియున్నట్టైతే నాయందుదయచేసి వైనముచెప్పవలసినదని రాజును అడిగినట్టున్ను నేనునవ్విన హేతువు నీవుఊహిస్తూఉన్న నిమిత్తమును గురించినది కాదనిన్ని అందుకు మరియొక సంగతి కారణమై యున్నదనిన్ని అందులవివరము ఎవరికిన్ని తెలియనీయతగ్గదికాదనిన్ని ఇందునగురించి నీవు అనుమానమును ఉంచుకోవల…లేదనిన్ని ఆయన జవాబుచెప్పినట్టున్ను అందువల్ల ఆమెకు అనుమానము తీరడమునకు బదులుగా అదివృద్ధికావడమే కాకుండా విచారమున్ను అభిమానమున్ను క్రోధమున్ను కూడా కలిగినందున వాస్తవమైననకారణము ముఖ్యముగా చెప్పవలసినదని ఆమె చలపట్టినట్టున్ను సదరు సామర్థ్యము రాజుకు కలుగచేసిన గురువు ఆ విద్యను ఆయనకు ఉపదేశించిన కాలమందు మనుష్యేతర జంతువులయొక్క భాషను నీవు విని గ్రహించి యుండవలసినదేతప్ప అందుల అభిప్రాయమును మరిఎవరికిన్ని తెలియచేయకూడదనిన్ని ఈయాజ్ను మీరి ఒకవేళ ఎవరికైనా ఆ భాషయొక్క అభిప్రాయమును తెలియచేసిన పక్షమందు తత్క్షణమే నీవు ఇహలోకములను వదిలిపెట్టవలసిన వాడవౌతావనిన్ని విధించియున్నట్టున్ను ఇందువల్ల తానునవ్వినసబబు ఆమెకువినుపించడమునకు అనుకూలము లేకపోయినందున రాజు ఆమెను అనేకవిధములచేత బుజ్జగించినా ఆమె వినకపోయినట్టున్ను అటుపైన ఆసంగతి తెలియచేసిన పక్షమందు తాను జీవితేచ్ఛవదిలిపెట్టవలసి వస్తుందని రాజుపలికినట్టున్ను అక్కరలేదు వివరము చెప్పడము అననుకూలముగా మీరు యోజించే పక్షమందు నేనే శరీరమును వదలిపెడుతానని రాణి అన్నట్టున్ను అందుమీదట రాజు ఆమెను ఓదార్చచాలకనున్ను ఆమెయందు మిక్కిలీ ప్రేమగలవాడైనందుననున్ను అప్పట్లో ఆమె పొందియున్న దుఃఖస్థితి చూచినంతల్లో సదరు కల్తచేత ఆమె ప్రాణమును వదిలిపెట్టునేమోనని అనుమానము ఉదయించినందుననున్ను మిక్కిలీ విచారమును పొంది నిశ్చయములేని వ్యాపారముగలవాడుగా నుండినట్టున్ను మరిన్ని తనగురువుయొక్క ఉత్తరువునువిశ్వసించి ఆమెకుఉత్తరమివ్వకుండా నుండినట్టున్ను ఆలాగున మతిస్థిరతలేకుండా రాజు వ్యవహరిస్తూ ఉన్నసమయమందు ఒక గొప్పపాడుబావికి సమీపముగా ఒక మేకలజోడు ఉండినట్టున్ను వాటిలో పెంటిమేక నిండుచూడితో నుండినట్టున్ను అప్పుడది ఆ బావివంకసూచి దానిలోపలి పక్కలను కొన్నిచెట్లు మొలిచి తేపగా పెరుగుతూన్నట్టు కనుపడుతున్నందున వాటిరొట్టకొంచెము తెచ్చి తనకు ఇవ్వవలసినదని చీంబోతును అడిగినట్టున్ను పొలములో అక్కడక్కడ చెట్లు ఉండియున్నవి కావలెనంటె అక్కడికి వెళ్ళి వాటిరొట్ట మెయ్యవచ్చునని చీంబోతు అన్నట్టున్ను తనకు ఆకలిగా ఉన్నదిన్ని దూరముగా వెళ్ళడమునకున్ను ఒకచోటినుంచి మరియొకచోటికి తిరుగుతూ ఉండడమునకున్ను ఓపికతక్కువగానున్న దిన్ని విశేషించి ఈబావిలోపలినుంచి పెరిగిన మొక్కలయొక్క రొట్టమిక్కిలి పసందైనదిగా కనుపడుతున్నది – గనుక ఆరొట్టనే తెచ్చియివ్వవలసినదని పెంటిమేక తిరిగీచెప్పినట్టును నీకు బాగా ఆకలిగానుంటె ఏరొట్టఐనా తిందువు ఒకవేళ బావిలోనున్న మొక్కలఆకే కావలెనంటే సమీపమందే బావియున్నది గనుక నీవేవెళ్ళిమేస్తే యుక్తముగా నుంటుందని పోతుమేక చెప్పినట్టున్ను తానునిండుగర్భిణిగా నున్నందున సంచారయోగ్యత తక్కువగా నున్నదిన్ని ఈలాగున నుండి బావియొక్క లోపలి పక్కలనునిలిచి మేసేయెడల బావిలోపడుదునేమో నని భయము కలుగుతున్నది – గనుక తన కోరిక నెరవేర్చవలసినదని పెంటిమేక అన్నట్టున్ను బావియొక్క లోపలి అంచులునున్న యెడల కాలుజారి అందులో పడ్డ పక్షమందు ఎవరికిని అపాయమే కలుగుతుందనిన్ని నీ ప్రాణమందు నీకు ఎంత ఆసక్తి కలిగియున్నదో నా ప్రాణమందు నాకున్ను అంత ఆసక్తి కలిగియున్నది – గనుక నీవు పొలముమీదికి వెళ్ళి అక్కడ ఉండే చెట్లరొట్టనే నెమ్మదిగా మెయ్యడము అనుకూలమనిన్ని చీంబోతు తిరిగీ జవాబు చెప్పినట్టున్ను నీకు యథాప్రకారముగా నుండేశక్తిని ఏమిన్ని ఇప్పట్లో లోపముకలిగియుండలేదు – గనుక బావియొక్క లోపలిపక్కలను నిలిచిరొట్టతీసుకోవడమునకు తనవలె భయపడవలసినహేతువు లేదనిన్ని ఆరొట్టతెచ్చి ఇవ్వవచ్చుననిన్ని ఆడమేక తిరిగీ అన్నట్టున్ను వినియోగము మాలినమాటలు ఎందుకు చెప్పుతావు నేను చాలామార్లుమాళ్ళి ప్రతితడవకు కొంచెము కొంచము రొట్ట తెచ్చియిస్తేనేకాని నీకు ఆకలియున్ను భ్రమయున్ను తీరదు చాలామార్లు బావిలోపల కాలునిల్పి రొట్ట తీసుకుంటూ తిరిగీ బావిమీదికి ఎక్కివస్తూఉంటె ఒకసారైనా పొరబాటు రాకుండా ఉంటుందని నిశ్చయించేవల్లలేదు – నీవు వెళ్ళి రొట్ట మేసేపక్షమందు అనుకూలమైన పట్టు ఉన్నచోట తిన్నగా కాళ్ళునిలిపి నీ ఆకలిన్ని భమయున్ను తీరేలాగున మేసి జాగ్రతగా తిరిగీపైకి చక్కారావచ్చునని చీంబోతు చెప్పినట్టున్ను పురుషజాతికి ఉండే ధైర్యమున్ను లఘుసంచారశక్తిన్ని బలమున్ను స్త్రీజాతికి ఉండనేరదనిన్ని తనయొక్క వర్తమానస్థితివల్ల సులభముగా సంచరించేవల్ల లేకుండా ఉన్నదనిన్ని ఇదిగాక స్త్రీజాతికి అవశ్యమైనటువంటిన్ని విశేషించిన్ని గర్భిణులు కోరినటువంటిన్ని వస్తువులు సమకూర్చడము పురుషజాతికి ధర్మమనిన్ని ఈ హేతువుచేత తనకోరిక అంగీకరించి ఏలాగునైనా నెరవేర్చతగ్గదని చూడిమేక పలికినట్టున్ను ఏకార్యమునైనా నెరవేర్చడమునకు అనేకవిధములైన ప్రయత్నములుచేసే సామర్థ్యము మనుష్యునకే తప్ప తదితర జంతువులకు ఉండనేరదనిన్ని వన్యములైన పశ్వాది జంతువులయందు చిన్నపిల్లలు తప్ప దతిమ్మా వాటిలో క్షున్నిహరణ చేసుకోవడమును గురించి దేనిమట్టుకు అదే బాధ్యతగలదై యుంటుందనిన్ని నాయొక్క ప్రాణమునకు హానివన్చునేమోనని కనుపడుతున్న కార్యమును నీయందలీ ప్రేమను పట్టి ఏలాగున జరిగించవలసినదనిన్ని భార్యయొక్క ముష్కరమైన కోరికను తన మృతికి ఒప్పుకుని ఐనా నెరవేర్చక పోతే ఆమె దేహము చాలించునేమో ననే వెర్రిమోహముచేత మతిజెడి యున్న కేకయమహారాజువలె నేను అవివేకిని కానన్ని సహనముతో నీఆసక్తి వెళ్ళబుచ్చడమువల్ల నీయొక్క నాయొక్క ప్రాణములను అపాయమును పొందించకుండా చేసుకోవలసినది వశ్యమై యున్నదనిన్ని చీంబోతు చెప్పినట్టున్ను అందుకు చూడిమేక ఏమిన్నిచెప్పలేక ఒప్పుకుని ఊరికేయున్నట్టున్ను ఈసంభాషణను కేకయమహారాజువిని ఆచర్చ యావత్తు అంతఃకరణయందు తిరిగి సంభావించుకుని ప్రసన్నమైన మనస్సుగలవాడై తన నగరుకు వెళ్ళి రాణినిచూచి మనకు ఏమిన్ని ఆపదలేకయుండగా నీవు విశేషవ్యసనగ్రస్తులైన వారిస్థితినిపొంది మూర్ఖతను వహించియున్నావు – ఏ సంగతివల్ల నాకు నవ్వు వచ్చినదో ఆసంగతి తెలియచేస్తే నాకు ప్రాణహాని వస్తుందని చెప్పి యున్నప్పటికిన్ని అదే తెలియవలెనని కోరుతున్నావనిన్ని లోకస్వభావమునకు భిన్నమైన యొక తెలివి తన దేశికుని అనుగ్రహముచేత తనకు కలిగియున్నదనిన్ని అందువల్ల తెలియవచ్చిన యొక సంగతిని గురించి అప్పట్లో తనకు నవ్వు వచ్చినదనిన్ని అట్లా తెలియవచ్చిన సంగతి ఎవరికైనా తెలియచేసినపక్షమందు తనకు అప్పుడే మృతికలిగేటట్టు గురుశాపము ఉన్నదనిన్ని ఇదియావత్తు వాస్తవముగను తన నవ్వుకు కారణమైనసంగతి తెలియవలెనని కోరకూడదనిన్ని చెప్పి నేను ఎప్పటివలెనే నీతో అనుకూలముగా నుంటానని ఆమెతో ఖరారుచేసి ఆమెను చాలాగా వుస్లాయించి దుఃఖముమానునట్టున్ను తదనంతరమువారు ఎప్పటికివలె సుఖస్థితిని యుండినట్టున్ను ఒకకధ కలిగియున్నది.

౭ – ఈ కథ వాస్తవముగా జరిగియున్నదేనని అనేకులు నమ్ముచున్నారు, వారిలో కొందరు ఇప్పట్లో ఇది ప్రపంచమర్యాదకు విరుద్ధమైన సంగతి ఐనప్పటికిన్ని పూర్వయుగములయందు ఇటువంటి సంగతులు జరిగియున్నవని చెప్పుచున్నారు కాని ప్రపంచమర్యాదకు విరుద్ధములైన ధర్మములు ఏయుగమందున్ను జరిగినట్టు చెప్పడమునకు సబబులేదు మేకలు మొదలైనవి న్యాయగ్రాహమైన బుద్ధిగలవి కావు వాటికి పదపదార్థములజ్ఞానము ఉంటుందని చెప్పడమునకు వల్లలేదు శబ్దశబ్ధార్థజ్ఞానముఉంటే కాని భాషసురచించేవల్ల లేదు చీమలు సూక్ష్మజంతువులు వాటికి ధ్వనిచేసే సామర్థ్యము లేదు ఒకవేళ వాటి స్వరూపమునకు తగినంత మాత్రము ధ్వనిచేస్తవని ఎవరైనానమ్మినా ఆధ్వనివెంటనే వాయుమిశ్రితమైపోను గాని యొకరికి వినపడేటి యంతదూరము వ్యాపించనేరదు నేలనుపరుండే మనుష్యులైనా చీమలయొక్క పలుకులు విన్నట్టు చెప్పడము లేదు గనుక నేలను పాకుతున్న వాటిభాష మంచముమీదనున్న కేకయమహారాజు ఏలాగున విన్నాడ ఏంచను – చీమలు యుక్తియుక్తమైన భాషను ఏలాగున రచిస్తవి ఒకరి మంచము కిందుగా వెళ్ళకూడదనే అభిమానము వాటికి ఏలాగున పుడుతుంది – మంచముతీసి అవతల నుంచుదామనే హిమ్మతు చీమలకు ఏలాగున కలుగుతుంది యోజిస్తే మనుష్యునకు భిన్నములైన జంతువులకు యుక్తియుక్తమైన భాష యున్నదనడమున్ను భాషను వివరముగా గ్రహించే విద్య మనుష్యునకు కలిగి యున్నదనడమున్ను సంభవించతగనివి ఐనట్టు సామాన్యులకైనా తెలియతగియున్నది.

౮ – ఈ కధయందు అల్పజనులు గొప్పమనుష్యుల ఖ్యాతికి అసహ్యపడడము హాస్యాస్పదమనిన్ని తనను ప్రశ్నవేయతగిన వారి ఎదుటను ప్రత్యక్షమైన కారణమును కనుపరచలేనినవ్వు నవ్వడము కల్తలు పుట్టించడమునకు హేతువౌతుందనిన్ని భార్యయొక్క కోరికయైనా న్యాయమైనదిగానుండని పక్షమందు అంగీకరించతగ్గది కాదనిన్ని ఎవరివల్ల తన నాశనమునకు హేతువు కలుగుతుందో అటువంటి వారి విషయమైన మోహము వివేకశూన్యమైనిదనిన్ని తోచని సమయము వచ్చినప్పుడు పెద్దలైన వారి అభిప్రాయమును కనిపెట్టడము అనుకూలమైనదని అనిన్ని యోగ్యమైనసలహా సామాన్యులచేత ఇవ్వబడ్డదైనా శిరసావహించతగ్గదేననిన్ని తెలియడమునకు సదరు కథ కల్పించబడ్డదిగాని వాస్తవమని నమ్మతగినది కాదు గనుక పురాణాదుల యందుండే సంగతులనిన్ని వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదు వివేకశాలులెవరైన వారు పురాణాదుల యందుండే ప్రమేయములను పరిశీలిస్తే వాస్తవములైన వాటినిన్ని ఆయా నిమిత్తములలో నుండే నీతినిన్ని యుక్తినిన్ని విశదపర్చగలందులకు కల్పించబడి యున్న వాటినిన్ని కనిపెట్టనే వచ్చును.

రక్షఃప్రభ్యతిప్రమేయము

౧ – చనిపోయిన మనుష్యులు కొందరు రక్షస్సులున్ను – పిశాచములున్ను – భూతములున్ను – దయ్యములున్ను – ఐ – పూర్వస్వరూపములతోనే కొందరికి కనుపడడమున్ను – వారిని గూర్చి మాటలు చెప్పడమున్ను – కద్దని చాలామంది నమ్ముతున్నారు – ఈ నమ్మకము నిజమైన ఆధారముగలది కాదు, ఎందుచేతనంటే రక్షస్సులు – పిశాచములు మొదలైనవి తమకు కనపడవనిన్ని – తమనుగూర్చి మాట్లాడినవనిన్ని – చెప్పేవారేకాని వాటిని మరియొకరికి కనపరచేవారు ఎక్కడనూ ఉన్నట్టు కనుపడలేదు – చనిపోయినవారి శరీరములు పృథ్వియందు లీనములైపోతూనేయున్నవి – వాని ఆత్మలు తిరిగీ అటువంటిశరీరములతో మనుష్యులకు దర్శన మివ్వడమునకున్ను వీరితో మాట్లాడడమునకున్ను సదుపాయమున్ను నిమిత్తమున్ను ఉండనేరవు – దేహములు చాలించినవారు పరలోకగతులౌతారని గ్రంధములయందున్ను చెప్పబడియున్నది, బుద్ధిమంతులైనవారు చాలామంది అలాగున వాడికకూడా చేస్తున్నారు – గనుక చనిపోయినవారు కొందరు రక్షస్సులున్ను – పిశాచములున్ను – భూతములున్ను – దయ్యములున్ను – ఐ – జీవించియున్న వారిలో కొందరు పూర్వస్వరూపములతో దర్శనమిచ్చి వారిని గూర్చి – మాటలున్ను చెప్పుతున్నారని ఏలాగున నమ్మను, చనిపోయినవారు కొందరు ఏమేమి సబబులచేత రక్షస్సులుగాని – పిశాచములుగాని – భూతములుగాని – దయ్యములుగాని – ఔతారో ఆవైనము సదరు సంగతినమ్మేవా రెవరూ చెప్పజాలకుండా నున్నారు అట్లా అయ్యేమాట వాస్తవమైతే రక్షస్సులు మొదలైనవి యా స్వరూపములతోనే దర్శనమివ్వకపోవడమునకు హేతువుఏమీ కనపడదు, చనిపోయినవారిని మనస్సుచేత చూడవచ్చును మరిన్ని వారిని చూచినట్టున్ను వారితో మాటలు చెప్పినట్టున్ను వారుచెప్పినమాటలు విన్నట్టున్ను – ఒకానొకప్పుడు స్వప్నావస్థయందు సంభవించడము కలదు గాని, చనిపోయినవారు బ్రతికే యున్న వారికన్నులకు పూర్వపుస్వరూపములతో కనుపడడమున్ను వారితో మాట్లాడడమున్ను వాస్తవమని నమ్మడమునకు ఎంతమాత్రము సబబులేదు – ఐతే రక్షస్సులు మొదలైనవి కనుపడతవని నమ్మేవారిలో ఏమనిషియైనా ఒకానొకప్పుడు ఒంటరిపాటున నడిచేయెడల భ్రమను పొంది చనిపోయిన మనుష్యులు పూర్వస్వరూపములతో గాని లేక మరి యే వికారస్వరూపములతో గాని తనకుకనుపడ్డట్టున్ను తనసమీపమందు నడిచినట్టున్ను తనతోమాట్టాడినట్టున్ను ఎంచుకునేదికద్దు ఆభ్రమను పొందినవారిలో కొందరికి అందువల్ల అభిఘాతజ్వరము మొదలైన వికారములు కలిగి వారు చాలాతొందరలను పొందేదిన్ని కద్దు – అందులభయముచేత కొందరు దిగులుబడి క్రమక్రమముగా క్షీణించి చనిపోవడమున్ను కలదు, ఇటువంటివి సంభవించడమునకు వారివారి మనోవికారములే కారణములై యుంటున్నవి.

౨ – ఒకబ్రాహ్మణుడు ద్రవ్యవంతుడై వివాహము చేసుకోవలెననే ఆసక్తి కలవాడుగా ఉండినట్టున్ను – అలాగున నుండగా ఒకానొక నేరమువల్ల ఆయనకొర్తినివేయబడే శిక్షకు విధించబడ్డట్టున్ను – ఆశిక్ష జరిగినమీదట కొర్తిమీద నుండినప్పుడున్ను ఆయనకు వివాహము చేసుకోవలెననే ఆసక్తి తీరకుండా నిలచియుండినట్టున్ను – ఈ సంగతి యొక బ్రాహ్మణుడు గ్రహించి ఆ ద్రవ్యము తనకు ఇచ్చిన పక్షమందు తన కొమార్తెను ఆయనకు పెండ్లిచేస్తానని చెప్పినందున అందుకు ఆ మనిషి యొప్పుకుని తనద్రవ్యమంతా ఆ బ్రాహ్మణునికియిచ్చి ఆ చిన్నదాన్ని వివాహము చేసుకుని ఆ కొర్తిమీదనుండే చనిపోయినట్టున్ను – అంతట ఆ చిన్నదానితండ్రి ఆమెయొక్క – మంగళసూత్రమును విప్పివేసి ఆమెను మరియొక బ్రాహ్మణునికి వివాహము చేసినట్టున్ను ఆయనవల్ల ఆ చిన్నదానికి ఒకకొమారుడు కలిగినట్టున్ను – కొంతకాలమునకు ఆ చిన్నవాడి తండ్రి చనిపోయినట్టున్ను – తదనంతరము – ఆ కొమారుడు గయావ్రజనము చేయవలెననే ఇచ్ఛగలవాడై గయకువెళ్ళి పిండప్రదానము చేసిన్నట్టున్ను – చనిపోయిన మనుష్యులను గురించి గయలో పిండప్రదానము చేసేపక్షమందు, అప్పట్లో వారు ప్రత్యక్షముగా వచ్చి – పిండము అందుకుని వెళ్ళడము కలిగియుండినట్టున్ను – అప్పుడు పిండమును పుచ్చుకోవడమునకు ముందు సదరు కొర్తిమీదనుండి చనిపోయిన మనిషి ఆకొర్రుతోనున్ను – ఆయన వెనుక ఆ పిండప్రదాతయొక్క తండ్రిన్ని – హాజరైనట్టున్ను – వారినిచూచి పిండప్రదాత వీరిద్దరు రావడమునకు కారణమేమని తనతల్లిని అడిగినట్టున్ను పూర్వము జరిగియున్న వాస్తవమంతా కుమారుడితో ఆమె చెప్పినట్టున్ను – అందుమీదట పిండమును గ్రహించేవారు తతిమ్మాస్థలములయందు వలెనే అక్కడనున్ను తమస్వరూపము కనుపరచకూడదని శాపము ఇవ్వబడ్డట్టున్ను వాడిక కలిగియున్నది – కొర్రున వేయబడ్డమనిషి ప్రాణమును వదిలి పెట్టవలసినవాడే కాని వ్యవధిగా జీవించి యుండడమునకు సదుపాయము ఉండనేరదు, సంసారసుఖములను అనుభవించడమున్ను సంతానమును బడయడమున్ను – వివాహమునకు విషయములైయున్నవి ఈలాగుననుండగా ప్రాణప్రయాణ బాధలోనున్న మనిషికి వివాహము చేసుకోవలెననే ఆసక్తి ఏలాగున నిల్చియుంటుంది స్నాతకవ్రతమున్ను, పాణిగ్రహణమున్ను, ప్రధాన ప్రవేశహోమములున్ను, స్థాలీపాకమున్ను, ఔపాసనమున్ను, అధశ్శయనబ్రహ్మచర్యాదినియమములున్ను, గంధర్వస్థాపనాదులున్ను, వివాహమునకు ముఖ్యతంత్రములని చెప్పబడుతున్నవి గనుక పెండ్లికుమారుడు కొర్రుమీదను మరణవ్యధతోనున్న సమయమందు ఈ క్రియలన్ని ఏలాగున జరిగినవని ఎంచను, విశేషించి మంగళసూత్రమైనా ఆయన ఏలాగున కట్టినాడని నమ్మను, ఆ మనిషి సదరహీస్థితిలోనుండిన్ని ఆ చిన్నదాన్ని తనభార్యగా ఏర్పరచుకోవడమునకు ఏమిఫలమును ఆపేక్షించి యుండును, వివాహమునకు విధ్యుక్తములయిన క్రియలు ఏమిన్ని జరగనియెడల ఆ మనిషి ఆ చిన్నదానికి పెనిమిటి అని ఏలాగున ఒప్పవలసినది – అటువంటి చిన్నదానికి మరియొక పురుషునివల్ల కలిగిన కుమారుడు అతనితండ్రిని గురించి పిండప్రదానముచేస్తే ఆపిండమును అపేక్షించవలసిన హక్కు సదరు కొర్తిమీదిమనిషికి ఎట్లా కలుగుతుంది, ప్రాణవిహీనమైన ఘటము భూమియందు స్థాపించబడడముచేతగాని, దహనముచేతగాని, లేక మరియొకవిధముగాగాని, మృత్తులో కలిసిపోతూ ఉండగా కొర్తిమీదనుండి చనిపోయిన మనిషియొక్క ఆత్మకు పూర్వపుఘటమువంటిఘటమే తిరిగీ ఏలాగున దొరికెను కొర్రుకూడా ఏలాగునవచ్చెను – అదికూడా తీసుకుని రావడమునకు ఏమిసబబు ఉన్నది ఈమనిషి కొర్తిమీదనుండి చనిపోయినది మొదలుకుని సదరు పిండప్రదానసమయమువరకు చాలాసంవత్సరములు జరిగియుండినందున తనకున్ను పిండమురావలసినహక్కు ఉన్నట్టు రుజువు పరచేనిమిత్రము ఆ చిహ్నముతోకూడా కనుపడి ఉండునని చెప్పే పక్షమందైనా అంతకాలము మట్టుకు ఆయన పిండమును గురించి తగాదా చేయకుండా నుండడమునకు ఏమి సబబు – ఐతే గయకు భిన్నములైన స్థలములయందు వేయబడే పిండములు చనిపోయిన వారు ప్రత్యక్షముగా గ్రహించడము లేన్నట్టు సదరుకథవల్ల సూచింపబడుతున్నందున సదరుహీ చిన్నదానియొక్క కుమారునకు తండ్రిచనిపోయిననాటినుంచి అతనికి అతని పితృపితామహాదులకున్ను వేసే పిండములలో సదరు కొర్తిమీద మనిషిన్ని అతనిపితృపితామహాదులున్ను, అప్రత్యక్షముగా వచ్చి సగభాగమును పంచుకుంటూ ఉన్నట్టు ఎంచవలసియున్నది గాని వారిలో ప్రతిమనిషికిన్ని పూరా పిండమును ఆపేక్షించవలసిన హక్కు కలిగియుంటూ ఉండగా సగభాగముతోనే వారు సమాధాన పడియుండడమునకు ఏమికారణము, ఈ ప్రమేయముయొక్క మొదటి పేరాలో నుదాహరించబడియున్నప్రకారము చనిపోయినవారు బ్రతికియున్న వారికి ఒకానొకప్పుడు దర్శనమివ్వడమును వారినిగూర్చి మాటలు చెప్పడమున్ను వాస్తవముగా కలిగియున్నట్టయితే సదరు రెండు వంశముల పితృమహాదులున్ను ఆ చిన్నదానికుమారునియొద్దికి అనుకూలమైన సమయమందువచ్చి ప్రత్యేక ప్రత్యేకము పూరా పిండములను కలుగచేసుకునేకొరకు నింతగాజాచేయరాదు, ఉత్తరక్రియలు జరిగించేటప్పుడున్ను ప్రత్యాబ్దికామలయందున్ను పిండప్రదానముచేసేకాలమందున్ను చనిపోయినవారు హాజరైపిండమును గ్రహించే మర్యాదజరుగుతూ ఉండినట్టు చెప్పడము లేక ఉండగా గయలో పిండప్రదానము చేసేటప్పుడు మాత్రము చనిపోయిన మనుష్యులు ప్రత్యక్షముగా పిండమును గ్రహించడమునకు హాజరౌతూ ఉండినట్టు నమ్మడమునకు సబబులు ఏమి యున్నవి, కాబట్టి చనిపోయిన మనుష్యులు పిండమును గ్రహిస్తారనిన్ని – ఇతరస్థలములన్నిటికంటే గయ మిక్కిలీ మహాత్మ్యముగలదనిన్ని, ప్రకటనచేస్తే గయావ్రజనము చేయడమందు ప్రజలకు భక్తికలుగుననే కోరికచేత సదరు కథను గయావళీలు కల్పించి గ్రంధములలో చేర్చియుందురు గాని పైనవివరించిన హేతువులచేత ఈ కథ నమ్మతగనిదిగా తేటపడుతున్నది.

౩ – చనిపోయిన మనుష్యులు కొందరు రక్షస్సులున్ను – పిశాచములున్ను – భూతములున్ను – దయ్యములున్ను – ఐ – తమకు విధమైనయిలాకాలేని వారి గృహములయందు కూడా ప్రవేశించి వాటిలో నివసించి యుండే మనుష్యులకు కనుపడకుండా నుండి తాళములు వేసియుండే గదులలోను పెట్టెలలోను ఒకదానిలో నుంచబడిన వస్తువులు మరియొక దానిలో నుండేలాగు చేయడమున్ను – అటువంటి యొకపెట్టెలో నుంచబడిన వస్త్రములలో మధ్యవస్త్రముయొక్క కొన్ని పొరలు కాలియుండేలాగు చేయడమున్ను – ఇండ్లమీద రాళ్ళుపడేలాగు చేయడమున్ను చూరులయందు ఒకానొకప్పుడు లోపల అగ్నిగల గడ్డితుట్టెలు గాని కొరువులుగాని పొగ రాజుతూనుండేలాగు దోపియుంచడమున్ను – ఒకరు – ఇద్దరు – ముగ్గురు – నలుగురు – ఎత్తడమునకు భారముగానుండె వస్తువులు ఒకచోట నున్నవి మరియొకచోట పడియుండేలాగు చేయడమున్ను – శుభ్రముగానున్న స్థలములయందును వస్తువులయందున్ను అసహ్యములైనవస్తువులు ఉండేలాగు చేయడమున్ను – ఇంకా ఇటువంటి చాలా తొందరలు జరిగించడమున్ను – ఆ యిండ్లలో నివశించేవారు వాటిలో నుండలేక వేరేయిండ్లకు వెళ్ళితే అక్కడికిన్ని, గ్రామాంతరములకు వెళ్ళితే అక్కడికిన్ని కూడా వెళ్ళి సదరు తొందరలె జరిగించడమున్ను కలదని చాలామంది నమ్ముతున్నారు కాని ఇదివాస్తవముకాదు.

శ్లో॥ విద్యాధ రాప్సరో యక్ష రక్షో గంధర్వ కింనరాః పిశాచో గుహ్యక స్సిద్ధో భూతోమీ దేవయోనయః॥

విద్యాధరులున్ను – అప్సరసలున్ను – యక్షులున్ను – రక్షస్సులున్ను – గంధర్వలున్ను – కింనరులున్ను – పిశాచములున్ను – గుహ్యకులున్ను – సిద్ధులున్ను – భూతములున్ను – దేవయోనులని చెప్పబడ్డారు – దయ్యమనేపదమున్ను తద్భావబోధకమేఐయున్నది గనుక చనిపోయినవారు కొందరు రక్షస్సులు-భూతములు-దయ్యములు-ఔతారని నమ్మిన వారు పరుపదివిధముల వారు ఉండేలోకమునకు వెళ్ళి ఉండవలసినదే తన మనుష్యులు నివసించియుండే గృహములలో వారున్ను నివసించి యుండడమునకు ఏమి హేతువు ఉంటుంది వారికి దేవత్వము కలిగియుండగా నిర్నిమిత్తముగా పైన వివరించబడ్డ దుష్కార్యములున్ను అసహ్యములైన పనులున్ను చేసి మనుష్యులను ఏలబాధపెడుదురు అట్లాజరిగించడమునకు వారికి ఏలాగు హక్కు కలుగుతుంది అందుకు వారు ఏల బాధ్యులౌతారు, అందువల్ల వారికి ఏమి బలము కలుగుతుంది యాయిండ్లవారు ఆస్థలమువదిలి మరియొక స్థలమునకు వెళ్ళితే అక్కడికేగాని లేక, ఆ గ్రామమువదిలి మరియొక గ్రామమునకు వెళ్ళితే అక్కడికే గాని కూడా వెళ్ళి వారి యెడల సదరు తొందరలే జరిగిస్తూ ఉండడమునకు ఏమి హేతువు ఉంటుంది. ఇందువల్లనున్ను రక్షస్సులు మొదలైనవి ఈ లాగున జరిగిస్తవని చెప్పేవారు ఎవరున్ను అట్లా జరుగుతున్నట్టు కనుపరచ వలసినదని అడిగేవారికెవరికిన్ని దాఖల్లా యివ్వలేకుండా నున్నందుననున్ను సదరు ప్రకారము రక్షస్సులు మొదలైనవి జరిగించుచున్నవని చెప్పేమాటలు నమ్మతగినవిగా ఉండనేరవు – ఐతే పైన వివరించబడ్డ కార్యములు జరుగుతూఉన్న ఏయింట్లోనైనా యింటివారితో కూడా ప్రవేశించి యుండడమునకు ఇలాకాగల వారెవరైనా అటువంటి తొందరలు జరిగించవలెననే కపట యత్నముగలవారైయున్నపక్షమందు గదుల యొక్క పెట్టెల యొక్క తాళములు తీయడమునకున్ను, పెట్టెలోనున్న వస్త్రములలో నొకమడతకొంతకాలేలాగున చేసి చల్లార్చి తిరిగి యెప్పటి మడతగా చేసి పూర్వస్థితిని యుంచడమునకున్ను, ఒక పెట్టెలోని వస్తువు మరియొక పెట్టెలోగాని యొక గదిలోని వస్తువును మరియొక గదిలోగాని వేయడమునకున్ను ఇంకాపైన వివరించబడ్డ కార్యములు జరిగించడమునకున్ను సదుపాయములు కలుగచేసుకో వచ్చును దమకి – ఏయే గృహాధిపతికి తొందరలు కలుగచేయ పనిని ఇచ్ఛ గలిగినటువంటిన్ని ఆయాగృహములలో చేరియుండేటటువంటిన్ని మనుష్యులున్ను మరిన్ని అటువంటి ఇచ్ఛగలిగి ఆయాగృహములకు పొరుగున నుండేటటువంటి గాని ఆయాగృహస్థులో ఒకానొకరితోనైనా కొందరితోనైనా యిలా కాగలిగినటువంటిగాని భూతవైద్యులమని వాడిక చేసుకుంటూ ఆయాస్థలములకు వస్తూపోతూనుంటేటటువంటిగాని మనుష్యులున్ను ఎవరెవరికి సాధ్యమైనమట్టుకు సదరు కార్యములు జరిగిస్తున్నట్టు ఎంచతగియున్నది కాని – అవి చనిపోయినవారిచేత జరిగించబడుతున్నట్టు ఎంచతగిన కార్యములు కావు.

౪ – చనిపోయినవారిలో రక్షస్సులున్ను – పిశాచములున్ను – భూతములున్ను – దయ్యములున్ను – ఐనవారు కొన్ని చోట్లను కొందరు మనుష్యుల యందు – ప్రవేసించేది కద్దనిన్ని, అట్లా ఆవహించబడ్డ వారు చాలా వికారస్థితులను పొందడము కద్దనిన్ని, వారికి రానిభాషలున్ను, శ్లోకములు మొదలైనవిన్ని, యథాక్రమముగా రచించేది కద్దనిన్ని, వారి బలమునకు మిక్కటమైన కార్యములు జరిగించేది కద్దనిన్ని, కొందరు నమ్ముతున్నారు – ఐతే మనుష్య శరీరములను వదిలిన ఆత్మలలో నొకానొకటి రక్షస్సు ఔతుందని నమ్మినా జీవముతోనున్న యొక మనుష్య శరీరమందు ఆ రక్షస్సు ప్రవేశిస్తుందని ఏలాగున నమ్మవలసినది – ఆ రక్షస్సుకు అటువంటి స్వతంత్రము ఎట్లా కలుగుతుంది – అట్లా ప్రవేశించి యుండడమునకు ఏమి నిమిత్తము ఉంటుంది – మనుష్య శరీరములో రక్షశ్శరీరము ఏలాగున దూరుతుంది – లేక మరియొక రూపముగా ప్రవేశిస్తుందని చెప్పినా అక్కడ ఏలాగున నుంటుంది – శరీరమందు ఏయేజాగాలలో ఏయేవస్తువులు ఉండవలసిందో ఆయా అవకాశములను ఆయా వస్తువులు ఆక్రమించుకునే యుంటవి శరీరతత్వముచేత వుంటే వస్తువులేతప్ప ఇతరవస్తువు శరీరమందు ప్రవేశించే పక్షమందు వర్ణించకుండా నివసించియుండేవల్ల ఏలాగున కలుగుతుంది – యొకవేళ ఆ రక్షస్సుయందున్న ఆత్మమాత్రమే మనుష్య శరీరమందు ప్రవేశిస్తుందని చెప్పేపక్షమందు ఆ ఆత్మయైనా మరియొక ఆత్మ సహితమైన శరీరమందు ప్రవేశించి యుండడమునకు ఏలాగున అవకాశము చిక్కుతుంది – ఒక ఘటమందుండే ఆత్మస్థానమందు రెండు ఆత్మలు ఏలాగున నుంటవి – యొకకత్తికి ఖరాగా సరిపడియుండే యొరలో మరియొక కత్తి ఏలాగున ప్రవేశిస్తుంది – ఆత్మకు ఖరాగా సరిపడియుండే అవకాశమే శరీరమందు కలిగి యుంటుంది, అనగా – శరీరమందు ఆత్మవిషయమై యుండే అవకాశమంతా తదాత్మ అయ్యేదే ఆవరించుకుని యుంటుంది – యొక ఘటమందు రెండు ఆత్మలకు ఏమి ప్రయోజనము కలుగుతుంది. కాబట్టి బుద్ధిమంతులైనవారు యోచిస్తే బ్రతికియున్నవాని ఘటమందు చనిపోయినవాని ఆత్మకూడా ప్రవేశించి యుండడము అసంభవమని సులభముగానే తేటపడతగియున్నది – ఐతే కొందరు మనుష్యుల తెలివియొక్క సహజస్థితి తప్పిపోయేటటువంటిన్ని, వికారచేష్టలు కలిగినటువంటిన్ని, భూతముమొదలైన పేర్లుగల జాడ్యములు చాలాగా సంభవించేది కద్దు – రక్షస్సులు మొదలైనవి మనుష్యులను ఆవహిస్తవని నమ్మేవారు సదరు ఆశక్తములను పొందిన వారిని రక్షసులు మొదలైనవి ఆవహించినట్టు ఎంచుకోవడమున్ను కలదు – ఆ అశక్తములను పొందినవారు వారిస్వభాషలనేమి వారికి వచ్చియుండే భాషాంతరములనేమి శ్లోకములనేమి పద్యములనేమి అనిమిత్తిముగానున్న స్వభావము మనకు భిన్నముగానున్ను చాలామట్టుకు ఆసందర్భములుగానున్ను వచించడము కలదు – వారికి రానిభాషలను – శ్లోకములను – పద్యములను – కూడా వినియుండడము చేత జ్ఞాపకము ఉన్నమట్టుకు సదరు ప్రకారమే వచించడమున్ను కలదు – మరిన్ని వారిలో నొకానొకరు తమ శక్తికి సంపూర్ణముగా సరిపడియుండే భారమును ఎప్పుడైనా విశేషప్రయత్నము చేత వహించడమున్ను కార్యమును చేయడమున్ను కలదు సదరుహీప్రకారము వచించడమున్ను భారమును వహించడమున్ను కార్యములను జరిగించడమున్ను ఆ మనిషి పూర్వము సహజముగా జరిగించేవి కానందున వీటిని విన్నటువంటిన్ని – చూచినటువంటిన్ని వారు వాస్తవము కనిపెట్టలేక భ్రమనుపొంది ఆ మనిషి తనకు రానిభాషలు మొదలైనవి వచించినట్టున్ను – ఎత్తలేని భారమును ఎత్తినట్టున్ను – చేయలేని కార్యమును చేసినట్టున్ను – ఎంచుకని వాటినిపెంచి చెప్పడమున్ను కలదు గాని భూతము మొదలైన పేర్లుగల రోగములలో నొకరోగము గలమనిషి సంకోచమున్ను భయమున్ను లేని హేతువుచేత కొంచము విపరితముగా భాషలను శ్లోకములను వచించినా కృత్యములను జరిగించినా ఆ మనిషికి రానటువంటి భాషలున్ను శ్లోకములు మొదలైనవిన్ని యథాక్రమముగా వచించడమున్ను నిజబలము వల్ల విశేషప్రయత్నము మీదనైనా చేయలేనికార్యములను చేయడమున్ను అసంభవముగా నెంచవలసినది – యొకానొక కుటుంబమువారిలో ఒకానొకరు యజమానినివంచించే కపటబుద్ధిచేతనున్ను భూతావేశమైనట్టు చాలా వికారచిహ్నములను కనుపరచేది కద్దు.

౫ – జగదీశ భట్టాచార్యులు అనే బ్రాహ్మణుడు తర్కశాస్త్రములో శిరోమణి అనే గ్రంధము చేసిన శిరోమణి – భట్టాచార్యుల శిష్యులలో నొకడుగా నుండిన్నట్టున్ను ఆయనకు విద్య యందు మొదట బుద్ధి బాగా ప్రవేశించకుండా ఉండినట్టున్ను – వారి గ్రామములో – ఆదివరకు ఒక చెట్టుమీదకు ఒక బ్రహ్మరక్షస్సుయుండినట్టున్ను – అప్పటప్పటికి ఎవరికైనా ఆ బ్రహ్మరక్షస్సు కనుపడుతూ వచ్చిన్నట్టున్ను – తదనంతరము ఒకానొక నిమిత్తము చేతను చెట్టు కొట్టివేయబడ్డట్టున్ను – అంతట ఆ బ్రహ్మరక్షస్సు జగదీశ భట్టాచార్యులను ఆవహించినట్టున్ను – అందుమీదట జగదీశభట్టాచార్యులకు చాలావిద్యలువచ్చి (౧౮) సంవత్సరములమట్టుకు జగదీశ మొదలైన విశేష గ్రంధములు రచించినట్టున్ను – తరువాత ఆ బ్రహ్మరాక్షస్సు ఆయనను వదలి వెళ్ళినట్టున్ను – అది వదిలిపోయిన నాటనుంచి విద్యావిషయమై ఎవరెవరు అడిగే ప్రశ్నలకు ఉత్తరములు చెప్పేసామర్థ్యము ఆయనకు లేక పోతూవచ్చినట్టున్ను అప్పుడు సదరు బ్రహ్మరక్షస్సుయొక్క ప్రభావము చేత సదరు గ్రంధములు రచించే యోగ్యత ఆయనకు వచ్చినదనిన్ని – ఆది వదిలిపోయిన మీదట ఆశక్తి ఆయనకు తప్పిపోయినదనిన్ని – ఆయనయొక్క సహాధ్యాయులు మొదలైనవారు కనిపెట్టినట్టున్ను – ఒక వాడుక కలిగియున్నది – జీవించియున్న యొకమనుష్య శరీరమందు రక్షస్సు మొదలైన వాటిలో నొకటి స్వశరీరముతో గాని – మరియొక రూపముగాగాని – లేక తదాత్మ మాత్రమైనాగాని ప్రవేశించిన మనకున్ను – నివసించడమునకున్ను వల్లలేనిసంగతి ఈ ప్రమేయము యొక్క నాలుగవ పేరాలో వివరించే యున్నాను – సదరు చెట్టు కొట్టివేయడముతో అందుమీదనున్నదన్న బ్రహ్మరక్షస్సు అంతకంటే యోగ్యముగానుండే మరియొక చెట్టును ఆశ్రయించికులాసాగా ఉండనేవచ్చును – అలాగున జరిగించడమునకుఏమియు ఆతంకము ఉన్నట్టు కనుపడదు – ఐతే జీవించియున్న యొక మనుష్య శరీరమందు ఆ రక్షస్సు యద్రూపముగా ప్రవేశించినదన్నా దానికి చెట్టుమీద కలిగియుండే ఖులాసా ఆశరీరమందు కలిగి యుంటుందని యెంతమాత్రము నమ్మేవల్లలేదు – అందుకు విరోధముగా మిక్కిలీ నిర్భంధమే కలిగియుంటుంది – గనుక ఆ రక్షస్సు అనుకూలమైన మరియొక వృక్షమందు ఖులాసాగా నివసించి యుండడమునకు బదులుగా జగదీశభట్టాచార్యుల శరీరమందు ప్రవేశించడమే సౌఖ్యముగా ఎంచుకుని ఆయిరుకునబడి (౧౮) సంవత్సరములు ఉండినదని ఏలాగున నమ్మను – ఆచెట్టు కొట్టబడ్డ తరువాత బ్రహ్మరక్షస్సు జగదీశభట్టాచార్యులను ఆవహించినట్టు నమ్మదగిన దృష్టాంతములుగాని – అది జగదీశ భట్టాచార్యులను వదిలివెళ్ళినట్టు నమ్మతగిన దృష్టాంతములుగాని – కనుక్కున్నవారు ఎవరూ ఉన్నట్టు సదరు కథవల్ల కనుపడలేదు – మరిన్ని రక్షస్సులు మొదలైన వాటిలో ఏదైనా పూనినమనిషికి వికారచేష్టలున్ను, ఆసౌఖ్యమున్ను, మతిచెడి పోవటమున్ను, సహజమైన్నట్టు లోకమందు …నడుచుగా వాడికె కలిగి యుండగా జగదీశ భట్టాచార్యులను బ్రహ్మరక్షస్సు ఆవహించి నందువల్ల ఆయనకు విశేషముగా కిఫాయత్‌ కలిగినట్టు చెప్పేమాటలు ఏలాగున అంగీకరించతగి యుంటవి ఐతే రక్షస్సులు మొదలైనవి వృక్షములను కూడా నివాస్థానముగా చేసుకుని యుంటవని యొక వాడిక కలిగియున్నందున ఆ సంగతిన్ని రక్షస్సులు వగైరాలు కనుపడుతవనే సంగతిన్ని నమ్మేవారు ఒంటరిపాటున వెళ్ళేయెడల చెట్టు ఉన్న చోటనే రక్షస్సులు మొదలైనవి కనుపడ్డట్టు తరచుగా భ్రమపడేదికలదు – అలాగున ఏ యే చెట్టువద్ద వారికి భ్రమకలుగుతుందో ఆ యా వృక్షములను రక్షస్సుచెట్టు అనిన్ని, వారున్ను, వారుచెప్పడము కొందరు ప్రజలున్ను వాడికచేయడము కలదుగాని – ఏచెట్లమీదనున్ను రక్షస్సులు మొదలైనవి యుండడమున్ను లేదు – వాస్తవముగా ఎవరికన్నులకు కనుపడడమున్ను లేదు సదరు జగదీశభట్టాచార్యులు వగైరాల గ్రామములోనున్ను బ్రహ్మరక్షస్సుచెట్టు అనే పేరుగల యొక చెట్టుఉండి అప్పట్లో అది కొట్టబడియుండును – విద్యార్థులలో ఒకానొకరికి కొంతమట్టుకు విద్యయందు బుద్ధిప్రవేశించకుండా నుండి తరువాత వారికి విశేషముగా విద్య రావడమున్ను కలదు, కొందరికి కొంతకాలము జరిగిన మీదట ఒకానొక అశక్తము చేత తెలివిచెడి పోవడమున్ను కలదు – గనుక జగదీశభట్టాచార్యులకున్ను ఈలాగుననే సంభవించి యుండును – ఆ సంగతులమీద ఆయన యొక్క సహాధ్యాయులు మొదలైనవారు అలాగున ఊహించ వాడుకచేసి యుందురు గనుక ఎవరెవరి సలహా చేత ఈలాగంటి కధలు కల్పించ బడడమేకాని అవి నమ్మతగ్గవి కావు.

