వాడుక భాష: రచనకు కొన్ని నియమాలు (పీఠిక)

[గ్రాంథిక వ్యావహారిక భాషావివాదం బలంగా నడుస్తున్న రోజులలో కూడా, దృష్టి అంతా పదాలు వాటి వర్ణక్రమాల మీదే ఉండింది. ఆ సమయంలో టేకుమళ్ళ కామేశ్వరరావు అనే యువకుడు వ్యావహారభాషకు నియమాలు ఏర్పరుచుకోవాలా వద్దా అనే అంశాన్ని చర్చకు తీసుకొని వచ్చారు. భారతిలో ప్రచురించిన తన వ్యాసాలను విస్తరించి వాడుక భాష: రచనకు కొన్ని నియమాలు అనే పుస్తకం ప్రచురించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసినది వ్యావహారభాషకు ఏ నియమాలూ అక్కరలేదు అని బలంగా నమ్మిన గిడుగు రామమూర్తి పంతులు. ఈ విషయం గురించి వివరంగా ఈ సంచికలోనే ప్రచురించిన గిడుగు – చిన్నయ సూరి వ్యాసంలో చదవండి. టేకుమళ్ళ కామేశ్వరరావు పుస్తకం ఈ సంచికలో ప్రచురిస్తున్న సందర్భంలో, ఆ పుస్తకపు ముందుమాట, కామేశ్వరరావు నా మాట ఇక్కడ ప్రచురిస్తున్నాం – సం.]

పీఠిక

శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు పంతులుగారు “భారతి” 13వ సంపుటములో “వ్యావహారిక రచనకు కొన్ని నియమాలు” అనే శీర్షికతో రెండు వ్యాసాలు ప్రకటించినారు. అవే ఇప్పుడు కొంచెము సవరించి పుస్తకముగా అచ్చు వేయించినారు. తాము ఏ ఉద్దేశముతో ఈ గ్రంథము రచించినారో ‘ఉపక్రమణిక’లో తెలియజేసినారు. వ్యావహారిక భాషలో వ్రాస్తున్న కొందరి వ్రాతలలో ‘ఏకత’ లేదనిన్ని, ‘ఏకత’ లేకపోవడము ఆ భాషలో గొప్ప దోషమనిన్ని, ఆ దోషము తొలగించడమునకు కొన్ని నియమాలు చేయవలసి ఉన్నదనిన్ని కొందరు అన్న మాటలు వీరికి నచ్చినవి. వీరికి వ్యావహారిక భాషమీద అభిమానము మెండుగా ఉన్నది. ఆ భాషలో రచితమయిన కథలూ, నవలలూ, నాటకాలూ, వ్యాసాలూ- అన్నీ వీరు చదువుతారు. ఆ భాషలోనే స్వయంగా నాటకాలూ కథలూ వ్యాసాలూ వ్రాస్తున్నారు. ‘ఏకత’ కలిగేలాగున రచన చేయవలెనని సంకల్పించి, అభ్యసిస్తున్నట్టు కనబడుతున్నది. ‘ఏకత’కు ఆదర్శముగా ప్రవీణులయిన కొందరి రచనలు వీరు స్వీకరించి, వాటిలో తమకు కనబడ్డ ‘నియమాలు’ ప్రమాణముగా గ్రహించి, ఏకత లేని రచనలలో లోపాలుగాను ‘దోషాలు’గా తమకు తోచినవి దిద్దడమునకు యత్నించినారు. కొందరకిది అతి సాహసమువలె తోచునేమో; గాని చిత్తశుద్ధితో చేసిన పని అని గ్రంథమంతా చదివేవారికి తెలియకపోదు. తమవలె వ్యావహారిక భాషా రచన అభ్యసిస్తూ ఉన్నవారితో సమాలోచన చేయ నుద్దేశించినట్లు కామేశ్వరరావుగారు తమ అభిప్రాయములు వ్యక్తపర్చినారు; ఆరంభదశలో ఉన్నవారు ఇవి ఉపదేశములుగా అంగీకరించవలెనని వీరి కోరిక అయి ఉంటుంది. “ఇది మనము వాడవద్దు; దీనివల్ల ‘ఏకత’కు భంగము కలుగుతుంది; అది మనము వాడవలెను; దానివల్ల ‘ఏకత’ కలుగుతుంది.” అని తమ బుద్దికి తోచినట్లు శబ్దముల ఔచిత్యము నిరూపించినారు; గాని ‘ఇది అసాధువు’ ‘ఇది సాధువు’ అని నిషేధించలేదు. వ్యావహారిక భాషకు ఇట్టి అనుశాసనము ఆవశ్యకమని కొందరంటున్నారని నేనెరుగుదును. భారతి 11వ సంపుటములో నా మిత్రులు శ్రీ మండపాక పార్వతీశ్వర శాస్త్రులుగారు ‘ఆంధ్రభాష’ను గురించి రెండు వ్యాసములు రచించి ప్రకటించినారు. ఇంగ్లీషు భాషలో ఉన్నట్టు ‘ప్రమాణము’ (Standard) తెలుగు భాషకు కూడా నియమించవలసి ఉన్నదని శాస్త్రులుగారు వాటిలో నిరూపించినారు. వారు చేసిన చర్చలోని ముఖ్యాంశములివి:-