మంత్రప్రమేయము

మంత్రములయందు ప్రత్యక్షఫలములుకలుగుచున్నట్టు హిందూజనులు చాలామందినమ్ముతున్నారు కాని, అట్లా ప్రత్యక్షమైన ఫలము ఒకటిన్ని వాటివల్ల కనుపడడములేదు – ఏయేదేవత యొక్క పేరుగా వాడికచేయబడుతున్న యక్షరమునకు గాని, అక్షరములకుగాని, మరికొన్ని యక్షరములనుచేర్చిన్ని, కొన్ని వదములనుఏకముగా చేర్చికొన్ని, కొన్నిమాటలనున్ను పదములనున్ను చేర్చిన్ని, మంత్రములు ఏర్పరచబడియున్నవి – యేదేవతయొక్క నామమైనా మంత్రముగా నేర్పరుచుకొని దాన్ని జపించినవారికి ఆ దేవత స్వాధీనముగా నుంటుందనిన్ని, వారు ఇచ్చ యించిన కార్యములను ఆదేవత జరిగిస్తూ ఉంటుందనిన్ని, యొక వాడిక యున్నది. యే దేవతయొక్క నామమైనా ఏమనిషిఐనా ఎంతకాలము జపించినప్పటికిన్ని – ఆ దేవత ఆమనిషికి స్వాధీనమై యుండడమున్ను సంభవించదు – ఆ మనిషి కోరినకార్యములను జరిగించడమున్ను సంభవించదు – లోకమందు మంత్రములు బహుశః వాడికలోనేయున్నవి వాటిపద్ధతి చాలా మందిగుర్తెరిగిన్ని యున్నారు – కావలెనంటే వాటినియుపదేశించగలవారు అనేకులుఉన్నారు – వాటిని పరమార్థమునకు జెపించేవారు సకృత్తుగా నున్నారు కాని డంబమునకున్ను ఉదర పోషణార్థమునకున్ను వాటిని జపించేవారు తరుచుగా నున్నారు – వాటిని జపించడమువల్ల ప్రత్యక్షములైన ఫలములు దొరకడము వాస్తవమయ్యే పక్షమందు లోకులందరూ జపములు చేయనేగలరు – వైభవములయందు లోకుల కందరికిన్ని ఆశక్తి కలిగేయుంటున్నది కొందరికి శత్రువులను సాధించే ఇచ్ఛకలిగిన్ని యుంటుంది – యింత సులభముగా దేవతావశ్యము కలిగే పక్షమందు ఎవరుబడితే వారే వైభవములనున్ను శత్రువులనున్ను సాధింతురు – ఒకవేళ ఒకానొకరికి గాని మంత్రసిద్ధి కాదని చెప్పెపక్షమందైనా ఆ ప్రకారము సిద్ధికలిగేవారు భూమండలమంతా ఏలే అధికారమునే కోరవచ్చును. వారికి ఎవరిమీద విరోధమువుంటే వారి మీద తమ జపదేవతను ప్రయోగించి వారినందరినీ సాధించనేవచ్చును. లోకమందు మంత్రజ్ఞులనిన్ని యేయే దేవతోపాసన జేసేవారినిన్ని అనేకులు చెప్పబడుతూఉన్నారు. మంత్రసిద్ధికలవారని చెప్పబడే వారందరూ అటువంటిసిద్ధి తమకు లేదనిన్ని మంత్రసిద్ధికానేరదనిన్ని దేవతావశ్యము కానేరదనిన్ని ఆ మంత్రదేవతలు తమకు ఏమిన్ని కార్యముచేసి పెట్టవనిన్ని బాగా గుర్తెరిగే యున్నారు – ఐతే అటువంటి వాడిక కలవారు తమ జీవనార్థము డాంబికులై ఆ వాడికను కలుగచేసుకొని యుంటారు గనుక వాస్తవస్థితిని వారు బయలుపరచరు – ఇటువంటి మంత్రములవల్ల ప్రత్యక్షఫలములు కలుగుతున్నట్టు నమ్ముతున్నటువంటిన్ని తమశత్రువులను సాధించవలెనని ఇచ్ఛగలిగినటువంటిన్ని కొందరుమనుష్యులు సదరు మాంత్రికులనే వాడికె గలిగినటువంటిన్ని భూతవైద్యులనే వాడికె గలిగినటువంటిన్ని వారినితీసుకునివచ్చి పూజించి ఆదరించి తమ శత్రువులమీద ప్రయోగము చేయవలసిందని కోరడమున్ను అట్లా కోరబడ్డవారు కొంతమట్టుకు మంత్రములు జపించడమున్ను చాలాతంత్రములు ఏర్పరచడమున్ను అట్లాకోరిన వారియొద్ద కొన్ని నెపములమీద కొంతద్రవ్యము సంగ్రహించడమున్ను కలదు – ఈలాగున నుండగా ఒకానొక సంగతిలో శత్రువులని చెప్పబడ్డవారికి దైవవశమువల్ల మరి యే హేతువు చేతనైనా ఆశక్తముగాని మరి యే తొందరగాని సంభవించిన పక్షమందు సదరు ప్రయోగము చేస్తున్నామనే వారికి విశేషముగా ద్రవ్యము దొరకడమున్ను వారు మిక్కిలీ ప్రజ్ఞగలవారని వారిచోట గౌరవము చిక్కడమున్ను కలదు – ఒకవేళ ఎవరిమీద ప్రయోగము చేయడమునకు వారు పూనుకున్నారో అటువంటివారికిగాని వారి కుటుంబములో మరి యెవరికి గాని అప్పట్లో ఏమిన్ని తొందరలు సంభవించక పోయిన పక్షమందు అనుకూలపడితే వారికి ఏవిధములైన తొందరలైనా కలుగడమునకు సదరు ప్రయోగవేత్తలు మరియొక విధముగా ప్రయత్నముచేసి కృత్రిమములు జరిగించడమున్ను కలదు, అవి కలిసివచ్చిన పక్షమందు తమ మంత్రశక్తివల్లనే ఆప్రకారము జరిగినట్టుకనుపరచి అందువల్ల కిఫాయతును పొందుతూ ఉండడమున్ను కలదు – ఐతే శత్రువులని చెప్పబడ్డవారికిగాని వారికుటుంబములో ఎవరికైనాగాని దానికి అదియేమిన్ని ఆశక్తమైనా హానియైనా సంభవించకపోయినా లేక తాము చేసిన ప్రయత్నములవల్ల ఏమిన్ని ఘటన పడక పోయినా శత్రువులు జాగ్రత్తపడి తగిన మంత్రప్రజ్ఞ గలవారిని తీసుకుని వచ్చి వారివల్ల సదరు ప్రయోగమునకు ప్రతిక్రియ చేయిస్తున్నారనిన్ని అందుకు ఇంకావిశేషముగా కొన్ని జపములున్ను తంత్రములున్ను జరిగించవలసి యున్నదనిన్ని తెలియచేసి పైగా కొంతద్రవ్యమున్ను రాబట్టుకుని మరికొన్ని ప్రయత్నములు జరిగించడమున్ను కలదు – అప్పటికిన్ని శత్రువులని చెప్పబడ్డ వారికిగాని వారికుటుంబము తాలూకు మరియొకరికిగాని యేమిన్ని తొందర కనుపడక పోయిన పక్షమందు పగతీర్చుకోవలెనని కోరినవారు సదరు ప్రయత్నములవల్ల ఫలము కలుగకపోయినట్టు కనుక్కొని యింకా వ్యయము చేయడమునకు యత్నము లేని వారుగా కనుపడే పక్షమందు శత్రువులు సహాయముగా తెచ్చుకున్న మనుష్యులు తమతో సమానులైన మాంత్రికులనిన్ని తమ ప్రయోగములన్నిటికిన్ని వారు ప్రతిహతి చేస్తున్నారనిన్ని కోరిన కార్యము పర్యాయతః నెరవేర వలసి యుంటుందనిన్ని తెలియ చేసి అప్పటికి ఆ ప్రయత్నము నిల్పి వేయడమున్ను కలదు – మంత్ర ప్రయోగములు దయ్యములు వగైరాలు వ్యాధిరూపముగా మనుష్యులను బాధిస్తవని నమ్మేవారికుటుంబములలో నిడివిగానిలచియుండే వ్యాధులుకలిగినప్పుడు సదరు మాంత్రికులు ఆ కుటుంబములవారి యొద్దికిజేరి వారినమ్మకములను బలపరచి ఆవ్యాధులను తాము నివారిస్తామని జపములు చేయడమున్ను కొన్నితంత్రములు జరిగించడమున్ను కలదు – అందువల్ల కిఫాయితు కనుపడక పోయిన మీదట అంతకంటే అధికమైన మంత్రసామర్థ్యము గలవారిని తెచ్చుకునేకొరకు ఆ యా గృహాధిపతులు యత్నములు జరిగిస్తూ ఉండడమున్ను కలదు, గాని చాలా స్థలములయందు సదరు వ్యాధులయొక్క వాస్తవములైన కారణములను కనిపెట్టడము లేకపోతూనేయున్నది – పాములు మొదలైన వాటియొక్క విషము దిగిపొయ్యేలాగు చేస్తామని కొందరు మంత్రించడముకలదు. పాముకాట్లను గురించి మంత్రిస్తామనేవారు చాలా మంది ఔషధములున్ను సంగ్రహించియుంచి వాటినిన్ని ప్రయోగించి మంత్రమున్ను మంత్రించేది కద్దు కాని సత్త యావత్తు ఔషధములయందే యున్నదనిన్ని మంత్రమందు సత్తయేమిన్ని లేదనిన్ని, ఆ మంత్రించేవారు బాగా గుర్తెరిగేయుంటారు. ఐనప్పటికిన్ని లోకులను భ్రమపరచే ఇచ్ఛచేత మంత్రించడమును వదిలిపెట్టరు మంత్రము దేవతాసంబంధమైనదియై యుండగా మంత్రసిద్ధి వారికి కలిగియున్న పక్షమందు వారు ఔషధముల సహాయమును కోరడమునకు ఏమి నిమిత్తము ఉంటుంది – కొందరు మంత్రములవల్ల క్రియగలదని నమ్మి వాటిని నేర్చుకుని మంత్రిస్తాకు కొన్ని పాములవిషము మిక్కిలీ పలుచగానుండడము చేతనున్ను ఆ యా శరీరతత్వములచేతనున్ను ఔషధము అక్కరలేకుండానే విషము దిగిపోయ్యేదికద్దు – గనుక అందువల్ల విషము దిగిపోతేనేతప్ప మంత్రమువల్ల నయముకావడమే లేదు – నయముగాని యెడల పాముకాటు బాగా తగిలినది మూడుగంట్లు ఏర్పడ్డవి అనిన్ని ఆ పాము విషము మిక్కిలి చిక్కనైనదనిన్ని అందువల్ల కుదిరినది కాదనిన్ని మంత్రించినవారు చెప్పడము కలదు. మంత్రమందు సామర్థ్యము ఉన్నట్టైతే గంట్లు ఎన్ని దిగినా విషము ఏలాంటిదైనా తప్పకుండా కుదరవలసినదే న్యాయమైయుంటుంది. కొందరు తేళ్ళుకుట్టినవారికి మంత్రిస్తారు. తేళ్ళచేత కుట్టబడ్డవారికి కొందరికి విషయము యెక్కేదిన్ని త్వరగానే దిగిపొయ్యేదిన్ని కలదు కొందరికి విషము ఎక్కకుండా కుట్టినచోటనే మంటమండుతూ ఉండేదిన్ని కొంతసేపటికి ఆమంట క్రమేణతగ్గి పొయ్యేదిన్ని సహజమే ఐయున్నది – కొన్ని తేళ్ళవిషమువల్ల రొమ్ముబళువు ఎక్కి చాలా తొందర చేసేదిన్ని కద్దు – ఒకానొక తేలుకుడితే ప్రాణహాని వస్తుందనే వాడికయున్ను కలదు, తేలుకుట్టి నందుకున్ను ఔషధములే చాలా ఉపయోగిస్తున్నది గాని మంత్రమువల్ల ఒక చోటనున్ను గుణమివ్వడము లేదు – తేలుకుట్టినచోట కొడుతూ చాలా సేపు మంత్రిస్తూ రావడము చేతనున్ను మంత్రించబడేవారు మంత్రమందు సత్తయున్నదనే భ్రమతో ఓపికచేసి బాధను సహించి యుండడము వల్లనున్ను క్రమేణ విషముయొక్క ఏపు తగ్గిపోవడమున్ను ఇప్పు డేలాగున ఉన్నదని యడుగబడే ప్రశ్నకు కొంచము నయముగా నున్నట్టు యున్నదని తేలుచేత కుట్టబడ్డమనిషి చెప్పడమున్ను అందుచేత నా మాంత్రికుడు ఇంకాకొంతసేపు మంత్రించడమున్ను ఇంతలో ఎక్కు దిగిపోగానె ఆసంగతి తేలుచేత కుట్టబడ్డమనిషి తెలియచేయడమున్ను మాంత్రికుడు మంత్రించడము మాని వేయడమున్ను కుట్టినచోట మంట అట్లానే యున్నదని మంత్రించబడ్డమనిషి అనడమున్ను కొంతసేపటికి ఆమంట కూడా తగ్గిపోతుందని మాంత్రికుడు చెప్పడమున్ను కలదు గాని తేలు కుట్టినవారికి సహజముగా శాంతించడముకంటె మంత్రించి నందువల్ల వచ్చే కిఫాయతు ఏమిన్ను లేదు. కొందరు ఇలుకును గురించి మంత్రిస్తామని మంత్రిస్తూ కొన్ని వస్తువులతో బెణికినదన్న చోటను మర్దన కూడా చేస్తారు అటువంటి స్థలమందు రక్తము కూడుకునేది కద్దు – ఆరక్తము మంత్రము చేత కరిగిపోతుందా – పోదు – అది కరిగి పోగలందులకే మంత్రించే వారు మర్దనకూడా చేస్తారు – కొన్ని సంగతులలో అమర్దన వల్లను పూరాగా నయము కాకపోతే సాధనాంతరముల సహయము కోరవలసివస్తూఉన్నది – కొందరు – చెలిదికిన్ని, సర్పికిన్ని, మాదలకున్ను, మంత్రిస్తారు. రక్తము చెడియున్న హేతువుచేత సదరు వ్యాధులు కలుగుతున్నవి – యెంతకాలము మంత్రించినా చెడిపోయిన రక్తమును సదరు మంత్రము సవరించగలుగునా – సవరించనేరదు కాని సదరు మాంత్రికులు మంత్రించడమే కాకుండా కొన్ని ఔషధములున్ను ఆయావికారములు కలిగియున్న చోట్లను పట్టించేలాగు చేస్తారు. ఈ చికిత్సవల్ల కొన్ని నయమయ్యేదికద్దు సదరు మంత్రవైద్యులు లోకముయొక్క వాడికమీద ఊహించియేర్పర్చిన వస్తువులు ఆ యా వ్యాధులకు తగినవి కాకపోవడమువల్ల చాలారోగములు నిమ్మళించక వికారములను పొందినంతల్లొ వాటిని గురించి మరికొన్ని ఔషధములను వాడికలో తేవలసి వస్తూనే యున్నది. మంత్రసిద్ధిగలవారమని చెప్పుకునేవారు కొందరు అటువంటి సంగతులు నమ్మేటి కొందరికి మంత్రములు ఉపదేశిస్తామని భ్రమపెట్టడమున్ను అట్లా యుపదేశించడమువల్ల కొన్ని చోట్ల కొంతద్రవ్యము అర్థించడమున్ను కలదు, ఉపదేశించబడ్డవారు కొందరు చాలా భ్రమకలిగి పునశ్చరణలు చెయ్యడమున్ను అందువల్ల చాలా లౌక్యకార్యములను చెడగొట్టు కోవడమే కాకుండా ఆ యా మంత్రప్రమేయములందు ఏర్పడియుండే నిర్ణయములను అనుసరించి పూర్వప్రకారము భోజనాదికము జరిగించక శరీరస్థితి చెడగొట్టుకోవడమున్ను కొందరు కొన్ని దుర్భ్రములచేత కొన్ని దుష్కార్యములను జరిగించి మానమునేకాని, కీర్తినేకాని, ధనమునేకాని, గౌరవమునేకాని, ప్రాణమునేకాని పోగొట్టుకోవడమున్ను కలదుగాని వారు ఉద్దేశించిన కార్యములు మంత్రములవల్ల ఫలించడము ఎప్పుడున్ను సంభవించనేరదు.

మౌసల్‌దేశపు రాజుకథ

౧ – మంత్రములచేత పరకాయ ప్రవేశమయ్యే సామర్థ్యము కలుగడము కలదని కొందరు నమ్ముతున్నారు.

౨ – ఒకరాజుకు మిక్కిలి సౌందర్యవతిన్ని మహాపతివ్రతయున్ను ఐన రాణి యుండినట్టున్ను ఆ దంపతులు క్రమక్రమముగా అభివృద్ధిని పొందుతున్న పరస్పర స్నేహముగలవారై యుండినట్టున్ను ఆ రాజుయొక్క యోగ్యమైన పరిపాలనవల్ల ప్రజలు మిక్కిలీ సంతోషిస్తూ ఆయనచోట చాలా భక్తిగలవారై యుండినట్టున్ను ఈలాగున అన్ని సంగతులయందున్ను యుక్తముగా జరుగుతూనుండగా నూతనవయస్సులో నున్న – ఒకపకీరు ఆ రాజుయొక్క దర్బారులోచేరి బుద్ధియొక్క చమత్కారకరమైనటువంటిన్ని చురుకైనటువంటిన్ని వ్యాపారమువల్ల గొప్పఅధికారస్థుల విహితమునుపొంది రమ్యములైన సంభాషణలచేతనున్ను ఉల్లాసకరములైన జవాబులచేతనున్ను వారి ప్రేమలను సంపాదించుకున్నట్టున్ను మరిన్ని వారితో షికార్లకువెళ్ళి జియాఫతులయందు కలుసుకొని నాగరికములైన వేడుకలలో ప్రవేశించి యుండిన్నట్టున్ను తదనంతరము అతను విశేషమైన ఉల్లాసమును పొందించడమునకు లాయభైన సంభాషణగలవాడుగా ఆ అధికారస్థులు రాజుతో ప్రశంసిస్తూ రావడమువల్ల రాజు అతణ్ణి చూడవలెననిన్ని – అతనితో సంభాషించవలెననిన్ని వేడుక కలవాడైనట్టున్ను ఆ పకీరు రాజుయొక్క దర్శనమునకు వచ్చినంతలో అతనియోగ్యత అదివరకు చెప్పబడ్డంతకంటే అధికముగా నున్నదని పరిశీలనమీద రాజుకు తోచినట్టున్ను అతనిప్రసంగము రాజును సంతోషపరచినట్టున్ను మరిన్ని కుశాగ్రబుద్ధిన్ని ప్రవీణతలున్ను కలిగిన మనుష్యులు దర్బారులో మాత్రమే యుంటారని గొప్పవారిలో ననేకులకు కలిగియుండే పక్షములోనుంచి అది రాజును ఖులాసాపరచినట్టున్ను ఆ పకీరుతో సంభాషించడమునకు రాజు మిక్కిలీ ఉల్లాసముగలవాడై యుండినట్టున్ను దర్బారుయొక్క గొప్పకార్యములయందు ముఖ్యులైన తనఉద్యోగస్థులలో నొకణ్ణిగా నిర్ణయించడములకు ఆ పకీరు తగిన యోగ్యత గలవాడని రాజు ఎంచుకునట్టున్ను ఐతే అందున గురించి రాజుకు ఆ పకీరు వందనముచేసి తాను ఏ ఉద్యోగములోనున్ను ప్రవేశించకుండా నుండేలాగు ప్రమాణము చేసుకుని యున్నాననిన్ని ఖులాసాగలిగినటువంటిన్ని స్వతంత్రమైనటువంటిన్ని జీవనమే తానుకోరియున్నాననిన్ని ఘనతనేకాని వైభవములనేకాని తాను మనస్కరించి యుండలేదనిన్ని ఎవడైతే అతని ప్రాణికోట్లలో సూక్ష్మములైన వాటినిన్ని సంరక్షిస్తాడో అటువంటి భగవంతుడు రోజుకు రోజు తన జీవనోపాధికి దయచేసే దానితోనే తాను తృప్తిని బొందుతున్నాననిన్ని అదివరకు తాను పొందియున్న పకీరు వేషమును బదలాయించడమునకు ఎంతమాత్రము కోరిక కలిగియుండలేదునిన్ని చెప్పిన్నట్టున్ను ఈ ప్రపంచముయొక్క డంబములవల్లనుంచి ఇంతగా విరక్తిని పొందినట్టు కనుపడ్డ సదరు పకీరును రాజు ఆశ్చర్యపూర్వకముగా చూస్తూ అందునగురించి అతణ్ణి మిక్కిలీ ఘనుణ్ణిగా ఎంచుకుంటూ నుండిన్నట్టున్ను అతడు సభకువచ్చినప్పుడల్లా ప్రేమతో అతణ్ణి గారవిస్తూ వచ్చినట్టున్ను ఎప్పుడయినా దర్బారువారితో అతను కలిసియుండడము సంభవించిన పక్షమందు రాజుయొక్కదృష్టి అతనిమీదనే ఉంటూవచ్చినటున్ను రాజుఎవరితో మిక్కిలీ తరుచుగా సంభాషిస్తూ ఉంటాడో వారిలో నొకడుగా ఆ పకీరు ఉంటూవచ్చినట్టన్ను రాజు క్రమేణ అతణ్ణి తనకు ముఖ్యుడైన ఇష్టుణ్ణిగా ఏర్పరచుకొనే అంత అసక్తికలవాడైనటున్ను ఒకనాడు ఒక అడవికి వేటకు వెళ్ళవలెనని రాజుకు ఇచ్ఛఉదయించి షికారుకు వెళ్ళినయెడల పరివారముతో రాజు విడిపోయి సదరు పకీరుతో ఒంటరిపాటున నుండడము సంభవించినట్టున్ను అప్పట్లో ఆ పకీరు తనసంచారముతో చేరిన అనేక సంగతులు రాజుకు వినుపించడమునకు ఆరంభించినట్టున్ను ఆ పకీరు చిన్నవాడుగా నున్నప్పటికి భూమండలము యొక్క విస్తారపు భాగమును చూచియుండిన్నట్టున్ను – అతను ఇంద్య దేశములో తాను చూచినటువంటిన్ని విశేషించి తాను స్నేహము చేసిఉన్న యొక పెద్దమనిషిని గురించినటువంటిన్ని అనేకములైన వింతలున్ను ఆశ్చర్యకరములైన సంగతులున్ను రాజుతో ప్రశంసించినట్టున్ను ఆ పెద్దమనిషి యొకదానికంటె యొకటి వింతగానుండే అనేకరహస్యములు స్వాధీనపరచుకుని యుండినాడనిన్ని ఇహప్రపంచ స్వభావముయొక్క అత్యంతము దాపరముగానున్ను అధికారములు ఆయనకు బైలుపరచబడి యుండినవనిన్ని ఆయనయొక్క అవసానకాలమందు ఆయన పరామర్శ తానే జరిగిస్తూ నుండినాడనిన్ని అప్పట్లో ఆ పెద్దమనిషి ఆయన తదనంతరము ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఉండగలందులకు ఒకరహస్యమును ఇతరులకు తెలియచేకుండానుండే ఖరారుమీద తనకు తెలియచేస్తానని అన్నందున ఆప్రకారము తాను ఖరారుచేస్తే ఆ రహస్యమైన మంత్రము ఆయన తనకు ఉపదేశించినవాడనిన్ని రాజుతో పకీరు చెప్పినట్టున్ను అందుపైన ఈ రహస్యముయొక్క స్వభావము ఏమిగాఉండును – అది బంగారము చేశేటటువంటి రహస్యము కాదా – అని రాజు ఆ పకీరును అడిగినట్టున్ను అది కాదనిన్ని అంతకంటే మిక్కిలీ వింతఐనదనిన్ని చనిపోయిన ఏ జంతువుయొక్క ఘటమందైనా ఆమంత్రముచేత తాను ప్రవేశించి ఆఘటము ఎప్పటివలెనే వ్యవహరించేటట్టు చేయగలననిన్ని అది ఎప్పుడు చూడవలెనని మీకు ఇష్టము ఉంటే అప్పుడు ఆ పరీక్ష మీయెదుట జరిగిస్తాననిన్ని రాజుతో పకీరు అన్నట్టున్ను అది యిప్పుడే కనుపరచవలసినదని రాజుకోరినట్టున్ను ఆ సమయమునకు అనుగుణముగానే అప్పట్లో ఒకలేడి లగువులు వేస్తూ అక్కడికి వచ్చినందున దాన్ని ఆరాజు బాణముతో ప్రాణహీనమైనదాన్నిగా చేసి దీన్ని ఎప్పటివలె వ్యవహరించేటట్టు చేయగలవేమో చూతామని పకీరుతో అన్నట్టున్ను మీసంశయము త్వరగానే తీరగలదనిన్ని నేను ఎరిగించడమునకు సిద్ధపడుతున్నానో అది కనిపెట్టవలసినదనిన్ని పకీరు చెప్పినట్టున్ను ఈవాక్యములు పకీరు పలికినవెంటనే పకీరుయొక్క శరీరము ప్రాణము లేకుండ భూమియందు పడిపోయి లేడియొక్క దేహము మిక్కిలీ చురుకుగాలేచినట్టు రాజు చూచినందున ఆయనకు విశేషమైన విభ్రాంతికలిగినట్టున్ను ఆయన ప్రత్యక్షముగా చూచినది సందేహించతగ్గది కాకపోయినప్పటికిన్ని తననేత్రములు మోసపుచ్చబడ్డవేమోనని ఎంచుకోవడమునకు అభిప్రాయము గలవాడుగా నుండినట్టున్ను అప్పట్లో ఆలేడి రాజువద్దకు వచ్చి వినయపూర్వకముగా కొంతసేపు ఆడి చాలాలగవులువేసి వ్రాలిపోయినట్టున్ను మరిన్ని భూమియందు పడియున్న సదరు పకీరు యొక్క శరీరము తత్క్షణమే తిరిగీ ప్రాణమును వహించినట్టున్ను రాజుయొక్క మనస్సు ఇటువంటి ఆశ్చర్యకరమైన రహస్యక్రియచేత మిక్కిలీ లోపరచబడ్డందున అది తనకు ఉపదేశము చేయవలసినదని రాజు పకీరును అడిగినట్టున్ను అది ఎవరికీ తెలియచేయకుండా నుండేలాగున్ను ఈఖరారు పూజనీయమైనదిగా నిల్పేలాగున్ను ఆ మంత్రము తనకు ఉపదేశము చేసిన పెద్దమనిషితో తాను ఖరారు చేసియున్నాను గనుక తమ కోరికను నెరవేర్చ లేనని మనవి చేయవలసి వచ్చినందుకు తనకు విచారముగా ఉన్నదని పకీరు జవాబు చెప్పినట్టున్ను రాజుయొక్క వినోదమును సమాధానపరచక పోవడమునుగురించి పకీరు క్షమాపణ కోరిన కొద్దీ రాజుయొక్క విమోదము మిక్కిలీ అభివృద్ధిని పొందుతూ వచ్చినట్టున్ను తాను అంతముఖ్యముగా కోరేటటువంటి సమాధానమును ఈశ్వర ప్రీతిగా తనకు కలుగచేయడమునకు మళ్ళబాటు చేయవద్దనిన్ని ఈరహస్యము బైలుపరచనని తానున్ను ఖరారు చేస్తాననిన్ని ఈమంత్రమును దుర్వినియోగము చేయనని మనను సృజించిన వాని సన్నిధియందు ప్రమాణము చేస్తాననిన్ని రాజుఅన్నట్టున్ను అందుమీద పకీరు యోచనచేస్తూకొంచెము వ్యవధి పుచ్చి ప్రాణముకంటె ప్రియులైయున్న మీకు ఆ రహస్యము తెలియచేయకుండా ఆలస్యముగా నిల్పి ఉంచవలెననిన్ని మీరు పదేపదే కోరే కోరికలను ఒప్పుకుంటాననిన్ని ఆమంత్రము తనకు ఉపదేశించిన పెద్దమనిషికి స్పష్టమయిన ఖరారు చేయడమే కాని తాను ప్రమాణముచేత అది రూఢిపరచి యుండలేదు – గనుక ఆ రహస్యము తమకు ఉపదేశము చేస్తాననిన్ని ఆ మంత్రము యావత్తు రెండు వాక్యములు స్మరించడమందు మాత్రమే యుండియున్నదనిన్ని ప్రాణములేని ఏ శరీరమును ఐనా తిరిగీ ప్రాణముగల దాన్నిగా కనుపరచడమునకు మనస్సుయందు మీరు ఆ వాక్యములను రెట్టించడమే చాలుననిన్ని పకీరు చెప్పి అప్పుడు ఆమంత్రమును రాజుకు ఉపదేశించినట్టున్ను రాజు వెంటనే దాని మాహాత్మ్యమును పరిశీలించడమునకు త్వరగలవాడై పడిపోయియున్న సదరు లేడియొక్క ఘటమందు తాను ప్రవేశించే యత్నముచేత ఆమంత్రమును ఉచ్చరించిన్నట్టున్ను అదేప్రకారము రాజుయొక్క ఆత్మ లేడిశరీరమందు ప్రవేశించినట్టున్ను ఆమంత్రవ్యాపారము అంత అనుకూలముగా ఫలించినట్టు చూడడము చేత రాజు పొందిన సంతోషము వెంటనే విచారమందు పర్యవసానమును పొందినట్టున్ను రాజుయొక్క ప్రాణము లేడి శరీరమందు ప్రవేశించగానే ద్రోహబుద్ధిగల పకీరు ఆ రాజుయొక్క శరీరమందు ప్రవేశించి నట్టున్ను మరిన్ని రాజధనుస్సేఏక్కుపెట్టి ఆ లేడిని కొట్టవలెనని యత్నముచేసిన్నట్టున్ను లేడిశరీరమందున్న రాజు ఆ నడపడివల్ల పకీరుయొక్క ఉద్దేశమును నిదానించి త్వరగా పరారికావడముచేత ప్రాణమును తప్పించుకోక పోయినట్టైతే పకీరుయొక్క కోరిక ఫలమును పొందతగ్గదే ఐ యుండినట్టున్ను లేడి పరారి ఔతూ ఉన్నప్పటికిన్ని పకీరు బాణము వదిలిపెట్టినందున దాని వేగము వాయువు యందె హరించి పోయినట్టున్ను లేడి శరీరమందున్ను రాజు స్వశరీరమును పోగొట్టుకున్నప్పటికిన్ని మనుష్యునకు లాయఖైన తెలివికలిగినవాడై అరణ్యములయందున్ను కొండలయందనున్ను ఉండె మృగములతో సంచరిస్తూ నుండడమునకు బద్ధుడై యుండినట్టున్ను రాజు తనలాచారిస్థితికి విచారమును పొందుతూ ఈలాగున నుండగా రాజశరీరమందున్న పకీరు తన స్వశరీరమును అడివియందే వదిలివేసి రాజశరీరమును వాడికలో తెచ్చుకోవడమందు జయముగలవాడై సేననుకలుసుకుని రాజువలెనే దర్బారుకు వెళ్ళి నిరాటంకముగా తఖ్తునున్ను రాణినిన్ని స్వాధీనపరచుకుని వైభవములను సౌఖ్యములను పొందుతూ ఉండినట్టన్ను ఐతే ఏమంత్రము రాజుకు హానిని కలుగచేసినదో ఆమంత్రముయొక్క ప్రభావము చేతనే లేడిశరీరమందున్ను రాజుదర్బారులో ప్రవేశించడమునకున్ను ఆయన విషయములు జరిగిన ద్రోహమునుగురించి పగతీర్చుకోవడమునకున్ను సదుపాయములు కుదుర్చుకొనునేమోనని రాజశరీరమందున్న పకీరు భయముకలవాడైనందున రాజఘనతను అతను ఆక్రమించుకొన్న రోజుననె లేళ్ళయందు తనకు ఉండేఅసూయ చేత రాజ్యమందు వాటిని లేకుండా చేయవలెనని నిశ్చయించుకున్నాననిన్ని ఆరాజ్యమందున్న లేళ్ళనన్నిటిని చంపివేయవలసినదనిన్ని ఒకఆజ్ఞను జారీచేసినట్టున్ను మరిన్ని ఆజంతువులను బొత్తిగా నాశనమును పొందించేకొరకు తన ప్రజలను మిక్కిలీ ప్రయత్నము గలవాండ్లనుగా ప్రేరణచేసే కొరకు తనయొద్దికి తీసుకరాబడే ప్రతిలేడి తలకాయకున్ను ముప్పదేసి వరహాల చొప్పున బహుమానమిచ్చేలాగు ప్రకటన కాకితము కూడా కట్టించినట్టున్ను ఆ పట్టణముయొక్క ప్రజలు ద్రవ్యాసక్తిచేత ప్రేరణచేయబడ్డ వాండ్లై పట్టణములోనుంచి బైలువెళ్ళి ఎక్కుపెట్టబడ్డ విండ్లతోనున్ను బాణములచేత నింపబడ్డ తూణీరములతోనున్ను – ఆ రాజ్యమందు సోలువులుతీర్చి కనుపడ్డట్టున్ను వారిదెబ్బలకు లోబడ్డ లేళ్ళను గాయములు చేసి చంపుతూ వారు వనములలో తిరిగిన్నట్టున్ను కొండలను వ్యాపించినట్టున్ను ఈలాగున నుండగా సదరు లేడిశరీరమందున్న రాజు ఆ ఉపద్రవమును గ్రహించి ఒక చెట్టుమొదటను చచ్చిపడియున్న పిగిలిపిట్టనుచూచి చిన్నదైన దాని శరీరమందు ప్రవేశించడముచేత ఆ నూతనమైన వేషమందుదాగి రెక్కలు చాచుకుని శత్రువుయొక్క దర్బారుకై వెళ్ళినందున యోగ్యమైన అదృష్టముచేతను వాండ్లబాణములకు భయపడవలసిన హేతువు ఆయనకు లేకపోయిన్నట్టున్ను ఆనగరుయొద్దనున్న యొకతోటలో దట్టమైన నీడగల యొకచెట్టుయొక్క కొమ్మలమధ్యను ఆపిట్ట దాగియుండిన్నట్టున్ను ఆచెట్టు రాణియొక్క నగరుకు సన్నిహితముగా పెరిగియున్నదైనట్టున్ను పిట్టశరీరమందున్న రాజు తనయొక్క ప్రత్యేకమైన లాచారీస్థితిని గురించిన్ని ప్రతిపక్షియొక్క సంతోషస్థితిని గురించిన్ని విచారమును పొందుతూ రాణి తాలూక్‌ నగరు ఉన్నభాగమందు తనదైన్యస్థితిని తెలియచెయ్యడమునకున్ను రాణిని అక్కడికి రప్పించడమునకున్ను తగియుండే పలుకులు రమ్యముగా పలుకుతూ నుండినట్టున్ను ఆ పలుకులను రాణివిని ఆ భాగమందున్న కిటికియొద్దకి వచ్చినంతల్లో ఆమెనుచూచి ఆ పిట్ట తానువిచారమును పొంది యున్నట్టు ఆమెకు సూచించడమునకు చాలియుండేలాగు ఆమెయొక్క దృష్టిపథమందు తన కంఠరవము యొక్క శక్తియావత్తు వినియోగపరచినట్టున్ను ఐనప్పటికిన్ని దైన్యయుక్తములైన ఆ పలుకులనుగురించి కనికరమును పొందడమునకు ప్రతిగా వాటిని రాణి సంతోషముగా విని హాస్యరసముగా నవ్వుకుంటూ తిరిగీ నగరులోకివెళ్ళినట్టున్ను ప్రతిరోజూ ఆ పలుకులు వినడమునకు అక్కడనున్న బంగళాయొక్క కిటికి యొద్దికి తనస్త్రీలతోకూడా ఆమెవచ్చి వింటూ ఉండినట్టున్ను అట్లు కొంతమట్టుకు జరిగిన తరువాత ఆపిట్ట తనకు కావలెనని ఆమె ఇచ్ఛగలదై వలలతో దాన్ని పట్టుకోవడమునకు ఉత్తరవు ఇచ్చినట్టున్ను ఆ పిట్ట పట్టుబడవలెనని ఇష్టముగలదే ఐనందున ఆప్రకారము వలలువెయ్యబడ్డప్పుడు ఎగిరిపోకుండా ఒకవలలో చిక్కుబడ్డట్టున్ను తదనంతరము బంగారుతీగెలతో నేర్పరచబడియున్న యొకపంజరములో ఆమెచేతిమీదుగానే ఆపిట్టయుంచబడ్డట్టున్ను ప్రతిదినము రాణినిద్రలేచినప్పుడు ఆ పిట్ట గానము చేస్తూ వచ్చి యున్నట్టున్ను ఆపంజరము ఒద్దికి ఆమె దాన్ని ముద్దాడడమునకేగాని దానికి ఏమైనా ఆహారము ఇవ్వడమునకేగాని వచ్చినప్పుడు ఆపిట్ట సంకోచమును పొందినట్టైనా భయమును పొందినట్టైనా కనుపడడమునకు బదులుగా తనసంతోషమును తెలియచేయడమునకు రెక్కలు చాచుకుని ఆమెచేతిని అందుకునే కొరకు దానిముక్కు పంజరముయొక్క తీగల సందునుంచి వెలపలికి రానిస్తూ వచ్చినట్టున్ను ఇంతస్వల్పకాలములో ఆపిట్ట అంతసాధువుఐనట్టు చూడడమునకు ఆమె ఆశ్చర్యమును పొందినట్టున్ను కొన్ని సమయములలో దాన్ని పంజరములోనుంచి వెలుపలికితీసి హాల్లో ఎగురుతూ వుండగలందుకు ఆమెవదిలి పెడుతూ వచ్చినట్టున్ను అటువంటి సమయములలో ఆమెను తాను ఉపసర్పించే నిమిత్తమున్ను అందుకు ఆమె ప్రేమయొక్క ఫలమును పొందేటందుకున్ను తప్పకుండా ఆమెయొద్దికే ఆపిట్ట ఎగిరిపోతూ వచ్చినట్టున్ను ఆమె తాలూక్‌ స్త్రీలలో ఎవరైనా, ఆపిట్టను పట్టుకోవలెనంటె దానిబలముకొద్ది ఆమనిషిని పొడిచి రక్కుతూ వచ్చినట్టున్ను ఈ చిన్నచిన్న ఉపాయములచేతను క్రమేణ ఆపిట్ట తనను రాణిని ప్రియమైనదాన్నిగా చేసుకున్నట్టున్ను రాణి అప్పటప్పటికి తన స్త్రీలతో చేసే సంభాషణలో ఆపిట్ట ఎప్పుడైనా చావడము సంభవించే పక్షమందు తనకు దుఃఖోపశమనము లేకపోయ్యే అంతగా దానియందు ప్రేమయుంచినానని అంటూవచ్చినట్టున్ను ఆపిట్టయొక్క ప్రస్తుతపు దుఃఖములయందు అది రాణియొక్క నగరులో సదా యుండడము దానికి సంతోషకరమైనప్పటికిన్ని అప్పట్లో ఆఫకీరు రాణిని చూచేనిమిత్తము అక్కడికి వస్తూ వచ్చినందున అతను రావడము ఆ పిట్టకు చాలా బాధకరముగా ఉంటూ వచ్చినట్టున్ను పగతీర్చుకోవడమును గురించి అప్పటప్పటికి ఆ పిట్ట తన నేత్రములను ఈశ్వరుణ్ణి గూర్చి యెత్తుతూ వచ్చినట్టున్ను దానిరెక్కలను నిక్కపొడుచుకుంటూ వచ్చినట్టున్ను దానిహృదయము పగిలిపోవడమునకు సిద్ధమయ్యే అంతకోపముగలదిగా ఆ పిట్ట యుంటూ వచ్చినట్టున్ను దానిపంజరమందు అది కిందికి మీదికి కొట్టుకుంటూ స్వస్థతలేనిది కావడము మాత్రమేకాని ఏమిన్ని చెయ్యలేక యుండినట్టున్ను ఆ ఫకీరు ఎదుట ఎప్పుడైనా రాణీ దాన్ని దువ్వినపక్షమందు అతనున్ను అదేప్రకారము దాన్ని దువ్వడమునకు యత్నము చేస్తే అతనిమీద దానికి ఉండే యావత్కోపమున్ను అసూయయున్ను సాధ్యమైనంత మట్టుకు దాని ముక్కు చేతను రెక్కలచేతను కనుపరుస్తూవచ్చినట్టున్ను ఐతే దానికోపము వారు నవ్వుకోవడమునకు మాత్రమే ఉపయోగమౌతూవచ్చినట్టున్ను రాణియొక్క నగరులో ఆమెకు ప్రియమైన ఒక ఆడకుక్క యుండినట్టున్ను అది యొకరోజున యొంటరి పాటుననుండి యీని చనిపోయినట్టున్ను ఈ దైవవశము ఆ పిట్టయందున్న రాజును ఆయనయొక్క మంత్రశక్తిని మూడోదఫాను పరిశీలించడమును గురించి ప్రేరణ చేసినట్టున్ను ఆ కుక్కయొక్క శవమందు తాను ప్రవేశించవలెననిన్ని రాణి అప్పట్లో ఆమె పికిలిపిట్టయొక్క మరణమునకు ఎంతదుఃఖపడుతుందో చూడవలెననిన్ని ఆయన ఇచ్ఛయించినట్టున్ను ఇటువంటి బదలాయింపువల్ల తనకు ఏమిన్ని కిఫాయతు ఉన్నదని ఆయన ఊహించి యుండనట్టున్ను ఐతే ఈవాంఛ ఈశ్వరప్రేరణగా తనఅంతస్సుయందు కలిగినందున అన్ని సంగతులలోనున్ను దాన్నే అనుసరించవలెనని ఆయన నిశ్చయించుకుని పెట్టశరీరమునువదిలి కుక్కశరీరమందు ప్రవేశించినట్టున్ను రాణి ఆగదిలోకి వచ్చినప్పుడల్లా ఆపంజరమును చూడడము ఆమెయొక్క మొదటి జాగ్రత యైయుంటూవచ్చినది, గనుక సదరు పిగిలిపిట్ట చచ్చియున్నట్టు ఆమెచూస్తూనే తనస్త్రీలకందరికి భయవిస్మయములు కలుగచేసే అంతకేక వేసినట్టున్ను అందుపైన ఆమె తాలూక్‌ స్త్రీలుఅందరూ వచ్చి పరామర్శించి ఎన్ని సదుపాయములైన మాటలు చెప్పినప్పటికిన్ని ఆమెకు ఆదుఃఖముమానకుండా ఉండినట్టున్ను ఆ సంగతి తెలిసి రాజశరీర మందున్న ఫకీరు ఆమె యొద్దకువచ్చి ఆమెను దుఃఖోపశమనములైన మాటలచేత చాలాగా నోదార్చినట్టున్ను అందువల్ల ఏమీ వినియోగము లేకపోయినట్టున్ను చనిపోయిన ఆడకుక్కయొక్క ఘటమందున్న రాజు అప్పట్లో రాణియొక్క అధికదుఃఖమువల్ల తనకు యోగ్యమైన అదృష్టము కలుగునని భవిష్యద్యోచన చెయ్యడమునకు ఆరంభించినట్టున్ను మరిన్ని ఎవరివల్లనూ విచారించబడకుండా పిల్లలకు పాలుయిస్తు ఒకమూలను ఉండి సదరుసంగతి యావత్తు విని రాణిని ఖులాసాపర్చే నిమిత్తము ఫకీరు అతని మంత్రవిద్యను ఉపయోగములో తెచ్చునేమోనని ఊహించినట్టున్ను ఈ ఊహ వ్యర్థమైనది కాకపోయినట్టున్ను రాజశరీరమందున్న ఫకీరు రాణిని మిక్కిలీ మోహించి యున్నవాడైనందుననున్ను ఆమెకన్నీళ్ళు విడువడమునుగురించి సంతృప్తహృదయుండైనందుననున్ను ఆమెతాలూక్‌ స్త్రీలనందరినిన్ని అక్కడినుంచి వెళ్ళేలాగు ఫర్మాయించి ఆమెతో ఒంటరిపాటుననుండి తనమాటలు పరులకెవరికి వినపడవని ఎంచుకుని రాణితో పికిలిపిట్టయొక్క మరణము నీకు చాలావిచారమును కలుగచేస్తున్నది గనుక – అది తిరిగీ ప్రాణమునకు తీసుకునిరాతగి యున్నదనిన్ని యికనేమిన్ని దుఃఖమును పొందవద్దనిన్ని అదితిరిగీ బ్రతుకగా నీవు చూస్తావనిన్ని నీకోరికల ప్రకారము దాన్ని తిరిగినీకు ఇవ్వడమునకు ఖరారుచేస్తాననిన్ని రేపు నీవు నిద్రలేచినట్టుగానే అదిపూర్వపురీతినే సంగీతముపాడడము నీవు వింటావనిన్ని అది నీచోట మామూలుప్రేమ జరిగించడము నీవు కనిపెట్టగలవనిన్ని ఫకీరు చెప్పినట్టున్ను మీరు శలవుఇచ్చినసంగతి తాను విన్నాననిన్ని ఎవరియొక్క వెర్రితనము ఖుషీపరచడమునకు లాయఖైయుంటుందో అటువంటి పిచ్చదాన్నిగానన్ను భావించినారనిన్ని నాపికిలిపిట్ట రేపటిరోజున ఇంకొకసారి జీవించడము నేనుచూస్తానని మీరు నన్ను నమ్మించ తలచియున్నారనిన్ని రేపు సదరు వింతను వ్యవధిచేసి ఎల్లుండిదాకజరుపుతారనిన్ని అదేప్రకారము రోజుకురోజు నాయొక్క నీరీక్షణలను నిడివిపరచి క్రమక్రమముగా నా వ్యాకులములవల్లనుంచి నన్ను తప్పించవలెననిన్ని ఆ ఫకీరుకు నాపిట్టయొక్క జ్ఞాపకము యావత్తు నామనస్సులో లేకుండా చెయ్యవలెననిన్ని మీరుకోరుతున్నారనిన్ని ఒకవేళ అటువంటి మరియొక పిట్టను ఈరోజుననే తెప్పించి నాయొక్క వ్యసనములను వంచించే కొరకు సదరు పంజరములో చేర్చదలచి యుందురనిన్ని ఆమె జవాబు చెప్పిన్నట్టున్ను లేదు నా రాణీ ప్రాణములేనిదాన్నిగా ఈ పంజరమలులో నీవు చూస్తువున్న పిట్టె నీవు దేన్నిగురించి యింతవ్యసనమును పొందుతున్నావో అటువంటి ఈ పికిలిపిట్టే ఈ ముద్దులపిట్టే వాస్తవముగా నిన్నుగూర్చి తిరిగీ గానము చేస్తుందనిన్ని దీన్నే తిరిగీ ప్రాణమునకు తెస్తాననిన్ని దీనియందు నీకు కలిగియుండే మామూలుప్రేమ యావత్తు నీవు వదిలిపెట్టగా చూచి సంతోషించదలచి యున్నాననిన్ని మరిన్ని నీయొక్క యుపకారమునకు ఇదివరకు ఎప్పుడైనా దీనికి కలిగియుండిన స్మృతికంటె ఇది అధికమైన యుపకారస్మృతి గలది ఔతుందనిన్ని మునుపటికంటె అధికముగానిన్ను సంతోషపరుస్తు ఉంటుందనిన్ని నేను స్వంతముగానే దీనియొక్క చిన్నశరీరమందు ప్రవేశించి దీన్ని వ్యవహరించేలాగు చెయ్యదలచినాను గనుక నిన్ను ఖుషీ పరచడమునకు ప్రతిరోజూ ఉదయకాలమందు దీన్ని ప్రాణమునకు మేలుకొలుపుతూ ఉంటాననిన్ని ఫకీరు ప్రత్యుత్తరమిచ్చి సదరు వింత తాను జరిగించగలననిన్ని ఈ రహస్యము తనకు స్వాధీనమైయున్నదనిన్ని నీవు ఇందుకు సందేహించినా లేక నీపిట్ట తిరిగీ బ్రతుకగా చూడడమునకు త్వరగలదానవైయున్నా ఈ క్షణమందే దీన్ని ప్రాణముగలదాన్నిగా చేస్తాననిన్ని చెప్పిన్నట్టున్ను అందుకు రాణి జవాబు ఇవ్వకపోయినట్టున్ను తాను గొప్పగా చెప్పుకున్న అధికారము తనకు ఉండదని ఆమె ఎంచుకున్నట్టు ఆ మౌనమువల్ల ఫకీరు నిదానించి ఒక శయ్యయందు పరుండి యొక ఘటములోనున్ను ఆత్మను ఏ శవములోకి ఐనా తీసుకుని పోవడమునకు వాహనముగా నుండే యొక మంత్రముయొక్క ప్రభావముచేత అతను అదివరకు ఉన్నశరీరమును వదిలిపెట్టి సదరు పికిలిపిట్టయొక్క శరీరమందు ప్రవేశించినట్టున్ను రాణికి ఆశ్చర్యమయ్యేలాగు వెంటనే ఆ పిట్ట పంజరములో గానము చేయ్యడమునకు ఆరంభించినట్టున్ను అది పలుకులు పలుకడమునకు మొదలు పెట్టగానే కుక్క శరీరమందున్న రాజు ఆ శరీరమును విడిచిపెట్టి జల్దుగా స్వశరరీరమందు ప్రవేశించినందున పిట్ట శరీరమందున్న ఫకీరుయొక్క గానరవము వెలయమునుపొందిన రాజు ఆపంజరముఒద్దికివెళ్ళి అందులోనున్న పిట్టను మిక్కిలీ కోపముతో వెలపలికి తీసినట్టున్ను అప్పట్లో ఆరాణి మీరు ఏమిచేస్తున్నారనిన్ని నా పిగిలిపిట్టను ఎందుచేత ఈలాగున జరిగిస్తున్నారనిన్ని అదిజీవించడము యుక్తముగా మీరు ఎంచనిపక్షమందు మీరు దీన్ని తిరిగి బ్రతికించక పోవలసే యుండెననిన్ని అంటూవున్నప్పటికిన్ని అమాటలు రాజు వినుపించుకోకుండా ఇదిముగింపు ఐనదనిన్ని ఎవరియొక్క అసహ్యమైన ద్రోహము మిక్కిలీ బలమైనశిక్షకు అర్హమైయున్నదో అటువంటి ద్రోహిని తుదకు నేను శిక్షించినాననిన్ని అంటూ రాజు తనశత్రువును వధించినట్టున్ను ఐతే చచ్చిన పికిలిపిట్ట తిరిగీ బ్రతకడము రాణికి ఎంత ఆశ్చర్యముగానుండెనో సాధారణమైన మర్యాద కంటె మిక్కటమైన బలముగా రాజు సదరు వాక్యములు పలుకడము రాణికి అంతకంటె మిక్కిలీ ఆశ్చర్యముగానుండినట్టున్ను మిమ్మునఇంతకోపమును పొందించడమునకు ఏదికారణమనిన్ని ఇప్పుడు మీరు పలికిన వాక్యములకన్నిటికి అభిప్రాయ మేమనిన్ని రాణియడిగినట్టున్ను అందుమీద ఫకీరునుగురించిన వృత్తాంతము యావత్తు రాజు ఆమెకు వినుపించినట్టున్ను ఆ కథ వినేయెడల అనేకస్థలములను ఆమెతల్లడిస్తూ వచ్చినట్టున్ను భయముచేత ఉలికిపడుతూ వచ్చినట్టున్ను ఆమెకు ఎరుకలేకనైనా పరపురుషసంబంధము కలిగినందుకు సిగ్గుచేత ఆమెముఖము ఎర్రబడుతూ వచ్చిన్నట్టున్ను విచారముచేత అప్పటప్పటికి వెలవెలబోతూ వచ్చినట్టున్ను అంతదుర్మార్గుడైన హల్కామనిషి తన శరీరసౌష్ఠవములను అనుభవించినాడనే తొందరలను ఆమె పొందియున్నందున ఆ మనస్సుకు నెమ్మది కలుగచేసేటందుకు రాజుకు సాధ్యము కాకపోయినట్టున్ను నీయొక్క అజ్ఞాతృత్వము ఈశ్వరునియొక్క ప్రపంచముయొక్క నాయొక్క దృష్టియందు నిన్ను నిర్దోషురాలినిగా చేస్తున్నదనిన్ని ఫకీరుమాత్రమే అపరాధియై అతనిచావుతో ఆ నేరము పోగొట్టుకున్నాడనిన్ని బదలాయింపు లేకుండా ఎప్పటి అంతఃకరణచేతనే నిన్ను మోహించి యుంటాననిన్ని రాజు దిలాసా చేసినప్పటికిన్ని సదరు అశుభమైన ఆకస్మికమును ఆమె మరచిపోయేటట్టుచేసేవల్ల లేకపోయినట్టున్ను వెంటనే ఆమె అశక్తమునుపొంది రాజును క్షమాపణ వేడుకుంటు ఆయన చేతులలోనే శరీరము చాలించినట్టున్ను తదనంతరము రాజు విరక్తుడై రాజ్యమును తన సన్నిహితజ్ఞాతికి ఒప్పగించి జీవితకాలమంతా యొక దూరదేశములో ప్రత్యేకనివాసమందు వెళ్ళబుచ్చడమునకు తగిన పరిజనముతో వెళ్ళినట్టున్ను ఒక భాషాంతరగ్రంధమందు చెప్పబడి యున్నది.

౩ – మంత్రములచేత నిటువంటి సామర్థ్యము మనుష్యునకు కలిగే పక్షమందు ఇది ఇహలోక ధర్మమునకు విరుద్ధముగా నుంటుంది మరిన్ని ఇహలోకమందు రాజ్యాధికారులుగా నుండేవారు ఎవరెవరి తప్పితములను గురించి వారిని శిక్షించేలాగు కలిగియున్న పద్ధతులు సదరు మంత్రశక్తివల్ల నిరర్థకములు కావడమునకున్ను హద్దుమీరిన కార్యములు శిక్షలేకుండా లోకమందు జరగడమునకున్ను హేతువు కలుగుతుంది గనుక ఇహప్రపంచ మర్యాదకు విరుద్ధముగా ఇటువంటి విపరీతములైన అన్యాయములను జరిగించడమునకు తగినశక్తి మనుష్యునకు భగవంతుడు ఇస్తాడని ఎంచడమునకు సబబులేదు.

౪ – ఈ కథయందు కనుపర్చడమునకు ఉద్దేశించబడ్డ నీతి యుక్తులయొక్క వివరము – విశేషనిమిత్తముయందు జురూరు కలిగితేనే తప్ప అల్పులైనవారిని గొప్పస్థితికి తేగూడదనిన్ని వారికి తగని చనువు ఇవ్వకూడదనిన్ని విరక్తులైనవారు గొప్పస్థలములయందు చేరడమునకు న్యాయము లేదుగనుక విరక్తులమని పేరుబెట్టుకుని గొప్పస్థలములయందు చేరియుండేవారు మిక్కిలీ దగాకోర్లుగా ఎంచతగియుంటారనిన్ని మిత్రుడనని వ్యవహరించేవాడు అవశాత్తుశత్రువుగా కనుపడే పక్షమందు వాడు చెయ్యదలచిన ఉపద్రవమును మిక్కిలి చురుకైన జాగ్రత్తచేత తప్పించుకోవలసి యుంటుందనిన్ని శత్రుప్రయత్నమువల్ల తటస్థించిన ప్రాణోపద్రవమును తప్పించుకోవడమునకు ఒకానొకప్పుడు మారువేషమును ధరించడము అవశ్యమై యుంటుందనిన్ని బలవంతమైన శత్రువును సహనముమీదనున్ను తగినప్రయత్నముమీదనున్ను సమయము వచ్చినప్పుడున్ను సాధించవలసి యుంటుందనిన్ని బహుప్రయత్నముచేత జయమును పొందినవారైనప్పటికిన్ని విపరీత ధర్మము చేత శత్రువును చంపకూడదనిన్ని స్వభావస్థితిని ఖలలుపరచే సంగతి వాస్తవముగా జరిగినదైనా కప్పులేకుండా తెలియచెయ్యడము న్యాయము కాదనిన్ని విశదపరచడమునకున్ను వినేవారి శ్రోత్రేంద్రియమునకు వినోదముగానుండేకొరకున్ను ఈకథ కల్పించబడ్డది గాని ఇది వాస్తవముగా జరిగినసంగతి కాదు.

శంకరాచార్యస్వాములవారి ప్రశంస

శంకరాచార్యస్వాములవారి కథయందున్ను సదరుసంగతికి అనుగుణములైన సంగతులు కొన్ని చేరి యున్నవి ఏలాగంటె.

౫ – ఒకానొక గ్రామములో మండనమిశ్రుడున్ను మండనపండితుడున్ను అనేపేర్లుగల యొక బ్రాహ్మణప్రభువు ఉండినట్టున్ను శంకరాచార్యస్వాములవారు ఆయనతో ప్రసంగము జరిగించి జయముపొందవలెనే అభిప్రాయముగలవారై ఆగ్రామమునకు వచ్చినట్టున్ను అప్పట్లొ ఉదకమునకు వెళ్ళుతూ మార్గమధ్యమందు కనుపడ్డ అనేక స్త్రీలను మండనమిశ్రునియిల్లు ఎక్కడఉన్నదని అడుగుతూవచ్చినట్టున్ను వారిలో చాలామంది మండనమిశ్రుని హవేలీయొక్క ఆనవాళ్ళు తెలియచ్చేస్తూ వచ్చినందున ఆప్రకారము ఆనగరువద్దికి శంకరాచార్యస్వాములవారు వచ్చినట్టున్ను ఆరోజున ఆనగరుయొక్క సింహద్వారము మూసియున్నట్టున్ను ఆనగరుయొక్క ప్రహరివెంటను లోపల ఒకతాటిచెట్టు ఉన్నట్టున్ను ఆ గ్రామములోనుండే యొకశాణారవానికి తాటిచెట్టు మొదలైనవాటిని యెక్కవలసిన ప్రయాసలేకుండా కల్లుగీచుకునేటందుకు వాటితలలను కిందికివంచేలాగు చేసే యొకమంత్రశక్తి కలిగి యుండినట్టున్ను సదరు ప్రహరిలోపలనున్న తాటిచెట్టు సదరుప్రకారము వంగేలాగుచేసి ఆ చెట్టుమీద నెక్కి అదితిరిగీ నిలువబడ్డ తరువాత దానిమీదినుంచి లోపలికి దిగివెళ్ళి మండనమిశ్రుణ్ణిచూచి ప్రసంగము చేసేయత్నముచేత ఆచార్యస్వాములవారు ఆ శాణారవాణ్ని ఆవిద్య తమకు తెలియచెయ్యవలసినిదని యడిగిన్నట్టున్ను ఆవిద్య మరియొకరికీ తెలియచేసిన పక్షమందు తనకు తిరిగీ అక్కరకు రాదనిన్ని అందువల్ల తన జీవనమునకు హానివస్తుందనిన్ని వాడు చెప్పినట్టున్ను వాని జీవనార్థమయి సదుపాయము కలిగి యుండేకొరకు ఆచార్యస్వాములవారు వానికి సువర్ణముఖియనే విద్యయొకటి యుపదేశించి వానియొద్దనున్న విద్యను ఆయన గ్రహించి సదరు తాటిచెట్టుగుండా మండనిమిశ్రుని నగరులో ప్రవేశించినట్టు ఒక వాడికయున్ను దర్వాజా వేసియున్నట్టు తెలిసిన మీదట ప్రాణాయామముపట్టి అందువల్ల ప్రహరిదాటి లోపల ప్రవేశించినట్టు ఒక వాడికయున్ను కలిగియున్నవి యేలాగున ప్రవేశిస్తేనేమి తదనంతరము ఆచార్యస్వాములవారు మండమిత్రునితో ప్రసంగము చేసినట్టున్ను ఆప్రసంగమందు ఆచార్యస్వాములవారికి ఆయనయోడిపోయినట్టున్ను అందుమీదట ఆయనభార్యను తనతో ప్రసంగించవలసినది స్వాములవారు కోరి వాదము జరిగించినట్టున్ను ఆ ప్రసంగములో ఆమె కళాశాస్త్రప్రమేయము తెచ్చినట్టున్ను శంకరాచార్యస్వాముల వారు బ్రహ్మచారిగా ఉండే సన్యసించినవారైనందున ఆ అంశము తెలియక ఆమెతో ప్రసంగించచాలక పోయినట్టున్ను తరువాత ఆమెతో తిరిగీ ప్రసంగము చెయ్యగలందులకు ఆరుమాసములు ఆమెయొద్ద స్వాములవారు వాయిదాపుచ్చుకున్నట్టున్ను అందునగురించి ఆయన మరియొక రాజ్యమునకువెళ్ళి అక్కడ నుండగా ఆ రాజ్యముయొక్క రాజు చనిపోయినట్టున్ను ఆ సంగతి స్వాములవారికి తెలిసి యొకచోట తమశిష్యులకాపుమీదను పరకాయప్రవేశమంత్రముచేత తమశరీరము వదిలిపెట్టి ఆరాజుయొక్క ఘటమందు ప్రవేశించిన్నట్టున్ను అప్పుడారాజసంబంధులు రాజుకు ప్రాణముకడబట్టియుండి తిరిగీచేరినదని యెంచుకుని సంతోషించినట్టున్ను ఆ రాజుకు నూరుమందిభార్యలు ఉండినట్టున్ను వారందరూ కళాశాస్త్రప్రమేయము బాగా తెలిసినవారైనట్టున్ను ఆచార్యస్వాములవారు వారిలో దినమొకరి శయ్యకువెళ్ళి వారికి తెలిసియున్న కళాశాస్త్రవిద్యను క్రమక్రమముగా గ్రహించినట్టున్ను ఆ రాజుపెద్దభార్య ప్రజ్ఞగలదియై యున్నందున భర్తచనిపోయినప్పుడు పరకాయప్రవేశ మంత్రజ్ఞుడైన యొకపురుషుడు ఆ శరీరమందు ప్రవేశించినాడని కనిపెట్టి యొకవేళ సదరు ఆత్మ ఈ ఘటమును తిరిగీ వదిలిపెట్టి స్వశరీరమునకు వెళ్ళునేమోననే సందేహముచేత ప్రాణములేని యేశరీరములు కనుపడ్డా అవి అన్నీ వెంటనే దహనముచేస్తూ రావలసినదని చాలామందికి ఆజ్ఞఇచ్చి పంపించినట్టున్ను వారు అదేప్రకారముజరిగిస్తూ సదరు స్వాములవారి శరీరము ఉన్నచోటికివచ్చి కావలియున్న శిష్యులను అదలించి ఆ శరీరమును తీసుకుని అగ్నియందు ప్రవేశపెట్టినట్టున్ను అది రాత్రివేళ ఐనట్టున్ను ఆ శిష్యులు సేయునదిలేక రాజుయొక్క హవేలీయొద్దికి వెళ్ళినట్టున్ను అప్పట్లో ఆరాజు సభతీర్చి యుండినందున ఒకశిష్యుడు సదుపాయము చేసుకుని లోపలికి వెళ్ళి సదరు శరీరముకాలుతున్న సంగతి స్వాములవారికి తెలిసేలాగు నృత్యసహితముగా పాడినట్టున్ను అప్పుడాసంగతి ఆయనకు తెలిసి కచేహరీ మాపుచేసి లోపలికి వెళ్ళి యొకశియ్యమీద పరుండి వస్త్రముకప్పుకుని ఆశరీరమునువదలి కాలుతూఉన్న స్వశరీరమందు ప్రవేశించినట్టున్ను అది చాలామట్టుకు కాలినందున లేచే సామర్థ్యము ఆయనకులేక అప్పుడు ఆయన ఇష్టదైవమును ప్రార్థించినట్టున్ను ఆదైవము ప్రత్యక్షమై చెయ్యియిచ్చి ఆయనను లేవతీసినట్టున్ను తరువాత స్వాములవారు మండలమిశ్రుని నగరుకువెళ్ళి ఆయన భార్యతో ప్రసంగించవలెనంటే వివాదచెయ్యకనే స్వాములవారికి సర్వజ్ఞత్వము ఉన్నట్టు ఆమె యెకరారు ఐనదనిన్ని వాడికకలిగియున్నది. అభిమానాదివికారగుణములవల్లనుంచి విముక్తులైనవారే యత్యాశ్రమమును పొందవలసినది న్యాయమైయున్నది. శంకరాచార్య స్వాములవారు యతిశ్రేష్ఠులనిన్ని విశేషజ్ఞులనిన్ని వాడిక కలిగియున్నది. ఈలాగున నుండగా ఒకరితో వివాదచేసి వారిని జయించవలెననే అభిమానము ఆయనకు ఏలాగున కలుగుతుంది – ఒకవేళ ఆచార్యసాములవారు బహుప్రయత్నముగలవారై మండనమిశ్రుణ్ణిచూచి ఆయనతో వాదించి గెలిచినారన్నప్పటికిన్ని మండనమిశ్రుని భార్యతోకూడా ఆయన వాదము చేసినారనడమునకు ఏమిసబబు ఉన్నది ఆడమనిషితో వాదముచేసి గెలిచినారంటే యేమిప్రతిష్ఠవస్తుంది – ఒకవేళ ఆమెతో స్వాములవారు వాదము చేసినప్పుడు ఆమె కళాశాస్త్రప్రమేయముతెస్తేతాము బ్రహ్మచర్యమందే సన్యసించినామనిన్ని అప్రమేయము తమకు బొత్తుగా తెలియదనిన్ని ఆచార్యస్వాములవారు ఆమెకు ఏల తెలియచెయ్యరాదు ఆ అంశమందు ఆమెతో ప్రసంగముచేసి గెలియవలెనని అభిమానము ఏలకలుగవలెను అందునగురించి ఆయనయొక్క ఆశ్రమధర్మమునకు విరుద్థమైనధర్మమనగా లోకమందు సదరు విద్యనుబాగాగుర్తెరిగియున్న కొందరు స్త్రీలతో ఆయన సుఖించి వారివల్ల ఆవిద్యను ఏలసంగ్రహించవలెను నిమిత్తము వచ్చినప్పుడల్లా అల్పులవల్ల విద్యలను నేర్చుకుని స్వాములవారు వివాదజరిగించకపోతే ఆయనయశస్సుకు యేమిహానివస్తుంది
శ్లోకం।
విద్యావివాదాయ ధనంమదాయ। శక్తిఃపరేషామపిపీడనాయ।
ఖలస్యసాధోర్విపరీతమేతత్‌। జ్ఞానాయ దానాయచ రక్షణాయ।
అభిప్రాయము, ఖలస్యసా దుర్జనునకు వచ్చినవిద్య వివాదకున్ను కలిగినధనము మదప్రేరిత కార్యములనగా న్యాయవిరుద్ధములైన కార్యములను జరిగించడమునకున్ను వానికియున్నశక్తి అనబలమున్ను అధికారమున్ను పరులను పీడపెట్టేటందుకున్ను ఉపయోగమౌతుందనిన్ని సత్వగుణమే ప్రధానముగా గలవానికి వచ్చినవిద్య దానమునకున్ను కలిగిన ధనము పాత్రగల పేదవాండ్లకు ఉపకరించడమునకున్ను వానికియుండే బలమున్ను అధికారమున్ను బాధలనుపొందియున్నవారి ఆపదలను నివారించడమునకున్ను ఉపయోగమౌతుందనిన్ని చెప్పబడియున్నది – గనుక సజ్జనులైన శంకరాచార్య స్వాములవారి విద్య యిటువంటి అయోగ్యములైన కార్యములకు ఏల వినియోగము చెయ్యబడుతుంది. మంత్రములకు మామిడికాయలే రాలవని లోకమందు సామితె కలిగియుండగా మంత్రమువచించినంతమాత్రముచేత తాటిచెట్టు దానితలకిందికి ఏలాగున వంచుతుంది. ప్రాణాయామముచేత ప్రహరియేలాగున దాటబడుతుంది గనుక కిఫాయితు గుర్తెరుగని వారు ఇటువంటి సంగతులు కల్పించి ఆచార్యస్వాములవారి కథకు చేర్చియుందురు గాని ఇవి వాస్తవములైన సంగతులు కావు.