“భాషలో ఏకత కావలెను; అట్టి ఏకత కావ్యభాషలో కలదు” అన్నారు గ్రాంథికవాదులు[1]ఏకత ఉన్నా జీవం ఉండదు. ఏకత కల్పితము, వాస్తవం కాదు.

In many countries men of letters, poets or story tellers formed a caste apart, with tradition, customs, and privileges of their own, their language therefore had all the characterstics of a special language, necessitating imitation and imposing an apprenticeship to the craft. It might even happen that the role of the poet was partly religious and certain literary languages are, at the same time, religious languages. In Greece the peculiarities of the great lyric poems were no doubt due to the fact that they were based on such religious languages. Even apart from all religious influences there arose in many countries literary languages which were limited to certain very definite uses. The language of the Greek epic is a type of such literary languages which took shape in the hands of all the poets and became fixed once for all. Whoever in Greece sought inspiration from the Epic Muse used a language corresponding in no way to any spoken tongue. (Vendreys)
. “భాషకు జీవము కావలెను; అట్టి జీవము వ్యావహారిక భాషలో కలదు” అన్నారు వ్యావహారిక భాషావాదులు. భారతిలోని కథలలో ఏకతలేని లోపము కనబడ్డది. మధ్య మార్గ మొకటి యవసరమైనట్లు కనఁబడినది. జీవము, ఏకత ఈ రెండును కలసి యుండవలెను.

ఆధునిక భాషలో మాధుర్యము కలదుగాని ఏకత లేదు. ఏకత కలిగించినచో వ్యావహారిక భాష రాజభాష (King’s Telugu) కాగలదు. ఈ యుద్దేశముతో భాషను విభజింపగా అది నాలుగు తరగతులుగా కనబడినది.

  1. 1. Archaic- ఉ. నేను చేయవలతును. నాకు చేయవలయును
    2. Classical- ఉ. నేను చేయవలయును
    3. Standard-ఉ. నేను చేయవలెను
    4. Dialectal-ఉ. నేను చేయాలి,– చేయాలె,–చేయాల మొ.
  2. 1. Archaic-వలవదు
    2. Classical-వలదు
    3. Standard-వద్దు
    4. Dialectal…ఒద్దు

Archaic, Classical ప్రాచీనాంధ్రము; Standard వర్తమానాంధ్రము; Dialect అభినవాంధ్రము. కడపటిది వ్యాపిస్తున్నది. కొంత గట్టు కట్టుట అవసరమని తోచినది.

ఈ గట్టు నన్ను కట్టమన్నారు. అది నాకే కాదు ఎవరికైనా అసాధ్యమే. ఇంగ్లీషు భాష మారి, పాడైపోతూ ఉన్నదని పూర్వము భాషాతత్వము తెలియని కాలములో, ప్రతీ తరమువారు తమకాలపు భాషను గురించి మొర్రపెట్టేవారు. జాన్సన్ తన కాలపు భాష మారకుండా కట్లుకట్టి నిఘంటువులో బంధించడానికి ప్రయత్నించినాడు. నిఘంటువు పూర్తిగా రచించేసరికి అతని భ్రమ వడలిపోయినది. జీవద్భాషను మారకుండా బంధించడం అసాధ్యమని ప్రకటించినాడు[2]Dr. Johnson in the plan of his dictionary issued in 1747, declared that one end of his undertaking was, ‘to fix the English language’. But a man could not compile a vocabulary of the tongue without learning something of the nature of speech. By the time he finished his work, he had been cured of this particular error. It seemed impossible for most men of the past-the impossibility continues for most men of the present-to comprehend the elementary principle that in order to have a language become fixed, it is first necessary that those who speak it should become dead-dead, at least intellectually, if not physically. Then in deed it can undergo no change for there is no one to change it. But so long as it lives in the mouths of men and not merely in the pages of books, it must constantly… (Lounsbury. The standard of usage.).

భాషకు మారే స్వభావము ఉన్నది గనుకనే మనుష్యుని జ్ఞానములోను భావములలోను కలిగే వికాసమును బోధించే సాధనముగా ఉపచరిస్తున్నది. కొత్తమాటలు పాతప్రకృతులలో నుండి ఆవిర్భవిస్తూ ఉంటవి.

పార్వతీశ్వరశాస్త్రులుగారు చేసిన భాషావిభజన కాక, ఇంగ్లీషులో Politic language అని, the language of prose అని, the language of higher, imaginative prose అని, liturgical language అని కూడా కొందరు భాషను విభజించి ఆయా భాగములలో ఎట్టి శబ్దములలో ప్రయుక్తమవుతూ ఉన్నదో చూపిస్తారు.

శాస్త్రులుగారు తెలుగు భాషను అనుశాసించవలసినదని నన్ను నియోగించినారు, గాని ఆ పని నేను పూనుకోగలనా? శాస్త్రులుగారి వంటివారు నూరుగురు సహాయులు అన్ని మండలములలోనూ పది సంవత్సరాలు శ్రద్ధతో పనిచేస్తే కొంతమట్టుకు ఆంధ్రభాష అనుశాసించవచ్చును. సంస్కృతమనే భాషకు అనుశాసనము చేసినవారు పాణినికి పూర్వులు అనేకులున్నారు. వారు చేసిన పని తాను స్వీకరించి. కొంతపని పాణిని చేస్తే, కాత్యాయనుడు మొదలయినవారు, దానిలో పదివేల “లోపాలు” “దోషాలు” కనిపెట్టి దిద్దినారు. ఇంకా లోపాలుంటే పతంజలి మహర్షి మరికొన్ని సవరణలు చేసినారు. ఈ వ్యాకరణములో ధాతు పాఠాలు, గణ పాఠాలు ఉన్నవి. ఎన్నో భాష్యాలు, వాటికి టీకలు ఉన్నవి. ఇన్ని ఉన్నా, గొప్ప వైయాకరణులు తగవులాడుతూనే ఉంటారు. సంస్కతము వాడుక భాషగా ఉన్నప్పుడే దానికి అనుశాసనము పుట్టినది. అనుశాసించినవారు, ప్రమాణముగా స్వీకరించినది గ్రంథస్థభాష కాదు, శిష్టవ్యవహారమందుండిన భాష. ఆ భాషకు పేరు “లౌకిక భాష”; గ్రంథస్థ భాషకు “వైదిక భాష” అని పేరు అనుశాసనములో ఉన్నది. ఏ శబ్దము ఏలాగున శిష్టులు ఉచ్చరిస్తారో ఆలాగుననే ఎత్తుకొని ప్రకృతి ప్రత్యయ విభాగము చేసి సంస్కరించినారు పాణిన్యాదులు. “సంస్కారము” అనగా దిద్దడము కాదు. లోపాగమ వ్యత్యయాదులు నిరూపించడమే “సంస్కార”మనిపించుకొంటుంది. ఒక పొల్లయినా లోకుల వాడుకలో ఉన్నది తీసివేయకూడదు; లేనిది చేర్చకూడదు. వైవిధ్యము ఎంత ఉన్నా ఉపేక్షింపకూడదు. అది అంతా అనుశాసనములో చేరవలెను. ఒకటి రెండు ఉదాహరణములు చూడండి. ప్రదత్త, ఆదత్త, దేవదత్త మొదలయిన శబ్దములలో ధాతువుయొక్క అంశము “ద” ఉన్నది. అదే లోపించి, ప్రత్త, ఆత్త, దేవత్త మొదలయిన రూపాంతరములు పొంది శిష్టుల వాడుకలో ఉన్నందున, అవి సాధుశబ్దములుగా అంగీకరించి వాటిని అనుశాసించినారు. వృషోదరాది శబ్దాలకు సూత్రాలు కల్పించలేకపోయినా, సాధువులే అన్నారు.