బగ్దాద్‌ పట్టణస్థునికథ

౬ – బగ్దాద్‌ అనే పట్టణమందు భాగ్యవంతుడైనటువంటిన్ని నూతన వయస్కుడైనటువంటిన్ని యొకమనిషి యుండినట్టున్ను అతను గుర్తెరుగకయున్ను ఒక చిన్నది మిక్కిలీ సౌందర్యవతిగా కనుపడ్డందున ఆచిన్నదాన్ని అతను వివాహము చేసుకున్నట్టున్ను వివాహమైన మరుసటిరోజు ఆదంపతుల భోజనార్థమై అలంకరించబడియున్న మేజా యోగ్యములైన వస్తువులతో కూడిన చాలాపళ్ళెరములుగలదై యుండినట్టున్ను వారిద్దరూ భోజనము చేసేటందుకు ఆమేజాయొద్ద కూర్చున్న యెడల పెండ్లికుమారుడు మామూలుపద్ధతిని చంచాతో భోజనము చేస్తూఉండగా పెండ్లికొమార్తె చంచాతో భోజనము చెయ్యడమునకు ప్రతిగా గులిబితెడ్డువంటిది యొకవరలోనుంచితీసి దానితో అన్నము ఒక్కొక్కకణముగా విడతీస్తూ అప్పటప్పటికి ఒక్కొకకణము భక్షిస్తూ ఉండినట్టున్ను అభోజన వైఖరి పెనిమిటికి ఆశ్చర్యముగా నుండి ప్రతితడవకు ఒకకణముకంటె అధికము పుచ్చుకోకుండా నుండేకొరకు కణములువిడతీసి నీవు పుచ్చుకోవలసిన కణములు లెక్కపెడుతున్నావా నీవు మీపుట్టింటను ఈప్రకారమే భోజనము చెయ్యడమునకు అభ్యసించియుందువా లేక మిక్కిలీ స్వల్పాహారిణివి ఐనందున ఆలాగున భక్షిస్తున్నావా యని భార్యని ప్రశ్నచేసి అట్లాగాక యొకవేళ వ్రయము కాకుండానుండే జాగ్రతచేతనైనా నేను మిక్కిలీ వ్రయకుణ్ణి కాకుండా నుండేలాగు నాకు నేర్పవలెననే అభిప్రాయముచేతనైనా నీవు ఆ చొప్పున జరిగించుతూ ఉన్నపక్షమందు వ్రయమౌతుందని నీవు భయపడవలసిన పని లేదనిన్ని ఆమార్గముగా వ్రయమైనందువల్ల మనము చెడిపోవలసినది లేదని నీకు దిలాసా చేస్తాననిన్ని మనము అవశ్యములైనవాటిని మానివెయ్యకుండా ఖులాసాగా జీవించడమునకు తగినటుల ఈశ్వరుడు మనకు దయచేసియున్నాడు గనుకనున్ను నీ ఇష్టమును కనిపెట్ట గలందులకు మాంసములు చాలా తరహాలుగా పక్వములు చేయించియున్నానుగనుకనున్ను నేను భోజనముచేస్తూ ఉన్నప్రకారమే నీవున్ను అన్నమున్ను మాంసాదులున్ను భోజనము చెయ్యవలసిందనిన్ని పెనిమిటి చెప్పినట్టున్ను ప్రేమ పూర్వకమయిన మర్యాదచేత పెనిమిటి తెలియచేసిన సదరు న్యాయవాక్యములు బాధ్యతగల యొకానొక జవాబును కలుగ చెయ్యతగ్గవై యున్నప్పటికిన్ని ఆవిడె ఒకమాటైనా జవాబుఇవ్వక ఆప్రకారమే భక్షణచేస్తూనుండినట్టున్ను మరిన్ని అతణ్ణి మిక్కిలీ విచారముగలవాణ్ణిగా చేసేకొరకు మధ్యమధ్య ఒకానొక కణముపుచ్చుకుంటూ అతనితోకూడా మాంసములుఏవైనా భక్షణ చెయ్యడమునకు బదులుగా పిచ్చికభక్షించే అంతకన్న స్వల్పమయిన పరిమాణముగల రొట్టెగుంజుయొక్క తునకలు మాత్రమే అప్పటప్పటికి ఆవిడె నోట్లో వేసుకుంటూ వచ్చిన్నట్టున్ను అందుమీద ఆవిడయొక్క ముష్కరమునుగురించి అతనికి మిక్కిలీ అధికముగా కోపము వచ్చినప్పటికిన్ని ఆవిడెచోట గారాబమునుంచే కొరకున్ను ఆవిడెను మన్నించేకొరకున్ను ఈ మనిషికి పురుషులతో భోజనముచేసే అభ్యాసము లేకయునుండుననిన్ని పెనిమిటితోకూడా భోజనముచేసే వాడిక బొత్తిగా లేదనిన్ని పెనిమిటియెదుట ఈ ప్రకారము భోజనము చెయ్యడమునకు నేర్పబడియుండునేమోననిన్ని ఆవిడె చద్దిభోజనము చేసినదేమోననిన్ని యొంటరిని భోజనము చెయ్యడమునకుగాని తలచియున్నదేమోననిన్ని అతను ఎంచుకున్నట్టున్ను అప్పట్లో ఆవిడెయొక్క స్వభావమును వికారపరచడమునకుగాని తన అసమాధానముయొక్క చిన్నాను ఆవిడెకు కనుపరచడమునకుగాని ఏమిన్ని చెప్పకుండా సదరు యోదినలు అతణ్ణి అటంకపరచినందున భోజనాంతరము కోపచిహ్నయొక్క వైఖరియేమీ కనుపరచకుండా అతను అక్కడినుంచి వెళ్ళినట్టున్ను ఆ రాత్రి భోజనమందేమి మరుసటిరోజు భోజన మందేమి తరువాత వారు ఉభయులు కూడా భోజనము చేసిన ప్రతితడవనూ ఏమి ఆవిడె అదేతరహాను జరిగించుతూ వచ్చినట్టున్ను మనిషి ఇంత స్వల్పాహారముమీద జీవనము నిల్పుకోవడము అసాధ్యమనిన్ని ఈ సంగతియందు ఏమోవింతయున్నదనిన్ని అతను ఊహించుకుని ఎరగనట్టు ఊరికే యుండడమునకు నిశ్చయించుకున్నట్టున్ను తాను కోరినప్రకారము అనుకూలముగా తనతోకూడా ఆవిడె యుండేలాగున కాలమే జరిగించగలదనే కోరికలచేత ఆవిడెయొక్క నడవళ్ళనుగురించి ఖబరుపుచ్చుకోనివాడుగా అతను కనుపడుతూ వచ్చినట్టున్ను ఐతే తనకోరికలు వ్యర్థములైనవిగా నుండినవని తరువాత కించిత్కాలములోనే అతను కనుక్కున్నట్టున్ను ఒకనాటి రాత్రి అతనికి మెళుకువ కలిగిఉన్నయెడల అతను బాగానిద్ర పోతున్నాడని ఆవిడె ఎంచుకుని అప్పుడు ఆశయ్య మీదినుంచి మెల్లిగా లేచి అతడు మేలుకుంటాడేమోననే భయముచేత చప్పుడు చెయ్యకుండా మిక్కిలీ జాగ్రత్తగా అవిడె దుస్తు వేసుకుంటూ ఉండినట్టున్ను ఆవిడె అభిప్రాయమేమో అతనికి తెలియక పోయినప్పటికిన్ని ఆ ఆశ్చర్యముచేత పూరానిద్రలో నున్నవాడుగా అతను ఉండినట్టున్ను ఆవిడె దుస్తువేసుకుంటూనే ఏమిన్ని చప్పుడు చెయ్యకుండా గదివెలపలి వాకిట్లోకి వెళ్ళినట్టున్ను అట్లా వెళ్ళగానే అతను లేచి కిటికిలోనుంచి చూస్తూఉండగా వీధితలుపు తీసుకుని ఆవిడె వెలపలికి వెళ్ళినట్టున్ను అతను తక్షణమే ఆవిడె యోరవాకిలిగా నుంచిన దర్వాజాగుండా వెన్నెల వెల్తురున ఆవిడె వెనుకనే వెళ్ళి వారి యింటికి సమీపముగానున్న శ్మశానవాటికలో ఆవిడె ప్రవేశించగా చూచినట్టున్ను అతడు అక్కడనున్న గోడచివరకు వెళ్ళి తనను ఎవరూ చూడకుండా జాగ్రతపెట్టుకుని ఆగోడచాటుననుండి దానిపైనుంచి చూస్తూఉండినట్టున్ను అక్కడ అదివరకు పూడ్చీ పెట్టబడియున్న ఒక శవమును అతనిభార్యయున్ను ఒకదయ్యమున్ను పెళ్ళగించి తన్మాంసభక్షణ చేస్తూఉండినట్టున్ను అప్పట్లో అతను మిక్కిలీ భయంకరమైన ఆశ్చర్యమునుపొంది వారియొక్క విందు ఆఖరయ్యే సమయమందు త్వరగా ఇంటికివచ్చి తలుపు ఓరవాకిలిగానే ఉంచి గదిలోకి వెళ్ళి పరుండి గాఢనిద్రపోతూ ఉన్నవాడివలెనే యుండినట్టున్ను తరువాత వెంటనే అతనిభార్యకూడా వచ్చి తానుబైలుపడకుండా కార్యమును నెరవేర్చుకుని వచ్చినానని సంతోషిస్తు చప్పుడు చెయ్యకుండా ఆవిడెకూడా పరుండినట్టున్ను ఆవిడెయొక్క దుర్మార్గమైనటువంటిన్ని అసహ్యమైనటువంటిన్ని నడవడినిగురించి అతనిమనస్సు చాలావికారమునుపొంది తెల్లవారేమట్టుకు నిద్రపట్టకుండా నుండినట్టున్ను తరువాతకొంచెము కునుకు పట్టి వెంటనే మెళుకువవచ్చినందున ఉదయమైన తరువాత అతను ఆ బస్తీ వెలుపలనున్న తోటలలోకివెళ్ళి ఇంటివద్దికి రావడమునకు ఇచ్చపుట్టక కొంతసేపు సదరు తోటలలో తిరుగుతూ ఉండినట్టున్ను అప్పట్లో ఆవిడె నడవడినిగురంచి యోజిస్తూ ఆవిడెయొక్క అయోగ్యములైన వాంఛలను ఆతంక పరచడమునకు అతనికితోచిన కఠినములైన సదుపాయములను నిల్పివేసి సౌమ్యములైన సదుపాయములను వినియోగపర్చడమునకు నిశ్చయించుకుని ఇంటికివచ్చినట్టున్ను ఇతణ్ణి చూస్తూనే ఆవిడె నౌకర్లను పిలిచి భోజనవస్తువులు మేజామీద సిద్ధముగా నుంచవలసినదని ఆజ్ఞయిచ్చినట్టున్ను ఆ ప్రకారము జరిగించబడ్డ మీదట వారిద్దరూ భోజననిమిత్తము మేజా యొద్ద కూర్చున్న యెడల పూర్వప్రకారమే ఆవిడె యొక్కొక్కకణము భక్షిస్తూ ఉండినట్టున్ను అప్పుడు సాధ్యమైనంత సౌమ్యతచేత పెనిమిటి ఆవిడెతో మన వివాహమైన మరుసటిరోజు మిక్కిలి స్వల్పముగానున్ను ఏగృహస్థునైనా కోపపరచతగిన మర్యాదచేతనున్ను నీవు అన్నము భక్షించడముచూసి నేను ఆశ్చర్యమును పొందడమునకు హేతువుకలిగినసంగతి నీకు తెలిసియున్నదిన్ని అలాగున నీవు భోజనముచేస్తూ ఉండడముగురించి నాకు సమాధానము గానున్నది కాదని నీకు సూచించడముమాత్రముచేతనే నేను సమ్మతిని పొందినట్టున్ను నీయొక్క యిష్టమును కనుక్కునే ప్రయత్నముచేత అనేకములైన తరహాలుగా మాంసములను పక్వముచేయించి వాటిని భక్షించ వలసినదని నీతో నేను చెప్పి యున్నట్టున్ను నీగుర్తెరిగే యున్నావనిన్ని అనేకవిధములైన మాంసములు కలిగియుండడము చేత నామేజాయందు కొరతలేదని నాకు నిశ్చయముగా తెలిసేయున్నదనిన్ని ఐతే నేను చేసిన నీతిచర్చలు నీచోటఫలమును పొందినవి కావనిన్ని నీయొక్క పూర్వపుమార్గమునే నీవు అనుసరిస్తున్నావనిన్ని నిన్ను నిర్భంధము చెయ్యకూడదనే తాత్పర్యముచేత నీతో నేను ఏమిన్ని అనలేదనిన్ని నీకుబాధగా నుండేది ఏమిన్ని చెప్పడమునకు నాకువిచారముగా నున్నదనిన్ని చెప్పి నిన్ను వేడుకుంటాను నామేజాయందు ఉంచబడియున్న మాంసముకంటె బాగా ఉన్నది కాదేమో చెప్పవలసినదని అడిగినట్టున్ను ఈకడపటి మాటలు అతను పలుకగానే కిందటిరాత్రి అతను తనను కనిపెట్టి యుండినట్టు ఆవిడె గ్రహించి యూహకువెలిగానుండే యంతఅధికమైన కోపమును పొందినట్టున్ను ఆవిడె ముఖము సిందూరమువలెనే ఎర్రనైనట్టున్ను ఆవిడెయొక్క నేత్రములు ముఖమువల్లనుంచి వెలపలికి రావడమునకు సిద్ధముగా నుండినట్టున్ను ఆవిడె పొందియున్న భయంకరస్థితిని అతను చూచి తనకువిరోధముగా ఆవిడెకుదిర్చిన ఘోరమైన దుష్కృత్వమును ఊహించడమునకున్ను దానివల్లనుంచి తననుబచావు చేసుకోవడమునకున్ను శక్తుడుగాకుండా నిశ్చేష్టితుడయి యుండే అంతభీతిని పొందినట్టున్ను ఆవిడె తనకోపాధిక్యముచేత సమీపమందున్న యొకపళ్ళెములోని నీళ్ళలో చెయ్యిముంచి కొన్నిమాటలు గొణుగుతూ అతని ముఖముమీద కొంచెము ఉదకముచల్లి కోపమును కూడుకున్న స్వరముతో పనికిమాలినవాడా నీఆశ్చర్యమునకు తగినశిక్షను పొందుమనిన్ని కుక్కవుకమ్మనిన్ని పలికినట్టున్ను ఆవిడె అదుష్టవాక్యములు పలుకగానే అతను కుక్కయైనట్టున్ను అవశాత్తుగా సంభవించిన ఈబదలాయింపువల్ల అకుక్కపొందిన విభ్రాంతిన్ని ఆశ్చర్యమున్ను ఆవిడె ఒకకర్ర తీసుకుని దాన్ని కొట్టవచ్చేమట్టుకు దాని సంరక్షణనుగురించి యోజించుకోకుండా దాన్ని ఆటంకపరచినట్టున్ను ఆకర్రతో ఆవిడె కుక్కను బళువుదెబ్బలు కొడుతూఉండగా తప్పించుకునేకొరకు ఆకుక్క వాకిట్లోకిపోతే ఆ కోపముతో అక్కడికిని వెళ్ళి తనకు అలుపువచ్చేమట్టుకు దాన్ని వెంటబడి ఆవిడెకొట్టినట్టున్ను కోరినప్రకారము ఆ దెబ్బలచేత అప్పుడు అది చావకపోయినందున ఆవిడె వీధితలుపు తెరచియుంచి ప్రాణసంరక్షణార్థమై వెలపలికి ఆకుక్క పరుగెత్తిపోయేటప్పుడు దాన్ని తలుపుసందున వేసి యొత్తి చంపవలెనని నిశ్చయించుకున్నట్టున్ను అది కుక్కయై యున్నప్పటికిన్ని పూర్వజ్ఞానముకలిగియున్న దైనందున తక్షణమే ఆవిడెయొక్క ద్రోహబుద్ధిని గ్రహించి ఆవిడెయొక్క జాగ్రత్తను వంచించే కొరకు ఆవిడెముఖమునున్ను చలనములనున్ను సమయముదొరికేమట్టుకు కనిపెట్టిచూస్తూ దాని ప్రాణమును సంరక్షించుకునేటందుకున్ను ఆవిడెయొక్క కార్యమును తప్పించుకునేటందుకున్ను చాలినంతజల్దుతో వెలపలికి ఆకుక్క దాటినట్టున్ను అప్పట్లో ఆవిడె తలుపుకదియ వేసినందున కుక్కయొక్క తోక చివర కొద్దిగా నలిగిపోయినట్టున్ను అంతట అది వీధుల వెంట పరుగెత్తేటప్పుడు అదివరకు పొందిఉన్న బాధచేత అరిచి యేడ్చినందున ఆ సమీపమందున్న కుక్కలు విస్తారముగా పోగైనట్టున్ను వాటిలో చాలా కుక్కలచేత ఈకుక్క కరువబడ్డట్టున్ను అంతట వాటివల్ల ఇంకా వచ్చే ఉపద్రవమును తప్పించుకునే కొరకు పక్వములైన వేటతలకాయలు మొదలైనవి అమ్మే ఒకమనిషియొక్క దుకాణములోకి ఆకుక్క పరుగెత్తి తత్కాలోపద్రవము తప్పించుకున్నట్టున్ను ఆ మనిషి పశ్చాత్తాపముచేత దాని పక్షమును అవలంబించి దాన్ని వెంబడించిన కుక్కలను తరిమివేసినట్టున్ను అది మాత్రము అతనిదుకాణములో దాగియుండినట్టున్ను ఐతే అది అతని దుకాణములో ఉన్నమట్టుకు ఏ వస్తువునున్ను అంటుకోకుండా ఉంటూ వచ్చినట్టున్ను ఉదయకాలమందు అతను సరుకులుతెచ్చి దుకాణమున వేసేయెడల వాటివాసననుబట్టి ఆ దుకాణముచుట్టూ కొన్ని కుక్కలు పోగైయుంటూ వచ్చినందున అదిన్ని దుకాణము యెదటికివచ్చి ఆహారమును ఆర్థించేస్థితిలోనుంటూవస్తె ఆ దుకాణదారుడు చూచి అది తన దుకాణములో ఏవస్తువునున్ను అంటుకోకుండా నుండినందుకు సంతోషించి దీనికి తగిన ఆహారము ఇస్తూవచ్చినట్టున్ను తదనంతరము ఆ కుక్క అతని యింట్లోకి చేరడమునకు కోరికగలదిగా అతనికి తోచినందుననున్ను అతను కుక్కలు అపరిశుద్ధములైన జంతువుగా గావించుకొనే వారిలో వాడైనందుననున్ను తన గృహమందు దానికి నివాసమును ఇవ్వడమునకు అంగీకరించక మరియొక నూతనమయిన నివాసమును వెతుక్కునేటట్టు అది బలవంతపెట్టబడేలాగు చెయ్యడమునకు చానిన చిహ్నములను కనుపరచినట్టున్ను అందుమీదట ఆకుక్క సమీపమందున్న యొక రొట్టెల దుకాణము ఒద్దికి వెళ్ళినట్టున్ను ఆ దుకాణదారుడు మిక్కిలీ ఉల్లాసమయిన స్వభావము గలవాడై యుండినట్టున్ను అప్పుడతను భోజనముచేస్తూ ఉండిన్నట్టున్ను సదరహీ కుక్క అతనియొద్దికి వెళ్ళి నిలచినంతట అది ఏమిన్ని కోరినట్టు సంజ్ఞ కనుపరచకపోయినప్పటికిన్ని రొట్టెతునక వకటి అతను దానిముందర వేసినట్టున్ను ఇతరములైనకుక్కలు ఆహారవస్తువును అందుకునే తరహాను ఆకుక్క సదరు తునకను త్వరితముగా అందుకోవడమునకు బదులుగా ఉపకారస్మృతిని తెలియచెయ్యడమునకు అది తల కదిలిస్తూ తోక ఆడిస్తూ అతనివంక చూచినట్టున్ను అందుకు అతడు చాలా సంతోషించి చిరినవ్వునవ్విన్నట్టున్ను అప్పట్లో ఆకుక్క ఆకలి గొనియుండక పోయినప్పటికిన్ని అతణ్ణి సంతోషపరిచేకొరకున్ను అతనియెడల మర్యాదచేత సదరు తునక తినేటట్టుగా కనుబరచడమునకున్ను నిమ్మళముగా దాన్ని భక్షించినట్టున్ను దాని అభిప్రాయమును అతను గ్రహించి తన దుకాణము ఒద్ద అది యుండడమునకు అంగీకరించినట్టును అది అక్కడ కొంచెము సేపు కూర్చుని యుండి అతని ప్రాపకమే తనకు కావలసినదని అతనికి తెలియ చెయ్యడమునకు తగినట్టు వీధిపక్కను తిరిగి పెంపుడుకుక్క వలెనే కూర్చుని యుండినట్టున్ను అందుకు అతను అంగీకరించడము మాత్రమే కాకుండా దాన్ని దువ్వి మచ్చికచేసి ఇంట్లోకి రావడమునకు కూడా దిలాసా గలుగచేసినట్టున్ను అతనికి ఆజ్ఞాబద్ధమయినదై తాను ఇంట్లో ప్రవేశించినట్టుగా కనుపడే మర్యాదతో అది లోపల ప్రవేశించినట్టున్ను అతను ప్రవేశించి అది నివసించియుండడమునకు ఒకస్థలము కనుపరచినట్టున్ను ఆకుక్క అతనితోకూడా యున్నంతమట్టుకు ఆస్థలము దానికిందనే యుంచుకున్నట్టున్ను అతనిచేత ఆకుక్క చక్కగా ఆదరించబడుతూ వచ్చినట్టున్ను అతను భోజనము చేసినప్పుడల్లా భోజనవస్తువులలో దానికితగినవస్తువులు వేస్తూవచ్చినట్టున్ను దాన్నిమట్టుకు అది అతణ్ణి ఆశించి ఉపకార స్మృతికి తగిన విశ్వాసముగలదై సదా దాని దృక్కులు అతనిమీదనే ఉంచుతూ ఉండినట్టున్ను అతను దర్వాజా వెలుపలికి వెళ్ళినా లేక పట్టణములోనికి ఏమయినా పనిఉండి వెళ్ళినా అతని మడమలవెంటనే ఆకుక్క యుంటూ వచ్చినట్టున్ను తాను లక్ష్యము కలిగి ప్రవర్తిస్తూ ఉండడము అతణ్ణి సంతోషపరచినట్టు అది గ్రహించి మిక్కిలీజాగ్రత్తగా ఉంటూవచ్చినట్టున్ను అది తనకుతానై వచ్చి అతనికి మిక్కిలీసంతోషము కలిగేలాగు ప్రవర్తిస్తు వచ్చినందున ఆకుక్కకు అతను భాగ్యమనేపేరుఉంచినట్టున్ను ఎప్పుడైనా అది చూడడమునకు అవకాశము లేకుండా అతను వెలపలికి వెళ్ళెయెడల భాగ్యమా అని అతను దాన్ని పిలుస్తూవచ్చినట్టున్ను అలాగున పిలువగానే అది తాను ఉన్నస్థలములోనుంచి ఎగిరిగంతులువేస్తూ దుముకుతూ దర్వాజాముందర పరుగెత్తుతూ అతను వెలుపలికి వెళ్ళేమట్టుకు వినయముగా నాడుతూఉండి తరువాత అది అతణ్ణి వెంబడించేకాని లేక తన సంతోషము అతనికి కనుపరచేలాగు తరచుగా అతనివంక చూస్తూ అతనిముందర పరుగెత్తుతూనే కాని యుంటూవచ్చినట్టున్ను ఆకుక్క అతనియొద్ద కొంతకాలము ఉన్నమీదట ఒకనాడు ఒకస్త్రీ రొట్టెలు కొనుక్కునే నిమిత్తము ఆదుకాణములోనికి వచ్చి కొన్ని మంచి నాణ్యములతో ఒక జబ్బునాణ్యముకూడా ఆవర్తకుడికి ఇచ్చినట్టున్ను అతను ఆ జబ్బునాణ్యము కనుక్కుని అది తిరిగియిచ్చివేసి అందుకు బదులు ఇమ్మని అడిగినట్టున్ను ఆవిడె అది పుచ్చుకోక మళ్ళబాటుచేసి అదియోగ్యమైనదేనని అన్నట్టున్ను ఆ నాణ్యము మంచిదికాదని అతను వాదించి అది తన కుక్కకూడా కనుక్కోగలిగినంత స్పష్టమైన దగానాణ్యమైనట్టు తనకు నిశ్చయముగా తెలుసునని ఆవిడెతో అతను చెప్పి అందుమీద భాగ్యమా భాగ్యమా అని పిలిచినట్టున్ను తక్షణమే ఆ కుక్క ఆ దుకాణము ముందరఉన్న దసుకుపెట్టెమీదికి దుమికి నందున అతను ఆ నాణ్యములు దాని ముందరవేసి ఇవి చూచి ఇందులో చెల్లని నాణ్యమేదో చెప్పవలసినదని అన్నట్టున్ను అప్పుడా కుక్క ఆ నాణ్యములనన్నిటిని చూచి తతిమ్మావాటిలో నుంచి జబ్బు నాణ్యమును విడతీసి తన పాదము దానిమీద ఉంచి అది తనఖానందుకు కనుపరచడమునకుగాని అతని ముఖము చూచినట్టున్ను అతను ఆస్త్రీని యెగతాళి చెయ్యడమును గురించి మాత్రమే ఆకుక్కను పిలచియున్నందున అది త్క్షణమే జబ్బునాణ్యము మీద పాదము ఉంచినందుకు మిక్కిలీ ఆశ్చర్యపడ్డట్టున్ను ఈ ప్రకారము నేరము రుజువుపరచబడ్డ ఆస్త్రీకి అందునగురించి చెప్పడమునకు ఏమి సబబు లేనందున ఆ జబ్బునాణెమునకు బదులుగా మంచినాణ్యమును అతనికి యివ్వడమునకు ఆవిడెబద్ధురాలైనట్టున్ను ఆవిడె అక్కడనుంచి వెళ్ళినతరువాత ఆవర్తకుడు తన యిరుగుపొరుగువారిని కొందరిని పిలచి సదరహి ప్రకారము సంభవించిన సంగతి వారికి తెలియచేస్తూ ఆ కుక్కయొక్క యోగ్యత మిక్కిలి అధికముగా వర్ణించినట్టున్ను మంచిచెడ్డ నాణ్యములను ఆ కుక్క విడతియ్యడము తాము చూడవలెనని వారు ఆపేక్షించినట్టున్ను మంచినాణ్యములతోకలిపి వారు వేస్తూవచ్చిన జబ్బునాణ్యముల అన్నిటిలో ఒకటిఐనా తప్పిపోకుండా ఆ కుక్క విడతీసి వాటిమీద అది తనపాదము ఉంచుతూ వచ్చినట్టున్ను ఇందువల్లనున్ను ఈ వింత సదరుస్త్రీ ఆవిడెకు తటస్థించిన ప్రతిమనిషితోనూ చెప్పుతూ రావడమువల్లనున్ను ఆ ఇరుగుపొరుగు మాత్రమే కాకుండా పట్టణముయొక్క తద్భాగమందున్ను క్రమేణ పట్టణము కడాకున్ను మంచినాణ్యములలోనుంచి చెడ్డనాణ్యములను విడతీసేశక్తి ఆ కుక్కకు ఉన్నట్టు ఒకవాడిక వ్యాపించినట్టున్ను సదరువర్తకుని దుకాణము యొద్దకు రొట్టెలు కొనుక్కో వచ్చే వారికందరికిన్ని దాని ప్రజ్ఞ కనుపరచడమునకు అది బాధ్యతకలదైనందున ప్రతిరోజు దానికి చాలినంతపని యుంటూ వచ్చినట్టున్ను ఆ ప్రసిద్ధి సదరు వర్తకుడు నెరవేర్చకలిగినపనికంటె అధికమైనపని అనగా ఆ పట్టణముయొక్క మిక్కిలీ దూరపుభాగములనుంచిన్ని రొట్టెలు కొనేవారికి అతని యొద్దికి తీసుకువస్తూవచ్చినట్టున్ను అతను తనస్నేహితులతోనున్ను ఇరుగుపొరుగు వారితోనున్ను ఆ కుక్క తనకు ఖజానా యున్నదని చెప్పదగిన్నట్టు కొంతకాలము సదరు వింతజరుగుతూ వచ్చినట్టున్ను ఆ కుక్కయొక్క యోగ్యతాప్రసిద్ధి ఆ వర్తకునియొక్క మంచి అదృష్టమునకు చాలామంది ఓర్చలేక పొయ్యేలాగున్న వారు ఆ కుక్కను ఎత్తుకు పోవడమునకు అనేక తంత్రములు జరిపించేలాగున్ను చెయ్యడమునకు కారణమయినందున ఆ వర్తకుడు సదా ఆ కుక్కను తన దృష్టిపథమందే ఉంచుకోవదమునకు బద్ధుడైన్నట్టున్ను ఒకరోజున ఒకస్త్రీ తతిమ్మా్వారి వలెనే వేడుకచేత ఆ దుకాణముయొద్దికి రొట్టెలు కొనడమునకు వచ్చి అక్కద బల్లమీద కూర్చున్న సదరు కుక్కనుచూచి ఒక చెల్లని నాణ్యముతోకూడిన ఆరునాణ్యములు ఆకుక్కయొద్ద వేసినట్టున్ను వెంటనే ఆ కుక్క వాటిలో నుంచి చెల్లనినాణ్యమును విడతీసి దానిమీద తనపాదముఉంచి ఇది చెల్లనినాణ్యముకదా అని తెలియచెయ్యడమునకు చాలినట్టుగా ఆ మనిషియొక్క ముఖము చూచినట్టున్ను ఆ మనిషి కుక్కవంక చూచి ఔనూ నీవు ఖరాగానే జరిగించినావు అది చెల్లనిదేనని చెప్పి ఈ కుక్కనున్ను ఇది జరిగించేపనిన్ని నిదానముగా చూస్తూ అక్కడ కొంతసేపు ఉండి ఆ చెల్లనినాణ్యమునకు బదులునాణ్యమును రొట్టెలఖరీదుకింద ఆవర్తకునికియిచ్చి ఆవిడె దుకాణము వెలపలికి వెళ్ళెటప్పుడు అ కుక్కను తనవెంబడిరమ్మని వర్తకునికి తెలియకుండా ఇషారా చేసినట్టున్ను తనకు అవశాత్తు సంభవించిన బదలాయింపువల్లనుంచి విడుదల కావడమునకు తగిన సదుపాయమైనా కలిగేకొరకు ఆ కుక్క సదాయత్నముగలదై యున్నందున సదరు స్త్రీ తనను వింతఐనశ్రద్ధతో పరిశీలించినట్టు గ్రహించి తనయొక్క గ్రహచారమునున్ను తాను పొందిఉన్న విచారస్థితినిన్ని కొంతమట్టుకు ఆవిడె కనిపెట్టి యుండునని ఊహించినట్టున్ను ఐనప్పటికిన్ని ఆవిడెను దుకాణము వెలపలికి వెళ్ళనిచ్చి ఆవిడెవంక చూస్తూఉండినట్టున్ను తరువాత ఆవిడె రెండుమూడు అడుగులు నడిచి అక్కడినుంచి తిరిగీ ఆ కుక్క అది ఉన్నస్థలములోనుంచి కదలకుండా తనను చూస్తూఉన్నట్టు కనుక్కుని దాన్ని తనతోకూడరమ్మని మరియొక సంజ్ఞ చేసినట్టున్ను ఆ కుక్క వ్యవధిగా నిదానిస్తూ ఉండక తన ఖామందు మరియొక పనిమీద ఉండి తనను మనస్కరించకుండా ఉన్నట్టు కనుక్కుని తాను కూర్చున్న బల్లమీదినుంచి దుమికి ఆ మనిషితోకూడా వెళ్ళినందున ఆ మనిషి సంతోషించి కొంతదూరము వెళ్ళిన తరువాత ఆవిడె తన ఇంటి యొద్ద నిలిచి తలుపు తెరచి నాతోకూడా రావడమువల్ల నీవు పస్తాయించవు లోపలికి రమ్మని కుక్కతో అన్నట్టున్ను ఆవిడెతోకూడా ఆ కుక్క లోపలికి వెళ్ళినతరువాత ఆవిడెతలుపువేసి దాన్ని తన హాల్లోకి తీసుకుని వెళ్ళినట్టున్ను అక్కడ సౌందర్యవతియైన ఒక చిన్నది కషీదాపనిచేస్తూ యుండినట్టున్ను ఆ చిన్నది సదరు స్త్రీయొక్క కుమార్తెఐన్నట్టున్ను మరిన్ని ప్రబలమాంత్రికురాలైనట్టున్ను తల్లి ఈ కుక్కను కొమార్తెకు కనుపరచి మంచిచెడ్డ నాణ్యములు కనిపెడుతుందనే ప్రసిద్ధి గల కుక్కను తీసుకవచ్చినాననిన్ని మొదట నేను ఈ కుక్కసంగతి విన్నప్పుడు ఒకానొక దుర్మార్గమైన దగాచేత మనిషి కుక్కగా బదలాయించబడ్డాడని నాకుతోచి ఆసంగతినీతో చెప్పియున్నాననిన్ని ఈ రోజున ఆ వర్తకుని దుకాణముయొద్దికి కొన్నిరొట్టెలు కొనేనిమిత్తము నేను వెళ్ళి ఈ కుక్కవల్ల జరిగించబడుతున్న వింతలను ప్రత్యక్షముగా చూచినాననిన్ని చెప్పినా ఊహయందు నేనేమైనా పొరపడ్డానేమో చెప్పుతావా అని కుమార్తెను ఆవిడే అడిగినట్టున్ను అమ్మా నీవు పొరపడలేదు అది ఇప్పుడే ఆ ప్రకారము కనుపడేలాగు చేస్తానని కుమార్తె జవాబు చెప్పి వెంటనేలేచి ఉదకముతో ఉన్న ఒక పళ్ళెములో తన చెయ్యి ముంచి కొంచెము ఉదకము ఆ కుక్కమీద చల్లి నీవు కుక్కవుగా పుట్టి వుండినట్టయితే ఆ ప్రకారముగానే యుండవలశినదనిన్ని లేక మనిషిగా పుట్టియుండిన పక్షమందు ఈ ఉదకప్రభావము చేత నీయొక్క పూర్వపు ఆకారమును తిరిగి పొందవలసినదనిన్ని అన్నట్టున్ను మనిషిని కుక్కగా బదలాయించియున్న మంత్రశక్తి అప్పుడే భగ్నమై ఆ కుక్క యథాప్రకారముగా మనిషి ఐన్నట్టున్ను సదరు ఉపకారముయొక్క అధికతను అతను బాగా కనుక్కుని ఆవిడెకు నమస్కరించి నా ప్రియరక్షకురాలాను ఆమణ్ణిఐన నాయెడల నీవు చేసిన అధికమైనటువంటిన్ని సరిలేనటువంటిన్ని అనుగ్రహమునుగురించి నా ఉపకారస్మృతి కనుపరచడమునకు నేను ఏమిజరిగించవలసినదో నీవే చెప్పవలసినదని నిన్ను వేడుకునే అంతగా వివేకముగలవాడనై యున్నాననిన్ని లేక నన్ను సేవకుణ్ణిగా ఏర్పరచుకోవడమునకు నీకు న్యాయమైన హక్కు ఉన్నది గనుక ఆ ప్రకారము జరిగిస్తే మిక్కిలీ యోగ్యముగా నుంటుందనిన్ని ఇకను నేను నా వాణ్ణికాననిన్ని బొత్తుగా నీ వాణ్ణే ఐయున్నాననిన్ని పలికి తాను ఎవరైనది ఆవిడెకు తెలిసేలాగు తనవృత్తాంతమున్ను తన వివాహపుసంగతిన్ని వివాహమైనది మొదలుకుని తాను కుక్కగా బదలాయించబడేమట్టుకు జరిగినసంగతిన్ని సంక్షేపముగా అతను ఆవిడెతో చెప్పినట్టున్ను నీవు నాకు అచ్చి ఉన్నట్టు చెప్పేబాధ్యతను గురించి మనము ప్రశంసించవలసినపని లేదనిన్ని నీవంటి యోగ్యుడైన పురుషునకు ఉపయోగమైన కార్యమేదైనా నేను జరిగించినానని అనడమే నాకు చాలి యున్నదనిన్ని నీ భార్యనుగురించి మనము కొంత సంభాషించవలసినదనిన్ని సదరు చిన్నది అతనితో అని నీభార్యను నీవివాహమునకు పూర్వము నేను గుర్తెరిగి యుంటిననిన్ని తామిద్దరమున్ను మంత్రవిద్య ఒకదేశికియొద్దనే నేర్చుకునియున్నాము గనుక నీభార్య మాంత్రికురాలని నాకు తెలిసే ఉన్నదనిన్ని ఆ మంత్రవిద్యా సంబంధమయిన ఎరుక కొంచెము తనకు కలిగియున్నట్టు ఆవిడెకుకూడా తెలిసియున్నదనిన్ని స్నానశాలలయందు తామిద్దరమూ తరుచుగా కలుసుకుంటూ వచ్చినామనిన్ని ఐతే తమస్వభావములు భిన్నముగా నున్నందున ఆవిడెతో స్నేహము చెయ్యడమునకు అన్ని సమయములనున్ను తాను తప్పిస్తూవచ్చినాననిన్ని తనచోట ఆవిడెకూడా అదేప్రకారము జరిగిస్తూ వచ్చినది గనుక తాను అట్లా తప్పించడము కఠినమయినపనిగా ఉండినది కాదనిన్ని ఆవిడెయొక్క దుర్మార్గత్వమునకు తాను మిక్కిలీ ఆశ్చర్యమును పొందియున్నాను కాననిన్ని నీకు ఇదివరకు నేను జరిగించినది చాలియున్నది కాదనిన్ని నేను ఆరంభించినది సంపూర్ణము చేస్తాననిన్ని మనుష్యకూటమువల్లనుంచి నిన్ను ఆవిడె తప్పించునటువంటి మంత్రశక్తిని విచ్ఛిత్తు చెయ్యడముమాత్రము చాలియున్నది కాదనిన్ని నీవు ఇంటికి తిరిగీ వెళ్ళి నీయజమానత్వమునువహించి ఆవిడెను తగినట్టు శిక్షించవలసినదనిన్నీ అందుకు తగిన సదుపాయములు నీకు నేను కలుగచేస్తాననిన్ని నేను తిరిగీ వచ్చేమట్టుకు నాతల్లితో నీవు సంభాషణచేస్తునుండవలసిన దనిన్ని చెప్పి ఆవిడె ఒకగదిలోకి వెళ్ళి అక్కడ ఉండగా వారి ఉపకారముచేత తాను బద్ధుడై ఉన్నసంగతిని గురించి ఆవిడెతో ప్రశంసిచినట్టే ఆవిడెతల్లితోనున్ను అతను ప్రశంసించినట్టున్ను అతనిభార్యకు కలిగియున్నట్టే మంత్రసామర్థ్యము తనకుమార్తెకున్ను కలిగియున్నప్పటికిన్ని స్వల్పమయిన సంగతిలోనైనా తనకుమార్తె ఆశక్తి దుర్వినియోగములో తెచ్చేపక్షమందు తాను సహించవలసినది లేదనిన్ని ఆ సామార్థ్యముచేత ఆవిడె ఇతరునుగురించి జరిగించేమేలు ఆ శక్తిని ఆవిడె వినియోగము పరచడమునకు తనను ఒప్పించినదనిన్ని అతనితో చెప్పి తన కొమార్తె సదరు మంత్రిశక్తివల్ల జరిగించిన ఉపకారములు కొన్ని ప్రశంసించడమునకు ఆవిడె ఆరంభించినట్టున్ను అంతట సదరు చిన్నది ఆ గదిలోనుంచి చేత ఒకచిన్నశీసా ఉంచుకుని హాల్లోకివచ్చి అతనితో ఇప్పుడు నీభార్య ఇంటివద్దలేదనిన్ని తిరిగీ త్వరగానే యింటికివస్తుందనిన్ని నీయొక్క గైరుహాజరీకి తనకు మిక్కిలీ విచారముగా ఉన్నట్టు నీ నౌకర్లఎదుట ఆవిడె మభ్యపరచి ఉన్నదనిన్ని మరిన్ని నీవు భోజనసమయమందు ఒకానొకపని జ్ఞాపకము చేసుకున్నందున తక్షణమే వెలపలికి వెళ్ళేలాగు ఆ పని నిన్ను బాధ్యతపరచినట్టున్ను వెలపలికి వెళ్ళేయెడల నీవు తలుపు తెరచియుంచినట్టున్ను అప్పట్లో నీభార్య భోజనముచేస్తున్నహాల్లోకి ఒకకుక్క వచ్చినట్టున్ను ఒక పెద్దకర్ర తీసుకుని ఆవిడె ఆ కుక్కను వెలపలికి వెళ్ళకొట్టినట్టున్ను నీనౌకర్లు నమ్మేలాగు నీభార్య చెప్పిఉన్నదనిన్ని అన్నట్టున్ను మరిన్ని ఈ చిన్నిసీసా తీసుకుని ఇప్పుడే యింటికి వెళ్ళి ఆవిడె యింటికి వచ్చేమట్టుకు నీగదిలో కనిపెట్టుకుని ఉండి ఆవిడె రాగానే ఆవిడెముఖము నీముఖము ఢీకొనేలాగున వాకిట్లోకి పరిగెత్తమనిన్ని అంత అవశాత్తుగా నీవు తిరిగీ రావడమును చూచినందుకు ఆవిడెకు కలిగే ఆశ్చర్యముచేత పరిగెత్తిపోవడమునకై ఆవిడె వెనుకకు తిరుగుతుంది అనిన్ని అప్పట్లో ఈశీసా సిద్ధముగా ఉంచి ఇందులో నున్న ఉదకము కొంత ఆవిడెమీద చల్లి నీదుర్మార్గత్వమునకు తగినశిక్షను పొందుమని పలుకవలసినదనిన్ని తరువాత ఫలము నేను చెప్పనక్కరలేదు నీవేచూస్తావనిన్ని ఆవిడె అతనితో చెప్పినట్టున్ను అందుమీదట సంపూర్ణమైన ఉపకారస్మృతియొక్క చిహ్నలతోనున్ను వారినిగురించి అతనికి ఉండేబాధ్యతను మరచిపోకుండా ఉండేటటువంటి వాస్తవమైన షరతుమీదనున్ను వారియొద్ద అతను శలవుపుచ్చుకుని యింటికి వెళ్ళినట్టున్ను అన్నిసంగతులు ఆమాంత్రికురాలు చెప్పిన ప్రకారమేసంభవించినట్టున్ను తరువాత వ్యవధిలేకుండానే అతనిభార్య ఇంటికి వచ్చినట్టున్ను ఆవిడె వాకిట్లోకిరాగానే అతను సదరు శీసా చేతులో ఉంచుకుని ఆవిడెకు ఎదురుగాపరిగెత్తినట్టున్ను ఆవిడె అతణ్ణిచూచి కేకవేసి దర్వాజాయొద్దికి పరిగెత్తడమునకు తిరుగగానే సదరు శీసాలో ఉన్న ఉదకముకొంత ఆవిడెమీద చల్లి నీకుతగ్గ శిక్షను పొందుమని అతను అన్నట్టున్ను తక్షణమే ఆవిడె యొక ఆడగుర్రమయి విభ్రాంతిని పొందియుండగా అతను దానిజూలును పట్టుకుని అది మళ్ళబాటు చేస్తున్నప్పటికిన్ని గుర్రముల తబేలాయెద్దకి తీసుకునివెళ్ళి దాన్ని అక్కడ కట్టిఉంచి కంచీతో శిక్షించినట్టున్ను మరిన్ని కొంతకాలము అదేప్రకారము శిక్షిస్తూ ఉండినట్టున్ను తదనంతరము సదరు మాంత్రికురాలిచేతనే ఆ గుర్రమును తిరిగి మనిషిగా బదలాయింపుచేయించి వదిలివేసినట్టున్ను ఒక భాషాంతరగ్రంధమందు చెప్పబడియున్నది.

౭ – ఈ కథయందు చెప్పబడ్డ విరుద్ధకార్యములనగా మనిషితో దెయ్యము కూడా కూర్చుండి భుజించడమున్ను మంత్రముచేత మనుష్యులు గుర్రములు కుక్కలు మొదలైన ప్రాణులుగా బదలాయించబడడమున్ను ఆప్రత్యక్షములైనటువంటిన్ని ముందు జరగబొయ్యేటటువంటిన్ని సంగతులు మనుష్యబుద్ధికి యథావిధిగా స్పష్టముకావడమున్ను ప్రపంచస్వభావమునకు విరుద్ధధర్మములైనట్టు తెలుస్తున్నవి.

౮ – ఈ కథయందు కనుపరచడమునకు ఉద్దేశించబడ్డ నీతియుక్తులయొక్క వివరము తాను వివాహము చేసుకోబొయ్యే చిన్నదానియొక్క యోగ్యతలను విమర్శించుకోనిది పెండ్లి యాడడము అమోగ్యమైన పని అనిన్ని పెండ్లికొమార్తెయందు ముందుగా కోరతగినది సద్గుణ సంపత్తే కాని సౌందర్యము కాదనిన్ని దుర్మార్గవృత్తికిన్ని దుర్మార్గసహవాసమునకున్ను వాడికపడ్డ మనిషికి న్యాయమైన మార్గము అలవడడము కష్టమనిన్ని అటువంటి వారిని న్యాయమైన మార్గమునకు తీసుకురావలెనని ప్రయత్నము చేసే యెడల ఎవరున్ను తమకాపుచేసుకోకుండా బేలతనముగా వ్యవహరించకూడదనిన్ని అవశాత్తు సంభవించిన విపత్తుయందు ప్రథమతః జాగ్రతకలుగడము అరుదైనప్పటికిన్ని కొంతపీడను పొందడము తోటిబుద్ధిమంతులు దాన్ని తప్పించుకునే జాగ్రత తెచ్చుకోవడము ఆవశ్యకమనిన్ని తనయొక్క ఆర్తిని ఆదరించేవారు లేనియెడల ప్రకటనచెయ్యడము ఆయాసమునకే హేతువు ఔతుందనిన్ని ఉపద్రవము వచ్చినప్పుడు తగినప్రాపకమును వెంటనే వెతుక్కోవడము అవశ్యమనిన్ని స్వామిద్రోహము లేనివారి విషయమై ఎటువంటి ప్రభువులైనా దయదలుచ చూస్తారనిన్ని యోగ్యుడైనటువంటిన్ని ప్రాజ్ఞుడైనటువంటిన్ని నౌకరును అంగీకరించి ఆదరించడమువల్ల స్వామికార్యము కిఫాయతును పొందడమునకు సందేహము లేదనిన్ని ఆపత్తును పొందియున్నప్పుడున్ను వివేకముతోకూడిన ప్రవర్తనకలిగి ఉన్నపక్షమందు ఆ ప్రవర్తనయొక్క కీర్తి ఆదరించతగ్గవారిని సులభముగానే ఘటనపరుస్తుందనిన్ని సజ్జనులైనవారికి కలిగినశక్తి ఆపదలను పొందినవారిని వాటివల్లనుంచి విముక్తులను చెయ్యడమునకున్ను దుష్టులను శిక్షించడమునకున్ను దుర్జనులైన వారికి కలిగినశక్తి కావలసినవారినైన బాధను పొందించడమునకున్ను ఉపయోగ మౌతుందనిన్ని తెలియచెయ్య గలందులకున్ను వినేవారికి వినోదముగా నుండగలందులకున్ను సదరు కథ కల్పించబడ్డదిగాని ఇది వాస్తవముగా జరిగిన కథ కాదు.

తక్షకప్రశంస

౯ – కలియుగాదియందు పరిక్షిన్మహారాజు షికారు నిమిత్తము వనమునకు వెళ్ళినప్పుడు ఆయనయొక్క బాణము తగిలిన యొక మృగము పడకుండా పోయినందున ఆయన గుర్రపుసవారై ఆ మృగమును వెనుదగిలి బహుప్రయాసతో ‘తరిమినట్టున్ను’ అది చాలాదూరము తిరిగీ అందకుండా తప్పించుకుని వెళ్ళినట్టున్ను అది వెళ్ళిన మార్గమందు శమీకుడనే యొకబ్రాహ్మణుడు జపము చేసుకుంటూ నుండగా రాజు ఆయనయొద్దకు వెళ్ళి తన బాణము తగిలిన యొకమృగము ఆ బాణముతోనే యిక్కడికివచ్చినది అది ఏవైపున వెళ్ళినదో చెప్పవలసినదని అడుగుతూవస్తే ఆయన ఏమీ జవాబుచెప్పనందున రాజువిసికి అక్కడ చచ్చిపడియున్న యొకపామును వింటిమొనతోతీసి ఆ బ్రాహ్మణుని కంఠమందు తగిల్చి చక్కా వెళ్ళినట్టున్ను ఆ బ్రాహ్మణుని కుమారుడైన శృంగి అనేఆయన ఈసంగతివిని పరిక్షిన్మహారాజు ఏడురోజులలోపలను తక్షకుడనేపాముచేత కరువబడి చచ్చుగాక యని తిట్టినట్టున్ను ఆ సంగతి శమీకునకు తెలిసి కుమారుణ్ణిపిలిచి పరిక్షిన్మహారాజు బహుయోగ్యుడనిన్ని మృగమును వెంటబడి తరిమి చాలాఅలసినవాడున్ను క్షుత్పిపాసా పీడితుడున్ను మృగాసక్తుడున్ను ఐయుండి అప్పట్లో తాను జపనిష్ఠయందుండినసంగతి కనిపెట్టలేక ఆయన తనను అడిగినమాటలు తాను వినిన్ని జవాబు చెప్పకపోయినట్టు ఎంచుకుని ఆకోపముచేత తనకంఠమందు ఒకయురగశవమును తగిలించి వెళ్ళినాడనిన్ని ఇది స్వల్పదోష మైనందున అందుకు నేను సహించేఉన్నాను గనుక ఇంతమాత్రమునకు ఆరాజును నీవు శపించడము అయుక్తమైనపని అనిన్ని ఆశాపము మళ్ళించవలసినదనిన్ని చెప్పి్నట్టున్ను నాతిట్టు అమోఘమైనదిన్ని ఇదివరకే వెళ్ళి తక్షకుణ్ణి ప్రేరణ చేసియుండుననిన్ని దాన్ని మళ్ళించననిన్ని కుమారుడు జవాబు చెప్పినట్టున్ను అంతట ఆ శమీకుడు ఈ సంగతి పరిక్షిన్మహారాజుకు తెలియచేసి తక్షకునివల్ల వచ్చే ఉపద్రవమును తప్పించుకునేజాగ్రత పెట్టుకోవలసినదని చెప్పగలందులకు ఒక బ్రాహ్మణుణ్ణి ఆయనయొద్దకు పంపించినట్టున్ను ఆసంగతి రాజువిని ఒంటి స్తంభపుమేడ కట్టించి మంత్రసిద్ధులైన చాలామంది బ్రాహ్మణులతోనున్ను తనకు ఆవశ్యకులైనవారితోనున్ను మిక్కిలీ జాగత్తగా ఆమేడమీద ఉండినట్టున్ను ఆయనను కరిచేనిమిత్తము తక్షకుడు బైలుదేరి వచ్చేయెడల మార్గమందు ఒకబ్రాహ్మణుడు కనుపడ్డందున ఎక్కడికి వెళ్ళుతావు అని తక్షకుడు ఆయనను అడిగినంతల్లో పరిక్షిన్మహారాజును తక్షకుండు కరిచిచంపుతాడని తెలిసినదనిన్ని అట్లా చంపినపక్షమందు తాను మంత్రించి ఆయనను తిరిగీబ్రతికించి ఆయనయొద్ద ద్రవ్యము తెచ్చుకునేటందుకు వెళ్ళుతున్నాననిన్ని ఆబ్రాహ్మణుడు చెప్పినట్టున్ను తానే తక్షకుడనిన్ని అక్కడఉన్న ఒక గొప్ప మర్రిచెట్టు తానుకరిచి భస్మము చేస్తాననిన్ని ఆచెట్టు నీవు తిరిగీ బ్రతికించ గలవేమో చూతామనిన్ని తక్షకుడు అన్నట్టున్ను అందుకు ఆబ్రాహ్మణుడు ఒప్పుకున్న తరువాత తక్షకుడు ఆమర్రిచెట్టుయొక్క మొదలును కరచినట్టున్ను అందువల్ల తక్షణమే ఆచెట్టు సమూలముగానున్ను దానిమీదనున్న పక్షులు మొదలైనవాటితోనున్ను సమిధలుకోస్తూ ఉన్న ఒకబ్రాహ్మణునితోనున్ను భస్మమై పోగుపడ్డట్టును అందుమీద ఆచెట్టు తిరిగీ బ్రతికిస్తానన్న బ్రాహ్మణుడు మంత్రించినందున అది ఎప్పటివలెనే బ్రతికి సంపూర్ణస్థితిని నిలచినట్టున్ను దానిపైనఉండిన బ్రాహ్మణుడున్ను పక్షులు మొదలైనవిన్ని్కూడా ఎప్పటివలె బ్రతికినట్టున్ను అంతట తక్షకుడు ఆబ్రాహ్మణునితో పరిక్షిన్మహారాజు ఇచ్చేద్రవ్యముకంటె అధికమైన ద్రవ్యము తానే యిస్తాననిచెప్పి ఆయనకు చాలాద్రవ్యము ఇచ్చి సమ్మతిపరచి అక్కడినుంచే తిరిగీ ఇంటికి పంపించివేసి తనబంధువులను కొందరిని బ్రాహ్మణరూపములు ధరించవలసినదనిన్ని వన్యములైన పుష్పములున్ను ఫలములున్ను బుట్టలోనుంచుకొని పరిక్షిన్మహారాజు యొద్దికివెళ్ళి ఆశీర్వదించి ఆయనకు ఇవ్వవలసినదనిన్ని చెప్పిపంపించినట్టున్ను సదరు శాపభయముచేత మిక్కిలీ జాగ్రత్తగా ఒంటిస్తంభము మేడమీద చాలామంది బాహ్మణులు మొదలైనవారితో నుండిన పరిక్షిన్మహారాజు యొద్దకు వారు వేదఘోషతో వెళ్ళినందున ఆయన సంతోషించి వారిని తనయొద్దకు రప్పించి వారు తెచ్చిన ఫలములు పుష్పములు పుచ్చుకుని వారిని సత్కరించి పంపివేసి అది శాపముయొక్క హద్దు గడిచిపొయ్యేపూటయని సంతోషిస్తు ఆ ఫలములు ఆ మేడమీద తనతోకూడానున్న చాలామంది బ్రాహ్మణులు మొదలైనవారికి పంచిపెట్టి ఒకపండు తాను భక్షించేనిమిత్తము తీసుకుని అది ఒలిచినట్టున్ను తక్షకుడు అదివరకే ఆపండులో ప్రవేశించి యుండి నల్లటిపురుగువలె ముందుగా అందులో కనుపడి తదనంతరము ఎర్రటివర్ణముగల పామువలే కనుపడుతూ వెలపలికివచ్చి రాజును గరచి అదృశ్యుడై నట్టున్ను అప్పుడు రాజును కనిపెట్టుకుని ఉన్నవారు అదిచూస్తూనే భయముచేత ఫరారిఐనట్టున్ను రాజుతోకూడా ఆఒంటిస్తంభపుమేడ భస్మమైపోయినట్టున్ను దరిమిలాను ఉదంకుడనే యొకబ్రాహ్మణుడు సంపూర్ణముగా విద్యాభ్యాసము చేసినమీదట ఆయనయొక్క గురుపత్ని నాలుగురోజులలోగా పౌష్యమహారాజు రాణియొక్క గుండలములు యాచించి తెచ్చి తనకు ఇవ్వవలసినదని ఉదంకుణ్ణి అడిగినట్టున్ను అందునిమిత్తమై ఆయన ఆ రాజు పట్టణమునకు పోతూ నుండగా ఒక దివ్వపురుషుడు వృషభవాహనారూఢుండై ఉదంకునకు దర్శనమిచ్చి ఆ వృషభసంబంధమైన గోమయము కొంచము భక్షించవలసినదని ఆజ్ఞ యిచ్చినట్టున్ను ఆయన ఆ ప్రకారము జరిగించి సదరు రాజుయొక్క దర్శనమునకు వెళ్ళి ఆయన రాణియొక్క కుండలములనుగురించి యాచించినట్టున్ను అందుకు ఆ రాజు సంతోషించి అంతఃపురమునకు వెళ్ళి తన శలవైనట్టు రాణికి తెలియచేసి కుండలములు అడిగి తెచ్చుకోవలసినదని చెప్పినట్టున్ను ఉదంకుడు అంతఃపురములోకి వెళ్ళి వెతికినంతల్లో రాణి అక్కడ కనుపడనందున తిరిగీ రాజుయొద్దకివచ్చి అంతఃపురమందు రాణి కనుపడ లేదనిన్నీ ఆ కుండలములు మీరేతెప్పించి ఇప్పించవలసినదనిన్ని చెప్పినట్టున్ను అందుమీద ఆరాజు మీవంటి మహాతపస్సంపన్నులైనవారు అశుచిగానున్నారని అనజాలననిన్ని తనరాణి మహాపతివ్రత యైనందున అశుచిగానుండే వారికి కనుపడదనిన్ని తెలియచేసినట్టున్ను తాను గోమయము భక్షించినందున తనయందు శుచిత్వము లేకపోయినట్టు ఉదంకుడు గ్రహించి శుద్ధోదకముచేత నోరున్ను చేతులున్ను పాదములున్ను ప్రక్షాళన చేసుకుని తిరిగీ అంతఃపురమునకు వెళ్ళినంతల్లో రాణి దర్శనమిచ్చి ఆయనయొక్క ప్రార్థన విని సంతోషించి కుండలములు ఆయనకు సమర్పించి తక్షుకుడనేవాడు ఈ కుండలములను ఆపేక్షించి యున్నాడనిన్ని అతను మహామాయకుడనిన్ని ఇవి అతనికి చిక్కకుండా సంరక్షించుకుని తీసుకుపోవలసినదనిన్ని చెప్పినట్టున్ను తరువాత ఉదంకుడు పౌష్యమహారాజు ఒద్దికి తిరిగీ వచ్చి సదరు సంగతి తెలియచేసినంతల్లో ఉదంకుణ్ణి మర్యాద చెయ్యవలెననే అభిలాషచేత ఆపూట తమ ఇంట్లో భోజనము చేసి వెళ్ళవలసినదని ఆ రాజు ప్రార్థించినట్టున్ను ఆలాగున భోజనము చేసేయెడల భోజనద్రవ్యమందు ఒకవెంట్రుక కనుపడ్డందున ఉదంకుడు కోపించి ఆరాజును గుడ్డివాడవు కమ్మని శపించినట్టున్ను అందుమీద ఇంత స్వల్పమయిన నేరమును గురించి నన్ను తిట్టినావు గనుక నీవు సంతానహీనుడవు కావలసినదని రాజు తిరిగీ శాపము ఇచ్చినందున ఉదంకుడు పశ్చాత్తప్తుడై తాను ఆ శాపమును భరించలేననిన్ని అది మళ్ళించవలసినదనిన్ని రాజును అడిగినట్టున్ను శాపము ఇవ్వడమునకున్ను అది మళ్ళించడమునకున్ను బ్రాహ్మణునికి స్వాధీనమైయుంటుందిగాని క్షత్రియుడు శాపమివ్వడమునకే తప్ప అది మళ్ళించడమునకు శక్తుడు కాడు గనుక నా శాపము నేను మళ్ళించలేననిన్ని మీశాపమును మీరు మళ్ళించవలసినదనిన్ని పౌష్యమహారాజు అన్నట్టున్ను అందుకు ఉదంకుడు ఒప్పుకుని కించిత్కాలములోనే ఆ రాజుకు ఎప్పటిదృష్టి కలిగియుంటుందని పలికి కుండలములు పట్టుకుని వస్తూ్ఉండగా ఒక స్వచ్ఛమైన జలప్రదేశము కనుపడ్డట్టున్ను అ కుండలములు అక్కడఉంచి ఆయన ఆచమనముచేసుకుంటూ నుండగా తక్షకుడు ఒక దిగంబరుడై వచ్చి ఆ కుండలములు తీసుకుని పరుగెత్తుతూఉంటే ఉదంకుండు తరిమి పట్టుకున్నట్టున్ను అప్పుడు తక్షకుడు నిజస్వరూపము ధరించి కుండములతో నాగలోకమునకు వెళ్ళినట్టున్ను తరువాత ఉదంకుడు నాగలోకమునకుపోయి సర్పశ్రేష్ఠులనుగూర్చి బహువిధముల ప్రార్థనచేస్తే యెవ్వరూ దర్శనమివ్వకపోయినట్టున్ను అప్పుడు అశ్వారూఢుడైన యొక మహాపురుషుడు ఉదంకునకు దర్శనమిచ్చి యొక సదుపాయమును ఉపదేశించినందున అందువల్ల తక్షకుడు భయపడి ఆ కుండలములు తెచ్చి ఉదంకునకు ఇచ్చినట్టున్ను అది సదరు వాయిదాయొక్క ఆఖరురోజౌటచేత గురువు యింటికి తిరిగీ చేరడమునకు వ్యవధి చాలదనీ ఉదంకుడు సందేహించుతూ నుండగా ఆ మహాపురుషుడు ఒక గుర్రమునిచ్చి దీన్ని సవారిఐ నీవు వెళ్ళితే యిప్పుడే మీగురువుయింటికి చేరుతావని చెప్పినట్టున్ను ఆయన ఆ ప్రకారము వెళ్ళి గురుపత్ని్కి కుండలములు సమర్పించి తరువాత గురువు యొద్దకు వెళ్ళి నమస్కరించినంతల్లో నీవు ఈ సమీపమందున్న పౌష్యమహారాజు పట్టణమునకువెళ్ళి తిరిగీ రావడమునకు ఇంత వ్యవధి ఎందుకు ఐనదో చెప్పవలసిందని ఆయన అడిగినట్టున్ను తాను బయలుదేరినది మొదలుకొని జరిగిన వృత్తాంతము యావత్తు గురువుతో ఉదంకుడు చెప్పి్నట్టున్ను నీవు పౌష్యమహారాజు ఇంటికి వెళ్ళేయెడల నీకు దర్శనమిచ్చిన మహాపురుషుడు దేవేంద్రుడనిన్ని ఆయన ఎక్కిన వృషభము ఐరావతమనిన్ని నీవు భక్షించిన గోమయము అమృతమనిన్ని నీకు ఆ మహాపురుషుని యొక్క దర్శనమైనందువల్లనున్ను ఆ గోమయము నీవు భక్షించినందువల్లనున్ను నీ కార్యము అనుకూలమైనదనిన్ని నాగలోకములో నీకు దర్శనమిచ్చిన మహాపురుషుడు ఇంద్రసఖుడైన పర్జన్యుడనిన్ని గురువు తెలియచేసినట్టున్ను తక్షకుడు తనకు అపకారము జరిగించినందుకు అతణ్ణి సాధించే నిమిత్తము తదనంతరము ఉదంకుడు జనమేజయునియొద్దికి వెళ్ళి ఆయన తండ్రియైన పరిక్షిన్మహారాజును తక్షకుడు కరచి చంపినసంగతి ప్రశంసించి సర్పయాగము చెయ్యడమునకు అయనను ప్రేరణ చేసినట్టున్ను తరువాత ఆ యాగమును గురించిన కార్యములున్ను వస్తువులున్ను త్వరితముగానే సిద్ధమైనట్టున్ను ఆ యాగకార్యములయందు నిర్ణీతులైన హోత మొదలైన బ్రాహ్మణులుగాక నారదాదిమహర్షులు చాలామంది అక్కడికి వచ్చి దానియందు సదస్యులుగా నుండినట్టున్ను ఆ యాగము జరిగే యెడల అందుల హోమకుండములో అగ్నిప్రజ్వరిల్లుతూ నుండగా ఆ యాగమందు ప్రయోగించబడ్డ మంత్రములు భూలోకమందున్న సర్పములనున్ను నాగలోకవాసులైనటువంటిన్ని పర్వతశిఖరములవలె ఎత్తున్ను ౧-౨-౩-౪గేసి యోజనముల మట్టుకు లావున్నుగల శరీరములు గలిగినటువంటిన్ని సర్పశ్రేష్ఠులనున్ను కోట్లతరబడిగా తీసుకునివచ్చి ఆకుండములో పడవేస్తూఉండినట్టున్ను అప్పుడు కుండములోపడేపాములు పడుతూఉండగా కాలేవికాలుతూఉండగా శరీరములు కొంతమట్టుకు కాలినమీదట విపరీతధ్వనులతో బద్దలయ్యేవి బద్దలౌతూ ఉండగా కాలి భస్మమయ్యేవి ఔతూఉండగా తిరిగీపడేవి పడుతూ ఉండినట్టున్ను ఈలాగున తెరపిలేకుండా సర్పమారణమౌతూ అద్భుతముగా ఆ యాగము జరుగుతూ నుండినట్టున్ను అంతట తక్షకుని మేనల్లుడైన ఆస్తికుడనే బ్రాహ్మణుడు జనమేజయుని దర్శనమునకు వచ్చి ఆయనయోగ్యతలనున్ను వ్యవహారములనున్ను యాగమునున్ను అనేకవిధములుగా స్తోత్రముచేసినట్టున్ను ఆస్తోత్రమునకు రాజు చాలాసంతోషించి ఆయన కోరేకోరికను ఇచ్చేవాడివలె కనుపడ్డందున ఆ యాగమందు తక్షకుడు ఇంకా రాలేదుగనుక అతను వచ్చేమట్టుకు ఈ బాహ్మణునకు ఇవ్వదలచినవరమును నిలిపియుంచవలసినదని సదస్యులు సలహాయిచ్చినట్టున్ను అందుమీదట తక్షకుడు ఎందుకురాలేదని రాజు అడిగినట్టున్ను ఈ యాగభయముచేత అతను స్వర్గమునకువెళ్ళి ఇంద్రునియొక్క శరణుగోరి అయన పైనవేసుకున్న ఉత్తరీయములో దూరి యున్నాడని సదస్యులు మొదలైనవారు చెప్పినట్టున్ను అప్పుడు తక్షకుణ్ణి ఇంద్రునిసమేతు ఈ కుండములోకి తీసుకొనివచ్చేలాగు ప్రయోగము చెయ్యవలసినదని రాజు ఉత్తర్వు ఇచ్చి నట్టున్ను ఆలాగున మంత్రము ప్రయోగించబడ్డమీదట తక్షకుడు ఇంద్రునిసమేతు ఆకాశవీధికి తీసుకుని రాబడ్డట్టున్ను అప్పుడు అయాగమును చూచి ఇంద్రుడు భయపడి తక్షకుణ్ణి వదిలిపెట్టి తిరిగీ స్వర్గమునకు వెళ్ళినట్టున్ను తక్షకుడు దుఃఖిస్తూ సుడిగాలోపడ్డ అగ్నివలె గిరగిరతిరుగుతూ ఆ గుండముయొక్క సమీపమునకు వస్తువుండగా ఆస్తికుడు కోరినవరము ఇకను మీరు ఇవ్వవచ్చునని రాజుతో సదస్యులు చెప్పినట్టున్ను అందుమీదట రాజు ఆస్తికునితో మీరు ఏమికావలెనో కోరితే అది ఇస్తానని అన్నందున ఈ యాగము మాన్పి నిల్చియున్న సర్పకులమును రక్షించవలసినదని ఆస్తికుడు వేడుకున్నట్టున్ను అందుకు రాజు ఒప్పుకుని ఆప్రకారము జరిగించినట్టున్ను గ్రంధములయందు చెప్పబడియున్నది.