దండి చెప్పిన శబ్దహీనత్వదోషము నిరూపిస్తూ వ్యాఖ్యాత వ్రాసిన వాక్యము ఒక్కటి ఉదాహరిస్తాను. శిష్టానాముక్తౌ సూత్రాణా మభావే అనుశాసన కారిణఏవ దండనీయాః. శిష్టులు వాడిన మాటలకు అనుశాసనము లేకపోతే, తప్పు అనుశాసనము చేసినవాడిదేకాని వాడినవారిది కాదు.

అయితే ఒకానొక సందర్భములో ఒక శబ్దము ఉచితమా, అనుచితమా అనే విషయము కళాకోవిదులు చర్చించవలసినది. భాషానుశాసకులు దాని ఊసు ఎత్తుకోరు. భాషారచన ఒక కళ. ఇంగ్లీషులో ఈ రచనలోని భేదాలను బట్టి Poetic diction అని, Prose diction అని, అందులో ఇంకా Higher imaginative prose diction అని, Oratorical Style అని, Conversational style అని అనేక విధాల గ్రంథకర్తల భాష విభజిస్తారు. అట్టి విభాగములు సారస్వతము, సాహిత్యము బాగా వృద్ధిపొంది అనేకులు అనేక గ్రంథములు, అనేక విధములైనవి రచించిన పిమ్మట, వాటినిబట్టి లక్షణము నిరూపించేవారు నియమాలు చేసినారు. ముందుగా ఆంధ్రశబ్ద చింతామణి రచించి, దానికి అనురూపముగా నన్నయగారు భారతము రచించినారని వాదించడము హాస్యాస్పదము కాదా? ముందుగా నియమాలు చేసి, వాటి ప్రకారం లోకులచేత భాషావ్యవహారము చేయించడమునకు ప్రయత్నించడము అట్టిదే–యూరప్ ఖండములోని భాషలన్నిటిలో ఫ్రెంచి మిక్కిలి మెరుగెక్కినదనిన్ని, ఫ్రెంచి సాహిత్య పరిషత్తువారు చేసిన వ్యవస్థల చొప్పున గ్రంథకర్తలు భాషారచన చేస్తారనిన్ని, అందువల్ల అది ఏకరూపముతో విలసిల్లుతూ ఉంటుందనిన్ని 18వ శతాబ్దిలో పేరుపొందినది. అయితే అట్టి భాషలో గ్రంథాలు రచించేవారు కొద్దిమందే. ఫ్రెంచి భాషకు ఇప్పుడు నియంతలు పండితులు కారు ప్రజలు[3] The people est souverain enrnatiere de langage. (The people is sovereign in matters of language.); తమ భాషే, దేశభాష అంటారు ప్రజలు. అనేక వార్తాపత్రికలలో (మన ప్రజామిత్ర, ప్రజాబంధు, వాహిని, గృహలక్ష్మి మొదలయినవాటిలో వలెనే) వ్యావహారిక భాష వాడుతున్నారు. “శిష్ట భాష”లో సంపాదకీయ వ్యాసములు రచించేవారు ఇంకా ఉన్నారుగాని, పండిత సభలలోనయినా ఆ భాష వినబడదు. అందుచేత ఆ భాషకు కాలము ఆసన్నమయినది అన్నారు Vendreys గారు[4]“In any case, it can be foreseen that the fate of this literary French will be that of Latin. It will be preserved as a dead language, with its rules and vocabularies fixed once for all. The living language will continue to develop independently of it”.. అంతేకాక ఆ భాషలో చక్కగా రచన చేయగలవారి సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. కావ్యరచన కళగా అభ్యసించేవారు చాలాకాలము గురుశుశ్రూష చేస్తేనే కాని”కావ్య” భాష రాదు. ఆ భాష లోకములో అప్రయుక్తము కావడమువల్ల సదా కావ్యరచన చేస్తూ ఉన్నవారికే కాని అది వ్యావహారిక భాషవలె, “స్వాయత్తము” కాదు. కత్తులమీద నాట్యం చేయడము వంటిది అట్టి భాషలో రచన చేయడము. ప్రమాదము చేత అపశబ్దము ప్రయుక్తమైతే పత్రికలలో ఎగతాళి చేస్తారు. అందుచేత ప్రజల భాషలోనే నానావిధమయిన కావ్యాలు రచించడమునకు నవ్యసాహిత్యప్రియులు పూనుకొని, కృషి చేస్తున్నారు. గ్రాంథికాంధ్రములో సంపాదకీయ వ్యాసాలూ పుస్తకాలు రచిస్తూ ఉన్నవారు చేసే తప్పులు ఈలాగున చూపిస్తూ ఉంటే ఈ దంభాలు అంతమవుతవి

ఏకరూపమయిన Standard భాష లేకపోవడం గొప్ప లోపముగా పార్వతీశ్వరశాస్త్రులుగారు, కామేశ్వరరావుగారు ఇంకా అనేకులు భావిస్తున్నట్టు కనబడుతున్నది. ఆంధ్ర దేశములో అన్ని మండలములవారికీ పరస్పర సంబంధం అన్ని విధాలా ఎప్పుడు ఏర్పడుతుందో; ప్రజలకు, నూటికి తొంభయిమంది చొప్పున అయినా, చదువు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆంధ్ర భాషకు Standard దానంతట అదే ఏర్పడుతుంది. అదైనా కేవలమూ ఏకరూపమున ఉండదు సుమండీ. పరమైకతగల భాష లోకములో ఎక్కడా లేదు[5] Standard English like standard French, is now more a class dialect than a local dialect. It is the language of the educated all over Great Britain. But it is not yet perfectly uniform. It is still liable to be influenced by the local dialects in grammar and vocabulary and still more in pronunciation.
Again English, like all other living languages, changes from generation to generation. Pronunciations which are vulgar in one century may become fashionable in the next…

A spoken language is, therefore, necessarily a vague and floating entity. And English is no exception to the rule… A standard spoken language is, strictly speaking an abstraction. No two speakers of standard English pronounce exactly alike” Encyc. Britanica–Phonetics.)
. సృష్టిలో ఏ రెండు వస్తువులూ అన్ని విధాలా ఒక్కలాగున ఉండవు. Standard కోసము మనము పరితపించనక్కర లేదు. పండితుల ప్రయత్నంవల్ల అది ఏర్పడదు.

కథలూ, నాటకాలూ, పాటలూ ఇంకా ఇటువంటి రసవద్రచనలు చేసేవారు ప్రతిభావంతులయితే పురాణ పద్ధతులు అవలంబించరు. వారి రచనలలో ‘వ్యక్తిత్వ’ముంటుంది. అద్దెచీట్లు, క్రయచీట్లు, ఒడంబడికలు, ప్రభుత్వమువారి శాసనాలూ, ప్రకటనలూ ఇటువంటివి Standard భాషలో ఉంటవి. కావ్యాలలో కవులు తమ ఔచిత్యజ్ఞానమును అనుసరించి శబ్దాలు ప్రయోగిస్తారు. ఇతరుల నియమాలు పాటించరు. అలంకారశాస్త్రమందు గ్రామ్యమన్న ‘గల్ల’శబ్దము భవభూతి వాడినాడు. ఆంధ్రవ్యాకరణాలలో అసాధువులన్న మాటలు ఆంధ్రభారతములోనే ఉన్నవి. కామేశ్వరరావుగారు కొన్ని ‘కుదింపులు’ ఉచితములంటారు; కొన్ని అనుచితములంటారు. ఔచిత్యానుచిత్యములకు ప్రమాణమేమిటి; కేవలము ఇష్టత అనిష్టత ప్రమాణములు కావు. వర్ణ లోపముగానీ, ఆగమము కానీ, ఆదేశముకానీ, శిష్టవ్యవహారమందున్నది అసాధువు కాదు. ఇంతేకాక ఉత్సర్గాపవాదములుగా అనుశాసనము చేయవలెనుగాని ప్రతిపదపాఠము కూడదు; అది అసాధ్యము. బృహస్పతివంటి గురువు ఇంద్రునివంటి శిష్యునిచేత శబ్దపారాయణము చేయిస్తే, వెయ్యి దివ్యవర్షాలకయినా అంతం కాలేడట!