౧౦ – పరిక్షిన్మహారాజు షికారుయుక్క అలియకచేతను క్షుత్పి్పాసలచేతను బాధితుడయ్యిన్ని వేటయందలి ఆసక్తిచేత మృగమును తరుముతూ వచ్చినవాడైనందుననున్ను తాను జపనిష్ఠయందున్నట్టు కనిపెట్టలేక ఆయన తననుఅడిగినమాటలు వినిన్ని తాను ఉత్తరము ఇవ్వలేదని ఎంచుకుని యొకచచ్చినపామును తనమీద వేసిపోయినాడు గనుక ఇది పొరబాటువల్ల వచ్చిన స్వల్పమైన తప్పితమనిన్ని అందుకు తాను సహించేయున్నాననిన్ని నా అభిప్రాయమును కనుక్కోకుండా ప్రజలకందరికీ ప్రియకరుడైనరాజును చచ్చేటట్టు నీవుశపించినావు ఇది కూడనిపనిఅనిన్ని శాపముమళ్ళించవలసినదనిన్ని తండ్రిఐన శమీకుడు అజ్ఞఇచ్చి నప్పటికిన్ని శాపము ఇవ్వడమునకున్ను మళ్ళించడమునకున్ను పైన వివరించబడిన ప్రకారము బ్రాహ్మణునకు న్యాయము కలిగియున్నప్పటికిన్ని తనశాపము అదివరకే తక్షకుణ్ణి ప్రేరణచేసిఉండుననిన్ని అది అమోఘమనిన్ని దాన్ని తప్పించడము లేదనిన్ని మళ్ళబాటు చేసిన కుమారుడైనశృంగి తామసుడున్ను దుడుకుమనిషిన్ని తండ్రియొక్క ఆభిప్రాయము కనుక్కోకుండా అందుకు విరోధమైన కార్యము చేసినవాడున్ను తండ్రియొక్క న్యాయమైన ఆజ్ఞను తిరస్కరించినవాడున్ను ఐనట్టు స్పష్టముగా తేటపడుతున్నది, ఇటువంటి మనిషియొక్క తిట్టు అమోఘమని ఏలాగున ఎంచను – ఎవరిమీద కోపమువస్తే వారిని చచ్చేలాగు తిట్టేసామర్థ్యము ఆయనకు వాస్తవముగా ఉండినట్టుఐతే పరిక్షిన్మహారాజును అప్పుడే చచ్చేటట్టు ఏల తిట్టరాదు – ఈ భూమియందు అనేక సర్పములు ఉండగా నాగలోక నివాసుడున్ను అదిసర్పమున్నుఐన తక్షకుడే ఆ రాజునుకరిచి చంపేలాగు తిట్టడమునకు ఏమిసబబుఉన్నది వారముదినములు వ్యవధిఉండడమునకు ఏమి హేతువుఉన్నది ఏమిపద్ధతిచేత ఈ శృంగియొక్క ఆజ్ఞను శిరసావహించడమునకు నాగలోకవాసులకు ఏమిబాధ్యత కలిగియున్నది గురుపత్నియొక్క ఆజ్ఞాబద్ధుడై నడుచుతున్న ఉదంకుడు నాగలోకమునకు వెళ్ళి అనేకవిధములుగా ప్రార్థిస్తే నాగలోకవాసులు ఎవరున్ను్ ప్రత్యక్షము కాకపోయినట్టు చెప్పబడియుండగా గుర్వాజ్ఞానిరసనుడైన శృంగియొక్క తిట్టును నెరవేర్చడమునకు తక్షకుడు ఏలాగున లోపర్చబడుతాడు, శృంగియొక్క తిట్టు ఆమోఘమని తెలిసిన పక్షమందు దాన్ని తప్పించుకునే ప్రయత్నము చెయ్యవలసినదని పరిక్షిన్మహారాజు ఒద్దకి శమీకుడు వర్తమానము పంపించడమునకు ఏమిహేతువు ఉన్నది – ఆ శాపప్రకారము రాజును కరవగలందులకు వస్తూఉన్న తక్షకుడు రాజుయొద్దకు వచ్చి రాజును కరిచి వెళ్ళవలసినపనికి రాజును తిరిగి బ్రతికించేనిమిత్తము వస్తూ మార్గమధ్యమందు కనుపడ్డ బ్రాహ్మణునియొక్క మంత్రవిద్యను పరిశీలించడమునకున్ను ఆ బ్రాహ్మణుడు రాజుయొద్దకు రాకుండా ఆయనకు లంచమిచ్చి ఆయనను తిరిగీ పంపించివెయ్యడమునకున్ను తక్షకునకు ఏమికార్యము వచ్చినది అదృశ్యుడై వ్యవహరించే సామర్థ్యముగల తక్షకుడు ఎవరికీ కనుపడకుండా రాజుయొద్దకు చేరడమునకు బదులుగా తనబంధువులను కొందరిని కృత్రిమపు బ్రాహ్మణులనుగా ఏర్పరచి వారిచేత ఫలములు పుష్పములు రాజుయొద్దకు పంపించేయెడల ఆ ఫలములలో రాజు పుచ్చుకోబొయ్యే ఫలమందు సూక్ష్మరూపముగా తాను ప్రవేశించి దాగిఉండడమునకు ఏమికారణము – ప్రబలమునున్న మర్రిచెట్టుయొక్క మొదలును పాముకరచినంత మాత్రముచేతను అందుమీదఉన్న పక్షులకున్ను బ్రాహ్మణునకున్ను తప్పించుకోవడమునకు అవకాశము లేకుండా ఆ చెట్టు సదరు ప్రాణులసమేతు భస్మమైనట్టు ఏలాగున నమ్మను ఒకవేళ అది తక్షకునియొక్క విషప్రభావమనే పక్షమందు అందుమీద పక్షులు మొదలైన ప్రాణులు ఉన్నట్టు తక్షకునికి తెలియకుoడా నుంటుందని ఎంచేవల్లలేదు గనక ఇన్ని ప్రాణులకు నిర్నిమిత్తముగా తక్షకుడు హానిచెయ్యడమునకు తలుచుకుంటాడనడమునకు న్యాయము లేదు ఇంతేకాదు వృక్షము యొక్కబ్రాహ్మణుడు మంత్రించినంత మాత్రముచేత తిరిగీ యథాస్థితిగా వృక్షము వగైరాలు ఐనట్టు చెప్పడము మరీ వింతఐనపనిగా ఉన్నది బతికియున్న సదరు వృక్షమున్ను అందుమీదఉన్న బ్రాహ్మణునిన్ని పక్షులుమొదలైనవాటినిన్ని తృటిమాత్రములో భస్మముచేసిన తక్షకవిషము పరిక్షిన్మహారాజుతో ఆయన నివసించియున్న నీరసమైన ఒంటిస్తంభముమేడను భస్మము చేసేయెడల ఆమేడమీదనున్న తతిమ్మావారిని అందరినీ ఏల భస్మము చెయ్యలేకపోయెను వారు తప్పించుకునిపోవడమునకు అవకాశము ఏలాగున కలిగెను మంత్రసిద్ధిగలిగి ఆయన సంరక్షణార్థమే ఆయనతోకూడా ఉన్నట్టు చెప్పబడ్డ మహాత్ములు ఏలాగునపోయిరి మంత్రములయందు ప్రభావమున్నమాట నిజమయినట్టయితే వారిమంత్రములు తక్షకునివిషమును ఏలనివారించలేకపోయినవి తక్షకుని విషము వారి మంత్రములకు లోబడేది కాని పక్షమందు రాజును కరువవచ్చే్వాడు తక్షకుడేఐనట్టు ముందు తెలిసియుండగానున్ను రాజసంరక్షణ చేస్తామని వారు సదరు ఒంటిస్తంభము మేడమీదికి ఏలపోగైరి పరిక్షిన్మహారాజు మాతృగర్భస్థుడై యున్నయెడలనే విష్ణుమూర్తి అనుగ్రహము విశేషముగాగల పిండమయినట్టున్ను అశ్వద్ధామ క్రోధముచేత అపాండవమౌగాక యని శపించి దివ్యాస్త్రప్రయోగము చేసినప్పుడు వాటిచేత ఆ రాజు చావకపోయినట్టున్ను కలియుగము ప్రవేశించినమీదట ఆయన వ్యవహారదక్షుడై ఈ యుగదేవతయైన కలిని నివారించి తన ప్రభుత్వములో కలియొక్క ప్రవర్తన లేకుండా ఆజ్ఞ చేసినట్టున్ను చెప్పబడుతూనుండగా ఇటువంటి మహారాజు సదరు శృంగి తిట్టి్నంతమాత్రముచేతనున్ను తక్షకుడు కరచినంతమాత్రముచేతనున్ను కడతేరినాడని ఏలాగున నమ్మను – పౌష్యమహాదేవి పతివ్రత యైనప్పటికిన్ని ఆమెఉన్న స్థలమునకు వెళ్ళిన మనుష్యులకు ఆమె కనుపడకుండా ఏలాగుఉంటుంది కామరూపశక్తిగాని అదృశ్యమయ్యే సామర్థ్యముగాని మనుష్యులకు ఉంటుందని చెప్పే వల్లలేదు ఉదంకుడు భక్షించిన గోమయము వాస్తవముగా అమృతమైయుండినట్టయితే అమృతము పవిత్రముచేసే వస్తువుఐయుండగా అది భక్షించిన మనిషి అశుచిఅని యెట్లా చెప్పబడుతాడు, నాగలోకవాసులైన సర్పశ్రేష్ఠులకు శిరస్సులయందు విశేషరత్నములు ఉంటవని వాడిక కలిగియున్నది పాయా – దాయా – సఖేద – క్షుభిద – ఫణి – ఫణా – రత్న – నిర్యత్న – నిర్యదిత్యాది విశేషప్రసిద్ధిన్ని కలిగియున్నది, ఈలాగున నుండగా దివ్యసర్పమైన తక్షకుడు ఒకరాజు సామాన్యుడైన పౌష్యునిరాణియొక్క కుండలములను ఏమి హేతువుచేత పసందు చెయ్యవలసివచ్చెను అటువంటి కుండలములేగాని అంతకంటే విశేషకుండలములేగాని తక్షకుడు ఏల నిర్మించలేకపాయెను – సదరు కుండలములు దొంగలించుకొని పొయ్యేఅంతకార్యము అతను ఏల జరిగించవలసివచ్చెను – ఒక పామును గురించిన విరోధము తీర్చుకునేకొరకు చెయ్యబడ్డ యాగమందు మనుష్యులవల్ల ప్రయోగించబడ్డ మంత్రములువెళ్ళి లోకాంతరములయందుండే టటువంటిన్ని మహాకాయములు గలిగినటువంటిన్ని దివ్యసర్పములను నిమిషమాత్రములో తీసుకునివచ్చి సదరు యాగకుండములో వేస్తూ వచ్చినట్టు ఈకథయందు చెప్పబడియున్నిది కాని ఆ మంత్రములు ఏమేమి సదుపాయములచేత ఏయేతరహాను అటువంటి మహాసర్పములను తెచ్చి ఆ కుండములో పడవేస్తూ వచ్చినవో ఆ వైనము ఏమిన్ని కనుపర్చబడి యుండలేదు, మంత్రములు ఈ లాగున జరిగించినవని చెప్పడము మాత్రముచేతనే ఆమాట నమ్మవలసివచ్చే పక్షమందు మంత్రజ్ఞుడు ఫరమాయిస్తే ఒకదిక్కుననుండే మహాపర్వతములను మరిఒకదిక్కుననున్ను ఒకదిక్కుననుండే సముద్రమును మరిఒకదిక్కుననున్ను తృటిమాత్రములో ఆమంత్రములు తీసుకునివచ్చి యుంచుతవనికూడా చెప్పవచ్చును, ఐతే మంత్రమువల్ల ఇటువంటి కార్యములు కావడము లోకస్వభావమునకు విరుద్ధముగనుక సదరుసంగతి నమ్మడమునకు అవకాశము లేకుండానున్నది, జనమేజయునికి తక్షకునియందు విరోధము ఉన్నప్పటికిన్ని నిరపరాధులైనటువంటిన్ని నాగలోక నివాసులైనటువంటిన్ని సర్పశేష్ఠులనున్ను ఇతరసర్పములనున్ను హింసించడమునకు ఏమి న్యాయమున్నది సదరు యాగములో నారదాదిమహర్షులు సదస్యులుగా నుండినట్టు చెప్పబడ్డది ఈ యాగము పగతీర్చుకునే నిమిత్తము చెయ్యబడేది గనుక దీనియందు పుణ్యఫలమేమిన్ని సంభవిస్తుందని అనడమునకు వల్లలేదు జనమేజయునకున్ను ఉదంకునకున్ను తప్ప ఈయాగములో కూడినట్టు చెప్పబడ్డవారి కెవరికిన్ని తక్షకునియందు విరోధము ఉన్నట్టుకనుపడలేదు నారదాదులు దేవర్షులని చెప్పబడుతున్నందున రాజుయొక్క ఈవినివారు కోరవలసినపని లేదు గనుక వారు సదరు యాగమునకు వచ్చి ఉందురని తోచదు ఒకవేళ రాజుయందు దయకలిగి అక్కడికివచ్చినారని ఊహించినా వారు ఆ యాగములో ఇలాకాపుచ్చుకున్నారని నమ్మడమునకు హేతువులు ఏమిన్ని కనుపడ లేదు సదరు యాగకుండములో మహాసర్పములు అనేకముగా వ్యవధిలేకుండా పడుతూ కాలుతూ ఉండినట్టు చెప్పబడ్డది ఆలాగు నుండినపక్షమందు వాటి శరీరములు కాలాతూ ఉన్నయెడల సంభవించతగిన దుర్గంధము మిక్కిలి ప్రబలమైనదినిన్ని బహుదూరము వ్యాపించవలసినదిన్ని ఐయుంటుంది ఇది యెంతదూరము వ్యాపిస్తుందో అంతకులోగానుండే వారెవరున్ను దాన్ని సహించడమునకు సాధ్యముగానుండదు ఈలాగునుండగా ఆయాగమందు కూడియున్నవారు ఆదుర్గంధమును సహించడమునకు శక్తులైనారని ఏలాగున నమ్మను మరిన్ని ఆ కుండములో నాలుగేసి యోజనములమట్టుకు స్థూలములైనటువంటిన్ని పర్వతశిఖరములవలె ఉన్నతములైనటువంటిన్ని శరీరములుగల సర్పములు కోట్లతరబడి యెడతెగకుండా పడుతూఉండినపక్షమందు అటువంటి ప్రతిసర్పమున్ను ౫0,౬0 యోజనములమట్టుకు నిడివిగలదై యుంటుందిగనుక ఇటువంటి అనేక సర్పములు ఆకుండములో హుతమైనమాట వాస్తవమైతే అకుండము మిక్కిలీలోతున్ను చాలాయోజనముల పొడుగున్ను వెడల్పున్ను గలదిగా నుండవలెను ఇటువంటి కుండమును ఏర్పరచడమునకు ఆరాజు కిందనుండిన భూమియావత్తు చాలుతుందని తోచదు అట్లా చాలునేమోనని ఎంచినా ఆరాజు తాలూక్ భూమి అంతా పర్వతములు నదులు మొదలైనవి లేకుండా కుండము తవ్వడమునకే లాయఖైనభూమి నుండనేరదు ఆరాజు కిందనున్న భూమిఅంతా యాగకుండమునకే సరిపోతే యాగమునకు అవశ్యకనిమిత్తములన్నీ నెరవేర్చడమునకు రాజు యేలాగున సమర్థుడు యాగకుండమే ఇంతగొప్పదిగానుంటే యాగకార్యములు నెరవేర్చేవారు ఎందరు ఉండవలెను వీరిలో కుండమునకు ఆయా దిక్కులనుండే వారికి ఒకరి సమాచారము ఒకరికి ఏలాగున తెలుస్తుంది పైన చెప్పబడ్డ మహాసర్ప స్వరూపములైన హవిస్సులను హుతము చెయ్యడమునకు తగిన ఆజ్యము ఆ రాజు ఎక్కడ సంపాదించకలిగెను అంత ఆజ్యము సంపాదించడమునకు ఆ రాజుయొక్క దౌలతంతా చాలినట్టు కనుపడుతున్నది ఆ రాజు ఏలాగునైనా అంత ఆజ్యము సంపాదించగలిగినాడని ఎంచినా ఆధ్వర్యుడు ఆ నెయ్యిఅంతా ఏలాగున వేల్చినాడని ఎంచను అంత ప్రబలహవిస్సులు హుతమయ్యేటట్టు ఆజ్యాహుతులు ఇవ్వడమునకు వల్ల ఏలాగునచిక్కెను ఐతే ఇటువంటి సంగతులలో ఆజ్యాహుతులు చాలామంది వెయ్యవచ్చునని చెప్పినా వారైనా సదరు కుండముయొక్క అంచులనే ఆజ్యమువిడిచి పెట్టవలెగాని కుండమంతటానున్ను హవిస్సులమీద పడేటట్టు ఆజ్యము వెయ్యడమునకు ఏలాగున సమర్థులౌతారు విశేషించి ఇంత గొప్పకుండము సంపూర్ణముగా ప్రజ్వరిల్లే యెడల అందులకాకకు చుట్టూ చాలా దూరములోగా ఎవరున్ను నిలిచేవల్ల లేనట్టు కనబడుతున్నది, ఇందువల్ల ఆ కుండము అంచుననుండిఐనా ఎవరున్ను ఏ కార్యమున్ను జరిగించినట్టు నమ్మడమునకు వల్లకనుపడలేదు, జనమేజయుడు మనుష్యలోకములో నొకదేశమునకు రాజై యుండెను ఆ యాగమందు మంత్రములు ప్రయోగించిన బ్రాహ్మణుడు మనుష్యులలో నొకడై యుండెను మనుషులుచేసే యజ్ఞములు మొదలైనవి దేవతలయొక్క ప్రీతికొరకే చెయ్యబడుతూ ఉన్నవి వాటియొక్క ఫలప్రదేశము స్వర్గమేనని చెప్పబడుతున్నది దేవతలు వ్యవహరించే స్థలము స్వర్గమేఐయున్నది, దేవతలకందరికి దేవేంద్రుడు ప్రభువై యున్నాడు, ఈలాగుననుండగా ఒక మనుష్యమాత్రుడు ఇహలోకములో పగతీర్చుకునే నిమిత్తము చేసిన యాగములో ప్రయోగించబడ్డ మంత్రమువెళ్ళి స్వర్గమునకంతటికి సర్వాధికారియైన దేవేంద్రుణ్ణి తక్షకునికూడా ఆకాశవీధికి తీసుకవచ్చినట్టు చెప్పడమున్ను దేవేంద్రుడు ఆ యాగస్థితిచూచి భయపడి తక్షకుణ్ణి వదలిపెట్టి తిరిగీ వెళ్ళినాడని అనడమున్ను పైనచెప్పబడ్డ అన్నిసంగతులకంటె మిక్కిలీ విరుద్ధమైనవిగా నున్నవి మంత్రసామర్థ్యముచేతను దేవేంద్రుడు ఆకాశవీధికి తక్షకునితోకూడా తీసుకరాబడ్డట్టయితే మంత్రమును ప్రయోగించినవారి అనుమతిలేనిది తక్షకుణ్ణి వదిలిపెట్టి దేవేంద్రుడు తిరిగీ వెళ్ళడమునకు ఏలాగున సమర్థుడయ్యెను, తక్షకుణ్ణి వదిలిపెట్టిన పక్షమందు ఆయన రాకపోవడమునకు సదుపాయము ఉండినట్టయితే తనకు అవుమానము లేకుండా స్వర్గములోనుండే ఇంద్రుడు తక్షకుణ్ణి ఏల వదిలిపెట్టరాదు తక్షకునకు సదరు హోమకుండములోపడి భస్మము కావలసినటువంటి ఆపదవచ్చిన పక్షమందు ఇంత చాలనిప్రభువైన దేవేంద్రుని శరణు జొరకపోతే తన అన్నఐన వాసుకి కైలాసవాసులైన శ్రీ మత్సాంబమూర్తివారికి భూషణమై ఆయనయొక్క సంపూర్ణమైన అనుగ్రహమును పొందియుండగా అక్కడికివెళ్ళి వారిశరణు ఏలచొరరాదు, తనపెద్దఅన్నఐన శేషుడు పరమపదవాసులైన శ్రీమన్నారాయణమూర్తివారికి పర్యంకమై వారి సంపూర్ణమైన ప్రేమను పొందియుండగా అక్కడికివెళ్ళి వారిశరణు ఏలచొరరాదు, సర్పయాగము చెయ్యడమువల్ల ఇటువంటి కార్యము సాధ్యమయ్యే పక్షమందు తక్షకునివల్ల వచ్చే ఉపద్రవమును తప్పించుకోవలసినదని శమీకుడు పరిక్షిన్మహారాజుకు వర్తమానము పంపించినప్పుడు ఆయన తక్షణమే సర్పయాగము మొదలుగా ముందుగా ఆ తక్షకుడే ఆ హోమకుండములో పడి భస్మమై పొయ్యేలాగు ఏల చెయ్యరాదు, కాబట్టి పరిక్షిన్మహారాజు పాముశవమును శమీకుని కంఠమందు ఉంచి వెళ్ళినట్టు విన్నప్పుడు ఆ రాజు పాము కరిచి చావవలెనని కోపముచేత శృంగి తిట్టి యుండును కాలవశముచేత లోకసాధారణమైన ఏ నెపముమీదనైనా కాకతాళన్యాయముగా పరిక్షిన్మహారాజు కాలముచేసి యుండును గాని శృంగియొక్క తిట్టువల్ల సదరు విరుద్ధసంగతులు జరిగినట్టు ఎంచేవల్ల లేదు.

౧౧ – ఈప్రశంసయందు కనుపర్చడమునకు ఉద్దేశించబడ్డ నీతియుక్తులయొక్క వివరము – వేట సప్తవ్యసనములలోది ఐనందున బుద్ధిని పొరబెట్టేస్వభావము దానికి కలిగియుంటుందనిన్ని షికారుయొక్క వ్యసనమును పురుషుడు హద్దుపరచి యుంచవలెననిన్ని ప్రభువులైనవారు నేరము పరిష్కారముగా కనుక్కోనిదీ పెద్దమనుష్యులైన వారిని అవమానించడము న్యాయము కాదనిన్ని అట్లా విమర్శించక పెద్దమనుష్యులను అవమానించిన పక్షమందు అది నిందకు కారణమౌతుందనిన్ని సంస్థానికులైన వారి విషయమై ప్రయత్నపూర్వకముగా చేసిన అపకారము అట్లాచేసినవారికి కాలాంతరమందైనా అవమానమును కలుగచేస్తుందనిన్ని తండ్రికిచ్చిన అపకీర్తి కప్పబడే కార్యములను కుమారుడు జరిగించవలసినది న్యాయమనిన్ని యొకానొక సంగతిలో జాతముందు ఒకడు చేసిన తప్పితముయొక్క ఫలము జాతము వారందరూ పోవలసి వచ్చేది కద్దనిన్ని ఎంతగొప్పవారైనా నేరము చేసినవానికి ఆసరా చేసిన పక్షమందు అట్లా ఆసరాచేసినవారికిన్ని అవమానము వస్తుందనిన్ని తెలియచెయ్యడమునకు సదరు కథ కూర్చబడి యున్నది.

హితసూచని
పరోక్షాది జ్ఞానప్రమేయము

పరోక్షమందు జరిగేటటువంటిన్ని ప్రత్యక్షమందు జరగబొయ్యేటటువంటిన్ని సంగతులనున్ను ఎవరెవరి మనస్సులయందుండే అభిప్రాయములున్ను కనిపెట్టేజ్ఞానమున్ను ఈశ్వరవిషయిక జ్ఞానమున్ను పరోక్షాదిజ్ఞానమని చెప్పబడుచున్నది.

పూర్వభాగము

౧ – మనుష్యులలో కొందరు దివ్యదృష్టిచేత సదరు సంగతులున్ను అభిప్రాయములనున్ను కనిపెడుతున్నట్టు కొందరు నమ్ముతున్నారు దివ్యదృష్టి అనగా దైవసంబంధమైన దృష్టి అనిపించుకునుచున్నది ఈ దృష్టిచేత సదా సమస్తసంగతులను కనిపెట్టడము సర్వజ్ఞుడైన యేలినవానికి మాత్రమే సహజమయియున్నది ఏలినవానిచేత ఏయే నిమిత్తములనుగురించి యేర్పరచబడ్డ దేవతలకు ఆయా నిమిత్తములకు తగుమాత్రము దివ్యసామర్థ్యము ఆయన కలుగజేసియుండునని నమ్మవచ్చునుగాని దివ్యదృష్టిచేత కనిపెట్టవలసిన నిమిత్తముగల అధికారమేదిన్నీ మనుష్యునకు ఇవ్వబడియుండలేదు కనుక మనుష్యులలో కొందరికి ఏలినవాడు దివ్యదృష్టి కలుగచేస్తారని నమ్మడమునకు తగినసబబులు ఏమీ కనుపడలేదు, దివ్యదృష్టిగలమనుష్యులు పూర్వయుగములయందు తరుచుగా నుండేవారనిన్ని ఇప్పుడు అరుదుగా నున్నారనిన్ని కొందరు చెప్పుతున్నారు అట్లా దివ్యదృష్టి కొందరికి కలిగియుండినట్టు కొన్నిగ్రంధములయందు చెప్పబడి యుండడమేగాని అటువంటిదృష్టిగల మనుష్యులు ఎక్కడా ఉన్నట్టు కనుపడడములేదు – అటువంటివారిని కనుపరుస్తామనేవారున్ను ఎక్కడా లేకుండానున్నారు గనుక మనుష్యబుద్ధిచేత తెలియతగనికార్యములను దానిచేత తెలియబడినట్టుగాని తెలియబడుతున్నట్టుగాని నమ్మవలసినపనిలేదు.

౨ – ఒకానొకరు ఒకానొక దేవతోపాసనచేత తదనుగ్రహమునుపొంది అందువల్ల సదరు సంగతులనున్ను అభిప్రాయములనున్ను గ్రహిస్తున్నారని కొందరు నమ్ముతున్నారు ఏమనిషికైనా సదరు సంగతులను అభిప్రాయములను కనిపెట్టతగినట్టు దేవతానుగ్రహము కలిగేపక్షమందు ఆయన మనుష్యకోటిలో మిక్కిలీ ఉత్కృష్టుడని చెప్పవచ్చు కాని ఏదేవతయైనా మనిషికి ప్రత్యక్షము కావడముగాని యేసంగతియైనా తెలియచెయ్యడముగాని మనుష్యబుద్ధిచేత తెలియతగనిసంగతులను తెలుసుకునే సామర్థ్యము కలుగచెయ్యడముగాని లోకపద్ధతికి విరుద్ధమయియున్నది గనుక దేవతోపాసనచేత సదరు సంగతులను అభిప్రాయములను ఏమనిషియైనా కనిపెడుతున్నట్టు ఎంచడమునకు సబబు లేదు లోకములో దేవతోపాసకులుగా చాలామంది వాడిక చెయ్యబడుతున్నారు గాని వారియందెవరున్ను అటువంటి సత్త తమకు కలిగియున్నట్టు తెలియతగిన దాఖలా ఏమిన్ని కనుపర్చచాలకుండానున్నారు, లోకులు కొందరు తమవారియొక్క వ్యాధిగ్రస్తమయిన స్థితి ఏదేవతనైనా దేవతలనైనా పూజించడమునకు బద్ధులైయున్న ప్రకారము తాము జరిగించక యుపేక్షచేసినందునగాని లేక చనిపోయిన ఏమనిషినైనా ఆదరణగా నుండేలాగున్ను జ్ఞాపకార్థముగానున్ను జరిగించవలసిన కార్యములు తాము జరిగించక పోయినందునగాని చనిపోయిన మనుష్యులు దయ్యములుగానైనా రక్షస్సులుగానైనా లేక వీరులుగానైనా చిన్నపిల్లలుగానుండి చనిపోయినవారు వీరులౌతారని యొకవాడిక కలదు, తమవారిని పూనడముచేతగాని లేక ఎవరైనా తమకు విరోధులై యుండేవారు మంత్రప్రయోగములు చెయ్యడమువల్లగాని లేక తమవారు జడుసుకున్నందునగాని సంభవించినదిగా ఎంచుకోవడముకలదు, ఇటువంటి సంగతులు వాస్తవముగా సంభవించుచున్నవి యెంచుకునేనటువంటిన్ని వీటి ప్రశంస జరిగించడముతోటే యొడలు పెరిగేటటువంటిన్ని మనిషి తత్తదావేశము తనకు కలిగినట్టు అభినయించి ఆ అశక్త స్థితినిగురించి తోచినకారణమును తెలియచెయ్యడమున్ను కలదు అందుమీద ఆ గృహమందు ముఖ్యులుగా నుండేవారుగాని లేక సదరు అశక్తస్థితిలోనున్న మనిషికి మిక్కిలీ సన్నిహితులుగా నుండేవారుగాని ఆ మాటలు నమ్మి ఆ యా దేవతలనుగూర్చియయినా చనిపోయిన మనిషినిగూర్చిఐనా నమస్కరించి ఉపేక్షచెయ్యబడ్డ పూజయైనా ఆదరణకున్ను జ్ఞాపకమునకున్ను జురూరైనకార్యమయినా జరిగిస్తానని ఖరారుచెయ్యడమున్ను ముడుపులు కట్టుకోవడమున్ను లేక మాంత్రికులమని పేరుబెట్టుకున్న వారినిగాని భూతవైద్యులమని పేరుబెట్టుకున్న వారినిగాని రప్పించి వారిచేత జపమయినా భూతవైద్యమయినా చేయించడమున్ను కలదు అశక్తస్థితి యొకానొకప్పుడు హెచ్చడమున్ను ఒకానొకప్పుడు తగ్గిపోవడమున్ను సహజమేగనుక తరువాత వెంటనే ఆ అశక్తము తగ్గిపోయినపక్షమందు తాము జరిగించిన కార్యమువల్ల గుణమిచ్చినట్టు ఎంచుకోవడమున్ను అశక్తము అధికమయినపక్షమందు సదరు ఆవేశము కలిగినట్టుగా చెప్పబడ్డ సంగతి నిశ్చయముకాదనిఎంచి పైనచెప్పబడ్డ ఉపాసకులయొద్దకివెళ్ళి వారిద్వారా దర్యాప్తుచేస్తే వాస్తవము తేటపడుతుందని భ్రమపడేదిన్ని కలదు, ఇటివంటి భ్రమను సామాన్యులు పొందడమేకాకుండా పండితులని చెప్పబడేవారు కొందరున్ను సామాన్యులతో సమానముగానే పొందుతున్నారు, ఈచొప్పున భ్రమపడేవారు తమవారికి కలిగియున్నదనే ఆపదయొక్క కారణమును ఏయేదేవతోపాసకులవల్ల తెలుసుకునేకొరకు దక్షిణలు వగైరాలు తీసుకుని దూరగ్రామములకైనా వెళ్ళి వారినికనుక్కుని మర్యాదచేసి ఇవివారికిఇచ్చి యొకానొక సంగతినిగురించి వారి దేవతయొక్క అభిప్రాయమును తెలియవలసి తాము వచ్చినామని వారికి తెలియచెయ్యడమున్ను కలదు, ఆ ఉపాసనాపరులు దేవతా ప్రార్థన చేస్తున్నామనే నెపముమీద కొంతసేపు కాలముజరుపుతూ నుండడమున్ను ప్రశ్న అడగడమునకు వచ్చినవారికి సంభవించియున్న తొందరలనున్ను వారి వృత్తాంతములనున్ను వారి తాలూక్ మనుష్యులగుండా సదరు ఉపాసకుల తాలూక్ కొందరు మనుష్యులు దర్యాప్తుచేసి పూజయందున్న మనిషికి ఆ సంగతులు తెలియచెయ్యడమున్ను ఆ మనిషి ఆవేశముకలిగినట్టుగా అభినయిస్తూ కొన్నికొన్ని ప్రమేయములు కొద్దికొద్దిగా ఒకటివిడిచి యొకటి పలుకుతూ ప్రశ్నఅడిగేనిమిత్తము తనయెదుటకూర్చున్న మనుష్యులయొక్క ముఖవైఖరి మొదలైన వాటివల్ల తన వృత్తికి సాధారణమైన ప్రజ్ఞచేత కొన్ని సంగతులు కనిపెడుతూ తనయిలాకామనుష్యులు తెలియచేసే అభిప్రాయమును తెలుసుకుంటూ చాలాసేపటికి ఒక ఊహచేసి అందులోకొంత వచించి అందుమీద ప్రశ్నఅడిగిన మనుష్యులు అది వాస్తవముగా ఎంచుకునేదిన్ని లేనిదిన్ని కనిపెడుతూ ఆ మనుష్యులు ఒప్పుకున్నట్టు కనుపడేసంగతిని రూఢీచేసి ఫలాని నిమిత్తముకలిగి అందుల కారణము తెలియవలసి మీరు వచ్చినారనిన్ని ఫలాని విధముగా సదరు ఆపదవచ్చినదనిన్ని ఫలాని విధముగా అందుల పరిహారము చేసుకోవలసినదనిన్ని చెప్పడముకలదు, ఒకానొకదేవత అనుగ్రహమువల్ల ఆ మాటలు సదరు మనిషి గ్రహించి తమకుచెప్పినట్టు ఆ ప్రశ్న అడుగబోయిన మనుష్యులు నమ్మి ఇంటికివెళ్ళి అందుకు అనుగుణములైన కార్యములు జరిగించడమున్ను కలదు అప్పట్లో సదరు అశక్త స్థితి కొంచము నిమ్మళముగానుంటే తమప్రయత్నమువల్ల గుణమిచ్చినట్టు ఎంచుకోవడమున్ను అశక్తము అధికముగా నుంటే దేవతోపాసనచేసే మరియొక మనిషియొద్దకువెళ్ళి ప్రశ్న అడుగడమున్ను అప్పట్లో తెలియవచ్చిన సంగతులను అనుసరించి కొన్ని ప్రయత్నములు చెయ్యడమున్నుకలదు సదరు భ్రమలచేత చికిత్సచేయించడము బహుశః ఉపేక్షచెయ్యడమున్ను అందువల్ల ఒకానొక సంగతిలో అశక్తము ప్రబలించి ఆ అశక్తులు లోకాంతరగతులు కావడమున్ను తటస్థమౌచున్నది, ప్రశ్న అడుగబొయ్యేమనుష్యులు తమవారికి వాస్తవముగా సంభవించియున్న అశక్తములను కనిపెట్టక సంభవించతగని సంగతులు సంభవించినట్టు ఎంచుకుని లోకమందు తెలియతగనిసంగతులు ఉపాసకులవల్ల తెలుస్తవని భ్రమపడి తెలివిమాలియున్నవారై నందుననున్ను ఉపాసకులు చాలా విమర్శమీద ఊహించిచెప్పే జవాబులలో ఒకానొకటి ప్రశ్న అడుగబోయినవారి అభిప్రాయమునకు అనుగుణముగానుంటే ఆ యుపాసకులు విశేషమైన యోగ్యతగలవారైనట్టు ప్రశ్నఅడుగబోయినవారు ఎంచుకుని వారు అట్లా యోగ్యత గలవారైనట్టు ప్రకటన చెయ్యడమున్ను కలదు చాలాసంగతులలో దేవతోపాసకులవల్ల తమ అభిప్రాయానుసారముగా జవాబు కాకపోయినప్పటికిన్ని తమకు సంభవించిన అంకిని ఆ దేవతాప్రార్థనలోకి వచ్చినది కాదని అనుకోవడమున్ను కలదు గాని వాస్తవమైనసంగతి వారు కనిపెట్టడము లేకపోతూనేయున్నది, దూరదేశస్థుడైయున్న తమవానిసమాచారము తెలియకపోయినందున గురించిన్ని సదరు ఉపాసనాపరులఒద్దికి కొందరువెళ్ళి ప్రశ్న అడుగడమున్ను ఆ మనిషి యింకా జీవించియున్నాడనిన్ని కొన్నిరోజులలో వస్తాడనిన్ని వారు ఉత్తరము చెప్పడమున్ను ప్రశ్నఅడిగినవారు ఆమాట నమ్మియుండగా ఇంకా బ్రతికియున్నట్టు చెప్పబడ్డమనిషి అదివరకే చనిపోయినట్టు సమాచారపత్రిక రావడమున్ను కలదు ఒకానొకమనిషి బ్రతికియున్నప్పటికిన్ని అతను చనిపోయినాడని సదరు ఆవేశములో చెప్పడమున్ను కలదు – విశేషించిన్ని తమవారిలో నొకడు దూరదేశస్థుడైన మీదట అతని సమాచారము తెలియకుండానుండిన్ని ఇంటియొద్ద నున్నవారిలో నెవరికైనా ఏదైనా ఆపదకలిగియుండిన్ని ప్రశ్న అడుగబోయినసంగతిలో దూరదేశస్థుడైయున్న సదరుమనిషి చాలా దినముల కిందటనే చనిపోయినాడనిన్ని యింటియొద్ద బాధకలిగి యున్న మనిషిని అతను పూనియున్నాడనిన్ని సదరు ఉపాసకులు చెప్పడమున్ను అందు ప్రశ్నలు అడిగినవారు ఆమాటలు నమ్మియుండగా అదివరకే చనిపోయినట్టు చెప్పబడ్డమనిషిగాని యింటియొద్ద బాధగలిగియున్నమనిషిని ఆవహించియున్నాడని చెప్పబడ్డమనిషిగాని తిరిగీ యింటికి రావడమున్ను ఆ మనిషినిచూచి ఆ యింటివారేమి ఆ గ్రామస్థులు కొందరేమి అతను దయ్యమైవచ్చినాడని భయపడడమున్ను చాలా విమర్శమీద అతను వాస్తవముగా బ్రతికియున్నవాడేనని ఎంచుకోవడమున్ను కలదు ఒకానొకచోట అటువంటి మనిషి వచ్చినప్పుడు కొంచెముసేపుమాత్రము విభ్రాంతినిపొంది విమర్శమీద సులభముగానే అతనిసంబంధులు అతణ్ణి యింట్లోకి తీసుకునిపోవడమున్ను సంభవిస్తూ వచ్చినది, పశువులు మొదలైన వాటిని పోగొట్టుకున్నవారున్ను కొందరు సదరు ఉపాసకులలో ఒకానొకరియొద్దికి వెళ్ళుతున్నాను ఆ మనిషి వారు కోరిన కార్యములను చాలా దర్యాప్తు మీదఊహించి పశువులనిగాని గుర్రములనిగాని ఇతరజంతువులనిగాని మీరు పోగొట్టుకున్నారనిన్ని అవి ఫలానాదిక్కుకు దూరముగా తోలుకుని పోబడ్డవనిన్ని మీరు ఆదిక్కుకువెళ్ళితే అవి కనుపడుతవనిన్ని చెప్పడమున్ను ప్రశ్న అడిగినవారు భ్రమపడి ఆప్రకారము చాలాప్రయాసతో ఆ దిక్కుకుపోయి వెతకడమున్ను చివరకు అవి కనుపడక శ్రమయున్ను వ్యర్థప్రయత్నము కావడమున్ను తటస్థమౌతూవచ్చినది యింకా సొమ్ముగాని మరి యేవస్తువులైనాగాని పోగొట్టుకున్నవారున్ను సదరహీ ప్రకారమే ప్రశ్నఅడిగి ఉపాసనాపరులు చెప్పిన వరుసను అనుమానపు స్థలములనున్ను అనుమానపు మనుష్యులనున్ను పరిశీలించబోయి చాలాకల్తలుపడి తొందరలనుపొందుతూ రావడమే కాని అందువల్ల ఏమిన్ని కిఫాయతు లేకపోతూనే వచ్చినది, ఈలాగంటి సంగతులు కలుగుతున్నందుననున్ను ఇంకా అనేకములైన దాఖలాలచేతనున్ను దేవతోపాసకులమనేవారు చెప్పేసంగతులు వాస్తవములైనవి కావని తెలియదగి యున్నప్పటికిన్ని వారిని ప్రశ్న అడుగవలెననే భ్రమ చాలామందికి కలుగుతూనేయున్నది దేవతోపాసన చేసేవారికి వారు గ్రహించియుండని సంగతులున్ను ముందుజరగబొయ్యే సంగతులున్ను ఏలాగున తెలుస్తవి మరి ఏమనుష్యుడైనా వీటిని ఏలాగున కనిపెట్టగలడు ఇవి సర్వజ్ఞుడైన ఏలినవాడేతప్ప తదితరులెవరున్ను కనిపెట్టచాలరు.

౩ – విద్యలు చదువుకునేవారికి జ్యోతిశ్శాస్త్రముయొక్క సిద్ధాంతభాగము అభ్యసించడము జురూరేఐయున్నట్టు విద్యాప్రమేయములో సూచించేయున్నాను ఏయేమనిషినిగురించి యేయేనిమిత్తమును గురించిన్ని జరగబొయ్యే వైనములు జ్యోతిశ్శాస్త్రముయొక్క జాతకముహూర్తభాగములవల్లనున్ను సాముద్రికశాస్త్రము మొదలయిన వాటివల్లనున్ను కొందరు కనిపెడుతున్నారనిన్ని తత్సంబంధములైన గ్రంధములలో కొన్ని దివ్యదృష్టిగలవారు రచించియున్నారనిన్ని కొందరు నమ్ముతున్నారు దివ్యదృష్టి మనుష్యులకు కలుగడము అసంభవమైయున్న సంగతి మొదటి పేరాలో వివరించబడే యున్నది పూర్వుల అనుభవమునుపట్టి ఊహించి యేయేశాస్త్రముల నేర్పరచినారుగాని అవి దివ్యదృష్టిచేత నేర్పరచబడ్డవికావు కొన్ని గ్రంధములు దివ్యదృష్టిచేతనే యేర్పరచబడియున్న పక్షమందు ఆ సంగతిలోనే వాటి అభిప్రాయములకు భిన్నముగా వేరేగ్రంధములు పుడుతూ రావడమునకు హేతువు ఉండనేరదు జాతకముహూర్తభాగములనేమి సాముద్రికము మొదలయిన శాస్త్రములనేమి పూర్వులు అనుభవమును యోచించి రచించియున్నారు ఐతే వీటిచేతనైనా వీటిలో అక్కడక్కడ చెప్పబడియుండే సంగతులయందలి గుణదోషములనుపట్టి ఫలములను ఊహించవలసినదేకాని రూఢిగా కనిపెట్టె వల్లలేదు బుద్ధిమంతులయినవారు ఒకానొక నిమిత్తములో న్యాయానుగుణముగా చాలాయోచించి ముందుజరగపొయ్యేటట్టు ఒకానొక ఉహచెయ్యడమున్ను ఆ యూహకు అనుగుణముగానే ఆ కార్యము సంభవించడమున్ను కలదు అటువలెనే సదరు గ్రంధములు చదువుకున్నవారున్ను వాటిమీద నూహించి చెప్పే సంగతులలో నొకానొకటి కొంతమట్టుకు వారి యూహకు అనుగుణముగా సంభవించవచ్చును విశేషించిన్ని జాతకభాగమందు చాలా తరహాలుగా గ్రంధములు పుట్టియున్నవి, యొక గ్రంధమునుపట్టి యేర్పరచిన ఫలములు మరియొక గ్రంధమునుపట్టి యేర్పరచే ఫలములకు భేదించియుండడము కలదు గనుక యొకగ్రంధమును మాత్రముపట్టి చెప్పబడే ఫలములు దాఖలా యిస్తవని చెప్పేవల్లలేదు ఒకవేళ కొన్ని గ్రంధములనుపట్టి ఫలములు ఏర్పరచినపక్షమందు అవి వాస్తవములైనవి కావచ్చునేమోనంటే ఆ సంగతిలోనున్ను ఒక జ్యోతిష్కుని యూహకు మరియొక జ్యోతిష్కుని యూహ భేదించేనుండును గాని సరిగా యుండనేరదు గనుక సదరు గ్రంధములమీద నేర్పరచబడేసంగతులు ఖరాగా సంభవిస్తపని నమ్మతగ్గని కావు.