పార్వతీశ్వరశాస్త్రులుగారు “చేయాలె” అనే శబ్దము Standard కాదు, dialectal అంటారు. ‘చేయవలెను’ ‘చేయవలె’ అయినది. పిమ్మట ‘వ’కారము లోపించి, పూర్వాచ్చుకు దీర్ఘము వచ్చినది. ఇట్టి మార్పు తిక్కన కాలములోనే కనబడుతున్నది. ‘పోయినవాఁడు’ = ‘పోయినాఁడు’, ‘మాయలవాఁడు’ = ‘మాయలాఁడు’– ఇట్టివి నన్నయ గ్రంథములో లేవుగాని తిక్కన గ్రంథములో ఉన్నవి. ఈ మార్పు క్రమంగా వ్యాపించినందున ‘చేయవలె’ ‘చేయాలె’ అయినది. అందరూ వాడుతూ ఉన్న శబ్దము Standard కాదా? Standard అంటే అట్టిదే. వ్రాతలో వైవిధ్యము ముద్రణాలయములో తొలగించవచ్చును. ‘ఉన్నాయి’, ‘ఉన్నయి’, ‘ఉన్నై’, ‘ఉన్నాయ్’, ‘ఉన్నయ్’ అనే రూపములు పత్రికలలోను, పుస్తకాలలోను కనబడుతున్నవి. శిలాశాసనములలో వర్ణక్రమము వ్యత్యస్తముగా ఉన్నది. తెలుగుభాష మాతృభాషగా మాట్లాడేవారిని ఈ వైవిధ్యము బాధించదు; తెలుగుభాష నేర్చుకొనే విదేశీయులకు భ్రాంతిజనకముగా ఉండవచ్చును. Caxton అచ్చుయంత్రము ఇంగ్లండులో స్థాపించి గంథాలు అచ్చు వేయడమునకు మొదలుపెట్టినపుడు, వ్రాతప్రతులలోని శబ్దరూపములు (Spelling) బహువిధాలుగా కనబడ్డవి. ఎవరి పద్ధతి వారిది. నోటిన ఉచ్చరించినట్లు కాగితముమీద వ్రాయడానికి నియమాలు అప్పుడు లేవు. క్రమంగా ఏర్పడ్డవి. ఇప్పుడు కూడా (Centre, Contre అని) అనేక శబ్దాలు వివిధముగా ఇంగ్లీషువారు వ్రాస్తున్నారు. అమెరికావారు Spellingలో కొన్ని మార్పులు చేసినారు. ఇందులో ఎంత వైషమ్యమున్నా ఇంగ్లాండులోనివారు అమెరికా వారి పుస్తకాలు చదువుకోగలరు; అట్లే అమెరికావారు ఇంగ్లండులోని వారి పుస్తకాలు చదువుకోగలరు. ఇంగ్లండులో అనేక ‘మాండలీయక’ భాషలున్నవి. వాటికి Spelling నియమాలు ఏర్పడలేదు. నవలలలోను నాటకాలలోను అట్టి భాషలు పాత్రోచితముగా ప్రయోగించినప్పుడు గ్రంథకర్తలు ఎవరికి ఏలాగున తోస్తే ఆలాగున వ్రాస్తున్నారు. ‘Always’ అనేమాట ఒకరు allays అని, ఒకరు awlus అని వ్రాస్తారు. Half-penny worth అనేది ఒకరు halporth అని, ఒకరు ha’porth అని, ఒకరు hapeth అని వ్రాస్తారు. షాగారు Tuesday, stupid అనే మాటలు Choosda, Schoopid అని వ్రాస్తారు. ఇట్టివారి భాష కేవలమూ అధునికము. “ఏమండీ! ఉద్గ్రంథాలు ప్రౌఢమయిన శైలిలో రచించరేమి?” అంటే, “మేము ఇప్పటివారి కోసము వ్రాస్తున్నాముగాని ఇరవైరెండో శతాబ్దివారి కోసము కాదు” అంటారు. ఐర్లండులో Synge వంటి ప్రఖ్యాత రచయితలు పామరులభాష నేర్చుకొని, అది రసవంతములయిన నాటకాలలోను, కథలలోను వాడుతున్నారు. దేశాటనము చేసేవారు తమ గ్రంథాలలో అన్యదేశ్యములేకాక మాండలీయకాలు కూడా యథేచ్ఛముగా ప్రయోగిస్తున్నారు. అట్టివి Standard భాషలో అంతర్భూతములవుతూ దానిని “వృద్ధి” పొందిస్తూ ఉంటవి. కామేశ్వరరావుగారు ఈ గ్రంథములో చేర్చిన మాండలీయకముల పట్టికలు వినోదకరములే కాదు, మిక్కిలి ఉపయుక్తమయినవి కూడాను. అట్టివి ఎన్ని అయినా చాలవు. వాటి ప్రయోజనము అపరిమితము. వివిధ మండలములలో నివసించి ఉన్న తెలుగువారిలో పరస్పర మైత్రి కలిగించుటకు అవి ఉపచరిస్తవి. కామేశ్వరరావుగారు ఈ కృషిలో మార్గదర్శకులయినారు. ఇతరులు కూడా ఇట్టిపని చేస్తే భాషాసేవ చేసినవారవుతారు.