ఉత్తర భాగము

౧ – ఈ ప్రపంచముయొక్క కార్యములన్ని స్వభావముగానే కలుగుచున్నవని కొందరంచున్నారు స్వభావమనేపదము జగత్కారణమైన పరబ్రహ్మముయొక్క శక్తియైన ప్రకృతినిన్ని బోధిస్తున్నది నైజము మొదలైనవాటినిన్ని బోధిస్తున్నది కార్యములన్ని స్వభావముగానే కలుగుచున్న వనేవారు వాటికి కలిగియున్న మూలకారణ సంబంధమేమీ ఒప్పడములేనందున కార్యములన్ని నైజముగా ననగా వాటికవే ఏర్పడుచున్నట్టు ఎంచుచున్నారని తోచుచున్నది యేకార్యమైనా కారకుడు లేకుండా దానికి అదే యేర్పడనేరదు ప్రపంచమనే కార్యము బహువిచిత్రములైన పద్ధతులతో నేర్పరచబడుతున్నది, ఇటువంటి కార్యము కారకుడు లేకుండా దానికదే ఏర్పాటుఔచున్నదని ఎలాగున నమ్మను కాబట్టి అది కారణమైన పరబ్రహ్మము చేతనే జగత్తు ఏర్పరచబడుచున్నట్టు తెలియతగి యున్నది – లోకమందు కొన్ని కార్యములు కృతకమని చెప్పబడుచున్నవి, యివి యీ ప్రపంచము జరుగుతూ నుండడమునకు భగవంతుడు ఏర్పరచిన పద్ధతివల్ల జంతువులకు కలిగే సామర్థ్యమునను జంతువులచేత రచించబడు చున్నవి – కృతకములు గాక మిగిలిన కార్యములన్నీ దైవనిర్మితములనే చెప్పబడుచున్నవి గనుక ఏకార్యమైనా దానికి అదే ఏర్పడుచున్నట్టు నమ్మేవల్లలేదు నైజమనే స్వభావమైనా ప్రపంచము జరుగుతూ నుండగలందులకు ఈశ్వరుడు ఏర్పరచిన పద్ధతిలోదే ఐయున్నది గనుక ప్రపంచములో కలిగే కార్యములన్నీ సదరు పద్ధతివల్లనే కలుగుచున్నవని చెప్పవచ్చునుగాని నైజముగానే కలుగుచున్నవని చెప్పడమునకు న్యాయములేదు ప్రాణులలో మనుష్యుడు న్యాయగ్రాహకమైన బుద్ధిగలవాడైనందున విశేషములైన కార్యములను ఏర్పరచే యోగ్యత గలవాడయి యున్నాడు ఐనప్పటికిన్ని మనుష్యునిచేతనైనా సదరు పద్ధతివల్ల వానికికలిగే సామర్థ్యమునకు లోబడని కార్యములు జరిగించబడనేరవు ఐతే జగన్నాథుడు ప్రపంచమునకు పరుడయి సాక్షిభూతుడయి స్వతంత్రుడై యున్నాడు గనుక ఆయన యొకానొక రూపముగా ఈ లోకమందు కలిగియున్నాడనిన్ని సదరు పద్ధతికి భిన్నములయిన కార్యముల జరిగించినాడనిన్ని దానిచేత తెలియతగని సంగతులను తెలియచేసినాడనన్ని నమ్మడమునకు ఈ చర్చ ప్రతిబంధి కానేరదు.

౨ – ఈశ్వరుడు అగుణుడని కొందరు అంచున్నారు అగుణుడనగా గుణమేలేనివాడని కొందరు ఆపదముకు అర్థము చెప్పుచున్నారు – స్థితియనేది ధర్మమున్ను ఐయున్నది గుణాశ్రయమున్ను ఐయున్నది – స్థితిగలదనడమే సగుణమని యెంచతగి యున్నది ఈశ్వరుడు గుణమే లేనివాడని చెప్పేపక్షమందు ఈశ్వరుడనేస్థితి లేదనే యొప్పవలసి వస్తుంది ఆ పక్షమందు నిరీశ్వరవాదమును ఒప్పుకున్నట్టు ఔతుంది గనుక ఈశ్వరుడు గుణరహితుడని చెప్పడమునకు హేతువు కనుబడ లేదు ఈశ్వరుడు ఆయనయొక్క గుణములు ముకుళించి యున్నప్పుడు అగుణుడని చెప్పబడుతున్నట్టు కొందరు చెప్పుతున్నారు తద్గుణములు ఒకప్పుడు ముకుళితములై యుంటవని యెప్పడమునకు సబబు కనుపడలేదు, ఒకవేళ అటువంటి సమయము ఉంటుందని చెప్పినా అప్పుడున్ను ముకుళితముగానైనా గుణములుఉన్నట్టే స్పష్టమౌచున్నది కాబట్టి ఈశ్వరుడు గుణములేనివాడని చెప్పడమునకు ఎప్పుడూ వల్లలేదు ఈశ్వరుడు అగుణుడనగా హేయగుణరహితుడని కొందరు అర్థము చెప్పుచున్నారు గుణమనే పదమునకు సాధారణముగా హేయగుణమని అర్థము చెప్పడమునకు న్యాయము లేదు ఈశ్వరుడు అగుణుడని వాడుక చెయ్యడమునకు ఒప్పి ఆ వాక్యమునకు హేయగుణరహితుడని కష్టక్లుప్తిగా ఏలఅర్థము చెయ్యవలెను ఈశ్వరుడు యావత్సద్గుణములు కలవాడనే ఏల చెప్పరాదు అగుణుడన్న పదమునకు పైన చెప్పబడ్డ అర్థములవల్ల విశేషమేమీ కనుపడదు గనుక ఈశ్వరుడు అగుణుడని వాడిక చెయ్యనేకూడదని తేటపడుతున్నది.

౩ – మంత్రములయందు ప్రత్యక్షమైన ఫలమేమీ లేదని పై ప్రమేయములో వ్రాసియున్నాను, అట్లా వ్రాయడముచేత భగవంతుణ్ణి ప్రతిపాదించే నామములలో నొకదాన్ని స్మరించడమువల్లగాని జపించడమువల్లగాని కిఫాయతులేదని నా అభిప్రాయముకాదు అటువంటి నామమును స్మరించడముచేతనైనా జపించడముచేతనైనా ఈశ్వరుణ్ణి తలచుకోవడమునకు హేతువు ఔతుంది గనుక భగవంతుణ్ణి ప్రతిపాదించే నామమును మంత్రముగా స్మరించినా జపించినా కిఫాయతు లేదని యేప్పుడూ చెప్పకూడదు, ఇంతేకాదు ఇటువంటి మంత్రమును జపించేయెడల జాగ్రత కలుగడమునకు సాధకముగానుండే జపమాలికవల్లకూడా కిఫాయతులేదని చెప్పకూడదు, ఐతే కరుణత్రయములోను అంతఃకరణమే ప్రధానమైయున్నది, ద్రోహచింతలేక పరిపక్వతనున్ను నిర్మలత్వమునున్ను పొందుచున్న అంతఃకరణమే సర్వజ్ఞుడైన ఏలినవానిదయకు ఫ్రధానసాధకమౌచుంది గనుక అటువంటి మనస్సుచేత తననుభావించినందుకు సంతోషించినట్టు ఏలినవాడు మంత్రజపము చేతగాని పూజనములు మొదలైనవాటి చేతగాని సంతోషిస్తాడని ఎంచవలసిన పనిలేదు సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం శరణం అనగా సర్వధర్మాన్ పరిత్యజ్య వర్ణాశ్రమములచేతను నిర్ణీతములైన కర్మములు ఫలప్రదములుగా నమ్మక – మా మేకం శరణంవ్రజ అనగా శ్రీమజ్జగన్నాథ మేకం శరణం వ్రజ శ్రీమత్ మోక్షలక్ష్మీ నివాసభూతుడైన జగన్నాథ మేకం జగన్నాయకుణ్ణే శరణం వ్రజ శరణును పొందుమా యనే ప్రసిద్ధమైన నిర్ణయము గలిగి యున్నది గనుక బుద్ధిమంతులైనవారు ఈ పరమార్థమును ముఖ్యముగా కనిపెట్టవలసినది.

శ్రీ
వివాహప్రమేయము

వివాహమునుగురించి జరిగే మర్యాదలలో కొన్ని అన్యాయపద్ధతులుగా కనుపడుతున్నందున చెన్నపట్టణములో నుండే ఆదివెలమవారనే మా బంధుజాతమువారికి కొన్నిచర్చలతో ఒకప్రశ్నవ్రాసి పంపించియుంటిని వాటి అభిప్రాయములను ఇక్కడ వాయడమైనది.

౧ – వివాహమునకు మూడుసంగతులు ఆవశ్యకములై యున్నవి వాటిలో చిన్నదానియొక్క చిన్నవానియొక్క పరస్పరేచ్ఛ మొదటిది ఇది అవశ్యమైనందుకు దృష్టాంతరము – కన్యావరణములు అనగా పాణిగ్రహణము చెయ్యబోయేముందు చిన్నదానియొక్క చిన్నవానియొక్క మధ్య సంధికితిరిగేవారికి ఇచ్చే దక్షిణలు ఈ దక్షిణనిచ్చేటప్పుడు అవి పుచ్చుకునేవారితో మదర్థం వరం వృణీధ్వం అనేమంత్రము చిన్నదానిచేత చెప్పించుచున్నారు – ఇందుకు వరం నన్ను మోహించినటువంటి ఫలానిపురుషుణ్ణి నాకొరకు వృణీధ్వం కోరవలసినదని అర్థమౌచున్నది – ఇందుకు అనుగుణముగానే మదర్థం కన్యాం వృణీధ్వం అని చిన్నవాని చేతనున్ను చెప్పించుచున్నారు సదరు ఇచ్ఛ యుక్తమైనదేమో ననే విమర్శ మీద వారి తలిదండ్రులు దాన్ని అంగీకరించడము రెండోది – ఆవశ్యకులైనవారు కూడి వధూవరులు కావడమునకు ఆ చిన్నదానికి చిన్నవానికి ఉండే ఇచ్ఛను సిద్ధించినదిగా రూఢిపరచ తగిన కార్యమనగా పాణిగ్రహణము చేయించడమువల్ల ఆ వధూవరత్వముమ దృఢపర్చవలసినది మూడోది – దీనికి విస్తారమైన వ్రయము జురూరులేదు ఈ మూడింటికితప్ప వివాహమునకు ముఖ్యకార్యములు లేవు – కొందరి జీవనోపాధికి సదుపాయము కలిగేకొరకు వివాహాదులయందు కొన్నితంత్రములు జరగడము అవశ్యమైనట్టు పూర్వులు కొందరేర్పరచియున్నారు అటువలెనే కొన్ని మర్యాదలనుకూడా ఒకానొకరు ఏర్పరుస్తూ వచ్చినందున ఒకరినిచూచి యొకరు వాటిని జరిగిస్తూ వచ్చినారు భాగ్యవంతులైనవారు తమ ఖులాసాచొప్పున చాలా వేడుకలున్ను వివాహములయందు జరిగిస్తూవచ్చినారు కాని సదరు తంత్రములు మర్యాదలు వేడుకలు వివాహమునకు ప్రథానకార్యములు కావు ఐనప్పటికిన్ని అవి క్రమేణ ప్రబలించి నివారించడమునకు సాధ్యముకాకుండా నుండే అంతబలమైన ఆచారముగా నేర్పడ్డవి ఈయాచారమును తప్పించేవల్ల లేకుండా నున్నందున ద్రవ్యవంతులుగాని వారి వారికి అగత్యము వచ్చినప్పుడల్లా వివాహములు సులభముగా జరిగించడమునకు అనుకూలపడక పోతూవచ్చినది దీని ప్రబలతచేత కొందరు పురుషులకు వివాహములు కావడము లేకపోతూనే వచ్చినది కొందరు కన్యలకు యుక్తవయస్సు వచ్చిన్ని కొంతకాలము వివాహము కాకుండా వుండడమునన్ను సంభవిస్తూ వచ్చినది పూర్వమందు చిన్నదానికి పూర్ణవయస్సు వచ్చినమీదట వివాహము చెయ్యడము సర్వత్ర ఆచారమైయుండేది – వివాహములయందు జరిగే తంత్రములున్ను చెప్పబడే మంత్రములున్ను ఈసంగతినే తేటపరుస్తున్నవి కొంతకాలము కిందట చాలామంది బ్రాహ్మణులయందున్ను ఒకకాలములో కోమట్లయందున్ను చిన్నదానికి సంపూర్ణవయస్సు రాకమునుపే వివాహము చేసే మర్యాద యేర్పరచబడ్డది అది క్రమేణ స్తన్యపానముచేసే ఆడశిశువుకుకూడా వివాహముచేసే ఆచారముగా ఏర్పరుచుకోబడ్డది – పూర్ణవయస్సువచ్చిన చిన్నదాన్ని దానమిస్తే పూర్ణకన్యాదాన మనిపించుకుంటుంది బాలికను దానమిస్తే అది అపూర్ణకన్యాదాన మనిపించుకుంటుంది గనకనున్ను చిన్నవాండ్లకు బాలారిష్టములు మొదలైన వికారములు సంభవించ తగియుంటవిగనుకనున్ను చిన్నది వ్యక్తురాలైన మీదట వివాహము చెయ్యడమే మిక్కిలీ న్యాయమైయున్నది అనూతనదంపతులు వెంటనే తదుద్దేశసుఖమును పొందుతారు తదనంతరము తత్పరంపరానుభవమున కేదైనా విఘాతము వచ్చిన్నప్పటికిన్ని అది వివాహముచేసిన పెద్దల జబ్బు నడవడినిపట్టి వచ్చినదిగా నెంచడమునకు న్యాయములేదు.

౨ – ఐతే బ్రాహ్మణులు కోమట్లు గాక తతిమ్మావారు పూర్ణకన్యాదానము చేసే ఆచారము కలిగి యున్నప్పటికిన్ని ఒకటి – కన్యాదానఫలముయొక్క న్యూనత్వాధిక్యములను కనిపెట్టజాలకనున్ను – రెండు – బ్రాహ్మణులచేత వివాహముచెయ్యబడే మర్యాద విశేషమయినదిగా భావించిన్ని – మూడు – వివాహములయందు పైగా పెరిగియుండే తంత్రములను మర్యాదలను వేడుకలను పదేపదేజరిగించే ద్రవ్యోపపత్తిలేక పూర్ణవయస్సువచ్చిన కన్యల వివాహములతోకూడా బాలికలకున్ను వివాహములుచేస్తే అనుకూలముగా నుంటుందని ఎంచిన్ని – నాలుగు – చిన్నదానికి పూర్ణవయస్సు రాకమునుపే వివాహముచేస్తే చాలా వేడుకలకు అనుకూలముగా నుంటుందని తలచిన్ని – ఐదు – తలిదండ్రులలోనైనా చిన్నదానియొక్కగాని చిన్నవానియొక్కగాని లేక ఆప్తవర్గములోనయినా నొకరికి వార్ధకముచేతగాని మరి ఏ హేతువుచేతగాని జీవితకాలము విస్తారములేదని తోచి ఆ మనిషి వివాహాత్సవము చూడవలెనని ఇచ్ఛయించడముచేతనున్ను బాలికలకుకూడా దరిమలాను వివాహములు జరిగిస్తున్నారు.
ఒకటి – కన్యాదానఫలముయొక్క న్యూనత్వాధిక్యములు పైపేరాలో వివరించబడ్డ సంగతులవల్లనే తేటపడతగియున్నవి – రెండు – పూర్ణకన్యాదానము చేసే మర్యాద లేనివారు జరిగించే పద్ధతి పూర్ణకన్యాదానము చేసే మర్యాద గలవారెప్పుడున్ను అంగీకరించతగ్గదికాదు – మూడు – వివాహమునకు ముఖ్యకార్యములుగాక పైగా వాడికలలోనుండే తంత్రములను మర్యాదలను వేడుకలను ధారాళముగా జరిగించే శక్తిలేనివారు వాటిని సులభముగానే మట్టుపరచవచ్చును మనదేశములో ద్రవ్యస్థితి మిక్కిలీ తక్కుయై యున్నది – మనదేశస్థులు జీవించడమునకు ఉండేవృత్తులు చాలా తగ్గిపోయినవి – రాజధానులయందుండేవారికి జీవనార్థమై కొన్ని సదుపాయములు కలుగుతున్నప్పటికిన్ని ఇతర స్థలములయందు ఉద్యోగములులేకుండా నుండేవారికి జీవనము జరుపుకోవడము మిక్కిలీ కష్టతరమై యున్నది – రాజధానులయందుండే వారిలోనున్ను ఉద్యోగములు కలిగియున్నవారు వినాగా తతిమ్మావారు జీవనార్థమయియుండే బాధను కొంతమట్టుకైనా తెలుసుకుంటూనే యున్నారు వేడుకలు అవి జరిగిన ఉత్తరక్షణమందు చూడడమునకు ఏమీ నిమకళా లేకుండా అప్పుడే గడిచిపోతవి గనుక వేడుకలనిమిత్తము అప్పులు చెయ్యరాదు తమకు తమపిల్లలకు జీవనాధారముగానుండే స్థితిని వివాహముక్రింద వ్రయమున్ను చెయ్యకూడదు ఈ ఆంశములను లక్ష్యపెట్టకుండా వివాహములు జరిగించినవారేమి వారి వారసులేమి చాలా సంగతులలో మిక్కీలీ ఆపదలను పొందుతూ నున్నందుకు అనేక దృష్టాంతరములు కలిగియున్నవి – ఇదివరకు మనవారు కొందరు చెన్నపట్టణముందు వివాహములు చెయ్యజాలక అందుకు సమీపస్థలములయందు వారు వారి అనుకూలము కొద్ది వివాహములు జరిగిస్తున్నారు – అది వారికేగాని వివాహము చెయ్యబడ్డ దంపతులకే గానీ న్యూనముగా నెంచడములేదు – విస్తరించి వ్రయముచెయ్యలేనివారు అనివార్యములైన కార్యములను మాత్రము తమశక్తికొలది జరిగించే సదుపాయములు కుదుర్చుకుని వివాహములు సులభముగా చేసుకుంటే దోషములేదు గాని తమపిల్లలయొక్క కాగలస్థితికి హానికరమౌనేమోనని సందేహించతగిన కార్యముల నెప్పుడున్ను జరిగించకూడదు – నాలుగు – భాగ్యవంతులైనవారు ఏపేరుబెట్టిఐనా అన్ని వేడుకలున్ను జరిగించుకోవచ్చును వివాహోత్సవములే కావలెనంటె బొమ్మలపెండ్లిమూలముగానైనా జరిగించవచ్చును లేక ఆఉత్సవములకు తమపిల్లనే విషయముగా నేర్పరచవలెనని ఇచ్ఛయుంటె బొమ్మలకుబదులుగా తమపిల్లలనే కూర్చోబెట్టిన్ని ఊరేగించిన్ని కావలసినవేడుకలు జరిగించుకోవచ్చును గాని అవి తమపిల్లలయొక్క కాగలస్థితికి హానికరమయ్యే బంధకముగా నుండకూడదు – వధూవరస్థితి యనగా చిన్నవాణ్ణి చిన్నిదిన్ని చిన్నదాన్ని చిన్నవాడున్ను వరించిన ఫలమును పొందేస్థితి ఇదే వివాహస్థితి ఇదే మనుష్యజన్మమునకు ప్రధానమైనస్థితి చిన్నదానికి పూర్ణవయస్సు వచ్చినమీదటగాని ఇటువంటిస్థితి ఘటనపడదు – తమపుత్రికలు పూర్ణవయస్సు వచ్చేమట్టుకు జీవించి యున్నప్పటికీ పన్ని ఇటువంటిస్థితిని వారికి దొరకకుండా చెయ్యడమునకు హేతువు యౌనేమోనని భయపడతగిన వివాహబంధములచేత మందలుగా తమ వేడుకలకొరకు తమపిల్లలను బద్ధులను చెయ్యడము తమవేడుకలకు తమపిల్లలను బలియివ్వడముగా నెంచతగియున్నది యేయేస్థలములయందు పొడిమిన స్వల్పకాలమలోనే అనేక జనులకు హానిజేసే విషూచి మొదలైన వ్యాధులయొక్క వ్యాపకమును యోజించవలసినది – ఐదు – తమకు జీవితకాలము అధికముగాలేదని యెంచుకునిగాని జీవితకాలము అధికముగాలేని తమవారి కోరికను గురించిగాని బాలికలకు వివాహములు చెయ్యడము యిహపరములకు హానికరమైనదిగా తేటపడుతున్నది – గనుక వీరున్ను ఈపైన చెప్పబడియున్న పద్ధతిచొప్పున వేడుకలు జరిగించి తమ కోరికలను తృప్తి పొందించుకోవచ్చును.

౩ – చిన్నదానికి పూర్ణవయస్సు వచ్చినమీదట వివాహముచేసే ఆచారమునే ముఖ్యమయినదిగా నెంచి మనవారు వివాహములు చేస్తూనుండేవారు దరిమిలాను క్రమేణ బాలికలకున్ను వివాహములు చేస్తున్నారు – ఈలాగున వివాహము చెయ్యబడ్డవారిలో పెండ్లికుమార్తెలు రజస్వలలు కాకమునుపే కొన్నిచోట్లను బాలారిష్టమువల్లనైనా మరియే రోగమువల్లనైనా మరియే హేతువువల్లనయినా పెండ్లికుమాళ్ళు శరీరములు వదిలిపెట్టడము సంభవిస్తున్నది – పుత్రికావంతులైన తలిదండ్రులకు సాధ్యమైనంతమట్టుకు పుత్రికానుమతిని కనిపెట్టిన్ని ఆదరించిన్ని పుత్రికకు వివాహము చెయ్యడమున్ను వివాహముచేసేముందు ఆ చిన్నదానికి పర్యాయతః జరగగల సౌఖ్యములనుగురించి చాలాగా యోజించి అందుకు అనుకూలమయినంత బందోబస్తు చెయ్యడమున్ను విధియై యున్నది ఈలాగున నుండగానున్ను రజస్వలలయిన కన్యలకు వివాహము చెయ్యడము న్యాయమున్ను ముఖ్యమయిన ఆచారమున్ను ఐయుండగానున్ను అందుకు విరోధముగా తలిదండ్రులు బాలికలకు వివాహములు చెయ్యడమున్ను అ నడవడివల్ల వచ్చేహానిని ఆ బాలికలు పొందవలెననడమున్ను అనగా యుక్తవయస్సు రాకమునుపే ఆ మగచిన్నవాండ్లు చనిపోతే తిరిగి వివాహము లేకుండా ఆ బాలికలు జీవితకాలము మట్టుకు దుఃఖము ననుభవిస్తూ నుండవలసినదనడమున్ను న్యాయమైయున్నదా – యని ప్రశ్న చెయ్యడమయినది – ఈ ప్రశ్నకు మాబంధుజాతమువారు వ్రాయించిన ఉత్తరముయొక్క అభిప్రాయము యిక్కడ వ్రాయడమౌచున్నది.

౧ – వివాహమందు – పాణిగ్రహణమే ముఖ్యకార్యములనిన్ని అందుకు విస్తారమయిన ద్రవ్యము జురూరులేదనిన్ని తెలియ తగిన సంగతులు యుక్తియుక్తములుగా విచారించి సదరు ప్రశ్నలో వ్రాసినందుకు మిక్కిలీ సంతోషించడమయినది – రెండు – అయితే వివాహమునకు చిన్నదానియొక్క చిన్నవానియొక్క పరస్పరేచ్ఛ మొదటిది యనగా గాంధర్వ వివాహమునకు మాత్రమే ఒప్పియున్నది – చతుర్వర్ణములవారు ఆ వివాహము జరిగించడము లేదు – మూడు – ఈవర్ణములవారు జరిగించే వివాహములు పరస్పరేచ్ఛను అనుసరించి చెయ్యడములేదు – తలిదండ్రుల యిష్టము వెంబడే జరిగించబడుతున్నవి – నాలుగు – పూర్వము కొందరు రాజులు స్వయంవరము చాటించి పుష్పమాలికను చిన్నదాని చేతికిఇచ్చి స్వయంవరమునకు వచ్చియుండే వారిలో ఆమెకు పసందుగాడనుపడే పురుషునియొక్క కంఠమందు ఆ మాలిక నుంచేటట్టు నియమించి యున్నారు ఇందుకు భిన్నముగా మత్స్యయంత్రము మొదలైనవాటిని సాధించినవారికి తమకొమార్తెల నిస్తామని కూడా కొందరు రాజులు పతిజ్ఞచేసి ఆ ప్రకారము సాధించినవారికి తమ పుత్రికలనిచ్చి వివాహము చేసియున్నారు – చిన్నదానియొక్క ఇచ్ఛను ముఖ్యముగా ఎంచుకోవలసిన నియమము ఉండినట్టయితే ఇటువంటి శపథములు చెయ్యడమునకు నిమిత్తము ఉండనేరదు గనుక సదరు స్వయంవరములున్ను శేషథములున్ను క్షత్రియులలో ఒకానొకచోట జరిగించబడ్డవి గాని వారిలో నైనా ఇవి సర్వత్ర అంగీకరించబడ్డ పద్ధతులు కావు – ఈ శపథములను గురించి సీతాదేవియొక్క ద్రౌపతియొక్క వివాహప్రశంసలే దృష్టాంతములై యున్నవి – ఐదు – పుత్రికలు తగిన మనుములను విచారించవలసిన ఉద్యోగము తలిదండ్రులదిగా నున్నందున వారి అభిప్రాయానుసారముగా చిన్నది ఏపురుషుణ్ణి ఐనా వరించినట్టయితే పాలలో శర్కర ఉంచినట్టు హర్షించడమునకు హేతువు ఐయుంటుంది – ఆరు – చిన్నదాని ఇచ్ఛనే అవశ్యమందామంటే చిన్నది ఏచిన్నవాణ్ణిఐనా వరించినపక్షమందు ఆవిడె అప్పుడే అతనికి శేషమైనట్టు ఎంచతగియుంటుంది ఆచిన్నవాడు ఒకవేళ అందుకు ప్రతికూలించి వివాహము చేసుకోకపోయినా లేక ఆవివాహము కావడమునకు ఏదైనా వేరేఒక భంగము సంప్రాప్తమైనా అది చిన్నదానియోగ్యతకు న్యూనతగా ఎంచబడుతుందిగనుక పైన ఉదహరించబడిన ప్రకారము చిన్నదాని ఇచ్ఛనే అవశ్యమనడమునకు అవకాశము లేకుండానున్నది.

౨ – వివాహములో పాణిగ్రహణము చెయ్యబొయ్యేముందు చిన్నవానియొక్క చిన్నదానియొక్క మధ్య సంధికితిరిగే వారితో మదర్థం వరం వృణీధ్వం అనిన్ని మదర్థం కన్యాం వృణీధ్వం అనిన్ని వధూవరులు కాబొయ్యేవారిచేత చెప్పించే మంత్రములలో పూర్వవాక్యమందు నాకొరకు పురుషుణ్ణి వరించవలసినదనిన్ని ఉత్తరవాక్యమందు నాకొరకు కన్యను వరించవలసినదన్నిన్ని అర్థమౌచున్న ది – ఇంతకుమించి ఈ వాక్యములనన్వయించడమునకు అవకాశమగుపడలేదు – ఇంతేకాకుండా తలిదండ్రులచేత ఏర్పాటుచేయబడ్డ వరుణ్ణిగురించిన్ని కన్యనుగురించిన్ని సదరు మంత్రములు ఉద్దేశించబడ్డవిగాని కన్యావరులయొక్క పరస్పరేచ్ఛనే ప్రధానమైనదిగా నేర్పరచడమునకు ఉద్దేశించబడ్డవికావు అందుకు వారి అభిప్రాయములనుపట్టి వివాహములు జరిగించే మర్యాద లేకపోవడమే దృష్టాంతమైయున్నది.

౩ – స్త్రీలకు ఎంతమాత్రమూ స్వాతంత్ర్యములేదని చెప్పబడుతున్నది – ఎటువలెనంటే – పితారక్షతి కౌమారే భర్తారక్షతి యౌవనే। పుత్రోరక్షతి వార్థక్యే నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి॥ పితా-తండ్రి – కౌమారే-కౌమారమందు – రక్షతి-రక్షింపుచున్నాడు – యౌవనే-యౌవనమందు – భర్తా-పెనిమిటి – రక్షతి-రక్షింపుచున్నాడు – పుత్రః-పుత్రుడు – వార్థక్యే-ముసలితనమందు – రక్షతి-రక్షింపుచున్నాడు – స్త్రీ-ఆడమనిషి – స్వాతంత్ర్యం-స్వతంత్రత్వమును – నార్హతి-పొందతగదు – మహిష్యాంగవికన్యాయా మాదానం న స్వతంత్రతా। తతో గ్రహీతుస్తాః ప్రాహు స్స్వాతంత్ర్యం న కదాచన॥ మహ్యిష్యాం-ఎనుముయందున్ను – గవి-గోవుయందున్ను – కన్యాయాం-కన్యయందున్ను – ఆదానం-దానముచేసే పర్యంతమున్ను – స్వతంత్రతా-స్వాతంత్ర్యము – న-లేదు – తతః-అటుతరువాతను – తాః-వాట్లను – గ్రహీతుః-గ్రహించినవాని సంబంధములైనవిగా – ప్రహుః-చెప్పినారు – తానాం-వాట్లకు – స్వాతంత్ర్యం – కదాచన-ఒకానొకప్పుడున్ను – న-లేదు – కన్యకాదానపర్యంతం పిత్రోరేవవశోభవేత్। తతో భర్తృ వశేప్రోక్తా స్వతంత్రా న కదాచన॥ దానవర్యంతం-దానము చేసేవరకు – కన్యకా-కన్య – పిత్రోః-తలిదండ్రులయొక్క – వశఏవ-వశమందే – భవేత్-ఉండవలసినది – తతః-అటుతరువాతను – భర్తృవశే-పెనిమిటియొక్క అధీనతయందు – ప్రోక్తా-చెప్పబడ్డది – స్వతంత్రా-స్వతంత్రురాలు – కదాచన-ఒకానొకప్పుడున్ను – న-కాదు – అని ప్రమాణములు ఉన్నందువల్ల చిన్నదానికి తగిన వరుణ్ణి లభింపచాయడము తలిదండ్రులయొక్క కార్యమేనని విశదమౌచున్నది – తదనుకూలముగా పెద్దలున్ను బంధువులు మొదలైనవారున్ను కూడియున్నప్పుడు తలిదండ్రులైనా లేక తగినవారైనా చిన్నదాన్ని దానముచేయ్యడమున్ను చిన్నవాడు గ్రహించడమున్ను పట్టి ఆ ఇరువురికి వధూవరత్వస్థితి సిద్ధించినదిగా చెప్పతగియున్నది.

౪ – కొంతకాలముకిందట చాలామంది బ్రాహ్మణులయందన్ను ఒకానొకకాలములో కోమట్లయందున్ను చిన్నదానికి పూర్ణవయస్సు రాకమునుపే వివాహముచేసే మర్యాద యేర్పరచుకోబడ్డదనడము విచారించగా వైశ్యులలో బేరిజాతమువారు రసజ్వలలైన కన్యలకుకూడా సాధారణముగా వివాహములు జరిగిస్తున్నందున కోమట్లలో మాత్రము అట్లా జరిగించకూడదనిన్ని నిబంధన దరిమిలాను ఏర్పరచుకున్నట్టు ఉన్నదనడమునకు ఆస్పదముగా కనుపడుతున్నది గాని బ్రాహ్మణవర్ణములో అనేకభేదములు ఉన్నప్పటికిన్ని వారిలో నెవరున్ను రజస్వలయైన కన్యకకు వివాహము చేసేఅచారము లేకయుండగా వారిలోనున్ను సదరు మర్యాద యిటీవల యేర్పరచుకోబడ్డదనడమునకు ఏమి సబబు ఉన్నది – యొకవేళ చిన్నది ఋతుమతియైన మీదట వివాహము చెయ్యవలసినదని ధర్మశాస్త్రమందు వచించబడి యున్నదనే హేతువుచేత సదరు మర్యాద బ్రాహ్మణులు దరిమిలాను నిర్ణయించుకున్నట్టు ఊహించబడిన్ని ఉండవచ్చును రాజులు కొందరు స్వయంవరవివాహములు జరిగించినట్టు ఒకటోపేరాలో వ్రాయబడియున్నది – అది వారి వారి యిష్టానుసారముగా ఒకానొకచోట జరిగిన ఆచారమైనప్పటికిన్ని ఇటువంటిసంగతులలో జరిగే ప్రతిమర్యాదకున్ను వచనపూర్వకమైననిర్ణయము కలిగియుండవలసినది న్యాయమైయున్నది గనుక యీ స్వయంవరవివాహమునకున్ను కొన్నివచనములు ఏర్పడియున్నవి యేలాగంటే బోధాయనస్మృతియందు – త్రీణివర్షాణ్యృతుమతీ కాంక్షేత పితృశాసనం తతశ్చతుర్థేవర్షేతు విందేతసదృశంపతిం॥ ఆనే వచనము వ్రాయబడి యున్నది – దీనికి – ఋతుమతీ-ఋతుకాలమును పొందినది – త్రీణివర్షాణి-మూడుసంవత్సరములు – పితృశాసనం-తండ్రియొక్క ఆజ్ఞను – కాంక్షేత-కోరవలెను – తతః-అటుతరువాత – చతుర్థేవర్షేతు-నాలుగో సంవత్సరమందైతే – సదృశం-సమానకులజాతుడైన – పతిం-భర్తను – విందేత-పొందవలెనని అర్థమౌచున్నది – యిందుకు అనుగుణముగానే కొందరు ఋషులు వచించియున్నారు చిన్నది రజస్వలయైనమీదట ఇంతవ్యవధి లేకుండానే వారి వారికి అనుకూలమని తోచినంత వ్యవధికలుగచేసి కొందరు ఋషులు వ్రాసియున్నారు – ఐతే – యీ దిగువను వచ్చేవచనము యీ సంగతిలో కడపట వచించబడినదిగా కనుపడుతున్నది యేలాగంటే మరియొక గ్రంధమందు – కన్యా ద్వాదశకేవర్షే యాత్వదత్తాగృహేవసేత్। భ్రూణహత్యా పితు స్తస్యాప్సా కన్యావరయేత్స్వయం॥ అనేవచనము చెప్పబడి యున్నది – దీనికి యాతు-ఏకన్యకయైతే – ద్వాదశకే-పన్నెండోదైన – వర్షే-సంవత్సరమందు – అదత్తా-ఇవ్వబడనిదై – గృహే-పితృగృహమందు – వసేత్-ఉంటుందో – తస్యాః-కన్యయొక్క – పితుః-తండ్రికి – భ్రూణహత్య అయ్యీని – సాకన్యా-ఆకన్య – స్వయం-తాను – వరయేత్-భర్తను వరియించతగ్గది – యని అర్థమౌచున్నది – యిందువల్ల ఈగ్రంధకర్త చిన్నదానికి యుక్తవయస్సు వచ్చినమీదట వ్యవధికాకుండానే స్వయంవరవివాహము జరిగించడము యోగ్యముగానెంచి పన్నెండోసంవత్సరములోనే చిన్నదానికి వివాహము జురూరై యుంటుందనిన్ని ఆయీడుగలకన్య స్వయంవరవివాహపూర్వకముగా భర్తను ఏర్పరుచుకోతగ్గది యనిన్ని వ్రాసియున్నట్టు తెలుస్తున్నది – గనుక సదరు వచనద్వయపద్ధతులున్ను ఇంకా ఇటువంటివచనముల పద్ధతులున్ను రాజులు పూర్వమందు జరిగిన స్వయంవరవివాహములనుగురించినవిగా తేటపడుతున్నది – బ్రాహ్మణకన్యలకు వివాహములు చెయ్యవలసిన కాలములు ఈదిగువను వచ్చేవచనమందు నిర్ణయించబడియున్నవి – దశైకోనాష్టవర్షాతు వివాహ్యా బ్రాహ్మణేనతు। నాతో వివాహశ్శాస్త్రోక్తశ్చోత్తమాతూత్తరోత్తరా॥ చిన్నది దశవర్షా-పదిఏండ్లది ఐనా – ఏకోనా-తొమ్మిదిఏండ్లది ఐనా – అష్టవర్షా-యెనిమిదిఏండ్లది ఐనా – బ్రాహ్మణేన-బ్రాహ్మణునిచేత – వివాహ్యా-వివాహము చేసుకోతగ్గది – అతః-ఇంతకంటే – వివాహః-భిన్నమయిన వయస్సుగలదాని వివాహము – నశాస్త్రోక్తః-శాస్త్రోక్తమయినది కాదు – ఉత్తమాతు-ఉత్తమమయినది – ఉత్తరోత్తరా- పైపైదియని చెప్పబడ్డది గనుక పైన ఉదహరించబడిన వచనములు రెండున్ను బ్రాహ్మణులలో చెయ్యవలసిన వివాహములను గురించినవిగావని స్పష్టమౌచున్నది.

౫ – మరిన్ని యీ దిగువను వచ్చే శ్లోకమందు ౮-౯-౧౦ సంవత్సరముల యీడుగల ఆడపిల్లలకున్ను పదిసంవత్సరములకు మిగిలిన ఈడుగల చిన్నదానికిన్ని ప్రత్యేకము ప్రత్యేకముగా నామములు ఏర్పరచబడ్డవి – అష్టవర్షాత్‌ భవేత్కన్యా నవవర్షాతురోహిణీ। దశవర్షా భవేద్గౌరీ అతఊర్ధ్వంరజస్వలా॥ – అష్టవర్షా-యెనిమిది సంవత్సరములది – కన్యా-కన్యయనేనామముగలది – భవేత్-అయ్యీని – నవవర్షాతు-తొమ్మిదిసంవత్సరములదైతే – రోహిణీ-రోహిణియనేనామముగలది – భవేత్-అయ్యీని – దశవర్షా-పదిసంవత్సరములుగలది – గౌరీ-గౌరియనేనామముగలది – భవేత్-అయ్యీని – అతఊర్ధ్వం-ఇటుతరువాతను – రజస్వలా-రజస్వలయనేనామముగలది – భవేత్-అయ్యీని అని చెప్పబడియున్నది – యింతేకాకుండా యీవయస్సులుగల కన్యలను దానమిచ్చినవారికి గలిగే లోకాంతరప్రాపులుకూడా ఈ దిగువనువచ్చే వచనమందు వివరించబడి యున్నవి యేలాగంటే – గౌరీందదన్నాకపృష్ఠం వైకుంఠంయాతిరోహిణీం। కన్యాందదద్బ్రహ్మలోకం రౌరవంతురజస్వలాం॥ – దీనికి – గౌరీం-పదిసంవత్సరముల దానిని – దదత్-ఇచ్చినవాడు – నాకపృష్ఠం-స్వర్గలోకమును యాతి-పొందుచున్నాడు – రోహిణీం-తొమ్మిదిసంవత్సరముల దానిని – దదత్-ఇచ్చినవాడు – వైకుంఠం-విష్ణులోకమును – యాతి-పొందుచున్నాడు – కన్యాం-ఎనిమిదిసంవత్సరముల దానిని – దదత్-ఇచ్చినవాడు – బ్రహ్మలోకం-చతుర్ముఖలోకమును – యాతి-పొందుచున్నాడు – రజస్వలాం-రజస్వలను – దదత్-ఇచ్చినవాడు – రౌరవ-రౌరవమనేనరకమును – యాతి-పొందుచున్నాడని అర్థమౌచున్నది – ధర్మశాస్త్రములయందు ఈ రీతిగా నిర్ణయించబడి యున్నందువల్ల చిన్నదానికి పదిసంవత్సరముల లోపలనే వివాహముచెయ్యడము బ్రాహ్మణజాతమునకు విధ్యుక్తమయినదిగానే యున్నది – ఈ ప్రకారము వివాహము చెయ్యడములో చిన్నది ఏ పురుషుణ్ణి అయినా వరించడమునకు అవకాశము లేనందున వధూవరస్థితి అనగా చిన్నవాణ్ణి చిన్నదిన్ని చిన్నదాన్ని చిన్నవాడున్ను వరించినఫలమును పొందేస్థితి అనిన్నీ ఇదే వివాహస్థితి అనిన్ని చిన్నదానికి పూర్ణవయస్సు వచ్చిన మీదటగాని ఇటువంటిస్థితి ఘటనపడదనిన్ని నిశ్చయము చెయ్యడమునకు అనుకూలముగా నున్నది కాదు.

౬ – మరిన్ని – సర్వేషామేవవర్ణానాంకన్యాదానం సదష్టమే। ఆతిరిక్తస్తుయఃకాలశ్చోదనామాత్రమేవతత్॥ సర్వేషాం-సమస్తములైన – వర్ణానాం-వర్ణములవారికి – యఃకాలస్తు-ఏకాలమయితే – అతిరిక్తః-ఎనిమిది సంవత్సరములకు అతిక్రమించినదో – తత్-ఆ అతిక్రమణము – చోదనామాత్రమేవ-చెప్పడముమాత్రమేగాని – అష్టమే-యెనిమిదో సంవత్సరమందు – కన్యాదానం-కన్యాదానము చేసేదే – సత్-మంచిది అని చెప్పబడియున్నది – ఇందువల్ల అన్నిజాతములయందున్ను చిన్నదానికి ఎనిమిదో సంవత్సరమందే వివాహము చెయ్యడము యోగ్యముగా నుంటుంది – అష్టవర్షాభవేత్కన్యా అనే ఆ న్యాయముచేతను ఎనిమిదిసంవత్సగముల చిన్నదానికే కన్యాత్వము రూఢియై యున్నది గనుక అటువంటి చిన్నదాన్ని దానమిస్తే అది పూర్ణకన్యాదానమే అనిపించుకుంటుంది గాని దీన్ని అపూర్ణకన్యాదానమని చెప్పడమునకు న్యాయము లేదు.

౭ – బాల్యమందు వివాహములయిన వారిలోనున్ను కొందరు చాలా సంవత్సరముల మట్టుకు ఆ వధూవరస్థితికి విచ్ఛిత్తు సంభవించకుండా సజీవులై యుంటూ వచ్చినారు రజస్వలలైన కన్యలకు వివాహములు జరిగినసంగతులలోనున్ను ఒకానొకచోట వివాహమందే పెండ్లికుమారునికి రుగ్మతి వచ్చి హానికలుగుతూ వచ్చినది గనుకనున్ను – తేనవినా తృణాగ్రమపి నచలతి – తేనవినా-ఆసర్వేశ్వరుని చేత తప్ప – తృణాగ్రమపి-గరికెకొన ఐనప్పటికిన్ని – నచలతి-చలించదని చెప్పబడియున్నది గనుకనున్ను కర్మానుగుణముగా సంభవించేవాట్లను తప్పించడమునకు ఎంత వారికయినా శక్యము కానేరదు అని తర్కించబడి యున్నది – అందుమీద నాకు తోచిన సంగతులను ప్రత్యుత్తరముగా వ్రాసి వారియొద్దికి చెన్నపట్టణమునకు పంపించి యున్నాను అందు ఆ అభిప్రాయము కొన్ని దృష్టాంతరములతో ఈదిగువను వాయడమౌచున్నది.