షేక్‌స్పియరు కాలములో ఇంగ్లీషుభాష అశ్రుత పూర్వంగా విజృభించినట్లు ఈ కాలములో తెలుగుభాష విజృంభిస్తున్నది. ఇంగ్లీషు భాషకు అప్పుడు కట్లూ గట్లూ ఉండాలని ఎవ్వరూ అభిలషించలేదు. అప్పుడు కావలసినది స్వేచ్ఛగాని నిర్బంధము కాదు. వెల్లువవలె భాష ప్రవహించినది. వరదతో బురదా చెత్తా వచ్చిపడ్డది. అది అంతా క్రమంగా అడుగంటినది. స్వచ్ఛమయిన భాష తేరినది. అప్పటినుండి ఇప్పటివరకూ ఇంగ్లీషు భాషావాహిని గట్టు లేకుండానే ‘టేమ్‌జ్’ నదివలె నిర్మలముగా ఉన్నది. ఏటిలోనికి కొత్తనీరు రాకుండా గట్టు కట్టితే, ఏరు ఎండిపోతుంది; నీరుంటే మురిగిపోతుంది. భాషా స్వభావమును అనుసరించి, భాషలో భావబోధమునకు కావలసిన మార్పులు కలుగుతూ ఉంటవి.

మన దేశములోని భాషలన్నిటిలో బంగాళీ భాష మిక్కిలి వికాసము పొందడమునకు కారణము దానికి “పండితులు” నిర్మించిన గట్లు కొట్టివేయడమే. ఇట్టి గట్లవల్ల ఎంత కీడు బంగాళీ భాషకు కలిగినదో శ్రీ రవీంద్రనాథఠాకూరుగారు తెలియజేస్తూ ఇరవయియేళ్ళ కిందట వ్రాసిన వ్యాసములోని వాక్యములు ఉదాహరిస్తాను. అవి ఆంధ్రభాషాభిమానులు సావధానముగా చిత్తగింతురుగాక.

“I have found that the direct influence which the Calcutta University wields over our language is not strengthening and vitalising but pedantic and narrow. It tries to perpetuate the anachronism of preserving the Pandit-made Bengali swathed in grammar wrappings borrowed from a dead language. It is every day becoming a more formidable obstacle in the way of our boys’ acquiring that mastery of their Mother-tongue which is of life and literature. The artificial language of a learned mediocrity, inert and formal, ponderous and didactic, devoid of the least breath of creative vitality, is forced upon our boys at the most receptive period of their life… In the modern European Universities the medium of instruction being the vernacular, the student, in receiving, recording and communicating their lessons, perpetually come into intimate touch with it, making its acquaintance where it is not slavishly domineered by one particular sect of academicians The personalities of various authors, the individuality of their styles, the relation of the living power of their language are constantly and closely brought to their minds… But our students have not the same opportunity, except in their private studies and according to their private tastes. And, therefore, their minds are more liable to come under the influence of some inflexible standard of language manufactured by pedagogues and not given birth to by the genius of artists. I assert once again that those who, from their position and authority have the power and the wish to help our language in the unfolding of its possibilities, must know that in the present stage, freedom of movement is of more vital necessity than fixedness of forms[6]ఇప్పుడు బడులలోను కళాశాలలలోను “చలిత భాష” అనగా వాడుకలో నున్న బంగాళీ భాషలో రచనాభ్యాసము చేయిస్తున్నారు.. -(Modren Review)

తెలుగుభాషా రచయితలకు ఎనభైయేళ్ళయి బడిపండితులు సంకెళ్ళు తగిలించినారు. బడులలోను కళాశాలలలోను విద్యార్థులు ఇంకా సంకెళ్ళతోనే ఉన్నారు. కొందరు యువకులూ యువతులూ పండితుల బంధాలు తెంపి స్వాతంత్ర్యము సంపాదించుకొన్నారన్నమాట నిజమేకాని, “సనాతనులు” పండ్లు ఇంకా కొరుకుతున్నారు. స్వాతంత్ర్యము సంపాదించుకొన్నవారు ఉద్రిక్తులయి, బడి నుండి సాయంకాలము వెడలివచ్చిన పిల్లలవలే, యథేచ్ఛముగా విహరించడమువల్ల అట్టే హాని కలుగదు. వారి స్వాతంత్యమును అరికట్టడము వల్ల ఎక్కువ హాని కలుగుతుంది. వ్యావహారిక భాషారచన చక్కగా అభ్యసించినవారు మంచి పుస్తకములు వాసి ప్రకటిస్తే అవి సామాన్యులకు ఆదర్శములుగా ఉపచరిస్తవి. పిల్లలు పెద్దలను అనుకరించి కదా మాతృభాష నేర్చుకొంటారు; అట్లే గ్రంథరచన కూడాను. కామేశ్వరరావుగారున్ను పార్వతీశ్వరశాస్త్రిగారున్ను గ్రంథ రచన అభ్యసించి, దానిలో నైపుణ్యము సంపాదించినవారు గనుక వారికి ఉచితమని తోచిన ‘నియమాలు’ అవలంబించి గద్యకావ్యాలుగాని పద్యకావ్యాలుగాని రచిస్తే, వారి ఉద్దేశము నెరవేరుతుంది. వ్యాకరణాలు వల్లించి మాతృభాష నేర్చుకోవడము ఎప్పుడూ ఏ దేశములోనూ జరుగలేదు. వాడుకలో ఉన్న అన్య భాషలు నేర్చుకోవడమునకయినా వ్యాకరణము ఆవశ్యకము కాదు; సహవాసమువల్లనే అది అలవడుతుంది.

నా భాష పందొమ్మిదో శతాబ్దిదనిన్ని అది నేటివారికి అనుకరణ యోగ్యము కాదనిన్ని కామేశ్వరరావుగారు అన్నారు. అవును; నేను ఆ శతాబ్దిలో పుట్టి పెరిగినవాడను గనుక అప్పటి భాష నాకు అలవాటయినది. వారి భాష వారి మనుమలకు పాత భాష అవుతుంది. అందులో వైపరీత్యమేమీ లేదు; హానీ లేదు. ఒకరిమాట ఒకరికి తెలియకపోదుకదా! స్వస్తి.

16-12-1938, రాజమహేంద్రవరం.
గిడుగు వెంకటరామమూర్తి


నా మాట

‘భారతి’లో పడ్డ ‘వ్యవహారిక రచనకి కొన్ని నియమాలు’ అనే నా వ్యాసం కొన్ని మార్పులతోను, చేర్పులతోను ఇక్కడ పునర్ముద్రితమయింది. మాండలీయకాల పట్టీలు మాత్రం క్రొత్తగా చేరాయి.

ఈ పుస్తకం 26వ పుటలో ప్రాచీనకాలంలో మన దేశంలో ఉచ్చారణ విషయమై కొంత రాశాను. దీనికి ఆధారం గ్రంథాలనుంచి కాదు. పాశ్చాత్య భాషలు కొన్నిటిలో పూర్వం ఆ మోస్తరుగా ఉండేది. దానినిబట్టి మన దేశంలో కూడా అలాగే ఉండవచ్చని తలచి రాశాను. వేదం నేర్చుకోడం పద్ధతి ఇప్పటికీ అలాగే ఉందికదా.

తప్పొప్పుల పట్టిక ప్రకారం మాండలీయకాల పట్టీలు (అనుబంధాలు) మొదట దిద్దుకుని మరీ ఆ పట్టీలు చదివితే మంచిది. కర్నూలుజిల్లా తెలుగు సేకరించడంలో నాకు ఆ జిల్లా బాహ్మణేతర సోదరుడొకతను కొంచెం సహాయపడ్డాడు. అంచేత అక్కడి శిష్టభాషలో కొంచెం తేడాలు ఉండవచ్చు.

ఈ పుస్తకంలో నేను సూచించిన స్వల్ప నియమాలని అనుసరించి వాడుక భాషలో రచిస్తూంటే చదువరులకి వ్యావహారిక గ్రంథాలమీద మరింత అభిలాష, ఆదరణ కలుగుతుందని నా అభిప్రాయం.

ఈ గ్రంథానికి పీఠిక రాసియిచ్చిన శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారికి కృతజ్ఞతపూర్వక వందనాలు.

రాజమహేంద్రవరం,
టేకుమళ్ళ కామేశ్వరరావు
31–12–38.


అధస్సూచికలు[+]