౧ – సదరహీ ప్రశ్నరూపకమయిన లిఖతములోని కొన్నిసంగతులు యుక్తియుక్తముగా నున్నందుకు సంతోషించినామని ఉత్తరము తాలూక్ ఒకటో పేరాలో వ్రాయించినారు కాని అందులోనుండే సంగతులన్నీ మీ ఆలోచనలో తేబడగలందులకే వ్రాయబడ్డవి గనుక అవి ఆలోచనలోనుంచినట్టు సదరు జవాబులో ఎక్కడ వ్రాయించబడి యుండనందున కొన్నిసంగతులు బాగాఉన్నట్టు వ్రాయించినందుకు సంతోషించే అవకాశము నాకు కలుగకుండా నున్నది – ఒకటి – మరిన్ని దంపతులుగాబొయ్యే్వారి పరస్పరేచ్ఛ గాంధర్వవివాహమునకు మాత్రమే ఒప్పియున్నదిన్ని చతుర్వర్ణములవారు ఆ వివాహముజరిగించడము లేదనిన్ని – రెండు – ఈ వర్ణములవారు జరిగించే వివాహములు పరస్పరేచ్ఛను అనుసరించి చెయ్యడము లేదనిన్ని – మూడు – పూర్వము కొందరు రాజులు స్వయంవరములను జరిగిస్తూ వచ్చినారున్ను అందుకు భిన్నముగా కొందరు రాజులు మత్స్యయంత్రము మొదలైనవి ఏర్పరచి వాటిని సాధించినవారికి తమపుత్రికలనిచ్చి యున్నందున చిన్నదాని ఇచ్ఛను ముఖ్యమని యెంచేవల్ల లేదనిన్ని అవి సర్వత్ర అంగీకరించబడ్డ మర్యాదలు కావనిన్ని ప్రతిజ్ఞలనుగురించి సీతాదేవి మొదలయినవారి విగ్రహప్రశంసలు దృష్టాంతములై యున్నవనిన్ని – నాలుగు – పుత్రికలకు తగిన మనుములను విచారించడము తలిదండ్రుల ఉద్యోగమేననిన్ని చిన్నది ఒక చిన్నవాణ్ణి వరించిన పక్షమందు ఆవిడె ఆ చిన్నవానికి శేషమయినట్టు ఎంచతగియుంటుందిన్ని యే హేతువు చేతనైనా ఆ వివాహము కాకపోతే అది చిన్నదాని యోగ్యతకు న్యూనతగా ఎంచబడుతుందనిన్ని వ్రాయించినారు – ఒకటి – భార్యాభర్తలయ్యేవారి పరస్పరేచ్ఛ గాంధర్వవివాహమందు మాత్రమే కాకుండా బ్రాహ్మాది వివాహములయందున్ను అవశ్యమే ఐయున్నది – అది విధిఐయున్నందుకు క్రమముగా జరిగే వివాహములయందు మదర్థం వరం వృణీధ్వం అని – మదర్థం కన్యాం వృణీధ్వం అని పాణిగ్రహణమునకు ముందు చిన్నదానిచేత చిన్నవానిచేత చెప్పించే ఆచారమే దృష్టాంతమై యున్నది – రెండు – ఇప్పట్లో బ్రాహ్మణులున్ను తతిమ్మా మూడువర్ణములవారిలో చాలామట్టుకున్ను చిన్నదానియొక్క – చిన్నవానియొక్క పరస్పరేచ్ఛను కనిపెట్టే ఆచారమందు గౌరవముంచక దాన్ని వదిలిపెట్టినందుననే ఈ ప్రశంస జరిగించవలసి వచ్చినది – మూడు – ఒకరి అనుమతికి నిరీక్షించకుండా చిన్నది తనకు తానే పురుషుణ్ణి వరించడము స్వయంవర మనిపించుకుంచున్నది – కాని పూర్వము కొందరు రాజులు నిర్ణయించినారన్న స్వయంవరమందు చిన్నదానికి తలిదండ్రుల అనుమతి అదివర కే ఇవ్వబడియుంటుంది చిన్నదాన్ని ఇవ్వడముగురించి నిర్ణయించబడ్డ ప్రతిజ్ఞను నేరవేర్చి ఆ చిన్నదాన్ని గ్రహించడము వీర్యశుల్కలబ్ధమని చెప్పబడుచున్నది – వీర్య మనగా బలమునకు పరాక్రమమునకు అర్థమౌచున్నది – శుల్కమనగా-ఓలి – ఇది వివాహము కాబొయ్యేటప్పుడు చిన్నదానికి చిన్నవాడిచ్చే సొత్తు – వీర్యశుల్క మనగా – చిన్నవానియొక్క బలపరాక్రమములే చిన్నదానికిచ్చేసొత్తుకు ప్రతినిధిగా గలది యనిపించుకుంచున్నది – సీతాదేవియొక్క వివాహసంగతియందు తండ్రిఐన జనకచక్రవర్తి తమకు వివాహము చెయ్యవలెననే సంకల్పము కలవాడైనట్టు తెలిసి ఆమె శివధనుస్సు ఉంచియుండేశాలను అలంకరిస్తామనే నెపముమీదను ఆ ధనుస్సును సాధారణముగా తీసి అవతల ఉంచినందున జనకచక్రవర్తి అమ్మవారి అభిప్రాయమును గ్రహించి ఆ విల్లు ఎక్కుబెట్టిన పురుషునకు తనకొమార్తెనిస్తానని ప్రతిజ్ఞ చేసినట్టు గ్రంధములవల్ల తెలియబడుచున్నది – శ్రీరామస్వామివారు ఆమెను వివాహము చేసుకోవడమునకు ఇచ్ఛగలవారైనందుననే ఆ ధనుస్సును ఎక్కుబెట్టడమునకు దర్ఖాస్తు చేసినారు – ద్రౌపదీ వివాహ సంగతియందున్ను ఆమె శక్తినిన్ని అభిప్రాయమునున్ను తండ్రి గుర్తెరిగి మత్స్యయంత్ర మేర్పరచి అదిబడవేసిన పురుషునకు తనకొమార్తెను ఇస్తానని ప్రతిజ్ఞ చేసినాడు అందునగురించి రాజులు మొదలయినవారు వచ్చినప్పుడు ఆ పరీక్ష ఆమె కన్నులను చూచుకునే నిమిత్తము ఉన్నతమైన మంటపమేర్పరచి ఆమెను అందుమీదఉంచి యేయే రాజులపేర్లు ఆమెకు తెలియచేస్తూ వారి ప్రయత్నములను ఆమెకు కనుపరుస్తూ నుండేలాగున ధృష్టద్యుమ్నుణ్ణి నిర్ణయించినట్టు గ్రంధములవల్ల కనుపడుతున్నది – ఇందువల్ల కొమార్తెల అభిప్రాయములునున్ను శక్తులనున్ను తండ్రులు గర్తెరిగే ప్రతిజ్ఞలు ప్రకటనచేస్తూ వచ్చినట్టు కనపడుతున్నది గనుక వీర్యశుల్కములను స్వయంవరములను కన్యలకుఉండేహక్కును యోజించే రాజులు జరిగించినట్టు తెలియతగియున్నది – నాలుగు – పుత్రికలకు తగినమనుములను విచారించవలసిన ఉద్యోగము తలిదండ్రులదిగా నున్నదనడము న్యాయమే ఐయున్నది – కాని పుత్రులకుకూడా తగిన కన్యలను సాధ్యమైనంత మట్టుకు ఘటన పరచడమున్ను వారికి అవశ్యమే ఐయున్నది – ఇందువల్ల తలిదండ్రులు కొమార్తెలయొక్కగానీ కుమారునియొక్కగాని అభిమతమును అనుకూలమైన మార్గములచేత ముందుగా కనుక్కో వలసినది జురూరై యున్నది అటువంటి అభిమతమును వారు ఆదరించిన్ని విమర్శించిన్ని అది యుక్తముగా తోచని పక్షమందు చిన్నవాండ్లకు బోధించి ఆ ఇచ్ఛను మానిపించవలసినదిన్ని అదియుక్తమయినదిగా తోచినపక్షమందు ఆ వరము ఘటనపరచడమునకు తగినయత్నములు చెయ్యవలసినదిన్ని వారికి ముఖ్యమైనవిధియైయున్నది, చిన్నవాండ్లయొక్క అభిమతములను కనిపెట్టకగాని కనిపెట్టిన్ని ఆదరించకగాని తలిదండ్రులు వివాహములుచేసిన అనేకసంగతులలో అట్లా వివాహము చెయ్యబడ్డవారి దాంపత్యము విసంచుకావడమేకాకుండా వారికి చాలా తొందరలున్ను ఆపదలున్ను అపకీర్తులన్ను సంభవిస్తూ వచ్చినవి – ఈ సంగతి లోకమందు సర్వత్రా తెలిసేయున్నది గనుక దంపతులు కాబొయ్యేవారి పరస్పరేచ్ఛ ముఖ్యమైనది కాదనడమునకు న్యాయము లేదు – ఐదు – చిన్నదానికి ఒక చిన్నవానియందు ఇచ్ఛగలిగిన మీదట అందునగురించి ప్రయత్నము చెయ్యగా కార్యము ఘటన పడకపోయిన పక్షమందు ఆ ఇచ్ఛ మళ్ళించతగ్గదే ఐయుంటుందిగాని యింత మాత్రముచేత చిన్నది చిన్నవానికి శేషముకానేరదు శుక్రుని కుమార్తె దేవయాని బృహస్పతి కుమారుడైన కచుణ్ణి వివాహము చేసుకోవలెనని కోరినయెడల అందుకు ఆచిన్నవాడు ఒప్పకపోయినట్టున్ను అందుమీద ఆచిన్నవానికి ఆమె శాపమిచ్చినట్టున్ను ఆమెకు ఆచిన్నవాడు తిరిగీ శాపము ఇచ్చినట్టున్ను తరువాత ఆమె మరి ఒకరిని వివాహము చేసుకున్నట్టున్ను పూర్వకథయందు చెప్పబడియున్నది – స్వయంవరములో చిన్నది చిన్నవాని కంఠమందు పుష్పమాలిక యుంచినమీదట ఆ చిన్నది ఆచిన్నవానికి శేషమయినదని చెప్పవచ్చును వీర్యశుల్కమందు చిన్నవాడు ప్రతిజ్ఞను నెరవేర్చగా చిన్నది చూచి ఆ ప్రతిజ్ఞ ఆ చిన్నవానిచేత నేరవేర్చబడ్డదని ఒప్పుకున్న పక్షమందు అప్పుడు ఆ చిన్నది ఆ చిన్నవానికి శేషమయినట్టుగా చెప్పవచ్చును – ఇప్పట్లో జరిగే వివాహములలో రజస్వలయైన చిన్నదాని వివాహమందు పాణిగ్రహణమయితేనేతప్ప చిన్నది చిన్నవానికి శేషమయినట్టుగా నెంచవలసిన పనిలేదు – చిన్నదాన్ని చిన్నవాడున్ను చిన్నవాణ్ణి చిన్నదిన్ని అంగీకరించడమునకు అనుకూలించినమీదట సాధ్యమైనమట్టుకు ఆవశ్యకులైనవారు కూడియున్న సమయములో ధర్మమందున్ను అర్థమందున్ను కామమందున్ను నీతో సమభోగినినికావలెనని కొరియున్నాననన్ని భగవంతుడు సాక్షిగా నేను నీసొత్తు ఔచున్నాను గనుక నన్ను పరిగ్రహించి ఏలుకోవలసినదనిన్ని చిన్నది వచించి తనచెయ్యి తన తలిదండ్రులయొక్క హస్తములకుండా చిన్నవానిచేత నుంచడమున్ను వారు చిన్నది ఇక నీసొమ్మేనని వచించి తమచేతులలోనుంచి ఆ చెయ్యి వదలడమున్ను ధర్మార్థకామములయందు నిన్ను అతిక్రమించి నేను యేమిన్ని జరిగించవలసినది లేదనిన్ని భగవంతుడు సాక్షిగా ఇందుకు ఒప్పుకొన్నాననిన్ని పురుషుడు వచించి ఆ చెయ్యి గ్రహించి కన్యకు మంగళసూత్రము కట్టడమున్ను పాణిగ్రహణమనిపించుకుంచున్నది – ఇదే కన్యాదానమును చెయ్యడమున్ను కన్యాదానమును అంగీకరించడమున్ను – ఇదే వధూవరస్థితిని పొందడము – ఇదే వివాహము – గనుక ప్రస్తుతకాలములో దీనికి పూర్వము చిన్నది చిన్నవానికి శేషము కానేరదు – ఇచ్ఛామాత్రము చేతనే ఒకరికి ఒకరు శేషమైనట్టు ఎంచడము న్యాయము కాదు – ఇచ్ఛ అనగా ఫలాని చిన్నవాడు యుక్తముగా నున్నట్టు కనుపడుతున్నాడు – ఈ చిన్నవాణ్ణి వివాహము చేసుకుంటే అనుకూలముగా నుంటుందని ఎంచడము సాధారణమయిన ఇచ్ఛ ఇందుమీద తన తలిదండ్రులు ఆ ఇచ్ఛను గ్రహించి పసందు చేసినట్టున్ను తదనంతరము ఆ చిన్నవాడు తనను వివాహము చేసుకోవడమునకు అభిమతము గలవాడైనట్టున్ను అతని అభిమతమునకు అతని తలిదండ్రులు ఒప్పుకున్నట్టున్ను చిన్నదానికి తెలిసిన మీదట ఆ ఇచ్ఛ దృఢమైన దౌచుంది – ఈ ప్రకారము దృఢమైన దైనప్పటికిన్ని పాణిగ్రహణమయితేనేగాని ఆ ఇచ్ఛకు సిద్ధిలేదు – ఒకానొకచోట సదరహీ ప్రకారము ఇచ్ఛ దృఢమయిన మీదట ప్రధానము చేస్తారు గాని తరువాత ఏ హేతువు చేతనైనా ఆ వివాహము కాదని రూఢి ఐన పక్షమందు అప్పటికితగిన చిన్నవాణ్ణి ఆ చిన్నదానికి వివాహము చెయ్యడము సాధారణమే ఐయున్నది – ఇప్పట్లో చిన్నదానికి యుక్తవయస్సు వచ్చినమీదట వివాహము చేసే మర్యాదగలవారిలో చిన్నదాన్ని చిన్నవాడున్ను చిన్నవాణ్ణి చిన్నదిన్ని గుర్తెరిగియున్న సంగతులయందు వివాహముయొక్క విషయము గుర్తెరిగి యున్నటువంటిన్ని పరిశీలనబుద్ధి గలిగినటువంటిన్ని తలిదంద్రులు సదుపాయముగా చిన్నదాని అభిప్రాయమును కనుక్కుని తరువాత అవతలివారి తాత్పర్యమును తెలుసుకునే ప్రయత్నమును చెయ్యడమున్ను కలదు. సదరహీ ప్రశ్నతో చేరిన లిఖతములో వివాహమునకు ప్రధానములయిన సంగతులు అనగా చిన్నదానియొక్క చిన్నవానియొక్క పరస్పరేచ్ఛ మొదటిదిన్ని ఆ ఇచ్ఛ యుక్తమైనదేమోననే విమర్శమీద వారి తలిదండ్రులు దాన్ని అంగీకరించడము రెండోదిన్ని తగినవారు కూడి వధూవరులు కావడమునకు చిన్నదానికి చిన్నవానికి ఉండే ఇచ్ఛను సిద్ధించినదిగా రూఢిపర్చదగిన కార్యమనగా పాణిగ్రహణము చేయించడముచేత ఆ వధూవరత్వమును దృఢపర్చవలసింది మూడోదిన్ని ఐయున్నవిన్ని ఇంతకుతప్ప వివాహమునకు అవశ్యకార్యములు లేవనిన్ని వ్రాసియున్నాను గాని చిన్నదానియొక్క చిన్నవానియొక్క పరస్పరేచ్ఛ మాత్రమే వివాహమునకు చాలునని నేను వ్రాయలేదు – ఈలాగున నుండగానున్ను చిన్నదానియొక్క చిన్నవానియొక్క పరస్పరేచ్ఛ గాంధర్వ వివాహమునకు మాత్రము అవశ్యమని వ్రాయించడమువల్ల నేను వ్రాసియున్న సంగతులు పూరాగా ఆలోచనలో తేబడలేదని కనుబడుతున్నది ఏ ఏ కార్యమునకయినా ముఖ్యకారణమున్ను ఇతర కారణములున్ను కలిగియుండడము సహజమయ్యే ఉన్నది – వస్త్రమునకు నూలు ముఖ్యకారణమున్ను నేసేవాడు మగ్గపు సామాను మొదలయినవి ఇతర కారణములున్ను ఐయున్నవి ఇందులో ప్రధానమయిన కారణమేదో అనంతర కారణములేవో కనిపెట్టవలసినది ఆవశ్యకమై యున్నది – ఈ సంగతిలో నూలు ప్రధానకారణమయి యున్నది – ఘటమునకు మృత్తు ఇటువలెనే ప్రధానకారణమున్ను కుమ్మరవాడు కుమ్మరసారె మొదలయినవి ఇతర కారణములున్ను ఐయున్నవి గనుక వివాహమునకున్ను అటువలెనే చిన్నదానియొక్క చిన్నవానియొక్క పరస్పరేచ్ఛ ప్రధానకారణమున్ను తతిమ్మావి అనంతర కారణములున్ను ఐయున్నవి ఈ లాగుననున్న హేతువుచేతనే వివాహములయందు పాణిగ్రహణమునకు ముందు చిన్నదానిచేతనున్ను చిన్నవానిచేతనున్ను మదర్థంవరంవృణీధ్వం మదర్థంకన్యాంవృణీధ్వం అనేమంత్రములు మధ్యవర్తుల యెదుట చెప్పించడము ఆచారమయి యున్నది గనుక – ఈ ప్రకారము మంత్రములు చెప్పించుచూనుండిన్ని వీటి ఉద్దేశమునకు విరోధముగా బాలికలకే వివాహములు చెయ్యడము పూర్వాచారమునకు భిన్నముగా నున్నట్టున్ను మంత్రము ఒకదోవగానున్ను నడువడి మరియొకదోవగానున్ను ఉన్నట్టు తేటపడుతున్నది.

౨ – వివాహములో పాణిగ్రహణమునకు ముందు చెప్పించే సదరు మంత్రములకు నా కొరకు పురుషుణ్ణి వరించవలసినదనిన్ని నా కొరకు కన్యను వరించవలసినదనిన్ని అర్థమౌచున్నట్టున్ను ఇంతకు మించి ఈ వాక్యముల నన్వయించడమునకు అవకాశ మగుపడనట్టున్ను సదరు ఉత్తరముయొక్క రెండవ పేరాలో మీరు వ్రాయించి యున్నారు అందువల్ల ఏ పురుషుణ్ణి వరించవలసినదిన్ని ఏ కన్యకను వరించవలసినదిన్ని స్పష్టమున్ను కాలేదు – సంధికి వెళ్ళేమనిషే చిన్నవాణ్ణి వరించేపక్షమందు చిన్నదానికోరికకు ఫలము లేకపోతుంది సంధికి వెళ్ళేమనిషే చిన్నదాన్ని వరించేపక్షమందు చిన్నవానికోరికకు ఫలము లేకపోతుంది గనుక అట్లా అర్థము చెయ్యడమువల్ల ఈ వాక్యములు సార్థకములు కాకపోతవి – గంగాయాంఘోషః అన్నప్పుడు గంగయందు గొల్లపల్లె అని అందులోని పదముల అర్థమయినప్పటికిన్ని అట్లా అర్థము చెయ్యడమునకు వల్లకాదు గంగాయాంఘోషః అన్నప్పుడు గంగఒడ్డుననున్న గొల్లపల్లె యని అర్థము చేస్తే ఈవాక్యము సార్థకమౌచున్నది వరించిన వాణ్ణి అని అర్థము ఉన్నది – వరించిన వాడనగా వివాహము చేసుకున్నవాడని అర్థమువస్తుంది అప్పటికి వివాహము లేకుండా ఉన్నందున ఆ అర్థము ఉపయోగించదు గనుక వరం అనగా తనను మోహించినటువంటి ఫలాని చిన్నవాణ్ణి అని అర్థము చెయ్యవలసి యున్నది – ఐతే యే పదమున్ను ఆకాంక్ష సహితమైనప్పుడు గాని దాని యొక్క ప్రయోజనము తేటపడదు ఆకాంక్ష అనగా ఆశంక ఇక్కడ ఎవరిని మోహిస్తున్నవాడనేది ఆకాంక్ష అందువల్ల ఫలానివారిని మోహిస్తున్నవాడనేది ఉత్తరము వస్తుంది అప్పుడాపద ప్రయోజనము స్పష్టమౌచుంది కాని మరియొకరిని మోహిస్తున్నవానితో నిక్కడ ప్రయోజనము లేదు గనుక తనను మోహిస్తున్నవాడని విశదమౌచున్నది – మదర్థం కన్యాం వృణీధ్వం అన్నప్పుడు కన్యను అనేపదమునకు ముందునున్ను మోహించియున్నటువంటి అనే విశేషణము అధ్యాహారముచేత వస్తున్నది – అవశ్యమయినపదము ఉదాహరించబడి యుండక పోయినప్పటికిన్ని గ్రంధసమయమునుపట్టి ఆ పదము తెచ్చుకోవడము అధ్యాహారమనిపించుకుంటున్నది – గనుక నన్ను మోహించియున్నటువంటి ఫలాని చిన్నదాన్ని అని సాధారణముగా అర్థము వస్తున్నది – ఇంతేకాదు సదరు వాక్యములకు ఏలాగున అర్థము చేసినా వాటివల్ల చిన్నదానియొక్క చిన్నవానియొక్క పరస్పరేచ్ఛ ప్రధానమని ఎంచడము విధిగా కనపడుతున్నది గనుక చిన్నదానిచేత మోహింపబడి యున్నటువంటిన్ని చిన్నదాన్ని మోహించియున్నటువంటిన్ని చిన్నవాడు వరుడని చెప్పవలసినదిగాని తలిదండ్రులు కుదిర్చినారన్న చిన్నవాణ్ణి చిన్నది పసందు చేసే మట్టుకు వరుడని చెప్పేవల్లలేదు అటువంటి చిన్నవాణ్ణి చిన్నదికూడా అంగీకరించిన పక్షమందు వరుడని చెప్పవచ్చును – ఆ పక్షమందు కన్యావరుల పరస్పరేచ్ఛ ముఖ్యమయినదిగానే తేటపడుతుంది – కాబట్టి తలిదండ్రులచేత కుదర్చబడ్డ చిన్నవాడై నప్పటికిన్ని చిన్నది పసందు చెయ్యని చిన్నవాణ్ణిగురించి ఇటువంటి మత్రము చిన్నదానిచేత చెప్పించడమునకు న్యాయము లేదు – మదర్థం వరం వృణీధ్వం మదర్థం కన్యాం వృణీధ్వం అనేమంత్రములు చిన్నది రజస్వలయైన మీదట వివాహము చేసే మర్యాదను అనుసరించి దంపతులు కాబొయ్యే వారి పరస్పరేచ్ఛ ప్రధానముగా ప్రకటనచేస్తూ ఉన్న వైనందున ఆ మర్యాదకు భిన్నముగా చెయ్యబడే వివాహమునకు ఉపయోగమయ్యే లాగు వాటికి అర్థము చేసేవల్ల యుండదు.

౩ – స్త్రీలకు స్వతంత్రత లేదని కనుపరచడమునకు మీరు ఉదాహరించిన శ్లోకములలో పితారక్షతీత్యాది శ్లోకములో కౌమారమందు తండ్రిన్ని యౌవనమందు భర్తనున్ను వార్థక్యమందు కుమారుడున్ను సంరక్షకులై యుంటారనిన్ని – స్త్రీ – స్వాతంత్ర్యమును పొందతగదనిన్ని మహిష్యామిత్యాది కన్యకాదాన పర్యంతమిత్యాది – రెండు శ్లోకములయందు కన్యాదానపర్యంతము కన్యతండ్రివశమేఅనిన్ని తరువాత పెనిమిటి వశమనిన్ని స్త్రీలకు ఎప్పుడూ స్వాతంత్ర్యము లేదనిన్ని చెప్పబడి యున్నందున స్త్రీలు వారి సంరక్షణనుగురించి స్వాతంత్ర్యమును పొందతగదని స్పష్టమౌచున్నది గాని తగినపురుషుణ్ణి వివాహము చేసుకోవలెనని వారు యిచ్ఛయించకుండా ఆతంకమైన అభిప్రాయమేమిన్ని సదరు శ్లోకమందు కలిగియుండ లేదు విశేషించి పితారక్షతీత్యాది శ్లోకములో యౌవనకాలమంతా పెనిమిటి రక్షకుడుగా ఉంటాడని కనుపడుతున్నందున స్త్రీకి భర్తృవియోగము వచ్చిన పక్షమందు యౌవనమున్ని మట్టుకు పునర్వివాహ యోగ్యత కలిగియుండిన సంగతి సూచించబడుతున్నది ఐతే ఆ పద్ధతి పూర్వము రద్దు పరచబడియున్నది చిన్నదానికి పూర్ణవయస్సు వచ్చినతరువాత వివాహము చేసే ఆచారమును బ్రాహ్మణులు దరిమిలాను మట్టుపరచి తదనంతరము బాలికలకే వివాహములు చెయ్యడమునకు నిర్ణయించుకున్నయెడల గర్భాధానమయ్యేలోపల పెనిమిటి చనిపోయిన పక్షమందు ఆ చిన్నదానికి పునర్వివాహము జరిగేలాగు నిర్ణయించబడ్డది – ఆ నిర్ణయము ప్రకారము జరుగుతూనుండగా ఆ పునర్వివాహ యోగ్యతయున్ను ఇటు తరువాత ఒక పురుషుడు నిషేధించియున్నందున గర్భాధానమయ్యే లోపల పెనిమిట్లు చనిపోయిన బాలికలు యౌవనమువచ్చిన నాటనుంచీ సదరు శ్లోకములలో నిషేధించబడ్డ స్వాతంత్ర్యమునున్ను సంరక్షించే పెనిమిటిలేని దుఃఖములనున్ను పొందుతూనే ఉన్నారు.

౪ – సదరు ఉత్తరముయొక్క నాలుగవ పేరాలో బ్రాహ్మణ భేదములవారిలో నెవరున్ను పూర్ణవయస్సు వచ్చిన కన్యకు వివాహము చెయ్యడము లేనందున పూర్ణవయస్సు రాని చిన్నదానికే వివాహము చేసే మర్యాద బ్రాహ్మణులలో ఇటీవల ఏర్పరచుకోబడ్డ దనడమునకు సబబు లేదన్ని చిన్నది ఋతుమతి యైనమీదట వివాహము చెయ్యవలసినట్టు ధర్మశాస్త్రమందు వచించబడి యున్నందున సదరు మర్యాదను దరిమిలాను నిర్ణయించుకున్నట్టు ఊహించబడి యుండవచ్చుననిన్ని బోధాయనస్మృతి తాలూక్ త్రీణివర్షాణ్యృతుమతీత్యాది వచనమును మరియొక గ్రంధము తాలూక్ కన్యాద్వాదశకేవర్ష ఇత్యాదివచనమున్ను క్షత్రియులలో పూర్వము జరిగించబడ్డ స్వయంవర వివాహముల విషయమై యేర్పరచబడ్డట్టు స్పష్టమౌచున్న దనిన్ని బ్రాహ్మణకన్యలకు ఎనిమిది మొదలుకొని పదిసంవత్సరముల మట్టుకు మాత్రమే వివాహయోగ్యకాలమైనట్టు దశైకోనాష్టవర్షాతిత్యాది వచనమందు విధించబడియున్నదనిన్ని వ్రాయబడియున్నది బ్రాహ్మణ భేదములవారెవరున్ను ఇప్పట్లో ఋతుమతియైన కన్యకు వివాహము చేసేమర్యాద లేక పోవడము పూర్వమందు సదరు ఆచారము జరిగియుండకపోయినట్టు ఎంచడమునకు ఆధారము కానేరదు – బ్రాహ్మణులుయందు మిశ్రులలో కొందరు రజస్వలలైన కన్యలకే వివాహములు చేసే మర్యాద యున్నట్టు తెలియబడుతున్నది కాని బాలికలకే వివాహము చేసేపద్ధతి దరిమిలాను ఏర్పరుచుకున్నట్టు ఎంచడమునకు అది ఆధారమని నా తాత్పర్యము కాదు – ప్రతిష్ఠగల వర్ణములవారికన్యలకు తలిదండ్రులు ఏర్పరచిన పురుషులను పసందు చేసేయెడలనేమి ఆలాగున తగినపురుషులు ఘటనపడనియెడల తమకుతామే అనుకూలముగాతోచినవారిని వివాహమునకు ఏర్పరుచుకోవడమునకేమి సర్వత్ర కలిగియున్నటువంటిన్ని ధారాళముగా కొంతకాలముకిందటివరకు జరిగినటువంటిన్ని ఇప్పటికిన్ని కొందరియందు చెల్లుతున్నటువంటిన్ని హక్కును యోజించి పూర్ణవయస్సువచ్చినకన్యలకు వివాహము చెయ్యడము యోగ్యమని వ్రాసియున్నాను – చిన్నదానికి పూర్ణవయస్సు రాకమునుపే వివాహము చేసేమర్యాద బ్రాహ్మణులు దరిమిలాను ఏర్పరచుకున్న సంగతి వాస్తవమైనందుకు పూర్వాచార ప్రకారము మదర్థంవరంవృణీధ్వమనేమంత్రవాక్యము చిన్నదానిచేత చెప్పించడమే చాలిన దృష్టాంతమై యున్నది – కన్యావరయతేరూపం – అనగా తాను వివాహము చేసుకోబొయ్యే పురుషుడు యోగ్యమయిన రూపము గలవాడుగా నుండవలెనని చిన్నది కోరుతుంది అనే వాడిక కలిగియున్నది – ఇందువల్లనున్ను పురుషుణ్ణి కోరేహక్కు కన్యకు కలిగియున్నట్టు తేటపడుతున్నది – చిన్నది ఋతుమతి కాకమునుపు ఇతరుల మాటలచేత ఇటువంటి కోరిక చిన్నదానికి కలిగియున్నప్పటికిన్ని ఋతుమతి యైనమీదట కలిగేకోరికగాని పూర్ణమైనదిగా చెప్పకూడదు – పెండ్లికుమారునియందేమి పెండ్లికుమార్తెయందేమి గుణసంపత్తి మొదలైనవిన్ని కోరతగియున్నవి బుద్ధిదార్ఢ్యమువచ్చినకన్య రూపమును మాత్రమే కోరదు రజస్వల యైనవెంటనే చిన్నదానికి తగిన బుద్ధిదార్ఢ్యము కలుగనేరదు, ఇందువల్ల బుద్ధిదార్ఢ్యము కలిగే లోపల ఆవిడె పసందు చెయ్యతగినపురుషుణ్ణి ఘటనపరచడమునకు తలిదండ్రులే బాధ్యతగలవారై యుంటారు గనుక అటువంటి పురుషులను విచారించి వారు అప్పట్లో చిన్నదానికి తెలియచెయ్యడమున్ను వారిలో ఫలానిపురుషుడు పసందుగా కనుపడుతున్నాడని చిన్నది తెలియచెయ్యడమున్ను అందుమీదట ఉభయులున్ను వితర్కించుకుని ఫలానిపురుషుడు పెండ్లికుమారుడు కావలసినదని నిర్ణయించుకోవడమున్ను మిక్కిలీ పసందైనటువంటిన్ని న్యాయమైనటువంటిన్ని పద్ధతి ఐయున్నది కాని తగినకాలములోగా అటువంటి పురుషుణ్ణి వారు ఘటనపరచలేకపోయిన పక్షమందు చిన్నదే అప్పటికి తగిన పురుషుణ్ణి యేర్పరచి వారికి తెలియచెయ్యడమున్ను వారు అందుకు అంగీకరించి వివాహము చెయ్యడమున్ను న్యాయమయి యున్నది – కుమారునకున్ను పూర్ణవయస్సు వచ్చినమీదట ఆ చిన్నవాని అభిప్రాయమును కనిపెట్టి తలిదండ్రులు వివాహము చెయ్యవలసినదిగాని అందుకు భిన్నముగా వివాహము చెయ్యకూడదు – యుక్తవయస్సువచ్చిన కుమారుడు స్వతంత్రముగానే తగినకన్యను కోరడమునకు లాయఖైయుంటాడు ఐనప్పటికిన్ని ఆ సంగతిలో అనుకూలమని తోచిన సలహాయివ్వడమునకు తలిదండ్రులున్ను తగియుంటారు ౧౬ సంవత్సరములకు యుక్తవయస్సు వస్తుందని కొందరంచున్నారు ౧౮ సంవత్సరముల వయస్సు యుక్తవయస్సు అనిపించుకుంటుందని కొందరు చెప్పుచున్నారు ఇది న్యాయమయిన అభిప్రాయముగా తోస్తున్నది గాని “ప్రాప్తేతు షోడశేవర్షే పుత్రం మిత్రవదాచరేత్‌” అనే న్యాయముచేత పదహారో సంవత్సరము వచ్చినప్పటినుంచీ కుమారుడు స్నేహితునివలెనే యెంచతగ్గవాడై యుంటాడు పూర్ణవయస్సు వచ్చిన కన్యలు గాని మొగచిన్నవాండ్లుగాని ఉన్న స్థలములయందు వీరిని వారున్ను వారిని వీరున్ను చూస్తూనుండడమునకు అనుకూలముగా నుండేపక్షమందు ఒకరి యోగ్యతలను ఒకరు క్రమముగా కనిపెట్టి వారివారికి పసందయిన వారిని వరించేదిన్ని కలదు – ఒకవేళ వారివారి జాతములయందుండే పూర్ణవయస్సువచ్చిన కన్యలున్ను పురుషులున్ను దూరముగా నుండడమువల్ల ఒకరినియొకరు చూడడము సంభవించకపోయినప్పటికిన్ని వినికిడిచేత వారివారి యోగ్యతలను బాగా తెలుసుకుని ఒకరిని యొకరు వివాహము చేసుకోవలెనని కోరడమున్ను కలదు రుక్మిణీదేవియొక్క వివాహప్రశంస చూడవలసినది ఆమెకు పూర్ణవయస్సు వచ్చియున్నప్పుడు శ్రీకృష్ణమూర్తివారి యోగ్యతలను వినికిడివల్ల చక్కగా తెలుసుకుని ఆయనను వివాహము చేసుకోవలెనని ఆమె కోరినట్టు ఈ దిగువనువచ్చే పద్యమువల్ల స్పష్టమౌచున్నది – తన తండ్రి గేహమునకుం జనుదెంచుచునున్న యతిథిజనులవలన కృష్ణుని రూపబలగుణాదులు విని కృష్ణుడు తనకు దగినవిభుడని తలచెన్‌ ఇటువంటి కోరిక కలిగియున్నట్టు తెలియబడుచూనుండగానున్ను ఆమెయొక్క పెద్దఅన్న ఐన రుక్మి వ్యవహార సమర్థుడైయుండి యీమె వివాహమునుగురించి తండ్రియొక్క అభిప్రాయమైనా తెలియగోరక ఆమెను తనకు విహితుడుగా నుండే శిశుపాలునకు వివాహము చెయ్యవలెనని యత్నము చేసినందున ఆ అభిప్రాయమును ఆమె గ్రహించి తండ్రియైనా అన్నయొక్క ఉద్దేశమును వారించలేక యున్నాడనియెంచి శ్రీకృష్ణమూర్తి వారియొద్దికి తమఅన్న యొక్క యత్నములను నిరసించి తమను వివాహము చేసుకోవలసినదని యొక బ్రాహ్మణునిచేత సమాచారము పంపించినది – ఐతే ఆ బ్రాహ్మణుడు అందుకు బదులు ఉత్తరము తీసుకొని వచ్చేలోగా రుక్మియొక్క ప్రయత్నము జరగడమునకు వ్యవధిలేకుండానున్నట్టు కనుపడ్డందున మిక్కిలీ వ్యసనముగలదై యీదిగువనువచ్చే పద్యములోనున్న ప్రకారము వచించియున్నది –
“పోడను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి వాసుదేవుడుం
రాడను నింక బోయి హరిరమ్మని చీరెడి యిష్టబంధుడుం
లేడను రుక్మికిం దగవు లేదిట చైద్యున కిత్తు నంచు ను
న్నాడను గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే డనున్.”
– ఈ పద్యములో రుక్మికిందగవులేదిట చైద్యునకిత్తునంచునున్నాడను అన్న వాక్యమందు రుక్మికి ఈ సంగతియందు న్యాయబుద్ధిలేక శిశుపాలునకు తమను వివాహము చెయ్యడమునకు సిద్ధపడియున్నాడని వచించియున్నది గనుక చిన్నదాని కోరికకు విరోధముగా వివాహము చెయ్యడము అన్యాయమయినట్టు కనుపడుతున్నది – రాజయిన తండ్రికి “పుత్రవద్దుహితాచ” అనే న్యాయముచేతను కుమారుడున్ను కుమార్తెయున్ను సమానులే ఐయున్నప్పటికిన్ని ఆయన రుక్మియొక్క దుర్యత్నమును మాన్పజాలకుండా నుండినందున ఆయనను అన్నతో చేరినవాణ్ణిగా ఎంచి వారికి అవమానము కలిగే మార్గము చేతనైనా తమకోరిక నెరవేరేలాగు ఆమె ప్రయత్నము చేసినట్టు కనుపడుచున్నది – తండ్రి యీమెకు జరిగించదలచిన వివాహము స్వయంవర వివాహముకాదు సాధారణ మైనవివాహమే ఐయున్నది గనుక ఇటువంటి వివాహమందున్ను ఏ చిన్నదియైనా స్వంతముగానే పురుషుణ్ణి యేర్పరుచుకో తగినహక్కు కలదైయున్నట్టు విశదపడుచున్నది – బోధాయనస్మృతి తాలూక్‌ వచనములో త్రీణివర్షాణ్యృతుమతీ కాంక్షేత పితృశాసనం అనే వాక్యమునకు ఋతిమతియైన చిన్నది మూడుసంవత్సరములు వివాహము లేకుండా తండ్రియొక్క ఆజ్ఞయందుండవలసినదని అర్థముకాదు తండ్రియొక్క ఆజ్ఞను కోరవలసినదిగా వివాహము చేసుకోవడమునకు ఒకచిన్నవాణ్ణి అంగీకరించేయెడల తలిదండ్రుల ఉత్తర్వును పుచ్చుకోవలసినదని అర్థమౌచున్నది – యెందుచేతనంటే తాను వివాహము చేసుకోబొయ్యే పురుషునియొక్క గుణసంపత్తి మొదలయిన వాటిని పరిశీలించే సామర్థ్యము రజస్వల యైనవెంటనే చిన్నదానికి కలుగ నేరదు గనుకనున్ను తలిదండ్రులు అటువంటి సామర్థ్యము కలిగియుండి కొమార్తెయొక్క శ్రేయస్సును అపేక్షించి యుంటారు గనుక నున్నది వారు అంగీకరించిన పురుషుణ్ణేగాని చిన్నది పసందు చెయ్యకూడదని అభిప్రాయము కలిగియున్నది – ఇందువల్ల చిన్నది ప్రథమ రుతుస్నాతయై శుద్ధిని పొందినది మొదలుకుని చిన్నదానికి అనుకూలముగా నుండే పురుషుణ్ణి మూడు సంవత్సరములలోగా వారు ఎప్పుడు ఘటనపరచి వివాహముచేస్తే అప్పుడు వివాహము జరగవచ్చునని స్పష్టమైయున్నది – తతశ్చతుర్థేవర్షేతు విందేత సదృశం పతిం అనే వాక్యమునకు మూడుసంవత్సరములమట్టుకు తనకు తగిన పురుషుణ్ణి తలితండ్రులు కుదర్చలేక పోయిన పక్షమందు వారు కోరినంత యోగ్యత కల పురుషుడు ఘటనపడడము కష్టమని తెలుసుకుని సజాతీయులయందు ఘటన పడతగిన పురుషులలో యోగ్యుడని తనకుతోచినపురుషుణ్ణి ఏర్పర్చుకోవలసినది అభిప్రాయము కలిగియున్నది – ఇందువల్ల వారు కొమార్తెయొక్క అభిప్రాయమును అంగీకరించి కన్యాదానము చేస్తారని ఎంచతగియున్నది గాని అప్పుడైనా వారు దానము చెయ్యకుండా పాణిగ్రహణము కావడము న్యాయమని ఆ వాక్యమునకు అభిప్రాయము కాదు – ఇందువల్ల ఈ వచనపద్ధతులు ప్రతిష్ఠగల అన్నివర్ణములవారియందు సాధారణముగా జరిగే వివాహములకు ఉపయోగించతగ్గవి ఐయున్నవి గాని మీరు వ్రాసిన స్వయంవర వివాహములకు మాత్రమే ఉపయోగములైనవి కావు – కన్యాద్వాదశకేవర్ష ఇత్యాది వచనము రాజులు పూర్వము జరిగించినారన్న స్వయంవర వివాహముల విషయమైనదిన్ని కాదు – వారు సాధారణముగా జరిగించే వివాహమును గురించినదిన్ని కాదు – బ్రాహ్మణులకు వినాగా మరియొక జాతమునకు విధిఐనదిన్ని కాదు – ఎందుచేతనంటే ఆ స్వయంవరమునందు కన్య ప్రజ్ఞావతియై ఉండవలసినది అవశ్యమైయున్నది – స్వయంవరమునకు వచ్చే అనేక రాజులయొక్క చరితములు కన్య ముందుగా తెలుసుకునియుండి వారు సభతీర్చియున్న యెడల వారి పేర్లున్ను వారియోగ్యతలున్ను తెలిసియున్నయొక స్త్రీ వల్ల వింటూ వారి రూప వైభవములను క్రమేణ పరిశీలిస్తూ వీరిలో తనయిష్టము ఎవరియందు కలుగుతుందో ఆ రాజుయొక్క కంఠమందు పుష్పమాలిక యుంచడము న్యాయమయియున్నది గనుక కన్య ప్రజ్ఞావతియైయుంటే గాని యీకార్యము జరిగించనేరదు కన్యలు పదిహేనోసంవత్సరమందు రజస్వలలు కావడము సాధారణమై యున్నది – దేశభేదముచేతను పదమూడవ పదునాలుగవ సంవత్సరములోనున్ను కొందరు రజస్వలలు కావడము కలదు – మరిన్ని శరీరస్థితి భేదములచేత అంతకులోపలనున్ను రజస్వలలు అయ్యేదికద్దు – పన్నెండు సంవత్సరములలోపల రజస్వలలు అయ్యే కన్యలలో కొందరికి తరువాత కొంతకాలము మట్టుకు యౌవనావయవ వ్యక్తి కలుగడమే లేకయుండడమున్ను కలదు – అప్పట్లో వారు యౌవనవతులనిన్ని చెప్పబడరు – గనుక పన్నెండో సంవత్సరమందే చిన్నది ఋతుమతి యౌతుందనిన్ని యౌవనమతి ఔతుందనిన్ని నిశ్చయముగా అనడమునకు వల్లలేదు – క్షత్రియులు ఋతుమతియయిన చిన్నదానికే వివాహము చేసే ఆచారము సదా సాధారణముగా జరుగుతూ నున్నది – గనుక పన్నెండో సంవత్సరములోనే తప్పకుండా వివాహము జరిగించ వలసిన దనే విధి వారు సాధారణముగా జరిగించే వివాహములకైనా ఉపయోగమయినదిగా ఎంచేవల్లలేదు – ఇటువంటి విధి మరి ఏవర్ణము వారికిన్ని కలిగి యుండలేదు – చిన్నది రజస్వలయైనమీదట వివాహముచేసే ఆచారమున్ను ఋతుమతియైన తరువాత కొంతకాలమునకులోగా చిన్నదానికి అనుకూలముగా కనుపడే పురుషుణ్ణి తలిదండ్రులు కుదర్చలేకపోయిన పక్షమందు చిన్నది తానే అప్పటికి తనకు తగినవాడని కనుపడ్డ పురుషుణ్ణి ఏర్పరచి వారికి తెలియచేస్తే వారు కన్యాదానము చెయ్యడమున్ను ధారాళముగా జరుగుతూ నుండగా కొందరు బ్రాహ్మణులు ఈ ఆచారమును తమలో మట్టుపరచవలెననే ఉద్దేశము గలవారైనప్పుడు అంతటినుంచి వారిలో జరగగలందులకు ప్రధమతః ఏర్పరచబడ్డ వచనమైనట్టు తెలియతగియున్నది – ఎందుచేతనంటే అదివరకు ధారాళముగా జరుగుతూనున్న ఆచారమును సవరింపుచేసుకోవడమునకు దానికి కించిద్భిన్నమయిన పద్ధతి ఏర్పరిస్తేనేతప్ప చాలాభేదముగా నుండే పద్ధతి వెంటనే ఏర్పరిస్తే విపరీతముగా నుంటుందని యెంచి పన్నెండోసంవత్సరములో వివాహము చెయ్యకపోతే తండ్రికి భ్రూణహత్య వస్తుందనిన్ని ఆ చిన్నది తానే పురుషుణి ఏర్పరచుకోతగ్గది ఐయుంటుందనిన్ని సదరు శ్లోకము రచించబడ్డదిగాని పన్నెండో సంవత్సరములోనే వివాహసమయము మిగలబడుతుందనిన్ని ఆ చిన్నది తానే పురుషుణ్ణి ఏర్పరుచుకోవడమునకు తగిన సామర్థ్యము గలదై యుంటుందనిన్ని చెప్పేసంగతి నమ్మతగ్గదికాదు – దశైకోనాష్టవర్షాతిత్యాదిశ్లోకమందు పదియైనా తొమ్మిదియైనా యెనిమిదియైనా ఏండ్లుగల చిన్నది బ్రాహ్మణునిచేత వివాహము చేసుకోతగ్గది అనిన్ని అంతకంటే మిగిలిన యీడుగల చిన్నదాన్ని వివాహము చేసుకోవడము శాస్త్రోక్తమైనది కాదనిన్ని చెప్పబడియున్నందువల్ల పదిసంవత్సరములపై వయస్సుగల చిన్నదానిన్ని యెనిమిదిసంవత్సరములలోపలి వయస్సుగల చిన్నదానిన్ని బ్రాహ్మణులు వివాహము చేసుకోకూడదని నిషేధించబడ్డట్టు కనుపడుతున్నది కాని యీపద్ధతిని బ్రాహ్మణులు ముఖ్యముగా అనుసరించడము లేదు – ఏలాగంటే పన్నెండో సంవత్సరమువచ్చిన చిన్నదానికిన్ని స్తన్యపానముచేసే ఆడశిశువుకున్ను వారు వివాహములు చేస్తూనే యున్నారు – ఈ సంగతి సర్వత్ర తెలిసేయున్నది – బ్రాహ్మణవివాహములను గురించి సదరు శ్లోకపద్ధతే విధియైఉంటే యీలాగున జరిగించడమునకు హేతువు ఉండదు – వచనముల ఆధారములేనిది వారు యీలాగున జరిగిస్తున్నారని ఎంచవల్లలేదు – పన్నెండోసంవత్సరము వచ్చిన చిన్నదానికి వివాహము చెయ్యడమునకు సదరు కన్యాద్వాదశ కేవర్ష ఇత్యాదివచనమును ఇంకా కొన్నివచనములున్ను స్తన్యపానముచేసే ఆడశిశువుకు వివాహము చెయ్యడమునకు యావద్దోషం నజానాతితావద్భవతి కన్య కేత్యాది వచనములు కొనిన్ని యిప్పట్లో ఆధారములై యున్నవి. [1]ఒక అంశమునుగురించి యిన్నితరహాల వచనములు ఏలపుట్టవలెను వీటిపద్ధతులు బ్రాహ్మణ బాలికలకు ఒకబంధమై యున్నవి [2]వివాహవిషయమై తతిమ్మాబాలికలకు కలిగియుండే హక్కు బ్రాహ్మణబాలికలకు మాత్రమే లేకుండా నుండడమునకు తగిన సబబు కనుపడలేదు.

౫ – సదరు ఉత్తరముతాలూక్‌ ఐదోపేరాలో అష్టవర్షాభవేత్కన్యేత్యాది వచనమందు ఎనిమిదిఏండ్లచిన్నది కన్యయనిన్ని తొమ్మిదిఏండ్ల చిన్నది రోహిణియనిన్ని పదిఏండ్లచిన్నది గౌరియనిన్ని పదిఏండ్లకు మించిన వయస్సు గలచిన్నది రజస్వలయనిన్ని పేర్లు ఏర్పరచబడ్డట్టున్ను గౌరీందదన్నాకపృష్ఠమిత్యాది వచనమందు ఇటువంటి కన్యలను దానము యిచ్చినవారికి కలిగే లోకాంతర ప్రాపులుకూడా చెప్పబడి యున్నట్టున్ను ధర్మశాస్త్రములయందు ఈరీతిగా నిర్ణయించబడి యున్నందువల్ల చిన్నదానికి పదిసంవత్సరముల లోపలనే వివాహము చెయ్యడము బ్రాహ్మణజాతమునకు విధ్యుక్తమైనదిగానే యున్నదనిన్ని ఈవిధి ప్రకారము వివాహము చెయ్యడములో చిన్నది యేపురుషుణ్ణి ఐనా వరించడమునకు అవకాశము లేనందున వధూవరస్థితి అనగా చిన్నదాన్ని చిన్నవాడున్ను చిన్నవాణ్ణి చిన్నదిన్ని వరించిన ఫలమును పొందేస్థితి అనిన్ని యిదే వివాహస్థితి అనిన్ని చిన్నదానికి పూర్ణవయస్సు వచ్చినమీదటగాని యెటువంటిస్థితి ఘటనపడదనిన్ని అనడమునకు అనుకూలముగా నుండనట్టున్ను వ్రాయబడియున్నది – అష్టవర్షాభవేదిత్యాది వచనమందు ఆయా యీడుగల బాలికలకు వచనకర్త తన యిష్టప్రకారము పేర్లు పెట్టడమే కాని అందుకు ఉపయోగమయినసంగతి ఏమి చెప్పలేదు గనుక ఆపేర్లు బెట్టడమువల్ల వచ్చేవిశేషమున్ను కనుపడదు – బాధకమున్ను కనుపడదు కాని గౌరీందదన్నాకవృష్ఠమిత్యాది – శ్లోకము రచించినపుడు గౌరియనే వయస్సు గలదాన్ని ఇచ్చినవాడు స్వర్గమునుపొందుతాడనిన్ని రోహిణియనే వయస్సు గలదాన్ని ఇచ్చినవాడు వైకుంఠప్రాప్తుడౌతాడనిన్ని కన్యయనే వయస్సు గలదాన్ని ఇచ్చినవాడు చతుర్ముఖలోకమును పొందుతాడనిన్ని రజస్వలయనే వయస్సు గలదాన్ని ఇచ్చినవాడు రౌరవమునే నరకము పొందుతాడనిన్ని ఆ శ్లోకమందు ఫలములు ఏర్పరచినాడు – ఐతే గౌరియనే యీడుగల దాన్ని దానము చేసినవాడు స్వర్గమును పొందడమునకు ఏమీ హేతువు అని ఒకప్రశ్న – రోహిణియనే ఈడుగలదాన్ని దానము చేసినవాడు వైకుంఠప్రాప్తుడు కావడమునకు ఏమి హేతువు అని ఒక ప్రశ్న కన్యయనే వయస్సు గలదాన్ని దానము చేసినవాడు చతుర్ముఖలోకమును పొందడమునకు ఏమి హేతువు అని ఒక ప్రశ్న కలగుచున్నవి – స్వర్గమునకుపైన చతుర్ముఖలోకమున్ను దానికిపైన వైకుంఠమున్ను ఉన్నట్టు గ్రంధమువల్ల తెలుస్తున్నది గనుక గౌరియనే పదిసంవత్సరముల యీడుగల దానిని దానమిచ్చినవానికి స్వర్గప్రాప్తిని రోహిణియనే తొమ్మిదిసంవత్సరముల యీడుగలదానిని దానమిచ్చిన వైకుంఠప్రాప్తిన్ని చెప్పి కన్యయనే యెనిమిది సంవత్సరముల యీడుగలదానిని దానమిచ్చినవానికి వైకుంఠమునకంటె తక్కువయైన చతుర్ముఖలోకప్రాప్తి చెప్పడమువల్ల క్రమము తప్పించినట్టు కనుపడుతున్నది యిందుకు ఏమిహేతువు అని ఒక ప్రశ్న – విష్ణుభక్తునకు వైకుంఠప్రాప్తి చెప్పడము యుక్తియుక్తముగా నుంటుంది గాని రోహిణిని దానమిచ్చినవాడు శైవుడుగా నుండే పక్షమందు శైవునకు వైకుంఠ ప్రాప్తి చెప్పడము న్యాయమయి యుండలేదు – గనుక ఆ సంగతియందు ఆ మనిషి పొందవలసిన ఫలము ఏర్పాటయి యుండకపోవడమునకు ఏమి హేతువు అని ఒక ప్రశ్న – రజస్వలయనే ఈడుగలదాన్ని దానమిచ్చిన వానికి రౌరవమనే నరకము రావడమునకు ఏమి హేతువు అని ఒకప్రశ్న – ఈ ఆరుప్రశ్నలు కలుగు చున్నవి – వీటిలో నొకదానికిన్ని యుక్తియుక్తమయిన ఉత్తరము వచ్చేటట్టు కనుపడడు విశేషించిన్ని ఇహలోకమునున్ను పరలోకమునున్ను బోధించే శాస్త్రములలో ఇహలోకమును బోధించేశాస్త్రములు ప్రత్యక్షదృష్టాంతములచేతనున్ను యుక్తియుక్తములైన సంగతులచేతనున్ను దృఢపరచబడుచున్నవి – పరలోకమును బోధించే శాస్త్రములు కేవలం యుక్తియుక్తములైన సంగతులు మాత్రమే ఆధారముగలవై యున్నవి గనుక సదరు కన్యాదానములుచేసే వారికి పైనవివరించబడినప్రకారము భిన్నముగానున్ను వ్యుత్క్రమముగా నున్ను పరలోకప్రాప్తి ఔతుందని సదరు శ్లోకము రచించిన పురుషునకు ఏలాగున తెలిసియుండునని ఒకప్రశ్న పుడుతూఉన్నది – ఇంతేకాదు మహాపురుషులనిన్ని మహర్షులనిన్ని చెప్పబడ్డవారు యుక్తవయస్సు వచ్చినకన్యలకే వివాహములు జరిగించియున్నట్టు కనుపడుతున్నది – ఐతే రజస్వలయనే యీడుగలదానిని ఇచ్చేవాడికి నరకప్రాప్తి అయ్యేటట్టుంటే ఆ సంగతి వారికి తెలియకుండానుండునా అని ఒక ప్రశ్న అటువంటివారికిన్ని పూర్వము తెలియకుండా నుండిన అంశము ఈ పురుషుడు ఏలాగున కనిపెట్టెనని ఒకప్రశ్న – ఒకవేళ రజస్వలయనే యీడుగలదానిని ఇచ్చేవారిని నరకమునకు తీసుకుని పొయ్యే పద్ధతి పూర్వము లేక దరిమిలాను పుట్టియుండునా అని ఒక ప్రశ్న కలుగుచున్నవి – ఈ ప్రశ్నలకు యుక్తియుక్తములైన ఉత్తరములు రావడము బొత్తుగానే దుర్ఘటనమని తెలియతగియున్నది – సదరహీప్రకారము కన్యాదానము చెయ్యడము మాత్రము చేతనే ఉత్తమ లోకప్రాప్తి కలుగుతుందని లోకమందు పూర్వము తెలియబడి యుండినట్టయితే ఉత్తమలోకములను కోరి ఋషులు బహుకాలము నిరశనలై కష్టతమములయిన తపస్సులు సేసినారన్న వాడికను కొందరైనా అనగా పూర్వము నమ్మినవారయినా నమ్మకపోదురు యజ్ఞములుచేస్తే స్వర్గప్రాప్తి ఔతుందనే భ్రమగలవారు బహుప్రయాస చేసినప్పటికిన్ని యథావిధిగా నెరవేరడము అసాధ్యమయియున్న యజ్ఞములను చెయ్యడముకంటే సులభముగా సదరహీదానములలో నొకదాన్ని చేసి స్వర్గమునే కాని అంతకంటె విశేషమయిన లోకమునే కాని పొందనెవచ్చును కాని ఈ శ్లోకభావమందు నమ్మకములేని హేతువుచేతనే చాలామంది యజ్ఞములు చేస్తున్నారు – ఐతే యెనిమిది మొదలుకుని పది సంవత్సరములలోపలి యీడుగలచిన్నదానికి వివాహము చెయ్యవలసినదనే పద్ధతియందు లోకులకు భక్తికలుగుననే తాత్పర్యముచేత ఈ వచనము రచించబడియుండును బాలికలకే వివాహముచేసే ఆచారము యోగ్యమయినదిగా నిర్వహించడమునకున్ను చిన్నది రజస్వల యయినమీదటగాని వధూవరస్థితి ఘటనపడదనే వాస్తవమును నిరసించడమునకున్ను ఇటువంటి వచనములు ఆధారముగా నెంచడము న్యాయముకాదు[3]

౬ – సర్వేషామేవర్ణా్ నామనే శ్లోకమునకు ఎనిమిదో సంవత్సరమునకు మిగిలిన కాలము చెప్పడముమాత్రమేగాని సమస్తవర్ణముల వారికిన్ని చిన్నదానియొక్క యెనిమిదో సంవత్సరమందే కన్యాదానము శ్రేష్ఠమని అర్థము వ్రాయబడియున్నది – చిన్నదానియొక్క తతిమ్మాసంవత్సరములలో కన్యాదానము చెయ్యడముకంటె యెనిమిదో సంవత్సరమందే కన్యాదానము చెయ్యడము శ్రేష్ఠమయినదిగా నెంచడమునకు చాలినహేతువులు ఏమియున్నవో తెలుసుకోవడమునకు సదుపాయములేమిన్ని కనుపర్చబడలేదు – ఈ శ్లోకపద్ధతి – సదరు కన్యాద్వాదశవర్షే-దశైకో నాష్టవర్షాతు – అష్టవర్షాభవేత్కన్యా – గౌరీందదన్నాకపృష్ఠం – అనే నాలుగుశ్లోకములయొక్క పద్ధతులకు భేదముగా నున్నది – యీ ఐదుశ్లోకములే కాకుండా వీటి అభిప్రాయములకు భిన్నములైన అభిప్రాయములు కలిగినటువంటిన్ని ఒకటికి ఒకటి సంబంధించకుండా నుండేటటువంటిన్ని ఏదిబడితే అదే సిద్ధాంతమయినదిగా కనుపడేటటువంటిన్ని అనేక శ్లోకములు గ్రంధములయందు చేరియున్నవి – ఐతే న్యాయములయిన సబబులుచేత సంరక్షించబడని శ్లోకములెన్ని వున్నా వినియోగము లేదు[4] కన్యాత్వ సమయప్రశంసలో కొందరు ఎనిమిది సంవత్సరములది గౌరి యనిన్ని తొమ్మిది సంవత్సరములది నగ్నిక అనిన్ని పదిసంవత్సరములది కన్య యనిన్ని పన్నెండోసంవత్సరము వచ్చినది వృషలి అనిన్ని పేర్లు‌ బెట్టినారు – రజస్వల అయ్యేమట్టుకు చిన్నది కన్యయనిపించుకుంటుంది అనిన్ని తరువాత వృషలి యనిపించుకుంటుందనిన్ని కొందరు వ్రాసియున్నారు స్త్రీచిహ్నములు బాగా స్ఫురించేమట్టుకు చిన్నది కన్యయనిపించుకుంటుదని కొందరన్నారు – చిన్నది వివాహమయ్యేమట్టుకు కన్యయనిపించుకుంటుందని కొందరు వాడియున్నారు – ఋతుస్నాతయై శుద్ధిని పొందిన చిన్నదే కన్యయని కొందరన్నారు – చిన్నది సిగ్గుగుర్తెరుగ కుండానున్న మట్టుకు కన్యయని కొందరన్నారు – చిన్నది ధూళితో ఆడుకుంటూనున్న మట్టుకు కన్యయని కొందరన్నారు. ఇంకా యిటువంటిహద్దులే ఏర్పరచి కొందరు వచించియున్నారు గనుక అష్టవర్షాభవేత్కనా అనేశ్లోకమును పట్టి యెనిమిది సంవత్సరముల చిన్నదే కన్యయని ఎంచడమునకు వల్లలేదు – ఎనిమిదో సంవత్సరమందు చిన్నదానికి పురుషేచ్ఛ కలుగదు గనుక చిన్నదానియొక్క యెనిమిదో సంవత్సరమందు చిన్నదాన్ని దానముచేస్తే పూర్ణకన్యాదానమౌతుందని చెప్పకూడదు – ఋతుస్నాతయై శుద్ధినిపొందిన – చిన్నదాన్ని దానముచేస్తేగాని పూర్ణకన్యాదానము కానేరదు – లోకమందుజరిగేకార్యములలో సమయము వచ్చినప్పుడు జరిగించవలసినవి కొన్నిన్ని – సమయము రాకమునుపే ఏర్పరచి యుంచవలసినవి కొన్నిన్ని ఐయున్నవి – వివాహము దానితో అవసరము వచ్చిన్నప్పుడు చెయ్యవలసినదే గాని ముందుగా జరిగించి యుంచతగ్గది కాదు – ముందుగా జరిగించడముచే జురూరై యుండడము మాత్రమే కాకుండా బాలికకు వివాహముచేస్తే వివాహమందుండే ఉద్దేశము నెరవేరడమునకు చాలావ్యవధి ఉంటుంది గనుకనున్ను అది నెరవేరడమునకు అనేక విఘ్నములు సంభవించతగియుంటవి గనుకనున్ను వివాహము పూర్ణమౌతుందో కాదో నిశ్చయించడమునకు వల్లలేదు కాబట్టి చిన్నది రజస్వలయైనమీదటగాని పాణిగ్రహణము చెయ్యడము న్యాయముకాదు – కన్యాదానమునకు కన్యావరులు సంసారసుఖమును అనుభవించి సంసారఫలమును పొందవలెననేదే ఉద్దేశమైయున్నది. పూర్ణవయస్సు వచ్చిన కన్యను దానమిస్తే తత్సుఖానుభవము అప్పుడే సంభవిస్తుంది గనుక అది పూర్ణకన్యాదాన మనిపించుకుంచున్నది – బాలికను దానమిస్తే తత్సుఖానుభవము అప్పట్లో సంభవించనేరదు గనుక అది పూర్ణకన్యాదానమని చెప్పడమునకు సబబులేదు సిద్ధమయిన ఫలమును దానిమిస్తే ఫలదానమౌచుంది గాని శలాటుదానమిచ్చి ఫలదానమిచ్చినట్టు చెప్పడము యుక్తముగానుండదు విశేషించిన్ని బాలికకు వివాహముచేసి కన్యాదానమిచ్చినా మనడమేగాని ఆపిల్లను అప్పట్లో దానముపట్టినవారి ఆధీనము చెయ్యకుండా తమ ఆధీనతయందే దానమిచ్చినవారు ఉంచుకుంటూ ఉన్నారు – ఇది అనుభవములో తెచ్చుకోకూడని పిందెను చెట్టుమీదనుండగా కనుపరచి ఫలదానమిచ్చినా మన్నట్టు ఉన్నది గనుక పూర్ణవయస్సురాని చిన్నదానికే వివాహము చేసే మర్యాదను పసందు చెయ్యడమునకు చాలిన హేతువులు ఏమిన్ని కనుపడి యుండలేదు మీరు ఉదాహరించిన శ్లోకములలో – మహిష్యాంగవికన్యాయామిత్యాది – కన్యకాదానపర్యంత మిత్యాదిశ్లోకములయందు కన్యాదానమయ్యేమట్టుకు చిన్నది తండ్రివశమనిన్ని కన్యాదానముకాగానే పెనిమిటివశమనిన్ని చెప్పబడియున్నది – యౌవనమురానిపిల్ల పెనిమిటి అధికారమం దుండవలసిన దనడము న్యాయముకాదు గనుకనున్ను కన్యాదానమువరకే యౌవనము వచ్చియుంటేగాని వెంటనే పెనిమిటివశము చెయ్యడమునకు అనుకూలము కాదు గనుకనున్ను సదరు రెండు శ్లోకముల అభిప్రాయముచేతను యౌవనము వచ్చినకన్యకును వివాహము చెయ్యవలసినదిన్ని వెంటనే ఆ చిన్నదాన్ని ఆ పురుషుని ఆథీనము చెయ్యవలసినదిన్ని సాధారణమయిన మర్యాదయై యుండినట్టు తేటపడుచున్నది.

౭ – సదరు ఉత్తరముయొక్క ఏడవపేరాయందు బాల్య కాలములో వివాహములయిన వారియందున్ను కొందరి దాంపత్యము చాలాకాలము జరుగుతూ వచ్చినదనిన్ని రజస్వలలైన కన్యలకు వివాహములు జరిగిన సంగతులలోనున్ను ఒకానొకచోట వివాహమందే పెండ్లికుమారునికి రుగ్మతవచ్చి హాని కలుగుతూ వచ్చిన దనిన్ని సదరు ఉత్తరములో వ్రాయబడి యున్నది – యిందువల్ల ఈ రెండు తరహాల వివాహముల యొక్క గుణదోషముల యందు విశేషమయిన భేదములేదని మీరు యోజించినట్టు కనుపడుతున్నది ఋతుమతులైన కన్యలకు వివాహములు జరిగించే సంగతిలో ఒకానొకచోట వెంటనే భర్తృవియోగము సంభవించినప్పటికిన్ని తతిమ్మా అన్నిచోట్లను పాణిగ్రహణోద్దేశ సుఖము వివాహాంతమందు కలుగుతున్నందున దీనియందు గుణమధిక మయినట్టు స్పష్టమైయున్నది – బాలికలకు – వివాహముచేసే సంగతిలో పాణిగ్రహణోద్దేశము నెరవేరడమునకు చాలా వ్యవధియుండడమువల్ల అనేకస్థలములను భంగములు సంభవించడముకలదు గనుక దీనియందు దోషమధికమని విశదమౌచున్నది – దంపతులు కాబొయ్యేవారి శరీరములు రోగసహితములు కాకుండా నున్నట్టున్ను వారి శరీరదార్ఢ్యములు మొదలైనవి వారు దంపతులు కావడమునకు తగియున్నట్టున్ను పరీక్షవల్ల కనిపెట్టి తదనంతరము పాణిగ్రహణము చేయించవలసినదని పూర్వులు నిర్ణయించియున్నారు – ఈ పద్ధతిన్ని ఋతుమతియైన కన్యకు వివాహముచేసే మర్యాదనే సూచిస్తున్నది యీ ప్రకారము జరిగించడమువల్ల ఆ మిధున మందొకరికిన్ని అప్పట్లో సాధారణముగా రుగ్మత కలుగనేరదు మరిన్ని పాణిగ్రహణము చెయ్యడమే బ్రహ్మచర్యమును వదిలిపెట్టటమై యున్నది యీ కార్యము కావడముతోటే తదుద్దేశ సుఖమును పొందడమునకు దంపతులకు న్యాయముచేత అధికారము కలుగుచున్నది – యిందుకు అనుగుణముగా జరిగే ఆచారము సౌఖ్యకరమై యున్నది – యీలా నుండగా పాణిగ్రహణమయినది మొదలుకుని దంపతులు అవినాభావముగా కొన్ని కార్యములు జరిగిస్తూ నాలుగు దినముల పర్యంతము బ్రహ్మచర్యమును నిలువబట్టవలసినదని దరిమిలాను ఒకవిధి యేర్పాటైనందున పాణిగ్రహణమయిన రోజుననే తదుద్దేశ సుఖము వారికి కలుగడము లేకపోతున్నది యీ అంతరము వారి శరీర స్థితులను వికారపరచడమునకు కారణమున్ను ఔచున్నది – ఉత్తరము తాలూక్‌ సదరుపేరాలో తేనవినాతృణాగ్రమపినచలతి అనే వాక్యమునకు ఆ సర్వేశ్వరునిచేతతప్ప గంకెకొన యైనప్పటికిన్ని చలించదని అర్థము వ్రాయబడి యున్నది – ఈ వాక్యమునకు వ్రాసిన అర్థము సరిగానే యున్నది – కాని ఈ వాక్యమును మీరు ఉదాహరించిన గ్రంధసమయము విచారించగా మనుష్యయత్నము నిష్ఫలమని సదరు వాక్యమునకు అభిప్రాయమని మీరు యోజించినట్టు కనుపడుతున్నది – ఈశ్వరుడు ఇహమందు చేసిన సృష్టిలో మనుష్యజాతిని వ్యవహార సామర్థ్యము గలదాన్నిగా సృజించి వివేకమనేవస్తువును మనుష్యునకు ఇచ్చి యున్నాడు అందుకు అనుగుణముగా మనిషి వివేకమునపట్టి వ్యవహరించకపోతే శిక్షవచ్చేమాట సిద్ధమయియున్నది – “ఎందును గాలము నిజమని – పందతనంబునను బుద్ధిబాయక జడుడై – ఎందాక బుద్ధినిగుడెడు – నందాక జరింపవలయు నాత్మబలమునన్.”– ఎందును – దేనియందున్ను – కాలమునిజమని – ఎప్పుడేది తటస్థించవలనునో అప్పుడు అది సంభవిస్తుందని ఎంచి – జడుడై – మూఢుడై – పందతనంబునను – సోమరితనము చేతను – బుద్ధిబాయక – బుద్ధిని వదిలిపెట్టక – ఎందాక – ఎంతమట్టుకు – బుద్ధినిగుడెడు – బుద్ధివ్యాప్తిస్తుందో – అందాక అంతమట్టుకున్ను ఆత్మబలమునన్‌ – తనశక్తికొలది – జరింపవలయు – బుద్ధిని వ్యాపింపచెయ్యవలసినది – “ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీః దైవంప్రధానమితి కాపురుషా వదన్తి దైవం భజస్వ కురు పౌరుషమాత్మశక్త్యా యత్నేకృతే యది న సిధ్యతి కోత్ర దోషః”- దైవంప్రధానమితి – దైవమే ప్రధానమని – కాపుకుషాః-కుత్సిత పురుషులు వదంతి – చెప్పుచున్నారు – లక్ష్మీః – వైభవము – ఉద్యోగినం – వ్యవహరిస్తూ ఉన్నటువంటి పురుషసింహం – పురుషశ్రేష్ఠుణ్ణి – ఉపైతి – పొందుచున్నది – గనుక – దైవం – ఏలినవాణ్ణి – భజస్వ – ప్రార్థించు – మరిన్ని ఆత్మశక్త్యానీ – శక్తికొలది – పౌరుషం – పురుషవృత్తిని – కురు – చేయుమా – యత్నేకృతే – ప్రయత్నము చెయ్యబడగా – యదినసిధ్యతి – సంభవించకపోతే – ఆత్ర-దీనియందు – దోషః కః దోషము ఏమి ఉన్నది – కాబట్టి అవశ్యములయిన సంగతులలో సాధ్యమైనంత మట్టుకు యత్నము చెయ్యవలసినది మనిషికి విధియైయున్నది తనపిల్ల – బావిఒడ్డున నుండగా చూచి ఈశ్వరుని చేతగాని గరికెకొనఐనా చలించదని ఉపేక్షచేసి తల్లిఐనా తండ్రిఐనా – ఊరికె యుండవలసినదని – ఎవరైనా చెప్పగలరా – చెప్పలేరు – ఈశ్వరునిచేత వినగా గరికెకొనఐనా – చలించదన్నప్పుడు ఈశ్వరుడు సర్వాంతర్యామిఐ యున్నాడనే తాత్పర్యముగాని మనుష్యయత్నముచే జురూరని అర్థముకాదు – మరిన్ని – ఆ పేరాలో కర్మానుగుణముగా సంభవించే వాట్లకు తప్పించడమునకు ఎంతవారికయినా శక్యము కానేరదని సిద్ధాంతముగా ఉన్నట్టు వ్రాయబడి యున్నది – ఇది మనుష్య యత్నమును అవశ్యమయినదిగానే తెలియచేస్తున్నది – యెందుచేతనంటే – కర్మమనగా చెయ్యబడేకార్యము – అందుకు అనుగుణముగా సంభవించే దన్నప్పుడు ఆ కార్యమునకు పట్టివచ్ఛేఫలము – దీన్ని తప్పించే వల్లలేదనియుండుట వల్ల యుక్తఫలమునిచ్చే కర్మనే మనిషి యోజించి జరిగించుకోవలసినది అవశ్యమై యుంటుంది – సదరు ఉత్తరము వ్రాయించియున్న వారియెద్దికి ఈ ప్రత్యుత్తరము వ్రాసిపంపించి చాలా కాలమయినప్పటికిన్ని యిందుమీద ఏమిన్ని వారు వ్రాయించి పంపించలేదు కాని వారిలో కొందరు కూడి యిది చూచుకుని అందరు కూడిన మీదట ఇందున గురించి కలిగే తాత్పర్యమును తెలియచెయ్యడము యుక్తమని యెంచిన్నట్టున్ను ఒకానొక అనుపపత్తిచేత వారందరూ కూడడము సంభవించకుండా నున్నట్టున్ను తెలిసినందున ఈ దిగువను వ్రాయబడే నా అభిప్రాయముతోకూడా ఈ ప్రమేయము బుద్ధిమంతులయిన హిందూలయొక్క యోజనలో తేబడగలందులకు ప్రచురము చెయ్యవలెనని నాకు ఇచ్ఛ కలుగుచున్నది.

౧ – యుక్తవయస్సురాని బాలికలకే వివాహము చేసేలాగున ఏర్పరచుకున్న ఆచారము ద్రవ్యముపుచ్చుకుని బాలికలను వివాహమునకిచ్చే మర్యాదనుకూడా కలుగచేసినది ఇది మిక్కిలీ దురాచారమయినటువంటిన్ని సహించశక్యము కానటువంటిన్ని పద్ధతిగానున్నది చిన్నదాన్ని వివాహము చేసుకునే పురుషునియొక్క యోగ్యతాయోగ్యతలున్ను శరీరస్థితిన్ని జీవితకాల చిహ్నలున్ను యోజించకుండానే చాలామంది ద్రవ్యమున కపేక్షించి తమ బాలికలను నిర్దాక్షిణ్యముగా వివాహమునకు ఇస్తూఉన్నారు ఇది న్యాయవిరుద్ధమున్ను ప్రతిష్ఠకు హానికరమున్ను ఐయున్నది – ఈప్రకారము వివాహమునకు ఇవ్వబడ్డ చాలామంది బాలికలు యౌవనము వచ్చిననాటనుంచి చాలా దైన్యములను దుఃఖములను అపకీర్తులను పొందడమునకు హేతువులు కలుగుచున్నవి పూర్ణవయస్సు వచ్చిన కన్యకు వివాహముచేసే సంగతిలో తనకు భర్తకాపొయ్యే మనిషి కురూపిగాగాని వృద్ధుగాగాని మరియే లోపమయినా గలవాడుగాగాని ఉన్నపక్షమందు అటువంటి పురుషుణ్ణి వివాహము చేసుకోవడమును గురించి ఆకన్య గట్టిగా మళ్ళ బాటు చేస్తుందనడమునకు ఏమీ సందేహము లేదు బాలికలకు అటువంటి పురుషులను వివాహము చేసే పక్షమందు అందున గురించి వారు ఏమిన్ని – ఆక్షేపించ చాలరు గనుక ఈ సంగతిలో దాక్షిణ్యము లేనటువంటిన్ని న్యాయబుద్ధి లేనటువంటిన్ని ద్రవ్యమందే ముఖ్యమయిన ఆసక్తిగలిగినటువంటిన్ని తండ్రులయొక్క ఉద్దేశములకు విరోధముగా కొమార్తెలయొక్క ఆతంకములేమిన్ని కలుగనేరవు – దుర్నయములకు లోబడే మనుష్యులయొక్క యత్నములకు ఆతంకమైనది ఏమిన్ని లేకుండానున్న పక్షమందు అవి ప్రబలముగా వ్యాపించగలవు – ద్రవ్యము పుచ్చుకుని బాలికలను వివాహమునకు ఇచ్చే వారిని మాంసవిక్రయికులని కొందరు వాడికచేస్తున్నారు – కాని వారెవరున్ను ఆ దుర్నయమయిన ఆచారమునకు ఆతంకము చెయ్యజాలకుండా నున్నారు గనుక సదరు ఆచారము క్రమేణ ప్రబలిస్తూ ఉన్నది బాలికలకు వివాహము చెయ్యడము అయుక్తమన్నసంగతి ఆలోచనలోవచ్చిన పక్షమందు అది సదరు దురాచారమును ఆతంకపరచడమునకు సందేహమేమీలేదు.

౨ – సదరు ప్రత్యుత్తరములో వివరించబడియున్న అనేక హేతువులచేత చిన్నది రజస్వలయైన తరువాత కన్యావరుల పరస్పరేచ్ఛను కనిపెట్టి వివాహము చెయ్యడము యుక్తకార్యముగా నెంచతగియున్నది – చిన్నది రజస్వలయైతేగాని కన్యావరులకు ఏకశయ్యాగతి న్యాయముగా నుండదు ఋతుమతి కాకమునుపు చిన్నదానికి రజస్సంపూర్ణత లేనందున అప్పట్లో ఏకశయ్యాగతి అన్యాయమున్ను చిన్నదానియొక్క శరీరస్థితిని ఖలలు పరచడమునకు హేతువున్ను ఐయుంటుంది బ్రాహ్మణులలో బాలికకు వివాహములు చేస్తున్నప్పటికిన్ని కన్యావరులు ఒకరిని ఒకరు మోహించి యున్న వారైనట్టు స్పష్టమయ్యేలాగు మధ్యవర్తుల ఎదుట రుజువుపరిచేనిమిత్తము మదర్థం వరం వృణీధ్వం అనేమంత్రము చిన్నదానిచేతనున్ను మదర్థం కన్యాం వృణీధ్వం అనేమంత్రము చిన్నవానిచేతనున్ను పాణిగ్రహణమునకు ముందు చెప్పించే ఆచారము కలిగి యుండడము వల్లనున్ను పాణిగ్రహణ మయినరోజుననే పెండ్లికుమార్తెను భర్తగృహమునకు వెంటబెట్టుకు పోవలసినదనిన్ని ఆరోజు మొదలుకుని వధూవరులు ఏకశయ్యాగతులు కావలసినదనిన్ని విధికలియుండడమువల్లనున్ను మరిన్ని నాలుగుదినములమట్టుకు బ్రహ్మచర్యము నిలవబట్టి యుంచగలందులకు కన్యావరులమధ్యను గంధర్వునికి ప్రతినిధిగా మంత్రపూతముయినయొక వస్తువు ఉంచవలసినదని ఏర్పాటై యుండడమువల్లనున్ను నాలుగోరోజున గంధర్వుణ్ణి ఉద్వాసన చేసినతరువాత కన్యావరులు పూర్ణవివాహస్థితిని యున్నట్టు సూచించే గర్భాధానమంత్రములు చెప్పేవాడిక యుండడమువల్లనున్ను రజస్వలయయినకన్యకకే వివాహము చెయ్యవలసినది నాయమయియున్నట్టు స్పష్టమౌచున్నది – బాలికను పాణిగ్రహణము చెయ్యవలసినట్టు వేదమందు చెప్పబడియుండలేదని బ్రాహ్మణులు చెప్పుతున్నారు రజస్వలయయినకన్యను పాణిగ్రహణము చెయ్యడము న్యాయమయినటువంటిన్ని సౌఖ్యకరమైనటువంటిన్ని మర్యాదఐ యున్నది – ఇటువంటి యోగ్యమయిన మర్యాదను వదిలిపెట్టి వేదమందు చెప్పబడనటువంటిన్ని సమయము రానటువంటిన్ని సరసముగానటువంటిన్ని వినియోగము మాలినటువంటిన్ని పాణిగ్రహణము చెయ్యడము యోగ్యమయినది కాదు – భోజనముచేసే మనిషే భోజనము యొక్క గుణదోషఫలములను పొందవలెను గనుక అందుల వస్తుగ్రహణమునకు ఆ మనిషియొక్క కోరికే మొదటిదిగా చెప్పతగియుంటుందిగాని వడ్డించడము మొదలయిన కార్యములు నెరవేర్చేవారియొక్క కోరికలు మొదటివిగా చెప్పతగియుండవు అదే ప్రకారము వివాహము చేసుకునేమనిషే అందుమీదవచ్చే మంచిచెడ్డ ఫలములను పొందవలెను గనుక అందునగురించి ఆ మనిషియొక్క కోరిక మొదటిదిగా చెప్పతగియుంటుంది గాని తలిదండ్రులు మొదలైనవారి కోరికలు మొదటివిగా చెప్పతగియుండవు కాబట్టి కన్యావరులయొక్క పరస్పరేచ్ఛను ప్రధానముగా నెంచి వివాహము జరిగించబడుతూవచ్చినపద్ధతే మిక్కిలీ శ్రేష్ఠమయినదిగా నున్నది.

౩ – స్త్రీజాతియందు కొన్ని దేశములవారు గౌరవము జరిగిస్తున్నారు హిందూలలోనున్న చాలా దేశములవారు స్త్రీలయెడల గౌరవము నుంచే ఆచారము కలిగియున్నది ఐనప్పటికిన్ని బాలికలకు వివాహములు చెయ్యడము మొదలయిన పద్ధతులు ఈ యాచారమునకున్ను భిన్నముగానే యున్నవి – ఏలాగంటే బ్రాహ్మణులలో చిన్నదానికి పూర్ణవయస్సు రాకమునుపే వివాహము చేసేపద్ధతి ఏర్పాటైన మీదట కోమట్లయందున్ను ఆపద్ధతే అంగీకరించబడ్డది – యిందువల్ల వారిలోనేమి తరువాత తతిమ్మావారిలో కొంతమట్టుకుఏమి దంపతులు కాబొయ్యేవారి పరస్పరేచ్ఛ ప్రధానమైనదిగా నెంచే మర్యాద యందు గౌరవము తక్కువయైపోయినది యిది బాలికలయందు చులకదనమును కలుగచెయ్యడమునకు కారణమౌచున్నది[5] ఏయే జాతముయొక్క బాలికలు ఆయా జాతమందు మాతలు కాదగియుంటారు గనుక ప్రతిష్ఠగల – జాతముయొక్క బాలికలకు చులకదనమురావడము విలక్షణమైన పనికాదు – వివాహము కాకమునుపే చిన్నది రజస్వలయైనపక్షమందు తలిదండ్రులు తోడబుట్టినవారు ఆ చిన్నదానితో నదీగర్భమందు ప్రవేశించవలసినదని ఒక పురుషుడు నిర్ణయించినాడు యుక్తప్రవర్తన కలిగినటువంటిన్ని ద్రవ్యవంతులు గానటువంటిన్ని సౌందర్యవతులుగాని చాలామంది కొమార్తెలు కలిగినటువంటిన్ని గృహస్థులు వారి పుత్రికలకు చిన్నతనములోనే వివాహములు చెయ్యడము మిక్కిలీ కష్టముగానుంటుంది ఇటువంటి సంగతులలో పిల్లలు రజస్వల కాకమునుపే వారికి వివాహములు చెయ్యవలసినదనిన్ని వివాహముకాకమునుపే కన్యలురజస్వలలైనపక్షమందు తలిదండ్రులున్ను తోడబుట్టినవారున్ను ఆకన్యలతో నదీప్రవేశముకావలసినదనిన్ని నిర్ణయములుండడమువల్ల అటువంటికుటుంబములవారికి అనివార్యములైన ఆపత్తుకలుగుతున్నవి – స్త్రీకి భర్తృవియోగము సంభవించిన పక్షమందుయౌవనమున్న మట్టుకు పునర్వివాహయోగ్యత పూర్వముకలిగి యుండేది (భారతము తాలూకు ఆదిపర్వము వేదవ్యాసులవారి తల్లియైన సత్యవతియొక్క భీష్ములవారితండ్రియైన శంతనునియొక్క వివాహప్రశంస చూడవలసినది) ఇదియిటుతరువాత నిషేధించబడియున్నది యిందువల్ల చాలామంది స్త్రీలయొక్క యౌవనమునకు నిర్భంధము కలుగుచున్నది బాలికలకే వివాహము చేసే మర్యాద ఏర్పరచుకున్న మీదట – జరుగుతూవచ్చిన పునర్వివాహముకూడా రద్దుపర్చబడ్డందున చిన్నతనములోనే వివాహము తప్పిపోయి సదరు నిషేధమువల్ల తిరిగీ వివాహము లేకపోయి అనేక స్త్రీలయొక్క యౌవనము దుఃఖముతోనే వెండ్లబుచ్చబడుతున్నది – సదరహీ ఉత్తరము తాలూక్‌ నాలుగవపేరాలో ఉదాహరించబడియున్న కన్యాద్వాదశకేవర్ష ఇత్యాది శ్లోకమందు పన్నెండో సంవత్సరములో చిన్నది వివాహము చెయ్యబడక పుట్టింటనున్ను పక్షమందు ఆ చిన్నదాని తండ్రికి భ్రూణహత్య వస్తుందని చెప్పబడియున్నది. (బాలికకు అక్కరజట్టని పెండ్లియనగా చిన్నతనములోనే పెండ్లిజేసి గర్భాధానము కాకమునుపే ఆ పెండ్లికుమారుడు చనిపోతే ఆపిల్లకు తిరిగి పెండ్లి చెయ్యక ఆ చిన్నది ఆవిడెయొక్క యౌవనము దుఃఖముతోనే వెళ్ళబుచ్చుకునేలా కనిపెట్టడమునకు బాధ్యతగలవాడయ్యేతండ్రి ఎంతపాపమును ఎంతదుఃఖమును పొందవలసియున్నదో వివేకశాలు లయినవారు యోజించవలసినది) పునర్వివాహములు రద్దుపరచినందుచేత నిర్భంధమును పొందినస్త్రీలలో చాలామందిచేత అనేకములైన అకృత్యములు జరిగించబడి వాటినిబట్టి వచ్చే దురాచారసంబంధములను తద్దోషములను ఉపద్రవములను ఆయాకుటుంబములవారు పొందడమునకు హేతువులు కలుగుతున్నవి – సదరు పునర్వివాహ నిషేధములున్ను నదీగర్భమందు ప్రవేశించవలసినదనే విధిన్ని ఏర్పరచినవారు లోకమందు ఏమి అసంగతములను పోగొట్టేకొరకు లోకమునకు ఏమి కిఫాయతును కలుగచేసే కొరకు ఏమిన్యాయములనుపట్టి సదరు పద్ధతులేర్పరచిరో ఆవైనములు ఎందువల్లనూ కనపడకుండా నున్నవి – ఐతే వివాహమును గురించి పూర్వము జరుగుతూనుండిన ఆచారములవల్ల కొన్ని హేతువులచేత వారికి ఆయాసము కలిగిన్నట్టున్ను అందువల్ల వారు ఇటువంటి పద్ధతులేర్పరచినట్టున్ను కొందరు చెప్పుచున్నారు పూర్వము కర్మజ్యేష్ఠులుగాగాని విద్యాధికులుగాగాని కొందరివల్ల గౌరవమును పొందుతూనుండేవారు ఒకానొకపద్ధతి ఏర్పరచినపక్షమందు అది వాడికలో రావడము కలదని తెలియబడుచున్నది – సదరు సంగతులలోనున్ను అదేప్రకారము జరిగియుండునుగాని ఒకానొకరికి ఏ హేతువుచేతనైనా సంభవించిన ఆయాసమునుబట్టి అనేకులకు ఆయాసము కలిగేలాగు పద్ధతులేర్పచడము న్యాయమయినపనికాదు[6] ఏ హేతువుల చేతనైనా అయుక్తములైనటువంటిన్ని అసౌఖ్యములైనటువంటిన్ని ఆచారములు కొన్ని కలిగి లోకమందు వ్యాపించియున్నప్పటికిన్ని బుద్ధిమంతులైనవారు వాటి అయుక్తస్థితిని కనిపెట్టిన మీదట ఆ యాచారములను దిద్దుబాటు చేసుకోవడము అవశ్యమే ఐయుంటుంది – సుఖమునున్ను సంతోషమునున్ను వివాహస్థితినిన్ని పొందేహక్కు భగవంతుడు స్త్రీ పురుష జాతులకు సమానముగానే కలుగచేసి యున్నాడు గనుక తప్పితమేమీ లేనిది అటువంటి హక్కులవల్లనుంచి స్త్రీజాతిలో కొందరిని తప్పించడమునకు ఎవరికిన్ని న్యాయము ఉన్నట్టు ఎంచేవల్లలేదు – కాబట్టి వివాహము కాకమునుపు చిన్నది ఋతుమతియైతే తలిదండ్రులున్ను తోడబుట్టినవారున్ను ఆ చిన్నదానితో నదీగర్భమందు ప్రవేసించవలసినదనే విధిన్ని యౌవనవతికి పతి చనిపోయిన పక్షమందు పునర్వివాహము కూడదనే నిషేధమున్ను నిరర్థకములైనవనిన్ని – చిన్నది రజస్వల యైనమీదటనే కన్యయొక్క పురుషునియొక్క అభిప్రాయములను విమర్శించి వివాహములు చేస్తూనుండడమున్ను పెనిమిటి చనిపోయినటువంటిన్ని యౌవనము కలిగియున్నటువంటిన్ని స్త్రీలలో పునర్వివాహమందు ఇష్టము గలవారికి సజాతీయులలో ఏయే స్త్రీ కోరినటువంటిన్ని అందుకు ఒప్పుకున్నటువంటిన్ని పురుషునకు ఆయా స్త్రీని పాణిగ్రహణము చేయించడమున్ను ఇకను పతివిహీనలు కాబొయ్యే వారిని గురించిన్ని యిదేప్రకారము జరిగిస్తూ నుండడమున్ను యుక్తకార్యములుగా నెంచతగి యున్నవనిన్ని స్త్రీపునర్వివాహము చేసేయెడల దంపతులు కాబొయ్యేవారియిష్టము తెలిసిన మీదట అనుకూల మయినసమయమందు బంధువులు కూడియుండి పాణిగ్రహణము చేయించవలసినది యుక్తమనిన్ని యీ పెండ్లికుమార్తెయొక్క పాణి-తలిదండ్రులహస్తములగుండా యివ్వబడవలసింది కానందున యీ పాణిగ్రహణమును కన్యాదాన మనవలసినపని లేదనిన్ని[7] పాణిగ్రహణముకావడమే వివాహమునకు ముగింపుగా నెంచతగియుంటుందనిన్ని ఈ ప్రకారము పాణిగ్రహణము చెయ్యబడ్డ స్త్రీలయొడల ప్రథమ వివాహమైన వారికి జరిగించబడే గౌరవమే జరిగించబడుతూ నుండవలసినదిన్ని పునర్వివాహము చేసుకున్న స్త్రీకి పూర్వకుటుంబమువారిని భరణమిమ్మనే హక్కు లేకపోవలసినదిన్ని – సొత్తువిషయమై ఆమెకున్ను ఆమెసంతతికిన్ని ధర్మశాస్త్రముచేతను అదివరకు కలిగిఉండేహక్కే తదనంతరమున్ను కలిగియుండవలసినదిన్ని ప్రథమవివాహస్త్రీకిన్ని ఆమెసంతతికిన్ని ధర్మశాస్త్రముచేత కలిగేహక్కే పునర్వివాహముచేత వచ్చిన స్త్రీకిన్ని తదనంతరము ఆమెకు కలిగే సంతతికిన్ని కలిగియుండవలసినదిన్ని పునర్వివాహము చెయ్యడము అంగీకరించబడ్డమీదట – మృతభర్తృకలైనవారిలో ప్రథమవివాహభర్తవిషయము మిక్కిలీ యోగ్యతకలిగి నడుచుకున్న స్త్రీకే పునర్వివాహము చెయ్యడమునకు బంధువులు అంగీకరించవలసినదిన్ని ఈ సంగతిలో వారినిగురించి యెవరైనా నిందచేసిన పక్షమందు బంధువులు విమర్శించి న్యాయము జరిగించవలసినదిన్ని అవశ్యమనిన్ని పునర్వివాహ సంగతిలో ఇంకా యేమైనా పద్ధతులు ఏర్పరచడము అగత్యమనితోచినా వివాహముతోగాని పునర్వివాహముతోగాని చేరినయేఅంశమయినా అయుక్తమయినదిగాగాని అసౌఖ్యమయినదిగాగాని కనుపడేపక్షమందైనా నానీతికోవిదులైన వారుకూడి ఈ ప్రమేయముయొక్క ఉద్దేశములకు అనుగుణముగానున్ను యుక్తముగానున్ను ఏర్పరుచుకోనున్ను వచ్చుననిన్ని దిద్దుబాటున్ను చేసుకుంటూ నుండవచ్చుననిన్ని నాయభిప్రాయమయియున్నది……

[1] ఇటువంటి వచనముల అభిప్రాయమునుగురించి యీప్రత్యుత్తరము తాలూక్‌ ఆరవ పేరాయొక్క మధ్యభాగము – అనగా కన్యాత్వసమయప్రశంస చూడవలసినది.
[2]ఈ ప్రమేయము యొక్క ప్రశ్నతా – రెండవ పేరాయందు ఉత్తరభాగములోని నాలుగవసంగతి చూడవలసినది.
[3] పీఠికతాలూక్‌ ఒకటో పేరాయొక్క ఉత్తర భాగమున్ను విద్యాప్రమేయముతా – రెండవపేరానున్ను చూడవలసినది.
[4]పీఠిక తా – ఒకటోపేరాయొక్క అంత్యభాగమున్ను విద్యా ప్రమేయము తా-రెండవ పేరానున్ను చూడవలసినది.
[5]ఈ అభిప్రాయము తాలూక్‌ ఒకటోపేరా చూడవలసినది
[6] విద్యాప్రమేయము తాలూక్‌ రెండవపేరా చూడవలసినది
[7] ఈ వివాహప్రమేయము యొక్క ప్రత్యుత్తరము తాలూక్‌ ఒకటోపేరాలో పాణిగ్రహణపద్ధతి చూడవలసినది.

శ్రీమతే జగన్నాథాయనమః

‘హితసూచని’
ముద్రణకు సహకరించిన హితులు
మాన్యశ్రీ కె. వెంకటేశ్వరరావు, పి. రవీంద్రకుమార్‌, పి. రామకృష్ణారెడ్డి, రాజమండ్రి టౌనుహాలు, ఆర్‌. సూర్యప్రకాశరావు, ప్రొ॥ బి॥ వి. సూర్యనారాయణ, వి. గోపాలకృష్ణ, వి. రఘునాథశర్మ, వై.యస్‌. నరసింహారావు, ఆర్‌. గిరిధరరావు, డా॥ ఎ. నారాయణరావు, ఎమ్‌. సాంబశివరావు, జి.ఎన్‌. సుబ్రహ్మణ్యం, డి.వి.వి. సూర్యనారాయణ, డా॥ డి.యస్‌.వి. సుబ్రహ్మణ్యం, బి.పి. వెంట్రాజు, ఎమ్‌. పార్థసారథి, డా॥ పి.వి. మురళీకృష్ణ, డా॥ జి. జయలక్ష్మి, పి. సుబ్రహ్మణ్యశర్మ, ఎస్‌. నరసింహశర్మ, డి. సత్యనారాయణ, వై.సి. తిమ్మారెడ్డి, కె. సత్యశ్రీమన్నారాయణ, బి.వి. రమణ, టి.వి. గోపాలకృష్ణ, ఎమ్‌.వి.ఎన్‌. చారి (చిరంజీవి), జె. గంగరాజు, ఎమ్‌. వాసుదేవమూర్తి, జి. రమణయ్య, శ్రీమతి పి. వరలక్ష్మి. ఇంకా…. ఇంకా… అందరికీ కృతజ్ఞతలు.